
ఆరోగ్య మిషన్ నిధులు పక్కదారి
- రాష్ట్రంలో ఆరోగ్య కార్యక్రమాలు సరిగా అమలు కావడంలేదు
- కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ మనోజ్ జలానీ అసంతృప్తి
- తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష
సాక్షి, హైదరాబాద్ : జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్‌హెచ్‌ఎం) నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించడంపై కేంద్రం మండిపడింది. కేంద్రం ఆధ్వర్యంలో రాష్ట్రంలో చేపడుతున్న వివిధ వైద్య,ఆరోగ్య పథకాలు కుంటుపడుతున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ మనోజ్ జలాని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్ వచ్చిన ఆయన సచివాలయంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో ఎన్‌హెచ్‌ఎం కార్యక్రమాల అమలుతీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మను కలిశారు. కేంద్రం విడుదల చేసిన ఎన్‌హెచ్‌ఎం నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానాలో వేసుకుందని, వాటిని విడుదల చేయడం లేదని అన్నట్లు తెలిసింది.
వాటా విడుదల చేయకుంటే కష్టమే
రాష్ట్రంలో జనని సురక్ష యోజన(జేఎస్‌వై), జనని శిశు సురక్ష కార్యక్రమం(జేఎస్‌ఎస్‌కే), కుటుంబ నియంత్రణ, ‘ఆశ’ కార్యకర్తలకు జీతాలు, వివిధ రకాల మందులు, పరికరాల కొనుగోలుకు ఎన్‌హెచ్‌ఎం కింద రాష్ట్రానికి విడుదలైన నిధులు ఏమయ్యాయని మనోజ్ జలాని నిలదీసినట్లు తెలిసింది. ఎన్‌హెచ్‌ఎం కింద గతేడాది రూ.143.28 కోట్లను కేంద్రం విడుదల చేసిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వవాటాతో కలిపి ఎన్‌హెచ్‌ఎంకు రూ. 458 కోట్లు సమకూరాల్సి ఉందని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది.
రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోవడంతో జేఎస్‌వై కింద ఆసుపత్రిలో ప్రసవించిన తల్లులకు ఇవ్వాల్సిన రూ.వెయ్యి ప్రోత్సాహకానికి ఇబ్బందులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. జేఎస్‌ఎస్‌కే, కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు కుంటుపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆరోగ్య రంగానికి సంబంధించిన అత్యవసర నిధులను పక్కదారి పట్టించడంపట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా రాష్ట్ర వాటాను విడుదల చేయాలని రాజీవ్‌శర్మను కోరినట్లు తెలిసింది. సమీక్ష సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి, కుటుంబ సంక్షేమ కమిషనర్ జ్యోతి బుద్ధ ప్రకాష్, ఎన్‌హెచ్‌ఎం రాష్ట్ర ప్రత్యేకాధికారి డాక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.