
ఏటా 25 వేల మంది
రాష్ట్రంలో భీతి గొలుపుతున్న శిశు మరణాలు
♦ నెలలు నిండని ప్రసవాలే కారణం
♦ అందులో 60 శాతం నవజాత శిశువులే
♦ వీటి తగ్గింపునకు కార్యాచరణ ప్రణాళిక
♦ ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌లకు ప్రాధాన్యం
♦ ‘2016ను నవజాత శిశు సంవత్సరం’గా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: నెలలు నిండని ప్రసవాల వల్లే నవజాత శిశు మరణాలు సంభవిస్తున్నాయి. తొమ్మిది నెలలకు కాకుండా ఏడెనిమిది నెలలకే శిశువు పుట్టడం.. బరువు తక్కువగా ఉండటం.. తద్వారా రోగనిరోధక శక్తి లేకపోవడం వంటి కారణాలతోనే శిశువులు చనిపోతున్నారు. దేశంలో ప్రతీ వెయ్యి మందికి 28 మంది నవజాత శిశువులు మరణిస్తుంటే.. రాష్ట్రంలో ఆ సంఖ్య 25గా ఉంది. దక్షిణ భారత దేశంతో పోలిస్తే రాష్ట్రంలో నవజాత శిశు మరణాల రేటు ఎక్కువే. దీన్ని పది లోపు(ఒకే అంకె)నకు తీసుకురావాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. అందుకోసం ‘2016ను నవజాత శిశు సంవత్సరం’గా ప్రకటించింది. తద్వారా తల్లుల్లో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడంతోపాటు పెద్దఎత్తున కార్యక్రమాల రూపకల్పనకు నడుం బిగించింది. దీనికి యునిసెఫ్‌తోపాటు జాతీయ ఆరోగ్య మిషన్ సహకారం తీసుకోనుంది.
ఏడాదికి 25 వేల శిశు మరణాలు
రాష్ట్రంలో ఏటా సరాసరి 6.30 లక్షల మంది శిశువులు పుడుతుండగా, అందులో 25 వేల మంది మరణిస్తున్నారు. ఏడాదిలోపు శిశు మరణాల రేటు 39 ఉండగా, 28 రోజుల్లోపు చనిపోయే నవజాత శిశు మరణాల రేటు 25గా ఉంది. అంటే ఏడాదిలో చనిపోయే శిశువుల్లో 60 శాతం మంది నవజాత శిశువులే ఉంటున్నారు. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గిరిజన, మారుమూల ప్రాంతాల్లో ఇది అధికంగా ఉంది. మహిళల్లో పౌష్టికాహార లోపం, బాల్య వివాహాలు, పేదరికం వల్లే నవజాత శిశు మరణాలు అధికంగా ఉంటున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. పుట్టిన శిశువు అనారోగ్యానికి గురైతేనే వైద్యులను సంప్రదిస్తున్నారు. అలాకాకుండా ముందుగానే వైద్యులను సంప్రదించే పరిస్థితి పల్లెల్లో ఉండటంలేదు.
యుక్త వయసు నుంచే ప్రత్యేక శ్రద్ధ
శిశు మరణాలను తగ్గించాలంటే ముందస్తు ప్రణాళిక అవసరమని కేంద్రం భావిస్తోంది. యుక్త వయసు, పెళ్లయ్యాక, గర్భిణీగా ఉన్న సమయంలో ఆరోగ్యంపై ఎలా శ్రద్ధ తీసుకోవాలో అవగాహన కల్పించాలని యోచిస్తోంది. స్కూలు, కాలేజీల్లో చదివే యుక్త వయసు బాలికలకు రక్తహీనత సహజం. అందుకోసం ఐరన్ మాత్రలను పంపిణీ చేయడం, పౌష్టికాహారంపై అవగాహన కల్పించడం లాంటివి చేయాలని ప్రణాళిక రూపొందించింది. అలాగే, గర్భిణుల్లో అత్యంత రిస్క్ ఉన్న వారిని గుర్తించి అత్యాధునిక వైద్య సౌకర్యాలు ఉన్నచోట ప్రసవం చేయాలని, అందుకోసం ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.
ఇందులో భాగంగా ఇప్పటికే ఉన్న వంద ప్రసవ కేంద్రాలను మరింత ఆధునీకరిస్తారు. అత్యంత రిస్క్ ప్రసవ కేసులు హైదరాబాద్ నిలోఫర్, వరంగల్ ఎంజీఎంకు వస్తున్నాయి. రాష్ట్రంలో కనీసం మూడు ఆసుపత్రులను అత్యంత ఆధునీకరించాలనే ఆలోచన కూడా ఉంది. ఆశ కార్యకర్తలను పూర్తిస్థాయిలో వినియోగించుకొని ప్రతీ గర్భిణీ సమగ్ర సమాచారం సేకరిస్తారు. అలాగే ప్రసవించాక శిశు రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేస్తారు. తల్లుల సెల్‌ఫోన్ నంబర్లకు ఎప్పటికప్పుడు ఆటోమెటిక్‌గా ఎస్‌ఎంఎస్‌లు పంపేలా ఏర్పాట్లు చేస్తారు. ఎప్పుడెప్పుడు చెకప్‌లు చేయించుకోవాలో కూడా మెసేజ్ రూపంలో తెలియపరుస్తారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌లను అత్యంత ప్రాధాన్యం గల జిల్లాలుగా గుర్తిం చిం ది. అందువల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇం దుకోసం కేటాయిం చే బడ్జెట్‌లో 30 శాతం ఆ జిల్లాలకే కేటాయిస్తారు.