సాక్షి, అమరావతి: ఇప్పటివరకు రోగికి వైద్యులు మాత్రమే మందులు రాసేవారు. కానీ, ఇక నుంచి ప్రత్యేక శిక్షణ పొందిన ఫార్మసిస్ట్‌లు, ఫిజీషియన్ అసిస్టెంట్‌లు, ఆప్టోమెట్రిస్ట్‌లు, ఆఫ్తాల్మజీ అసిస్టెంట్‌లకు కూడా ఈ అవకాశం దక్కనుంది. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) ఈ మేరకు బిల్లును రూపొందించింది. ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం కూడా పొందింది. త్వరలో వీరికి లైసెన్సులు జారీ చేయనున్నారు. తర్వాత వీరంతా లైసెన్స్‌డ్ నాన్ మెడికల్ ప్రాక్టీషనర్లగా నిర్దేశిత వైద్య సేవలు అందిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరతను వీరి ద్వారా అధిగమించవచ్చని ఎన్‌ఎంసీ భావిస్తోంది. ఈ నిర్ణయంపై వైద్య సంఘాలు మండిపడుతుండగా, ఫార్మసీ సంఘాలు సానుకూలంగా స్పందిస్తున్నాయి.
త్వరలో లైసెన్సులు
ఎన్‌ఎంసీ.. నాన్ మెడికల్ ప్రాక్టీషనర్లకు త్వరలో లైసెన్సులు జారీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. అయితే వీరికి కొన్ని మందులు రాయడానికి మాత్రమే అనుమతి ఉంటుంది. అది కూడా ప్రాథమిక వైద్యం, ప్రివెంటివ్ మెడిసిన్‌లో భాగంగానే. నాన్ మెడికల్ ప్రాక్టీషనర్స్‌కు ఇచ్చే లైసెన్సులను ఎన్‌ఎంసీ పరిధిలోని నైతిక విలువల కమిటీ పర్యవేక్షిస్తుంది. కాగా.. ఐసీయూ విభాగంలో ప్రత్యేక శిక్షణ పొందిన నర్సులకు కూడా మందులు రాసే అవకాశం ఉంటుంది.
ఏ పరిస్థితుల్లో మందులు రాస్తారు?
ప్రధానంగా ఓటీసీ (ఓవర్ ద కౌంటర్) డ్రగ్స్ విషయంలో ఈ మందులు రాస్తారు. అంటే.. వైద్యుడు లేని సమయంలో నేరుగా మందుల షాపునకు వెళ్లి తెచ్చుకునేవారికి వీళ్లు మందులు ఇవ్వవచ్చు. అది కూడా ప్రాథమిక స్థాయిలో కొన్ని మందులకు మాత్రమే. ఉదాహరణకు పల్లెటూరిలో ఓ వ్యక్తి జ్వరం, మలేరియా, టైఫాయిడ్ వంటి వాటికి గురైనప్పుడు అక్కడ ఎంబీబీఎస్ డాక్టర్ లేనప్పుడు ఇలాంటి నాన్ మెడికల్ ప్రాక్టీషనర్లు మందులు ఇస్తారు. వీరు ఇష్టారాజ్యంగా మందులు రాయకుండా ఎన్‌ఎంసీ వారిని పర్యవేక్షిస్తుంది. శిక్షణ ఇచ్చిన తర్వాత మాత్రమే లైసెన్సులు ఇస్తారు. అత్యవసరం కాని కేసుల్లో మాత్రమే వీళ్లు మందులు ఇచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునేందుకు ఎథిక్స్ కమిటీ ఉంటుంది.
దుర్వినియోగమయ్యే అవకాశాలు కూడా..
నాన్ మెడికల్ ప్రాక్టీషనర్లకు అనుమతులివ్వడం దుర్వినియోగమవ్వొచ్చని వైద్య వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఆర్‌ఎంపీలు, ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్స్ (పీఎంపీలు) ఇష్టారాజ్యంగా యాంటీబయోటిక్స్ రాస్తున్నారని, నాన్ మెడికల్ ప్రాక్టీషనర్స్ కూడా ఇలాగే మందులు రాస్తే చర్యలు తీసుకునే యంత్రాంగం ఉందా? అని ప్రశ్నిస్తున్నాయి. వేలాది మంది రోగులు అవసరం లేని, మోతాదుకు మించిన మందులు వాడుతూ కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారు. దీనిపై ఇప్పటివరకూ చర్యలు లేవని, ఇకపై తీసుకుంటారన్న నమ్మకం లేదని వైద్య వర్గాలు చెబుతున్నాయి. కాగా.. అమెరికా, ఫ్రాన్స్, కెనడా, బ్రిటన్ వంటి దేశాల్లో డాక్టర్‌కు మినహా మరెవరికీ మందులు రాసే అవకాశం లేదు. డాక్టర్ రాసే మందుల ప్రభావం, మోతాదులను పరిశీలించి వాటిని ఆపడం/కొనసాగించే హక్కు మాత్రం రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్‌కు ఉంది. అంతేకాకుండా ఓవర్ ద కౌంటర్‌లో భాగంగా సాధారణ జబ్బులకు 70 నుంచి 80 రకాల మందులు ఫార్మసిస్ట్ ఇవ్వచ్చు.
రాష్ట్రంలో వేధిస్తున్న డాక్టర్ల కొరత
రాష్ట్రంలో డాక్టర్ల కొరత వేధిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం.. ప్రతి వేయి మందికి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉండాలి. కానీ మన రాష్ట్రంలో ప్రతి 1700 మందికి కూడా ఒక డాక్టర్ లేరు. స్పెషలిస్టు డాక్టర్ల సేవలు పట్టణాలకే అది కూడా 30 శాతం మందికి మాత్రమే పరిమితం. గ్రామీణులు స్పెషలిస్ట్ డాక్టర్ సేవలు పొందాలంటే కనీసం 40 కి.మీ రావాల్సిందే. ఇప్పటికీ గ్రామీణులు ఆర్‌ఎంపీ, పీఎంపీలపైనే ఆధారపడి వైద్యం పొందుతున్నారు.
ఇప్పటికే రోగులు ఇబ్బంది పడుతున్నారు
రోగులకు ఇష్టారాజ్యంగా మందులు రాయడంతో తీవ్ర దుష్ఫరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అవసరం లేకపోయినా బాగా బలమైన మందులు ఇవ్వడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతోంది. శరీరానికి ఎంత మోతాదులో మందులు ఇవ్వాలో డాక్టర్లకే తెలుసు. ఇలా ఎవరు పడితే వాళ్లు మందులిస్తే రోగులు తీవ్రంగా నష్టపోతారు.
–డా.జయశంకర్, అధ్యక్షుడు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఏపీ)
ఆర్‌ఎంపీల కంటే వాళ్లే నయం
అనుభవం, అర్హత లేని ఆర్‌ఎంపీలు, పీఎంపీలు మందులు రాయడం కంటే అనుభవం ఉన్నవారు రావడాన్ని స్వాగతించొచ్చు. కానీ ఎంసీఐ, ఎన్‌ఎంసీ వంటి సంస్థలు మార్గదర్శకాలు జారీ చేయగలవే కానీ చట్టాలు చేయలేవు. నాన్ మెడికల్ ప్రాక్టీషనర్‌కు మందులు రాసే అధికారం ఇచ్చినా ఆర్‌ఎంపీల మాదిరి నియంత్రణను గాలికొదిలేయకూడదు.
–విజయ్ ఆర్ అన్నపరెడ్డి, ఫార్మసీ కౌన్సిల్ మాజీ అధ్యక్షులు
గ్రామీణ ప్రాంతాలకు మేలు జరుగుతుంది
గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్ల కొరత ఎక్కువగా ఉంది. అక్కడ లైసెన్స్‌డ్ నాన్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఉపయోగం చాలా ఉంటుంది. మందులపై వీరికి కనీస పరిజ్ఞానం ఉంటుంది. డాక్టర్లు లేని చోట పేద రోగులు వెంటనే ఉపశమనం పొందే అవకాశాలు ఉంటాయి.
–ఎన్.హేమంతర్ కుమార్, ఉపాధ్యక్షులు, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ (ఫార్మడి)
Comments
Please login to add a commentAdd a comment