సాక్షి, అమరావతి బ్యూరో: వినోదం కోసం సినిమా థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు అక్కడ విక్రయించే తినుబండారాల ధరలను చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఆ థియేటర్, ఈ థియేటర్ అనే తేడా లేదు. థియేటర్ స్థాయి బట్టి ధరలు మోతమోగుతున్నాయి. సినిమా టికెట్టుకంటే స్నాక్స్, పాప్‌కార్న్, టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ ధరలే అధికం. విజయవాడలో ఏసీ, నాన్ ఏసీ థియేటర్లతో పాటు మల్టీప్లెక్స్‌లు వెరసి 46 వరకు ఉన్నాయి. థియేటర్లలో అన్ని తరగతుల వారికి వారి స్థాయిని బట్టి టికెట్ల ధరలుంటాయి. సినిమా హాళ్ల క్యాంటీన్లలో విక్రయించే తినుబండారాలకు మాత్రం అలాంటి భేదం లేదు.
చదవండి: Andhra Pradesh: ఏకగ్రీవ పంచాయతీలకు రూ.134.95 కోట్లు
ఏ క్లాస్‌కు వెళ్లిన వారి కైనా ఒకటే బాదుడు. ఇంటర్వెల్ సమయంలో ప్రేక్షకులకు పది నిమిషాల పాటు విరామం ఉంటుంది. ఆ సమయంలో క్యాంటీన్లకు వచ్చి తినుబండారాలు, కూల్ డ్రింక్స్, టీ, కాఫీ కొనుగోలు చేయడం రివాజు. కుటుంబ సమేతంగా వెళ్లిన వారు పిల్లలకు తినుబండారాలు కొనివ్వక తప్పదు. లేదంటే వారు మారం చేస్తారు. క్యాంటీన్లలో విక్రయించే ధరలు బయట దొరికే రేట్లకు ఏ మాత్రం పొంతన ఉండదు. ఉదాహరణకు 200 మిల్లీలీటర్ల కూల్ డ్రింక్ బాటిల్ ధర మార్కెట్లో రూ.14 (గాజు బాటిల్), రూ.20 (ప్లాస్టిక్ బాటిల్) ఉండగా థియేటర్లలో రూ.60 నుంచి 79 వరకు వసూలు చేస్తున్నారు.
బయట రూ.30కి దొరికే 150 గ్రాముల పాప్‌కార్న్ రూ.180, రూ.20 విలువచేసే స్వీట్‌కార్న్ రూ.60, రూ.20కే దొరికే ఐస్‌క్రీంను రూ.50కి, రూ.20ల కేక్, పఫ్ రూ.50 చొప్పున విక్రయిస్తున్నారు. బయట రూ.10లకే దొరికే టీ సినిమా హాళ్ల క్యాంటీన్లలో కొన్నిచోట్ల రూ.25, మల్టీప్లెక్స్‌ల్లో టీ, కాఫీ, లెమన్ టీలు ఏదైనా రూ.50 చొప్పున పిండుతున్నారు. సినిమా హాళ్ల క్యాంటీన్లలో నాలుగైదు రెట్ల అధికంగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.
మరో విచిత్రమేమిటంటే.. థియేటర్లలో విక్రయించే కొన్ని తినుబండారాలపై ప్రత్యేక ఎమ్మార్పీలుంటాయి. ఎవరైనా గట్టిగా నిలదీస్తే ‘ఎమ్మార్పీకే విక్రయిస్తున్నాం’ అని క్యాంటీన్ల నిర్వాహకులు దబా యిస్తుంటారు. థియేటర్లలో ధరలు భరించలేని వారెవరైనా బయట నుంచి తినుబండారాలను తీసుకెళ్లడానికి అనుమతించరు. కనీసం మంచి నీళ్ల బాటిల్‌ను కూడా తీసుకెళ్లనీయరు. గేటు బయటే అలాంటి వాటిని తిరస్కరిస్తారు. విధి లేని పరిస్థితుల్లో ప్రేక్షకులు చేతి చమురు వదిలించుకోవాల్సి వస్తోంది.
కుటుంబానికి రూ.వెయ్యి ఖర్చు
నలుగురు సభ్యులు ఉన్న కుటుంబం సినిమాకు వెళ్తే కనీసం రూ.వెయ్యి ఖర్చవుతోంది. మామూలు థియేటర్ టికెట్టు ధర రూ.100 ఉంటే నలుగురికి రూ.400 అవుతుంది. థియేటర్‌లో తినుబండారాలకు పొదుపుగా ఖర్చు చేస్తే మరో రూ.600 అయినా వెచ్చించక తప్పదు. ఇలా ఒక మధ్య తరగతి కుటుంబం సినిమాకి వెళ్లాలంటే రాను, పోను ఖర్చులు కాకుండా రూ.వెయ్యి భారం పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment