ప్రాంతాల మధ్య అసమానతలు ఉన్నప్పుడు భావ సమైక్యత ఎలా సాధ్యం?
‘సీమ’కు విదర్భ తరహా పాలనా ఏర్పాట్లు ఉండాలి
నదీ జలాల పంపిణీలో తొలి ప్రాధాన్యత ఇవ్వాలి
ఈ దిశగా వైఎస్సార్ తన హయాంలో కృషి చేశారు
వెనుకబడిన ఉత్తరాంధ్ర, సీమలపై దృష్టి సారించాలి
‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో పౌరహక్కుల ఉద్యమ నేత, ప్రొఫెసర్ జి.హరగోపాల్
కడప సెవెన్‌రోడ్స్: ‘నవ్యాంధ్రప్రదేశ్ అవతరణ సమయంలో తెలంగాణ విడిపోయినప్పుడు రాజధానిని కోల్పోవాల్సి వచి్చంది. ఆ తర్వాత అమరావతిలోనే రాజధాని ఉండాలనే ఆ ప్రాంత వాసుల ఆకాంక్షల మేరకే చంద్రబాబు అక్కడ ఏర్పాటు చేశారు. అయితే అమరావతిపై మాత్రమే దృష్టి కేంద్రీకరించడమంటే తెలంగాణ విషయంలో చేసిన తప్పే మళ్లీ చేయడం. అభివృద్ధి అంతా ఒకేచోట పోగు వేయడం సరైంది కాదు. అభివృద్ధి కేంద్రీకరణ విషయంలో గతంలో ఉన్న న్యాయ భావన ఇప్పుడు లేదు.
నూతన ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చాక ఆ భావనకు తావు లేకుండాపోయింది. ఇప్పుడు అంతా సంపద సృష్టే తప్ప ప్రజలను పట్టించుకునే పరిస్థితులు లేవు’ అని ప్రొఫెసర్ జి.హరగోపాల్ కుండబద్దలు కొట్టారు. పౌరహక్కుల ఉద్యమ నేతగా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ప్రొఫెసర్ హరగోపాల్ ఓ సదస్సులో పాల్గొనేందుకు వైఎస్సార్ జిల్లా కడపకు వచ్చిన సందర్భంగా ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వెనుకబడ్డ రాయలసీమ సమగ్రాభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం కూడా బాగా వెనుకబడి ఉంటుందని, ఆ ప్రాంత అభివృద్ధి కోసం బడ్జెట్ అనుమతులు, నిర్వహణ వంటివి గవర్నరే చేపడతారని చెప్పారు. రాయలసీమకు కూడా అలాంటి పరిపాలనా ఏర్పాటు జరగాలన్నారు. ఒకప్పుడు తెలంగాణ అభివృద్ధి బోర్డు ఉండేదని, ఆ తర్వాత దాన్ని రద్దు చేశారని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ డిమాండుకు ఇది కూడా ఓ కారణమైందని చెప్పారు.
అలాంటివి పునరావృతం కాకుండా రాయలసీమ సమగ్రాభివృద్ధికి నీటి పారుదల, పరిశ్రమలు, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన తన అభిప్రాయాలు తెలియజేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
ప్రాంతాల మధ్య సమాన అభివృద్ధి అవసరం
ప్రాంతాల మధ్య సమాన అభివృద్ధి లేకుండా, సామాజిక న్యాయం జరగకుండా భాష ఒక్కటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచలేదన్న విషయం తెలంగాణ అనుభవం రుజువు చేసింది. అమరావతిలోనే అభివృద్ధి మొత్తం కేంద్రీకరించడం ద్వారా తెలంగాణ విషయంలో చేసిన తప్పే మళ్లీ చేస్తున్నారు.
కృష్ణా, గోదావరి జలాల పంపిణీలో వెనుకబడిన రాయలసీమకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ దిశగా కొంతమేరకు కృషి చేశారు. విదర్భ తరహాలో ఈ ప్రాంతానికి బడ్జెట్ కేటాయింపు కోసం ఒక పరిపాలనా ఏర్పాటు జరగాలి. అభివృద్ధినంతా ఒకే చోట పోగేయడం సరికాదు.
ఒకసారి రాష్ట్ర విభజన జరిగినా, ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకోకుండా మళ్లీ అదే తప్పు చేయడం సమంజసం కాదు. ప్రాంతాల మధ్య అభివృద్ధిలో అసమానతలు ఉన్నప్పుడు భావ సమైక్యత ఎలా ఉంటుంది? సామాజిక న్యాయం జరగకుండా భాష ఒక్కటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచలేదు.
అందువల్లే ప్రాంతీయ అసమానతలు
ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ కరువు పీడిత ప్రాంతం. ఉత్తరాంధ్రలో నీళ్లు ఉన్నా వెనుకబడి ఉంది. కోస్తాలో కృష్ణా, గోదావరి నదులు ప్రవహిస్తున్నా ఒకప్పుడు అది కరువు ప్రాంతంగా ఉండేది. కరువును పారదోలడం, వరదల ముప్పు తప్పించడం కోసం 1852లో సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్టలు నిర్మించడంతో ఆ ప్రాంతం సస్యశ్యామలమైంది.
అక్కడి రైతులు వ్యవసాయంలో వచ్చిన అదనపు ఉత్పత్తిని మద్రాసులోని సినిమా రంగం, ఇతర వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టారు. అలా సంపద పెరుగుతూ ఆ ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది. నదీ జలాల్లో వెనుకబడ్డ ప్రాంతాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ అలా జరగకపోవడం ప్రాంతీయ అసమానతలను పెంచింది.
అభివృద్ధి చెందిన ప్రాంతాలకు ఉన్న రాజకీయ ప్రాబల్యం వెనుకబడ్డ ప్రాంతాలకు ఉండదు. అందుకే రాయలసీమకు చెందిన వారు ఎక్కువ మంది ముఖ్యమంత్రులుగా పనిచేసినప్పటికీ కోస్తాంధ్రుల ప్రాబల్యం వల్ల ఆ ప్రాంతానికే ప్రాధాన్యతనిస్తూ వచ్చారు.
విభజన అనుభవాలు మరువకముందే..
రాజకీయ ప్రాబల్యాన్ని అనుసరించే అభివృద్ధి నమూనా ఉంటోంది. రాష్ట్ర విభజన అనుభవాలు ఇంకా మరిచిపోకమునుపే మళ్లీ అవే తప్పులు మళ్లీ చేస్తున్నారు. ఇక్కడి నాయకులు కూడా ఈ ప్రాంత సమస్యలు పట్టించుకోవడం లేదు. వివిధ చారిత్రక, రాజకీయ కారణాలతో రాయలసీమలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి.
గతంతో పోలిస్తే ఫ్యాక్షన్ ప్రభావం చాలా మేరకు తగ్గినప్పటికీ రక్షణ ఉండదని భావిస్తున్న ప్రజలు నేటికీ ఏదో ఒక నాయకుడి ప్రాబల్యం కింద ఉన్నారు. వీటి నుంచి బయట పడాల్సిన అవసరం ఉంది. చైతన్యవంతమైన ప్రజా ఉద్యమం ద్వారానే రాయలసీమకు న్యాయం జరుగుతుంది.
సీమకు నదీ జలాల విషయంలో వైఎస్సార్ శ్రద్ధ
రాయలసీమకు నదీ జలాలను మళ్లించే విషయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కొంతమేర కృషి చేయగలిగారనేదానిని కాదనలేం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వెడల్పు పనులు చేపట్టడంతో పాటు సీమ ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేసే దిశగా చర్యలు తీసుకున్నారు.
అయితే ఆయనపై కూడా అనేక ఒత్తిళ్లు వచ్చాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో సుమారు 290 కిలోమీటర్ల పరివాహక ప్రాంతమున్న కృష్ణా నీటిలో మా తెలంగాణ వాటా ఏమిటని మేము కూడా అడిగాం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జోరుగా జరుగుతున్న సందర్భంలో కృష్ణా జలాలు పునః పంపిణీ చేయాలని కోరారు.
పునః పంపిణీకి కోస్తాంధ్ర వాళ్లు ససేమిరా ఒప్పుకోరన్న విషయం రాజకీయ పరిణితి చెందిన వైఎస్‌కు బాగా తెలుసు. ఈ నేపథ్యంలో కృష్ణా జలాల పంపిణీ అయిపోయిందని ఆయన మాతో అన్నారు. ఏది ఎలా ఉన్నా సీమకు నదీ జలాలు ఇచ్చే విషయంలో ఆయన శ్రద్ధ తీసుకున్నారు.
కొన్ని త్యాగాలు తప్పవు..
రాయలసీమ, ఉత్తరాంధ్ర బాగా వెనుకబడి ఉన్నాయి. వీటికి తొలి ప్రాధాన్యత ఇవ్వడం ఎంతైనా సముచితం. అన్ని ప్రాంతాలు కలిసి ఉండాలనుకున్నప్పుడు కొన్ని త్యాగాలు తప్పవు. కోస్తాంధ్రులు తమ నీటి వినియోగాన్ని కొంతమేర తగ్గించుకోవడానికి ఇష్టపడరు.
అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలన్న విజన్ ఇప్పుడు ఎవరికి ఉంది? ఒక ప్రాంతం వెనుకబడి ఉండటానికి చారిత్రక, రాజకీయ కారణాలు ఉంటాయి. విధాన పరంగా, ఒత్తిడి లేకుండా ఒక ప్రాంత అభివృద్ధిని పట్టించుకునే పరిస్థితులు లేవు.
Comments
Please login to add a commentAdd a comment