పని మనుషులను బెదిరించి.. కంప్యూటర్లు, ఫర్నిచర్ ధ్వంసం
దాడులతో సంబంధం లేని 30 మంది వైఎస్సార్‌సీపీ నేతల అరెస్టు
టీడీపీ నేతల వైపు కన్నెత్తి చూడలేదు
తాడిపత్రి అర్బన్: చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. మంగళవారం జరిగిన అల్లర్ల అనంతరం పోలీసుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఇంట్లోని గదులకు తాళం వేసుకుని వెళ్లిపోయారు. అయితే మంగళవారం అర్ధరాత్రి దాటాక రెండు గంటల సమయంలో ఎవరూ ఊహించని రీతిలో పోలీసులు ఆయన ఇంట్లోకి చొరబడ్డారు.
అక్కడ నిద్రిస్తున్న పని మనుషులను నిద్రలేపి ఇంటి తలుపులు తీయాలని బలవంతం చేశారు. తమ వద్ద తాళాలు లేవని చెప్పడంతో పోలీసులు అక్కడే ఉన్న వంట చేసే కబ్‌గిరి(పెద్ద పొడవైన గరిటె)తో ఇంటి తలుపులను బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లోని సీసీ కెమెరాలు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. కంప్యూటర్లను పగులగొట్టి హార్డ్ డిస్క్‌లను మాయం చేశారు. కాన్ఫరెన్స్ హాలు తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించి అక్కడున్న ఫ్యాన్, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.
ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీసులు
పోలింగ్ రోజు నుంచి తాడిపత్రి పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అదనపు ఎస్పీ రామకృష్ణ టీడీపీ గూండాలను రెచ్చగొడుతూ వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియా ఎదుట మండిపడ్డారు.
పోలింగ్ రోజున కూడా టీడీపీ నేతల వైపు వారు కన్నెత్తి చూడకుండా వైఎస్సార్‌సీపీ శ్రేణులను టార్గెట్ చేశారు. 144 సెక్షన్ అమలులో ఉన్నప్పటికీ టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్‌రెడ్డి, ఆయన తండ్రి జేసీ ప్రభాకర్‌రెడ్డి వందలాది మంది అనుచరులను వెంటేసుకుని రోడ్లపై హల్చల్ చేసినా వారించలేదు. ప్రభాకర్‌రెడ్డి అల్లుడు దీపక్‌రెడ్డి తన వాహనానికి ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించుకుని తిరిగినా పోలీసులు ప్రశ్నించలేదు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి లక్ష్యంగా టీడీపీ అల్లరి మూకలు దాడులకు పాల్పడుతున్నా ఆయన ఇంటి ముందు బందోబస్తు ఏర్పాటు చేయలేదు. మంగళవారం ఘర్షణల అనంతరం డీఐజీతో సహా రాయలసీమ జిల్లాల నుంచి పోలీసు బలగాలు పెద్ద ఎత్తున తాడిపత్రికి చేరుకున్నాయి.
కానీ ఎమ్మెల్యే ఇంటి ముందు మాత్రం నామమాత్రపు బందోబస్తు ఏర్పాటు చేసి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి నివాసం వద్ద మాత్రం పెద్ద ఎత్తున బలగాలను మోహరింపజేశారు. అంతేగాకుండా సోమ, మంగళవారాల్లో జరిగిన దాడులతో ఎటువంటి సంబంధం లేని వైఎస్సార్‌సీపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారు. వారిని మంగళవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండానే పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. మరికొందరిని కౌన్సెలింగ్ పేరిట ఇష్టారాజ్యంగా కొడుతున్నట్లు సమాచారం. తాడిపత్రి పోలీసుల ఏకపక్ష వైఖరి, తన ఇంట్లోకి చొరబడి విధ్వంసం సృష్టించడంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు.
మీడియాపై ఎస్పీ ఆంక్షలు
తాడిపత్రిలో వరుసగా జరుగుతున్న సంఘటనలకు సంబంధించి న్యూస్ కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిథులపై కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. గొడవలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు చిత్రీకరించకూడదని సాక్షాత్తు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆంక్షలు విధించడం గమనార్హం. ఎమ్మెల్యే పెద్దారెడ్డి నివాస సమీపంలో అదనపు ఎస్పీ రామకృష్ణతో బందోబస్తుపై ఆయన సమీక్షిస్తుండగా ఫొటోలు తీస్తున్న ఓ విలేకరిపై ఆయన చిందులు తొక్కారు. సెల్ ఫోన్ తీసుకోండంటూ అక్కడే ఉన్న తన గన్‌మన్లను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment