
జుట్టును మృదువుగా, అందంగా సరిచేసుకోవాలంటే చేతిలో స్ట్రెయిటెనర్ ఉండాల్సిందే అంటారు చాలామంది ఆడవారు. అయితే సమయం ఉన్నా లేకున్నా, వీలున్నా లేకున్నా– పవర్ ప్లగ్ సమీపంలోనే చాలా స్ట్రెయిటెనర్లతో కేశాలంకరణ సాధ్యమవుతుంది. కానీ ఈ లేటెస్ట్ వైర్‌లెస్ గాడ్జెట్‌తో సులభంగా ఎక్కడైనా, ఎప్పుడైనా జుట్టును నచ్చిన విధంగా మార్చుకోవచ్చు.
ముఖ్యంగా ప్రయాణాల్లో ఈ గాడ్జెట్ భలేగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది రీచార్జబుల్ స్ట్రెయిటెనర్. దీన్ని వైర్‌లెస్ గాడ్జెట్‌లా వాడుకునే వీలుంటుంది. ఇది చూడటానికి, ఉపయోగించడానికి అచ్చం దువ్వెనలా ఉండటంతో జుట్టు దువ్వుకున్నట్లే దువ్వుకుని, ఈజీగా స్ట్రెయిటెనింగ్ చేసుకోవచ్చు. దీనిలో 120 డిగ్రీస్ నుంచి 200 డిగ్రీస్ సెల్సియస్ ఉష్ణోగ్రత వరకు మొత్తం మూడు ఆప్షన్స్ ఉంటాయి. ఆరోగ్యమైన జుట్టుకు, బలహీనపడిన జుట్టుకు ఉష్ణోగ్రతను ఎంపిక చేసుకోవడంలో వ్యత్యాసం పాటించాలి.
దీనితో పొడిబారి చిట్లిన జుట్టును సరి చేసుకోవచ్చు. వంకీల జుట్టును సులభంగా నిటారుగా మార్చుకోవచ్చు. ఉంగరాల జుట్టును మృదువుగా చేసుకోవచ్చు. ఈ గాడ్జెట్‌కు అటాచ్ చేసుకునేందుకు అనువుగా చార్జింగ్ బేస్ కూడా లభిస్తుంది.
ఈ కూంబ్ మెషిన్ ముందువైపు పవర్ బటన్ పైన ఆప్షన్స్ టెంపరేచర్ డీటైల్స్‌తో పాటు చార్జింగ్ ఇండికేషన్ కూడా కనిపిస్తుంది. దీన్ని కొనుగోలు చేసే సమయంలో బ్యాటరీ సామర్థ్యాన్ని, వినియోగదారుల రివ్యూలను పరిగణనలోకి తీసుకోవడం ఉత్తమం.
జుట్టు రాలు సమస్యకు చెక్..
ఈరోజుల్లో చాలామందికి జుట్టు రాలడమే ప్రధాన సమస్యగా మారింది. అందుకు పరిష్కారంగా ‘హెయిర్ మెసోథెరపీ’ అనే విధానాన్ని సూచిస్తున్నారు ప్రొఫెషనల్ బ్యూటీషియన్స్. మెసోథెరపీలో చాలా సన్నని సూదులను ఉపయోగించి.. విటమిన్లు, ఎంజైమ్‌లు, హార్మోన్లు వంటివి జుట్టు కుదుళ్లలోకి నేరుగా ఇంజెక్ట్ చేస్తారు.
ఈ ప్రక్రియ జుట్టు రాలడాన్ని తగ్గించి, బలమైన జుట్టు పెరిగేందుకు దోహదపడుతుంది. ఈ థెరపీ మాడులో రక్త ప్రసరణను మెరుగుపరచి, జుట్టు కుదుళ్లను ఉత్తేజపరుస్తుంది. జుట్టు రాలడానికి కారణమయ్యే హార్మోన్ల అసమతుల్యతను సరిచేస్తుంది.
ఈ చికిత్స సాధారణంగా కొన్ని వారాల వ్యవధిలో అనేక సెషన్లలో జరుగుతుంది. ఒక్కో సెషన్ సుమారు 30 నిమిషాలు పడుతుంది. హెయిర్ మెసోథెరపీని అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే చేయించుకోవాలి. చికిత్సకు ముందు, తరువాత వైద్యుల సూచనలను కచ్చితంగా పాటించాలి.
(చదవండి: Biodegradable Plastics: ప్లాస్టిక్‌ని వదిలించుకోవాలంటే.. చేతికి మట్టి అంటాల్సిందే..!)