‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఐఏఆర్‌ఐ డైరెక్టర్, వైస్ చాన్సలర్ డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు
వాతావరణ మార్పులు, మార్కెటింగ్ సమస్యలే పెనుసవాళ్లు
వరి, గోధుమ, ఇతర పంటల ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించాం
ఏటా 55 బిలియన్ యూఎస్ డాలర్ల ఆహార ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నాం
అపరాలు, నూనె గింజల పంట ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించాలి
ఏటా రూ.2 లక్షల కోట్ల విలువైన పప్పు దినుసులు, నూనె గింజల ఉత్పత్తులు దిగుమతి
రైతు క్షేత్రాలకు పరిశోధన ఫలాలు త్వరితగతిన చేరినప్పుడే వాటికి సార్థకత.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో జిల్లాకో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు అవకాశం
వ్యవసాయ అనుబంధ రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
‘ఒకప్పుడు బెగ్గింగ్ బౌల్‌గా ఉన్న భారతదేశం నేడు ప్రపంచ దేశాలకు ఆహారాన్ని అందించే స్థాయికి ఎదిగింది. వరి, గోధుమ వంటి ఆహార ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించింది. ఏటా 340 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు, 345 మిలియన్ టన్నుల కూరగాయలు, పండ్లు ఉత్పత్తి చేయడమే కాకుండా ఏటా 55 బిలియన్ యూఎస్ డాలర్ల విలువైన ఆహార ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. 142 కోట్ల జనాభా కలిగిన మన దేశానికి సంపూర్ణ ఆహార భద్రత సాధించగలిగాం. అందులో సందేహం లేదు. కానీ పప్పు దినుసులు, నూనె గింజల ఉత్పత్తిలో బాగా వెనుకబడ్డాం.
ఏటా రూ.2 లక్షల కోట్ల విలువైన పప్పులు, నూనె గింజల ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. వీటి ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఎఆర్‌ఐ) డైరెక్టర్ కమ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఈయన ట్రైనీ సైంటిస్ట్ నుంచి ఐఏఆర్ డైరెక్టర్ స్థాయికి ఎదిగిన తొలి తెలుగు వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగం, భవిష్యత్ ప్రణాళిక, తదితర అంశాలపై ఆయన ‘సాక్షి ప్రతినిధి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనోగతాన్ని ఆవిష్కరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..పంపాన వరప్రసాదరావు – సాక్షి, అమరావతి
బెట్టను తట్టుకునే మరిన్ని రకాలు రావాలి
దేశ జనాభా 142 కోట్లు దాటింది. 14 కోట్ల మంది రైతులున్నారు. దేశంలో 6 లక్షల గ్రామాలుండగా, 15 కోట్ల కమతాలున్నాయి. 80–85 శాతానికి పైగా చిన్న కమతాలే. ఈ కారణంగానే ఆశించిన స్థాయిలో దిగుబడులు సాధించలేకపోతున్నారు. అర్బనైజేషన్ కారణంగా గ్రామాలతో పాటు సాగు విస్తీర్ణం తగ్గడం, వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లను తట్టుకోలేక రైతులు సాగును వదిలేసే పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశ జనాభాలో 50 శాతం ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం.
సాగు విస్తీర్ణంలో 50 శాతానికి పైగా నేటికీ వర్షాధారమే. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో మెజార్టీ సాగు విస్తీర్ణం వర్షాధారమే. 30–40 ఏళ్లుగా వర్షాలకు లోటులేదు. కానీ బెట్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోతుండడం ఆందోళన కలిగిస్తోంది.
పొలంలో నీళ్లు పొలంలో, గ్రామంలో నీళ్లు గ్రామంలో, ఫామ్ ఫాండ్స్‌లో నీళ్లు నిల్వ చేసుకొని ఎప్పుడు బెట్ట వస్తే అప్పుడు మైక్రో ఇరిగేషన్ ద్వారా సమర్థవంతంగా వినియోగించుకుంటే సత్ఫలితాలు సాధించొచ్చు. నీటి వనరులను సద్వినియోగం చేసుకోకపోతే భవిష్యత్‌లో పెనుముప్పు తప్పదు. వర్షాధారం కింద అధిక దిగుబడులు సాధించే రకాల వంగడాలను, ప్రధానంగా బెట్టను తట్టుకునే వాటిని అభివృద్ధి చేయాలి.
కర్బన్ శాతాన్ని సంరక్షించుకోకపోతే ముప్పే
ప్రజల ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. వెజిటబుల్స్, పండ్లు తినే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. న్యూట్రిషన్ ఫుడ్ ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా పరిశోధనలు సాగాలి. చిరు ధాన్యాలు, పప్పు దినుసులు, నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది. ప్రాంతాల వారీగా అనువైన వంగడాలను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే వేలాది రకాల వంగడాలు అందుబాటులో ఉన్నాయి.
కరువు ప్రాంతాల్లో సైతం అధిక వర్షాలు, వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు తగిన వంగడాలను అభివృద్ధి చేయాలి. నేల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. నేలల్లో కర్బన్ శాతాన్ని సంరక్షించగలిగినప్పుడే అధిక దిగుబడులు సాధించవచ్చు. ఫామ్ మెకనైజేషన్ (యాంత్రీకరణ) ద్వారా పెట్టుబడి ఖర్చులను నియంత్రించగలుగుతాం.
కొత్త వంగడాలు వేగంగా అందించాలి
మన శాస్త్రవేత్తలు ఏటా వందలాది వంగడాలను అభివృద్ధి చేస్తున్నారు. అయితే అవి రైతు పొలానికి చేరినప్పుడే సత్ఫలితాలు వస్తాయి. అది ఆశించినంత వేగంగా జరగడం లేదు. పరిశోధనా కేంద్రాలు అందించే ఫౌండేషన్ సీడ్ నుంచి మల్టిపుల్ సీడ్ ఉత్పత్తి చేసి రైతులకు వేగంగా అందించాలి. ఇందులో ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు, సీడ్ ఏజెన్సీలు, సీడ్ కంపెనీలు ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి.
ఫాస్ట్ ట్రాక్ పద్దతిలో సీడ్ రీప్లేస్‌మెంట్ జరగాలి. ఉత్తమ వంగడాల డెమో, చీడపీడల నియంత్రణ, నీటి వినియోగం వంటి ప్రయోగాలన్నీ రైతు క్షేత్రంలోనే జరగాలి. పంట అవశేషాలను కాల్చకుండా కంపోస్ట్ మార్చడం, తక్కువ ఎరువులతో ఎక్కువ ప్రయోజనం పొందేలా అడుగులు వేయాలి. రైతులకు నిరంతర శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రతి గ్రామంలో ఓ రైతును ఓ మాస్టర్ ఫార్మర్‌గా తయారు చేయాలి.
వారి ద్వారా ఆ గ్రామంలో పరిశోధనా ఫలాలు వేగంగా రైతులకు చేరువవుతాయి. పంట సాగు వేళ, కోత, కోత అనంతరం, నిల్వ సమయంలో ఉత్పత్తి నష్టాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి పంట ఉత్పత్తిని ప్రాసెసింగ్ వ్యాల్యూ ఎడిషన్‌తో మార్కెట్‌లోకి తీసుకెళ్లగలిగితే రైతులకు మేలు జరుగుతుంది.
ఏపీ, తెలంగాణలో జిల్లాకో కేవీకే
దేశ వ్యాప్తంగా 113 పరిశోధనా సంస్థలు, 731 కృషి విజ్ఞాన కేంద్రాలు(కేవీకే) ఉన్నాయి. గతంతో పోలిస్తే వాటి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏపీ, తెలంగాణలో కూడా కేవీకేల సంఖ్య సమీప భవిష్యత్‌లో భారీగా పెరిగే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాల్లో పెరిగిన జిల్లాలకనుగుణంగా కనీసం 10–15 మధ్య కొత్తగా కేవీకేలు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది.
కొత్త రీసెర్చ్ స్టేషన్ల ఏర్పాటు కంటే ఉన్న రీసెర్చ్ స్టేషన్లను బలోపేతం చేయడమే నా ముందున్న లక్ష్యం. ఆ విషయంలో అవసరమైన నిధులు సాధించి పరిశోధనలు వేగవంతం చేసేందుకు కృషి చేస్తాను. వ్యవసాయ, అనుబంధ రంగాలలో పరిశోధనలకు ఏటా రూ.11 కోట్లు ఖర్చు చేస్తున్నారు. గతంతో పోలిస్తే దేశ వ్యాప్తంగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
సమీప భవిష్యత్‌లో వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా వర్షాధారం, బెట్ట పరిస్థితులతో పాటు వరదలు, తుపాన్‌లు వంటి వైపరీత్యాలను తట్టుకుంటూ అధిక దిగుబడులు సాధించేలా మల్టిపుల్ టాలెంటెడ్ వంగడాలను అభివృద్ధి చేయడంతో పాటు నేల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తాను.
వాతావరణంలో అనూహ్య మార్పులు, ఏటా పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు.. వ్యవసాయ రంగానికి పెనుసవాళ్లుగా మారాయి. పూర్వం జూన్‌లో వర్షాలు కురిసేవి. ఆ వెంటనే నాట్లు వేసుకునే వారు. కానీ నేడు జూలై–ఆగస్టుల్లో వర్షాలు కురిసే పరిస్థితి ఏర్పడింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశంలో వర్షపాతానికి లోటు లేదు. ఏటా సగటున 1000 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతోంది.
కానీ పడితే కుండపోత.. లేకుంటే కరువు అన్నట్టుగా ఉంది పరిస్థితి. కొన్నేళ్లుగా దశాబ్దాలుగా కరువుతో అల్లాడిన ప్రాంతాలను సైతం కుండపోత వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల వ్యవసాయ సీజన్‌లను కూడా మార్చుకోవాల్సి వస్తోంది. అన్ని కష్టనష్టాలను ఎదుర్కొని పంట దిగుబడి సాధిస్తే.. మార్కెటింగ్ తీరుతో రైతులు నష్టపోతున్నారు. ఈ సవాళ్లను అధిగమించడమే లక్ష్యంగా ఐఏఆర్‌ఐ ముందుకెళ్తోంది. – డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు, ఐఏఆర్‌ఐ డైరెక్టర్ కమ్ వైస్ ఛాన్సలర్
Comments
Please login to add a commentAdd a comment