15 రాష్ట్రాల్లోనే 90 శాతం డిజిటల్‌ చెల్లింపులు  | 90 percent digital payments in 15 states | Sakshi
Sakshi News home page

15 రాష్ట్రాల్లోనే 90 శాతం డిజిటల్‌ చెల్లింపులు 

Published Thu, Aug 24 2023 4:15 AM | Last Updated on Thu, Aug 24 2023 4:15 AM

90 percent digital payments in 15 states - Sakshi

సాక్షి, అమరావతి: డిజిటల్‌ చెల్లింపుల విలువ, పరిమాణంలో 90 శాతం వాటా దేశంలో టాప్‌ 15 రాష్ట్రాలదేనని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రీసెర్చ్‌ నివేదిక స్పష్టం చేసింది. ఈ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉండగా మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక తర్వాత స్థానాల్లో ఉన్నాయని పేర్కొంది. ఈ రాష్ట్రాల్లో సగటు డిజిటల్‌ చెల్లింపుల పరిమాణం రూ.2,000 నుంచి రూ.2,200 వరకు ఉందని తెలిపింది.

ఏపీ, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక తర్వాత అత్యధికంగా డిజిటల్‌ చెల్లింపులు జరిగిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, బిహార్, పశ్చిమ బెంగాల్‌ ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో సగటు డిజిటల్‌ చెల్లింపుల పరిమాణం రూ.1,800 నుంచి రూ.2,000 వరకు ఉంది. వీటి తర్వాత ఒడిశా, కేరళ, మధ్యప్రదేశ్, గుజరాత్, అసోం, హరియాణాల్లో డిజిటల్‌ చెల్లింపుల పరిమాణం రూ.1,600 నుంచి రూ.1,800 వరకు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.   

డిజిటల్‌ చెల్లింపుల్లో ఏపీ వాటా 8–12 శాతం 
డిజిటల్‌ చెల్లింపుల్లో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ వాటా 8–12 శాతంగా ఉందని నివేదిక పేర్కొంది. దేశంలో జిల్లాల వారీగా యూపీఐ డిజిటల్‌ చెల్లింపుల పరిమాణం, విలువల్లో టాప్‌ 100 జిల్లాలే 45 శాతం వాటా కలిగి ఉన్నట్లు తేలింది. దేశ జీడీపీలో 2017లో ఏటీఎంల నుంచి 15.4 శాతం నగదు ఉపసంహరణలు జరగ్గా.. 2023లో 12.1 శాతానికి ఇవి తగ్గిపోయాయి. గతంలో ఒక వ్యక్తి ఏడాదిలో ఏటీఎంలకు 16 సార్లు వెళ్తే ఇప్పుడు 8 సార్లుకు పడిపోయింది.  

గ్రామీణ, సెమీ అర్బన్‌  ప్రాంతాల్లో 60 శాతం వాటా.. 
రూ.2 వేల నోట్ల ఉపసంహరణ యూపీఐ చెల్లింపులపై ఎటువంటి ప్రభావం చూపలేదని నివేదిక విశ్లేషించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 414 బ్యాంకుల్లో యూపీఐ ద్వారా 890 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగాయి. వీటి మొత్తం విలువ రూ.14.1 లక్షల కోట్లుగా ఉందని నివేదిక తెలిపింది. దీన్నిబట్టి నగదు రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా దేశం ముందుకు వెళ్తున్నట్టు స్పష్టమవుతోందని పేర్కొంది. డిజిటల్‌ చెల్లింపులు కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాలేదని, గ్రామీణ, సెమీ అర్బన్‌ ప్రాంతాలు కూడా ఆశ్చర్యకరంగా 60 శాతం వాటాను కలిగి ఉన్నట్లు 
వెల్లడించింది.   

767 శాతానికి పెరిగిన డిజిటల్‌ చెల్లింపులు.. 
డిజిటల్‌ లావాదేవీలకు సంబంధించి 2016లో ప్రారంభించిన యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిందని ఎస్‌బీఐ నివేదిక తెలిపింది. మొత్తం డిజిటల్‌ చెల్లింపులు 2016లో దేశ జీడీపీలో 668 శాతం ఉండగా 2023 నాటికి 767 శాతానికి పెరిగాయి. రిటైల్‌ డిజిటల్‌ చెల్లింపులు (ఆర్‌టీజీఎస్‌ మినహా) 2016లో దేశ జీడీపీలో 129 శాతం ఉండగా 2023లో 242 శాతానికి పెరిగాయి.

దేశంలో వ్యక్తి నుంచి మరో వ్యక్తికి, వ్యక్తి నుంచి వ్యాపారికి మొత్తం డిజిటల్‌ చెల్లింపుల్లో యూపీఐ విలువ 73 శాతం ఉంది. ఈ లావాదేవీల్లో దేశం కొత్త మైలురాళ్లను అందుకుంది. యూపీఐ లావాదేవీల పరిమాణం 2017లో 1.8 కోట్ల నుంచి 2023 నాటికి 8,375 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో యూపీఐ లావాదేవీల విలువ రూ.6,947 కోట్ల నుంచి రూ.139 లక్షల కోట్లకు చేరింది. అంటే.. 2004 రెట్లు పెరిగింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement