‘సాక్షి’తో కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి, పీఎన్‌జీ మాజీ జేఎస్ ప్రొ.పద్మనాభయ్య
ఏపీలోనూ పుష్కలంగా తీర ప్రాంత ఖనిజ సంపద
ఖనిజాల వెలికితీతతో దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది
అవసరమైన మేరకే ఖనిజాలు వెలికితీస్తే మంచిది
అదే సమయంలో అక్రమ మైనింగ్ నియంత్రించాలి
సాక్షి, విశాఖపట్నం: బీచ్ శాండ్ ఇండస్ట్రీలో అపారమైన అవకాశాలున్నాయని.. దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను మార్చేఖనిజాలు బీచ్ సొంతమని కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి, కేంద్ర పెట్రోలియం నేచురల్ గ్యాస్ మాజీ జాయింట్ సెక్రటరీ, ఆస్కీ చైర్మన్ పద్మభూషణ్ ప్రొ.పద్మనాభయ్య అన్నారు. ఆంధ్రప్రదేశ్ తీరంలోనూ అపారమైన తీర ప్రాంత ఖనిజ సంపద ఉందని పలు అధ్యయనాలు వెల్లడించాయన్నారు.
అవసరమైన మేరకే ఖనిజాలు వెలికితీస్తే మంచిదని.. అదే సమయంలో అక్రమ మైనింగ్ నియంత్రించాలి్సన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. లేదంటే పర్యావరణ విఘాతం తప్పదని హెచ్చరించారు. కేంద్ర మైనింగ్ మంత్రిత్వ శాఖ, ఏపీ మినరల్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) ఆధ్వర్యంలో కరెంట్ ట్రెండ్స్ ఇన్ మైనింగ్, బీచ్ శాండ్ ఇండస్ట్రీలో ఉన్న అవకాశాలు అనే అంశంపై శుక్రవారం ఏయూలో జాతీయస్థాయి సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ప్రొ. పద్మనాభయ్య ‘సాక్షి’తో పలు అంశాలు మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
దేశంలో 130 బీచ్ మైనింగ్ డిపాజిట్స్..
దేశంలోని తీర ప్రాంతాల్లో 130 మైనింగ్ డిపాజిట్స్ ఉన్నాయి. ఒడిశాలోని ఛత్రపూర్, తమిళనాడులోని మనవల్లకురిచి, కేరళలోని చేవరాలో మాత్రమే పనులు నడుస్తున్నాయి. అన్ని మైనింగ్ బ్లాక్స్‌ను ప్రారంభిస్తే అద్భుతంగా ఉంటుంది. నిజానికి.. బీచ్ శాండ్ మైనింగ్ ఇండస్ట్రీలో మేజర్ గ్లోబల్ ప్లేయర్‌గా భారత్ మారేందుకు పుష్కలమైన అవకాశాలున్నాయి. ఎందుకంటే ప్రపంచంలోనే ఎక్కడాలేని అత్యంత విలువైన నాణ్యమైన అరుదైన ఖనిజ సంపద భారత సాగర తీరంలో ఉంది. అద్భుతమైన ఎలిమినైట్ ఖనిజం నిల్వలున్న దేశంగా మూడో స్థానంలో ఉంది.
అదేవిధంగా.. మన దేశ తీర ప్రాంతంలో మోనోజైట్ ఖనిజం కూడా అత్యధికంగా లభ్యమవుతుంది. ఇవన్నీ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ వెలికితీసే ప్రక్రియ ప్రారంభిస్తే.. భారత్ ప్రపంచంలోనే మంచి స్థానంలో ఉంటుంది. ప్రభుత్వాలే ఖనిజ సంపదను వెలికితీసే బాధ్యతని భుజానికెత్తుకోవాలి. ముఖ్యంగా పీపీపీ విధానాన్ని ఇందులో అవకాశాలు కల్పించాలి. అప్పుడే అక్రమ మైనింగ్‌ని నిరోధించవచ్చు. అలాగే, బీచ్ శాండ్ అక్రమ తవ్వకాలపై నమోదవుతున్న కేసుల విచారణ ఆలస్యమవుతుండటం విచారకరం. వీలైనంత త్వరగా.. ఈ తరహా అక్రమ కేసుల విచారణ వేగవంతమైతే వీటిని నియంత్రించే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment