
మలేరియా కంటే ప్రాణాంతక వ్యాధిగా కాలా అజార్
1824–25లో జెస్సోర్‌లో వెలుగులోకి వ్యాధి
మూడేళ్లలోనే 7.50 లక్షల మంది బలి
1970లలో మన దేశంలోనే 11.5 శాతం కేసులు
వ్యాధి నిర్మూలనకు పటిష్ట వ్యూహాన్ని అమలు చేసిన కేంద్రం
గత రెండేళ్లుగా 10 వేల జనాభాకు ఒకటికంటే తక్కువ కేసులు
కాలా అజార్ విముక్త దేశంగా భారత్
త్వరలో ప్రకటించనున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
సాక్షి, అమరావతి: కాలా అజార్.. రెండు దశాబ్దాలకు పైగా ప్రజారోగ్యంపై ప్రభావం చూపిన ఈ ప్రాణాంతక వ్యాధిని భారత్ విజయవంతంగా నిర్మూలించింది. మలేరియాకంటే ప్రాణాంతకమైనదిగా భావించే ఈ వ్యాధి నిర్మూలనలో భారత్ పటిష్ట వ్యూహాన్ని అమలు చేసింది. 10 వేల జనాభాకు ఒకటికంటే తక్కువ కేసుల లక్ష్యాన్ని 2023 నాటికి చేరుకుంది. గతేడాది ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య మరింతగా తగ్గిపోయింది. దీంతో త్వరలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‌ను కాలా అజార్ రహిత దేశంగా ప్రకటించనుంది.
వెక్టర్ బార్న్ డిసీజెస్‌లో మలేరియా తర్వాత రెండో ప్రాణాంతకమైన వ్యాధి కాలా అజార్ అని వైద్య రంగ నిపుణులు చెబుతున్నారు. 1824 – 25లో అప్పట్లో భారత భూభాగంలో ఉన్న జెస్సోర్‌లో (ప్రస్తుతం బంగ్లాదేశ్) ఈ వ్యాధి ప్రబలింది. మూడేళ్లలోనే 7.50 లక్షల మందిని బలి తీసుకుంది. 1970లలో ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో మనదేశంలోనే 11.5 శాతం ఉన్నాయి. 1990–91లో ఈ వ్యాధి నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ప్రారంభ దశలోనే రోగ నిర్ధారణ, వైద్యం అందించడం, సమర్థవంతమైన సరై్వలెన్స్ వంటి వ్యూహాలను పక్కాగా అమలు చేసింది. దీంతో క్రమంగా వ్యాధి తీవ్రత తగ్గింది. 1992లో దేశంలో 77,102 కేసులు 1,419 మరణాలు సంభవించగా, 1995లో కేసులు 22,625కు, మరణాలు 277కు తగ్గాయి. 2010 నాటికే ఈ వ్యాధిని నిర్మూలించాలని లక్ష్యంగా నిర్దేశించగా, దీనిని కేంద్ర ఆరోగ్య శాఖ 2023 వరకు పొడిగించింది. 2023లో 10 వేల జనాభాకు ఒకటికంటే తక్కువ కేసుల లక్ష్యాన్ని సాధించింది.
2023లో దేశవ్యాప్తంగా కేవలం 524 కేసులు, నాలుగు మరణాలు నమోదయ్యాయి. పశి్చమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని 54 జిల్లాల్లో ఈ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గతేడాది 438 కేసులు, రెండు మరణాలకు వ్యాధి తీవ్రత తగ్గినట్టు వెల్లడైంది. దీంతో వ్యాధిని పూర్తిగా నిర్మూలించిన దేశంగా భారత్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది.
ఇదీ వ్యాధి
కాలా అజార్ వ్యాధి ‘లీష్మానియా డోనోవానీ’ అనే పరాన్నజీవి సోకిన సాండ్ దోమలు కుట్టడం ద్వారా సోకుతుంది. కాలా (నలుపు) అనే హిందీ పదం, అజార్ (వ్యాధి) అనే పర్షియన్ పదం కలిపి ఈ వ్యాధికి ఈ పేరు పెట్టారు. వ్యాధి సోకిన వారిలో క్రమం తప్పకుండా జ్వరం వస్తుంది. బరువు గణనీయంగా తగ్గుతారు.
ప్లీహం, కాలేయం వాపు, తీవ్రమైన రక్తహీనత వంటి సమస్యలు తలెత్తుతాయి. సకాలంలో చికిత్స చేయకపోతే రెండు సంవత్సరాల లోపు చనిపోతారు. 95 శాతంకంటే ఎక్కువ కేసుల్లో చికిత్స లేకుండానే బాధితులు ప్రాణాలు వదిలేస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment