
అనంతపురం: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లడానికి హైకోర్టు అనుమతిచ్చినా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తొడలు కొడుతున్నారు. పెద్దారెడ్డి తాడిపత్రి వస్తే తిరిగి వెళ్లడు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లడానికి హైకోర్టు అనుమతి ఇచ్చినా... తాను మాత్రం దాడులు చేస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగంగా సవాల్ చేశారు.
పెద్దారెడ్డికి ఎవరూ మద్దత ఇవ్వొద్దని, తనకు పెద్దారెడ్డితో గొడవలు ఉన్నాయని, ఒకవేళ వస్తే తిరిగి వెళ్లడు అంటూ వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తాడిపత్రి వెళ్లడానికి హైకోర్టు అనుమతిచ్చిన క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలా వ్యాఖ్యానించడం ఏంటో అర్థం కావడం లేదని పలువురు విమర్శిస్తున్నారు.
ఫ్యాక్షన్ రాజకీయాలు చేయడంలో తాము వెనక్కి తగ్గమని సంకేతాల్ని ఇచ్చిన జేసీపై విశ్లేషకులు మండిపడుతున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతున్నా టీడీపీ పెద్దలు మాత్రం పెదవి విప్పడం లేదు. పార్టీలో సభ్యుడైన వ్యక్తిని కంట్రోల్ చేయాల్సిన వారు మిన్నుకుండిపోతుండటంతో జేసీ ప్రభాకర్ రెడ్డి పదే పదే రెచ్చిపోయి వ్యాఖ్యలు చేస్తున్నారనే అబిప్రాయం వ్యక్తమవుతోంది.
