వారిపై దాడులు అత్యంత అమానవీయం
‘సాక్షి’తో కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి సుజాతారావు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘ఇటీవల వైద్యులపై జరిగిన దాడులు నన్ను కలిచివేశాయి. ఇలాంటి అమానవీయ ఘటనలు చూడాల్సి రావడం దురదృష్టకరం. వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దుకుని ముందుకు వెళ్లకపోతే భవిష్యత్‌లో సామాన్య రోగులకు వైద్యం అందే పరిస్థితి ఉండదు. వైద్య వృత్తి భయంతో కాదు.. అంకితభావంతో చేసేది. వైద్యులకు ప్రశాంతత, స్వేచ్ఛ అవసరం’ అని కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుజాతారావు అన్నారు. సుదీర్ఘకాలం పాటు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పనిచేసిన సుజాతారావు.. ఆరోగ్య రంగంలో తీసుకువచి్చన ఎన్నో సంస్కరణల్లో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యుల భద్రత కోసం ప్రభుత్వాలు తీసుకోవాల్సిన పలు చర్యలను ఆమె ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
ప్రత్యేక చట్టం తీసుకురావాలి..
వైద్యులపై దాడుల నియంత్రణ రాష్ట్రాల పరిధిలో ని సమస్య. దీనికీ, కేంద్ర ప్రభుత్వానికీ సంబంధం లేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేక చట్టం తీసుకువచ్చి రక్షణ కల్పించాలి. ఈ విషయంలో పూర్తిగా రాష్ట్రాలదే బాధ్యత. రక్షణ కల్పించడమంటే ఆస్పత్రి దగ్గర ఇద్దరు లేదా ముగ్గురు పోలీసులను ఏర్పాటు చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఆస్పత్రుల్లో పోలీస్ వ్యవస్థ ఏర్పాటుకు కూడా ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. ప్రత్యేక వ్యవస్థ ఉంటే తప్ప దాడులను నియంత్రించడం సాధ్యపడదు. నేను పనిచేసిన సమయంలో ఇలాంటి ఘటనలు జరగలేదు. ఏవైనా ఘటనలు జరిగినప్పుడు ఆయా రాష్ట్రాల పరిధిలోనే కఠిన చర్యలు తీసుకొని శాంతిభద్రతలను అదుపు చేసేవారు.
భయంతో వైద్యం ఎలా చేస్తారు?
కోల్‌కతాలో వైద్యురాలిపై జరిగిన హత్యాచారం ఘటన నన్ను కలిచివేసింది. మనం ఇంకా ఏ సమాజంలో ఉన్నామా అనిపించింది. నాకైతే దీని వెనుక కుట్రకోణం ఉందనిపించింది. ప్రస్తుతం జరుగుతున్న ఘటనలతో వైద్యుల మనోభావాలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. వైద్యులు కూడా మనుషులే కదా. ప్రభుత్వాస్పత్రులకు వచ్చే రోగుల కుటుంబసభ్యులు, బంధువుల పరిస్థితి వేరేరకంగా ఉంటుంది. తమ మనిషి పోతే వారికి చాలా బాధ ఉంటుంది. కానీ దానిని వైద్యులపై చూపించడం సరికాదు. భయంభయంగా ఎన్నిరోజులని వైద్యం చేయగలరు?
రోగుల సహాయకులను నియంత్రించాలి
ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రులకు ఒక విధానమంటూ లేదు. మెయిన్ గేట్ నుంచి ఎమర్జెన్సీ వార్డు వరకూ రోగుల బంధువులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇది సరికాదు. మెయిన్ గేటు నుంచే నియంత్రణ జరగాలి. క్యాజువాలిటీ, ఎమర్జెన్సీ, ఐసీయూ తదితరాల చోట్ల ఒకరికి మించి ఎక్కువ మంది సహాయకులను అనుమతించకూడదు. వారిని నియంత్రించి.. సరైన విధానంలో కౌన్సెలింగ్ ఇవ్వడం అవసరం. ప్రభుత్వాస్పత్రుల్లో ఇలాంటి విధానాలు అమలు చేయకపోతే వైద్యులు పనిచేసే పరిస్థితి ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment