ఐదేళ్లుగా బాధపడిన వారికి 31% ప్రమాదం
6–20 ఏళ్లుగా ఉన్న వారికి 50 శాతం
20 ఏళ్లకు పైగా బాధపడిన వారికి 67% ఎక్కువ ముప్పు.. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనంలో వెల్లడి
ఆరోగ్యకరమైన జీవన శైలి, ఆహారంతోనే రక్షణ
రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటి జీవన శైలి జబ్బులు ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారాయి. ఈ సమస్యలు కిడ్నీ, మెదడు, గుండె సంబంధిత పెద్ద జబ్బులకు ప్రధాన కారణమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం మన దేశంలో 4.58 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధ పడుతున్నారు. వీరిలో 1.17 కోట్ల మంది రాష్ట్రాల ఆరోగ్య శాఖ ద్వారా వైద్యుల పర్యవేక్షణలో మందులు, చికిత్సలు అందుకుంటున్నారు.
రక్తపోటు.. హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతోందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనంలో తేలింది. అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు అమెరికాలోని 27,310 మంది పెద్దల ఆరోగ్య రికార్డులను 12 ఏళ్లకు పైగా పరిశీలించారు. అధ్యయనంలో పాల్గొన్న వ్యక్తుల సగటు వయస్సు 65 ఏళ్లుగా ఉంది. – సాక్షి, అమరావతి
10 కంటే ఎక్కువైతే 20% ప్రమాదం
రక్తపోటు సగటు కంటే ఎక్కువయ్యే కొద్దీ స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుందని మిచిగాన్ యూనివర్సిటీ న్యూరాలజీ విభాగం గతంలో ఓ అధ్యయనంలో వెల్లడించింది. రక్తపోటు సగటు కంటే 10 ఎంఎం హెచ్‌జీ ఎక్కువగా ఉన్న వారిలో ఇస్కీమిక్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం 20 శాతం, ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్ ప్రమాదం 31 శాతం ఎక్కువగా ఉంటుందని కనుగొన్నారు.
31 నుంచి 67 శాతం ఎక్కువ ప్రమాదం
సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఐదేళ్లు అధిక రక్తపోటు సమస్యతో బాధపడిన వ్యక్తులు స్ట్రోక్ బారిన పడేందుకు 31 శాతం ఎక్కువ అవకాశాలు ఉంటాయని గుర్తించారు. ఆరు నుంచి 20 ఏళ్ల పాటు రక్తపోటు సమస్య ఉన్న వ్యక్తుల్లో 50 శాతం, రెండు దశాబ్ధాలుపైగానే సమస్యతో బాధపడే వ్యక్తుల్లో 67 శాతం ఎక్కువగా స్ట్రోక్‌కు గురయ్యే ప్రమాదం ఉందని అంచనా వేశారు.
ఈ నేపథ్యంలో ప్రజలు రక్తపోటు సంబంధిత లక్షణాలను ముందే గుర్తించి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇందుకోసం ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహార అలవాట్లు అలవరుచుకోవాలన్నారు. ముందస్తు జాగ్రత్తలు, చికిత్సల ద్వారా రక్తపోటు నియంత్రణలో ఉంచుకుంటే జీవితకాల వైకల్యం ముప్పు తప్పుతుందన్నారు.
ప్రస్తుతం ఎటువంటి లక్షణాలు లేకుండానే కొందరిలో రక్తపోటు చాప కింద నీరులా వృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో తరచూ రక్త పోటు పరీక్షలు చేయించుకుంటూ, ఉండాల్సినదాని కంటే ఎక్కువ రికార్డు అయితే వెంటనే అప్రమత్తం అవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు.
జీవన శైలిలో మార్పు రావాలి
ఆహారం, నిద్ర, జీవన శైలిపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వ్యాయామాన్ని రోజువారి దినచర్యలో ఓ భాగం చేసుకోవాలి. రోజుకు 30 నిమిషాలు వాకింగ్, జాగింగ్ తప్పనిసరిగా చేయాలి. ఒత్తిడిని దరి చేరనివ్వకుండా చూసుకోవాలి.
ప్రస్తుతం స్కూల్ పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ చిన్న చిన్న విషయాలకే తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. రక్తపోటు, మధుమేహం ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. వైద్య పరీక్షలు చేయించుకుంటూ సమస్యలను అదుపులో ఉంచుకోవాలి. – డాక్టర్ బి.విజయ చైతన్య, కార్డియాలజిస్ట్, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment