
డిజీ చెల్లింపుల్లో దూసుకుపోతున్న భారతీయ మహిళలు
2014లో 14 శాతం మంది మహిళలు మాత్రమే ఈ చెల్లింపులు
2023 నాటికి 37 శాతం మంది వినియోగించారని క్రిసిల్ నివేదిక వెల్లడి
డిజీ చెల్లింపులపై 20 కోట్ల మంది అతివల ఆసక్తి
మొబైల్ ఇంటర్నెట్‌లోనూ అదే వృద్ధి
బ్యాంకింగ్ సేవల్లోనూ మహిళలే మహరాణులంటున్న ఆర్‌బీఐ
సాక్షి, విశాఖపట్నం: ప్రస్తుతం దేశంలో డిజిటల్ పేమెంట్స్ అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. చిన్నచిన్న చెల్లింపులకు సైతం ఫోన్ ద్వారానే చెల్లించేస్తున్నారు. ఈ విషయంలో భారత్ ఎంతో పురోగతి సాధిస్తోంది. పెద్ద దేశాలైన అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్‌లు 2022 డిసెంబరులో చేసిన డిజిటల్ పేమెంట్స్ మొత్తాన్ని కూడినా.. భారత్ చేసిన డిజిటల్ పేమెంట్స్‌ను అందుకోలేకపోయాయి. ఈ క్రమంలో మన దేశంలో అతివలూ సాంకేతికంగా ఎంతో అప్‌డేట్ అయ్యారు. డిజీ చెల్లింపుల్లో తామేమీ తీసిపోలేదని నిరూపిస్తున్నారు.
నేషనల్ పేమెంట్స్
కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) అందుబాటులోకి తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) సౌకర్యంతో ఈ సేవలు మరింత సులభమైపోవడమే ఇందుకు కారణం. దీంతో.. చిల్లర కొట్టు, షాపింగ్, బ్యూటీ పార్లర్, కిరాణా సామాన్లు.. ఇలా ఎక్కడికెళ్లినా వారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తూ డబ్బు చెల్లింపులు చేసేస్తున్నారు.
ఈ నేపథ్యంలో.. ఏటా దేశంలో డిజిటల్ చెల్లింపులు 200 మిలియన్ డాలర్లు దాటుతున్నాయంటూ క్రిసిల్ ఇటీవల తన నివేదికలో వెల్లడించింది. ఇందులో మహిళల వాటా తక్కువేమీ కాదు. ఈ విషయంలో ఏటా వీరి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మరోవైపు.. బ్యాంకింగ్ సేవల వినియోగంలోనూ మహిళలే మహరాణులంటూ భారతీయ రిజర్వ్ బ్యాంకు చెబుతోంది.
నిజానికి.. డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ఎప్పటికప్పుడు కొత్త వృద్ధి రేటుని నమోదు చేస్తోంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.8,839 కోట్లు డిజిటల్ చెల్లింపులు దేశంలో జరగ్గా.. 2023–24లో 111.9 శాతం పెరిగి అది రూ.18,737 కోట్లకు చేరుకుంది. ఇదే సమయంలో డిజిటల్ చెల్లింపులు వినియోగిస్తున్న వారిలో మహిళల సంఖ్య కూడా గణనీయంగా పెరగడం గమనార్హం. క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (క్రిసిల్) ఇటీవల విడుదల చేసిన నివేదికలో డిజీ చెల్లింపుల్లో ఆడ, మగ మధ్య ఉన్న అంతరం వేగంగా తగ్గుతూ వస్తోందని వెల్లడించింది.
ఏడేళ్లలో చెల్లింపులు రెట్టింపు..
2014 నాటికి మహిళల డిజిటల్ చెల్లింపులు కేవలం 14 శాతం మాత్రమే ఉండేవి. కానీ, 2021 నాటికి 200 శాతం పెరిగి 28 శాతానికి చేరుకున్నట్లు క్రిసిల్ వెల్లడించింది. 2023 నాటికి అది 37 శాతానికి పెరిగింది. ఇక పురుషుల విషయానికి వస్తే.. 2014లో 30 శాతం వరకూ ఉండగా.. 2021 నాటికి 41 శాతానికి, 2023 నాటికి 52 శాతానికి పెరిగింది. సాంకేతికతపై పెరుగుతున్న అవగాహనే దీనికి ప్రధాన కారణమని క్రిసిల్ ఆ నివేదికలో అభిప్రాయపడింది.
వ్యాపారంలోనూ డీజీ సేవలే..
మహిళలు స్వయం ఉపాధితో పాటు కుటీర పరిశ్రమలు, చిన్నచిన్న దుకాణాలు నడుపుతున్నారు. వీరు కూడా అత్యధిక శాతం మంది డిజిటల్ పేమెంట్స్ సేవలు తమ వ్యాపారాల్లోకి తీసుకొచ్చారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో 11.08 మిలియన్ యూఎస్ డాలర్ల యూపీఐ చెల్లింపులు భారత్‌లో జరగ్గా.. 2022–23లో ఏకంగా 1.01 బిలియన్ యూఎస్ డాలర్లకు చేరుకుంది.
విభిన్న వ్యాపార వినియోగంలో మహిళలు 22 శాతం మంది యూపీఐ వినియోగిస్తుండగా.. పురుషులు 40 శాతం లావాదేవీలు సాగిస్తున్నారు. సొంత వ్యాపారంలో 55 శాతం మంది పురుషులు యూపీఐ వాడుతుండగా.. మహిళలు 36 శాతం వినియోగిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ వినియోగంలోనూ మహిళలు, పురుషుల మధ్య అంతరం చాలావరకూ తగ్గింది. సొంత అవసరాల కోసం 79% మంది పురుషులు స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తుండగా.. మహిళలు 75% వాడుతున్నారు.
ఏటా 20 కోట్ల మంది డిజీ పేమెంట్స్..
ఇక దేశంలో 15 ఏళ్లు పైబడిన వారు 53.60 కోట్ల మంది మహిళలుండగా.. వీరిలో 37 శాతం మంది మొబైల్‌లో ఇంటర్నెట్‌ని వివిధ అవసరాల కోసం వినియోగిస్తున్నారు. అలాగే, 20 కోట్ల మందికి పైగా మహిళలు ఏటా యూపీఐ లావాదేవీల్లో భాగమవుతున్నారు. ఇందులో 7.4 కోట్ల మంది మహిళలు ఉపాధి రంగంలో ఉండగా.. 12.6 కోట్ల మంది ఇతర రంగాల్లో ఉన్నారని క్రిసిల్ నివేదిక చెబుతోంది. స్వయం ఉపాధి రంగంలో ఉంటూ డిజీ చెల్లింపులు వాడుతున్న వారు 4.8 కోట్ల మంది కాగా.. వేతనం మీద ఆధారపడిన మహిళలు 1.1 కోట్ల మంది, ఇతర ఉపాధిలో ఉన్నవారు 1.5 కోట్ల మంది యూపీఐ చెల్లింపులు చేస్తున్నారు.
బ్యాంకింగ్ సేవల్లోనూ అదే జోరు..
కేవలం డిజిటల్ లావాదేవీల విషయంలోనే కాకుండా.. బ్యాంకింగ్ సేవల వినియోగంలోనూ మహిళలు వృద్ధి సాధిస్తున్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఆర్థిక సూచీ ప్రకారం.. 2017లో బ్యాంకింగ్ సేవలు వినియోగించుకుంటున్న మహిళలు 43.4 శాతం ఉండగా.. 2024 మార్చి నాటికి 64.2 శాతానికి పెరిగినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. దీనికి కారణం ప్రధానమంత్రి జనధన్ యోజన (పీఎంజేడీవై) బ్యాంకు ఖాతాలేనని ఆర్‌బీఐ స్పష్టంచేసింది. పీఎంజేడీవై కింద ఇప్పటివరకూ 53.13 కోట్ల ఖాతాలుండగా.. వీటిలో సింహభాగం అంటే 29.56 కోట్ల ఖాతాలు మహిళల పేరుతో ఉండడం కొసమెరుపు.