National Health Mission
-
రూ.693 కోట్ల ఎన్హెచ్ఎం బకాయిలు ఇవ్వండి: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం)లో భాగంగా కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన రూ.693.13 కోట్ల బకాయి లను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని ఆయన కలిశారు. ఈ సందర్భంగా వైద్యారోగ్య రంగంపై తెలంగాణ ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ గురించి నడ్డాకు రేవంత్ వివరించారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనలన్నీ ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేస్తున్నట్లు వివరించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు 5,159 బస్తీ దవాఖానాలు (ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు) నిర్వహిస్తున్నామని చెప్పారు.కేంద్రం వాటా ఆలస్యంతో మేమే చెల్లిస్తున్నాం..: రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నందున కేంద్రం సహకరించాలని, ఎన్హెచ్ఎం బకాయిలు విడుదల చేయాలని నడ్డాను రేవంత్ కోరారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలోని మూడు, నాలుగు త్రైమాసికాల కింద రూ. 323.73 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని.. 2024–25 మొదటి త్రైమాసిక గ్రాంట్ రూ. 138 కోట్లు మంజురు చేయాల్సి ఉందన్నారు. ఆ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. ఎన్హెచ్ఎం కింద చేపట్టిన మౌలికవసతులు, నిర్వహణ కాంపొనెంట్ కింద 2023–2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రావల్సిన రూ. 231.40 కోట్లను తక్షణమే రీయింబర్స్ చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఎన్హెచ్ఎంకు సంబంధించి కేంద్రం నుంచి రావల్సిన నిధులు ఆలస్యం కావడంతో అత్యవసర వైద్య సేవలకు అంతరాయం, సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రాష్ట్ర వాటాతోపాటు కేంద్రం వాటా మొత్తాన్ని 2023 అక్టోబర్ నుంచి తామే విడుదల చేస్తున్నామని నడ్డా దృష్టికి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. -
కాంట్రాక్టు ఏఎన్ఎంలకు 30% వెయిటేజీ
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద ఎంపికైన ఏఎన్ఎం–2 (సెకండ్ ఏఎన్ఎం)లకు తాజాగా తలపెట్టిన నియామకాల ప్రక్రియలో 30 శాతం వెయిటేజీ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రజారోగ్య విభాగం సంచాలకుడు జి.శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటివరకు 20 శాతం వెయిటేజీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావించిందని, కానీ క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి మరో 10 శాతం మార్కులను వెయిటేజీ రూపంలో ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు. శనివారం కోఠిలోని తన కార్యాలయంలో ఆయన ఏఎన్ఎం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. చర్చల అనంతరం సంఘాల నేతలు ప్రభుత్వ నిర్ణయాలపై సానుకూలత వ్యక్తం చేసినట్లు శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. ఎన్హెచ్ఎం కింద రాష్ట్రంలో ప్రభుత్వం 5,198 మందిని రెండో ఏఎన్ఎంగా నియమించిందన్నారు. వీరి సర్వీసును క్రమబద్దికరించేందుకు ఎలాంటి ప్రాతిపదికలు లేవన్నారు. దీంతో క్రమబద్దికరణ అసాధ్యమని ప్రభుత్వం తేల్చిందని, ఈ క్రమంలో పోస్టుల లభ్యత ఆధారంగా నియామకాలు చేపడుతున్నప్పటికీ సర్వీసు ఆధారంగా గరిష్టంగా 30 శాతం మార్కులు వెయిటేజీ రూపంలో ఇస్తున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,520 ఏఎన్ఎం ఖాళీల భర్తీకి తొలుత మెడికల్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసిందని, ఆ తర్వాత మరిన్ని పోస్టులు మంజూరు కావడంతో 411 పోస్టులను అదనంగా కలిపామని, దీంతో పోస్టుల సంఖ్య 1,931కి పెరిగిందని చెప్పారు. తుది నియామకం జరిగే నాటికి మరిన్ని పోస్టులు ఖాళీ అయితే వాటిని కూడా కలిపి నియామకాలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న ఖాళీల ఆధారంగా పనిచేస్తున్న ఏఎన్ఎంలను క్రమబద్దికరించడం సాధ్యం కాదని, అందుకే అర్హత పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నవంబర్ రెండో వారంలో ఏఎన్ఎం అర్హత పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రతి ఆర్నెళ్లకు రెండు పాయింట్లు.. రాష్ట్రంలో సెకండ్ ఏఎన్ఎంలుగా 2008 నుంచి నియమితులైన వారున్నారని, మైదాన ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి ప్రతి ఆరునెలలకు 2 పాయింట్లు ఇస్తున్నామని, ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే వారికి రెండున్నర పాయింట్లు ఇస్తున్నామని శ్రీనివాసరావు చెప్పారు. గరిష్టంగా ఎనిమిది సంవత్సరాలు పనిచేసిన వారికి 30 శాతం వెయిటేజీ వస్తుందని, ఈ క్రమంలో తాజా నియామకాల ప్రక్రియలో వంద శాతం అవకాశాలు వీరికే వస్తాయని వెల్లడించారు. తాజాగా నియామకాల ప్రక్రియలో అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 49 సంవత్సరాలకు పెంచామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిని 53 సంవత్సరాలుగా ఖరారు చేశామని తెలిపారు. ఎన్హెచ్ఎం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమైనప్పటికీ రాష్ట్రంలో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎంలకు నెలవారీగా రూ.27,300 వేతనంగా ఇస్తున్నామన్నారు. ఏఎన్ఎంలు మొండిగా సమ్మె కొనసాగిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
అమ్మ కాని ‘అమ్మ’
పసిబిడ్డకు తల్లిపాలే అమృతం. కానీ అమ్మతనం అందివచ్చినా పిల్లలకు పాలు ఇవ్వలేని స్థితికొందరు తల్లులది. ఆ తల్లుల పాలిట ఆపద్బాంధవిలా, శిశువులకు తల్లిలా నిలుస్తోంది ఖమ్మం జిల్లా ప్రధాన ఆస్పత్రిలోని సమగ్ర తల్లిపాల సేకరణ కేంద్రం. ఏడాదిలో 599 మంది తల్లుల నుంచి సేకరించిన పాలను 626 మంది శిశువులకు అందజేసి ఆకలి తీర్చింది. శిశు మరణాలు తగ్గించడం, వారిని ఆరోగ్యవంతులను చేయడమే లక్ష్యంగా నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా దేశంలోని బెంగళూరు, కేరళ, ఢిల్లీ, చెన్నై తర్వాత ఐదో పెద్ద కేంద్రాన్ని ఖమ్మం ఆస్పత్రిలో గత ఏడాది ఏప్రిల్ 30న ఏర్పాటుచేశారు. హైదరాబాద్‌లోని నిలోఫర్, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రుల్లో మినీ మిల్క్ బ్యాంకులు ఉండగా ఖమ్మంలో మాత్రం ‘అమృతం’ పేరిట మెగా మదర్ మిల్క్ బ్యాంక్ అందుబాటులోకి వచ్చింది. – సాక్షిప్రతినిధి, ఖమ్మం ప్రసవాలే ప్రాధాన్యతగా.. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోజుకు సగటున 30 నుంచి 40 వరకు ప్రసవాలు జరుగుతుంటాయి. ఇక్కడ కంగారూ మదర్ కేర్ సెంటర్ ఉండటంతో బరువు తక్కువగా పుట్టిన శిశువులను తీసుకొస్తారు. వీరిలో తల్లి పాలు అందని పిల్లలు ఎక్కువగా ఉంటుండడంతో నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో సమగ్ర చనుబాల నిర్వహణ కేంద్రం(ఎస్ఎల్ఎంసీ) ఇక్కడ ఏర్పాటు చేశారు. రూ.42 లక్షల వ్యయంతో కేంద్రం.. భవన నిర్మాణానికి మరో రూ.73.39 లక్షలు వెచ్చించారు. ఇక్కడ తల్లుల నుంచి సేకరించిన చనుబాల బాటిళ్లను 400 నుంచి 600 వరకు నిల్వ సామర్థ్యం కలిగిన యంత్రాలున్నాయి. తల్లుల నుంచి సేకరించిన పాలను మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో భద్రపరుస్తుండడంతో ఆరునెలల పాటు వినియోగించే అవకాశం ఉంటుంది. కేజీన్నర లోపు బరువుతో పుట్టిన పిల్లలకే కాక, తల్లికి సరిపడా పాలు రాని సందర్భాల్లో పిల్లలకు ఈ పాలు పట్టిస్తారు. ఫలితంగా తల్లిపాలు అందక జరిగే శిశు మరణాలను అరికట్టడం సాధ్యమవుతోంది. ఆస్పత్రికి ప్రసవాల కోసం వచ్చే వారికి ఈ విషయమై అవగాహన కల్పించడంతో ఇప్పటివరకు 599 మంది తల్లుల నుంచి 2,14,100 మి.లీ. పాలను సేకరించి 626 మంది శిశువులకు అందజేశారు. ఇక్కడ తల్లిపాలు సేకరించేందుకు ఆరు బ్రెస్ట్ పంప్స్ ఏర్పాటు చేశారు. నిల్వ చేసుకునేందుకు వీలుగా.. ఆస్పత్రిలో డెలివరీ అయిన శిశువులు అనారోగ్యం పాలైతే ఇంక్యుబేటర్‌లో మూడు, నాలుగు రోజులు ఉంచాల్సి ఉంటుంది. దీంతో వారి తల్లులు తమ పాలను నిల్వ చేసుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. బ్రెస్ట్ పంప్స్ ద్వారా పాలు సేకరించి నిల్వ చేశాక, మళ్లీ శిశువులకు అవసరమైనప్పుడు అవే పాలు పడుతున్నారు. ఇలా 1,274 మంది తల్లులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. అంతేకాకుండా శిశుగృహాలు, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రసవం జరిగి పాలు లేని శిశువులకు కూడా ఈ కేంద్రం ద్వారా పాలు అందజేస్తున్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రితోపాటు ఏరియా ఆస్పత్రులు, అర్బన్ హెల్త్ సెంటర్లు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అవసరమైన శిశువులకు పాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. శిశువులకు వరం ఆస్పత్రిలోని ఎస్ఎల్ఎంసీ పాలు అందని శిశువులకు ఇది వరం లాంటిది. పాలు ఎక్కువగా ఉన్న తల్లులు ఈ బ్యాంకుకు అందజేసేలా అవగాహన కల్పిస్తున్నాం. శిక్షణ తీసుకున్న స్టాఫ్ నర్సుల పర్యవేక్షణలో పాల సేకరణ, నిల్వ, పంపిణీ కొనసాగుతోంది. – డాక్టర్ బి.వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్, ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి తల్లులు ముందుకొస్తున్నారు ఈ అంశాలపై 14 రోజుల పాటు నీలోఫర్‌లో శిక్షణ పొందాం. ఆస్పత్రిలో ప్రసవించే తల్లులకు పాలు ఎక్కువగా ఉంటే ఈ కేంద్రంలో ఇవ్వాలని అవగాహన కల్పిస్తున్నాం. పాలు ఉండి పిల్లలకు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నవారికి కూడా ఫీడింగ్ విధానం గురించి వివరిస్తున్నాం. చాలా మంది తల్లులు పాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. – కృష్ణవేణి, స్టాఫ్ నర్స్, ఎస్ఎల్ఎంసీ, ఖమ్మం పిల్లలు ఏడవడం చూడలేక.. జిల్లా ఆస్పత్రిలోనే నాకు డెలివరీ జరిగింది. నేను ఉంటున్న వార్డులో కొందరు తల్లుల వద్ద పాలు సరిపోక పిల్లలు ఏడుస్తుండడం చూశా. అది చూడలేక.. నా దగ్గర మా పాపకు సరిపోను పాల కన్నా ఎక్కువే ఉండటంతో కేంద్రంలో ఇచ్చా. ఆ పిల్లలకు ఈ పాలు ఇస్తుండటం ఆనందాన్ని కలిగించింది. – గుగులోతు అనిత, పెద్దతండా, ఖమ్మం -
తెలంగాణకు మరో రెండు జాతీయ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మాతా శిశు సంరక్షణలో తీసుకుంటున్న చర్యలకు జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. గర్భిణుల సంరక్షణకు రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలను కేంద్రప్రభుత్వం ప్రశంసించింది. కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ ఢిల్లీలో నిర్వహిస్తున్న ‘నేషనల్ మెటర్నల్ హెల్త్ వర్క్ షాప్‘లో భాగంగా తెలంగాణకు రెండు అవార్డులను ప్రకటించింది. మాతృ మరణాలను పూర్తిగా నివారించాలన్న కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలను కేంద్రం అభినందించింది. బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వైద్యారోగ్యశాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్పవార్ చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున జాయింట్ డైరెక్టర్ (మెటర్నల్ హెల్త్) డాక్టర్ ఎస్ పద్మజ అవార్డులు అందుకున్నారు. మిడ్ వైఫరీ వ్యవస్థపై కేంద్రం ప్రశంసలు దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిడ్ వైఫరీ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. రాష్ట్రంలో ప్రసవసేవలను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం దేశంలోనే తొలి సారి మిడ్ వైఫరీ వ్యవస్థను తీసుకువచ్చింది. దీని కోసం ఎంపిక చేసిన నర్సులకు అత్యుత్తమ శిక్షణ అందించింది. ఇప్పటి వరకు ఇలా శిక్షణ పొందిన 212 మంది మిడ్ వైఫరీలను ప్రభుత్వం 49 ఆస్పత్రుల్లో నియమించింది. ఇక హైరిస్క్ ఉన్న గర్భిణులను గుర్తించడం, చికిత్స అందించడంలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. హైరిస్క్ గర్భిణులను ముందస్తుగా గుర్తించడం, వారిని నిరంతరం పరిశీలించడం ( ట్రాకింగ్), ఉత్తమ చికిత్స అందేలా రిఫర్ చేయడంకోసం వైద్య అధికారులు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలతో ప్రత్యేక విధానాన్ని అభివృద్ధి చేసింది. దీంతో హై రిస్క్ కేసులను ముందుగా గుర్తించి, వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించి, ఆసుపత్రులకు తరలించి, సరైన చికిత్స అందించే అవకాశం కలిగింది. దీంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న కేసీఆర్ కిట్, అమ్మఒడి వాహన సేవలు గర్భిణులకు వరంగా మారాయి. ఫలితంగా రాష్ట్రంలో మాతృ మరణాలు గణనీయంగా తగ్గాయి. చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి: హరీశ్ ‘‘సీఎం కేసీఆర్ ఆలోచనతో రాష్ట్రంలో అమలు చేస్తున్న మాతా శిశు సంరక్షణ చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. మరో రెండు కేంద్ర ప్రభుత్వ అవార్డులు రావడం మా వైద్య సిబ్బంది పనితీరుకు నిదర్శనం. 2014లో 92గా ఉన్న ఎంఎంఆర్ ఇప్పుడు 43కు తగ్గటం గొప్ప విషయం. ఈ ఘనతలు సాధించడంలో క్షేత్రస్థాయిలో ఉండి వైద్య సేవలు అందించే ఆశాలు, ఏఎన్ఎంల నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వైద్యాధికారుల నిరంతర కృషి ఉందని’ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అభినందించారు. ఇదీ చదవండి: Hyderabad: పాతబస్తీకి మెట్రో కలేనా..? -
ఇది ముందడుగే కానీ...
మహిళా ఆరోగ్య రంగంలో ఒక శుభవార్త. మన దేశంలో ప్రసూతి మరణాల రేటు గతంతో పోలిస్తే తగ్గింది. భారత రిజిస్ట్రార్ జనరల్ (ఆర్జీఐ) ప్రత్యేక బులెటిన్ ఈ మంచి వార్తను మోసుకొచ్చింది. ప్రసూతి మరణాల రేటును లక్షకు వంద లోపునకు తగ్గించాలంటూ జాతీయ ఆరోగ్య విధానం (ఎన్హెచ్పీ)లో పెట్టుకున్న లక్ష్యాన్ని భారత్ అందుకుంది. తాజా ఘనతలో కేరళ, తెలంగాణ, ఏపీ సహా పలు దక్షిణాది రాష్ట్రాలదే కీలక పాత్ర. 2014–16 మధ్య ప్రతి లక్ష జననాల్లో 130 మంది చనిపోయేవారు. అది 2018–20కి వచ్చేసరికి లక్షకు 97 ప్రసూతి మరణాలకు తగ్గింది. ఈ ధోరణి కొనసాగితే, రానున్న 2030 కల్లా లక్షకు కేవలం 70 లోపలే ఉండాలన్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని (ఎస్డీజీ) భారత్ అందుకుంటుంది. కేంద్రం, రాష్ట్రాల ఆరోగ్య పథకాల సానుకూల ఫలితమే ఇది. గర్భిణిగా ఉండగా కానీ, ప్రసవమైన 42 రోజుల లోపల కానీ తలెత్తిన ఆరోగ్య సమస్యల వల్ల 15–49 ఏళ్ళ మధ్యవయసు స్త్రీ మరణిస్తే దాన్ని ‘ప్రసూతి మరణం’ అంటారు. ఇక, ఒక నిర్ణీత కాల వ్యవధిలో ప్రతి లక్ష జననాలకూ ఎందరు ప్రసూతి మహిళలు మరణించారనే సంఖ్యను ‘ప్రసూతి మరణాల రేటు/ నిష్పత్తి’ (ఎంఎంఆర్) అని నిర్వచనం. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్సారెస్) నుంచి నిష్పాదించిన గణాంకాల్ని బట్టి మన దేశంలో ఎంఎంఆర్ నానాటికీ తగ్గుతోంది. ఆ క్రమాన్ని గమనిస్తే 2014–16లో 130 మరణాలు, 2015–17లో 122 మరణాలు, 2016–18లో 113 మరణాలు, 2017–19లో 103 మరణాలు, తాజాగా 2018–20లో 97 మరణాలే నమోదయ్యాయి. అంటే లక్షకు 70 లోపలే మరణాలుండాలనే ఐరాస లక్ష్యం దిశగా భారత్ అడుగులేస్తోందన్న మాట. ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని సాధించడంలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర గణనీయం. గతంలో 6 రాష్ట్రాలే ఎస్డీజీని సాధించగా, ఇప్పుడు వాటి సంఖ్య 8కి పెరిగింది. లక్షకు కేవలం 19 మరణాలతో కేరళ అగ్రస్థానంలో ఉండగా, ఆ తరువాత క్రమంగా మహారాష్ట్ర (33), తెలంగాణ (43), ఆంధ్ర ప్రదేశ్ (45), తమిళనాడు (54), జార్ఖండ్ (56), గుజరాత్ (57), కర్ణాటక (69) నిలిచి, లక్ష్య సాధనలో గణుతికెక్కాయి. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద నాణ్యమైన మాతా శిశు ఆరోగ్య సేవలను అందరికీ అందించాలనీ, తద్వారా నివారించదగ్గ ప్రసూతి మరణాలను వీలైనంత తగ్గించాలనీ మన దేశం చేసిన నిరంతర కృషి మెచ్చదగినది. ఆరోగ్య సేవలను సమకూర్చడంపై, ముఖ్యంగా ప్రసూతి ఆరోగ్యకార్యక్రమాల అమలుపై కేంద్రం, రాష్ట్రాల శ్రద్ధ ఈ ఫలితాలకు కారణం. నిజానికి, ప్రసూతి ఆరోగ్యమనేది స్త్రీల స్వస్థత, పోషకాహారం, గర్భనిరోధకాల అందుబాటు సహా అనేక అనుబంధ రంగాల్లోని పురోగతిని తెలిపే కీలకమైన సూచిక. ఎంఎంఆర్ 100 లోపునకు తగ్గడమనేది దేశంలో ఇదే తొలిసారి. పైగా, 2014–16తో పోలిస్తే ఎంఎంఆర్ దాదాపు 25 శాతం తగ్గడం చెప్పుకోదగ్గ విషయం. అయితే, కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన ఈ డేటాను మరింత లోతుగా పరిశీలిస్తే, మెరుగుపడాల్సిన అనేక అంశాలు కనిపిస్తాయి. ఎంఎంఆర్ జాతీయ సగటు తగ్గినప్పటికీ, ఉత్తరాదిలోని అనేక రాష్ట్రాల్లో పలు పరస్పర వైరుద్ధ్యాలు చోటుచేసుకున్నాయి. కేరళలో ఎంఎంఆర్ ఏకంగా 19కి పడిపోతే, అస్సామ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ లాంటి చోట్ల మాత్రం ప్రసూతి మరణాలు 160కి పైన ఉండడమే దీనికి నిదర్శనం. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడ్డ ప్రాంతాల్లోనే ఈ పరిస్థితి నెలకొంది. నిజానికి, దేశాభివృద్ధి ఈ ప్రాంతాలపైనే ఆధారపడ్డది. అనేక ఇతర లోటుపాట్లూ లేకపోలేదు. వివిధ రాష్ట్రాల మధ్యనే కాక, వివిధ జిల్లాల్లో, అలాగే వివిధ జనాభా వర్గాల మధ్యనా అంతరాలున్నట్టు అర్థమవుతోంది. రాష్ట్ర సర్కార్ల శ్రమతో దక్షిణాది రాష్ట్రాల్లో కొన్నేళ్ళుగా ప్రసూతి మరణాలు తగ్గిన మాట వాస్తవమే. కానీ, ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో గర్భిణులపై హింసాఘటనలు అత్యధిక సంఖ్యలో నమోదు అవుతున్న చేదునిజాన్ని విస్మరించలేం. అంటే, దేశం మొత్తాన్నీ చూస్తే మన పురోగతి ఇప్పటికీ అతుకుల బొంతే. అసమానతలు అనేకం. ఆ మాటకొస్తే, ఈ ఏడాది జూలైలో ప్రసిద్ధ పీఎల్ఓఎస్ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం సైతం మన లెక్కల్లోని లోటుపాట్లను ప్రస్తావించింది. దేశంలోని 70 శాతం (640 జిల్లాల్లో 448) జిల్లాల్లో ఐరాస ఎస్డీజీకి భిన్నంగా ప్రసూతి మరణాలెక్కువని ఎత్తిచూపింది. మునుపటితో పోలిస్తే కొంత మెరుగుపడ్డా, స్వాతంత్య్ర అమృతోత్సవ వేళలోనూ ఈశాన్య రాష్ట్రాల సహా అనేక జిల్లాల్లో ప్రసూతి మరణాల రేటు ఎందుకు ఎక్కువగా ఉందో పాలకులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. డబల్ ఇంజన్ సర్కార్ అని గొప్పలు చెబుతున్న రాష్ట్రాలే అధిక మరణాల అపకీర్తిలో ముందుండడం గమనార్హం. మార్పులతో ‘జననీ శిశు సురక్షా కార్యక్రమ్’, ‘జననీ సురక్షా యోజన’ లాంటి ప్రభుత్వ పథకాల స్థాయి పెంచడం బానే ఉంది. కానీ, స్త్రీల సమగ్ర ఆరోగ్య రక్షణను మెరుగుపరచడమెలాగో చూడాలి. గర్భిణుల్లో రక్తహీనత మునుపటికన్నా పెరిగింది. గర్భిణుల్లో వైద్య చెకప్‌లు, ఐరన్, ఫోలిక్ యాసిడ్ అందనివారే నేటికీ అనేకం. అందుకే, కీలక ఆరోగ్య డేటాను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. దేశం మొత్తం ఎస్డీజీని చేరేలా తక్షణచర్యలు చేపట్టాలి. వీటిని కేవలం అంకెలుగా భావిస్తే పొరపాటు. ఆ అంకెల వెనకున్నది తల్లులు, అప్పుడే పుట్టిన పిల్లలు, యావత్ కుటుంబాలనే స్పృహ అవసరం. ఆ వైఖరితో నిశితంగా వ్యవహరిస్తే మంచిది. అనేక ప్రాణాలు నిలుస్తాయి. ఆరోగ్య భారతావని గెలుస్తుంది. ఆ కృషిలో ప్రసూతి మరణాల రేటు పదిలోపే ఉండేలా చేసిన బెలారస్, పోలెండ్, బ్రిటన్లే మనకు ఆదర్శం. -
నాణ్యమైన వైద్యం జగనన్న లక్ష్యం: మంత్రి విడదల రజిని
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అత్యంత సులువుగా, పూర్తిగా ఉచితంగా అందాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి విడదల రజిని అన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ టవర్స్‌లో గురువారం మంత్రి విడదల రజిని ఎన్హెచ్ఎం విభాగం ఉన్నతాధికారులు, కమిషనర్ నివాస్‌తో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం జగన్.. వైద్య ఆరోగ్యశాఖ విషయంలో ఒక స్పష్టమైన లక్ష్యంతో ముందుకు వెళుతున్నారని చెప్పారు. చదవండి: నరకం చూపిస్తారా.. కన్నీళ్లు పెట్టుకున్న దివ్యవాణి ప్రజలందరికీ ఉచితంగా మెరుగైన వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసేందుకు జగనన్న ఏ మాత్రం వెనుకాడటంలేదని తెలిపారు. గ్రామస్థాయి నుంచి మెడికల్ కళాశాలల వరకు ప్రభుత్వ ఆస్పత్రుల నిర్మాణం, ఆధునికీకరణ, వసతుల కల్పనకు తమ ప్రభుత్వం ఏకంగా 16 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని చెప్పారు. 40 వేలకుపైగా నియామకాలు చేపట్టామని వెల్లడించారు. పూర్తి ఉచితంగా అన్ని రోగాలకు వైద్యం అందిస్తున్నామన్నారు. ఈ సేవలు ప్రజలకు మరింత మెరుగ్గా, నాణ్యంగా, ఉచితంగా అందాలంటే అధికారుల సహాయ సహకారాలు ఎంతో అవసరమని చెప్పారు. నిర్లక్ష్యం వీడితే చాలు తాను ఈ మూడేళ్లలో పలు ఆస్పత్రులు సందర్శించానని అన్ని చోట్లా మంచినీటి కొరత, అపరిశుభ్రత, నిర్వహణలో లోపాలు, టాయిలెట్లు సరిగా లేకపోవడం.. లాంటివి గమనిస్తూనే ఉన్నానని తెలిపారు. ఇవన్న చాలా చిన్న చిన్న సమస్యలని, అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇవి పెద్దవిగా కనిపిస్తున్నాయని చెప్పారు. సరైన సమయంలో స్పందిస్తూ ఆయా సమస్యలను పరిష్కరించుకుంటే సరిపోతుందని, అధికారులు చిత్తశుద్ధితో ఉంటేనే ఇది సాధ్యమవుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న వారందరి సంక్షేమం గురించి కూడా మనం ఆలోచించాలని చెప్పారు. వారందరికీ పీఎఫ్, ఈఎస్ఐ అందున్నాయో లేదో చూడాలన్నారు. ప్రతి ఉద్యోగికి సంబంధించిన వివరాల్లోకి వెళ్లాలని, ఏ ఒక్కరికి, ఎక్కడ సమస్య ఎదురైనట్లు గుర్తించినా.. సదరు ఏజెన్సీలపై చర్యలకు వెనుకాడొద్దని చెప్పారు. ఏఎన్ఎంలు, ఇతర ఫీల్డ్ సిబ్బంది బయోమెట్రిక్ విధానం వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర వ్యాప్తంగా పదే పదే తన దృష్టికి తీసుకొస్తున్నారని, వారి అభ్యర్థనలోనూ న్యాయం ఉందని, ప్రత్యామ్యాయ పద్ధతులను ఆలోచించాలని ఆదేశించారు. 2021-22 సంవత్సరానికి సంబంధించి ఎన్హెచ్ఎం లక్ష్యాలు ఏమున్నాయి.. వాటిని ఎంతవరకు రీచ్ అయ్యాం.. ఇప్పుడు జరుగుతున్న ఆర్థిక సంవత్సరంలో మనం ఎలా లక్ష్యాలను చేరుకోవాలి అనే విషయాలపై అందరికీ అవగాహన ఉండాలని చెప్పారు. ఆ మేరకు పనిచేయాల్సిందేనని స్పష్టంచేశారు. ఎన్‌హచ్‌ఎం నిధులను సక్రమంగా వినియోగించుకోవడంలేదని, మెడికల్ ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్ల ఆ నిధులు మురిగిపోతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయని, ఏ ఆస్పత్రిలోనూ ఇలాంటి పరిస్థితులు ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఎన్హెచ్ఎం నిధులను అంతా సమర్థవంతంగా వినియోగించుకోవాలని చెప్పారు. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గతంలో ఏ ప్రభుత్వాలకూ సాధ్యం కానంతగా కోట్ల రూపాయలు ఖర్చుచేస్తుంటే.. ఇప్పటికీ కొన్ని పీహెచ్‌సీల్లో మందులు బయటకు రాస్తున్నారని ఈ పరిస్థితి మారాలని చెప్పారు. ఎక్కడా, ఎప్పుడూ టెస్టులుగాని, మందులుగాని బయటకు రాయకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆస్పత్రులకు కావాల్సిన అన్ని మెటీరియల్స్ అందించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని, అయినా సరే కొన్ని ఆస్పత్రుల్లో మెటీరియల్ కొరత కనిపిస్తోందని చెప్పారు. ఎలుకలు, దోమలు ఆస్పత్రుల్లో ఎందుకు ఉంటున్నాయని, ప్రభుత్వ నిధులను సక్రమంగా వినియోగించి ఈ సమస్య తలెత్తకుండా చూడాలని సూచించారు. పీహెచ్ సీల్లో కాన్పులు జరిగేలా చూడండి రాష్ట్రంలోని అన్ని పీహెచ్ సీల్లో కాన్పులు జరిగేలా చొరవ చూపాలని మంత్రి తెలిపారు. ప్రతి పీహెచ్సీలో నెలకు కనీసం 10 కాన్పులైనా జరిగేలా కచ్చితంగా ప్రయత్నించాల్సిందేనని చెప్పారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకోవాలన్నారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో కాన్పులు జరగకపోవడం వల్ల టీచింగ్, జిల్లా ఆస్పత్రులపై ఒత్తిడి పెరుగుతోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, నోటిఫికేషన్ విడుదల చేయాలని వివరించారు. ఏపీ ఎం ఎస్ ఐడీసీ ద్వారా కొనుగోలు చేస్తున్న పరికరాల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, నాణ్యతను పరిశీలించే టెక్నికల్ టీమ్‌లో సంబంధిత వైద్యులు కూడా ఉండేలా చూడాలని సూచించారు. కావాల్సినన్ని ఆస్పత్రులు నిర్మిస్తున్నాం, కావాల్సినంత సిబ్బందిని నియమిస్తున్నాం, కోట్లాది రూపాయలతో పరికరాలు కొనుగోలు చేస్తున్నాం.. అయినా సరే కొన్నిచోట్ల టెస్టులు బయటకు రాస్తున్నారు.. ఈ పరిస్థితి మారాలని మంత్రి తెలిపారు. ల్యాబ్‌లలో ఉన్న వైద్య పరికరాల మెయింటినెన్స్‌కు సంబంధించి కాలిబ్రేషన్ సక్రమంగా జరుగుతోందా..? లేదా అని ప్రశ్నించారు. క్వాలిటీ ఎజ్యూరెన్స్ స్కీమ్ కింద కాలిబ్రేషన్ చేయాలని ఇది సక్రమంగానే చేస్తున్నారా అని అడిగారు. వైద్య విభాగంలో ప్రతి ఒక్కటి పారదర్శకంగా జరగాల్సిందేనని స్పష్టంచేశారు. పరికరాల నిర్వహణకు కూడా ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తోందని, సమస్యలు రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని చెప్పారు. ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు, వైద్య శాఖలో ప్రొఫెనల్ ఐడీలు, ? ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లు, ప్రభుత్వ ఆస్పత్రుల మ్యాపింగ్ లాంటి వన్నీ గడువులోగా పూర్తికావాలని చెప్పారు. ప్రభుత్వ ఆశయాలకు, జగనన్న లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం మనందరిపై ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఆయా విభాగాల ఉన్నతాధికారులంతా పాల్గొన్నారు. -
ఇక జిల్లా ఆస్పత్రుల్లోనూ హెపటైటిస్‌కు వైద్యం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లో వైరల్ హెపటైటిస్ కేసులు క్రమేణా పెరుగుతున్న నేపథ్యంలో అన్ని జిల్లా ఆస్పత్రుల్లోనూ వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జాతీయ హెల్త్‌మిషన్ కేంద్ర అదనపు కార్యదర్శి, కేంద్ర ఎన్హెచ్ఎం డైరెక్టర్ వికాస్ షీల్ రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేశారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 11 బోధనాస్పత్రులు, 2 జిల్లా ఆస్పత్రుల్లో హెపటైటిస్ బీ వైరస్‌కు సంబంధించిన వ్యాధులకు స్క్రీనింగ్‌తో పాటు వైద్యం అందిస్తున్నారు. ఇక నుంచి అన్ని జిల్లా ఆస్పత్రుల్లోనూ హెపటైటిస్‌కు వైద్యం అందించాలని నిర్ణయించారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మరో 13 ఆస్పత్రుల్లోనూ హెపటైటిస్ బాధితులకు వైద్యం అందనుంది. అంటే మొత్తం 26 ఆస్పత్రుల్లో హెపటైటిస్ బీ, సి వ్యాధులకు పరీక్షలతో పాటు వైద్యం చేస్తారు. హెపటైటిస్ బీ లేదా సీ అనుమానిత కేసులైనా సరే ఇక్కడ వైద్యం చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా నిర్ధారిత కేసుల వివరాలు ఎప్పటికప్పుడు ఎన్‌వీహెచ్‌సీపీ (నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రాం) పోర్టల్‌కు అనుసంధానం చేయాలి. ప్రతి ఆస్పత్రిలో ఒక నోడల్ అధికారిని నియమించాలని కేంద్రప్రభుత్వం సూచించింది. హెపటైటిస్ వైరస్ వ్యాధులపై దేశంలోనే ఎక్కువ మందికి స్క్రీనింగ్ చేసి ఏపీ రికార్డు సృష్టించింది. ప్రత్యేక వైద్యుడి నియామకం జిల్లా ఆస్పత్రులు, బోధనాస్పత్రుల్లో హెపటైటిస్ బాధితులకు వైద్యం అందించడానికి ప్రత్యేక డాక్టర్‌ను ఏర్పాటు చేస్తారు. జనరల్ మెడిసిన్ లేదా గ్యాస్ట్రో ఎంటరాలజీ లేదా హెపటాలజీ వైద్యుల్లో ఒకరిని నియమిస్తారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. గడిచిన ఒక్క ఏడాదిలోనే 5,334 మంది హెపటైటిస్ బాధితులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందగా.. 71 మంది మృతి చెందినట్లు నిర్ధారణ అయింది. -
ఎన్హెచ్ఎం నిధులు వస్తున్నాయ్..
సాక్షి, అమరావతి: జాతీయ ఆరోగ్య కార్యక్రమం(ఎన్హెచ్ఎం) నిధులను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలోనే ఖర్చు చేస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. 2019–20వ సంవత్సారానికి గాను రూ.1,683.68 కోట్లు విడుదలవ్వగా అందులో రూ.1,667.97 కోట్లు, 2020–21కి గాను రూ.1,832.72 కోట్లలో రూ.1,812.12 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని తెలిపింది. కేంద్రం నుంచి రావాల్సిన వాటా నిధులు సకాలంలోనే రాష్ట్రానికి వస్తున్నాయని.. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటా నిధులను సకాలంలోనే విడుదల చేస్తోందని వెల్లడించింది. 2021–22కి గాను ఎన్హెచ్ఎం కింద కేంద్రం రూ.1,237.96 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.825.30 కోట్లు కలిపి మొత్తం రూ.2,063.26 కోట్లు కేటాయించాయని పేర్కొంది. ఇప్పటివరకు కేంద్రం నుంచి రూ.618.99 కోట్లు రావాల్సి ఉండగా రూ.699.78 కోట్లు అందినట్టు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.412.52 కోట్లు మంజూరు చేయాల్సి ఉండగా రూ.466.52 కోట్లు ఇచ్చిందని తెలిపింది. కేంద్ర పథకాల నిర్వహణ కోసం రాష్ట్రాలు నోడల్ ఖాతాలు తెరవాలని ఈ ఏడాది సెప్టెంబర్ 29న కేంద్రం సూచించగా.. ఆ మరుసటి రోజే ఎన్హెచ్ఎం కోసం ప్రత్యేక నోడల్ ఖాతాను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని వివరించింది. ఆ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.40 కోట్లు జమ చేసిందని ప్రకటించింది. -
కంగారెత్తిస్తున్న కరోనా.. మళ్లీ 40 వేలు..
న్యూఢిల్లీ: ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరూ కోవిడ్ 19 టీకా తీసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకు 60 ఏళ్లు పైబడిన వారందరూ, తీవ్రమైన ఇతర ఆరోగ్య సమస్యలున్న 45 నుంచి 60 ఏళ్ల మధ్యవారు మాత్రమే ఈ టీకా తీసుకోవడానికి అర్హులుగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా, 45 ఏళ్లు పైబడిన వారందరూ టీకా తీసుకోవచ్చని, ఇందుకు వారంతా రిజిస్టర్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని మోదీ నేతృత్వంలోజరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో నిర్ణయించారని మంత్రి జవదేకర్ చెప్పారు. ‘45 ఏళ్లు దాటిన వారందరూ టీకా తీసుకోండి. మొదటి డోసు టీకా తీసుకున్న తరువాత రెండో డోసును, వైద్యుల సలహా మేరకు 4 నుంచి 8 వారాల మధ్యలో తీసుకోవచ్చు’ అని అన్నారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంపై స్పందిస్తూ.. రాష్ట్రాలతో కేంద్రం మాట్లాడుతోందన్నారు. పంజాబ్‌లో నమోదైన కొత్త కేసుల్లో దాదాపు 80% మందిలో యూకే వేరియంట్ వైరస్‌ను గుర్తించారన్నారు. అందువల్ల, అర్హులైన అందరూ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా టీకా తీసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు. అదే సమయంలో, మాస్క్ ధరించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం మొదలైన కోవిడ్ నిబంధనలను పాటించడం కొనసాగించాలన్నారు. భారత్‌లో ఇస్తున్న రెండు రకాల టీకాలు విజయవంతం కావడం గర్వకారణమని, ప్రధాని మోదీ కూడా కోవాక్జిన్ టీకా తీసుకున్నారని తెలిపారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమం(నేషనల్ హెల్త్ మిషన్–ఎన్హెచ్ఎం) అమలును మంగళవారం కేంద్ర కేబినెట్ సమీక్షించింది. ఆరోగ్య పరిరక్షణ కోసం చేపట్టిన పలు పథకాల అమలును కేబినెట్ సమీక్షించింది. మళ్లీ 40 వేలు... కరోనా కేసులు రెండింతలు కావడానికి పట్టే సమయం ఈ నెల 23 నాటికి 504.4 రోజుల నుంచి 202.3కు పడిపోయింది. గత 24 గంటల్లో 40,715 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,16,86,796కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 199 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,60,166కు చేరుకుందని తెలిపింది. దీంతో మొత్తం రికవరీ రేటు 95.67 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 3,45,377గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 2.96 శాతం ఉన్నాయి. మరణాల శాతం 1.37గా ఉంది. ఇప్పటివరకూ 23,54,13,233 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. మంగళవారం 9,67,459 పరీక్షలు జరిపినట్లు తెలిపింది. గత 24 గంటల్లో బయట పడిన కేసుల్లో 80.90 శాతం కేవలం ఆరు రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమయ్యాయి. వాటిలో మహారాష్ట్రలో 24,645 (60.53శాతం), పంజాబ్‌లో 2,299, గుజరాత్లో 1,640 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల్లో 75.15 శాతం కేసులు మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌లలోనే ఉన్నాయి. కొత్త వేరియంట్ కేసులు 795 దేశంలో కోవిడ్–19 విదేశీ వేరియంట్ కేసులు 795కు చేరుకున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. యూకే, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వేరియంట్ కేసులు ఈనెల 18వ తేదీన 400 మాత్రమే నమోదు కాగా, తాజాగా అవి 795కు పెరిగాయని పేర్కొంది. పంజాబ్‌లో బయటపడిన 401 కరోనా కేసుల్లో 81శాతం యూకే వేరియంట్‌కు సంబంధించినవేనని రాష్ట్ర సీఎం అమరీందర్ చెప్పారు. ఆర్టీ–పీసీఆర్ పరీక్షలను పెంచండి ♦కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలను కోరిన కేంద్రం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా ఉధృతి నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. ఆర్టీ–పీసీఆర్ పరీక్షల సంఖ్యను పెంచాలనీ, టెస్ట్–ట్రాక్–ట్రీట్ ప్రొటోకాల్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలనీ, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరింది. కేంద్ర హోం శాఖ మంగళవారం ఈ మేరకు తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. మహమ్మారి బెడద నుంచి విజయవంతంగా బయటపడిన ప్రాంతాల్లో ఈ మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ►కొత్తగా బయటపడిన పాజిటివ్ కేసుల బాధితులను ఐసోలేషన్‌లో ఉంచడం లేదా క్వారంటైన్ చేయడం సాధ్యమైనంత త్వరగా చేపట్టి, సరైన చికిత్స అందించాలి. ఆర్టీ–పీసీఆర్ టెస్టులు తక్కువగా ఉన్న చోట నిర్దేశించిన పరీక్షల్లో 70 శాతం లేదా అంతకుమించి వేగంగా చేపట్టాలి. ►కేంద్ర ఆరోగ్య శాఖ వెలువరించిన మార్గదర్శకాలను పాటిస్తూ జిల్లా అధికారులు పాజిటివ్ కేసులు, వారి కాంటాక్టులను బట్టి కంటైన్మెంట్ జోన్లను జాగ్రత్తగా గుర్తించాలి. ►స్థానిక యంత్రాంగం వాస్తవ పరిస్థితులను అంచనా వేసి కోవిడ్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అవసరాన్ని బట్టి జిల్లా, ఉప–జిల్లా, నగరం, వార్డు స్థాయిల్లో ఆంక్షలను అమలు చేయాలి. ►నిబంధనల అమలుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్థానిక జిల్లా, పోలీసు, మున్సిపల్ యంత్రాంగాలను జవాబుదారీగా చేయాలి. ►టీకా ప్రక్రియ ఆటంకాలు లేకుండా కొనసాగుతున్నప్పటికీ, కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో చాలా నెమ్మదిగా అమలు కావడం ఆందోళనకరమైన విషయం. ►ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాధి సంక్రమణను అరికట్టడం క్లిష్టమైన వ్యవహారం అయినందున అన్ని ప్రాధాన్య వయస్సుల వారికి వేగంగా వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకోవాలి. ►రాష్ట్రాలతోపాటు, అంతర్రాష్ట్ర ప్రజల ప్రయాణాలు, సరుకు రవాణా విషయంలో ఎటువంటి ఆంక్షలు లేవు. కంటెయిన్మెంట్ జోన్ల వెలుపల ప్యాసింజర్ ట్రైన్లు, మెట్రో ట్రైన్లు, విమాన ప్రయాణాలతోపాటు పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్సులు, వినోద పార్కులు, యోగా సెంటర్లు, జిమ్‌లు, ఎగ్జిబిషన్లు, సభలు, సమావేశాలను ప్రామాణిక నిర్వహణ విధానం(ఎస్వోపీ)అనుసరించి కొనసాగించవచ్చు. -
పల్లె క్లినిక్‌లు: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: పల్లెలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఊళ్లలో ప్రభుత్వ క్లినిక్‌లను ఏర్పాటు చేయాలని తలపెట్టింది. ఇటీవల జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) సమీక్ష సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. అందులో తెలంగాణ నుంచి పలువురు సీనియర్ వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ప్రస్తుతం ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాలనే దశల వారీగా క్లినిక్‌లుగా మారుస్తారు. గతంలో వాటిని వెల్నెస్ సెంటర్లుగా మార్చాలని, వాటిల్లో శిక్షణ పొందిన నర్సులను నియమించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ నిర్ణయంలో పలు మార్పులు చేశారు. ఎంబీబీఎస్ లేదా ఆయుర్వేద లేదా హోమియో లేదా ప్రత్యేక శిక్షణ పొందిన నర్సులను నియమించాలని నిర్ణయించినట్లు ఆ సమావేశంలో పాల్గొన్న అధికారులు వెల్లడించారు. దీనిపై కేంద్రం కసరత్తు ప్రారంభించినట్లు ఒక ఉన్నతాధికారి వెల్లడించారు. చదవండి: (తాగునీరు ఫ్రీ.. మే లేదా జూన్ నుంచి అమలు) రెండు, మూడు ఊళ్లకొకటి... ప్రస్తుతం పల్లెల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీ) వైద్యానికి కీలకంగా ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్, నర్సులు ఉండటంతో ప్రాథమిక వైద్యం అక్కడే అందుతుంది.అవి దాదాపు ఒక్కో మండలంలో ఒక్కోటి చొప్పున మాత్రమే ఉన్నాయి. అయితే ఒక మండలంలో 15–20 గ్రామాలుంటే వారంతా పీహెచ్‌సీకి వెళ్లాల్సి వస్తుంది. అలా 20–30 కిలోమీటర్లు వెళ్తేగానీ కొన్ని గ్రామాలకు వైద్యం అందే పరిస్థితి లేదు. అయితే రాష్ట్రంలో పీహెచ్‌సీల కింద 4,905 ఆరోగ్య ఉపకేంద్రాలున్నాయి. వీటిలో ఏఎన్ఎంలే ప్రస్తుతం బాస్‌లుగా ఉన్నారు. ఆయా ఉపకేంద్రాల్లో టీకాలు ఇవ్వడం, గర్భిణులు, పిల్లలకు మందులివ్వడం వంటివి మాత్రమే నిర్వహిస్తున్నారు. ఈ ఆరోగ్య ఉప కేంద్రాలను క్లినిక్‌లుగా లేదా వెల్నెస్ సెంటర్లుగా మార్పు చేసి వాటిల్లో వైద్య సేవలు ప్రారంభిస్తారు. తద్వారా ప్రతీ రెండు మూడు గ్రామాలకు ఒక క్లినిక్ లేదా ఒక పెద్ద గ్రామంలో ఒక క్లినిక్ ఉండేలా ప్రణాళిక రూపొందిస్తారు. ఆయా క్లినిక్‌లలో రక్త పరీక్ష చేయడం, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించడం, వాటికి తగు వైద్యం అందించడంపై ఫోకస్ పెడతారు. దీంతో ప్రైవేట్ ప్రాక్టీషనర్లపై ఆధారపడకుండా నాణ్యమైన వైద్యం రోగులకు అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వైద్య విద్య పూర్తయిన వారికి అవకాశం... ప్రతీ ఏటా వేలాది మంది వైద్యులు మెడికల్ కాలేజీల నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని బయటకు వస్తున్నారు. వారిలో కొందరు మెడికల్ పీజీలకు వెళ్తుండగా, కొందరు అత్యంత తక్కువగా రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వేతనాలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారు. ఏడాదికేడాదికి వీరి సంఖ్య పెరుగుతుంది. మరోవైపు ఆయుష్ వైద్యుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. వీరందరికీ అవకాశం కల్పించాలన్నా, ప్రజలకు మరింత చేరువకు వైద్య సేవలు తీసుకురావాలన్నా ఆరోగ్య ఉప కేంద్రాలను క్లినిక్‌లుగా మార్చడం సరైందని కేంద్రం నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఒకవేళ ఎక్కడైనా ఎంబీబీఎస్ వైద్యులు, ఆయుష్ డాక్టర్లు ముందుకు రాకపోతే అటువంటి చోట్ల ప్రత్యేక శిక్షణ పొందిన నర్సులను ఆయా క్లినిక్‌లలో నియమిస్తారు. నర్సులకు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ (ఎంఎల్‌హెచ్‌పీ) అనే హోదా ఇస్తారు. ఎంఎల్‌హెచ్‌పీలుగా నియమితులవ్వడానికి బీఎస్సీ నర్సింగ్ అర్హతగా నిర్ణయించారు. ఈ క్లినిక్‌లు పీహెచ్సీ పరిధిలో ఉంటాయి. ఇక్కడ నయం కాని జబ్బులను పీహెచ్‌సీకి పంపిస్తారు. డాక్టర్లను లేదా ప్రత్యేక శిక్షణ పొందిన నర్సులను కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించే అవకాశం ఉంది. పారితోషికాన్ని ఎన్హెచ్ఎం ద్వారా ఇస్తారు. మూడేళ్ల పాటు ఆయా క్లినిక్‌లలో పనిచేయాలన్న హామీపత్రం ఇవ్వాలన్న నియమం పెట్టే అవకాశం ఉంది. పైగా వీరు కొత్త క్లినిక్‌లున్న చోటే నివాసం ఉండాలన్న షరతూ విధిస్తారు. అప్పుడే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఇంకా వీటిపై పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు వస్తాయని చెబుతున్నారు. -
ఆరోగ్య పథకాల 'అమలులో ఏపీ టాప్'
సాక్షి, అమరావతి: జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలోని ఆరోగ్య పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ గణనీయమైన పురోభివృద్ధి సాధించింది. ఏడాదిన్నర కాలంలో కొన్ని పథకాల అమలులో మిగతా రాష్ట్రాల కంటే ముందంజలో ఉందని జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) పరిశీలనలో వెల్లడైంది. గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు చాలా పథకాల్లో నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ పడేవి. ఈ పరిస్థితుల్లో గుజరాత్‌ను రెండో స్థానానికి నెట్టి ఏపీ మొదటి స్థానానికి వచ్చిందని ఎన్హెచ్ఎం అధికార వర్గాలు తెలిపాయి. మిగతా కొన్ని పథకాల అమలులోనూ త్వరలోనే ముందంజ వేసే అవకాశం ఉందని రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. ఎన్సీడీలో మొదటి స్థానం ► నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) అంటే అసాంక్రమిక వ్యాధుల నియంత్రణకు జాతీయ ఆరోగ్యమిషన్ ఎక్కువ ప్రాధాన్యమిస్తోంది. ఇందులో మన రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వాటిని గుర్తించేందుకు ఐదు కోట్ల జనాభాకు సంబంధించి ఇంటింటి సర్వే చేయించారు. ► 104 వాహనాల ద్వారా ప్రతి ఊరికీ వెళ్లి మందులు ఉచితంగా ఇచ్చేందుకు చర్యలు మరింత మెరుగైనట్టు ఎన్హెచ్ఎం పరిశీలనలో వెల్లడైంది. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల (వీటినే ఇప్పుడు వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ అంటున్నాం) నిర్వహణలోనూ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. ► రాష్ట్రంలో 10 వేలకు పైగా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు ఉండగా, వీటిలో 8,604 సెంటర్లకు కొత్త భవనాలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే సగం కేంద్రాలకు మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్స్‌గా బీఎస్సీ నర్సింగ్ చదివిన వారిని నియమించారు. ► ఇందులో ప్రధానంగా 12 రకాల సేవలను అందించడంలో గణనీయమైన వృద్ధి సాధించారు. దీనివల్ల లక్షలాది మంది గ్రామీణ ప్రాంత ప్రజలకు పైస్థాయి ఆస్పత్రులకు వెళ్లాల్సిన భారం తప్పింది. ► ఆర్సీహెచ్ (రీప్రొడక్టివ్ చైల్డ్ హెల్త్) అంటే గర్భిణుల ఆరోగ్యం, ప్రసవం అయ్యాక చిన్నారులకు సంరక్షణ వంటి వాటిని ఎప్పటికప్పుడు కేంద్ర పరిధిలో పనిచేసే పోర్టల్‌కు అనుసంధానించే ప్రక్రియలో ఎక్కడో ఉన్న ఏపీ ఇప్పుడు మొదటి స్థానానికి వచ్చింది. ► మాతా శిశు మరణాల నియంత్రణ, కుటుంబ నియంత్రణల్లో కేరళ, తమిళనాడులు ముందంజలో ఉన్నాయి. -
రాష్ట్రంలో మూడు భారీ ఔషధ నిల్వ కేంద్రాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడు ప్రాంతీయ ఔషధ నిల్వ (రీజనల్ డ్రగ్ స్టోర్స్ - ఆర్డీఎస్) కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిల్లో వీటి నిర్మాణానికి జాతీయ ఆరోగ్యమిషన్ రూ.10 కోట్ల వంతున నిధులు ఇస్తోంది. దేశంలో ఎక్కడాలేని విధంగా భారీ విస్తీర్ణంలో.. 40 వేల చదరపు అడుగుల్లో మందులు నిల్వ చేయడానికి అవకాశం ఉండేలా వీటిని డిజైన్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన స్థలాల్లో ఏడాదిలోగా ఈ నిర్మాణాలను పూర్తిచేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. భారీగా నిల్వలకు అవకాశం ⇔ రాష్ట్రంలో 13 జిల్లాల్లో 13 సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ (సీడీఎస్) ఉన్నాయి. ⇔ దీనివల్ల మందుల నిల్వకు సరిపడా విస్తీర్ణం అందుబాటులో లేదు. ⇔ ఈ నేపథ్యంలో రాష్ట్రం పంపిన ప్రతిపాదనలతో మూడు ఆర్డీఎస్ల నిర్మాణానికి రూ.10 కోట్ల వంతున నిధులిచ్చేందుకు జాతీయ ఆరోగ్యమిషన్ అంగీకరించింది. ⇔ కొత్తగా నిర్మించే ఈ కేంద్రాల్లో క్వారంటైన్ సదుపాయంతో పాటు భారీగా మందులు నిల్వ చేసుకునే వీలుంటుంది. ⇔ మందుల్ని ఈ కేంద్రాల్లో నిల్వ చేసి అవసరాన్ని బట్టి జిల్లాలకు పంపిస్తారు. ⇔ ఒక్కో కేంద్రంలో కనీసం ఆరునెలలకు సరిపడా మందుల్ని నిల్వచేయవచ్చు. ⇔ మందుల నిల్వతో పాటు అత్యాధునిక టెక్నాలజీతో కూడిన కోల్డ్‌చైన్ (శీతలీకరణ) అవకాశం ఉంటుంది. ⇔ ఇంజక్షన్లు, వ్యాక్సిన్లు, ఖరీదైన మందుల నిల్వకు ఇబ్బందులుండవు. -
కుక్కకాటు వైద్యానికి ప్రత్యేక క్లినిక్‌లు
సాక్షి, అమరావతి: కుక్కకాటు బాధితులకు ప్రత్యేక వైద్యం అందించేందుకు ప్రభుత్వ కసరత్తు పూర్తయింది. రాష్ట్రంలో ఏటా నాలుగు లక్షల మంది కుక్కకాటుకు గురవుతున్నారు. ఎక్కడో ఒక చోటకు వెళ్లి యాంటీరేబిస్ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. దీంతో ప్రత్యేక క్లినిక్‌లను ఏర్పాటు చేస్తున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ సహకారంతో ఈ క్లినిక్‌లలో ప్రత్యేక డాక్టర్‌తో పాటు ఒక స్టాఫ్‌నర్సు ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు అన్ని జిల్లాల వైద్యాధికారులకు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీచేశారు. క్లినిక్‌లు ఎక్కడంటే? వైద్య విధాన పరిషత్ పరిధిలో: టెక్కలి, విజయనగరం, అనకాపల్లి, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, తెనాలి, మార్కాపురం, ఆత్మకూరు, మదనపల్లె, ప్రొద్దుటూరు, హిందూపురం, నంద్యాల. బోధనాసుపత్రుల్లో: విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలు క్లినిక్‌లలో ఎలాంటి సేవలు? ► ఇతర జంతువుల కాట్లకు వైద్యం. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లినిక్‌లు. ► యాంటీరేబిస్ వ్యాక్సిన్‌తో పాటు యాంటీ స్నేక్ వీనం (పాము కాటు) మందు అందుబాటులో ఉంటుంది. -
ఆరోగ్య శాఖకు జవసత్వాలు
సాక్షి, అమరావతి : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పుడు కొత్త సందడి నెలకొంది. గత ప్రభుత్వం ఒక్క పోస్టునూ భర్తీ చేయకపోవడంతో దారుణ పరిస్థితుల్లో చిక్కుకున్న ప్రభుత్వ ఆస్పత్రులు ప్రస్తుతం కొత్త రూపును సంతరించుకున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలను పూర్తి స్థాయిలో మార్చిన సంగతి తెలిసిందే. ఇంతకుముందెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో వైద్యులు, వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయడంతోపాటు అన్ని ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసింది. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాస్పత్రుల వరకు అన్నీ కొత్త జవసత్వాలు సంతరించుకున్నాయి. ఇన్నాళ్లూ స్పెషలిస్టు డాక్టర్లు లేక కునారిల్లిన బోధనాస్పత్రులు ఇప్పుడు ఒక్కసారిగా 582 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల చేరికతో కళకళలాడుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ఇప్పటికే 592 మంది వైద్యులు చేరారు. దీంతో ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇద్దరు డాక్టర్లతో పనిచేస్తున్నాయి. ఫలితంగా పేదలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. ఇదే అతిపెద్ద నియామక ప్రక్రియ - రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ చరిత్రలో ఇదే అతిపెద్ద నియామక ప్రక్రియ - ఒకేసారి 2,094 పోస్టుల భర్తీ గతంలో ఎప్పుడూ జరగలేదు. ఇప్పటికే విధుల్లో 1,368 మంది చేరిక. మిగిలిన పోస్టులకు నియామక ప్రక్రియ కొనసాగింపు - జిల్లా స్థాయిలో మెడికల్, పారామెడికల్ తదితరాలకు సంబంధించి 7,838 పోస్టులకు నియామక ప్రక్రియ పూర్తి. వీరిలో ఇప్పటివరకు విధుల్లో చేరినవారు 4,979 మంది. - నేషనల్ హెల్త్‌మిషన్ ద్వారా మరో 2,919 పోస్టులకు కొనసాగుతున్న నియామక ప్రక్రియ - రాష్ట్రంలో 30 శాతం వరకు మానవవనరులు పెరిగినట్టు అంచనా వైద్యుల నియామకాలు.. విభాగం మంజూరైన పోస్టులు ఇప్పటివరకు నియామకాలు వైద్య విద్యా శాఖ 737 582 వైద్య విధాన పరిషత్ 692 194 ప్రజారోగ్య శాఖ 665 592 జిల్లాల వారీగా.. వైద్య విద్యా శాఖ 3,680 1,866 వైద్య విధాన పరిషత్ 1,678 1,161 ప్రజారోగ్య శాఖ 2,480 1,952 నేషనల్ హెల్త్ మిషన్ 2,919 ప్రక్రియ కొనసాగుతోంది -
కొత్తగా మరో 2,842 నియామకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల పరంపర కొనసాగుతూనే ఉంది. గడిచిన ఐదేళ్లలో ఒక్కటంటే ఒక్కపోస్టుకూ నియామకం ఇవ్వలేదు. ఈ ఏడాది ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా భారీగా నియామకాలు చేసిన సర్కారు ఇప్పుడు కొత్తగా మరో 2,842 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో వివిధ పథకాల అమలుకు ఈ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పటికే వివిధ జిల్లాల్లో నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లాలోనే.. ► పోస్టుల వివరాలన్నీ జిల్లా ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఉంటాయి. ► దరఖాస్తులు అక్కడే ఇస్తారు. దరఖాస్తుతో పాటు, ధ్రువపత్రాలు జతచేసి గడువులోగా డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఇవ్వాలి. ► నియామకం జరిగే పోస్టుల్లో సుమారు 30 కేటగిరీలకు పైనే ఉన్నాయి. ఎక్కువగా మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్‌నర్సులు, ల్యాబ్టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్‌లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఇలా రకరకాల పోస్టులున్నాయి. ► 2,842 పోస్టులు కాకుండా మరో 40 రాష్ట్ర స్థాయి పోస్టులను కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయం నుంచి భర్తీ చేస్తారు. ► అర్హత, పోస్టుల వివరాలు వంటివన్నీ కుటుంబ సంక్షేమ శాఖ వెబ్సైట్లో పొందుపర్చారు. పారదర్శకంగా నియామకాలు ఈ ప్రభుత్వం వచ్చాక వేలాది నియామకాలు జరిపాం. ఒక్క చిన్న పొరపాటు కూడా లేకుండా పూర్తయింది. కొత్తగా నియామకాలు జరిగే వీటి విషయంలోనూ అంతే పారదర్శకంగా జరపాలని అధికారులను ఆదేశించాం. ప్రతిభ కలిగిన ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుంది. – ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి పథకాల అమలు మరింత పటిష్టంగా.. కొత్తగా నియామకాల వల్ల మానవ వనరుల బలం పెరుగుతుంది. దీనివల్ల పథకాల అమలు పటిష్టంగా జరుగుతుంది. ఈ నెలాఖరుకు కొత్తగా ఎంపికైన వారు విధుల్లో చేరతారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో మరింత మెరుగైన సేవలందేలా చేస్తాం. – కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమ శాఖ -
ఆరోగ్య సంరక్షణలో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి: ఆరోగ్యం–సంరక్షణ కేంద్రాల నిర్వహణ, వైద్య సేవల విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. వరుసగా మూడుసార్లు మొదటి ర్యాంకు కైవసం చేసుకుని హ్యాట్రిక్ సాధించింది. కేంద్ర పథకాలైన వీటి అమలులో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. జాతీయ ఆరోగ్య మిషన్ అమలు చేస్తున్న పథకాలతో పాటు వివిధ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ చాలా రాష్ట్రాల కంటే గణనీయమైన ప్రగతి సాధించింది. నెలనెలా ర్యాంకులు ► కేంద్ర ఆరోగ్య మిషన్ పథకాలను అమలు చేస్తున్న విధానాన్ని బట్టి ప్రతినెలా ర్యాంకులు ప్రకటిస్తారు. ఏపీ వరుసగా మూడుసార్లు మొదటి స్థానంలో నిలవగా.. గుజరాత్ రెండో స్థానం, కర్ణాటక మూడో స్థానంలో నిలిచాయి. ► గ్రామీణ ప్రాంతాల్లో వివిధ వర్గాల వారికి ఆరోగ్యం, సంరక్షణ (హెల్త్ అండ్ వెల్నెస్) సెంటర్ల ద్వారా ఏపీ ప్రభుత్వం విశేష సేవలు అందిస్తోంది. ► టీకాల అమలులోనూ ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే మొదటి ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే. ► కరోనా సమయంలో చాలా రాష్ట్రాలు టీకాల కార్యక్రమాన్ని 50 శాతం మాత్రమే అమలు చేయగా.. ఆంధ్రప్రదేశ్ 73 శాతం పైగా టీకాలు వేసింది. ► జీవనశైలి జబ్బులను గుర్తించడంతోపాటు ట్రామా కేర్ బాధితులకు సేవలందించడంలోనూ ఏపీ మెరుగైన ఫలితాలను సాధిస్తున్నట్టు జాతీయ ఆరోగ్యమిషన్ పరిశీలనలో వెల్లడైంది. ► మొదటి మూడు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలకు.. మిగతా స్థానాల్లో ఉన్న రాష్ట్రాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉన్నట్టు వెల్లడైంది. -
1,900 పోస్టులకు ఈనెల 30న నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: జాతీయ ఆరోగ్యమిషన్ పరిధిలో పనిచేసేందుకు గానూ వివిధ కేటగిరీల్లో నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వనుంది. డాక్టర్లు, పారామెడికల్, నర్సులు తదితర పోస్టులు భర్తీ చేయనున్నారు. అన్ని కేటగిరీల్లో కలిపి దాదాపు 1,900 పోస్టులున్నట్టు కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. వీటికి ఈనెల 30న నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. దరఖాస్తుకు చివరి తేదీని అక్టోబర్ 10గా నిర్ణయించారు. తుది జాబితాను వచ్చే నెల 17న విడుదల చేసి.. 19వ తేదీన నియామక పత్రాలు అందించనున్నారు. ఈ పోస్టులను ఆయా జిల్లాల్లో కలెక్టర్లే భర్తీ చేసుకునేలా వీలు కల్పించారు. (తీపి కబురు: త్వరలో డీఎస్సీ) -
‘డిజిటల్ హెల్త్’ మంచిదేగానీ...
రెండేళ్లక్రితం నీతిఆయోగ్ ప్రతిపాదించిన నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్(ఎన్డీహెచ్ఎం) సాకారమైంది. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఎర్రకోట బురుజులపైనుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ప్రకటించారు. తొలి దశలో కొన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు ప్రారంభమవుతుంది. ప్రధాని చెబుతున్న ప్రకారం ఈ ప్రాజెక్టులో దేశ పౌరులందరి ఆరోగ్య రికార్డులు నిక్షిప్తమైవుంటాయి. ఆధార్ సంఖ్య మాదిరే ప్రతి వ్యక్తి పేరిట ఒక నంబర్ ఇవ్వడంతో పాటు అందులో వారికున్న అనారోగ్యం వివరాలు, అందుకు ఉపయోగిస్తున్న ఔషధాలు, వారికి భిన్న సందర్భాల్లో చికిత్స చేసిన వైద్యులు, ఆసుపత్రుల పేర్లు, వైద్య పరీక్షల రికార్డులు, ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్న సందర్భాలు వగైరాలన్నీ పొందుపరుస్తారు. అంటే ప్రతి వైద్యుడు, ఆసుపత్రి, రోగ నిర్ధారణ కేంద్రాలు వగైరాలన్నీ ఎప్పటికప్పుడు రోగి సంబంధించిన వివరాలు అప్లోడ్ చేయాలి. అందులో తమ ఫీజుల వివరాలు కూడా వుండాలి. ఇది అనేకవిధాల అవసరమైన ప్రాజెక్టు అనడంలో సందేహం లేదు. పౌరులు ఒకచోటనుంచి మరో చోటకు వెళ్లినప్పుడు అనుకోకుండా అస్వస్థులైన పక్షంలో వారికి ఎటువంటి చికిత్స అందించాలన్న అంశంలో అక్కడి వైద్యులకు సంపూర్ణ అవగాహన ఉండదు. తన సమస్యేమిటో, ఇంతక్రితం ఎలాంటి చికిత్స తీసుకున్నారో, తనను పర్యవేక్షిస్తున్న వైద్యులు రాసిన ఔషధాలేమిటో చెప్పే పరిస్థితి రోగికి ఉండకపోవచ్చు. పర్యవసానంగా రోగిలో తాము గమనించిన లక్షణాలనుబట్టి అక్కడి వైద్యులు చికిత్స అందిస్తారు. అది కొన్నిసార్లు వికటించే ప్రమాదం కూడా వుంటుంది. కొన్నేళ్లక్రితం ప్రముఖ టాలీవుడ్ నటుడు శ్రీహరి ముంబైకి ఒక షూటింగ్ నిమిత్తం వెళ్లి అస్వస్థులైనప్పుడు ఇదే సమస్య ఎదురైంది. ఆయన అనారోగ్య సమస్యపట్ల సరైన అవగాహనలేకుండా వైద్యులు చేసిన చికిత్స ఆయన ప్రాణాలను బలిగొంది. పౌరుల దగ్గర ఆరోగ్య గుర్తింపుకార్డు వుంటే, అందులో వారి వివరాలు వైద్యులు క్షణాల్లో తెలుసుకుని మెరుగైన చికిత్స అందించడానికి వీలవుతుంది. పౌరులకు కలిగే లాభాలిలావుంటే ప్రభుత్వాలకు ఉపయోగ పడే అంశాలు మరిన్ని వున్నాయి. స్వాతంత్య్రం వచ్చి 73 ఏళ్లవుతున్నా మన దేశంలో ఆరోగ్య సదుపాయాలు అత్యంత నాసిరకంగా వున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి విరుచుకుపడ్డాక ఈ సంగతి అందరికీ మరింతగా తేటతెల్లమైంది. అనుకోకుండా జబ్బులుబారిన పడిన పౌరులు ప్రైవేటు ఆసుపత్రుల దయా దాక్షిణ్యాలపై ఆధారపడే దారుణమైన పరిస్థితులు ఇక్కడున్నాయి. ఆరోగ్య రంగంపై ప్రభుత్వాలు మన జీడీపీలో కేవలం ఒక్క శాతం మాత్రమే ఖర్చుచేస్తున్నాయి. 2017లో విడుదల చేసిన ఆరోగ్య విధానం ప్రకారం జీడీపీలో 2.5 శాతాన్ని ఆరోగ్యరంగంపై వెచ్చించాలి. కానీ అది అమలుకావడం లేదు. అలా జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్లలో 8 శాతాన్ని ఆరోగ్య రంగంపై వ్యయం చేయాలి. ఆ రకంగా మొత్తం వ్యయంలో రాష్ట్రాల వాటా 60 శాతం అవుతుంది. మిగిలిన 40శాతం కేంద్రం భరించాల్సివస్తుంది. దేశంలో చాలాచోట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేవు. ఉన్నచోట వైద్యులు, ఇతర సిబ్బంది చాలినంతగా లేరు. ప్రతి పదివేల జనాభాకు కనీసం పదిమంది వైద్యులుండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశిస్తుండగా మన దేశంలో ఆ సంఖ్య 7.7. కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటెలిజెన్స్ నిరుడు విడుదల చేసిన నివేదిక ప్రకారం మన పౌరులపై ప్రభుత్వాల తలసరి వ్యయం రూ. 1,657 మాత్రమే. దీన్ని కనీసం రెట్టిం పైనా చేస్తే తప్ప మన పౌరులకు ఓమాత్రంగానైనా ఆరోగ్య సదుపాయాలు అసాధ్యం. భూతాపం పెరుగుతుండటంతో ప్రకృతి వైపరీత్యాలు వున్నకొద్దీ పెరుగుతాయని, అందువల్ల ప్రభుత్వాలు పౌరులపై తలసరి రూ. 4,000 వ్యయం చేయడానికి సిద్ధపడితే తప్ప ముప్పును ఎదుర్కొనడం కష్టమవుతుందని ఆరోగ్య నిపుణుల అంచనా. ఎన్డీహెచ్ఎం వల్ల పౌరుల్లో అత్యధికులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో, దేనికెంతో వ్యయం చేయాలో ప్రభుత్వాలకు తెలుస్తుంది. ఏ ప్రాంతంలో ఏ సమస్యలున్నాయో, అక్కడ తీసుకోవాల్సిన చర్యలేమిటో ప్రభుత్వాలకు అవగాహన కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజారోగ్య రంగాన్ని పటిష్టం చేయడానికి ప్రంశంసనీయమైన పథకాలు రూపొందిస్తున్నది. అందుకోసం రూ. 16,200 కోట్లు వ్యయం చేయడానికి సిద్ధపడుతోంది. ఇప్పుడున్న 11 వైద్య కళాశాలలకుతోడు మరో 15 వైద్య కళా శాలలు, నర్సింగ్ కళాశాలలు... ప్రస్తుతమున్న 1,138 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అదనంగా మరో 149 ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 989 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దబోతోంది. అలాగే ఏరియా ఆసుపత్రులకూ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు రూ. 1,236 కోట్లు ఖర్చు చేయనుంది. కేంద్రం తాజాగా ప్రారంభించిన ఎన్డీహెచ్ఎం ఫోన్లో ఇమిడే యాప్‌లో వుంటుందని, ఇందులో చేరడం తప్పనిసరి కాదంటున్నారు. అయితే చేరేవారికి సమకూరే సదుపాయాల వల్ల మున్ముందు ఎవరికి వారు స్వచ్ఛందంగా చేరతారన్నది ప్రభుత్వ ఉద్దేశం. అన్ని డిజిటల్ లావా దేవీలకూ వుండే ప్రమాదం ఎన్డీహెచ్ఎంకు కూడా వుంటుంది. లక్షల కోట్ల రూపాయల ఫార్మా రంగం అధిక శాతం పౌరులు ఎటువంటి జబ్బులబారిన పడుతున్నారో తెలుసుకోవడానికి ఈ డేటాను తస్కరించే ముప్పు ఎప్పుడూ పొంచివుంటుంది. డేటా రక్షణకూ, పౌరుల వ్యక్తిగత గోప్యత పరిరక్షణకూ పకడ్బందీ చర్యలు తీసుకుంటామని కేంద్రం చెబుతోంది. గతంలో ఆధార్ డేటా చౌర్యం జరిగిన ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నివిధాలా పటిష్టమైన చర్యలు తీసుకోవడం ముఖ్యం. డిజిటల్ వేదిక రూపకల్పన సరే... అందుకు అనువుగా ప్రజారోగ్య వ్యవస్థను కూడా సమూల ప్రక్షాళన చేయాలి. అప్పుడు మాత్రమే పౌరులు నిండు ఆరోగ్యంతో వుంటారు. -
గట్టిగా బుద్ధి చెప్పాం
న్యూఢిల్లీ: దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోట వేదికగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా, పాకిస్తాన్లకు గట్టి హెచ్చరికలే పంపారు. ఎల్ఓసీ (నియంత్రణ రేఖ) నుంచి ఎల్ఏసీ (వాస్తవాధీన రేఖ) వరకు దేశ సార్వభౌమత్వాన్ని సవాల్ చేసిన వారికి సాయుధ బలగాలు గట్టిగా బుద్ధి చెప్పాయన్నారు. లద్దాఖ్‌లో మన సైనికుల శౌర్య పరాక్రమాలు యావత్ ప్రపంచం చూసిందన్నారు. శనివారం ఢిల్లీలో ఎర్రకోటలో జరిగిన దేశ 74వ స్వాతంత్ర దిన వేడుకలకు సంప్రదాయబద్ధంగా కాషాయం, తెలుపు రంగుల్లో ఉన్న కుర్తా, పైజామా తలపాగా ధరించి వచ్చిన ప్రధాని గంటా 26 నిమిషాల సేపు ప్రసంగించారు. కేంద్ర పథకాలైన ఆత్మ నిర్భర్ భారత్, వోకల్ ఫర్ లోకల్, మేకిన్ ఇండియా టు మేక్ ఫర్ వరల్డ్, నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్లు, దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆర్థిక రంగ పురోగతికి చేపట్టిన సంస్కరణల గురించి వివరించారు. కరోనా వ్యాక్సిన్ నుంచి మహిళా సాధికారత వరకు ప్రతీ అంశాన్ని స్పృశిస్తూ ఆయన ప్రసంగం సాగింది. తూర్పు లద్దాఖ్‌లో చైనాతో ఇటీవల చెలరేగిన హింసాత్మక ఘర్షణల్లో 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో దేశ కోసం ప్రాణాలర్పించిన వారికి ఎర్రకోట నుంచి సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. సరిహద్దుల్లో ఉగ్రవాదమైనా, విస్తరణ వాదమైనా భారత్ వాటిపై యుద్ధం చేస్తుందని స్పష్టం చేశారు. అయితే పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలకే తాము ప్రాధాన్యం ఇస్తామన్నారు. గత ఏడాది విదేశీ పెట్టుబడుల్లో రికార్డు స్థాయిలో 18 శాతం వృద్ధి సాధించామని ప్రపంచ దేశాలు భారత్‌పై విశ్వాసం ఉంచాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. అయోధ్యలో రామ మందిర భూమి పూజను ప్రస్తావిస్తూ శతాబ్దాల సమస్యను శాంతియుతంగా పరిష్కరించమన్నారు. జమ్మూకశ్మీర్‌కు త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కరోనా సంక్షోభ పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్న ఫ్రంట్‌లైన్ వారియర్లను ప్రధాని మోదీ అభినందించారు. మోదీ కొత్త మంత్ర మేక్ ఫర్ వరల్డ్ మోదీ తన ప్రసంగంలో ఆత్మనిర్భర్ భారత్‌పై అత్యధికంగా దృష్టి పెట్టారు. కరోనా వంటి సంక్షోభ పరిస్థితులు కూడా దేశ సంకల్ప బలాన్ని అడ్డుకోలేవని ధీమాగా చెప్పారు. ఇంక ఎక్కువ కాలం దిగుమతులు మీద ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించాలన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అంటే దిగుమతులు తగ్గించుకోవడమే కాదు, మన సామర్థ్యం, సృజనాత్మకత, నైపుణ్యం ప్రపంచం గుర్తించేలా చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఇక మేకిన్ ఇండియా కాదు, మేక్ ఫర్ వరల్డ్ దిశగా భారత్ ప్రయాణం సాగాలని అన్నారు. ప్రపంచం ఆదరించేలా భారత్‌లో నాణ్యమైన వస్తువుల్ని ఉత్పత్తి చేయాలని మోదీ అన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఎన్–95 మాస్కులు, పీపీఈ కిట్లు, వెంటిలేటర్ల తయారీలో నాలుగు నెలల్లోనే భారత్ స్వయం సమృద్ధి సాధించడమే కాదు, ఎగుమతులు కూడా చేస్తోందని అన్నారు. దీంతో యువతకి ఉపాధి అవకాశాలను కల్పించామని ప్రధాని చెప్పారు. మౌలిక సదుపాయాల రంగంలో విప్లవం సృష్టించేలా రూ. 110 లక్షల కోట్లతో వివిధ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఏడు వేల నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్ఐపీ) ప్రాజెక్టుల్ని ప్రారంభించామని అన్నారు. కోవిడ్ విసిరిన ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌లో వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామన్న ప్రధాని రైతులే పారిశ్రామికవేత్తలుగా మారడానికి వీలుగా లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక నిధిని ప్రారంభించామని చెప్పారు. దీనివల్ల గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. వెయ్యిరోజుల్లో అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ రాబోయే మూడేళ్ల కాలంలో దేశంలో ఆరు లక్షలకు పైగా గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించే ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ ప్రాజెక్టుని ప్రకటించారు. గత అయిదేళ్లలో 1.5 లక్షల గ్రామ పంచాయితీలకు ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించామని మరో మూడేళ్లలో ప్రతీ గ్రామానికి నెట్ సదుపాయం ఉంటుందని అన్నారు. ఆన్లైన్ కార్యకలాపాలు అధికమైన నేపథ్యంలో సైబర్ భద్రతపై త్వరలోనే కొత్త విధానాన్ని తీసుకొస్తామన్నారు. తయారీలో మూడు కరోనా వ్యాక్సిన్లు కరోనా వ్యాక్సిన్ త్వరలోనే ప్రజలందరికీ అందుబాటులోకి వస్తుందని ప్రధాని మోదీ వెల్లడించారు. భారత్‌లో మూడు వ్యాక్సిన్ల ప్రయోగాలు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. వ్యాక్సిన్ విజయవంతంగా పనిచేస్తోందని శాస్త్రవేత్తలు ప్రకటించిన వెంటనే భారీ స్థాయిలో ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పారు. దేశంలో ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్ అందేలా ఇప్పటికే మౌలిక సదుపాయాల ఏర్పాటు పూర్తి చేశామన్నారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ తయారీలో అహరహం శ్రమిస్తున్న శాస్తవేత్తల్ని ప్రధాని రుషులు, మునులతో పోల్చారు. కరోనాపై విజయం సాధించడానికి వారు ల్యాబొరేటరీల్లో తీవ్రంగా శ్రమిస్తున్నారని అన్నారు. సాధ్యమైనంత తక్కువ సమయంలో వ్యాక్సిన్ దేశ ప్రజలందరికీ చేరేలా చూస్తామన్నారు. భారత్ బయోటెక్, జైడస్ క్యాడిలా రూపొందించిన వ్యాక్సిన్లు ఒకటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రస్తుతం నడుస్తున్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు అనుమతులు లభించాయి. రక్షణ రంగంలో స్వావలంబన దిశగా రక్షణ రంగంలో స్వావలంబన దిశగా గట్టి చర్యలు చేపడుతున్నట్లు మోదీ తెలిపారు. వందకు పైగా ఆయుధాలు, రక్షణ పరికరాల దిగుమతిని నిషేధించామన్నారు. క్షిపణుల నుంచి తేలికపాటి సైనిక హెలికాప్టర్లు, రైఫిల్స్, యుద్ధ రవాణా విమానాలను భారత్‌లో తయారుచేస్తామన్నారు. తేలికపాటి యుద్ధవిమానం తేజస్ ఆధునీకరణ జరుగుతోందన్నారు. దేశ రక్షణలో సరిహద్దు, తీరప్రాంత మౌలికసదుపాయాలు కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. హిమాలయ పర్వతశ్రేణుల్లో, హిందూ మహాసముద్రంలోని దీవుల మధ్య, లడఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు రహదారుల నిర్మాణం జరిగిందని, రవాణా సదుపాయాలకు ప్రాధాన్య మిచ్చామన్నారు. జల్ జీవన్ మిషన్ కింద ఏడాదిలో 2 కోట్ల కుటుంబాలకు నల్లా కనెక్షన్లు ఇచ్చామని, ముఖ్యంగా గిరిజన, మారుమూల ప్రాంతాల్లో నివాసం ఉండే వారికి సురక్షిత మంచినీరు అందించామని తెలిపారు. రూపాయికే శానిటరీ ప్యాడ్ స్వాతంత్య్రదిన ప్రసంగంలో ఈ సారి ప్రధాని ఏనాడూ ఎవరూ మాట్లాడని మహిళల రుతు స్రావం అంశాన్ని లేవనెత్తారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన మహిళా సాధికారత గురించి వివరిస్తూ నిరుపేద మహిళలకు 6 వేల జన ఔషధి కేంద్రాల ద్వారా రూపాయికే శానిటరీ ప్యాడ్లు అందిస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది మహిళలకు ఈ ప్యాడ్లు అందుతున్నాయని తెలిపారు. ప్రస్తుతమున్న 18 ఏళ్లుగా ఉన్న అమ్మాయిల పెళ్లి వయసును మార్చడానికి సన్నాహాలు చేస్తున్నామని, దీనికోసం కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో మహిళా అధికారుల్ని కీలక పదవుల్లో తీసుకున్నామని, ట్రిపుల్ తలాక్‌ని రద్దు చేశామన్నారు. ప్రధాని శానిటరీ ప్యాడ్ల ప్రస్తావనపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. 40 కోట్ల ‘జన్‌ధన్ బ్యాంకు అకౌంట’్లలో 22 కోట్ల అకౌంట్లు మహిళలవేనని, ఈ మహమ్మారి కాలంలో వారి ఖాతాల్లో రూ.30 వేలకోట్ల నిధులను వేసినట్లు ప్రధాని పేర్కొన్నారు. ‘ముద్ర’రుణాల్లో 70 శాతం చెల్లెళ్ళు, తల్లులకే ఇచ్చామని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అత్యధిక రిజిస్ట్రేషన్లు మహిళల పేరిటే ఉన్నాయన్నారు. అందరికీ హెల్త్ కార్డులు ఎర్రకోట సాక్షిగా ప్రధాని మోదీ ఆరోగ్య రంగాన్ని డిజిటలైజ్ చేసే పథకానికి శ్రీకారం చుట్టారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కింద ప్రతీ పౌరుడికి హెల్త్ ఐడీ నంబర్ ఇస్తారు. ఈ హెల్త్ ఐడీ డిజిటల్ రూపంలోనే ఉంటుంది. అందులో వారి ఆరోగ్య సమాచారం, వాడే మందులు, మెడికల్ రిపోర్ట్స్ నిక్షిప్తం చేస్తారు. ఈ ఐడీలన్నింటినీ దేశ వ్యాప్తంగానున్న ఆరోగ్య కేంద్రాలు, రిజిస్టర్డ్ వైద్యులతో అనుసంధానం చేస్తారు. దీనివల్ల దేశంలో ఎవరైనా అనారోగ్యంతో వైద్యుల్ని సంప్రదిస్తే ఒక్క క్లిక్‌తో వారి సమస్యలన్నీ తెలుసుకోవచ్చు. ఈ్త ఐడీలతో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని మోదీ చెప్పారు. ఎన్సీసీ కేడెట్లకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ ఎర్రకోట వద్ద 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల దృశ్యం విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోతున్న రాష్ట్రపతి నివాస ప్రాంతం రైసినా హిల్స్ -
కరోనా: ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం
భువనేశ్వర్: కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తున్న వేళ ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసుల నిర్ధారణ కోసం 45 రోజులు పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటా సర్వే చేపట్టాలని నిర్ణయించింది. జూన్ 16 వతేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు ఇంటింటా సర్వే చేస్తూ.. శాంపిల్స్‌ను సేకరించనున్నట్లు జాతీయ ఆరోగ్య మిషన్ డైరెక్టర్ శాలినీ పండిట్ వెల్లడించారు. మంగళవారం రోజున ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ కేసుల వివరాలను సేకరించనుంది. ఆశా, ఏఎన్ఎం కార్యకర్తల ద్వారా ఇంటింటా సర్వేచేపట్టనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో, మురికివాడల్లో కరోనా లక్షణాలున్న వ్యక్తులను గుర్తించడం వల్ల వీలైనంత వేగంగా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తోంది. కాగా ఇప్పటిదాకా.. ప్రాంతీయ వైద్యపరిశోధనా కేంద్రం (ఆర్ఎంఆర్సీ) సహా రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో 17 ప్రయోగశాలల్లో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. జూన్ 15 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్య 2 లక్షలు దాటినట్లు శాలినీ పండిట్ పేర్కొన్నారు. చదవండి: కరోనా: మగవాళ్లలోనే ఎందుకు మరణాలు ఎక్కువ? -
30 ఏళ్లు దాటితే.. మధుమేహ పరీక్ష
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మధుమేహం చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన మధుమేహ బాధితులు ఇప్పుడు ప్రతి పల్లెలోనూ దర్శనమిస్తున్నారు. వ్యాధితో లక్షలాది కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఇటీవల 30 ఏళ్ల వారు కూడా మధుమేహం బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో దీని నియంత్రణకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకునేందుకు సంకల్పించింది. ప్రాథమిక దశలోనే వైద్య పరీక్షలు నిర్వహించి వారిని జబ్బు బారిన పడకుండా చూసేందుకు కార్యాచరణ చేపట్టింది. ఇందుకయ్యే నిధులిచ్చేందుకు జాతీయ ఆరోగ్య మిషన్ గతంలో సిద్ధమైనా అప్పటి ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదు. ఇకపై ఈ పరిస్థితులు మారాలని.. ప్రతి సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)లోనూ ఒక ఎన్సీడీ (నాన్ కమ్యునికబుల్ డిసీజ్) క్లినిక్ నిర్వహించాలని కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది. స్క్రీనింగ్ తప్పనిసరి ► రాష్ట్ర వ్యాప్తంగా 30 ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కరికీ మధుమేహం, రక్తపోటు పరీక్షలు చేసేందుకు సీహెచ్సీలలో మౌలిక వసతుల కల్పిస్తారు. ► ఇందుకోసం 195 సీహెచ్‌సీల్లో ఒక్కొక్క ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు చేస్తారు. వీటిలో ప్రతిరోజూ మధ్యాహ్నం 2నుంచి 4 గంటల మధ్య ఇలాంటి వారి కోసం ఓపీ సేవలు నిర్వహిస్తారు. ► దీనికోసం ప్రత్యేక మెడికల్ ఆఫీసర్‌ను నియామకం. ప్రతి ఎన్సీడీ క్లినిక్‌లో ఒక స్టాఫ్ నర్సును కేటాయిస్తారు. ► పేషెంట్ పూర్తి వివరాలు (డేటా) సేకరిస్తారు. ఇదివరకే మధుమేహంతో బాధపడుతున్న వారిని మరింత మెరుగైన వైద్యం కోసం పెద్దాసుపత్రులకు రెఫర్ చేస్తారు. వీరికి మూత్ర పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్, ఫండోస్కొపీ వంటివి చేస్తారు. పక్కాగా డేటా మేనేజ్మెంట్ ► రాష్ట్రంలో అసాంక్రమిక వ్యాధుల చిట్టా పక్కాగా ఉండాలి. దీనికోసం ప్రత్యేక పేషెంట్ రిజిస్ట్రీ నిర్వహణకు చర్యలు చేపడతారు. ► పాత రోగులు, కొత్తగా వచ్చే వారికోసం రెండు రకాల రిజిస్ట్రీలు నిర్వహిస్తారు. ఏ రోజుకారోజు ఈ డేటాను యాప్ ద్వారా పోర్టల్‌లో నమోదు చేస్తారు. ► ప్రతినెలా జిల్లా ఎన్సీడీ సెల్ ఈ నివేదిక సమర్పిస్తుంది. త్వరలోనే సీహెచ్సీలలో ఎన్సీడీ క్లినిక్‌లను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. క్యాన్సర్ లక్షణాలపైనా దృష్టి ► మధుమేహం ఒక్కటే కాకుండా క్యాన్సర్ లక్షణాలపైనా దృష్టి సారిస్తారు. ప్రధానంగా మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించేందుకు పరీక్షలు చేస్తారు. ► ఈ పరీక్షలను మహిళా మెడికల్ ఆఫీసర్ నిర్వహిస్తారు. క్యాన్సర్ లక్షణాలుంటే బోధనాస్పత్రులకు లేదా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రెఫర్ చేస్తారు. ► టీబీ లక్షణాలున్నాయని అనుమానం ఉంటే ట్రూనాట్ లేదా సీబీనాట్ మెషిన్ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తారు. వ్యాధి ఉందని తేలితే చికిత్స నిమిత్తం బోధనాస్పత్రులకు పంపిస్తారు. -
కరోనా బాధితుల్లో మగవారే ఎక్కువ
సాక్షి, హైదరాబాద్: కరోనాకు ప్రభావితం అవుతున్న వారిలో అధికంగా పురుషులే ఉంటున్నారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 71 శాతం మగవారే ఉన్నట్లు అంతర్జాతీయ కరోనా అప్డేట్స్ను అందించే ‘వరల్డో మీటర్’అనే వెబ్సైట్ ఇటీవల నివేదికలో వెల్లడించింది. కరోనాతో మహిళలకు రిస్క్ తక్కువగా ఉన్నట్లు తెలిపింది. పొగతాగే అలవాటుండటం, కాలుష్యానికి అధికంగా ప్రభావితం కావడం తదితర కారణాలతో మగవారిలో శ్వాసకోశ, ఊపిరితిత్తుల సమస్యలు ఏర్పడటం వల్ల కరోనా మరణాల సంఖ్య అధికంగా ఉన్నట్లు తెలిపింది. ఈ వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తుందని తెలిపింది. చైనా నేషనల్ హెల్త్ కమిషన్ (ఎన్‌హెచ్‌సీ) అంచనాల ప్రకారం, మరణించిన వారిలో 80 శాతం మంది 60 ఏళ్లు పైబడిన వారు. వారిలో 75 శాతం మందికి గుండె సంబంధిత సమస్యలు, డయాబెటీస్ వంటివి ఉన్నాయని తేలింది. అలాగే ప్రపంచంలో ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఎక్కువ మంది కరోనాకు గురయ్యేది పురుషులేనని నివేదిక వెల్లడించింది. అంటే 71 శాతం మంది ఈ వైరస్‌కు మగవారు ప్రభావితం అవుతున్నారని తెలిపింది. అయితే కరోనా వైరస్ అన్ని వయస్సుల వారిని ప్రభావితం చేస్తుంది. ప్రధానంగా వృద్ధులు, ఉబ్బసం, డయాబెటీస్, గుండె సమస్యలు ఉన్న వారికి అధికంగా సోకుతుందని నివేదిక తెలిపింది. కాలానుగుణంగా ఫ్లూ, వైరస్ల వల్ల ప్రతీ ఏడాది ప్రపంచంలో 6.50 లక్షల మంది వరకు చనిపోతున్నారని తెలిపింది. 70 ఏళ్లకు పైబడిన వారిలోనే మరణాలు అధికం... కరోనా వైరస్‌కు చనిపోతున్నవారిలో అధికంగా 70 ఏళ్లకు పైబడినవారే ఉన్నారని నివేదిక తెలిపింది. చైనాతోపాటు ప్రపంచంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయినవారి లెక్కలను విశ్లేషిస్తే, 70 ఏళ్లకు పైబడినవారు 29.9 శాతం ఉన్నారు. పిల్లల్లో చాలా తక్కువ కరోనా కేసులు కనిపిస్తున్నాయి. లింగ నిష్పత్తిని లెక్క వేస్తే చైనాలో ధూమపానం మగవారిలో ఎక్కువగా ఉందని నివేదిక తెలిపింది. ధూమపానం శ్వాసకోశ సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి కరోనా మరణాల రేటు పురుషుల్లో అధికంగా ఉందని నివేదిక తెలిపింది. కేసుల సంఖ్యను, మరణాల సంఖ్యను లెక్కలోకి తీసుకుంటే... పురుషుల్లో మరణ రేటు 4.7 శాతం, మహిళల్లో 2.8 శాతంగా మరణ రేటు ఉందని తెలిపింది. గుండె వ్యాధులున్న వారిపైనే ప్రభావం కరోనా బారినపడేవారు అధికంగా ఇతరత్రా అనారోగ్య సమస్యలున్నవారే ఉన్నారని నివేదిక తెలిపింది. గుండె వ్యాధులున్నవారు అధికంగా చనిపోయారు. ఇతరుల వివరాలపై స్పష్టత లేదు. పొగతాగే వారిపై తీవ్ర ప్రభావం పొగతాగే వారికి కరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉంది. కరోనా ఊపిరితిత్తులకు సంబంధించిన వైరస్. పొగతాగే వారికి ఊపిరితిత్తుల సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వైరస్ ప్రధానంగా పొగతాగే అలవాటున్నవారిపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. కాబట్టి పొగతాగడాన్ని నిలిపివేయాలి. – నాగ శిరీష, యాంటీ టొబాకో యాక్టివిస్ట్, హైదరాబాద్ -
5,000 ఆరోగ్య ఉపకేంద్రాలకు కొత్త భవనాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో భాగంగా ఆరోగ్య ఉపకేంద్రాలకు(సబ్ సెంటర్లు) కొత్త భవనాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం 5,000 ఉపకేంద్రాలకు కొత్త భవనాలు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో 7,458 ఆరోగ్య ఉపకేంద్రాలున్నాయి. ఇందులో 90 శాతం కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల సొంత భవనాలు ఉన్నప్పటికీ పదేళ్లుగా సరైన నిర్వహణ లేక శిథిలావస్థకు చేరాయి. ఈ నేపథ్యంలో 5,000 సబ్‌సెంటర్లకు కొత్త భవనాలు నిర్మించాలని, అందులో ఏఎన్ఎంలు, మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్లను నియమించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఒక్కో భవనాన్ని రూ.23 లక్షల వ్యయంతో నిర్మించనున్నారు. కొత్త భవనాల నిర్మాణానికి రూ.1,150 కోట్ల వ్యయం కానుంది. ఒక్కో సబ్‌సెంటర్‌ను 5 సెంట్ల నుంచి 10 సెంట్లలో నిర్మిస్తారు. ప్రతి జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని, మొత్తం 13 ప్యాకేజీలుగా విభజించి భవనాల నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. ఇప్పటికే 70 శాతం కేంద్రాలకు స్థలాల సేకరణను పూర్తిచేశారు. కొత్తగా చేపట్టబోయే సబ్‌సెంటర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జాతీయ ఆరోగ్య మిషన్, ప్రపంచ బ్యాంకు నిధులు సమకూర్చనున్నాయి. వీటి నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులను జారీ చేయనుంది. ఆరోగ్య ఉపకేంద్రంలో అందించే సేవలు - ఇక్కడ 12 రకాల ఆరోగ్య సేవలు అందిస్తారు. - సబ్‌సెంటర్ పరిధిలోని గ్రామాల్లోని గర్భిణులను పరీక్షల కోసం ఆస్పత్రులకు తీసుకొస్తారు. - ఆశా వర్కర్ల సాయంతో గర్భిణులకు క్రమం తప్పకుండా వైద్యసేవలు అందిస్తారు. - పోషకాహార లోపంతో బాధపడుతున్న గర్భిణులకు డాక్టర్ల సూచనల మేరకు ఐరన్ ఫోలిక్ మాత్రలు, విటమిన్ మాత్రలు అందజేస్తారు. - శిశువులు, బాలలకు వ్యాధి నిరోధక టీకాలు వేస్తారు. - క్షయ, కుష్టు వ్యాధిగ్రస్థులకు డాక్టర్ల సూచనల మేరకు మందులు ఇస్తారు. - గ్రామాల్లో జనన, మరణాలను నమోదు చేస్తారు. - పల్స్‌పోలియో వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. - సబ్‌సెంటర్ పరిధిలోని ప్రభుత్వ స్కూళ్లలో రక్తహీనతతో బాధపడుతున్న విద్యార్థులకు అవసరమైన మాత్రలు పంపిణీ చేస్తారు. -
బీపీ, షుగర్ రోగులకు ఐడీ నంబర్
సాక్షి, హైదరాబాద్: బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు యూనిక్ ఐడీ నంబర్ కేటాయించాలని జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) నిర్ణయించింది. ప్రతి వ్యక్తికి ప్రత్యేక నంబర్‌తో కూడిన బుక్ అందజేస్తారు. ఈ బుక్‌లో యూనిక్ ఐడీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) కోడ్, జిల్లా, గ్రామం కోడ్స్ ఉంటాయి. ఇప్పటికే బుక్స్ సిద్ధం కాగా, త్వరలోనే పంపిణీ చేయనున్నారు. యూనిక్ ఐడీ నంబర్ల వినియోగంపై ప్రస్తుతం ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో రోగికి ఒక్కో బుక్ ఇచ్చి, అందులోని యూనిక్ ఐడీ నంబర్‌తో రోగుల వివరాలను అనుసంధానించి ఆన్లైన్లో నమోదు చేస్తారు. వారికి అందిస్తున్న వైద్యం, ఉచితంగా పంపిణీ చేస్తున్న మందులు, ఇతర విషయాలు బుక్‌లోనూ, ఆన్లైన్లో నమో దుచేస్తారు. దీంతో వ్యాధిగ్రస్తులు జాగ్రత్తలు తీసుకోవడానికి వీలుంటుంది. ఒకవేళ ఏదైనా చికిత్స కోసం వెళితే ఈ యూనిక్ ఐడీ నంబర్ ఆధారంగా డాక్టర్లు వైద్యం చేసే అవకాశముంది. 5.14 లక్షల మందికి నంబర్లు.. రాష్ట్రంలో సిద్దిపేట, జనగామ, కరీంనగర్, మహబూబాబాద్, సిరిసిల్ల, భూపాలపల్లి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, మెదక్, సంగారెడ్డి, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో నాన్–కమ్యూనికబుల్ డిసీజ్ (ఎన్సీడీ) సర్వే పూర్తయింది. ఈ జిల్లాల్లో 30 ఏళ్లు పైబడిన 35 లక్షల మందికి బీపీ, షుగర్ పరీక్షలు చేయించారు. ఇందులో 2.14 లక్షల మందికి డయాబెటిస్, సుమారు 3 లక్షల మందికి బీపీ ఉన్నట్టు గుర్తించారు. తమకు షుగర్, బీపీ ఉందని వీరిలో సుమారు 50 శాతం మందికి సర్వే నిర్వహించే వరకూ తెలియదు. మిగిలిన జిల్లాల్లో సర్వే కొనసాగుతోంది. క్షేత్రస్థాయి ఆరో గ్య కార్యకర్తలు గుర్తించిన అనుమానిత కేసులకు పీహెచ్సీ స్థాయిలో మరోసారి పరీక్షలు చేయాల్సి ఉంది. సర్వే పూర్తైన 12 జిల్లాల్లో మరోసారి సర్వే చేయనున్నట్టు చెబుతున్నారు. తొలి దశలో కొన్ని చోట్ల పాత పేషెంట్ల వివరాలు నమోదు చేయలేదు. వీరికి కూడా యూనిక్ ఐడీ నంబర్ ఇస్తారు. త్వరలో అందరి హెల్త్ ప్రొఫైల్.. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ తన నియోజకవర్గంలో హెల్త్ ప్రొఫైల్‌పై మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెల్త్ ప్రొఫైల్ చేపట్టే అంశంపై అధికారులకు ఆదేశాలు రానున్నాయి. ముందుగా సీఎం నియోజకవర్గం నుంచి ప్రారంభించి దశల వారీగా రాష్ట్రం మొత్తం అమలు చేయనున్నారు.మొత్తం వైద్య ఆరోగ్య శాఖతోపాటు హెల్త్ ప్రొఫైల్‌పై ముఖ్యమంత్రి త్వరలో సమీక్ష చేసే అవకాశముంది. -
రాష్ట్రవ్యాప్తంగా హెపటైటిస్ స్క్రీనింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా హెపటైటిస్ స్క్రీనింగ్ చేయాలని ఆరోగ్యశాఖ భావిస్తోంది. ఈ మేరకు అధికంగా కేసులు నమోదవుతున్న గద్వాల్ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాలని నిర్ణయించింది. గద్వాల జిల్లాలోని ఐజా, రాజోలి మండలాల్లోని పలు గ్రామాల్లో 20 నుంచి 25 శాతం మంది రకరకాల కాలేయ వ్యాధులతో బాధపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల్లో నివసిస్తున్న సుమారు 10వేల మందికి ఆరోగ్య పరీక్షలు చేయించనున్నారు. వైరస్ ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే ప్రమాదమున్న నేపథ్యంలో స్క్రీనింగ్‌లో పాల్గొనే ఆరోగ్య సిబ్బందికి ఇప్పటికే వ్యాక్సిన్లు ఇచ్చారు. డిసెంబర్ తొలి వారంలో స్క్రీనింగ్ ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ స్క్రీనింగ్‌కు అవసరమైన మెడికల్ కిట్లను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అధికారులకు అందజేసింది. ఈ స్క్రీనింగ్‌లో వ్యాధి ఉన్నట్లు తేలితే నేషనల్ హెల్త్ మిషన్ నిధులతో ఉచితంగా చికిత్స అందించనున్నారు. -
జీవనశైలి జబ్బులకు 'చెక్'..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న జీవనశైలి జబ్బుల (నాన్ కమ్యునికబుల్ డిసీజెస్..ఎన్సీడీ – అసాంక్రమిక వ్యాధులు)ను ప్రాథమిక దశలోనే నియంత్రించేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఉన్న ఎన్సీడీ క్లినిక్‌ల సంఖ్యను మరింతగా పెంచేందుకు నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 85 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 13 జిల్లా ఆస్పత్రుల్లో కలిపి మొత్తం 98చోట్ల ఈ ఎన్సీడీ క్లినిక్‌లు ఉన్నాయి. బాధితుల సంఖ్య ఎప్పటికప్పుడు గణనీయంగా పెరుగుతుండటంతో ఇవి ఏమాత్రం సరిపోవడంలేదు. దీంతో మరో 110 సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ ఎన్సీడీ క్లినిక్‌లు ఏర్పాటుచేయనున్నారు. ఓపీ సేవలతో పాటు ఇక్కడే రక్త పరీక్షలు కూడా చేస్తారు. కాగా, కొత్తగా ఏర్పాటుచేసే ఒక్కో క్లినిక్‌కూ ఒక డాక్టరు, స్టాఫ్ నర్సు, ఫిజియోథెరపిస్ట్‌ను నియమిస్తారు. క్లినిక్‌ల నిర్వహణకు సంబంధించిన ప్రతిపాదనలకు జాతీయ ఆరోగ్య మిషన్ ఆమోదం తెలిపి అక్కడ నుంచి అనుమతులు రాగానే ఈ 110 క్లినిక్‌లలో ఓపీ సేవలు నిర్వహిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అలాగే, ఆదివారం మినహా మిగతా అన్ని రోజుల్లోనూ వీటిల్లో సేవలు అందుబాటులో ఉంటాయి. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో జీవనశైలి జబ్బుల రిస్క్‌కు చేరువవుతున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతోందని, వీటి నియంత్రణకు చర్యలు తీసుకోకపోతే మరింత ప్రమాదం పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ భావించింది. అంతేకాక.. ఈ శాఖలో సంస్కరణల కోసం సుజాతారావు అధ్యక్షతన ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ సైతం రాష్ట్రంలో జీవనశైలి జబ్బుల ప్రభావం తీవ్రంగా ఉందని, దీనివల్ల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో.. వీటి నియంత్రణకు విధిగా చర్యలు అవసరమని అధికారులు భావించి అదనంగా ఎన్సీడీ క్లినిక్‌లను ఏర్పాటుచేస్తున్నారు. అలాగే, చాలామంది గ్రామీణ ప్రాంత వాసులకు మధుమేహం, రక్తపోటు తదితర జబ్బులపై అవగాహన లేనందున.. ప్రతీ నియోజకవర్గ స్థాయిలోనూ ప్రజలకు వీటిపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ప్రాథమిక దశలోనే వ్యాధుల గుర్తింపు కొత్తగా ఏర్పాటుచేసే క్లినిక్‌ల ద్వారా ప్రాథమిక దశలోనే వ్యాధులను గుర్తించే వీలు కలుగుతుంది. తద్వారా సకాలంలో వైద్య సేవలు అందించవచ్చు. అన్నింటికీ మించి.. బీపీ బాధితులు ఏటా పెరుగుతున్నారు. దీన్ని నియంత్రించాల్సిన అవసరం చాలా ఉంది. – డాక్టర్ గీతాప్రసాదిని, ప్రజారోగ్య శాఖ అదనపు సంచాలకులు -
జిల్లా కేంద్రాల్లో ‘పాలియేటివ్ కేర్’ యూనిట్లు
సాక్షి, హైదరాబాద్: అన్ని జిల్లాల్లో పాలియేటివ్ కేర్ యూనిట్లు ప్రారంభించా లని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఇప్పటికే 8 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవం తంగా నడుస్తుండటంతో, మిగతా అన్ని జిల్లాల్లోనూ నెలకొల్పేందుకు సన్నాహా లు ప్రారంభించింది. దీనికి అవసరమైన నిధులను సమకూర్చాలని జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం)ను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా కోరింది. ప్రస్తుతం ఆదిలాబాద్, సిద్దిపేట, ఖమ్మం, వరంగల్ (రూరల్), జనగాం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, యాదాద్రి జిల్లాల్లో పాలియేటివ్ కేర్ సేవలు ప్రయోగాత్మకంగా కొనసాగుతున్నాయి. జీవిత చరమాంకంలో ఉండే వయో వృద్ధులు, కేన్సర్‌కు గురై చివరి దశలో ఉన్నవాళ్లు తుదిశ్వాస వరకూ నొప్పి, బాధ తెలియకుండా సంతోషంగా గడిపేందుకు అవసరమైన సపర్యలు చేయడాన్నే వైద్య పరిభాషలో ‘పాలియేటివ్ కేర్’గా పిలుస్తారు. పాశ్చాత్య దేశాల్లో ఇది ఎప్పటి నుంచో అమలవుతోంది. ఖర్చుతో కూడుకున్న వ్యవహా రం కావడంతో ఈ సేవలను పొందడం అందరికీ సాధ్యం కాదు. దీంతో చాలామం ది అంతిమ దశలో బాధను అనుభవిస్తూ తనువు చాలిస్తారు. ఇలాంటి వారికి కావాల్సిన వైద్య సేవలు, మందులు ఇవ్వగలిగితే వారి జీవిత కాలాన్ని పొడిగించడంతోపాటు, నొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగించొచ్చు. ఎన్హెచ్ఎం కింద దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, మంచాన పడ్డవారికి వారి ఇంటికే వెళ్లి సేవలందించాలని కేంద్రం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అన్ని జిల్లాల్లో ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని ఎన్హెచ్ఎం అధికారి డాక్టర్ మాధవి తెలిపారు. జిల్లాకు ఒక ప్రత్యేక వైద్య బృందం.. పాలియేటివ్ కేర్ కింద ఎంపికైన జిల్లాకు ప్రత్యేక వైద్య బృందాన్ని, ఓ వాహనాన్ని కేటాయిస్తారు. వైద్య బృందం రోజూ కనీసం 12 మంది రోగుల ఇంటికి వెళ్లి సేవలు చేయాల్సి ఉంటుంది. స్టాఫ్ నర్సులు, ఫిజియోథెరపిస్టులకు ఇప్పటికే ఆయా జిల్లాల్లో అవసరమైన శిక్షణ ఇస్తున్నారు. త్వరలో జిల్లా ఆస్పత్రుల్లో వృద్ధులకు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తారు. నిమ్స్‌లోనూ వృద్ధుల కోసం (జెరియాట్రిక్) ప్రత్యేక వార్డు సిద్ధం చేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఇప్పటికే ఇంటింటికీ వెళ్లి 30 ఏళ్లకు పైబడిన వారికి ఆరోగ్య పరీక్షలు చేస్తూ వివరాలను నమోదు చేస్తున్నారు. ఇంట్లో ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా? అని ఆశ వర్కర్లు ఆరా తీస్తున్నారు. అలాంటి వారి వివరాలు తీసుకుని ఏఎన్ఎంలకు సమాచారమిస్తారు. వారు రోగి ఇంటికి వెళ్లి ‘పాలియేటివ్ కేర్’అవసరమా లేదా? అవసరమైతే ఎలాంటి సేవలు అవసరమన్న సమాచారం సేకరించి మెడికల్ ఆఫీసర్‌కు నివేదిస్తారు. డాక్టర్ వెళ్లి ఆ రోగికి అవసరమైన వైద్య పరీక్షలు చేయడంతోపాటు సదరు రోగికి ఎలా వైద్యం చేయా లన్న దానిపై కుటుంబ సభ్యులకు శిక్షణ ఇస్తారు. అవసరాన్ని బట్టి వారానికి ఒకట్రెండు సార్లు లేదా రెండ్రోజులకోసారి రోగి ఇంటికి వైద్య బృందం వెళ్లి సేవలు చేస్తుంది. రోగి మానసిక ఉల్లాసానికి అవసరమైన కౌన్సెలింగ్, వైద్య సేవలు అందిస్తారు. ఇంట్లో సేవలు అందించలేని పరిస్థితి ఉంటే సమీప ప్రభుత్వ దవాఖానలో ‘పాలియేటివ్ కేర్’వార్డుల్లో ఉంచి సపర్యలు చేస్తారు. -
రక్తం ఇస్తారా?... వచ్చేస్తాం
సాక్షి, హైదరాబాద్: దాతల వద్దకే వెళ్లి రక్తం సేకరించేందుకు ప్రత్యేక మొబైల్ వాహనాలను ప్రవేశపెట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ప్రతీ జిల్లా లో ఇటువంటి మొబైల్ వాహనాలను అం దుబాటులో ఉంచుతారు. ప్రయోగాత్మకంగా 18 రక్తసేకరణ వాహనాలను సిద్ధం చేశారు. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) నిధులతో వాటిని కొనుగోలు చేశారు. వాటిని ఆయా జిల్లాలకు పంపుతారు. వీటి ద్వారా రక్త సేకరణ విజయవంతమైతే మిగతా జిల్లాల్లోనూ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. మొబైల్ వాహనాల్లో సౌకర్యాలను ఆరోగ్య కుటుంబ సంక్షేమ అధికారులు పరిశీలించారు. బ్లడ్ బ్యాంకుల్లో మాదిరిగానే ఈ వాహనాల్లో అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి. ఏసీ, రెండు పడకలు, బీపీ, బరువు చెక్ చేసే యంత్రం తదితర సదుపాయాలుంటాయి. ఒకేసారి ఇద్దరి నుంచి రక్తం సేకరించడానికి వీలుంది. బ్లడ్ బ్యాంక్‌లకు చేరే వరకూ రక్తాన్ని భద్రపరిచేందుకు అవసరమైన కోల్డ్ స్టోరేజ్ సిస్టమ్‌ను వ్యాన్‌లో అమర్చారు. ఒక్కో వాహనం ధర రూ. 35 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. వీటిని త్వరలో ప్రారంభించి రక్త దాతలకు అందుబాటులోకి తెస్తామని ఎన్హెచ్ఎం అధికారులు తెలిపారు. శిబిరాల ఏర్పాటు కష్టం అవడంతో.. ప్రస్తుతం బ్లడ్ బ్యాంకులు, శిబిరాల ద్వారా రక్తాన్ని సేకరిస్తున్నారు. ఎక్కడ రక్తదాన శిబిరం నిర్వహించాలన్నా వైద్యపరంగా నిబంధనల ప్రకారం సౌకర్యాల ను కల్పించడం కష్టమవుతోంది. స్కూళ్లు, ఇతరత్రా కార్యాలయాల వద్ద రక్తాన్ని సేకరించడం ఇబ్బందిగా మారింది. దీంతో ఎప్పుడంటే అప్పుడు ఎవరంటే వారు ఆహ్వానించగానే వెళ్లేలా ఈ వాహనాలను సిద్ధం చేశారు. రక్తదాతలు పిలిస్తే వెంటనే వెళ్లాలనేది వీరి ఉద్దేశం. ఊరూరా తిరిగి రక్తదానం ప్రాముఖ్యతను చెప్పి సేకరించాలనేది సర్కారు ఆలోచన. ఈ వాహనాల్లో ఒక మెడికల్ ఆఫీసర్, ఇద్దరు సాంకేతిక నిపుణులు ఉంటారని ఎన్హెచ్ఎం వర్గాలు తెలిపాయి. దేశంలోనే మొదటిసారిగా ఇటువంటి మొబైల్ రక్త సేకరణ వాహనాలను మన రాష్ట్రంలోనే ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నాయి. -
కేన్సర్ రోగులకు ఎక్కడికక్కడ చికిత్స
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న కేన్సర్ వ్యాధిగ్రస్తులకు ఎక్కడికక్కడ చికిత్స అందించే అంశంపై సర్కారు దృష్టి సారించింది. కేన్సర్ నివారణ, పరీక్షలకు సంబంధించిన కార్యక్రమాలను వికేంద్రీకరించాలని భావిస్తోంది. ఆ విషయంపై అధ్యయనం చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆధ్వర్యంలోని అధికారుల బృందం ఇండోర్ వెళ్లి అధ్యయనం చేసి వచ్చింది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ యోగితారాణా, జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) అధికారి మాధవిలతో కూడిన ఈ బృందంఅక్కడ కేన్సర్ కార్యక్రమాల వికేంద్రీకరణ సాధ్యాసాధ్యాలను పరిశీలించింది. రాష్ట్రంలో వాటి అమలుపై దృష్టిపెట్టింది. రాష్ట్రంలో కేన్సర్ విస్తృతి.. తెలంగాణలో కేన్సర్ రోజురోజుకూ విస్తృతమవుతోంది. దీనిపై ఇటీవల మంత్రి ఈటల రాజేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. నివారణకు కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అందులో భాగంగానే ఉన్నతస్థాయి అధికారులు అధ్యయనం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతీ లక్ష మంది జనాభాలో 74 కేన్సర్ కేసులున్నాయి. ఏటా 26 వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 1.2 లక్షల మంది కేన్సర్‌తో బాధపడుతున్నారు. కేన్సర్లలో 25% సర్వైకల్, మరో 25% రొమ్ము, 40% పొగాకుతో వచ్చే గొంతు, ఊపిరి తిత్తులు వంటి కేన్సర్లు, 10% జీవనశైలిలో మార్పుల ద్వారా వచ్చే కేన్సర్లు, 5% జన్యుపరమైన కారణాల ద్వారా కేన్సర్లు వస్తుంటాయి. దేశంలో కేన్సర్ నివారణకు వివిధ ప్రాంతాల్లో చేపడుతున్న కార్యక్రమాలను మున్ముందు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధ్యయనం చేయనుంది. జిల్లాస్థాయిలోనే కీమోథెరపీ ప్రస్తుతం రాష్ట్రంలో కేన్సర్ స్క్రీనింగ్‌ను క్షేత్రస్థాయిలో చేస్తున్నారు. అందులో బ్రెస్ట్, ఓరల్, సర్వైకల్ కేన్సర్లను ప్రాథమికంగా గుర్తిస్తున్నారు. అటువంటి కేసులను హైదరాబాద్, వరంగల్‌లోని కేన్సర్ ప్రాంతీయ కేంద్రాలకు పంపుతున్నారు. అయితే వికేంద్రీకరణలో భాగంగా కేన్సర్ నిర్ధారణకు సంబంధించి మెడికల్ ఆఫీసర్లకు పూర్థిస్థాయిలో శిక్షణ ఇచ్చి అన్ని జిల్లాల్లో కేన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడే పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టనున్నారు. అలాగే కేవలం స్క్రీనింగే కాకుండా జిల్లా స్థాయిలోనే కీమోథెరపీతోపాటు ఇంకా ఏమైనా సౌకర్యాలు, చికిత్సలు కేన్సర్ రోగులకు అందించవచ్చా అన్న అంశాలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. జిల్లా స్థాయిలో కేన్సర్ గుర్తింపు కేంద్రాలను ఏర్పాటు చేయడం, వాటిలోనే చికిత్సలు అందించడం, గుర్తించేందుకు సుశిక్షితులైన మెడికల్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో కేన్సర్ నిర్ధారించడం, ఇప్పటికే అందిస్తున్న పాలియేటివ్ కేర్ సేవలను కొనసాగించడం, భవిష్యత్‌లో ఈ సేవలన్నింటినీ మరింత విస్తరించడం లాంటివన్నీ కేన్సర్ కార్యక్రమాల వికేంద్రీకరణలో ఉండబోతున్నాయి. ఇండోర్‌లో అటువంటి కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్న తీరును బృందం అధ్యయనం చేసింది. -
ప్రభుత్వ వైద్యానికి చికిత్స తప్పనిసరి
సాక్షి, అమరావతి: ‘‘గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో జాతీయ ఆరోగ్య మిషన్ నిధులను చక్కగా వినియోగించుకొని, ప్రభుత్వ వైద్య వ్యవస్థను అభివృద్ధి చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పలు కీలక సేవలను ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించారు. ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూర్చారు. నిధులను ఖర్చు చేసినా ఆశించిన ఫలితాలు రాలేదు. ఏపీలో ప్రభుత్వ ఆస్పత్రులు పూర్తిగా బలహీనపడ్డాయి. వైద్య వ్యవస్థ దిగజారిపోయింది.’’ అని నిపుణుల కమిటీ కుండబద్దలు కొట్టింది. ప్రభుత్వ వైద్య వ్యవస్థకు కాయకల్ప చికిత్స తప్పనిసరి అని తేల్చిచెప్పింది. ఆరోగ్య శాఖలో చేపట్టాల్సిన సంస్కరణలను సిఫార్సు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుజాతారావు అధ్యక్షతన నిపుణుల కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా మూడు నెలలపాటు పర్యటించారు. పలువురి అభిప్రాయాలను తెలుసుకున్నారు. సామాన్య ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ)తో కొనసాగుతున్న ప్రాజెక్టులను పరిశీలించారు. తుది నివేదికను సిద్ధం చేశారు. నిపుణుల కమిటీ ఈ నెల 19వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి తమ నివేదికను అందజేయనుంది. నిపుణుల కమిటీ సిఫార్సులు - రోగులకు ఎలక్ట్రానిక్ హెల్త్‌కార్డులు ఇవ్వాలి. దీనివల్ల ప్రత్యేక ట్రాకింగ్ విధానం అమలు చేయొచ్చు. - ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందిన హెల్త్ ప్రాక్టీషనర్స్ మాత్రమే మందులు ఇచ్చే విధానం ఏర్పాటు చేయాలి. - విలేజ్ హెల్త్ క్లినిక్‌లు నెలకొల్పాలి. - ఫ్యామిలీ ఫిజీషియన్ వ్యవస్థను బలోపేతం చేయాలి. - ప్రతి పీహెచ్సీలో ల్యాబొరేటరీ, ఫోన్, కంప్యూటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టాటికల్ అసిస్టెంట్ ఉండాలి. - ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చేసుకోవాలి. - అందులో వచ్చే సొమ్ములో 30% డబ్బును అద్దెకింద ప్రభుత్వ ఆస్పత్రికి చెల్లించాలి. - ప్రభుత్వ హాస్పిటళ్లలో పనిచేసే వైద్యులు ప్రైవేట్ హాస్పిటళ్లకు వెళ్లి ఆరోగ్యశ్రీ పరిధిలోని సర్జరీలు చేయకూడదు. - అనుమతి లేకుండా ప్రైవేట్ ప్రాక్టీసు చేస్తే తమను విధుల తొలగించవచ్చని వైద్యుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకోవాలి. - అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసీయూ, క్యాజువాలిటీ ఉండాలి - ‘108’ అంబులెన్సులను 3 షిఫ్టుల్లో నిర్వహించాలి. - రోగుల వివరాలు, బయోమెట్రిక్ అటెండెన్స్, లైవ్ డ్యాష్బోర్డ్లను ఏర్పాటు చేయాలి. - పీపీపీ ప్రాజెక్టులను పునఃసమీక్షించాలి. నిపుణుల కమిటీ నివేదికలోని ముఖ్యమైన అంశాలు.. - రాష్ట్రంలో గుండెపోటు, డయాబెటిక్, హైపర్ టెన్షన్ కేసులతో పాటు బలవన్మరణాలు అధికంగా నమోదవుతున్నాయి. ఐరన్ లోపం, రక్తహీనత వంటి జబ్బులు వేధిస్తున్నాయి. - అర్హత లేని వైద్యులు రోగుల నుంచి భారీగా వసూళ్లు చేస్తున్నారు. అవసరం లేకపోయినా యాంటీబయోటిక్స్ వాడుతున్నారు. - మందుల సరఫరా అత్యంత లోపభూయిష్టంగా ఉంది. మందుల కొరత వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. - గత మూడేళ్లలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చాలా సేవలను ప్రైవేట్‌పరం చేశారు. - వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆసుపత్రుల్లో వైద్యుల కొరత వేధిస్తోంది. - ప్రభుత్వ హాస్పిటళ్లలో మౌలిక వసతులు కొరవడ్డాయి. ఆపరేషన్ థియేటర్ల పరిస్థితి దారుణంగా మారింది. - అన్ని వసతులున్న ఆస్పత్రులను రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ కోల్పోవాల్సి వచ్చింది. - ఏపీలో చాలా వైద్య కళాశాలల్లో ఎండోక్రైనాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, రేడియోథెరఫీ వంటి విభాగాలు లేవు. ఉన్నా సక్రమంగా పని చేయడం లేదు. - ఒక్కసారి ఇన్‌పేషెంట్‌గా చేరితే గ్రామీణ ప్రాంతాల్లో రూ.13,010, పట్టణ ప్రాంతాల్లో రూ.30,712 ఖర్చు చేయాల్సి వస్తోంది. - రాష్ట్ర ప్రజలు మందుల కోసం ప్రతిఏటా రూ.21,309 కోట్లు ఖర్చు చేస్తున్నారు. - సాంక్రమిక(కమ్యూనికబుల్) వ్యాధుల నియంత్రణలో రాష్ట్రం విఫలమైంది. ఖాళీలను భర్తీ చేయకపోవడం, సాంకేతిక సిబ్బంది లేకపోవడం వంటివి దారుణంగా దెబ్బతీశాయి. - నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (అసాంక్రమిక వ్యాధులు) నియంత్రణలో విఫలమయ్యారు. - క్యాన్సర్, గుండెజబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ జబ్బులు పెరుగుతున్నా వాటి నియంత్రణకు చర్యలు తీసుకోలేదు. - 50 శాతం అంబులెన్సులు సరైన కండిషన్లో లేవు. -
పోటెత్తిన గుండెకు అండగా
సాక్షి, హైదరాబాద్: ఆకస్మికంగా గుండెపోటు వస్తే తక్షణం వైద్యం అందక రాష్ట్రంలో అనేక మరణాలు సంభవిస్తున్నాయి. 108 అత్యవసర అంబులెన్సులున్నా వాటిల్లో అత్యాధునిక సదుపాయా లు లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో గుండెపోటు మరణాల రేటు అధికంగా ఉంటోంది. ఈ పరిస్థితికి చెక్ పెట్టాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేకంగా ‘స్టెమీ’ అంబులెన్స్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అకస్మాత్తుగా గుండెపోటు రావడాన్ని ఎస్టీ–ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (స్టెమి) అంటారు. అత్యాధునిక వసతులతో కూడిన అంబులెన్సులు, ఇతరత్రా సదుపాయాలు కల్పించడమే ఈ అంబులెన్స్ ఉద్దేశం. ఈ అంబులెన్సులను ఆగస్టు 15న ప్రారంభించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఆరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 30 అంబు లెన్సులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందుకు సంబంధించి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆకస్మికంగా గుండెపోటు వచ్చిన రోగిని బతికించేందుకు దేశంలో పలుచోట్ల ‘జాతీయ స్టెమీ కార్యక్రమం’ నడుస్తోంది. తమిళనాడులో ప్రస్తుతం ఇది పైలట్ ప్రాజెక్టుగా అమలవుతోంది. ఇప్పుడు తెలంగాణలో ప్రారంభించనున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద దీనికి కేంద్రం నిధులు రానున్నాయి. చేయి దాటుతోంది.. దీర్ఘకాలం గుండెలో రంధ్రాలు మూసుకొని పోయి ఉండటం వల్ల ఒకేసారి తీవ్రమైన గుండెపోటు వస్తుంది. ఈ పరిస్థితినే స్టెమీ అంటారు. ఇలాంటి సందర్భంలో ప్రతి క్షణం అత్యంత కీలకమైంది. స్టెమీ అనే తీవ్రమైన గుండెపోటు వచ్చిన వారు చనిపోవడానికి ప్రధాన కారణం ఆసుపత్రికి తీసుకెళ్లేంత సమయం ఉండకపోవడం, రవాణా సదుపాయాలు లేకపోవడం.. అంతేకాదు సాధారణమైన ప్రాథమిక స్థాయి ఆసుపత్రుల్లో తీవ్రమైన గుండెపోటు గుర్తించే పరిస్థితి లేకపోవడమేనని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు అంటున్నాయి. సాధారణ అంబులెన్సుల్లో తీవ్రమైన గుండెపోటుకు తీసుకోవాల్సిన ప్రత్యేక వ్యవస్థ ఉండదు. ఆక్సిజన్ ఇచ్చి సాధారణ వైద్యం చేస్తూ సమీప ఆసుపత్రులకు తీసుకెళ్లడానికి మాత్రమే అవి పనికొస్తున్నాయి. దీనివల్ల ఈ అంబులెన్సులు రోగిని తీసుకెళ్లేందుకు వచ్చినా ప్రాణాలు కాపాడటం సాధ్యం కావట్లేదు. అత్యాధునిక సదుపాయాలు.. స్టెమీ అంబులెన్సులు ఆకస్మిక గుండె పోటును నివారించేందుకు ఉపయోగపడతాయి. అందులో కేతలాబ్లో ఉండే అన్ని రకాల అత్యాధునిక వసతులు ఉంటాయి. ఈసీజీ రికార్డు చేయడం, గుండె చికిత్సకు అవసరమైన ప్రొటోకాల్ వ్యవస్థ ఉంటుంది. అడ్వాన్స్ లైఫ్ సపోర్టుతో వైద్యం అందుతుంది. ఈ అంబులెన్సులను ఆకస్మికంగా గుండెపోటు వచ్చిన వారి కోసమే పంపుతారు. 108 అత్యవసర వాహనాలకు స్టెమీని అంబులెన్సులను అనుసంధానం చేస్తారు. స్టెమీ అంబులెన్సులతో పాటు ప్రతి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కేతలాబ్ను ఏర్పాటు చేస్తారు. దానివల్ల రోగిని ఏదో ఆసుపత్రికి కాకుండా కేతలాబ్కే తీసుకెళ్లడానికి వీలుంటుంది. దేశంలో కొన్నిచోట్ల ఇప్పటికే స్టెమీ అంబులెన్సులను ఏర్పాటు చేయడం వల్ల ఆయా ప్రాంతాల్లో 19 శాతం ఆకస్మిక గుండె మరణాలను తగ్గించగలిగారని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. -
ఏపీఎంఎస్‌ఐడీసీకి కమీషన్ల జబ్బు
సాక్షి, అమరావతి: రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థలో (ఏపీఎంఎస్ఐడీసీ) తవ్వేకొద్దీ అవినీతి వ్యవహారాలు బయట పడుతున్నాయి. మందుల కొనుగోలు నుంచి సివిల్ నిర్మాణాల వరకూ ఆన్లైన్ టెండర్లకు వేదికైన ఈ సంస్థలో గత నాలుగున్నరేళ్లలో ఎన్నో అక్రమాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులు, బాలింతల్లో రక్తహీనతను గుర్తించి, చికిత్స అందించేందుకు ఎనీమియా స్క్రీనింగ్ యంత్రాల (హిమోగ్లోబిన్ డిజిటల్ మెషీన్లు) కొనుగోలుకు జాతీయ ఆరోగ్య మిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. కమీషన్లకు కక్కుర్తి పడిన ఏపీఎంఎస్ఐడీసీ గత ఆరు నెలలుగా 164 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు హిమోగ్లోబిన్ డిజిటల్ మీటర్లను సరఫరా చేయలేదు. గర్భిణులు, బాలింతలకు ఉపయోగపడే యంత్రాలను రాకుండా అడ్డుకున్నారంటే ఏపీఎంఎస్ఐడీసీ అధికారులు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. 3,150 యంత్రాల కొనుగోలుకు టెండర్లు రాష్ట్రంలో ఏటా 7.50 లక్షలకు పైగా ప్రసవాలు జరుగుతున్నాయి. గర్భిణుల్లో 60 శాతం మంది రక్తహీనత బాధితులే. పదేపదే సూదితో గుచ్చి రక్తం తీయడం వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే జాతీయ ఆరోగ్య మిషన్ ప్రాథమికంగా 164 పీహెచ్‌సీలకు అత్యాధునిక హిమోగ్లోబిన్ డిజిటల్ మీటర్లను సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ మెషీన్లు ఉంటే గర్భిణులు, బాలింతలకు సూది గుచ్చాల్సిన అవసరం ఉండదు. కనురెప్పలు తెరిచి, ఆ మెషీన్‌తో చూస్తే శరీరంలో ఎంతమేరకు రక్త శాతం ఉందో క్షణాల్లో తెలిసిపోతుంది. ఈ మెషీన్‌కు బ్లూటూత్ పరికరం ఉంటుంది. వైద్యుడు సుదూర ప్రాంతంలో ఉన్నా అతడి సెల్‌ఫోన్‌కు ఈ హిమోగ్లోబిన్ సమాచారాన్ని పంపించి, సలహాలు సూచనలు పొందవచ్చు. మొత్తం 3,150 మెషీన్ల కొనుగోలుకు ఏపీఎంఎస్ఐడీసీ 2018 అక్టోబర్ 9న టెండర్లు పిలిచింది. సాంకేతిక, ఆర్థిక బిడ్ల పరిశీలన తరువాత డెమో కూడా పూర్తయ్యింది. బయోసైన్స్ అనే సంస్థ ఒక్కో మెషీన్‌ను రూ.21 వేలకు కోట్ చేసి, టెండర్లలో ఎల్1గా నిలిచింది. ఎల్2గా నిలిచిన మాసిమో అనే సంస్థ ఒక్కో యంత్రానికి రూ.80 వేలు కోట్ చేసింది. దీంతో ఎల్1గా తేలిన బయోసైన్స్ సంస్థకు టెండర్ అప్పగించాల్సిన ఏపీఎంఎస్ఐడీసీ ఆ పని చేయలేదు. కమీషన్ల బేరం కుదరకపోవడమే ఇందుకు కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారుల అవినీతి వల్ల 2019 జనవరి నుంచి ఇప్పటివరకూ ఆ మెషీన్లు సరఫరా కాలేదు. బయోసైన్స్‌కు ప్రొడక్ట్ లైసెన్స్ లేదు ‘‘హిమోగ్లోబిన్ డిజిటల్ మీటర్ల కొనుగోళ్లకు సంబంధించి టెండర్లలో ఎల్1గా తేలిన బయోసైన్స్ సంస్థకు ప్రొడక్ట్ లైసెన్స్ లేదని మాసిమో సంస్థ ఫిర్యాదు చేసింది. దీనిపై వెరిఫికేషన్ చేశాం. ఫైల్‌ను ఉన్నతాధికారులకు పంపించాం. ఈ టెండర్ల ప్రక్రియ నుంచి తప్పుకున్నాం. టెండర్ రద్దయ్యింది’’ – సీహెచ్ గోపీనాథ్, ఎండీ, ఏపీఎంఎస్ఐడీసీ -
సౌకర్యం ఉన్నా..ఫలితం సున్నా..!
సాక్షి, ప్రొద్దుటూరు : ప్రాణాపాయంలో రక్తం ద్వారా మనిషిని కాపాడవచ్చు. ఎలాంటి ఆస్పత్రుల్లోనైనా మొదటి ప్రాధాన్యత రక్తానిదే. రక్తపు నిల్వలు అందుబాటులో లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సైతం రక్తపు నిల్వలు లభించడం కష్టతరంగా మారింది. ఈ సమస్య తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం జిల్లాకు రక్తసేకరణ, రవాణా వాహనాన్ని మంజూ రు చేసింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రోజూ ఆయా ప్రాంతాల్లో రక్తాన్ని సేకరించి ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేయాల్సి ఉంది. అయితే ప్రజాదరణ లేక రక్త సేకరణలో లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. అన్ని సౌకర్యాలు కలిగిన వాహనం ఉన్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. రూ.48లక్షలతో వాహనం ఏర్పాటు జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా దేశంలోని మిగతా జిల్లాలతోపాటు వైఎస్సార్ జిల్లాకు రక్తసేకరణ, రవాణ వాహనాన్ని మంజూరు చేశారు. ఇందు కోసం రూ.48లక్షలు వెచ్చించారు. 2017 సెప్టెంబర్ 19న ఈ వాహనాన్ని ప్రారంభించారు. ఏసీతో కూడిన ఈ వాహనంలో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రికి అనుబంధంగా ఈ వాహనం పనిచేస్తోంది. స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని బ్లడ్‌బ్యాంకు డాక్టర్ కవిత వాహన నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వాహనానికి ఇరువురు ల్యాబ్ టెక్నీషియన్లతోపాటు డ్రైవర్ ఉన్నారు. ల్యాబ్ టెక్నీషియన్లకు నెలకు రూ.19వేలు చొప్పున, డ్రైవర్‌కు రూ.15వేలు చొప్పున వేతనాలు ఇస్తున్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో తిరిగినందుకు నెలకు సుమారు రూ.15వేలు డీజల్ ఖర్చు వస్తోంది. నెరవేరని లక్ష్యం నిబంధనల ప్రకారం ఈ వాహనం ద్వారా నెలకు 1500 యూనిట్ల రక్తాన్ని సేకరించాల్సి ఉంది. అయితే ఇందులో సగం యూనిట్ల రక్తం కూడా సమకూరడం లేదని తెలుస్తోంది. 2017లో 1481 యూనిట్లు, 2018లో 3,704 యూనిట్లు మాత్రమే రక్తాన్ని సేకరించారు. కొన్ని నెలల్లో 120 యూనిట్ల రక్తం మాత్రమే సేకరించారు. ప్రధానంగా ప్రచారం లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. సేకరించిన రక్తాన్ని ప్రతి నెల పులివెందుల, ప్రొద్దుటూరు, కడపలోని మదర్ బ్లడ్‌బ్యాంకులకు అందించాల్సి ఉంది. వీటి ద్వారా జమ్మలమడుగు, బద్వేలు, రాయచోటి, రాజంపేట ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో రక్తాన్ని నిల్వ చేస్తారు. ప్రతి నెల ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రికి 500 యూనిట్లు, రిమ్స్‌కు 2వేల యూనిట్లు రక్తపు నిల్వలు అవసరమని సమాచారం. అయితే తగినంత రక్తపు నిల్వలు రాకపోవడంతో ప్రాణాపాయంలో ఉన్న వారు రక్తం కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రుల్లో రక్తం తీసుకోవాలంటే తప్పనిసరిగా బదులు ఇవ్వాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. -
‘హెల్త్ అండ్ వెల్నెస్’ ప్రాజెక్టు అధికారి వేధింపులు
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఆరోగ్య మిషన్‌లో హెల్త్ అండ్ వెల్ నెస్ కేంద్రాల ప్రాజెక్టు అధికారిగా పనిచేస్తున్న సత్య తమను వేధిస్తున్నాడంటూ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాల్లో పనిచేస్తున్న మిడిల్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు (ఎంఎల్ హెచ్‌వో) హైదరాబాద్ కోఠీలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కార్యాలయం ముందు శుక్రవారం ధర్నాకు దిగారు. ప్రాజెక్టు ఆఫీసర్ సత్యను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. దాదాపు 5 గంటల సేపు ఆందోళన చేసిన వారు, ఒక దశలో కమిషనర్ యోగితా రాణా కారును అడ్డగించారు. అప్పటికే పోలీసులు రంగప్రవేశం చేశారు. దీంతో కార్యాలయ ప్రాంగణమంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాలు.. కేంద్రం ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలో కూడా 500 కేంద్రాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాలను హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలుగా మార్చి ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యంగా వీటిని నెలకొల్పారు. వీటిలో పనిచేసేందుకు గతేడాది వైద్య ఆరోగ్యశాఖ రాత పరీక్ష నిర్వహించి 76 మంది స్టాఫ్ నర్సులను ఎంఎల్హెచ్వోలుగా కాంట్రాక్టు పద్ధతిపై తీసుకున్నారు. ఈ కార్యక్రమమంతా జాతీయ ఆరోగ్య మిషన్‌లో భాగంగా చేపట్టారు. నియమించే సమయంలో వీరి స్థానిక ప్రాంతానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉద్యోగ అవకాశమిస్తారని అధికారులు తెలిపారు. కానీ ఒక జిల్లాలో ఉన్న వారిని మరో జిల్లాలో ఎక్కడో వంద కిలోమీటర్ల దూరంలో వేశారు. అలాగే ఈ ఏడాది జూన్ మొదటి నుంచి వారు ఎక్కడ పనిచేస్తున్నది, ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్లింది ఎప్పటికప్పుడు ప్రాజెక్టు ఆఫీసర్‌కు తెలిసేలా స్మార్ట్ ఫోన్లో లైవ్ లొకేషన్ షేర్ చేయమని ఆదేశాలు జారీ చేశారు. అర్ధరాత్రి అధికారి ఫోన్లు.. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రాజెక్టు ఆఫీసర్‌గా వ్యవహరిస్తోన్న సత్య అర్ధరాత్రి, అపరాత్రి అన్న తేడా లేకుండా తమకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడని, అవసరం లేకపోయినా కూడా కార్యక్రమాల వివరాలను తెలపాలని కోరుతున్నారని ధర్నా చేసిన స్టాఫ్ నర్సులు ఆరోపించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకే తమ డ్యూటీ అని, కానీ రాత్రి 10–11 గంటల సమయంలో కూడా ప్రాజెక్టు ఆఫీసర్ తమకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధా నంగా ఆయన వేధింపులు ఆపాలని, నిబంధనల ప్రకారం స్థానికంగా ఉన్న ప్రాంతాల్లోనే తమకు విధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆ అధికారిపై స్థానిక పోలీసు స్టేషన్లో వారంతా ఫిర్యాదు చేశారు. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. వెంటనే దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. -
జిల్లా ఆసుపత్రుల ఆధునీకరణ
సాక్షి, హైదరాబాద్: నూతన జిల్లాల్లో ఏర్పాటైన జిల్లా ఆసుపత్రులను ఆధునీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలు ఏర్పాటయ్యాక ఏరియా ఆసుపత్రులను జిల్లా ఆసుపత్రులుగా మార్పు చేశారు. అయితే పేరు మారిందే కానీ ఆ మేరకు వాటి స్థాయిని పెంచలేదు. పడకలు, పరికరాలు, ఇతరత్రా వసతుల ఏర్పాటు జరగలేదు. ఈ పరిస్థితిని సమగ్రంగా మార్చాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. దీంతో కొత్తగా ఏర్పాటైన జిల్లా ఆస్పత్రుల దశ మారనుంది. తొలి దశలో ములుగు, నారాయణపేట, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ రూరల్, మహబూబాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, సిరిసిల్ల, గద్వాల్ జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ తొమ్మిది ఆసుపత్రుల్లో భారతీయ ప్రజారోగ్య ప్రమాణాల ప్రకారం వసతులు సమకూర్చుతారు. ప్రస్తుతం ఈ ఆస్పత్రుల్లో 50 నుంచి 100 పడకలు మాత్రమే ఉన్నాయి. వాటిని 250కి పెంచనున్నారు. అలాగే జిల్లా ఆసుపత్రుల్లో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, అనెస్థీషియా, పీడియాట్రిక్ తదితర విభాగాలు తప్పనిసరిగా ఉండాలి. వాటన్నింటినీ ఈ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేస్తారు. ఆ ప్రకారం వైద్యులను కూడా నియమిస్తారు. అందుకోసం వైద్యుల భర్తీ ప్రక్రియ కూడా జరగనుంది. క్రిటికల్ కేర్, ఎమర్జెన్సీ యూనిట్, అంబులెన్స్, ఆపరేషన్ థియేటర్లను అందుబాటులోకి తీసుకొస్తారు. అలాగే రోగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించి సిటీ స్కాన్, ఆల్ట్రా సౌండ్, ఈసీజీ, ఎక్స్‌రే, ఎండోస్కోపి తదితర అన్ని డయాగ్నస్టిక్స్ యంత్రాలు సమకూరుస్తారు. ఒక్కో ఆస్పత్రికి 60 కోట్లు జిల్లా ఆస్పత్రుల అభివృద్ధికి జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) నిధులు కేటాయించేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ ముందుకొచ్చినట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. మొత్తం 3 దశల్లో రాష్ట్రంలోని జిల్లా ఆస్పత్రులను ఆధునీకరిస్తారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడ్డాక, ఆయా జిల్లా కేంద్రాల్లో ఉన్న ఏరియా ఆస్పత్రులను జిల్లా ఆస్పత్రులుగా ఆధునీకరించారు. అయితే ఆ మేరకు వసతులేవీ కల్పిం^è లేదు. దీంతో పాత జిల్లా కేంద్రాల్లోని దవాఖానాలకే రోగులు వెళ్తున్నా రు. ఈ దవాఖానాల అభివృద్ధికి ఎన్హెచ్ఎం నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు కోరుతూ వస్తున్నారు. కొత్త భవనాల నిర్మాణం, పలు విభాగాల ఏర్పాటు తదితర అవసరాలకు ఒక్కో ఆస్పత్రి కి రూ.60 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. తాజాగా ఈ ప్రతిపాదనకు కేంద్రం అంగీకరించినట్టు చెబుతున్నారు. మొత్తం 3 దశల్లో నూతన జిల్లాల్లోని ఆసుపత్రులను ఆధునీకరిస్తారు. ముందుగా తొమ్మిది ఆసుపత్రులు ఆధునీకరణకు నోచుకోనున్నాయి. -
‘ప్రైవేటు’ సిజేరియన్‌కు ప్రభుత్వ సిఫార్సు తప్పనిసరి
న్యూఢిల్లీ: ఆయుష్మాన్ భారత్–జాతీయ ఆరోగ్య సంరక్షణ మిషన్(ఏబీ–ఎన్‌హెచ్‌పీఎం)కు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఆస్పత్రులు సిఫార్సు చేస్తేనే ఈ పథకం కింద ప్రైవేటు ఆస్పత్రులు సిజేరియన్ ఆపరేషన్ నిర్వహించాల్సి ఉంటుందని ఏబీ–ఎన్‌హెచ్‌పీఎం సీఈవో ఇందు భూషణ్ తెలిపారు. ఏ కారణం చేత సదరు ప్రభుత్వ ఆస్పత్రి సిజేరియన్‌కు సిఫార్సు చేసిందో స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుందన్నారు. దేశంలో సహజ ప్రసవాలను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. తొలుత సహజ ప్రసవాలను ఈ పథకం పరిధిలో చేర్చలేదన్నారు. కానీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాల లేమీ లేదా ఇతర కారణాలతో ప్రైవేటు ఆస్పత్రులకు సిఫార్సు చేస్తే ఈ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. -
కాన్పుల్లో కోతలకే మొగ్గు !
సాక్షి, జగిత్యాల: నేషనల్ హెల్త్‌మిషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో చేపట్టిన సర్వే వివరాలు చూస్తే కళ్లు బైర్లుకమ్మడం ఖాయం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రుల్లో అత్యధికంగా సిజేరియన్లు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి సైతం సీరియస్ అయ్యారు. కలెక్టర్ సైతం వైద్యాధికారులతో సమావేశమై.. జిల్లాలోని ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనిపై ప్రతీ నెల రిపోర్టులు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య తగ్గింది. కేసీఆర్ కిట్‌తో.. కేసీఆర్ కిట్ అమలుతో ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య ఘననీయంగా పెరిగింది. అయితే ప్రభుత్వ వైద్యులు సైతం సాధారణ ప్రసవాల కోసం చూడకుండా ఆపరేషన్లు చేసేస్తున్నారు. ఈ సంవత్సరంలోనే 65 శాతం సిజేరియన్లు జరిగినట్లు రికార్డులు తెలుపుతున్నాయి. మొదటి కాన్పు సిజేరియన్ చేస్తే..రెండో కాన్పు సైతం సాధారణం ఇబ్బందవుతుందని, సిజేరియన్ చేయాలంటున్నారు వైద్యులు. కేసీఆర్ కిట్‌తో ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగినప్పటికీ.. ఇక్కడికి వస్తున్న వారిలో ఎక్కువ శాతం రెండో కాన్పుకోసమేనని వైద్యులు పేర్కొంటున్నారు. పలు సమస్యలు సిజేరియన్ చేస్తే అనేక సమస్యలు తలెత్తుతాయి. కొన్ని రోజులు కదలకుండా ఉండడంతోపాటు నొప్పి తీవ్రంగా ఉంటుంది. పుట్టిన పాపకు పాలు పట్టడంలో జాప్యమవుతుంది. సాధారణ ప్రసవంతో పొట్టపై ఎలాంటి కోతలు ఉండవు. బాలింత మరుసటి రోజే కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బిడ్డకు సైతం ఇబ్బంది లేకుండా పట్టవచ్చు. వైద్యుల కొరతే కారణమా? జిల్లాలో వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తుంది. జగిత్యాల ప్రధాన ఆస్పత్రిలో ముగ్గురే గైనకాలజిస్ట్లు ఉన్నారు. మెట్పల్లిలో ఇద్దరు, కోరుట్ల, రాయికల్, ధర్మపురిలో ఒక్కొక్కరి చొప్పున విధులు నిర్వర్తిస్తున్నారు. వైద్యులు ఎక్కువగా ఉంటే ఎక్కువ సమయం పరిశీలించి సాధారణ ప్రసవం చేసే అవకాశం ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. సిబ్బంది తక్కువగా ఉండడంతోనే సిజేరియన్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అత్యధికంగా నెలకు 400 వరకు ప్రసవాలు జరిగే జగిత్యాల ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు ముగ్గురు మాత్రమే ఉన్నారు. దీంతో ఇబ్బందికరంగా మారింది. దీంతో పాటు ఇటీవల రాయికల్ ఆస్పత్రిలో ఒకేరోజు 24 సిజేరియన్లు చేశారు. నిబంధనల ప్రకారం ఒక్క గైనకాలజిస్ట్ ఉన్నప్పుడు ఒకే రోజు అన్ని చేయడం ప్రమాదకరం. సమస్య లేకపోవడంతో ఇబ్బంది తలెత్తలేదు. ముహూర్తాలపై నమ్మకంతో.. చాలా మంది ముహూర్తాలపై నమ్మకంతో కోరుకున్న సమయంలో పిల్లలు పుట్టాలనే ఉద్దేశంతో టైం చూసుకుని మరీ సిజేరియన్లు చేయిస్తున్నారు. పురోహితులను సంప్రదించి తేదీ, సమయం తెలుసుకుని ఆపరేషన్ చేయించుకుంటున్నారని తెలుస్తున్నాయి. సాధారణ ప్రసవాల సంఖ్య పెంచుతాం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. ఎక్కువగా మొదటి కాన్పు సిజేరియన్ అయిన వారే ఆస్పత్రికి వస్తున్నారు. దీంతో తప్పకుండా రెండో కాన్పుకు సైతం సిజేరియన్ చేయాల్సి వస్తుంది. మొదటిసారి వచ్చిన వారికి సాధారణ కాన్పు అయ్యేలా వైద్యులు చూస్తున్నారు. అయినా సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగేలా చూస్తాం. – జైపాల్‌రెడ్డి, డెప్యూటీ డీఎంహెచ్‌వో -
కొత్తగా 26 ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులు
సాక్షి, హైదరాబాద్: బాలింతల ఆరోగ్య పరిరక్షణ లో వైద్య, ఆరోగ్య శాఖ మరో ముందడుగు వేస్తోంది. రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ బ్లడ్‌బ్యాంకులను ఏర్పాటు చేయనుంది. ఉత్తమ ప్రమాణాలతో కూడిన రక్తాన్ని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 26 బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేస్తోంది. అం దులో జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) ఆధ్వర్యంలో 13, రాష్ట్ర వైద్య విధాన పరి షత్ ఆధ్వర్యంలో మరో 13 బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో ఎన్హెచ్ఎం ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. భూపాలపల్లి, అచ్చంపేట, మల్కాజ్‌గిరిలోని బ్లడ్ బ్యాంకులను జనవరి 15న ప్రారంభించేందుకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ 26 కొత్త బ్లడ్ బ్యాంకుల్లో 6 నెలల్లోపు పూర్తి స్థాయి సేవలు ప్రారంభం కానున్నాయి. పేదలకు ఉపయోగపడేందుకు వీలుగా ప్రభుత్వ ఆస్పత్రుల ప్రాంగణంలోనే వీటి నిర్మాణం జరుగుతోంది. కాన్పు సమయంలో అధిక రక్తస్రావం జరిగే సందర్భాల్లో ఒక్కోసారి 2 నుంచి 10 యూనిట్ల వరకు రక్తం అవసరమవుతోంది. సరిపడా రక్తం అందుబాటులో లేకపోవడం వల్ల కొన్నిసార్లు బాలింత మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నారు. ‘ప్రైవేటు’కు అడ్డుకట్ట..! రాష్ట్రంలో ఏటా 4 లక్షల యూనిట్ల రక్తం అవసరముంటోంది. డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులు లేకపోవడంతో ప్రైవే టు వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రైవేటు బ్లడ్ బ్యాంకులు ఒక్కో యూనిట్‌కు దాదాపు రూ.3 వేల నుంచి 5 వేలు వసూ లు చేస్తున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని బ్లడ్ బ్యాంకులతో ఈ దోపిడీకి అడ్డకట్ట పడనుంది. వీటికి అనుబంధంగా 21 రక్త నిధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. రక్తాన్ని పరీక్షలు నిర్వహిం చి రక్త నిధి కేంద్రాల్లో భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరిచేలా వీటిని రూపొందిస్తున్నారు. ఉత్తమ ప్రమాణాలు.. కొత్త బ్లడ్ బ్యాంకుల నిర్మాణంలో నాణ్యత పరంగా ఎక్కడా రాజీ పడకూడదని అధికారులు నిర్ణయించారు. అధునాతన సాంకేతిక ప్రమాణాలతో వీటిని నిర్మిస్తున్నారు. 200 యూనిట్ల నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తున్న ఒక్కోబ్లడ్ బ్యాంకు కోసం గరిష్టంగా రూ.65 లక్షలు ఖర్చు చేస్తున్నా రు. ప్రభుత్వ, ప్రైవేటు కలిపి రాష్ట్రంలో 136 బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో ప్రస్తుతం 28 ఉన్నాయి. ఇప్పటికే ఉన్న వా టిని ఉత్తమ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు వైద్య, ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. అన్ని బ్లడ్ బ్యాంకులను దశలవారీగా నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ (ఎన్ఏబీహెచ్) ధ్రువీకరణ పొందేలా తీర్చి దిద్దుతోంది. కొత్త బ్లడ్ బ్యాంకులు.. జాతీయ ఆరోగ్య మిషన్: మలక్‌పేట, నాంపల్లి, నారాయణపేట్, అచ్చంపేట, మల్కాజ్గిరి, షాద్‌నగర్, బాన్సువాడ, భైంసా, పెద్దపల్లి, పరకాల, భూపాలపల్లి, ఏటూరునాగారం, మంథని. రాష్ట్ర వైద్య విధాన పరిషత్: నాగర్‌కర్నూల్, ఘట్కేసర్, కొండాపూర్, మెదక్, బోధన్, ఉట్నూరు, ఆసిఫాబాద్, గోదావరిఖని, నర్సంపేట, మహబూబాబాద్, ములుగు, భువనగిరి, కింగ్‌కోఠి (హైదరాబాద్). -
అమ్మఒడి కొందరికే!
సాక్షి, హైదరాబాద్: బాలింతలను, నవజాత శిశువులను సురక్షితంగా ఇళ్లకు చేర్చే ‘102’ వాహనాల సేవలు కొందరికే పరిమితమవుతున్నాయి. వైద్య, ఆరోగ్య శాఖ ప్రణాళికలేమితో కొన్ని ప్రాంతాల్లోనే ఈ సేవలు అమలవుతున్నాయి. కేసీఆర్ కిట్ పథకం ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు అయిన వారిని ఇళ్లకు చేర్చే సేవలను మాత్రం విస్తరించడంలేదు. దీంతో బాలింతను, శిశువును ఇళ్లకు తీసుకువెళ్లేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్‌లో భాగమైన జననీ సురక్ష యోజన నిధులతో రాష్ట్రం అమ్మఒడి కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. జీవీకే ఈఎంఆర్ఐ భాగస్వామ్యంతో ‘102’ వాహనాల సేవలను నిర్వహిస్తోంది. కేవలం 12 జిల్లాల్లోనే ఈ సేవలు అందుతున్నాయి. ప్రజా రవాణా వాహనాల్లో వెళ్లాల్సి రావడంతో కొన్నిసార్లు బాలింతలకు, నవజాత శిశువులకు ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయి. ఈ పరిస్థితిని తొలగించేందుకు అన్ని జిల్లాల్లో ‘102’ సేవలను ప్రారంభిస్తామని ఆరోగ్య శాఖ ప్రకటించినా.. ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదనే విమర్శలు పెరుగుతున్నాయి. -
ఆదిలోనే అంతం చేద్దాం!
► దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ, చికిత్సకు ప్రత్యేక కార్యాచరణ ► కేన్సర్, మధుమేహం, గుండె వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించే ఏర్పాట్లు ► బాధితులకు చికిత్స అందించేందుకు ప్రత్యేక వ్యవస్థ సాక్షి, హైదరాబాద్: పేదల జీవితాలను, కుటుంబాలను అతలాకుతలం చేస్తున్న దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ, చికిత్సపై వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యాచరణ మొదలుపెట్టింది. కేన్సర్, గుండె జబ్బులు, మధుమేహం, బీపీ.. వంటి దీర్ఘకాలిక వ్యాధులను ఆరంభంలోనే గుర్తించి చికిత్స అందించే ఏర్పాట్లు చేస్తోంది. జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) నిధులతో కేన్సర్, మధుమేహం, గుండె జబ్బుల నియంత్రణ జాతీయ కార్యక్రమం(ఎన్‌పీసీడీసీఎస్) పేరుతో ఈ కార్యక్రమం అమలవుతోంది. జనగామ, పెద్దపల్లి, సిద్ధిపేట, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, భూపాలపల్లి, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లో దీనిని అమలు చేస్తున్నారు. కాగా, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలను ఈ కార్యక్రమంలో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 1.23 లక్షల మందికి ప్రాథమిక పరీక్షలు జనగామ, పెద్దపల్లి, సిద్ధిపేట జిల్లాల్లో కలిపి ఇప్పటికే 1.23 లక్షల మందికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించి చికిత్స అవసరమైన వారిని గుర్తించారు. ఆందోళనకరంగా మధుమేహం, హైపర్ టెన్షన్(బీపీ) బాధితులు ఎక్కువ మంది ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. కేన్సర్ బాధితుల్లో ఎక్కువ మంది మహిళలే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గుండె జబ్బులకు సంబంధించి ముందస్తుగా గుర్తించే పరిస్థితి లేకపోవడం చికిత్స అందించేందుకు అడ్డంకిగా మారుతోందని వైద్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. అవగాహన కార్యక్రమాలు వాతావరణ మార్పులతో వచ్చే వ్యాధులు, ఇతర అంటు వ్యాధుల చికిత్స కోసం వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని ఆస్పత్రుల్లో చికిత్సలు అందుతున్నాయి. ఇలాంటి వ్యాధుల నియంత్రణకు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. మారుతున్న జీవనశైలితో దీర్ఘకాలిక వ్యాధుల(అంటురోగాలు కానివి)కు గురయ్యే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా మన దేశంలో కేన్సర్, మధుమేహం, గుండె జబ్బుల బాధితులు పెరుగుతున్నారు. ఈ వ్యాధుల బారిన పడిన వారికి చికిత్స పెద్ద సమస్యగా ఉంటోంది. వ్యాధులను గుర్తించడంలో ఆలస్యం జరగడం వల్ల ఎంత ఖర్చు చేసినా ఫలితం ఉండడంలేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ కోసం ఎన్‌పీసీడీసీఎస్ కార్యక్రమం మొదలుపెట్టింది. అన్ని స్థాయిల్లో వైద్య సిబ్బందికి శిక్షణ ఎన్‌పీసీడీసీఎస్ కార్యక్రమంలో మొదట అన్ని స్థాయిల్లోని వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తారు. అనంతరం సిబ్బంది గ్రామాలకు వెళ్లి ప్రజల వివరాలను, వారి ఆరోగ్య పరిస్థితులను సేకరిస్తున్నారు. వంశపారంపర్యంగా వచ్చే వ్యాధుల వివరాలను నమోదు చేస్తారు. ప్రాథమిక పరీక్షల అనంతరం వైద్యుల సూచన మేరకు సమీపంలోని వైద్య కేంద్రాలకు తీసుకువచ్చి రెండో స్థాయి పరీక్షలను నిర్వహిస్తారు. వ్యాధుల తీవ్రత మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఏరియా ఆస్పత్రి, జిల్లా ఆస్పత్రి, బోధన ఆస్పత్రిలో చికిత్స అందిస్తారు. ఇప్పటికే 9 జిల్లాల్లో స్క్రీనింగ్ పరీక్షలు జరిపిన వారి సంఖ్య 1.23 లక్షలు బీపీ ఉన్నవారి సంఖ్య 7,760 మధుమేహం ఉన్నవారి సంఖ్య 9,084 బ్రెస్ట్ కేన్సర్‌ఉన్నవారి సంఖ్య 253 నోటి కేన్సర్‌ఉన్నవారి సంఖ్య 886. -
రూ. 450 కోట్ల ఎన్హెచ్ఎం నిధులకు బ్రేక్
► ఈ ఏడాది నయాపైసా విడుదల చేయని కేంద్రం ► గతేడాది నిధులను సొంతానికి వాడుకోవడంపై ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.450 కోట్లకు బ్రేక్ పడింది. గతేడాది ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య కార్యక్రమాలకు కాకుం డా ఇతరత్రా తన ప్రాధాన్యాలకు వినియోగించుకోవడంపై కేంద్ర ప్రభుత్వం మండిపడింది. అందుకే 2016-17 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం తన వాటా రూ.450 కోట్లు విడుదల చేసే పరిస్థితి కనిపించడంలేదని, ఈ మేరకు కేంద్ర ఎన్హెచ్ఎం అధికారులు స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. ఫలితంగా ఎన్హెచ్ఎం కింద రాష్ట్రంలో చేపట్టిన అనేక ఆరోగ్య కార్యక్రమాలు, పథకాలకు నిధుల కటకట ఏర్పడింది. ఆ పథకం కింద పనిచేసే దాదాపు 10 వేల మంది సిబ్బందికి వేతనాలు ఇచ్చే పరిస్థితి లేకుండాపోయింది. 2016-17లో కేంద్ర ప్రభుత్వం ఎన్హెచ్ఎం కింద రాష్ట్రానికి రూ.750 కోట్ల వరకు కేటాయించింది. అందులో కేంద్రం వాటా రూ.450 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 6నెలలు గడిచాయి. కానీ, కేంద్రం తన వాటాలో ఒక్క పైసా విడుదల చేయలేదు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం తన వాటాగా విడుదల చేసిన సొమ్ములో ఇప్పటికీ రూ.300 కోట్లు తన వద్దే ఉంచుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇలా నిధులను ఇతరత్రా అవసరాలకు బదలాయించడంపై కేంద్రం ఆగ్రహంతో ఉంది. అందుకే ఈ ఏడాది నిధులను ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఈ విషయంపై గతంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు లేఖ రాశారు. స్వయంగా జోక్యం చేసుకొని నిధులు విడుదల చేయాలని సీఎంను కోరారు. అయినప్పటికీ నిధులు విడుదల చేయలేదు. దీంతో రాష్ట్రంలో జన ని సురక్ష యోజన(జేఎస్వై), జనని శిశు సురక్ష కార్యక్రమం(జేఎస్ఎస్కే), కుటుంబ నియంత్రణ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. వివిధ రకాల మందు లు, పరికరాల కొనుగోలుకు బ్రేక్ పడింది. పిల్లల టీకాలకు, గర్భిణులకు అందించే ఆరోగ్య సేవలకు విఘాతం ఏర్పడింది. ఎన్హెచ్ఎం కింద పనిచేసే 300 మంది డాక్టర్లు, 2 వేల మంది స్టాఫ్ నర్సులు, 5 వేల మంది ఏఎన్ఎంలు సహా ఇతరత్రా సిబ్బంది ఉన్నారు. వారికి నెలకు రూ. 15 కోట్లు వేతనాల కింద ఖర్చు చేయాల్సి ఉంటుంది. -
ఏపీలో కొత్తగా 14 పీహెచ్‌సీలు
హైదరాబాద్: జాతీయ ఆరోగ్యమిషన్ (ఎన్హెచ్ఎం) నిధులతో ఏపీలో మరో 14 కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ప్రజారోగ్యశాఖ పరిపాలనా అనుమతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఇందులో దొడ్డిపట్ల, అత్తిలి (పశ్చిమగోదావరి), కరప (తూర్పు గోదావరి), తాడిమర్రి, నార్పల, ముదిగుబ్బ (అనంతపురం), ముదినేపల్లి, రుద్రపాక, కల్లేటికోట, ఇందుపల్లి (కృష్ణా), అమృతలూరు, మాచవరం (గుంటూరు), గర్బామ్ (విజయనగరం), కురుచేడు (ప్రకాశం) జిల్లాలు ఉన్నాయి. ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రూ.1.18 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. ప్రస్తుతం రాష్ట్రంలో 1075 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. కొత్తగా రానున్న 14 పీహెచ్‌సీలతో ఈ సంఖ్య 1089 కి చేరనుంది. ఈ పీహెచ్‌సీలకు పూర్తిస్థాయిలో కేంద్రం నుంచే నిధులు రానున్నాయి. -
మళ్లీ పోలియో మహమ్మారి
* అంబర్‌పేట, నాగోలు నీటి శుద్ధి ప్లాంట్లలో బయటపడిన 2 కేసులు * ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మళ్లీ పోలియో వైరస్ వెలుగు చూసింది. నాలుగు నెలల్లోనే మళ్లీ పోలియో వైరస్ వెలుగు చూడటంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. సరిగ్గా గత జూన్ నెలలో అంబర్‌పేట మురుగునీటి నాలాలో పోలియో వైరస్ బయటపడిన సంగతి తెలిసిందే. మళ్లీ అంబర్‌పేట, నాగోలుల్లోని మురుగునీటి శుద్ధి ప్లాంట్లలో టైప్-2 వ్యాక్సిన్ వైరస్ బయటపడిందని జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) ప్రత్యేకాధికారి డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. అయితే ఇది ప్రమాదకారి కాదని ఆయన వివరించారు. గత నెల 28వ తేదీన అంబర్‌పేట, నాగోలుల్లోని మురుగునీటి శుద్ధిప్లాంట్ల నుంచి శాంపిళ్లను సేకరించి ముంబైలోని ఈఆర్ఎస్ లేబరేటరీకి పరీక్షల నిమిత్తం పంపించారు. ఆ పరీక్షల్లో రెండు చోట్ల కూడా పోలియో వైరస్ ఉన్నట్లు తేలింది. దీంతో ఒక్కసారిగా అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరా తీస్తోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్రమత్తం చేసింది. భారత్‌ను పోలియో రహిత దేశంగా ప్రకటించాక సంబంధిత వైరస్ హైదరాబాద్‌లో నాలుగు నెలల్లోనే రెండుసార్లు వెలుగు చూడటంతో వైద్య ఆరోగ్యశాఖపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మనుషుల్లో కాకుండా మురికి నీళ్లలో ఈ వైరస్ రావడానికి గల కారణాలపై పరిశోధన జరుగుతోంది. పోలియో వైరస్ వెలుగు చూసిన నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గురువారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన వైద్యాధికారులు, ఔషధ నియంత్రణ అధికారులు, మిలటరీ, రైల్వే, ఆర్టీసీ, ఐపీఎం అధికారులు హాజరయ్యారు. ఎలాంటి వైరస్ ఇది..? ఎలా వచ్చింది..? ఈ ఏడాది ఏప్రిల్ 25వ తేదీ వరకు రాష్ట్రంలో ట్రైవలెంట్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ (నోటి ద్వారా వేసే వ్యాక్సిన్-టీవోపీవీ)ను పిల్లలకు వేసేవారు. ఆ తర్వాత నుంచి దాన్ని నిషేధించారు. ఎందుకంటే నోటిద్వారా వేసే వ్యాక్సిన్‌లో బతికున్న పోలియో వైరస్ ఉంటుంది. అది సురక్షితం కాదని ఆ తర్వాత నుంచి ఇంజెక్షన్ రూపంలో వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే టీవోపీవీ వ్యాక్సిన్‌ను ఇంకా కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎక్కడైనా ఉంచి ఉంటారని అనుమానిస్తున్నారు. వాటిని విచ్చలవిడిగా బయట పారేయడం వల్లే ఇప్పుడు పోలియో వెలుగు చూసిందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదకరమైన దీన్ని వేడినీళ్లలో మరగించి ప్రత్యేక పద్ధతుల్లో నాశనం చేయాలి. కానీ వైద్యాధికారుల నిర్లక్ష్యం వల్లే ఇది మురుగునీటిలోకి వెళ్లిందని అధికారులు చెబుతున్నారు. నేటి నుంచి మూడు రోజులు ప్రత్యేక డ్రైవ్ ఈ వైరస్ మురుగు నీటిలోనే ఉండి పోయిందా? మురుగు నీటి నుంచి తాగునీటిలో కలిసి పిల్లలెవరికైనా సోకిందా? అన్న అనుమానాలు వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 3 జిల్లాల్లోని జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎక్కడైనా టైప్-2 వ్యాక్సిన్ ఇంకా ఉంటే.. వాటిని గుర్తించి నాశనం చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం శుక్రవారం నుంచి ఆదివారం వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. వివిధ శాఖలకు చెందిన 800 మంది సిబ్బంది ఇందులో పాల్గొంటారు. -
రూ.3వేల కోట్ల గ్రాంట్లు నిలిపివేత
- రావాల్సిన నిధులను విడుదల చేయని కేంద్రం - సంక్షోభంలో వైద్య ఆరోగ్యశాఖ పథకాలు - కొన్ని విభాగాల్లో జీతాలకూ కటకట సాక్షి, హైదరాబాద్ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సుమారు రూ.3 వేల కోట్లపైనే నిలిపివేశారు. దీంతో రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖలో అమలవుతున్న పలు పథకాలు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. కొన్ని విభాగాల్లో జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో విడుదల కావాల్సిన ప్రధానమంత్రి స్వాస్థీయ సురక్ష యోజన (పీఎంఎస్ఎస్వై) పథకానికి చెందిన సుమారు రూ.400 కోట్లు పైనే ఇప్పటివరకూ రాలేదు. విశాఖపట్నంలో మెడ్‌టెక్ పార్క్ జోన్ ఏర్పాటుకు రూ.92 కోట్లు రాష్ట్రమిస్తే, మరో రూ.92 కోట్లు కేంద్రం ఇవ్వాల్సి ఉంది. అయితే నేటికీ కేంద్రం రావాల్సిన నిధులివ్వలేదు. ఇక జాతీయ ఆరోగ్యమిషన్ నిధులు కూడా సకాలంలో రాలేదు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ మండలి నుంచి వచ్చే నిధులు రాకపోవడంతో రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉంది. నిధులివ్వాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ గత మూడు మాసాల్లో నాలుగు లేఖలిచ్చినా కేంద్రం వీటిని చెత్తబుట్టలో వేసినట్టు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో పథకాల అమలు తీరు, నిధుల వ్యయంపై ఇప్పటికే కేంద్రం పలుసార్లు హెచ్చరించింది. ఇటీవల కేంద్రం నుంచి రూ.56 కోట్లు పట్టణ ఆరోగ్యం మెరుగు పర్చండి అని నిధులిస్తే.. ఏకంగా ఈ - యూపీహెచ్సీల పేరుతో ప్రైవేటుకు అప్పజెప్పారు. అలాగే పథకాల నిర్వహణను ఆఫ్‌లైన్ టెండర్ల ద్వారా పిలిచి అప్పగించడం, జాతీయ ఆరోగ్యమిషన్ నిధుల వ్యయంపై రసీదులు, వోచర్లు ఇవ్వకపోవడం వంటివాటిపై కేంద్రం పలు అనుమానాలు వ్యక్తం చేసింది. ఆరోగ్యశాఖలో పథకాలన్నీ కేంద్ర నిధులతోనే రాష్ట్రంలో అమలవుతున్న 95 శాతం ఆరోగ్య పథకాలన్నీ కేంద్రం ఇచ్చే నిధులతోనే నడుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ పథకాలకు చేస్తున్న వ్యయం, దానికి సంబంధించిన లెక్కల్లో పారదర్శకత లేదని అధికార వర్గాలే చెబుతున్నాయి. జిల్లాల నుంచి గత మూడేళ్లలో ఖర్చు చేసిన వ్యయాలకు సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లు కూడా ఇప్పటికీ సరిగా లేవు. ఇలా ప్రతి పథకంలోనూ ఏదో ఒక అవకతవకలు జరగడం, లేదా సరిగా అమలు చెయ్యకపోవడం వల్లే కేంద్రం నిధులు ఇవ్వడం లేదని తెలుస్తోంది. కేంద్రం నుంచి సకాలంలో నిధులు రాకనే రాష్ట్రంలో ఈ పరిస్థితి నెలకొందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. -
నేషనల్ హెల్త్ మిషన్‌లో
141 పోస్టులు నేషనల్ హెల్త్ మిషన్‌లో భాగంగా హిమాచల్‌ప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో (బ్లాకుల్లో) కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేసేందుకు కావాల్సిన సిబ్బంది నియామకానికి మిషన్ డెరైక్టర్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. కాంట్రాక్ట్ గడువును 31-3-2017గా పేర్కొన్నారు. అభ్యర్థి పనితీరు, డిపార్ట్మెంట్ అవసరాలకు అనుగుణంగా ఈ వ్యవధిని పెంచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్‌లోని సమగ్ర వివరాలు.. నేషనల్ హెల్త్ మిషన్‌లో భాగంగా హిమాచల్‌ప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో (బ్లాకుల్లో) కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేసేందుకు కావాల్సిన సిబ్బంది నియామకానికి మిషన్ డెరైక్టర్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. కాంట్రాక్ట్ గడువును 31-3-2017గా పేర్కొన్నారు. అభ్యర్థి పనితీరు, డిపార్ట్మెంట్ అవసరాలకు అనుగుణంగా ఈ వ్యవధిని పెంచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్‌లోని సమగ్ర వివరాలు.. ఖాళీల వివరాలు: మొత్తం వేకెన్సీ 141 కాగా అవి పోస్టుల వారీగా.. 1. ఆయుష్ మెడికల్ ఆఫీసర్ (మేల్)-35 2. ఆయుష్ మెడికల్ ఆఫీసర్ (ఫిమేల్)-33 3. ఫార్మాసిస్ట్-35 4. ఫిమేల్ హెల్త్ వర్కర్-38 వేతనం: మెడికల్ ఆఫీసర్ (మేల్, ఫిమేల్)కు నెలకు రూ.19,125. ఫార్మాసిస్ట్‌కు రూ.8,910. ఫిమేల్ హెల్త్ వర్కర్‌కు రూ.8,710. వయసు: నాలుగు రకాల పోస్టులకూ 18-45 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హత: మెడికల్ ఆఫీసర్ (మేల్, ఫిమేల్) పోస్టులకు ఆయుర్వేదలో ఐదేళ్ల డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ (సీసీఐఎం) ఇంటర్న్‌షిప్ చేసుండాలి. ఫార్మాసిస్ట్ పోస్టుకు 10+2లో సైన్స్ లేదా తత్సమాన విద్యార్హతతోపాటు బ్యాచిలర్ డిగ్రీ/డిప్లొమా ఇన్ ఫార్మసీ లేదా తత్సమాన విద్యార్హత. స్టేట్/సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టరై ఉండాలి. ఫిమేల్ హెల్త్ వర్కర్ పోస్టుకు సైన్స్ సబ్జెక్టుతో మెట్రిక్యులేషన్/హయ్యర్ సెకండరీ పార్ట్-1 ఉత్తీర్ణత లేదా తత్సమానం. ఫిమేల్ హెల్త్ వర్కర్‌గా ఏడాదిన్నర పాటు శిక్షణ పొందినట్లు సర్టిఫికెట్ ఉండాలి. పైన పేర్కొన్న నాలుగు రకాల పోస్టులకూ సాంకేతిక విద్యార్హతకు సంబంధించి కంప్యూటర్/ల్యాప్‌ట్యాప్‌లో ఎంఎస్ వర్డ్ పరిజ్ఞానం అవశ్యం. హిమాచల్‌ప్రదేశ్ మాండలికాలు, అక్కడి ప్రజల తీరుతెన్నులు తెలిసుండాలి. ఎంపిక విధానం: జిల్లా కేంద్రాల్లో నిర్వహించే ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు. సంబంధిత కోర్సుల్లో పొందిన మార్కులు, వృత్తికి సంబంధించిన పూర్వానుభవాన్ని బట్టి ‘ఒక పోస్టుకు ఐదుగురు అభ్యర్థులు’ చొప్పున ఇంటర్వ్యూకు పిలుస్తారు. దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనాలో పూర్తిచేసిన దరఖాస్తులను సంబంధిత జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్‌కు పంపాలి. దరఖాస్తు రుసుం: జనరల్ అభ్యర్థులు రూ.200; ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు రూ.100 డీడీ తీసి దరఖాస్తుకు జత చేయాలి. చివరి తేదీ: 2016, ఆగస్టు 20 వెబ్సైట్: అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకునేందుకు, ఇతర వివరాల కోసం www.nrhmhp.gov.in చూడొచ్చు. -
పైలేరియా మందుల పంపిణీని విజయవంతం చేయాలి
జాతీయ ఆరోగ్య మిషన్ రీజినల్ డైరెక్టర్ అనురాధ నర్మెట : ప్రభుత్వం చేపట్టిన పైలేరియా మందుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జాతీయ ఆరోగ్య మిషన్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ అనురాధ మేడోజు అన్నారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో గురువారం నులిపురుగుల నివారణ మందుల పంపిణీని ఆమె పరిశీలించారు. తొలుత ఆర్డీ అనురాధ స్థానిక పీహెచ్‌సీలోని రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బోదకాలు నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. దోమకాటుతో వచ్చే బోదకాలు నివారణ మాత్రలు ప్రతీ ఒక్కరూ వేసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి, వరంగల్‌లో మాత్రమే బోదకాలు వ్యాధి తీవ్రత ఉందని, దీనిపై వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వరంగల్ జిల్లాలో 17 పీహెచ్‌సీల పరిధిలో మాత్రమే సమస్య ఉందన్నారు. ప్రజలు తమ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి ఆమె నులి పురుగుల నివారణ మాత్రలు వేసుకున్నారు. కార్యక్రమంలో ఎస్పీహెచ్ఓ పి.కరుణాకర్‌రాజు, క్లస్టర్ ఇ¯Œæచార్జి వీరబాబు, ఫాతిమాబేగం, రహమాన్, ఏఎన్ఎంలు సునంద, కరుణ, ఆశకార్యకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
సగానికి పైగా షెడ్డుకే..
- 31,260 వైద్య పరికరాలకుగాను... 18 వేలు పనిచేయనివే - ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుంటుపడిన వైద్య ఆరోగ్య సేవలు సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ ఆసుపత్రులు రోజురోజుకూ కునారిల్లుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సగానికిపైగా సాధారణ పరికరాలు సహా వైద్య పరికరాలు మూలనపడి ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తాజాగా గుర్తించింది. అవి ఏమాత్రం పనిచేయడం లేదని అధికారులు గుర్తించారు. ఏసీలు మొదలు మైక్రోస్కోపులు, బ్లడ్ సెల్ కౌంటర్లు, క్లినికల్ థర్మామీటర్, డీప్ ఫ్రీజర్, డెలివరీ టేబుళ్లు, డయాగ్నోస్టిక్ ఆల్ట్రాసౌండ్ మిషన్, డయాలసిస్ మిషన్, డిస్టిల్డ్ వాటర్ ప్లాంట్, ఈసీజీ రికార్డర్, ఐ స్లిట్ ల్యాంప్ బయో మైక్రోస్కోప్, గ్లూకోమీటర్, ఇన్ఫాంట్ కేర్ ట్రాలో, ఇన్ఫాంట్ రేడియంట్ వార్మర్లు అనేకం మరమ్మతుల్లో ఉన్నాయి. ఇనుస్ట్రుమెంట్ స్టెరిలైజర్, ఆక్సిజన్ కాన్సెంట్రేటర్, పేషెంట్ స్ట్రెచర్ ట్రాలీ వంటివీ మరమ్మతుల్లో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 31,260 వైద్య పరికరాలు, ఇతరత్రా నాన్ మెడికల్ పరికరాలున్నాయి. వాటిల్లో 18 వేల పరికరాలు (60%) మరమ్మతుల్లో ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తేల్చింది. రోగులను తరలించే స్ట్రెచర్లు మొదలు కొని ఈసీజీ, ఆల్ట్రాసౌండ్ తదితర 360 రకాల పరికరాల స్థితిగతులపై ఆ శాఖ నివేదిక తెప్పించుకుంది. అందులో 60 శాతం వరకు మరమ్మతులకు గురయ్యాయని నిర్ధారించింది. మరమ్మతు బాధ్యత ఒకే కంపెనీకి... కొత్త వాటిని కొనుగోలు చేయడం, ఉన్న వాటిని బాగు చేయడం కోసం ప్రభుత్వం నడుం బిగించింది. ముందుగా వైద్య పరికరాల నిర్వహణ, మరమ్మతుల బాధ్యతను ఔట్ సోర్సింగ్ ద్వారా ఒక కంపెనీకి అప్పగించాలని నిర్ణయించింది. ఐదేళ్ల వరకు ఆ కంపెనీయే నిర్వహణ, మరమ్మతు బాధ్యత తీసుకుంటుంది. ఇందుకోసం జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద రూ. 20 కోట్లు మంజూరు చేసింది. తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) ద్వారా ఈ టెండర్ల ప్రక్రియ చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. అయితే ఒకే ఒక కంపెనీకి అప్పగించడం వల్ల వేలాది పరికరాలను వారెంత వరకు సక్రమంగా నిర్వహిస్తారోనన్న విమర్శలూ ఉన్నాయి. -
మొబైల్ హెల్త్ వాహనాలు ప్రారంభం
నల్లగొండ టౌన్: గ్రామీణ స్థాయిలోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లోని విద్యార్థులకు వైద్య పరీక్షలను నిర్వహించడానికి జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్బీఎస్కే పథకం కోసం సమకూర్చిన మొబైల్ వాహనాలను మంగళవారం కలెక్టర్ పి.సత్యనారాయణరె డ్డి తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించడంలో నిర్లక్ష్యం తగదన్నారు. చిన్నారుల ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ద తీసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా వై ద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ భానుప్రసాద్‌నాయక్ మాట్లాడుతూ జిల్లాలోని 15 క్లస్టర్లకు గాను ఒక్కో క్లస్టర్‌కు రెండు వాహనాల చొప్పున 30 వాహనాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఒక్కో మొబైల్ వాహనంలో ఇద్దరు డాక్టర్లు ఫార్మసిస్ట్, ఏఎన్ఎం టీంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ అరుంధతి, డాక్టర్ లలితాదేవి, జిల్లా మలేరియా అధికారి ఓంప్రకాష్, జిల్లా మాస్‌మీడియా అధికారి జి.తిరుతపయ్య, నర్సింహ పాల్గొన్నారు. -
ఆరోగ్య మిషన్ నిధులు పక్కదారి
- రాష్ట్రంలో ఆరోగ్య కార్యక్రమాలు సరిగా అమలు కావడంలేదు - కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ మనోజ్ జలానీ అసంతృప్తి - తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష సాక్షి, హైదరాబాద్ : జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించడంపై కేంద్రం మండిపడింది. కేంద్రం ఆధ్వర్యంలో రాష్ట్రంలో చేపడుతున్న వివిధ వైద్య,ఆరోగ్య పథకాలు కుంటుపడుతున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ మనోజ్ జలాని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్ వచ్చిన ఆయన సచివాలయంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో ఎన్హెచ్ఎం కార్యక్రమాల అమలుతీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మను కలిశారు. కేంద్రం విడుదల చేసిన ఎన్హెచ్ఎం నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానాలో వేసుకుందని, వాటిని విడుదల చేయడం లేదని అన్నట్లు తెలిసింది. వాటా విడుదల చేయకుంటే కష్టమే రాష్ట్రంలో జనని సురక్ష యోజన(జేఎస్వై), జనని శిశు సురక్ష కార్యక్రమం(జేఎస్ఎస్కే), కుటుంబ నియంత్రణ, ‘ఆశ’ కార్యకర్తలకు జీతాలు, వివిధ రకాల మందులు, పరికరాల కొనుగోలుకు ఎన్హెచ్ఎం కింద రాష్ట్రానికి విడుదలైన నిధులు ఏమయ్యాయని మనోజ్ జలాని నిలదీసినట్లు తెలిసింది. ఎన్హెచ్ఎం కింద గతేడాది రూ.143.28 కోట్లను కేంద్రం విడుదల చేసిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వవాటాతో కలిపి ఎన్హెచ్ఎంకు రూ. 458 కోట్లు సమకూరాల్సి ఉందని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోవడంతో జేఎస్వై కింద ఆసుపత్రిలో ప్రసవించిన తల్లులకు ఇవ్వాల్సిన రూ.వెయ్యి ప్రోత్సాహకానికి ఇబ్బందులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. జేఎస్ఎస్కే, కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు కుంటుపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆరోగ్య రంగానికి సంబంధించిన అత్యవసర నిధులను పక్కదారి పట్టించడంపట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా రాష్ట్ర వాటాను విడుదల చేయాలని రాజీవ్‌శర్మను కోరినట్లు తెలిసింది. సమీక్ష సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి, కుటుంబ సంక్షేమ కమిషనర్ జ్యోతి బుద్ధ ప్రకాష్, ఎన్హెచ్ఎం రాష్ట్ర ప్రత్యేకాధికారి డాక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
నవజాత శిశువులకు బేబీకేర్ కిట్స్
జూలై 1 నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా పంపిణీ గుంటూరు మెడికల్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవమయ్యే పసికందులకు జూలై 1వ తేదీ నుంచి బేబీకేర్ కిట్స్‌ను అందించనున్నారు. ఈ మేరకు బుధ వారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్యులు విడుదల చేశారు. పసికందులకు దోమతెర, చేతుల పరిశుభ్రం చేసుకునే స్క్రబ్, బేబిని గుడ్డలో చుట్టి ఉంచేందుకు రెండు బేబిరేపర్లు, ప్లాస్టిక్కిట్ బ్యాగ్ మొత్తం రూ.600 ఖరీదు చేసే కిట్‌ను అందిస్తారు. నేషనల్ హెల్త్ మిషన్, ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్చన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు సంయుక్తంగా ఈ కిట్లను అందించనున్నారు. పుట్టకతో సంభవించే శిశు మరణాలు తగ్గించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కిట్లను అందిస్తుంది. ఏడాదిలో సుమారు ఐదు లక్షల కాన్పులు జరుగుతాయని, అందుకోసం రూ.30 కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం నిర్ధారణ చేసి రూ.10 కోట్లు నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా, రూ.20 కోట్లు కార్మికశాఖ సంక్షేమ బోర్డు ద్వారా విడుదల చేయనున్నారు. -
వైద్య పోస్టుల భర్తీపై నీలినీడలు!
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్కే)లో భాగంగా జిల్లాల్లో వైద్య ఉద్యోగ ఖాళీలను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేసే ప్రక్రియపై నీలినీడలు కమ్ముకున్నాయి. కలెక్టర్ చైర్మన్‌గా జిల్లా స్థాయి ఎంపిక కమిటీ ద్వారా చేపట్టే ఈ నియామకాల్లో గందరగోళం నెలకొంది. ఫలితంగా ఒక్క మెదక్ జిల్లా మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో మొత్తం ప్రక్రియకే బ్రేక్ పడింది. వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది నియామకానికి అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. వైద్యుల పోస్టులు రాష్ట్రస్థాయివి కావడం, నర్సుల పోస్టులు జోనల్ స్థాయివి కావడంతో సంబంధిత జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల వారూ దరఖాస్తు చేసుకున్నారు. వేలల్లో దరఖాస్తులు వ చ్చిపడ్డాయి. ప్రతిభ ఆధారంగా ఉద్యోగం పొందిన వారు దరఖాస్తు చేసుకున్న జిల్లాల్లో విధుల్లో చేరగా.. చాలా మంది ఉద్యోగాల్లో చేరలేదు. అల్లోపతికి చెందిన వారు చాలాచోట్ల చేరలేదని తెలిసింది. ఆర్బీఎస్కే పోస్టులను భర్తీ చేయకుండా, అందుకు కేటాయించిన రూ.65 కోట్లు ఖర్చు చేయకుండా ఎన్హెచ్ఎం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎన్హెచ్ఎం సమావేశంలో రాష్ట్ర అధికారులపై మండిపడినట్లు తెలిసింది. మొత్తం 1,330 పోస్టులు.. 16 ఏళ్లలోపు పిల్లల్లో 30 రకాల వ్యాధులను గుర్తించడం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అన్ని జిల్లాల్లో 150 కమ్యూనిటీ హెల్త్, న్యూట్రిషన్ క్లస్టర్ల (సీహెచ్ఎన్సీ)ను ఏర్పాటు చేయాలనేది దీని ఉద్దేశం. ఒక్కో క్లస్టర్ కింద రెండు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 300 హెల్త్ టీంలు సేవలు అందిస్తాయి. ఇందుకోసం 630 ఎంబీబీఎస్, ఆయుష్ డాక్టర్ పోస్టులు, 300 ఏఎన్ఎం, 300 ఫార్మసిస్టు, మరో 100 పోస్టుల్లో ఫిజియోథెరఫిస్టులు, స్టాఫ్ నర్సులు, సైకాలజిస్టు తదితర 1,330 పోస్టులను భర్తీ చేయాలి. వీరు వైద్య సేవలు అందించడానికి జిల్లాకొక డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ (డీఈఐసీ)ను ఏర్పాటు చేస్తారు. ఆయా కేంద్రాల్లో ఒక పిల్లల వైద్య నిపుణుడు, ఎంబీబీఎస్ మెడికల్ ఆఫీసర్, ఒక డెంటల్ మెడికల్ ఆఫీసర్ ఉంటారు. మొత్తం 1,330 పోస్టులను జిల్లా ఎంపిక కమిటీ ద్వారా పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా ప్రతిభ ఆధారంగా భర్తీ చేస్తారు. అయితే అన్ని జిల్లాల్లోనూ నోటిఫికేషన్లు జారీ చేసి భర్తీ ప్రక్రియ చేపట్టారే కానీ సరైన ప్రణాళిక లేకపోవడంతో అడ్డంకులు ఏర్పడ్డాయి. మళ్లీ చేపడతాం మెదక్ జిల్లాలో ఆర్బీఎస్కే ప్రక్రియలో భాగంగా మొత్తం పోస్టులను భర్తీ చేశాం. అయితే మిగతా చోట్ల వివిధ జిల్లాలకు చెందిన వారు మూడునాలుగు చోట్ల దరఖాస్తు చేయడం, అన్నిచోట్లా ఉద్యోగం పొంది ఒక చోట చేరడంతో నియామక ప్రక్రియలో సమస్యలు తలెత్తాయి. ఈసారి అన్ని జిల్లాల్లో ఒకేరోజు జాబితా తయారుచేసి, ఒకేరోజు కౌన్సెలింగ్ నిర్వహించి.. పాత నోటిఫికేషన్ ఆధారంగానే భర్తీ చేపడతాం. - రాజేశ్వర్ తివారీ, ముఖ్య కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ -
ఆదర్శ ఆరోగ్య జిల్లాలుగా మెదక్, మహబూబ్‌నగర్
ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలను ఆదర్శ ఆరోగ్య జిల్లాలుగా కేంద్రం ఎంపిక చేసింది. ఆ జిల్లాల్లోని ప్రాథమిక ఆస్పత్రుల నుంచి జిల్లా ఆస్పత్రుల వరకు అన్నింటినీ ఆదర్శంగా తీర్చిదిద్దాలనేది కేంద్రం ఉద్దేశం. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద వీటిని ఎంపిక చేశారు. వీటిని ఆదర్శంగా తీర్చిదిద్దడంలో కేంద్రం 60% నిధులిస్తుంది. మిగిలిన 40% నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఆయా జిల్లాల్లో ఇటీవల పర్యటించి ఆస్పత్రుల్లో పరిస్థితిని పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సర్కారు దవాఖానాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దాలన్న వైఖరితో ఉన్నందున రెండు జిల్లాలు ఆదర్శ ఆరోగ్య జిల్లాలుగా ఎంపిక కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రెండేళ్లలో ఈ రెండు జిల్లాల ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు కేంద్రం రూ.5 కోట్ల చొప్పున విడుదల చేయనుంది. మెదక్ జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో లేబర్ రూం వసతులు, డెలివరీలు, మాతా శిశు సంరక్షణ తదితర అంశాలను గుర్తించి దాన్ని ఆదర్శ ఆరోగ్య జిల్లాగా ఎంపిక చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాను వైద్య పరంగా వెనుక బాటును లెక్కలోకి తీసుకుని ఆదర్శ ఆరోగ్య జిల్లాగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. కేంద్ర ప్రకటన నేపథ్యంలో ఆ రెండు జిల్లాల్లోని ఆసుపత్రుల్లో ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. -
కుటుంబానికి రూ. లక్ష ఆరోగ్య బీమా
వైద్య రంగానికి రూ. 38,206 కోట్లు సీనియర్ సిటిజన్లకు అదనంగా రూ. 30 వేల వరకు ప్యాకేజీ జాతీయ ఆరోగ్య మిషన్‌కు 19వేల కోట్లు కిడ్నీ రోగులపై కరుణ ♦ జాతీయ డయాలసిస్ సేవలకు శ్రీకారం ♦ అన్ని జిల్లా ఆస్పత్రుల్లో డయాలసిస్ సేవలు ♦ దేశవ్యాప్తంగా 3 వేల జన్ఔషధి స్టోర్లు న్యూఢిల్లీ: పేదలు (దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలు), ఆర్థికంగా వెనకబడిన కుటుంబాల ఆరోగ్య భద్రతపై బడ్జెట్లో కేంద్రం కరుణ చూపింది. వారి కోసం కొత్త ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడుతూ పేద, ఆర్థికంగా వెనకబడిన కుటుంబాల ఆరోగ్య భద్రత కోసం రూ. లక్ష విలువైన ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెడతామన్నారు. ఆయా కుటుంబాల్లోని సీనియర్ సిటిజన్ల కోసం (60 ఏళ్లు, అంతకన్నా పైబడిన వ్యక్తులు) రూ. 30 వేల టాప్ అప్ ప్యాకేజీని అందిస్తామన్నారు. ‘‘కుటుంబ సభ్యుల్లో ఎవరైనా తీవ్ర అనారోగ్యానికి గురైతే అది ఆ కుటుంబంపై పెను ఆర్థిక భారం మోపడమే కాకుండా వారి ఆర్థిక భద్రతను దెబ్బతీస్తుంది. అందుకే ఆ కుటుంబాలను ఆదుకునేందుకు కొత్త ఆరోగ్య పథకం తెస్తాం’’ అని జైట్లీ పేర్కొన్నారు. ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం తర్వాత ప్రకటించనుంది. జాతీయ ఆరోగ్య మిషన్‌కు రూ. 19,037 కోట్లు కేటాయించారు. ఆరోగ్య రంగానికి రూ. 38,206 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ.4,375 కోట్లు ఎక్కువ. అలాగే ఢిల్లీలోని ఎయిమ్స్‌కు రూ. 2,043 కోట్లు, జాతీయ ఎయిడ్స్ నియంత్రణకు 1,700 కోట్లు కేటాయించారు. న్యూఢిల్లీ: కిడ్నీ రోగులపై బడ్జెట్లో కేంద్రం ఉదారత చాటుకుంది. క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకోవడం అవసరమైన రోగులకు ఆర్థికంగా, శారీరకంగా ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయాలు తీసుకుంది. జాతీయ డయాలసిస్ సేవల కార్యక్రమాన్ని ప్రారంభించి దీని కింద అన్ని జిల్లా ఆస్పత్రుల్లో రోగులకు డయాలసిస్ సేవలు అందించనుంది. అలాగే డయాలసిస్ పరికరాల్లోని కొన్ని భాగాలను బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, ఎక్సైజ్ లేదా కౌంటర్వెయిలింగ్ డ్యూటీ, స్పెషల్ అడిషనల్ డ్యూటీ నుంచి మినహాయిస్తామని ప్రతిపాదించింది. ‘‘దేశంలో ఏటా కిడ్నీల వైఫల్యంతో 2.2 లక్షల మంది బాధపడుతుంటే దేశవ్యాప్తంగా సుమారు 4,950 డయాలసిస్ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా ప్రైవేటు రంగంలో, ప్రధాన నగరాలు/పట్టణాల్లోనే కేంద్రీకృతమయ్యాయి. దీంతో 3.4 కోట్ల డయాలసిస్ సెషన్లకు అదనపు డిమాండ్ ఏర్పడుతోంది. ఒక్కో డయాలసిస్ సెషన్‌కు రూ. 2 వేల ఖర్చవుతుండగా ఏటా ఈ ఖర్చు రూ. 3 లక్షలు దాటుతోంది. డయాలసిస్ కోసం రోగుల కుటుంబాలు తరచూ దూరప్రాంతాలకు ప్రయాణించాల్సి రావడం వల్ల ప్రయా ణ ఖర్చులు మోపెడవుతున్నాయి. దీంతో వారు రోజువారీ వేతనాలూ నష్టపోతున్నారు. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని జాతీయ డయాలసిస్ సేవల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నాం’’ అని జైట్లీ పేర్కొన్నారు. అన్ని జిల్లా ఆస్పత్రుల్లో డయాలసిస్ సేవలు అందించేందుకు పీపీపీ విధానంలో నిధుల సమీకరణ చేపడతామన్నారు. నాణ్యమైన జనరిక్ మందులను చవకగా ఇచ్చేందుకు ప్రధానమంత్రి జన్ఔషధి యోజన కింద 3 వేల స్టోర్లను ఏర్పాటు చేస్తామన్నారు. -
ఏటా 25 వేల మంది
రాష్ట్రంలో భీతి గొలుపుతున్న శిశు మరణాలు ♦ నెలలు నిండని ప్రసవాలే కారణం ♦ అందులో 60 శాతం నవజాత శిశువులే ♦ వీటి తగ్గింపునకు కార్యాచరణ ప్రణాళిక ♦ ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌లకు ప్రాధాన్యం ♦ ‘2016ను నవజాత శిశు సంవత్సరం’గా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: నెలలు నిండని ప్రసవాల వల్లే నవజాత శిశు మరణాలు సంభవిస్తున్నాయి. తొమ్మిది నెలలకు కాకుండా ఏడెనిమిది నెలలకే శిశువు పుట్టడం.. బరువు తక్కువగా ఉండటం.. తద్వారా రోగనిరోధక శక్తి లేకపోవడం వంటి కారణాలతోనే శిశువులు చనిపోతున్నారు. దేశంలో ప్రతీ వెయ్యి మందికి 28 మంది నవజాత శిశువులు మరణిస్తుంటే.. రాష్ట్రంలో ఆ సంఖ్య 25గా ఉంది. దక్షిణ భారత దేశంతో పోలిస్తే రాష్ట్రంలో నవజాత శిశు మరణాల రేటు ఎక్కువే. దీన్ని పది లోపు(ఒకే అంకె)నకు తీసుకురావాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. అందుకోసం ‘2016ను నవజాత శిశు సంవత్సరం’గా ప్రకటించింది. తద్వారా తల్లుల్లో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడంతోపాటు పెద్దఎత్తున కార్యక్రమాల రూపకల్పనకు నడుం బిగించింది. దీనికి యునిసెఫ్‌తోపాటు జాతీయ ఆరోగ్య మిషన్ సహకారం తీసుకోనుంది. ఏడాదికి 25 వేల శిశు మరణాలు రాష్ట్రంలో ఏటా సరాసరి 6.30 లక్షల మంది శిశువులు పుడుతుండగా, అందులో 25 వేల మంది మరణిస్తున్నారు. ఏడాదిలోపు శిశు మరణాల రేటు 39 ఉండగా, 28 రోజుల్లోపు చనిపోయే నవజాత శిశు మరణాల రేటు 25గా ఉంది. అంటే ఏడాదిలో చనిపోయే శిశువుల్లో 60 శాతం మంది నవజాత శిశువులే ఉంటున్నారు. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గిరిజన, మారుమూల ప్రాంతాల్లో ఇది అధికంగా ఉంది. మహిళల్లో పౌష్టికాహార లోపం, బాల్య వివాహాలు, పేదరికం వల్లే నవజాత శిశు మరణాలు అధికంగా ఉంటున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. పుట్టిన శిశువు అనారోగ్యానికి గురైతేనే వైద్యులను సంప్రదిస్తున్నారు. అలాకాకుండా ముందుగానే వైద్యులను సంప్రదించే పరిస్థితి పల్లెల్లో ఉండటంలేదు. యుక్త వయసు నుంచే ప్రత్యేక శ్రద్ధ శిశు మరణాలను తగ్గించాలంటే ముందస్తు ప్రణాళిక అవసరమని కేంద్రం భావిస్తోంది. యుక్త వయసు, పెళ్లయ్యాక, గర్భిణీగా ఉన్న సమయంలో ఆరోగ్యంపై ఎలా శ్రద్ధ తీసుకోవాలో అవగాహన కల్పించాలని యోచిస్తోంది. స్కూలు, కాలేజీల్లో చదివే యుక్త వయసు బాలికలకు రక్తహీనత సహజం. అందుకోసం ఐరన్ మాత్రలను పంపిణీ చేయడం, పౌష్టికాహారంపై అవగాహన కల్పించడం లాంటివి చేయాలని ప్రణాళిక రూపొందించింది. అలాగే, గర్భిణుల్లో అత్యంత రిస్క్ ఉన్న వారిని గుర్తించి అత్యాధునిక వైద్య సౌకర్యాలు ఉన్నచోట ప్రసవం చేయాలని, అందుకోసం ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఉన్న వంద ప్రసవ కేంద్రాలను మరింత ఆధునీకరిస్తారు. అత్యంత రిస్క్ ప్రసవ కేసులు హైదరాబాద్ నిలోఫర్, వరంగల్ ఎంజీఎంకు వస్తున్నాయి. రాష్ట్రంలో కనీసం మూడు ఆసుపత్రులను అత్యంత ఆధునీకరించాలనే ఆలోచన కూడా ఉంది. ఆశ కార్యకర్తలను పూర్తిస్థాయిలో వినియోగించుకొని ప్రతీ గర్భిణీ సమగ్ర సమాచారం సేకరిస్తారు. అలాగే ప్రసవించాక శిశు రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేస్తారు. తల్లుల సెల్‌ఫోన్ నంబర్లకు ఎప్పటికప్పుడు ఆటోమెటిక్‌గా ఎస్ఎంఎస్లు పంపేలా ఏర్పాట్లు చేస్తారు. ఎప్పుడెప్పుడు చెకప్‌లు చేయించుకోవాలో కూడా మెసేజ్ రూపంలో తెలియపరుస్తారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌లను అత్యంత ప్రాధాన్యం గల జిల్లాలుగా గుర్తిం చిం ది. అందువల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇం దుకోసం కేటాయిం చే బడ్జెట్లో 30 శాతం ఆ జిల్లాలకే కేటాయిస్తారు. -
‘ఆరోగ్య మిషన్’ నియామకాల్లో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) కింద రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం(ఆర్బీఎస్కే)లో భాగంగా జిల్లాల్లో వైద్య ఉద్యోగ ఖాళీల భర్తీ గందరగోళంగా మారింది. కలెక్టర్ చైర్మన్‌గా జిల్లాస్థాయి ఎంపిక కమిటీ ద్వారా కాంట్రాక్టు పద్ధతిన నియామకాలు చేపడతారు. వైద్యులు, నర్సులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది నియామకానికి అన్ని జిల్లాల్లోనూ దరఖాస్తులను ఆహ్వానించారు. వీటికి వేలల్లో దరఖాస్తులు వచ్చాయి. సంబంధిత జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల వారూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ప్రతిభ కలిగినవారు దరఖాస్తు చేసుకున్న జిల్లాలన్నింటిలోనూ ఉద్యోగం పొందుతారు. తర్వాత వారు ఏదో ఒక చోట చేరుతారు. దీనివల్ల ఖాళీ అయ్యే చోట వెంటనే మరొకరిని భర్తీ చేయడం కుదరదు. దీనివల్ల మరిన్ని ఉద్యోగాలు మిగిలిపోయే అవకాశం ఉందని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాకాకుండా, ఒకేసారి అన్ని జిల్లాల్లో ప్రతిభ జాబితా తయారు చేసి భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. -
కాంట్రాక్టు వైద్య పోస్టుల భర్తీ షురూ
1,330 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చే నెలాఖరుకు నియామకాలు హైదరాబాద్: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్కే)లో భాగంగా జిల్లాల్లో 1,330 కాంట్రాక్టు వైద్యులు, నర్సులు, ఫార్మాసిస్టు తదితర పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ఉద్యోగాలకు అభ్యర్థుల వయోపరిమితిని పదేళ్లు పెంచింది. వయోపరిమితిని 18 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అదనంగా మరో ఐదేళ్లు వయోపరిమితిని సడలింపు వర్తిస్తుంది. మిలటరీలో పనిచేసిన వారికి సర్వీసుతో కలిపి మూడేళ్లు, వికలాంగులకు అదనంగా 10 ఏళ్లు వయోపరిమితి ఉంటుంది. ప్రతీ కేటగిరీలో రోస్టర్ పాయింట్లను లెక్కిస్తారు. జిల్లాలకు మార్గదర్శకాలు: ఈ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేసేందుకు అన్ని జిల్లాల్లో ఈ నెల 24 నుంచి 30 వరకు వీలునుబట్టి నోటిఫికేషన్లు జారీచేయాలని ఆదేశిస్తూ... జిల్లాలకు ైవైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు పంపింది. వచ్చే నెల 14 నుంచి 16 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 17నుంచి 22వరకు దరఖాస్తుల పరిశీలన, 19 నుంచి 24వరకు మెరిట్ జాబితాల ప్రదర్శన, 24 నుంచి 30 వరకు నియామకాలు జరుపుతారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,330 పోస్టులను భర్తీ చేయనుం డగా...అందులో 630 మంది ఎంబీబీఎస్, ఆయుష్ డాక్టర్ పోస్టులు, 300 ఏఎన్ఎం, 300 ఫార్మసిస్టు పోస్టులు ఉన్నాయి. మిగతా 100 పోస్టుల్లో ఫిజియోథెరఫిస్టులు, స్టాఫ్‌నర్సులు, సైకాలజిస్టు పోస్టులు ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్‌కు రూ. 33 వేల వేతనం, ఆయుష్ మెడికల్ ఆఫీసర్‌కు రూ.22 వేలు, ఆగ్జిలరీ న ర్స్ మిడ్వైఫ్, ఫార్మసిస్టుకు రూ.10 వేలు, డెంటల్ మెడికల్ ఆ ఫీసర్కు రూ. 25 వేలు, స్టాఫ్‌నర్సుకు రూ. 14,190 వేతనంగా ఇస్తారు. చిన్న పిల్లల వైద్యులకు రూ. 80 వేల వేతనం ఇస్తారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో: జిల్లాస్థాయిలో భర్తీచేసే ఈ పోస్టులకు పరీక్ష, ఇంటర్వ్యూలు ఉండవు. కలెక్టర్ చైర్మన్‌గా, డీఎంహెచ్‌వో సభ్య కన్వీనర్‌గా డీఎస్సీని ఏర్పాటు చేస్తారు. మరో ముగ్గురు సభ్యులుంటారు. ఈ కమిటీ జిల్లాస్థాయిలో నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. మొత్తం 100 మార్కులను ప్రామాణికంగా తీసుకుంటారు. పోస్టుకు అర్హతగల పరీక్షలో సాధించిన మార్కులను 90గా, వయసుకు గరిష్టంగా 10 మార్కులుగా పరిగణనలోకి తీసుకుంటారు. ప్రతిభ ఆధారంగా జాబితా తయారుచేసి వెబ్సైట్లో పెడతారు. శిశువుల నుంచి 16 ఏళ్లలోపు పిల్లల్లో 30 రకాల వ్యాధులను గుర్తించడం కోసం... ప్రభుత్వం అన్ని జిల్లాల్లో 150 కమ్యూనిటీ హెల్త్, న్యూట్రిషన్ క్లస్టర్ల (సీహెచ్ఎన్సీ)ను ఏర్పాటు చేస్తుంది. ఒక్కో క్లస్టర్ కింద రెండు మొబైల్ హెల్త్ బృందాలు ఉంటాయి. వీరు గుర్తించిన వ్యాధులున్న పిల్లలకు వైద్యం చేయడానికి జిల్లాకొక డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ (డీఈఐసీ)ను ఏర్పాటు చేస్తారు. వాటిల్లో సేవలు అందించేందుకు ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. -
లోక్‌సభ సభ్యులే చైర్మన్లు
ఎన్హెచ్ఎం విజిలెన్స్ కమిటీలపై కేంద్రం స్పష్టీకరణ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వెల్లడి హైదరాబాద్: ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం షాక్ ఇచ్చింది. కమిటీలకు చైర్మన్లుగా కేంద్రం నియమించిన వారిని కాదని, ఆయా పదవుల్లో కేవలం తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలను నియమించడాన్ని తప్పుపట్టింది. ఈ మేరకు జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాల్సిందిగా ఆదేశించింది. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీల చైర్మన్లుగా తాము ఎంపిక చేసిన లోక్‌సభ సభ్యులనే కొనసాగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి మనోజ్ ఝలానీ ఈనెల 14న రాష్ట్ర ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాల కొండయ్యకు ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. మిషన్ ప్రకాశం జిల్లా చైర్మన్‌గా ఆదే జిల్లాకు చెందిన లోక్‌సభ సభ్యుని హోదాలో తనను, తన మాదిరిగానే నెల్లూరు మిషన్ చైర్మన్‌గా ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డిని, వైఎస్సార్ జిల్లా చైర్మన్‌గా వైఎస్ అవినాష్‌రెడ్డిని నియమిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ 2015 మార్చి 30వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిందని సుబ్బారెడ్డి తెలిపారు. అలాగే ఇతర జిల్లాల్లో అక్కడి ఎంపీలను కేంద్రం నియమించిందన్నారు. అయితే సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా.. తమను తప్పిస్తూ టీడీపీ వారిని నియమిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారని తెలిపారు. తానీ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాకు 2015 జూన్ 17వ తేదీన ఫిర్యాదు చేశానని, దీంతో సీఎస్ జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాల్సిందిగా కేంద్రం నుంచి ఆదేశాలొచ్చాయని తెలిపారు.ఈ ఆదేశాలను తాము సీఎస్‌కు పంపుతున్నామని తెలిపారు. -
1300 వైద్య ఉద్యోగ ఖాళీల భర్తీ
ఆర్థిక శాఖ ఆమోదం... వచ్చే నెలలో నోటిఫికేషన్ సాక్షి, హైదరాబాద్: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్కే)లో భాగంగా జిల్లాల్లో వైద్య ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపినట్లు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా ‘సాక్షి’కి తెలిపారు. ఈ పోస్టుల కోసం వచ్చే నెలలో నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉందని, జూన్‌లో నియామకాలు జరుగుతాయని వెల్లడించారు. ఆర్బీఎస్కే కింద 600 మంది వైద్యులు, 300 మంది ఏఎన్ఎంలు, 400 మంది సాంకేతిక నిపుణులు, ఇతర సిబ్బందిని నియమించుకోవడానికి ఎన్హెచ్ఎం అనుమతి ఇచ్చింది. మంగళవారం ఈ నియామకాలకు సంబంధించి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. -
'పేదల ఆరోగ్యంపై అజాగ్రత్త వద్దు'
ఒంగోలు:ప్రకాశం జిల్లా కలెక్టరేట్ లో జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్ కార్యక్రమంపై నియోజకవర్గ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సోమవార సమీక్ష నిర్వహించారు. దీనిలో భాగంగానే జిల్లాలో ప్రభుత్వాస్పత్రుల పనితీరుపై సుబ్బారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. పేదల ఆరోగ్యంపై అజాగ్రత్త వద్దని ఆయన సూచించారు. ఈ సమీక్ష సమావేశానికి ఎమ్మెల్యేలు అశోక్ రెడ్డి, గొ్ట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్, వీరాంజనేయ స్వామి తదితరులు హాజరయ్యారు. -
ఎన్హెచ్ఎంకు రూ. 1,571 కోట్లు ఇవ్వండి
కేంద్రానికి తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదన హైదరాబాద్: రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కార్యక్రమాలకు అవసరమైన నిధులు కోరుతూ తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కేంద్ర ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు పంపింది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఎన్హెచ్ఎం ద్వారా చేపట్టబోయే కార్యక్రమాలకు రూ.1,571.10 కోట్లు కావాలని కోరుతూ నివేదిక పంపింది. గతేడాది తెలంగాణకు ఎన్హెచ్ఎం కింద కేంద్రం రూ. 527.22 కోట్లు కేటాయించింది. దాంట్లో రూ.179 కోట్లు మాత్రమే ఖర్చు చేసిన వైద్య ఆరోగ్య శాఖ ఈసారి గతేడాది నిధులకు మూడు రెట్లు అదనంగా కోరడం గమనార్హం. ఇచ్చిన సొమ్ము ఖర్చు చేయడంలో విఫలం కావడంతో ఈసారి నిధుల విడుదల తక్కువగానే ఉంటుందని అంటున్నారు. అయితే రాష్ట్ర విభజన జరగడం, శాఖలు విడిపోవడం, ఉద్యోగుల కేటాయింపులో ఆలస్యం తదితర కారణాల వల్ల విడుదల చేసిన నిధులు ఖర్చు చేయని మాట వాస్తవమేనని, ఆ పరిస్థితిని కేంద్రానికి విన్నవించినట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. ఆసుపత్రుల బలోపేతానికి రూ.127 కోట్లు.. ఎన్హెచ్ఎం కింద గ్రామీణ స్థాయిలో ఆసుపత్రుల బలోపేతానికి రూ. 127 కోట్లు కావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కేంద్రాన్ని కోరింది. అందులో ప్రధానంగా మాతా శిశు సంరక్షణ విభాగాల ఏర్పాటు కూడా కీలకమైనవి. అయితే గతేడాది కేంద్రం వీటికోసం నిధులు కేటాయించలేదు. అలాగే పట్టణ ఆరోగ్య కార్యక్రమాలకు రూ. 221.88 కోట్లు కోరింది. అయితే ఇక్కడ విచిత్రమేంటంటే గతేడాది అందుకోసం రూ. 4.87 కోట్లు కేటాయిస్తే... ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకపోవడం గమనార్హం. అంధత్వ నివారణ కార్యక్రమం కింద రూ. 11.42 కోట్లు, జీతాలు, ఇతరత్రా మానవ వనరుల కోసం రూ. 153.96 కోట్లు కోరింది. గతంలో ఒక్కపైసా కేటాయించని జాతీయ వృద్ధుల ఆరోగ్య రక్షణ కార్యక్రమం కోసం ఈసారి మాత్రం రూ. 37 కోట్లు కావాలని ప్రతిపాదించింది. కేంద్రం నిధులు నిలిపివేసిన కేన్సర్, షుగర్, గుండె తదితర జబ్బుల నియంత్రణకు రూ. 82.13 కోట్లు కోరింది. సిబ్బంది శిక్షణ, నూతన నిర్మాణాలు తదితర ఖర్చులకు రూ. 85.22 కోట్లు కోరారు. -
జాతీయ అంబులెన్స్ సేవా పథకంలోకి 108
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తున్న జాతీయ అంబులెన్స్ సేవాపథకంలోకి 108-ఈఎంఆర్ఐ (ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) పథకాన్ని మారుస్తూ టీ సర్కార్ శుక్రవారం ఉత్తర్వులు (జీవో నం. 38) జారీచేసింది. కేంద్రం సంచార మెడికల్ యూనిట్స్, అంబులెన్స్ సర్వీసులన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకు రానుంది. జాతీయ అంబులెన్స్ సేవా పథకంలోకి మారడం వల్ల అంబులెన్సుల నిర్వహణకయ్యే ఖర్చులో 25 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ నేపథ్యంలో 108-ఈఎంఆర్ఐ పథకాన్ని జాతీయ అంబులెన్స్ సేవా పథకంలోకి మారుస్తున్నట్లు ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. -
‘104’ కష్టాలు
ఆదిలాబాద్ టౌన్ : గ్రామీణులకు నిరంతర వైద్యం అందించాలని ప్రవేశపెట్టిన 104 వాహనాల సేవలకు గ్రహణం పట్టుకుంది. పేరుకు తగ్గట్టే 104 కష్టాలు వాటిని చుట్టుముట్టాయి. వాహనాలుంటే డీజిల్ ఉండదు.. డీజిల్ ఉంటే డ్రైవర్లుండరు.. అన్నీ ఉన్నా మందులుండలుండవు అన్న చందంగా తయారైంది వారి పరిస్థితి. దీనికితోడు సిబ్బందికీ వేతనాలూ లేవు. 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జాతీయ ఆరోగ్య మిషన్ సహకారంతో 104 విధానాన్ని రూపొందించారు. గ్రామాలకు వెళ్లి 104 సంచార వాహనాల ద్వారా ప్రజలకు వైద్య సేవలందించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మర ణాంతరం 104 వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందక పేద ప్రజలు అవస్థలు పడుతున్నారు. వాహనాలలో పనిచేసే ఉద్యోగులకూ నెలల తరబడి వేతనాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మందుల కొరత, వాహనాల మరమ్మతు, సిబ్బందిని నియమించడంలో జాప్యం జరుగుతుండడంతో సేవలు అందకుండాపోతున్నాయి. మూలన పడ్డ నాలుగు వాహనాలు జిల్లాలో 24 వాహనాలున్నాయి. వీటిలో 20 వాహనాలు మాత్రమే సేవలందిస్తున్నాయి. నాలుగు వాహనాలకు డ్రైవర్, పార్మాసిస్టులను నియమించకపోవడంతో నార్నూర్, ఖానాపూర్, జైనూర్, ముథోల్ క్లస్టర్ల పరిధిలోని 104 వాహనాలు నిలిచిపోయాయి. డ్రైవర్ లేరనే సాకుతో అధికారులూ ప్రజారోగ్యంతో ఆడుకుంటున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలు పలు రోగాలతో అవస్థలు పడుతున్నారు. వారికీ 104 సేవలు అందడం లేదు. మందుల కొరత.. ప్రతిరోజూ గ్రామాలకు వెళ్లి వైద్యసేవలందించే 104 వాహనాల్లో 42 రకాలు మందులు అందుబాటులో ఉండాలి. కొంతకాలంగా వావానాల్లో పూర్తిస్థాయిలో మందుల్లేక సిబ్బంది నామమాత్రంగా వైద్య సేవలందిస్తున్నారు. వాంతులు, విరేచనాలు, జ్వరం, దగ్గు, గర్భిణులకు అందించే ఐరన్పోలిక్ మాత్రలు, పేయిన్ కిల్లర్, ఫిడ్స్‌కు సంబంధించిన కార్భొజఫమాయిల్, షుగర్‌కు సంబంధించి గ్లేమీఫడ్ మాత్రలు, యాంటిబయాటిక్, తదితర మాత్రలు లేవు. చిన్న పిల్లలకు జ్వరాలకు సంబంధించిన మందు అందుబాటులో లేదు. బడ్జెట్ లేక మందులు కొనుగోలు చేయడం లేదని తెలుస్తోంది. వైద్యులు రాక అవస్థలు.. 104 సేవలందించే గ్రామాలకు ఆయా పీహెచ్సీ పరిధిలోని మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు హాజరుకావాల్సి ఉంటుంది. కానీ.. కేవలం ఏఎన్ఎంలను మాత్రమే పంపడంతో రోగులకు సేవలందడం లేదు. ఫార్మసిస్టులు గతం నుంచి వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి మాత్రమే మందులు ఇస్తున్నారు. దీంతో ఎంతో ఆశతో వచ్చిన రోగులు వైద్యం అందకుండాపోతోంది. వైద్యులు అందుబాటులో ఉంటే వివిధ రోగాలతో బాధపడుతున్న వారు వైద్యులకు తమ గోడును వినిపించుకోవచ్చు. ఫార్మసిస్టులు రోగులకు మందులు ఇస్తున్నా వారిలో వ్యాధి నయమవుతుందన్న భరోసా కనిపించక నిరాశకు లోనవుతున్నారు. వాస్తవానికి మెడికల్ ఆఫీసర్ పీహెచ్సీలో ఉదయం పూట.. మధ్యాహ్నం నుంచి 104కు హాజరుకావాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆదేశించినా పెడచెవిన పెడుతున్నారు. రెండు నెలలుగా.. 104 వాహనాల్లో సుమారు 140 మంది సిబ్భంది ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వీరికి రెండు నెలలుగా వేతనాలు అందడంలేదు. ఈ సిబ్బందిలో వివిధ ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు. ఉద్యోగ రీత్యా వీరంతా ఆయా మండల కేంద్రాల్లో అద్దె ఇళ్లలో ఉంటున్నారు. వేతనాలు అందకపోవడంతో కనీసం అద్దె చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు. అలాగే తమ పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టలేని స్థితిలో ఉన్నట్లు సిబ్బంది అవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అధికాారులు స్పందించి వేతన బకాయిలు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
‘కు.ని’కి పాట్లు
సాక్షి, ఒంగోలు : జాతీయ ఆరోగ్యమిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) నుంచి జిల్లాకు ఏటా రూ.20 కోట్లకు పైగా నిధులు వస్తున్నాయి. ఇందులో రూ.2 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల వరకు కుటుంబ సంక్షేమ పథకాలకు కేటాయిస్తున్నారు. ఈ నిధులతో నాలుగు రకాలుగా కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇద్దరు సంతానం పుట్టాక కుటుంబ నియంత్రణ (కు.ని) ఆపరేషన్లు చేయడం ఒకటి కాగా, పిల్లల మధ్య ఎడమ కోసం తాత్కాలిక ఆపరేషన్లైన కాపర్ టీ వేయించడం, గర్భం దాల్చకుండా నోటిమాత్రలు పంపిణీ చేయడం, కండోమ్‌ల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. ఇందులో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు మినహా అన్ని కార్యక్రమాలు నామమాత్రంగానే సాగుతున్నాయి. క్షేత్రస్థాయిలో కానరాని ప్రగతిని జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం గణాంకాల్లో ఘనంగా చూపుతుండటం గమనార్హం. వేసెక్టమీలు ఏడు మాత్రమే... కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు సంబంధించి ఏటా భారీ స్థాయిలో లక్ష్యాలను నిర్దేశించుకుంటూ.. వాటిని అధిగమించే విషయంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ చతికిలపడటం రివాజవుతోంది. ఏటా రూ. కోట్లు ఖర్చుచేస్తున్నా.. లక్ష్యాలు నెరవేరడం లేదు. జిల్లావ్యాప్తంగా పురుషులకు చేసే వేసెక్టమీ ఆపరేషన్లు ఈఏడాది మొత్తంలో కేవలం ఏడు మాత్రమే నమోదవడం తాజా ఉదాహరణ. వాస్తవ పరిస్థితులిలా.. జనాభా నియంత్రణలో కుటుంబ నియంత్రణ అనేది ఒక భాగం. తల్లులు, పిల్లల ఆరోగ్యం విషయంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఇద్దరు లేదా ముగ్గురు పిల్లల తర్వాత తప్పనిసరిగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకునేందుకు దంపతులను ప్రోత్సహించాలి. చిన్న కుటుంబంతో కలిగే లాభాలను వివరించే అవగాహన సమావేశాలు నిర్వహించాలి. కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేయాల్సిన ‘డెమో’ విభాగం మూలనపడింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకునేందుకు జిల్లాలో 37 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్సెంటర్లు పనిచేస్తున్నాయి. యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం తదితర నియోజకవర్గాల్లో అక్కడక్కడా తప్ప అధిక చోట్ల ప్రత్యేక శిబిరాల ఊసే లేదు. ఆయాప్రాంతాల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరగడం లేదు. గైనిక్, అనస్థీషియా (మత్తు) వైద్యులు కొరత కారణంగా తొందరపడి ఆపరేషన్ల జోలికి వెళ్లలేకపోతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరైన మౌలిక సదుపాయాలు లేనందున చాలామంది ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. నెరవేరని లక్ష్యం.. జిల్లావైద్య, ఆరోగ్యశాఖ 2013-14 సంవత్సరంలో 22 వేల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకుగాను కేవలం 7 వేల ఆపరేషన్లు మాత్రమే నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రులు కంటే ప్రయివేటు ఆస్పత్రుల్లో ఈ ఆపరేషన్లు అధికంగా జరిగాయి. పీహెచ్సీ, సీహెచ్సీలలో వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు ముందుకు రావడం లేదని ఫిర్యాదులందుతున్నాయి. ఒంగోలు రిమ్స్‌కు పంపుతూ కొన్ని నియోజకవర్గాల్లో వైద్యసిబ్బంది చేతులు దులుపుకుంటున్నారు. ఈ విషయంలో వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో లక్ష్యం నీరుగారుతోంది. -
‘నై’.. వైద్యం
- గిరిజనులను పీడిస్తున్న మలేరియా - వ్యాధులపై అవగాహన కల్పించే సిబ్బంది కరువు - ఇంకా నాటువైద్యం వైపే గిరిజనం మొగ్గు - వైద్యశాఖలో భర్తీకి నోచని ఖాళీలు - మంత్రి రాకతోనైనా తీరు మారేనా.. భద్రాచలం : ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు మెరుగైన వైద్యం అందని ద్రాక్షగానే మిగులుతోంది. కార్పొరేట్ స్థాయి వైద్యసేవలను వారి చెంతకే తీసుకెళ్తామని గత పాలకులు చెప్పిన మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. భద్రాచలం ఏజెన్సీలోని గిరిజన గూడేలలో ఆదివాసీలు నేటికీ నాటువైద్యం వైపే మొగ్గుచూపుతున్నారంటే ఇక్కడి వైద్య సేవల పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోంది. జిల్లాలో 69 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు ఉండగా, ఇందులో 50 ఏజెన్సీ ప్రాంతంలోనే ఉన్నాయి. వీటిలో 28 పీహెచ్సీలలో 24 గంటల పాటు వైద్యసేవలందే ఏర్పాట్లు ఉన్నప్పటికీ, పూర్తిస్థాయిలో ఆ ఆస్పత్రులకు వచ్చేలా గిరిజనులకు అవగాహన కల్పించేవారు లే రు. మాతా-శిశు సంరక్షణ కోసం జాతీయ ఆరోగ్యమిషన్ ద్వారా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ, భద్రాచలంలో ఏజెన్సీలో వారి మరణాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ప్రధానంగా చింతూరు, కూనవరం, వీఆర్‌పురం మండలాల్లోని కొండరెడ్లు, ఆదివాసీలు, వలస గొత్తికోయల గ్రామాల్లో ఎక్కువగా మాతా శిశు మరణాలు సంభవిస్తున్నాయి. గిరిజనుల్లో తగిన అవగాహన లేకనే ఇంకా ఇళ్ల వద్దనే ప్రసవాలు జరుగుతున్నాయని పరిశీలనలో వెల్లడవుతున్నా, దీనిపై అధికారులు దృష్టి సారించడం లేదు. కొండరెడ్ల మహిళల ప్రసవం కోసమని ఏడుగురాళ్లపలి, తులసిపాక, కూటూరు, కొయిదా, రేఖపల్లి పీహెచ్‌సీల ప్రాంగణాల్లో ప్రత్యేకంగా భవనాలు నిర్మించినా.. అవి వారి అభిరుచికి తగ్గట్టుగా లేకపోవటంతో అక్కడ ఉండేందుకు వారు నిరాకరిస్తున్నారు. ఇక ప్రతీ ఏటా సీజనల్ వ్యాధులతో సంభవించే మరణాలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. రాష్ట్రంలో మలేరియా వ్యాధి పీడిత కేసులు ఎక్కువగా నమోదయ్యేది కూడా భద్రాచలం ఏజెన్సీలోని చింతూరు మండలం తులసిపాక, ఏడుగురాళ్లపల్లి పీహెచ్సీ పరిధిలోనే. ప్రంపంచ బ్యాంకు సహాయంతో వీటి నివారణ కార్యక్రమాలు చేపడుతున్నా ఫలితాలు అంతంతమాత్రమే. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు 3,10,864 రక్తపూతలు సేకరించగా, ఇందులో 1713 మందికి మలేరియా వ్యాధి సోకినట్లు ఆ శాఖ అధికారుల నివేదికల్లో వెల్లడైంది. ఈ వ్యాధికి అడ్డుకట్ట వేసేందుకు దోమతెరల పంపిణీకి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు ప్రతిపాదనలు చేసినా పాలకులు పట్టించుకున్న దాఖలాలు లేవు. 6 లక్షల జనాభాకు 3.50 లక్షల దోమతెరలు కావాలని కోరినప్పటికీ ఇప్పటి వరకూ దీనిపై స్పష్టత లేదు. అవగాహన కల్పించే వారేరి... సీజనల్ వ్యాధులతో పాటు ఆసుపత్రిలోనే ప్రసవాలు జరిగేలా గిరిజనుల్లో అవగాహన కల్పించేందుకు తగిన సిబ్బంది లేకపోవటం వల్లే సమస్య జఠిలమవుతోంది. అవగాహన కల్పించే హెల్త్ ఎడ్యుకేటర్ పోస్టుల భర్తీ గత కొన్నేళ్లుగా నిలిచిపోయింది. ఏజెన్సీలో 12 క్లస్టర్లు ఉండగా, ముగ్గురు మాత్రమే హెల్త్ ఎడ్యుకేటర్లు పనిచేస్తున్నారు. వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా డీహెచ్పీఈ వంటి శిక్షణ పొందిన ఉద్యోగులు ఆ శాఖలో ఉన్నప్పటికీ వారి సేవలను వినియోగించుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో గిరిజనులు నాటు వైద్యం చేసే వజ్జోడు, భూత వైద్యులను ఆశ్రయిస్తున్నారు. చింతూరు మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో ఓ విద్యార్థిని ఇటీవల ఈ కారణంగానే మృత్యువాత పడింది. వ్యాధులు సంభవించిన తరువాత హడావిడి చేసే కంటే ముందుగానే వీటిపై గిరిజనుల్లో తగిన అవగాహన కల్పిస్తే మేలని, ఇందుకోసం అన్ని క్లస్టర్లలో హెల్త్ ఎడ్యుకేటర్ పోస్టులు భర్తీ చేయాలని పలువురు కోరుతున్నారు. పెద్దాస్పత్రిలో సమస్యలెన్నో... పెద్దాస్పత్రిగా పేరొందిన భద్రాచలం ఏరియా వైద్యశాలకు నిత్యం 500 మందికి పైగానే వస్తుంటారు. 100 మందికి పైగా ఇన్‌పేషెంట్లు ఉంటారు. కానీ ఈ ఆస్పత్రిని ఆ స్థాయిలో అభివృద్ధి చేయలేదు. 100 పడకలు ఉన్న ఏరియా ఆస్పత్రిని 200 పడకలుగా మారుస్తామని ప్రకటించినా అది కార్యరూపం దాల్చలేదు. ఈ ఆస్పత్రికి చెందిన పలువురు వైద్యులు ప్రైవేటుగా ప్రాక్టిస్ చేసుకుంటూ విధులకు డుమ్మా కొడుతున్నారు. దీంతో ఇక్కడికి వచ్చేవారికి సరైన వైద్య సేవలు అందడం లేదు. కాగా, ఇక్కడ సివిల్ సర్జన్లు 2, సివిల్ సర్జన్ స్పెషలిస్టులు 8, డిప్యూటీ సివిల్ సర్జన్ 1, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ఖాళీల భర్తీ ఎప్పుడో... ఏజెన్సీలోని వైద్యశాఖలో పలు కీలక పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగానే ఉన్నాయి. పీహెచ్‌సీల్లో వైద్యుల పోస్టులు 12, అసిస్టెంట్ మలేరియా అధికారి 1, సీహెచ్‌వో 7, పీహెచ్ఎన్ 2, స్టాఫ్‌నర్స్‌లు 21, అప్తాలమిక్ అధికారి 3, హెల్ సూపర్వైజర్లు(ఫిమేల్)1, మేల్ 17, ఎంపీహెచ్ఏ(మేల్) 161, ఎంపీహెచ్ఏ(ఫిమేల్) 83, ఫార్మసిస్టు 14, ల్యాబ్ టెక్నీషియన్లు 19, హెల్త్ ఎడ్యుకేటర్ పోస్టులు 7 ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీపై గత ప్రభుత్వం దృష్టి సారించకపోవటంతో గిరిజనులకు వైద్యసేవలు అంతంతమాత్రంగానే అందుతున్నాయి. కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు... తెలంగాణలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంపై గిరిజనులు కోటి ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి తాటికొండ రాజయ్య తొలిసారి గురువారం భద్రాచలం వస్తున్నారు. ఆయన ఏరియా ఆసుపత్రి పరిశీలనతో పాటు, గిరిజనులకు అందుతున్న వైద్య సేవలపై ఐటీడీఏలో ఉన్నతాధికారులతో సమీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన సమస్యలపై దృష్టి సారించి వైద్యశాఖను గాడిలో పెట్టాలని గిరిజనులు కోరుతున్నారు. -
అర్బన్ హెల్త్ సెంటర్లకు మహర్దశ!
విజయనగరం ఆరోగ్యం : జిల్లాలోని పట్టణ ఆరోగ్య కేంద్రాలకు (అర్బన్ హెల్త్ సెంటర్లు) మహర్దశ పట్టనుంది. వీటిని పీహెచ్‌సీలుగా అప్‌గ్రేడ్ చేయూలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు ప్ర భుత్వం ఇప్పటికే ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలో ఎనిమిది పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వాటిలో విజయనగరంలో నాలుగు, బొబ్బిలిలో రెండు, సాలూరులో ఒకటి, పార్వతీపురంలో ఒకటి ఉన్నాయి. మొదటిసారిగా జిల్లాలోనిపట్టణ ఆరోగ్య కేంద్రాలను అర్బన్ పీహెచ్‌సీలుగా మార్చి, ఇక్కడ విజయవంతమైన తరువాత దశల వారీగా రాష్ట్రంలోని అన్ని అర్బన్ హెల్త్ సెంటర్లను అర్బన్ పీహెచ్‌సీలుగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. పస్తుతం పట్టణాల్లో 50వేల జనాభాకు ఒక అర్బన్ హెల్త్ సెంటర్ ఉంది. ఇందులో టెక్నికల్ సిబ్బంది ఎవరూ లేరు. ఒక వైద్యుడు, ఒక స్టాఫ్‌నర్సు, ఇద్దరు ఏఎన్ఎంలు, ఒక కమ్యూనిటీ ఆర్గనైజర్, వైద్యుడి సహాయకుడు ఒకరు, వాచ్‌మన్ ఒకరు, హెల్పర్ ఒకరు చొప్పన పని చేస్తున్నారు. అర్బన్ పీహెచ్సీగా అప్‌గ్రేడ్ అయితే పీహెచ్సీ మాదిరి ఒక డాక్టర్, ఒక స్టాఫ్ నర్సు, ఇద్దరు ఏఎన్ఎంలు, ఒక ఫార్మసిస్టు, ఒక ల్యాబ్ టెక్నీషి యన్, ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక సీహెచ్ఓ, ఒక హెల్త్ సూపర్వైజర్, ఒక వాచ్‌మన్, ఒక కంటింజెంట్ వర్కర్ ఉంటారు. దీని వల్ల రోగులకు ప్రతిరోజూ 12 గంటల పాటు వైద్య సేవలు అందుతాయి. అంతేకాకుండా అన్ని రకాల వ్యాధులకు ఓపీ సేవలు, కుటుంబ సంక్షేమ శస్త్ర చికిత్సలు, పసవాలు వంటి వైద్య సేవలు అందుతాయి. అర్బన్ హెల్త్ సెంటర్లో ప్రస్తుతం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే వైద్య సేవలు అందుతున్నాయి. మందులు పూర్తిస్థాయిలో ఉండడం లేదు. దీని వల్ల రోగులకు సక్రమంగా సేవలు అందడం లేదు. వీటిని పీహెచ్‌సీలుగా అప్‌గ్రేడ్ చేస్తే పట్టణవాసులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందుతాయి. గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించడం కోసం ఎన్ఆర్హెచ్ఎం పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. ఇకపై పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలకు నేషనల్ హెల్త్ మిషన్( ఎన్హెచ్ఎం) ద్వారా నిధులు విడుదల కానున్నాయి. కాగా సీహెచ్ఎన్సీ మాదిరి పట్టణాల్లో కూడా అర్బన్ సీహెచ్ఎన్సీలను ఏర్పాటు చేయనున్నారు. 2.50 లక్షల జనాభాకు ఒక పట్టణ సీహెచ్ఎన్సీ ఏర్పాటు చేయూలని కేంద్రం భావిస్తోంది. వివరాల సేకరణలో వైద్య సిబ్బంది ప్రస్తుతం అర్బన్ హెల్త్ సెంటర్లలో పని చేస్తున్న సిబ్బంది పట్టణాల్లోని వార్డుల్లో ఉన్న జనాభా వివరాల సేకరణలో బిజీగా ఉన్నారు. ఏ వార్డులో ఎంత మంది జనాభా ఉన్నారు. ఎంతమంది గర్భిణులు.. ఎంతమందికి వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నారు. క్షయ, హెచ్ఐవీ, కాన్సర్, బోదకాలు, మలేరియా వంటి వాధులతో ఎంతమంది బాధపడుతున్నారు వంటి పూర్తిస్థాయి వివరాలు సేకరిస్తున్నారు.