ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌.. ఆరోగ్యం మటాష్‌ | Scientists Says Do Not Eat Processed Food Products, Know Its Health Risks And What To Avoid | Sakshi
Sakshi News home page

ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌.. ఆరోగ్యం మటాష్‌

Published Mon, May 20 2024 5:08 AM | Last Updated on Mon, May 20 2024 9:34 AM

Scientists says Do Not Eat Processed Food Products

ఇవి తింటే క్యాన్సర్, స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం ముప్పు 

జీవనశైలి మార్పులతో పెరిగిన ప్యాకింగ్‌ ఫుడ్స్‌ వినియోగం 

గ్రామీణ ప్రాంతాల్లోనూ చొరబడటంపై నిపుణుల ఆందోళన 

ఐస్‌క్రీమ్, కూల్‌డ్రింక్స్, రెడీ మీల్స్, ప్రాసెస్డ్‌ మాంసం, నూడుల్స్‌ వద్దంటున్న శాస్త్రవేత్తలు 

‘బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌’లో ప్రచురించిన అధ్యయనంలో వెల్లడి

సాక్షి, అమరావతి: ప్రాసెస్డ్, అల్డా ప్రాసెస్డ్‌ ఆహారాల వినియోగం తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడుగురి పెద్దల్లో ఒకరు, ప్రతి 8మంది చిన్నారుల్లో ఒకరిని ప్రాసెస్డ్‌ ఫుడ్‌ వ్యసనపరులుగా మారుస్తోంది. ఐస్‌క్రీమ్, కూల్‌ డ్రింక్స్, రెడీ మీల్స్‌ (రెడీ టు ఈట్‌), ప్రాసెస్‌ చేసిన మాంసపు ఉత్పత్తులతో క్యాన్సర్, బరువు పెరుగుదల, గుండె జబ్బులు, మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా సంభవిస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. 36 దేశాలకు చెందిన 281 అధ్యయనాలను విశ్లేషించడం ద్వారా ‘అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్‌ అడిక్షన్‌’ ప్రమాదాలను కనుగొన్నారు. మొత్తం జనాభాలో 14 శాతం మంది పెద్దలు, 12 శాతం మంది చిన్నారులు నిత్యం ప్రాసెస్డ్‌ ఆహారాన్ని మాత్రమే భుజిస్తున్నట్టు బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనంలో తేలింది.  

మద్యంతో సమానం 
ప్రాసెస్డ్‌ ఆహార పదార్థాలు అతిగా తీసుకునే వారిలోనూ, ఆల్కాహాల్‌ తీసుకున్న వ్యక్తులలోనూ మెదడు స్ట్రియాటమ్‌లో ఎక్స్‌ట్రా సెల్యులర్‌ డోపమైన్‌ను ఒకే స్థాయిలో ప్రేరేపిస్తున్నట్టు తేల్చారు. తద్వారా తీవ్రమైన కోరికలు, స్థూలకాయం, తిండిపై నియంత్రణ లేకపోవడం, అతిగా తినే రుగ్మత, శారీరక–మానసిక అనారోగ్యం తదితర ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొంది. యూకే, యూఎస్‌లలో సగటు వ్యక్తి ఆహారంలో సగానికిపైగా ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌ వినియోగిస్తున్నారు. 

ఇలా ప్రపంచవ్యాప్తంగా అసమతుల్య ఆహారాన్ని తీసుకోవడంతో వైద్యం, పర్యావరణ కోసం ఏడాదికి 7 ట్రిలియన్‌ డాలర్లకుపైగా అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా స్థూలకాయం, నాన్‌–కమ్యూనికేబుల్‌ వ్యాధులు ఉన్నత, మధ్య ఆదాయ దేశాలలో గణనీయంగా పెరిగాయి. పట్టణీకరణ, జీవనశైలిలో మార్పులతోపాటు స్త్రీ, పురుషుల ఉద్యోగాలు, ప్రయాణ సమయాలు పెరగడంతో కొన్ని దేశాల్లో అధికంగా ప్రాసెస్‌ చేసిన ఆహార పదార్థాల వినియోగం ఎక్కువగా ఉంది. 

ప్రాసెస్‌ చేసిన జంతు ఆధారిత ఉత్పత్తులు, నూడుల్స్, కృత్రిమ స్వీటెనర్లతో కార్డియో వాసు్కలర్, కార్డియో మెటబోలిక్‌ కోమోర్చిడిటీలు 9శాతం పెరుగుతోంది. అయితే రొట్టెలు, తృణధాన్యాలు, మొక్కల ఆధారిత ఉత్పత్తులు వంటి ఇతర అల్ట్రా ప్రాసెస్‌ చేసిన ఆహారాలు ఎటువంటి ఆరోగ్య ప్రమాదాలను కలిగి ఉండవని నివేదించింది. 

పౌష్టికాహార భద్రత లోపం 
ఇప్పటికే ఆసియా, లాటిన్‌ అమెరికాల్లో అత్యంత ప్రాసెస్‌తోపాటు సహా ప్రాసెస్‌ చేసిన ఆహారాల వినియోగం పెరుగుతోంది. ఇది ఆఫ్రికాకు కూడా వేగంగా వ్యాపిస్తోంది. అయితే కోవిడ్‌–19కి ముందు స్థాయిల కంటే చాలా ఎక్కువగా ఉంది. తద్వారా పౌష్టికాహార లోపం భయపెడుతోంది. ప్రపంచ జనాభాలో దాదాపు 29.6 శాతం మంది (240 కోట్ల మంది ప్రజలు) 2022లో తీవ్రంగా ఆహార భద్రతను ఎదుర్కొన్నారు. వీరిలో దాదాపు 90 కోట్ల మంది (11.3 శాతం మంది) ఆహార అభద్రతలో తీవ్రంగా కూరుకుపోయారు. 

ఇక 2030లో దాదాపు 60 కోట్ల మంది దీర్ఘకాలికంగా పోషకాహార లోపంతో బాధపడతారని ఐక్యరాజ్య సమితి సైతం ఆందోళన చెందుతోంది. తొమ్మిది దక్షిణాసియా దేశాలలో పోషకాహార లోపం (24 కోట్ల మంది)లో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌ తర్వాత భారతదేశం మూడవ స్థానంలో ఉంది. 

భారత్‌లో పోషకాహార లోపం 2004–06లో 21.4 శాతం నుంచి 2020–22 నాటికి 16.6కి తగ్గింది. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌ ఎక్కడికక్కడ లభిస్తున్నాయి. నగరం/పట్టణం నుంచి 1–2 గంటలు, అంతకంటే ఎక్కువ ప్రయాణ సమయం ఉన్న గ్రామాల్లోనూ ఈ ఆహార విధానం వృద్ధి చెందడం ఆందోళన కలిగిస్తోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement