కిన్‌సుగీ.. ఫెయిల్యూర్స్‌ని అంగీకరించే  ఒక సక్సెస్‌ స్టోరీ! | Success Should Be Achieved By Accepting Imperfection Perfectly | Sakshi
Sakshi News home page

కిన్‌సుగీ.. ఫెయిల్యూర్స్‌ని అంగీకరించే  ఒక సక్సెస్‌ స్టోరీ 

Published Sun, Nov 5 2023 8:59 AM | Last Updated on Sun, Nov 5 2023 11:09 AM

Success Should Be Achieved By Accepting Imperfection Perfectly - Sakshi

శోభనా సమర్థ్‌.. ఒకప్పటి బాలీవుడ్‌ నటి, దర్శకురాలు, నిర్మాత. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్‌ యాక్ట్రెస్‌ కాజోల్‌కి అమ్మమ్మ. ఒకసారి కాజోల్‌.. వాళ్లమ్మమ్మ బుగ్గలు పట్టుకుని ‘అమ్మమ్మా.. ఎంతందంగా ఉంటావే!’ అంటూ ముద్దు చేసిందట. ‘కారణమేంటో తెలుసా?’ అని అడిగిందట అమ్మమ్మ. ‘తెలీదు.. చెప్పూ’ అందట కాజోల్‌. ‘వికారంగా ఉన్న ఈ ముక్కే’ అందట అమ్మమ్మ తన ముక్కును చూపిస్తూ. అవాక్కయిందట మనవరాలు. ‘ఈ చిన్న ఇంపర్‌ఫెక్షనే లేకపోతే నేనసలు అందంగా కనిపించేదాన్నే కాను’ అందట చిన్నగా తలెగరేస్తూ! ఆ ఆత్మవిశ్వాసానికి అబ్బురపడుతూ కాజోల్‌.. వాళ్లమ్మమ్మ మొహంలోకి పరిశీలనగా చూసిందట మొదటిసారి.

నిజమే ఆవిడ చెప్పినట్టుగా ఆమె మొహానికి ముక్కే మైనస్‌ అని గ్రహించిదట కాజోల్‌. ‘అలా ఎలా మేనేజ్‌ చేశావ్‌ అమ్మమ్మా’ అని అడిగిందట ఆశ్చర్యపోతూ! ‘మేనేజ్‌ చేయలేదు. యాక్సెప్ట్‌ చేశా. నా ముక్కును. ఇంపర్‌ఫెక్షన్‌ మేక్‌ యూ మోస్ట్‌ బ్యూటిఫుల్‌ అని నమ్మాను.అంతే నా అందంలో ముక్కూ అమరింది. నా అభినయంలో పార్ట్‌ అయింది’ అని చెప్పిందట. అక్కడితో ఆ సీన్‌ ఎండ్‌ అవలేదు. మనవరాలి తెరంగేట్రానికి బోలెడు స్ఫూర్తినిచ్చింది.

అమ్మమ్మ మాటనే ఆచరణలో పెట్టి..
ఇంపర్‌ఫెక్షన్‌ని పర్‌ఫెక్ట్‌గా యాక్సెప్ట్‌ చేసే వారసత్వాన్ని పంచింది. ఎలాగంటే.. కాజోల్‌ రెండు కనుబొమలు కలుసుకుంటాయి. జీవితంలో దీన్ని దురదృష్టానికి ముడిపెడితే.. స్క్రీన్‌ మీద లుక్స్‌కి లంకె పెట్టారు. యూనీబ్రోతో స్క్రీన్‌ అపియరెన్స్‌ బాలేదు.. థ్రెడింగ్‌ చేయించుకో అని కాజోల్‌ ఆప్తుల నుంచి దర్శకనిర్మాతల దాకా అందరి దగ్గర్నుంచీ ఒత్తిడి వచ్చింది ఆమెకు. కానీ అమ్మమ్మ చెప్పిన మాటను మరచిపోలేదు కాజోల్‌. ఆచరణలో పెట్టింది. వేషాలు ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు కానీ థ్రెడింగ్‌ ముచ్చటే లేదు అని తెగేసి చెప్పింది. సణుగుతునే వేషాలు ఇచ్చారు. హిట్‌ అయింది. ఆ యూనిబ్రో ఆమె యూనిక్‌ స్టయిల్‌ అయింది. తర్వాత ఎందరో అమ్మాయిలు ఆ స్టయిల్‌ను ఫాలో అయ్యేలా చేసింది. శారీరక లోపాన్ని అందంగా మలచుకోవడం అంటే ఇదే! 
∙∙ 


ఒక అజేయుడి గురించీ చెప్పాలి. బహుశా అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకోసారి గుర్తు చేసుకుందాం. అతను ఈతగాడు. పేరు మైఖేల్‌ ఫెల్ప్స్‌. అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపరాక్టివిటీ డిజార్డర్‌ (ఏడీహెడ్‌డీ) బాధితుడు. ఈతలో ఎవరూ పోటీపడలేనంత ముందుకు వెళ్లాడు. విషయం ఏంటంటే చిన్నప్పుడు అంటే మైఖేల్‌కి ఏడేళ్లున్నప్పుడు మొహానికి తడి తిగిలితే చాలు చిరాకుపడిపోయేవాడట. వాళ్లమ్మ డెబ్బీ ఫెల్ప్స్‌ అబ్బాయిని స్విమ్మింగ్‌ పూల్‌లోకి తోస్తే మొహానికి తడి అంటకుండా ఈదడం నేర్చుకున్నాడట. కానీ దేనిమీదా ఏకాగ్రత ఉండేది కాదు.

ఇల్లు పీకి పందిరేయడంలో దిట్ట.  స్కూల్‌ నుంచీ మైఖేల్‌ మీద బోలెడు కంప్లయిట్స్‌ వచ్చేవి.. బాబు దేని మీద ఫోకస్‌ చేయట్లేదు అంటూ! అసలు వీడి ప్రాబ్లం ఏంటీ అని వాళ్లమ్మ..  కొడుకును డాక్టర్‌ దగ్గరకు తీసుకెళితే.. అప్పుడు తేలింది మైఖేల్‌కి ఏడీహెచ్‌డీ ప్రాబ్లం ఉందని! ఆనాటికి అతని వయసు 9 ఏళ్లు. చదువంటే ఇష్టపడేవాడు కాదు. కొడుకు సమస్య ఏంటో  అమ్మకు తెలిసింది. ఏది చేయలేడో దాన్ని వదిలేసింది. చేయగల దాని మీద దృష్టి పెట్టింది. అప్పుడు గ్రహించింది.. స్విమ్మింగ్‌ పూల్‌లో గంటలు గంటలు ఈతకొట్టగలడని. ఫోకస్‌ లేని ఆ మైండ్‌ని దార్లో పెట్టేది నీళ్లే అని అర్థమైంది ఆమెకు. పిల్లాడికున్న ఏడీహెచ్‌డీని జయించడానికి ఈతను మించిన ఆయుధం లేదని ఫిక్స్‌ అయిపోయింది. ఫలితం..ఒలింపిక్స్‌లో 28 పతకాలు (అందులో 23 బంగారు పతకాలే), 7 వరల్డ్‌ రికార్డులు. మానసిక లోపాన్ని జయించడం అంటే ఇదే!
∙∙ 

వీటిని గెలుపు గాథలుగా వివరించ లేదు. లోపాలను గ్రహించి.. వాస్తవాన్ని అంగీకరించి.. వాటిని తమకు అనుకూలంగా మలచుకుని వాటితోనే జీవితాన్ని ఆస్వాదించి ఆనందంగా సాగిన వ్యక్తులను పరిచయం చేశాం. అనుభవంలోకి వచ్చిన పరిస్థితులను ఒప్పుకోవడానికి చాలా శక్తి కావాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? మనలో ఉన్న ఇతర పాజిటివ్‌ కోణాల నుంచి! ఎప్పుడైతే మనలోని మైనస్‌నే ప్రపంచం చూస్తూ పాయింట్‌ అవుట్‌ చేస్తుందో అప్పుడు మనకు ఈ స్ట్రెంత్‌ అవసరం అవుతుంది.

ఆ మైనస్‌ను మెదడు అట్టడుగుపొరల్లోకి నెట్టేసి.. అట్టడుగున ఉన్న ప్లస్‌ని బయటకు తెచ్చి ప్రపంచం ఫోకస్‌ను ఆ పాజిటివ్‌ పాయింట్‌ మీదకు మరల్చాలంటే ముందు మైనస్‌ను అంగీకరించగలగాలి గౌరవంగా! ఇదే ఇంపర్‌ఫెక్షన్‌ని శక్తిగా మలచుకోవడమంటే! దీన్నే జపాన్‌లో కిన్‌సుగీ అంటారు. వైఫల్యంతో సఫలమవడమెలాగో నేర్పించడమే దాని తత్వం. 

ఫ్యాట్‌ లుక్‌తోనే హిట్స్‌ ఇచ్చి ట్రెండ్‌సెట్‌ చేసింది!
జీరో సైజ్‌ ట్రెండ్‌గా ఉన్న బాలీవుడ్‌లో తన ఫ్యాట్‌ లుక్‌తోనే హిట్స్‌ ఇచ్చి ఆ ట్రెండ్‌ని మార్చేసింది విద్యాబాలన్‌. ‘లావు కదా.. మోడరన్‌ డ్రెసెస్‌ అంతగా సెట్‌ కావు ఆమెకు’ అంటూ పెదవి విరుస్తున్న ఇండస్ట్రీలో చీరల్లోనే కనిపిస్తూ  నటననే కాదు గ్లామర్‌నూ పండించింది. వాస్తవానికి బ్యూటీ ఎక్స్‌పర్ట్‌ల అభిప్రాయం ప్రకారం విద్యాబాలన్‌.. ఇంపర్‌ఫెక్షన్‌ల పుట్ట. హార్మోన్‌ అసమతుల్యత వల్ల ఆమెకు సమస్యలు వచ్చాయి. వాటిని బహిరంగంగానే చెప్పింది. తను ఎలా ఉందో అలాగే స్క్రీన్‌ మీద కనిపిస్తోంది.. మేకప్‌తోగానీ.. సర్జరీలతోగానీ కరెక్షన్స్‌కు వెళ్లకుండా!  

ఫర్‌ఫెక్షన్‌కి కొలమానం లేదు
పర్‌ఫెక్షన్‌ అనేదానికి ప్రామాణికం లేదు. ఒకరికి పర్‌ఫెక్ట్‌గా అనిపించింది మరొకరికి అనిపించకపోవచ్చు. అందుకే ఎవరి ప్రమాణాలనో ప్రామాణికంగా తీసుకుని పర్‌ఫెక్షన్‌ అనే మాయలో పడను. నా శరీరాకృతి విషయంలో చాలా విమర్శలనే ఎదుర్కొన్నాను. నా మీద నాకు ప్రేమ ఎక్కువే. ఆత్మవిశ్వాసమూ అంతకంటే ఎక్కువే. అందుకే నన్ను నేను కాన్ఫిడెంట్‌గా క్యారీ చేసి విమర్శించిన వాళ్లచేతే గ్లామర్‌ క్వీన్‌గా మెప్పు పొందాను అని అంటోంది ఇలియానా.



వాల్ట్‌ డిస్నీ.. 
అతని కెరీర్‌ మొదట్లో ‘క్రియేటివిటీ లేదు.. పాడు లేదు.. నువ్వు పనికిరావు పో’ అన్నారట. ఆరోజు అతను ఆ మాటను పట్టించుకుని కుంగిపోయుంటే ఈ రోజు ప్రతి తరంలోని పిల్లలు సంతోషంతో పరవళ్లు తొక్కే మిక్కీ మౌస్, డొనాల్డ్‌ డక్‌ క్యారెక్టర్స్‌ పుట్టేవే కావు. 

కేట్‌ బాస్‌వర్త్‌ 
ఈ అమెరికన్‌ నటికి జన్యపరమైన కారణాల వల్ల ఒక కనుపాప తేనె రంగులో, ఇంకో కనుపాప నీలం రంగులో ఉంటాయి.  ఆ లోపాన్నే గ్లామర్‌ ప్రపంచంలో తన ప్రత్యేకతగా చాటుకుంది.   

‘ద గోల్డెన్‌ గర్ల్‌ ఆఫ్‌ వెల్‌నెస్‌’ కాన్‌డీస్‌ కూమై గురించి నాలుగు మాటలు.. 
‘కిన్‌సుగీ వెల్‌నెస్‌ ద జపనీస్‌ ఆర్ట్‌ ఆఫ్‌ నరిషింగ్‌ మైండ్, బాడీ అండ్‌ స్పిరిట్‌’ రచయిత కాన్‌డీస్‌ కూమై స్వస్థలం అమెరికాలోని కాలిఫోర్నియా. తల్లి జపాన్‌ దేశస్థురాలు. తండ్రి అమెరికాలో స్థిరపడిన పోలండ్‌ దేశస్థుడు. ఈ నేపథ్యం వల్ల అమెరికాలో కూమై చాలా వివక్షనే ఎదుర్కొంది. కిన్‌సుగీని ప్రాక్టీస్‌ చేయడం వల్లే తట్టుకుని నిలబడగలిగాను అని చెబుతుంది. కూమై..  షెఫ్‌గా చాలా ప్రసిద్ధి. మాజీ మోడల్, రచయిత, జర్నలిస్ట్, ఆర్ట్‌ డైరెక్టర్, పాడ్‌కాస్ట్‌ హోస్ట్, ఫొటోగ్రాఫర్‌ కూడా! ప్రముఖ ఎల్‌ మ్యాగజైన్‌ ఆమెకు ‘ద గోల్డెన్‌ గర్ల్‌ ఆఫ్‌ వెల్‌నెస్‌’ అనే బిరుదునిచ్చింది

పూర్వాపరాల్లోకి వెళితే.. 
నిజానికి కిన్‌సుగీ అనేది ఒక కళ. ఆర్ట్‌ ఆఫ్‌ రిపేర్‌. కిన్‌సుగీ అంటే గోల్డెన్‌ రిపేర్‌ లేదా గోల్డెన్‌ జాయినరీ. పగిలిపోయిన పింగాణీ పాత్రలను బంగారు లేదా వెండి వర్ణంతో అతికించే కళ. పగిలిపోయినవాటిని అతికిస్తే అవి మునుపటి రూపానికి రావు. ఆ పగుళ్లు సన్నగా.. ఎగుడు దిగుడుగా కనిపిస్తాయి. కాబట్టి ఆ అతుకును బంగారం, వెండి లేదా ప్లాటినం ద్రావకాలతో అద్దుతారు. దాంతో ఆ పాటరీ ఆ అతుకులతోనే అందంగా.. ఆకర్షణీయంగా.. ప్రత్యేకంగా కనిపిస్తుంది.

కిన్‌సుగీని జలపాతాలు.. నదులు.. మైదానాలతో పోలుస్తారు. ఎందుకంటే అవి రకరకాల రూపాల్లోకి ఒదుగుతూ అందంగా కనిపిస్తుంటాయి కదా! ఈ కళ.. ‘మొత్తైనై’ అంటే ‘అయ్యో వృథా అయిపోయిందే’.. ‘ముషిన్‌’ అంటే ‘మార్పును అంగీకరించడం’ అనే భావనల్లోంచి పుట్టింది అని చెబుతారు. అందుకే మూలం కన్నా కొత్తగా.. అరుదైన అందమైన దాన్నిగా మలచే కళగా కిన్‌సుగీ విరాజిల్లుతోంది. 

ఈ కళ ఎప్పుడు మొదలైంది?
15వ శతాబ్దంలో మొదలైంది. అషికాగా యోషిమాసా అనే సైనికాధికారి చైనా నుంచి పింగాణీ టీ పాత్రను తెప్పించుకున్నాడు. అందంగా ఉండే ఆ పాత్ర అంటే అతనికి ఎంతో ఇష్టం. ఒకసారి అది అతని చేతిలోంచి జారి కిందపడి పగిలిపోయింది. దాన్ని అతికించివ్వమని చైనాకు పంపాడు. అతికించి చైనీయులు తిరిగి పంపారు. అష్టవంకరలు కనిపించేలా అతికించిన ఆ పాత్రను చూసి ఏడ్చినంత పనిచేశాడట అషికాగా యోషిమాసా. తమ దగ్గరున్న కళాకారులను పిలిచి.. ఆ టీ పాత్రను చూపిస్తూ.. ‘మీరేం చేస్తారో తెలియదు.. ఈ అతుకులకు కొత్తందం తీసుకురావాలి’ అని ఆజ్ఞాపించాడట.

చిత్తమంటూ వాళ్లు చిత్తగించి.. రకరకాల ప్రయోగాలు చేసి.. చివరకు బంగారు ద్రావకంతో ఆ పగుళ్లను అద్దారు. అంతే ఆ పాత్ర ప్రత్యేక అందాన్ని సంతరించుకుంది. దాన్ని చూసిన అషికాగా యోషిమాసా మొహంలో ఆనందం పరచుకుంది. అప్పటి నుంచి ఆ అద్దకం ఆర్ట్‌గా మారింది. తర్వాత కాలంలో ఆ కళను జీవితానికీ అన్వయించుకోవడం మొదలుపెట్టారు జపనీయులు. అనుభవంలోకి వచ్చిన పరిస్థితులు.. బాధలను విశ్లేషించుకోసాగారు. ఆ విశ్లేషణ వాళ్లను వాస్తవాన్నించి పారిపోకుండా.. అంగీకరించి ముందుకు కదిలే స్థైర్యాన్నిచ్చింది.

అలా భయంలోంచి ధైర్యానికి సాగుతున్న ఆ ప్రయాణంలో దాగున్న ఆనందాన్ని పట్టుకున్నారు వాళ్లు. ఆస్వాదించడం ప్రారంభించారు. దాంతో సమస్యలను చూసే వాళ్ల దృష్టికోణమే మారిపోయింది. ఇది కదా బతకడం అంటే అనే గ్రహింపుకి వచ్చేశారు. అదిగో అప్పుడే కిన్‌సుగీ ఓ తత్వంగానూ మారి  స్థిరపడింది. లోపాలను స్వీకరించి.. వాటిని అందంగా మలచుకుని ఆత్మవిశ్వాసంతో సాగిపోవడమే ఈ జీవన కళ ఉద్దేశం. 

లోపాలు వరాలు
ఎవరమైనా పర్‌ఫెక్షన్‌ కోసమే పాకులాడుతాం. అహాన్ని సంతృప్తిపరచుకోవడానికో.. కీర్తి కోసమో.. ఆరోగ్యం విషయంలోనో ఆ పర్‌ఫెక్షన్‌ని సాధించాలనుకుంటాం. జీవితంలో ఉత్కృష్టమైన వాటి గురించే కథలుగా చెప్పుకుంటాం. కానీ వైఫల్యాలను చెప్పుకోం. బలహీనతలను బయటపెట్టుకోం. తప్పులను దాచేస్తాం. బంధాలు.. అనుబంధాల్లోని అరమరికలను ఒప్పుకోం. ఎవరూ ఎందులోనూ పర్‌ఫెక్ట్‌ కాదు అనే నిజం తెలిసినా నిర్లక్ష్యం చేస్తాం. అసలు తప్పులు చేయడంలో.. తప్పుగా ప్రవర్తించడంలోనే అందరం ఎక్స్‌పర్ట్స్‌మి. ప్రశంసించాల్సింది ప్రతిభను కాదు.

బలహీనతలను.. గాయాల తాలూకు మచ్చలను.. పొరపాట్లను చూపించుకునేందుకు చేస్తున్న ధైర్యాన్ని మెచ్చుకోవాలి. కానీ ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తాం. ఎదుటి వాళ్లను చూసి ప్రమాణాలను ఏర్పరచుకుంటాం. ప్రతికూల ఫలితాలకు భయపడతాం. మంచి, చెడు ఏ అనుభవమైనా అక్కరకొచ్చేదే. ఏదీ వృథా కాదు. కాస్త మనసుపెడితే లోపాలు.. వైఫల్యాలు వరాలుగా తోస్తాయి. ఫెయిల్యూర్స్‌ మన ఆత్మస్థైర్యాన్ని వెలికితీస్తాయి.. మరింత శక్తిమంతంగా నిలబెడతాయి. పింగాణీ పాత్ర పగులుకు ఎలాగైతే బంగారు ద్రావకంతో మెరుగులు పెడతారో అలాగన్నమాట. అందుకే లోపాలు వరాలు అంటున్నది.

ఫెయిల్యూర్‌తో వక్తిత్వవికాసం జరుగుతుంది. ఆ ట్రాన్స్‌ఫర్మేషన్‌ విజయాన్ని మించిన కిక్‌నిస్తుంది. దాన్ని ఆస్వాదించాలి.. అనుభవించాలి అని చెబుతుంది ఆర్ట్‌ ఆఫ్‌ హీలింగ్‌.. కిన్‌సుగీ. పర్‌ఫెక్షన్‌ వెంట పరుగులు పెట్టిన చాలామంది కిన్‌సుగీని లోతుగా అధ్యయనం చేశారు. ఆ అధ్యయనం.. తమ పరుగుకు అర్థంలేదని తేల్చింది. దాంతో ఆ పరుగును ఆపి కిన్‌సుగీని ప్రాక్టీస్‌ చేయసాగారు. వాళ్లలో కాన్‌డీస్‌ కూమై ఒకరు. న్యూయార్క్‌వాసి అయిన ఆమె కిన్‌సుగీ మీద ఆసక్తితో జపాన్‌ వెళ్లి అక్కడ కొన్నాళ్లుండి కిన్‌సుగీని ఔపోసన పట్టింది. ‘కిన్‌సుగీ వెల్‌నెస్‌ ద జపనీస్‌ ఆర్ట్‌ ఆఫ్‌ నరిషింగ్‌ మైండ్, బాడీ అండ్‌ స్పిరిట్‌’ అనే పుస్తకం రాసింది. అందులో.. ఒత్తిడిలేకుండా జీవితాన్ని హాయిగా ఆస్వాదించే టెక్నిక్స్‌ కొన్నింటిని విశదపరచింది. అవేంటో చూద్దాం..

వాబి సాబి 
జపాన్‌ భాషలో వాబి అంటే ఏకాంతం.. లేదా ఒంటరితనం. సాబి అంటే వెళ్లే సమయం. ఈ రెండూ కలసి.. మనలోని మంచి, చెడులను  మనమెట్లా అంగీకరించాలి.. వాటితో మన జీవితాన్ని ఎలా పరిపుష్టం చేసుకోవాలో చెబుతాయి. ఒక్కమాటలో.. వాబి సాబి అంటే మన లోపాల్లోని అందాన్ని ఆస్వాంచమని అర్థం. జీవితమంతా పర్‌ఫెక్ట్‌ ఫ్రేమ్‌లో సాగడం అసాధ్యం. మన బలహీనతలను తెలుసుకోవడం అంటే మన శక్తిసామర్థ్యాలను సెలబ్రేట్‌ చేసుకోవడమే. ఈ సానుకూల దృక్ఫథమే జీవితాన్ని సరళం చేస్తుంది. జీవితాన్ని ప్రేమించేలా చేస్తుంది. మన మీద మనకు నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచుతుంది. ఇదే వాబి సాబి సారాంశం. 

గామన్‌ ..
అంటే స్థితప్రజ్ఞత. తుఫాను వచ్చినా.. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నా సంయమనం కోల్పోకుండా.. ప్రశాంత చిత్తంతో ఉండడం. ఆవేశం ఆవహించకుండా చూసుకోవడం. దైనందిన జీవితంలో ఎదురయ్యే ఒత్తిడికి మనం స్పందించే తీరుతోనే దీన్ని ప్రాక్టీస్‌ చేయొచ్చు. పొద్దస్తమానం ప్రతికూల పరిస్థితుల గురించి ఆలోచించకుండా  సానుకూల పరిస్థితుల మీద దృష్టి పెట్టడం మంచిదని వివరిస్తుంది గామన్‌. 

యూయిమారు
వ్యక్తిగత సంబంధాలు, పరస్పర సహాయసహకారాలు ఎంత అవసరమో చెబుతుంది. మన అనుబంధాల్లోని గాఢత మీదే మనకు దొరికే సహానుభూతి ఆధారపడి ఉంటుంది. మన ఆప్తులు, సన్నిహితుల పట్ల మనం శ్రద్ధ కనబరిస్తే వాళ్లూ మన పట్ల శ్రద్ధ కనబరుస్తారు అంటుంది కిన్‌సుగీలో భాగమైన యూయిమారు. సింపుల్‌గా ఇచ్చిపుచ్చుకోవడమే! 

యొషోకు..
అంటే సౌండ్‌ మైండ్‌ ఇన్‌ సౌండ్‌ బాడీ, సౌండ్‌ బాడీ త్రూ సౌండ్‌ మైండ్‌ .. అన్నమాట. మెదడు నిరంతరం ఆరోగ్యకరమైన ఆలోచనలు చేస్తుంటేనే దాన్ని కలిగిన శరీరం ఆరోగ్యంగా.. దృఢంగా ఉంటుందనేది యొషోకు మంత్రం. ఏరకమైన ఆహారం తీసుకుంటున్నామనే దాని మీదే మైండ్, బాడీ కనెక్షన్‌ ఆధారపడి ఉంటుంది. కాబట్టి సాత్వికమైన పౌష్టికాహారాన్ని తీసుకుంటే అదే స్థాయిలో మెదడు ఆలోచనలు అద్భుతంగా సాగుతాయి. శరీరమూ అంతే పాజిటివ్‌నెస్‌తో స్పందిస్తుంది.  

కన్షా.. 
అంటే మన అహాన్ని వీడడం.. అనుభవాలను మళ్లీ పేర్చుకోవడం! జీవితంలోని మంచి, చెడులు.. రెండింటినీ సమంగా స్వీకరించి, రెండింటికీ సమంగా కృతజ్ఞత తెలపాలంటుంది కన్షా. కిన్‌సుగీలో అత్యంత ప్రధానమైన అంశం ఇదే! కృతజ్ఞత ప్రాక్టీస్‌ చేయడం అంటే వర్తమానంలో బతకడం. లేని వాటి గురించి ఆలోచించకపోవడం.. కోరుకోకపోవడం! వీటితో మన మెదడుకు కేవలం సానుకూలతలనే చూడమనే సంకేతాలను ఇవ్వడం.

ప్రతి చర్యకు ఓ కారణం ఉంటుంది. ఎలాంటి సమస్యకైనా ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ కారణం.. ఆ ఉద్దేశం మనల్ని మరింత శక్తిమంతంగా.. ఉన్నతంగా తీర్చిదిద్దాలి! ఇలా పుస్తకంలోనే కాదు జీవితంలోనూ అనుసరిస్తున్న ఈ కిన్‌సుగీ వెల్‌నెస్‌ టెక్నిక్స్‌ గురించి కూమై పాడ్‌కాస్ట్‌నూ నిర్వహిస్తోంది. ఆ శ్రవణమాధ్యమానికి ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాకమైన శ్రోతలున్నారు. 

చివరగా.. 
అదృష్టాదృష్టాలనే మాట లేకుండా.. బలాలు బలహీనతలతో సహా ఉన్నదున్నట్లుగా జీవితాన్ని అంగీకరించడం.. సుఖదుఃఖాలను సమంగా తీసుకోవడం.. అడ్డంకులను శక్తికి కొలమానంగా భావించడం, ఓటమిలోంచి గెలుపుకి దారి వేసుకోవడమనే తత్వాన్ని ఒంటబట్టించుకోవడమంటే సాధుపుంగవులుగా మరడమని కాదు. చేతుల్లో లేని వాటిని .. సరిచేయలేని వాటిని మెదడులో మోసే పనిపెట్టుకోవద్దని. చేయగలిగే వాటి  మీదే మెదడు పెట్టమని.

పోటీలు, పోల్చుకోవడాలు, ఒత్తిళ్లు, అంచనాలు, విఫలయత్నాలు, అసంతృప్తులు, కలలు, కల్లలు వంటివన్నీ ఆ ప్రాక్టీస్‌ని మన దరి చేరనీయకపోవచ్చు. భయం మన లోపాలను భూతద్దంలో చూపిస్తుండొచ్చు. ఆ భూతద్దాన్ని బ్రేక్‌ చేస్తే భయం అర్థం కోల్పోతుంది. అప్పుడు గెలుపు.. ఒటమి రెండూ సమంగా కనపడతాయి. బతుకు విలువ తెలుస్తుంది. మనకు కావల్సింది ఆ భూతద్దాన్ని పగలగొట్టే పరికరం. అదే ఈ కిన్‌సుగీ. బ్రేక్‌ చేసి ప్రాక్టీస్‌ చేయడమే ఆలస్యం!   

(చదవండి: నిండు గర్భిణి మళయాళ టీవీ నటి మృతి..ఆ టైంలో కూడా గుండె సమస్యలు వస్తాయా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement