సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మానసిక వ్యాధులతో బాధపడుతున్నవారి సంఖ్య ఏటా భారీగా పెరుగుతోంది. పట్టణాలకే పరిమితమైన మానసిక ఆందోళనలు, ఒత్తిళ్లు ఇప్పుడు పల్లెల్లోనూ కనిపిస్తున్నాయి. ఆర్థిక, సామాజిక, కుటుంబ కారణాలతో మానసిక రుగ్మతలతో బాధపడుతున్నవారి సంఖ్య భారీగా పెరుగుతున్నా అందుకు తగిన వైద్యం మాత్రం అందడం లేదు. తగిన సంఖ్యలో మానసిక వైద్య నిపుణులు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది బాధితులు ఆర్‌ఎంపీ డాక్టర్ల వద్దకు వెళుతుండటం.. వారు మోతాదుకు మించిన మందులు ఇస్తుండటంతో తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయి. ఏ ప్రభుత్వాస్పత్రిలోనూ సైకియాట్రీ నిపుణులు లేరు. అటు ప్రైవేటు రంగంలోనూ మానసిక వైద్య నిపుణులు తక్కువగానే ఉన్నారు. దీర్ఘకాలిక మానసిక సమస్యలకు సరైన వైద్యం లేకపోవడం, కౌన్సెలింగ్ ఇచ్చేవారు లేకపోవడంతో ఆత్మహత్యల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఏపీలో 50 లక్షల మందికి పైగా బాధితులు
దేశంలో మానసిక రుగ్మతలతో బాధపడే రోగులు ఎక్కువ సంఖ్యలో ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నారని వైద్య నిపుణులు చెబుతుండటం అందరినీ కలవరపరుస్తోంది. ఏటా ప్రతి వేయి మందిలో 102 నుంచి 104 మంది కొత్త రోగులు ఏదో ఒక మానసిక సమస్యతో వైద్యుల వద్దకు వెళ్తున్నట్టు వివిధ సర్వేల్లో వెల్లడైంది. రాష్ట్రంలో దాదాపు 50 లక్షల మందికి పైగానే మానసిక సమస్యలతో బాధపడుతున్నారని తేలింది. స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) దేశంలో మానసిక రుగ్మతల విషయంలో రాష్ట్రంలో ఆందోళన చెందే విధంగా పరిస్థితి ఉన్నట్టు వెల్లడించింది. ఆత్మహత్యలు చేసుకుంటున్నవారిలో 80 శాతం మందికి సరైన కౌన్సెలింగ్ లేకపోవడం, వారి మానసిక స్థితికి తగ్గట్టు సకాలంలో వైద్యం అందించలేకపోవడం వల్లే మృతి చెందుతున్నట్టు తేలింది. ఇలా మానసిక ఆందోళనకు గురవుతున్న వారి వయసు 16 నుంచి 44 ఏళ్ల మధ్య లోపే ఉండటం విస్మయం కలిగిస్తోందని గుంటూరుకు చెందిన ఓ మానసిక వైద్యుడు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మానసిక వ్యాధులకు సంబంధించి విశాఖపట్నంలో మాత్రమే ప్రభుత్వ మానసిక చికిత్సాలయం ఉంది. గతేడాది అక్కడ కొత్తగా నమోదైన ఔట్‌పేషెంట్ల సంఖ్య 49 వేలకు పైగా ఉందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అంచనా వేయొచ్చు.
సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ ఏర్పాటు ఎక్కడ?
2017లో కేంద్ర ప్రభుత్వం ‘మెంటల్ హెల్త్ యాక్ట్’ చట్టాన్ని రూపొందించింది. దీన్ని అన్ని రాష్ట్రాలు విధిగా అమలు చేయాలని చెప్పింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాలకు నిధులు కూడా మంజూరు చేసింది. ప్రతి జిల్లాలో మానసిక వైద్యుడు, మనస్తత్వ నిపుణులతోపాటు ప్రత్యేక సిబ్బందిని నియమించి పేషెంట్ల రిజిస్ట్రీని నమోదు చేయాలని సూచించింది. మానసిక రోగులకు గుర్తింపు లేని వైద్యులు ఎవరైనా వైద్యం చేసినట్టు ఫిర్యాదులొస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దీనికి ప్రత్యేక కమిటీని నియమించాలని ఆదేశించింది. మానసిక రోగుల పట్ల వివక్ష చూపించకూడదని, వారికి తక్షణమే వైద్యసేవలు అందించాలని, చికిత్సా విధానాలు సంబంధిత అథారిటీకి చెప్పాలని కూడా తెలిపింది. దీనికోసం విశాఖపట్నంలో రూ.30 కోట్లతో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ ఏర్పాటు చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ ఏర్పాటు చేయలేదు. కేంద్రం పలుసార్లు సూచించినా మానసిక వైద్యానికి ఎలాంటి మార్గదర్శకాలూ రూపొందించకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.
మానసిక రుగ్మతల లక్షణాలివే..
- ఎదుటివారితో పోల్చుకుంటూ వారికంటే తక్కువగా ఉన్నామని బాధపడటం
- ఆర్థిక, కుటుంబ కారణాలతో తీవ్ర మానసిక ఆందోళనకు గురవడం
- తనకేమైనా ఆపద వస్తుందేమోనని ముందుగానే భయపడి ఒత్తిడికి గురవడం
- ప్రతి చిన్న విషయానికి ఆందోళనకు లోనవడం
- జనంలో ఇమడలేక, ఒంటరిగా ఉండలేక ఒత్తిడికి గురవడం
- చదువులతో ఒత్తిడికి గురై విద్యార్థులు మానసిక ఆందోళనతో ఉండటం
- జీవితంలో అనుకున్నంతగా ఎదగలేకపోతున్నామని ఆందోళనకు గురవడం
త్వరలోనే మార్గదర్శకాలు
ఇప్పటికే కేంద్రం నుంచి మార్గదర్శకాలు వచ్చాయి. వాటిని త్వరలోనే అమలు చేస్తాం. వీటికి అనుగుణంగా వైద్యం అందిస్తాం. రాష్ట్రంలో మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్న మాట వాస్తవమే.
–డా.కె.బాబ్జీ, వైద్యవిద్యా సంచాలకులు
Comments
Please login to add a commentAdd a comment