
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి సర్కార్ కక్ష సాధింపులు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయని మండిపడ్డారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. వైఎస్సార్ పేరును గోడల మీద, స్టేడియం మీద నుంచి చెరిస్తారేమో కానీ.. ప్రజల గుండెల్లో నుంచి తొలగించలేరని అన్నారు. వైఎస్సార్ పేరు వింటేనే కూటమి నేతలకు వణుకు పుడుతోందన్నారు.
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తాజాగా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి వైఎస్సార్‌సీపీ లేకుండా చేయాలని చూస్తున్నారు. వైఎస్సార్ పేరు, బ్రాండ్ లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నాగార్జున యూనివర్సిటీలో వైఎస్ విగ్రహాన్ని తొలగించారు. బాపట్లలో వైఎస్సార్ విగ్రహాన్ని తగలబెట్టారు. ఇప్పుడు క్రికెట్ స్టేడియానికి వైఎస్ పేరు తొలగించారు. సీతకొండ వ్యూ పాయింట్‌కి వైఎస్ పేరు చేరిపివేశారు. వైఎస్సార్ పేరు గోడల మీద, స్టేడియం మీద నుంచి చెరిస్తారేమో కానీ.. ప్రజల గుండెల్లో నుంచి తొలగించలేరు.
రేపు ఉదయం 10 గంటలకి స్టేడియం వద్ద నిరసన కార్యక్రమం చేపడతాం. వైఎస్సార్ రాష్ట్రానికి చేసిన సేవకు గుర్తుగా క్రికెట్ స్టేడియానికి పేరు పెట్టారు. వైఎస్సార్ పేరు వింటేనే కూటమి నేతలకు వెన్నులో వణుకు పుడుతోంది. గతంలో వైజాగ్ ఫిలింనగర్ క్లబ్‌లో లాన్‌కు ఉన్న వైఎస్సార్ పేరు తొలగించారు. అలాగే, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పేరు తొలగించారు. ఒక జిల్లాకి ఎన్టీఆర్ పేరును కూడా చంద్రబాబు పెట్టలేకపోయారు. కానీ, ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన నాయకుడు వైఎస్ జగన్’ అని చెప్పుకొచ్చారు.

Comments
Please login to add a commentAdd a comment