బాంబులేయడం.. కరెంటు షాక్ ఇవ్వడం, రసాయనాలు కలిపి విషప్రయోగం
ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటికీ ఇవే పద్ధతులుతద్వారా ఆక్వా రంగానికి అపార నష్టం..
అందుకే అక్కడ మత్స్య సంపద పెంచేందుకు ప్రత్యేక శిక్షణనిస్తున్నాం
అక్కడ ప్రతీచోట ఆంధ్ర ఫిష్ మార్కెట్ ఉంది
తాబేళ్ల రక్షణ కోసం ప్రత్యేక టెడ్‌ల తయారీ
‘సాక్షి’తో సీఐఎఫ్‌టీ డైరెక్టర్ డాక్టర్ జార్జ్ నీనన్
‘అక్కడ చేపలు పట్టడమంటే చెరువుల్లో బాంబులు వేయడమో.. కరెంటు షాక్ ఇచ్చి లేదా నీటిలో రసాయనాలు కలిపి చేపలు చచ్చేలా చేసి పట్టుకోవడమో మాత్రమే తెలుసు. అంతేగానీ.. ప్రత్యేకంగా చేపలు పట్టేందుకు స్థానికులకు శిక్షణలేదు. ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లిన సమయంలో దీనిని గమనించాను. తద్వారా విషపూరితమైన చేపలను తినడమో.. చేపలతో పాటు ఇతర ప్రాణులు చనిపోవడమో జరుగుతోంది.
అందుకే ప్రత్యేకంగా ఏడు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన (అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయా, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర) 20 మంది అధికారులకు శిక్షణ ఇస్తున్నాం’.. అని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ (సీఐఎఫ్‌టీ) డైరెక్టర్ డాక్టర్ జార్జ్ నీనన్ తెలిపారు. అక్కడ మత్స్య సంపదను పెంచడంతో పాటు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై కూడా ఈ ఐదురోజుల శిక్షణలో భాగం చేశాం.
ఇక్కడ శిక్షణ తీసుకున్న అధికారులు అక్కడకెళ్లి స్థానికంగా ఉండే మత్స్యకారులతో పాటు స్వయం సహాయక సంఘాలకు (ఎస్‌హెచ్‌జీ) శిక్షణ ఇస్తే వారి ఆదాయ మార్గాలను పెంచేందుకు దోహదపడుతుందని ఆయన చెప్పారు. విశాఖపట్నం బీచ్ రోడ్డులో ఉన్న సంస్థ కార్యాలయంలో వీరికి ఐదురోజుల పాటు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ‘సాక్ష్రి’ ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడింది. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం
మత్స్యసంపదకు తీవ్ర నష్టం!
ఈశాన్య రాష్ట్రాల్లో చేపలు పట్టేందుకు ప్రధానంగా మెకానికల్ స్టుపెఫైయింగ్ పద్ధతిలో రాళ్లు విసరడం, డైనమైట్ వంటి పేలుడు పదార్థాలను ఉపయోగించడం చేస్తుంటారు. దీనిని సాధారణంగా బ్లాస్ట్ లేదా డైనమైట్ ఫిషింగ్ అని పిలుస్తారు. ఈ పద్ధతి చాలా హానికరం. ఈ పద్ధతిలో కేవలం మనం ఆహారంగా తీసుకునేందుకు అవసరమయ్యే చేపలతో పాటు వాటి గుడ్లు, ఇతర జలచరాలు కూడా చనిపోతాయి.
ఇక మరో పద్ధతి.. ఫిష్ పాయిజనింగ్. ఈ పద్ధతిలో రాగి, సున్నం వంటి రసాయనాలను వినియోగిస్తారు. గిరిజన సంఘాలు ఈ పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. ఈ పద్ధతిలో కూడా చిన్న చేపల నుంచి పెద్ద చేపల వరకూ చనిపోతాయి. అంతేకాక.. చేపలలో విష రసాయనాలు ఉంటాయి. వీటిని తినడం ఆరోగ్యానికి హానికరం కూడా. ఈ పారే నీటిని కిందనున్న ప్రాంతాల వారు తాగేందుకు వినియోగించే అవకాశం ఉంటుంది. తద్వారా వారి ఆరోగ్యాలు కూడా పాడవుతాయి.
ఇక మూడో పద్ధతి.. ఎలక్ట్రికల్ ఫిషింగ్. ఈ పద్ధతిలో కరెంట్ షాక్ ఇవ్వడం ద్వారా చేపలు కదలకుండా పక్షవాతం వచ్చినట్లుగా పడిపోతాయి. తద్వారా వాటిని వలలతో పట్టుకోవడం సులభమవుతుంది. ఈ అన్ని పద్ధతుల్లో మత్స్యసంపద దెబ్బతినడంతో పాటు పర్యావరణ వ్యవస్థను కూడా ధ్వంసం చేస్తుంది. అందుకే వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
ప్రతీచోట ఏపీ ఫిష్ మార్కెట్..
ఇక ఈశాన్య రాష్ట్రాల్లో ప్రతీ ప్రాంతంలో రెండు చేపల మార్కెట్లు ఉన్నాయి. ఒకటి స్థానిక చేపల మార్కెట్ కాగా.. మరొకటి ఆంధ్రప్రదేశ్ ఫిష్ మార్కెట్. అక్కడ ఏపీ చేపలకు అంత డిమాండ్ ఉంది. మేం చూసిన ప్రతీ ప్రాంతంలో చేపల మార్కెట్ ఎక్కడా అని ఆరాతీస్తే.. ఏ మార్కెట్ కావాలి? లోకల్ ఫిష్ మార్కెటా? ఏపీ ఫిష్ మార్కెట్ కావాలా అని అడిగే వారు. ఇక విమానాశ్రయాల్లో కూడా చేపల ఉత్పత్తుల విక్రయం జరుగుతుంది.
ప్రత్యేక పద్ధతుల్లో తయారుచేసిన చేపలను అక్కడ విక్రయిస్తున్నారు. వాటికి స్థానికుల నుంచి మంచి డిమాండ్ ఉంటోంది. అయితే, మన విమానాశ్రయాల్లో అటువంటి పరిస్థితిలేదు. మరింతగా చేపల వినియోగాన్ని, మార్కెట్‌ను పెంచేందుకు ఇటువంటి పద్ధతులను మనం కూడా ఆచరించాల్సిన అవసరం ఉంది.
తాబేళ్ల రక్షణకు ప్రత్యేక వలలు..
సముద్రంలో వేటకు వెళ్తున్న మత్స్యకారులు వినియోగిస్తున్న వలల్లో తాబేళ్లు కూడా చిక్కుకుంటున్నాయి. తద్వారా తాబేళ్లు మృతువాత పడుతున్నాయి. దీనిని నివారించేందుకు తాబేళ్ల రక్షణ కోసం ప్రత్యేకంగా టర్టిల్ ఎక్స్‌క్లూడర్ డివైజ్ (టెడ్)లను అభివృద్ధి చేశాం.
తాబేళ్ల రక్షణ కోసం ఈ వలలను ప్రత్యేకంగ ఉపయోగించే దిశగా మత్స్యకారులకు అవగాహన కల్పిస్తున్నాం. మొదటి దశలో 60 వేల వరకూ తయారుచేస్తున్నాం. అయితే, వీటి ధర అధికంగా ఉంది. వీటిని సబ్సిడీపై అందించేందుకు ప్రయత్నిస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment