![Nasscom deloitte report 3 new tech hubs in Andhra Pradesh - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/1/Nasscom-deloitte-report-3-new-tech.jpg.webp?itok=XjiPrHwl)
Nasscom-Deloitte Report: ఆధునిక ప్రపంచంలో భారతదేశం అభివృద్ధివైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రాలు కూడా ఇదే దిశలో పయనిస్తున్నాయి. దేశంలో 26 డెవెలప్ అవుతున్న టైర్-2 నగరాలు టెక్నాలజీ హబ్‌లుగా అభివృద్ధి చెందుతున్నాయని డెలాయిట్ ఇండియా వెల్లడించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు నగరాలు ఉన్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు నగరాలు..
అభివృద్ధి చెందిన నగరాలతో పోలిస్తే.. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఖర్చులు 25 నుంచి 30 శాతం తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రెంటల్స్‌లో 50 శాతం ఖర్చు ఆదా అవుతుంది. మన రాష్ట్రంలో టెక్ హబ్‌లుగా అవతరిస్తున్న నగరాల్లో తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణం ఉన్నాయి.
ప్రస్తుతం భారతదేశంలోని టెక్నాలజీ రంగానికి అవసరమయ్యే నిపుణుల్లో 11 నుంచి 15 శాతం మంది ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఉన్నారు. అలాగే ఇంజనీరింగ్, ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన వారు 60 శాతం మంది చిన్న పట్టణాల్లో ఉన్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: చంద్రయాన్-3 సక్సెస్.. ఇస్రో ఉద్యోగుల జీతాలు ఎంతో తెలుసా?
దేశంలోని మొత్తం స్టార్టప్‌లలో 39 శాతం (7,000 కంటే ఎక్కువ) డీప్ టెక్ నుంచి బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ (BPM) వరకు పరిశ్రమలు విస్తరించి ఉన్న ఈ అభివృద్ధి చెందుతున్న టైర్-2 నగరాల్లో పనిచేస్తున్నాయి. టెక్నాలజీకి సంబంధించి పెద్ద నగరాలు గతంలో ఫోకస్‌లో ఉన్నప్పటికీ.. కరోనా మహమ్మారి తరువాత దేశవ్యాప్తంగా చెప్పుకో తగ్గ స్థాయిలో వికేంద్రీకరణ జరిగింది.
2014 - 2018 మధ్య కాలంలో కంపెనీలు గణనీయంగా ఎదిగాయి. 2025 నాటికి ఇవి 2.2 రెట్లు వృద్ధి చెందనున్నట్లు తెలుస్తోంది. ఇన్వెస్టర్లు కూడా ప్రస్తుతం పెద్ద నగరాల్లో మాత్రమే కాకుండా చిన్న పట్టణాల్లోని సంస్థల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. రానున్న రోజుల్లో మనదేశంలో మరిన్ని కొత్త నగరాలు టెక్ హబ్‌లుగా మారతాయని చెప్పడానికి ఇదే నిదర్శనం.
Comments
Please login to add a commentAdd a comment