విద్యుత్ వాహన కొనుగోళ్లపై 52 శాతం భారత మహిళల ఆసక్తి
2035 నాటికి దేశంలో 2.7 రెట్లు పెరగనున్న విద్యుత్ వాహన విక్రయాలు
గూగుల్ సర్వేలో ఆసక్తికర విషయాలు
సాక్షి, విశాఖపట్నం: ఏటా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు జనం గుండెల్ని గుభేల్‌మనిపిస్తున్నాయి. సామాన్యులే కాదు.. ఉన్నత వర్గాల వారు కూడా ఇంధన ధరల కారణంగా ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా.. అందరి చూపూ ఎలక్ట్రిక్ వాహనాల(electric vehicle)పై పడుతోంది. పెట్రోల్, డీజిల్‌తో పనిలేదు.. పరిమిత వేగం.. స్వల్ప బరువు.. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం.. పర్యావరణ హితం.. ఇలా బోలెడు ప్రయోజనాలున్న ఈ–వెహికల్స్‌పై ఆసక్తి పెరుగుతోంది.
తమకు ఉన్న వాహనంతో పాటు కొత్తగా ఇంకొకటి కొనాలంటే.. ఇప్పుడు చాలామంది ఈ–వెహికల్‌వైపు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా భారతీయ మహిళలు(Indian Women).. ఈవీలపై ఆసక్తిని పెంచుకుంటున్నారు. 52 శాతం మహిళలు ఈవీ కొనుగోలు చెయ్యాలంటూ ఇళ్లల్లో ఒత్తిడి తీసుకువస్తున్నారని ‘థింక్ మొబిలిటీ’ శీర్షికన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ)తో కలిసి గూగుల్ సంస్థ నిర్వహించిన సర్వే ఒకటి పేర్కొంది.
ఆందోళనలూ ఉన్నాయ్..
అయితే చాలా మంది ఇంకా బ్యాటరీలు పేలిపోవడం, చార్జింగ్ సౌకర్యాలు గణనీయంగా వృద్ధి చెందకపోవడం వంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్రతి ముగ్గురిలో ఒకరు బ్యాటరీ లైఫ్‌టైమ్ ఆశించినంతగా ఉండటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
అభిరుచులకు అనుగుణంగా మోడల్స్...
ఈవీలో తలెత్తుతున్న సవాళ్లని అధిగమిస్తూ.. కొనుగోలుదారుల అభిరుచులకు అనుగుణంగా అంతర్జాతీయ బ్రాండ్లతో పాటు మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్లు ఈ–వెహికల్స్‌ని మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. కొన్ని బ్రాండ్లు బ్యాటరీ కాలపరిమితిని పెంచుతూ మోడల్స్‌ని తీసుకువస్తున్నాయి. ఈ తరుణంలో ఇండియన్ ఆటోమోటివ్ మార్కెట్ గణనీయమైన వృద్ధి సాధిస్తోంది. సర్వే అధ్యయనం ప్రకారం 2035నాటికి ఈ– వాహన కొనుగోళ్లు 2.7 రెట్లు వరకూ పెరగనున్నాయి.
సర్వేలో వెల్లడైన మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు...
⇒ 3/1 కొత్త వెహికల్ కొనాలనుకునే వారిలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఈవీ వైపు మొగ్గు చూపుతున్నారు
⇒36 శాతం ఒక వాహనం ఉంటే రెండోది ఎలక్ట్రిక్ వెహికల్ కావాలని కోరుకుంటున్నవారు
⇒ 30 శాతం ఈ–బైక్ బెటర్ ఆప్షన్‌గా ఎంపిక చేసుకుంటున్న మహిళలు
⇒ 41 శాతం జీపీఎస్ సౌకర్యంపై మక్కువ చూపుతున్నవారు
⇒ 45 శాతం ఫ్యూయల్ వాహనాలతో పోలిస్తే.. ఈవీలతో డబ్బులు ఆదా అవుతున్నాయని భావిస్తున్నవారు
ఫ్యూయల్ కోసం ఇబ్బందులు లేవు
ఇంట్లో కారు, ఫ్యూయల్ స్కూటీ ఉన్నా.. పట్టుబట్టి మరీ ఎలక్ట్రిక్ స్కూటీని తీసుకున్నాను. ఇది చాలా సౌలభ్యంగా ఉంది. ఇంధన వెహికల్ అయితే.. ఫ్యూయల్ కోసం బంకుల కోసం వెతుకులాట ప్రయాసగా ఉంటోంది. ఈ–బైక్ అయితే ఇంట్లోనే చార్జింగ్ పెట్టుకుంటే చాలు. హ్యాపీగా ఇబ్బందులు లేకుండా ప్రయాణం చేసుకోవచ్చు. నాలుగు గంటల సమయం వరకు చార్జింగ్ పెడితే దాదాపు 100 నుంచి 120 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది.
– గంపా చైతన్యజ్యోతి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్
తేలిగ్గా డ్రైవ్
సాధారణ స్కూటీలతో పోలిస్తే ఈవీ చాలా తేలిగ్గా డ్రైవ్ చేసుకోగలుగుతున్నాను. ముఖ్యంగా ఇందులో ఉన్న నేవిగేషన్ సిస్టమ్‌కి ఫిదా అయిపోయి ఈ–స్కూటీ కొనుగోలు చేశాను. ఎవరినీ అడ్రస్ అడగాల్సిన అవసరం లేకుండా.. ఎక్కడికి కావాలంటే అక్కడికి నేరుగా స్క్రీన్‌లో చూసుకుంటూ వెళ్లిపోగలుగుతున్నాం. ఇప్పుడు దాదాపు అన్ని చోట్లా చార్జింగ్ స్టేషన్లు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. భవిష్యత్తులో ఈ–కారునే కొంటాం.
– సీహెచ్ లక్ష్మి, గృహిణి
Comments
Please login to add a commentAdd a comment