
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ బ్రాండ్ ఉండకూడదని ప్రయత్నిస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. వైఎస్సార్ చరిత్ర.. చెరిపేస్తే చెరిగిపోయేది కాదని చెప్పుకొచ్చారు. విశాఖ స్టేడియానికి వైఎస్సార్ పేరును తొలగించడం దుర్మార్గమైన చర్య అంటూ మండిపడ్డారు.
విశాఖ క్రికెట్ స్టేడియం వద్ద వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. దివంగత మహానేత వైఎస్సార్ పేరును క్రికెట్ స్టేడియానికి తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ నేతలు నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలోనే తొలగించిన పేరు యథావిధిగా పెట్టాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా స్టేడియం వద్దకు భారీ సంఖ్యలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు చేరుకుని కూటమి సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్సార్ చనిపోయిన తర్వాత 2009లో విశాఖలోని స్టేడియానికి ఆయన పేరు పెట్టారు. వైఎస్సార్ ఉమ్మడి రాష్ట్రానికి చేసిన సేవకు గుర్తుగా తీర్మానం చేసి పేరు పెట్టారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ బ్రాండ్ ఉండకూడదు అని చూస్తున్నారు. అధికారంలోకి రావడంతో నాగార్జున యూనివర్సిటీలో ఉన్న వైఎస్సార్ విగ్రహం తొలగించారు. బాపట్లలో ఆయన విగ్రహాన్ని తగలబెట్టారు. సీత కొండ వ్యూ పాయింట్‌కు పేరు తొలగించారు.

ACA స్పందించాలి..
కూటమి ప్రభుత్వం ఉన్మాద చర్యలు మానుకోవాలి. స్టేడియం దగ్గర వైఎస్సార్ విగ్రహాన్ని ACA పెట్టింది. 48 గంటలు అవుతున్నా ఈ ఘటనపై ACA నోరు విప్పలేదు. రాజకీయాల్లో ఉన్నవారు క్రికెట్ అసోసియేషన్‌లో ఉండరాదు. దానికి భిన్నంగా కూటమి ఎంపీలు ఉన్నారు. వైఎస్సార్ పేరు చెబితే ఎందుకు భయపడుతున్నారు?. విశాఖలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు ప్రైవేట్ పరం కాకుండా చేశారు. వైఎస్ జగన్ సీఎంగా అండగా జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెట్టారు. నాలుగు సార్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు ఎందుకు జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టలేదు?. ఎన్టీఆర్‌కు ఎందుకు భారతరత్నను చంద్రబాబు ఎందుకు డిమాండ్ చేయలేదు?.
ఏపీలో వైఎస్సార్‌సీపీ హయాంలో ఆడుదాం ఆంధ్ర ద్వారా వైఎస్ జగన్ లక్షలాది మంది క్రీడాకారులను ప్రోత్సహించారు. వైఎస్సార్ చరిత్ర.. చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. ఇప్పటికైనా తొలగించిన వైఎస్సార్ పేరును వెంటనే స్టేడియానికి పెట్టాలి. పేరు తొలగించడంపై ACA నోరు విప్పాలి’ అని డిమాండ్ చేశారు.
పోలీసుల మోహరింపు..
మరోవైపు.. వైఎస్సార్‌సీపీ నేతల నిరసనల నేపథ్యంలో కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగింది. చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. గురువారం తెల్లవారుజామునుంచే వైఎస్సార్‌సీపీ నేతలను ముందస్తు అరెస్ట్‌లు చేశారు. అంతేకాకుండా క్రికెట్ స్టేడియం వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.
ఇదిలా ఉండగా, నగరంలోని పీఎంపాలెం వద్దనున్న డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మాజీ సీఎం వైఎస్సార్ పేరును పాలకవర్గం తొలగించింది. వైఎస్సార్ రాష్ట్రానికి అందించిన సేవలకు గుర్తుగా 2009 సెప్టెంబరు 14న అప్పటి ఏసీఏ అధ్యక్షుడు గోకరాజు గంగరాజు ఆధ్వర్యంలో ఏసీఏ–వీడీసీఏ స్టేడియాన్ని వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంగా పేరు మార్చారు. అప్పుడు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది.
తాజాగా.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ప్రధానంగా విశాఖలో వైఎస్సార్ గుర్తులు తుడిచేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా విశాఖ బీచ్ తదితరచోట్ల వైఎస్సార్ వ్యూ పాయింట్లు ధ్వంసం చేశారు. అలాగే, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో పలుచోట్ల ఉన్న వైఎస్సార్ పేరును మరమ్మతుల పేరిట తొలగించేస్తున్నారు. ఈ చర్యపట్ల క్రికెట్ అభిమానులతోపాటు వైఎస్సార్ అభిమానులు మండిపడుతున్నారు. ప్రభుత్వం మార్కు తన పాలనలో చూపించాలిగానీ ఇలాంటి విధ్వంసకర విషయాల్లో కాదని ఆక్షేపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment