health problem
-
ఆమె చదువు మహిళలకు ఆదర్శం
తూర్పు గోదావరి: మండలంలోని పందలపాకకు చెందిన రుత్తల లీలాశ్రావణికి చదువుపై ఉన్న శ్రద్ధ మహిళలకు ఆదర్శంగా నిలిచింది. విజయవాడకు చెందిన ఈమె 2018–19 ఏడాది 9.7తో పదవ తరగతి పూర్తి చేసింది. అయితే ఆరోగ్య సమస్యల వల్ల చదువు మానేసింది. ఆ తర్వాత పందలపాకకు చెందిన యడ్ల మణికంఠతో వివాహం చేశారు. దీంతో ఆమె పందలపాక వచ్చింది. ఆమెకు ఒక పాప పుట్టింది. చదువు మళ్లీ కొనసాగించాలనే లక్ష్యంతో అడుగు ముందుకు వేసింది. అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పందలపాక గ్రామంలో మహిళల కోసం కళాశాలను ఏర్పాటు చేశారు. దీంతో ఆమె కాలేజీలో చేరి చదువు కొనసాగించింది. దీంతో కాలేజీ చేరిన ఇంటర్ మొదటి సంవత్సరంలో సీఈసీలో 479 మార్కులు సాధించింది. శనివారం వచ్చిన ఇంటర్ రెండో సంవత్సరం ఫలితాల్లో మొత్తం 943 మార్కులు సాధించింది. హైస్కూల్ ప్లస్ కాలేజీలో రాష్ట్రంలో మొదటి స్థానం రావడంతో చాలా సంతోషంగా ఉందని ఉపాధ్యాయురాలు కావడం తన కొరిక అని తెలిపింది. విద్యాశాఖ మంత్రి ఈ నెల 15వ తేదీన ఆమెను సత్కరించనున్నట్టు మేసేజ్ వచ్చిందని పందలపాక పడాల పెద్దపూల్లారెడ్డి జిల్లా పరిషత్ హెచ్ఎం చిర్ల శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
గమనించండి.. వర్కవుట్స్ వీరికి వర్కవుట్ కాదు!
వర్కౌట్స్ చేయడం ఎన్నో ప్రయోజనాలు అందించినప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నవారు వర్కవుట్స్ చేయకపోవడమే మంచిది. వారెవరో తెలుసుకుందాం. ఎముకలు, కండరాల సమస్యలు...లిగమెంట్స్ సమస్యలు, బెణుకులు, కీళ్ల గాయలు, ఎముకల పగుళ్ల వంటి సమస్యలు ఉన్నవారు వర్కౌట్ చేయడం వల్ల మరింత నష్టమవుతుంది కాబట్టి, ఈ సమస్యలున్నవారు పూర్తిగా కోలుకున్న తర్వాతే వర్కవుట్స్ చేయాలి. అదే విధంగా వళ్లునొప్పులు ఎక్కువగా ఉన్నా వర్కవుట్స్ చేయకూడదు.సర్జరీలు...కొన్నిసార్లు సర్జరీలు జరుగుతాయి. వీటి తర్వాత శరీరం కోలుకోవడానికి కొద్దిగా సమయ పడుతుంది. సర్జరీలు అయిన వెంటనే వర్కౌట్స్ చేస్తే ఇంటర్నల్ బ్లీడింగ్ కావొచ్చు. ఇతర సమస్యలు కూడా వస్తాయి. అదేవిధంగా స్త్రీలు సిజేరియన్ వంటి ఆపరేషన్ తర్వాత కోలుకునే వరకూ వాకింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలతోనే సరిపెట్టుకోవాలి. గుండె సమస్యలు...అరిథ్మియా, గుండె సమస్యలు, హై బ్లడ్ ప్రెజర్, హార్ట్ ఫెయిల్యూర్, గుండె సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా లేకుండా వర్కౌట్స్ చేయొద్దు. కష్టమైన వర్కౌట్స్ అసలే వద్దు. ఎక్కువ ఎఫెక్టివ్‌గా ఉండే వర్కౌట్స్ గుండెపై ప్రెజర్‌ని పెంచుతాయి. దీని వల్ల ఛాతీ నొప్పి, హార్ట్ బీట్‌లో తేడా వచ్చి ఏకంగా గుండె ఆగిపోయే ప్రమాదమే ఉంది కాబట్టి, వర్కౌట్స్ చేసే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.ఇన్ఫెక్షన్, ఫీవర్‌తో బాధపడేటప్పుడు...మీరు ఏదైనా ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నప్పుడు, ముఖ్యంగా జ్వరంతో ఉన్నప్పుడు ఎంత రెస్ట్ తీసుకుంటే అంత మంచిది. అలాంటి సమయంలో వర్కౌట్స్ చేయడం వల్ల డీహైడ్రేట్ అవుతారు. హార్ట్ బీట్ పెరుగుతుంది. కండరాల బలహీనత, అలసట పెరుగుతుంది. అంతేకాకుండా గాయాలు అవుతాయి. అందుకే, జ్వరం తగ్గేవరకూ వర్కౌట్స్ జోలికి పోకపోడమే మంచిది. చదవండి: ఏ భర్తా ఇవ్వలే(కూడ)ని వెడ్డింగ్ డే గిఫ్ట్ : కళ్లు చెమర్చే వైరల్ వీడియో -
ఇంకా ఆందోళనకరంగానే పరిస్థితి!
న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్యం తిరిగి ఆందోళనకర స్థాయికి చేరింది. కలుషిత గాలి కారణంగా జనం కళ్ల మంటలతో పాటు ఊపిరాడక ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ 450కి పైగా నమోదైంది. బవానాలో అత్యధిక ఏక్యూఐ స్థాయి 475 వద్ద నమోదైంది. ఇది చాలా తీవ్రమైన విభాగంలోకి వస్తుంది.నిర్మాణ పనుల నిలిపివేతడిసెంబర్ 16 నుంచి ఢిల్లీలో గ్రాప్ -4 నిబంధనలు అమలులో ఉన్నాయి. అయినప్పటికీ ఢిల్లీ గాలి నాణ్యతలో ఎలాంటి మెరుగుదల కనిపించడం లేదు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక 400 దాటింది. సొమవారం ఉదయం 6 గంటలకు ఢిల్లీలోని 25 కాలుష్య పర్యవేక్షణ కేంద్రాలలో గాలి నాణ్యత సూచిక 400 కంటే అధికంగా నమోదైంది. గ్రాప్-4 నిబంధనల అమలుతో ఢిల్లీలో నిర్మాణ పనులను పూర్తిగా నిషేధించారు. పాఠశాలలను కూడా హైబ్రిడ్ విధానంలో నడుపుతున్నారు.ఏడు ప్రాంతాల్లో 450 దాటిన ఏక్యూఐ ఢిల్లీలోని బవానాలో 475, రోహిణిలో 468, వజీర్‌పూర్‌లో 464, అశోక్ విహార్‌లో 460, సోనియా విహార్‌లో 456, జహంగీర్‌పురిలో453గా ఏక్యూఐ స్థాయి నమోదయ్యింది. ఇది ఢిల్లీవాసులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు ఈరోజు(సోమవారం) ఢిల్లీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఢిల్లీలో కాలుష్యంతో పాటు చలి కూడా అధికంగానే ఉంది. సోమవారం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్సియస్, గరిష్టంగా 20 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే మరో రెండు రోజుల పాటు ఢిల్లీలో దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఇది కూడా చదవండి: Year Ender 2024: కుటుంబం మెచ్చిన 10 అందమైన ప్రదేశాలు -
Delhi Pollution: గ్యాస్ ఛాంబర్ కన్నా ఘోరం.. బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు!
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత అత్యంత క్షీణ స్థాయికి చేరింది. ఢిల్లీ ఏక్యూఐ స్థాయి గురువారం 400 దాటింది. ఈ స్థాయి కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ గ్రాప్- 3ని నవంబర్ 15 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది.గ్రాప్- 3 నిబంధనల ప్రకారం కాలుష్యం అదుపులోకి వచ్చే వరకు నిర్మాణ సంబంధిత పనులను నిలిపివేయనున్నారు. భవనాల కూల్చివేతలు, మైనింగ్‌కు సంబంధించిన అన్ని రకాల కార్యకలాపాలు నిలిపివేయనున్నారు. ప్రాథమిక పాఠశాలలకు ఆన్లైన్ తరగతులు నిర్వహించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. గత రెండు రోజులుగా ఢిల్లీలో కాలుష్య స్థాయి అత్యంత పేలవమైన స్థాయి నుంచి తీవ్ర స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో గురువారం ఢిల్లీ ప్రభుత్వం గ్రీన్ వార్ రూమ్‌లో పర్యావరణ శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహించింది. అనంతరం పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్.. కాలుష్య నివారణకు చేపడుతున్న మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సంబంధిత శాఖలను ఆదేశించారు.రాజధాని ఢిల్లీ గాలి పీల్చడం ఇప్పుడు ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారింది. పంజాబ్-హర్యానాలలో పంట వ్యర్థాలను కాల్చడం వల్ల వచ్చే పొగ కారణంగా, రాజధాని ఢిల్లీ గ్యాస్ ఛాంబర్‌గా మారింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) తాజా డేటా ప్రకారం ఢిల్లీలో సగటు గాలి నాణ్యత సూచిక అంటే ఏక్యూఐ 452కి చేరింది. సైన్స్ మ్యాగజైన్ లాన్సెట్ న్యూరాలజీ జర్నల్‌లో ఇటీవల ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం వాయు కాలుష్యం కారణంగా సబ్రాక్నోయిడ్ హెమరేజ్(బ్రెయిన్ స్ట్రోక్-ఎస్ఏహెచ్) కేసులు పెరుగుతున్నాయి. తీవ్రమైన వాయు కాలుష్యంఅంగ వైకల్యానికి, అనేక సందర్భాల్లో గుండె వైఫల్యానికి కారణంగా నిలుస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చదవండి: డయాబెటిస్ వాట్సాప్ చానల్ -
లక్ష్య సాధన కోరుతున్న చిత్తశుద్ధి
కొన్ని నివేదికలు, గణాంకాలు పాలకులైనా, ప్రజలకైనా గట్టి మేలుకొలుపులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇటీవల విడుదల చేసిన ‘ప్రపంచ క్షయవ్యాధి (టీబీ) నివేదిక’ అలాంటిదే. ప్రపంచవ్యాప్త టీబీ కేసుల్లో 26 శాతం భారత్‌లోనే ఉన్నాయట! ఒక్క గడచిన 2023లోనే మన దేశంలో 25.5 లక్షల కొత్త టీబీ కేసులు నమోదయ్యాయి. 1960లలో టీబీపై నియంత్రణకు ఉపక్రమించినప్పటి నుంచి ఇప్పటి దాకా ఇది అత్యధికం. ఇది మన మత్తు వదిలించే మాట. దానికి తోడు పలు ఔషధాలకు లొంగకుండా తయారైన టీబీ (మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ – ఎండీఆర్ టీబీ) సరికొత్త ప్రజారోగ్య సంక్షోభంగా తయారైంది. ఆ కేసులూ మన దేశంలోనే ఎక్కువన్న సంగతి ఆందోళన కలిగిస్తోంది. పేరుకు 85 శాతానికి పైగా టీబీ రోగులకు చికిత్స చేరువైనా, ఖరీదైన మందులతో సామాన్యుల ఇల్లు, ఒళ్ళు గుల్లవుతున్నాయి. దాదాపు 20 శాతం మంది రోగులు తమ వార్షికా దాయంలో 20 శాతం పైగా ఈ చికిత్సకే ఖర్చు చేస్తున్నారట. దీనికి తోడు కొన్నేళ్ళుగా టీబీ నియంత్రణ నిధులు కూడా 13 లక్షల డాలర్ల మేర తగ్గడం శోచనీయం. ఈ చేదు నిజాలన్నీ అత్యవసర చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని మన ప్రభుత్వాలకు గుర్తు చేస్తున్నాయి. గడచిన 2023 లెక్కల ప్రకారం భారత్‌లో దాదాపు 27 లక్షల టీబీ కేసులున్నట్టు అంచనా. వాటిలో 25.1 లక్షల మంది రోగులు మందులు వాడుతున్నారు. అలా చూస్తే టీబీ సోకినవారిలో నూటికి 85 మందికి పైగా చికిత్స పొందుతూ ఉండడం చెప్పుకోదగ్గ విషయమే. నిరుడు అత్యధిక కేసులు నమోదైన సంగతి పక్కన పెడితే... గత ఎనిమిదేళ్ళలో భారత్‌లో టీబీ కేసులు 18 శాతం తగ్గినట్టు డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా 8 శాతం మేర కేసులు తగ్గితే, భారత్‌లో అంతకు రెట్టింపు కన్నా ఎక్కువగా కేసులు తగ్గాయట. సంతోషకరమే. కానీ, అది సరిపోతుందా అన్నది ప్రశ్న. 2025 నాటి కల్లా దేశంలో టీబీ లేకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత్ అనుకున్నది సాధించాలంటే ఇది సరిపోదన్నది నిపుణులు తేల్చిచెబుతున్న నిష్ఠురసత్యం. వ్యాధి నిర్ధారణ పరీక్షల వసతుల్ని మరింత మెరుగుపరచడమే కాక, నిధుల కొరతను తీర్చడం, మరింత మందికి చికిత్స అందించడం లాంటివి చేసినప్పుడే టీబీ నిర్మూలన లక్ష్యం వైపు అడుగులు వేయగలం. ఈ వ్యాధిని కేవలం ఆరోగ్య సమస్యగానే చూడలేం. దారిద్య్రం, పౌష్టికాహార లోపం, అంతంత మాత్రపు ఆరోగ్య వసతులు లాంటి సామాజిక – ఆర్థిక కారణాలూ ఇది ముదరడానికి కారణమని విస్మరించలేం. నిజానికి, గత ఆరు దశాబ్దాల కాలంలో మన దేశంలో టీబీ నిర్మూలన కార్యక్రమం కింద లబ్ధి పొందిన రోగుల సంఖ్య తక్కువేమీ కాదు. ఆ సంఖ్య పెరుగుతోంది. అయితే, ఆర్థికంగా బాగా వెనుక బడినవారికి అందుతున్న సాయం ఇప్పటికీ అంతంత మాత్రమే. టీబీ సోకినవారిలో అయిదోవంతు కన్నా ఎక్కువ మందికి సాయం అందడం లేదని ప్రభుత్వ గణాంకాలే ఒప్పుకుంటున్నాయి. అంత కన్నా విషాదం ఏమిటంటే, టీబీ నిర్మూలన లక్ష్యం గురించి పైకి గొప్పగా చెబుతున్నా, తీరా ఆచ రణలో అందుకు కేటాయించాల్సిన నిధుల్ని గణనీయంగా తగ్గించేస్తూ ఉండడం. లెక్క తీస్తే, 2019లో మన దేశంలో ఈ నిర్మూలన కార్యక్రమానికి 43.26 కోట్ల డాలర్ల కేటాయింపులు ఉండేవి. తీరా గడచిన 2023కు వచ్చేసరికి ఆ నిధుల మొత్తాన్ని 30.28 కోట్ల డాలర్లకు తగ్గించేశారు. ఆలోచనకూ, ఆచరణకూ మధ్య ఉన్న ఈ వ్యత్యాసాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది అచ్చంగా ‘దుత్తలో కూడు దుత్తలోనే ఉండాలి. చంకలో పిల్లాడు మాత్రం దుడ్డులా ఉండాల’న్నట్టుగా ఉంది. ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపట్టాలంటున్నది అందుకే. పైగా, కరోనా అనంతరం, గత ఏడాది ఒక్కసారిగా అన్ని కొత్త టీబీ కేసులు ఎందుకు నమోదయ్యాయో లోతుగా అధ్యయనం చేయాలి. టీబీని నిర్మూలన లక్ష్యం గొప్పదే అయినా అందుకు సవాళ్ళూ అనేకం. ప్రభుత్వం అందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలి. కృతనిశ్చయంతో ఉన్నా ప్రజల్లో ఈ వ్యాధిపై తగినంత చైతన్యం తీసుకు రాలేకపోతున్నారు. మనకున్న వైద్య వసతులూ అంతంత మాత్రమే. ఇక, పౌష్టికాహార లోపం సైతం టీబీ నిర్మూలనకు పెను అవరోధంగా మారింది. కేవలం పౌష్టికాహార లోపం వల్లనే ఏటా వయోజ నుల్లో 35 నుంచి 45 శాతం మేర కొత్త టీబీ కేసులు వస్తున్నాయని నిరుడు ‘లాన్సెట్’ నివేదిక ఒకటి స్పష్టం చేయడం గమనార్హం. అలాగే, సరిగ్గా మందులు వాడకపోవడం వల్ల కీలక ఔషధాలకు పని చేయకుండా పోయిన ఎండీఆర్–టీబీ కేసుల్లోనూ కేవలం 44 శాతమే తగిన చికిత్సకు నోచుకుంటున్నాయి. అదీ మరింత ఖరీదైన, విషతుల్యమైన వాటిని దీర్ఘకాలం వాడాల్సిన అగత్యం ఏర్పడుతోంది. ఈ సవాళ్ళను అధిగమించడానికి చర్యలు చేపట్టడం అవసరం. అందుకు క్రియాశీలకంగా వ్యవహరిస్తూ, కొత్తగా ఆలోచించక తప్పదు. సరికొత్త వైద్యవిధానాల్ని ఆశ్రయించడమూ ముఖ్యమే.ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాన్ని టీబీ రోగులకు, మరీ ముఖ్యంగా ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నవారికి వర్తించేలా చేయాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇది మంచి సూచనే. దేశంలో టీబీ నిర్మూలనకు ఇది దీర్ఘకాలంలో బాగా ఉపకరించే ఆలోచన. రోగుల విషయంలో వ్యక్తి కేంద్రితంగా సమగ్ర వైఖరిని అవలంబించాలని శాస్త్రవేత్తలు చెబుతున్న మాటకు చెవి ఒగ్గాలి. అలాగే, ఫార్మసీ రంగాన్ని పెద్ద ఆదాయ వనరుగా చూస్తున్న పాలకులు వైద్య, ఆరోగ్య రంగంలో కీలకమైన పరిశోధనలకూ, కొత్త ఔషధాలు, చికిత్సలకూ ఏపాటి ప్రోత్సాహమిస్తున్నారు? గణనీయంగా నిధులు కేటాయించి, సమన్వయంతో కృషి చేస్తేనే మన దేశంలో టీబీ నివారణ అయినా, నిర్మూలనైనా సాధ్యమవుతుంది. మానవాళిని పట్టిపీడిస్తున్న ప్రాణాంతక వ్యాధులను సమర్థంగా ఎదుర్కోవాలంటే,ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా నిలబడడమే మార్గం. -
Exercise: వారానికి ఒక్కరోజు!
నిత్యం పని ఒత్తిడితో సతమతమవుతున్న నగర యువత వ్యాయామంపై దృష్టి పెడుతున్నారు. అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారానికి ఒక్కరోజైనా కసరత్తులు చేయడానికి సమయం కేటాయిస్తున్నారు. దీంతో ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఒత్తిడుల నుంచి ఉపశమనం పొందుతున్నారని నగర వాసులపై నిర్వహించిన అధ్యయనాల్లో తేలింది. అంతేకాదు రెగ్యులర్‌గా జిమ్ చేసే వారితో సమానంగా ఫలితాలను పొందుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సెలవు రోజుల్లో అవకాశాన్ని బట్టి జిమ్‌కు వెళ్లడం, క్రీడల పట్ల నగర యువత ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా మానసిక ప్రశాంతతో పాటు, శారీరకంగానూ ఆరోగ్యంగా ఉంటున్నామంటున్నారు. పనిదినాల్లో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకూ, రాత్రి 7 గంటల తరువాత జిమ్ టైమింగ్స్ కావాలని కోరుకుంటున్నారు. దీంతో ఆ సమయంలో బిజీబిజీగా మారుతున్నాయి. దీంతో స్లాట్స్ దొరకడం కష్టంగా ఉందని చెబుతున్నారు. సెలవు రోజుల్లో జిమ్‌కు వచ్చే వారి తాకిడి కూడా ఎక్కువగా ఉంటుందని, ఎక్కువ సమయం జిమ్ చేయడానికి మొగ్గుచూపుతున్నారని నిర్వాహకులు చెబుతున్నారు.సర్వేలు చెప్పేదేంటి!..ఇటీవల ఓ ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం వారంలో ఒక్క రోజైనా వ్యాయామం చేసే వారి చేతికి యాక్సిలరో మీటర్ అమర్చి సుమారు 90 వేల మంది ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషిచింది. ఈ నివేదికల ప్రకారం దాదాపు నిత్యం వ్యాయామం చేసిన వారితో సమానంగా వారంలో ఒక్క రోజైనా కనీసం రెండున్నర గంటల నుంచి 3 గంటల పాటు వ్యాయామం చేసేవారు సమాన ప్రయోజనాలు పొందుతున్నారని తేలింది. వారంలో గంటన్నర కంటే తక్కువ వ్యాయామం చేసిన వారిలో జీర్ణకోశ, నాడీ వ్యవస్థ, మానసిక రోగాలు వంటివి మొత్తం 678 రోగాలను గుర్తించారు. అదే సమయంలో నిత్యం వ్యాయామం చేసేవారు, వారంలో వీలు చూసుకుని ఒక్క రోజైనా రెండున్నర గంటలకుపైగా వ్యాయామం చేసే వారిలో సుమారు 200 రకాల రోగాలు తక్కువగా ఉన్నాయని తేలింది. వ్యాయామం చేసిన వారిలో అధిక రక్తపోటు సమస్య 23 శాతం నుంచి 28 శాతం తక్కువగా ఉంటే, మధమేహం మాత్రం 43 శాతం నుంచి 48 శాతం తక్కువగా వస్తుందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.షిఫ్ట్ డ్యూటీలతో ఇబ్బంది.. డ్యూటీలో షిఫ్ట్‌ల సిస్టం ఉంటుంది. నైట్ షిఫ్ట్ ఉంటే పగలంతా నిద్రపోవడం వల్ల జిమ్‌కు వెళ్లడం కుదరడం లేదు. ఇటువంటి సందర్భంలో సెలవు రోజుల్లో స్లాట్ బుక్ చేసుకుంటాను. కనీసం రెండు నుంచి మూడు గంటల పాటు వర్కౌట్ చేస్తాను. సాధారణ షిఫ్ట్‌లు ఉన్నప్పుడు ఉదయం, సాయంత్రం సమయంలో రోజుకు ఒక గంట సమయం జిమ్ కోసం కేటాయిస్తాను. – శిరీష, సాఫ్ట్వేర్ ఉద్యోగిసెలవు రోజుల్లో స్లాట్స్‌కు డిమాండ్ .. సెలవు రోజుల్లో ఎక్కువ మంది జిమ్‌కు వస్తుంటారు. ఉదయం, సాయంత్రం స్లాట్స్ బిజీగా ఉంటాయి. అటువంటి సమయంలో జిమ్ ట్రైనర్‌గా ఎక్కువ మందిని డీల్ చేయాల్సి ఉంటుంది. సాధారణ రోజుల్లో అంతగా ఫ్లోటింగ్ ఉండదు. అటువంటి సమయంలో సహచర సిబ్బంది జిమ్‌ను మేనేజ్ చేసుకోగలుగుతారు. నేను రెండు గంటలకు తగ్గకుండా జిమ్ చేస్తాను. జిమ్ చేయడంపై మక్కువతో విడిచిపెట్ట లేకపోతున్నా. ఉద్యోగం, జిమ్ రెండింటినీ మేనేజ్ చేస్తున్నాను. – రాహుల్, సాఫ్ట్వేర్ ఉద్యోగి, జిమ్ ట్రైనర్ -
ఎడాపెడా పురుగుమందుల స్ప్రే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పురుగుమందుల వాడకం మితిమీరుతున్నట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) వెల్లడించాయి. దీంతో రైతులను తీవ్రమైన శ్వాసకోశ, చర్మ వ్యాధులు పట్టిపీడిస్తున్నాయని పేర్కొంది. వరి, పత్తి పండించే రైతులే ఎక్కువగా పురుగు మందులు వాడుతున్నారని తేలింది. ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ సంస్థలు నిర్వహించిన ‘దేశంలో ముఖ్యంగా తెలంగాణలో పురుగుల మందు వాడకం–రైతుల ఆరోగ్యంపై ప్రభావం–నివేదిక’అనే అధ్యయనంలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. 18–70 ఏళ్ల మధ్య వారిపై సర్వే చేశారు. అందులో కనీసం ఒక సంవత్సరం పాటు పురుగుమందులు పిచికారీ చేసిన వారున్నారు.వయస్సు, లింగం, ఎత్తు, బరువు, రక్తంలో గ్లూకోజ్ స్థాయి, విద్యాస్థాయి, ప్రధానవృత్తి, వారు అనుసరించే వ్యవసాయ పద్ధతులు, పురుగుమందుల వాడకం, విస్తీర్ణం, ఖర్చులు, కూలీల పనులు, çపురుగు మందుల వినియోగానికి గల కారణాలు తదితర సమాచారం సేకరించారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రక్తం, మూత్ర నమూనాలను సేకరించారు. పురుగు మందులను ఎక్కువగా వాడటం వల్ల కొందరు కేన్సర్, అల్జీమర్స్ వంటి పెద్ద వ్యాధులకు కూడా గురువుతున్నారని పేర్కొంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన లెక్కల ప్రకారం 28 రకాల పురుగు మందుల్లో 11 రకాల మందులు అత్యంత ప్రమాదకరమైనవిగా వర్గీకరించింది. రైతుల నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాల ద్వారా వారిలో పురుగు మందుల అవశేషాలు కనుగొన్నట్టు ఆ నివేదిక తెలిపింది. నిషేధిత రసాయనాలు కూడా విరివిగా ఉపయోగిస్తున్నారని తేలి్చంది. యాదాద్రి–భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని గ్రామాల్లో క్రాస్ సెక్షనల్ సర్వే జరిగింది. అధ్యయన నివేదికలోని ముఖ్యాంశాలు ⇒ వాణిజ్య పంటల్లో మితిమీరిన పురుగు మందుల వినియోగం వల్ల అనేక నష్టాలు వాటిల్లుతున్నాయి. అవగాహన లేకపోవడంతో తీవ్రమైన అనారోగ్యాలకు గురవుతున్నారు. ⇒ రైతులు పురుగుమందులను కలపడానికి ఒట్టి చేతులను ఉపయోగించడం వల్ల కూడా నష్టం జరుగుతోంది. ⇒ పురుగు మందుల మితిమీరిన వాడకం వల్ల ఊపిరి ఆడక పోవడం, ఛాతీనొప్పి, గుండె కొట్టుకునే వేగం పెరగడం, వాంతులు, తిమ్మిరి, కండరాల బలహీనత, తలనొప్పి, తల తిరగడం, బ్యాలెన్స్ సమస్యలు తలెత్తుతున్నాయి. ⇒ ఆదాయాన్ని పెంచుకోవాలన్న ఉద్దేశంతో వాణిజ్య పంట లు పండించే రైతులు పురుగు మందులను మితిమీరి వా డారు. నిషేధిత రసాయనాలను కూడా వినియోగించారు. ⇒ అవగాహన ఉన్న రైతులు మాత్రం 36 శాతం తక్కువగా పురుగు మందులను వినియోగించినట్టు తేలింది. ఈ రైతులు మెరుగైన విత్తన రకాలు, సేంద్రియ పురుగు మందులు వాడుతున్నారని తేలింది. ⇒ పురుగు మందులకు గురికావడం వల్ల రైతుల్లో జీర్ణాశయ సమస్యల నుంచి నాడీ సంబంధిత లక్షణాలు, శ్వాసకోశ వ్యాధులు సంభవిస్తున్నాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వంటివి చుట్టుముడుతున్నాయి. పిల్లలు కూడా పురుగు మందులకు గురవుతున్నారు. ⇒ సేంద్రియ పురుగు మందులు వాడటం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. -
అమ్మో.. ప్లాస్టిక్ భూతం!
సాక్షి, అమరావతి: భారత్‌ను ప్లాస్టిక్ భూతం భయపెడు తోంది. విచ్చలవిడి వినియోగంతో కాలుష్యం కమ్మేస్తోంది. జనాభాతో పాటు ప్లాస్టిక్ వాడకం పెరుగుతుండటంతో ఎక్కడికక్కడ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ఫలితంగా ప్రపంచంలోనే ప్లాస్టిక్ ఉద్గారాలకు భారత్ నిలయంగా మారుతోంది. నేచర్ జర్నల్‌లో ప్రచురించిన లీడ్స్ విశ్వవిద్యాలయ (ఇంగ్లడ్) బృందం అధ్యయనం ప్రకారం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సౌకర్యాలు లేకపోవడంతో అత్యంత ఎక్కువ ప్లాస్టిక్ వ్యర్థాలను విడుదల చేస్తున్న దేశాల జాబితాలో చైనాను దాటుకుని భారత్ అగ్రస్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది.వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా 25.1 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఏటా ఉత్పత్తి అవుతున్నాయి. వీటితో 2 లక్షల ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్స్‌ను నింపొచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అయితే 5.21 కోట్ల టన్నుల వ్యర్థాలు రీసైక్లింగ్ కాకపోవడంతో ఎక్కువ భాగం పర్యావరణంలోకి ప్రవేశించి కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తున్నట్టు నివేదిక చెబుతోంది. ఇందులో దాదాపు ఐదో వంతు (18 శాతం) భారత్ నుంచే వస్తుండటం గమనార్హం.ఈ క్రమంలోనే చైనాలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా వస్తున్నప్పటికీ అక్కడి రీసైక్లింగ్ వ్యవస్థ ద్వారా వాటిని నియంత్రిస్తున్నట్టు నివేదిక స్పష్టం చేసింది. దక్షిణాసియా, సబ్–సహారా ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాల్లోనే ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. భారత్ తర్వాత నైజీరియా, ఇండోనేషియా, చైనా ప్లాస్టిక్ ఉద్గారాల్లో పోటీపడుతున్నాయి. యూకే మాత్రం 4 వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలతో 135వ ర్యాంకు పొందింది.ఏటా వివిధ దేశాలు ఉత్పత్తి చేస్తూ నిర్వహణకు నోచుకోని ప్లాస్టిక్ వ్యర్థాలు (లక్షల టన్నుల్లో)ఆరోగ్యానికి ముప్పుప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాస్టిక్ కాలుష్య కారకాలకు కారణం అవుతోంది. జనాభా పెరుగుదలకు తోడు ఆదాయ వనరులు పెరగడంతో విలాసాల జీవితం దగ్గరవుతోంది. ఫలితంగా ఎక్కువ వ్యర్థాలు బయటకొస్తున్నాయి. దీంతో దేశంలో వ్యర్థాల నిర్వహణను చేపట్టడం సవాల్‌గా మారింది. దేశంలో డంపింగ్ యార్డుల్లో చెత్త కుప్పలుగా పేరుకుపోతోంది. ఇక్కడ సగటున ప్రతి వ్యక్తి రోజుకు 0.12 కేజీల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.అయితే, దేశంలో 95 శాతం వ్యర్థాలను సేకరిస్తున్నట్టు చెబుతున్నప్పటికీ.. వీటిలో గ్రామీణ ప్రాంతాలు, విచ్చలవిడిగా తగలబెడుతున్న వ్యర్థాలు, అనధికారికి రీసైక్లింగ్‌లోని వ్యర్థాలను లెక్కించడం లేదని అధ్యయనం పేర్కొనడం గమనార్హం. మరోవైపు ప్లాస్టిక్‌ను బహిరంగంగా కాల్చడం ద్వారా కార్బన్ మోనాక్సైడ్ వంటి విషపూరిత రసాయనాలు విడుదల అవుతున్నాయి. ఇవి శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, కేన్సర్ సహా అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. 20 దేశాల నుంచే 69 శాతం వ్యర్థాలుప్రపంచంలో 69 శాతం వ్యర్థాలు 20 దేశాల నుంచే వస్తున్నట్టు అధ్యయనం నమోదు చేసింది. ఇందులో 4 తక్కువ ఆదాయ, 9 తక్కువ మధ్య ఆదాయ, 7 ఉన్నత మధ్య ఆదాయ దేశాలున్నాయి. అధికాదాయ దేశాలలో ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తి రేటు ఎక్కువగా ఉంది. మరోవైపు ప్రపంచంలో రీసైక్లింగ్ చేయని ప్లాస్టిక్‌లో దాదాపు 43 శాతం చెత్తగా మారి పర్యావరణాన్ని కలుషితం చేస్తోంది. అయితే.. అత్యంత ప్లాస్టిక్ ఉద్గారాలను విడుదల చేస్తున్న దేశాల్లో చైనా నాలుగో స్థానంలో ఉంటే.. అక్కడ సగటున రోజులో ఒక వ్యక్తి ఉత్పత్తి చేస్తున్న వ్యవర్థాలు తక్కువగా ఉండటంతో 153వ స్థానంలో నిలిచింది. ఈ విషయంలో భారత్ 127వ స్థానంలో ఉంది. -
బాగా బొద్దుగా... రోగాలకు ముద్దుగా...
ఇటీవల అధిక బరువు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సమస్యగా మారింది. ముఖ్యంగా మహిళల్లో బరువు పెరుగుతున్న వారి సంఖ్య గణనీయంగా ఉందని జాతీయ కుటుంబ సర్వే వెల్లడించింది. తెలంగాణలో బరువు ఎక్కువగా ఉన్న మహిళల సంఖ్య 28.6 శాతం నుంచి 30.1 శాతానికి, ఏపీలో 33.2 నుంచి 36.3 శాతానికి ఎగబాకిందని ఆ సర్వేలో పేర్కొంది. ఊబకాయం తెచ్చే అనర్థాలూ, బరువు తగ్గడానికి కొన్ని మార్గాలను తెలుసుకుందాం...ఓ వ్యక్తి తాను ఉండాల్సిన బరువు కంటే అధిక బరువు ఉండటాన్ని స్థూలకాయం / ఊబకాయం ఇంగ్లిష్‌లో ఒబేసిటీగా చెబుతారు. ఒబేసిటీ అన్నది కేవలం లావుగా కనిపించడమో కాదనీ, ఎన్నో ఆరోగ్య సమస్యలకు కారణమన్నది డాక్టర్ల మాట. వారు ఎందుకలా చెబుతున్నారో చూద్దాం...ఒబేసిటీకి ప్రధాన కారణాలు⇒ జన్యుపరమైనవి : వంశపారంపర్యంగా తల్లిదండ్రుల్లో ఊబకాయం ఉన్నప్పుడు కుటుంబాల్లో అది పిల్లల్లోనూ కనిపిస్తుంటుంది. ఈ తరహా ఒబేసిటీని తగ్గించడం అంత తేలిగ్గా సాధ్యపడదు. ప్రయత్నపూర్వకంగా కొంత తగ్గి, చురుగ్గా తమరోజువారీ కార్యక్రమాలు తేలిగ్గా జరుపుకుంటే వారు ఆరోగ్యంగా ఉన్నట్టే.⇒ వయసు : యువకులుగా ఉన్నప్పుడు సన్నగా ఉన్నా మధ్యవయస్కులయ్యేనాటికి బరువు పెరగడం కొందరిలో కనిపిస్తుంది. ఈ పరిణామం స్త్రీపురుషులిద్దరిలోనూ ఉన్నా మహిళల్లో కాస్త ఎక్కువ. ప్రత్యేకంగా మెనోపాజ్ దశ దాటిన మహిళల్లో ఇది ఇంకాస్త ఎక్కువ.⇒ ఆహార అలవాట్లు : ఆధునిక జీవనశైలిలో భాగంగా కొవ్వులు (శాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్‌ఫ్యాట్స్) ఎక్కువగా ఉండే ఆహారం, తీపి పదార్థాలు తీసుకోవడంతో పాటు పాశ్చాత్య జీవనశైలిని అనుసరిస్తూ పిజ్జా, బర్గర్, ఫాస్ట్‌ఫుడ్ వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండటం, వేళకు తినకపోవడం, రాత్రి డ్యూటీలు చేస్తూ వేళగాని వేళల్లో ఆహారం తీసుకొని, పగలు పడుకోవడం వంటి కారణాలతో బరువు పెరగడం.⇒ శరీర కదలికలు తగ్గడం : ఇటీవలి కూర్చొని చేసే వృత్తులు పెరగడం వల్ల బరువు పెరగడం ఎక్కువైంది. ఈ ఆధునిక వృత్తుల్లో ఒంటి కదలికలకు ఏమాత్రం లేకపోవడంతో శరీరారికి తగిన శ్రమ లేక క్యాలరీలు దహనం కాకుండా కొవ్వుల రూపంలో అవి పేరుకుపోవడం.⇒ కొన్ని జబ్బులు (మెడికల్ రీజన్స్) : హైపోథైరాయిడిజమ్, కుషింగ్ సిండ్రోమ్, పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు, అలాగే తీవ్రమైన ఒత్తిడి (స్ట్రెస్)తో కూడా బరువు పెరగడం.⇒ కొన్ని రకాల మందులతో : వైద్యకారణాలతో స్టెరాయిడ్స్‌తో కూడిన మందులు వాడటం, అలాగే డిప్రెషన్ ఉన్నవారు వాడే యాంటీడిప్రెసెంట్స్, మూర్చవ్యాధిగ్రస్తులు వాడే యాంటీ ఎపిలెప్టిక్ మందులతోనూ ఒళ్లు వచ్చే ప్రమాదం.ఒబేసిటీ కేవలం కాస్మటిక్ సమస్య కాదు... అది అనారోగ్యాలకు కారణం?డయాబెటిస్, హైబీపీ, గుండెజబ్బులు, కీళ్లనొప్పులు, నిద్రలో ఊపిరి సరిగా అందకుండా చేసి గురకకు దారితీసే స్లీప్ ఆప్నియా, డిప్రెషన్, పిత్తాశయంలో రాళ్లు, హెర్నియా మొదలైన సమస్యలకు స్థూలకాయం ప్రధాన కారణం. సన్నగా ఉన్న మహిళలతో ΄ోల్చి చూస్తే లావుగా ఉన్న మహిళలలో ప్రసవం కష్టమవుతుంది. అబార్షన్లు అయ్యే అవకాశమూ ఎక్కువే. స్థూలకాయం కొన్ని రకాల క్యాన్సర్లకు కూడా దారితీస్తుంది. ఇలా దాదాపు 65 రకాల వ్యాధులకు ఒబెసిటీయే మూల కారణం. ఆరోగ్యకరమైన స్థూలకాయం లేనివారితో పోలిస్తే స్థూలకాయుల్లో ఆయుఃప్రమాణం 5 నుంచి 20 ఏళ్లు తగ్గే అవకాశం ఉంది.స్థూలకాయం ఉందా లేదా అని తెలుసుకోవడం ఎలా?ఒక వ్యక్తి ఎత్తుకు తగినంత బరువు ఉండాలి. అతడు తన ఎత్తుకు తగిన బరువు ఉన్నాడా లేడా అనే విషయం తెలుసుకోడానికి ‘బాడీ మాస్ ఇండెక్స్’ (బీఎమ్ఐ)ను ప్రమాణంగా తీసుకుంటారు. ఎవరైనా తమంతట తామే తెలుసుకోవచ్చు. అందుకు చేయాల్సిందల్లా మొదట తమ బరువును కిలోగ్రాముల్లో తెలుసుకోవాలి. ఆ తర్వాత స్కేలు / టేప్ సాయంతో ఎత్తును మీటర్లలో కొలుచుకోవాలి. అటు తర్వాత తమ బరువును తమ ఎత్తు స్క్వేర్తో భాగించాలి. ఉదాహరణకు ఓ వ్యక్తి 90 కిలోల బరువు ఉన్నాడనుకుందా. అతడి ఎత్తు 1.7 మీటర్లు అనుకుందాం. అప్పుడు అతడి బీఎమ్ఐ 90 / 1.7 ఇంటూ 1.7 = 31.14 అనే విలువ వస్తుంది. తమ ఈ విలువను బీఎమ్ఐ ఛార్ట్‌లో చూసుకుని తామ స్థూలకాయం (ఒబేసిటీ) ఏ మేరకు ఉందో తెలుసుకోవచ్చు. డాక్టర్లు కూడా దీన్నే అనుసరిస్తుంటారు.బరువు పెరగకుండా నియంత్రించుకునే మార్గాలు...∙అధిక బరువు (బీఎమ్ఐ 23 – 24.99) ఉన్నవారు, స్వల్ప స్థూలకాయం (బీఎమ్ఐ 25 – 29.99) ఉన్నవారు రోజూ క్రమం తప్పకుండా కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడక (బ్రిస్క్ వాకింగ్) వంటి వ్యాయామం క్రమం తప్పకుండా చేయాలి ∙ఆహారంలో కొవ్వు పాళ్లు తగ్గించుకోవడం సమతులాహారం తీసుకోవడం అంటే కొవ్వులు ఎక్కువగా ఉండే మాంసాహారం కంటే తాజా ఆకుకూరలు, కాయగూరలతో కూడిన ఆహారాలు తీసుకోవడం. ఒకవేళ మాంసాహారం తినాలనుకుంటే వేటమాంసం (రెడ్ మీట్) కంటే చేపలు, చికెన్ వంటి కొవ్వులు తక్కువగా ఉండే వైట్ మీట్ తినాలి ∙క్రమం తప్పకుండా ఒకే వేళకు తినడంతో పాటు తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు తీసుకోవాలి ∙రాత్రి కంటినిండా నిద్రపోవాలి. ఒకవేళ మెలకువతో ఉన్నా ఏమీ తినకూడదు ∙చిరుతిండ్లూ, కూల్‌డ్రింక్స్, ఆల్కహాలిక్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి.పైన వచ్చిన విలువ ప్రకారం 90 కిలోల బరువున్న ఆ వ్యక్తి 31.14 విలువతో అధిక స్థూలకాయం కేటగిరీలో ఉన్నాడు. అలా బరువు పెరుగుతున్న కొద్దీ స్థూలకాయం ప్రమాణికతల ప్రకారం అతడు వ్యాధిగ్రస్థ స్థూలకాయంలో ఉన్నాడా లేక సూపర్ స్థూలకాయంలో ఉన్నాడా అన్నది తెలుస్తుంది. -
మందు లవర్స్! లివర్ జాగ్రత్త!
గతంలో మద్యం తాగడం తప్పు అన్న భావనతో చాలామంది దానికి దూరంగా ఉండేవారు. కానీ ఇటీవల కాలంలో తాగడం ఓ ఫ్యాషన్ అనే ధోరణి పెరుగుతుండటంతో పాటు... ఆల్కహాల్ అంటే మూడు నాలుగు దశాబ్దాల కిందట ఉన్న అపరాధభావన క్రమంగా కనుమరుగైపోతుండటంతోయువత ఎలాంటి జంకు గొంకు లేకుండా మద్యానికి అలవాటు పడుతున్నారు. దాంతో ఇటీవల యువతలో ఫ్యాటీలివర్, లివర్ ఇన్ఫ్లమేషన్, స్కార్డ్ లివర్, లివర్ సిర్రోసిస్ లాంటి ‘ఆల్కహాలిక్ సంబంధిత కాలేయ వ్యాధులు’ (ఆల్కహాలిక్ లివర్ డిసీజెస్) పెరుగుతున్నాయి. మద్యం ఎన్నిరకాలుగా కాలేయాన్ని దెబ్బతీస్తుందో, ఎన్ని వ్యాధులు కలగజేస్తుందో తెలుసుకుందాం...కాలేయం అత్యంత కీలకమైన అవయవం. జీర్ణక్రియకు సహాయపడటంతో పాటు బయటనుంచి జీర్ణవ్యవస్థ ద్వారా ఏ పదార్థం దేహంలోకి ప్రవేశించినా అందులోని విషాలను విరిచివేసి, వాటిని బయటకు ప్రయత్నిస్తుంది. ఆల్కహాల్ కూడా ఒకరకంగా విషమే. అందుకే దాని దుష్ప్రభావం పడకుండా కాపాడటానికి ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలో దీర్ఘకాలంగా మద్యం తాగే అలవాటున్న వ్యక్తుల్లో క్రమంగా పలు మార్పులకు లోనవుతుంది. దాంతో ఫ్యాటీలివర్, లివర్ ఇన్ఫ్లమేషన్, సిర్రోసిస్, కాలేయంపైన ఓ గాటులాంటిది పడే స్కారింగ్ వంటి దుష్ప్రభావాల కారణంగా క్రమంగా లివర్ ఫెయిల్యూర్‌కు దారితీస్తుంది. ఇలా కాలేయాన్ని దెబ్బతీసి, ్రపాణాపాయం వైపునకు వెళ్లేలా చేసే వ్యాధులివి...ఫ్యాటీలివర్ : శక్తిగా మారి, దేహ అవసరాలు పూర్తయ్యాక అదే చక్కెర కాలేయంలో కొవ్వు రూపంలో పేరుకు΄ోతుంది. ఆల్కహాల్ అలవాటున్నవారిలో ఇది చాలా వేగంగా జరుగుతూ కాలేయ కణాలు కొవ్వు పేరుకున్నట్లుగా మారి΄ోతాయి. ఈ కండిషన్‌ను ఫ్యాటీలివర్ అంటారు. ఫ్యాటీలివర్‌లో మూడు దశలుంటాయి. మొదటి దశ : ఈ దశలో కాలేయ కణాల మధ్య కొద్దిగా కొవ్వు పేరుకుంటుంది. ఇది ్రపాథమిక సమస్య. రెండో దశ: ఈ దశను నాష్ (ఎన్‌ఏఎస్‌హెచ్) అంటారు. ఇందులో కాలేయం కొద్దిగా గాయపడటంతో పాటు కొన్ని కాలేయ కణాలు నశిస్తాయి. కొన్నిసార్లు ఇన్ఫ్లమేషన్కు కూడా గురికావచ్చు. అంతేకాదు కాలేయం గాయపడటం వల్ల... ఓ మచ్చగా అంటే... స్కార్లాగా ఏర్పడవచ్చు. మూడో దశ: ఈ దశలో సిర్రోసిస్ వస్తుంది. అంటే కాలేయం పూర్తిగా తన స్వరూపాన్ని కోల్పోవడమేగాక దాన్ని ఆకృతి కూడా మారిపోతుంది. కణాలు పూర్తిగా దెబ్బతింటాయి. ఈ దశలో కాలేయ మార్పిడి తప్ప మరో వైద్యమేమీ పనిచేయదు. ఫ్యాటీలివర్ లక్షణాలు : మొదట్లో లక్షణాలు పెద్దగా కనిపించవు. అయితే సాధారణంగా ఇతర సమస్యలకోసం అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయించుకున్నవారిలో ఇది బయటపడుతుంటుంది ∙కొందరికి కుడివైపు పోట్ట పైభాగంలో (రిబ్కేజ్ కింద) ΄÷డుస్తున్నట్లుగా నొప్పి వస్తుంటుంది. కాలేయం క్రమంగా పెరుగుతుండటం వల్ల ఈ నొప్పి వస్తుంది. ఫ్యాటీలివర్ వల్ల పరిణామాలు : ∙ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చాక తగిన జాగ్రత్తలు తీసుకోక΄ోతే అది కాలేయం పూర్తిగా దెబ్బతిని΄ోయే సిర్రోసిస్ లేదా లివర్ క్యాన్సర్ వంటి పరిణామాలకు దారితీయవచ్చు ∙ఫ్యాటీ లివర్ దశల్లో మొదటిదశ నుంచి క్రమంగా రెండో దశ అయిన నాష్ (ఎన్‌ఏఎస్‌హెచ్)కూ, అక్కడి నుంచే క్రమంగా మూడో దశ అయిన సిర్రోసిస్‌కు దారి తీస్తుందని భావించడానికే వీల్లేదు. కొన్నిసార్లు నేరుగా మూడో దశ అయిన సిర్రోసిస్‌కు దారితీయవచ్చు. అందుకే ఫ్యాటీలివర్ తొలిదశలో ఇది కనిపించినప్పుడే జాగ్రత్తపడాలి. ఫ్యాటీ లివర్‌కు చికిత్స : ∙ఆల్కహాల్‌తోనే ఫ్యాటీలివర్ వచ్చిందని తేలితే... లేదా ఇది వచ్చిన వారిలో ఆల్కహాల్ తీసుకునే అలవాట్లు ఉన్నట్లయితే వెంటనే ఆల్కహాల్ పూర్తిగా మానేయాలి. పిండిపదార్థాలు, కొవ్వులు ఎక్కువగా తీసుకునే అలవాటు ఉంటే ఆహారంలో మార్పులు, వ్యాయామం వంటి మార్గాలను డాక్టర్లు సూచిస్తారు చాలా కొద్దిమందిలో మందులు, శస్త్రచికిత్స అవసరం కావచ్చు. లివర్ స్కార్ : ఆల్కహాల్ అలవాటు మితిమీరిన కొందరిలో కాలేయం వాపు రావచ్చు. దాన్ని లివర్ ఎన్లార్జ్మెంట్గా చెబుతారు. వీళ్లలో ఆ గాయం తీవ్రమై కాలేయం మీద మచ్చ (స్కార్)లా ఏర్పడవచ్చు. ఇది చాలా ప్రమాదం తెచ్చిపెట్టే అంశం కాబట్టి జాగ్రత్తపడాలి. లివర్ సిర్రోసిస్ : హెపటైటిస్–ఏ, హెపటైటిస్–బి, హెపటైటిస్–సి, హెపటైటిస్–డి, హెపటైటిస్–ఇ వంటి కొన్ని కాలేయ ఇన్ఫెక్షన్లు ముదరడంతో లివర్ సిర్రోసిస్ రావచ్చు. అలాగే ఆల్కహాల్ అలవాటు కారణంగా కాలేయం ఆకృతి, దానికి ఉండే సహజ స్వాభావికమైన రంగు దెబ్బతిని, అది జిగురుజిగురుగా మారవచ్చు. ఆ కండిషన్‌నే సిర్రోసిస్ అంటారు. డయాబెటిస్, స్థూలకాయం ఉన్నవారికి ఆల్కహాల్ తీసుకునే అలవాటుంటే సిర్రోసిస్ ముప్పు మరింత ఎక్కువ. హెపటైటిస్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నవారికి మద్యం అలవాటు ఉంటే అది కాలేయ క్యాన్సర్‌కు దారి తీయవచ్చు. ఇలాంటివారికి ప్రమాదం మరింత ఎక్కువ. నిర్ధారణ పరీక్షలు: ∙అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కానింగ్‌తో చాలా వరకు ఫ్యాటీలివర్ డిసీజ్ తెలుస్తుంది ∙ఫ్యాటీలివర్ మొదలుకొని మిగతా అన్ని కాలేయ సమస్యలకు లివర్ ఫంక్షన్ పరీక్ష (ఎల్ఎఫ్టీ) అవసరం. దాంతో ఏవైనా ఎంజైములు స్రవించడం వల్ల కాలేయం దెబ్బతిన్నదా అన్న విషయం తెలుస్తుంది ∙డయాబెటిస్, కొలెస్ట్రాల్ స్థాయులు, ట్రైగ్లిజరైడ్ స్థాయులు ఏమైనా పెరిగాయా అన్నది కూడా పరిశీలించాలి ∙కొందరిలో లివర్ బయాప్సీ (అంటే సూది ద్వారా కాలేయానికి సంబంధించిన చిన్న ముక్కను సేకరించి) చేయించాల్సిన అవసరం ఉంటుంది.ఫ్యాటీలివర్ దశలోనే జీవనశైలి మార్పులో జాగ్రత్తపడటం చాలా మేలు. అయితే... పరిస్థితి లివర్ సిర్రోసిస్ దశకు చేరాక కాలేయ మార్పిడి మినహా మరే చికిత్స కూడా సాధ్యం కాదు. అందుకే ఫ్యాటీలివర్ దశలో ఉన్న సమయంలోనే ఆల్కహాల్ అలవాటు పూర్తిగా మానేయడం మంచిది. -
సిగరెట్ సగం దమ్ములాగి వదిలేస్తున్నారా? అయితే ..!
సిగరెట్ అస్సలు ముట్టనివాళ్లతో పోలిస్తే... సగం సగం లేదా ఒకటి, రెండు ఫప్స్ తీసుకునే వారిలో 64 శాతం మందికి మామూలుగా పోగాకుతో కలిగే ముప్పులన్నీ వస్తుంటాయని హెచ్చరిస్తున్నారు యూఎస్‌లోని నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చెందిన అధ్యయనవేత్తలు. ఆ అధ్యయనంలోని వివరాల ప్రకారం కొద్ది కొద్దిగా పఫ్ పీల్చినప్పటికీ వాళ్లలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ముప్పు ఇతర ఆరోగ్యకరమైన వ్యక్తుల కంటే 12 రెట్లు ఎక్కువని తేలింది.అంతేకాకుండా కొద్దిపాటి మోతాదులోనైనా పోగ పీల్చేవాళ్లలో ఎంఫసిమా వంటి శ్వాసకోశ వ్యాధులు వచ్చే ముప్పు రెండున్నర రెట్లు అధికమని తేలింది. యాభై తొమ్మిది నుంచి ఎనభై రెండేళ్ల వరకు వయసున్న మొత్తం మూడు లక్షల మందిపై ఓ అధ్యయనం నిర్వహించాక వాటి ఫలితాలను బట్టి ఈ అంశాలు వెల్లడయ్యాయి. -
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
న్యూఢిల్లీ: బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయన్ను న్యూఢిల్లీలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. ప్రస్తుతం ఎల్కే అద్వానీ డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. అయితే ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వైద్యులు ఓ ప్రకటనలో తెలిపారు.గత నెల 27న ఎల్కే అద్వానీ అస్వస్థతకు గురికావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చిన విషయం తెలిసిందే. -
సిక్‌ప్యాక్! లుక్ కోసమైతే ఫసక్కే
అనారోగ్యంపాలవుతున్న బాడీ బిల్డర్స్సిక్స్ ప్యాక్ శరీరానికి మంచిది కాదు..ఆరోగ్యకరమైన కొవ్వులూ అవసరమే : వైద్యులు ఏదైనా అతిగా చేస్తే అనర్థమే..! ఔను నిజమనే అంటున్నారు వైద్యులు.. ఇంతకీ ఏంటది? దేని గురించి? ఈ చర్చంతా దేనికి అనుకుంటున్నారా? అదే నండి బాబు సిక్స్ ప్యాక్ గురించి.. సిక్స్ ప్యాక్ అనగానే.. ప్రస్తుత తరానికి ఎంతో క్రేజ్. ఆ పేరు చెప్పగానే శరీరంలోని నరాలన్నీ జివ్వుమన్నట్లు అవుతుంది.. కానీ అతిగా చేస్తే ఆరోగ్యానికి అనర్థమే అంటున్నారు వైద్యులు.. ఇటీవల పలువురు హీరోలు అతిగా వ్యాయామం చేసి అనారోగ్యం పాలవ్వడమే దీనికి చక్కటి ఉదాహరణ. అసలు సిక్స్ ప్యాక్ కథేంటి? వైద్యులు ఏమంటున్నారు? తెలుసుకుందాం.. బాలీవుడ్ టు టాలీవుడ్.. సిక్స్ ప్యాక్ సినిమా స్క్రీన్కు పరిచయమై రెండు దశాబ్దాలు పైమాటే. అయినా అంతకంతకూ తన క్రేజ్‌ను పెంచుకుంటోంది. దాదాపు బాలీవుడ్, టాలీవుడ్ అగ్రహీరోల్లో యుక్తవయసులో ఉన్న హీరోలందరూ ఆరున్నొక్కరాగం ఆలపిస్తున్నవారే. తెలుగులో ‘దేశ ముదురు’తో అల్లు అర్జున్ నుంచి మొదలై సునీల్, ప్రభాస్, నితిన్, జూనియర్ ఎనీ్టయార్, రామ్‌చరణ్, సుధీర్‌బాబు, విజయ్ దేవరకొండ...తాజాగా అఖిల్..ఇలా అనేకమంది ఆరు–ఎనిమిది పలకల దేహాలతో తెరపై గ్రీక్ లుక్‌లో తళుక్కుమంటున్నారు. అనుకరణ మరింత ప్రమాదమట.. సిక్స్‌ప్యాక్ కొనసాగింపు కోసం నాగశౌర్య నెలల తరబడి తీవ్ర కసరత్తులు చేశారని, అదే విధంగా కఠినమైన డైట్ ను పాటించారని సమాచారం. ఎప్పుడూ హుషారుగా ఆరోగ్యంగా కనిపించే శౌర్యకు ఆకస్మికంగా స్పృహ కోల్పోయే పరిస్థితి రావడానికి సిక్స్ ప్యాక్ క్రేజ్ కారణమై ఉండవచ్చని పలువురి వాదన.. అయితే వైద్యులు మాత్రం ఆ విషయాన్ని ధృవీకరించలేదు. ఈ నేపధ్యంలో హీరోల్ని చూసి మక్కీకి మక్కీ అనుసరించే లక్షలాది మంది యువ అభిమానులు జాగ్రత్త పడాల్సి ఉందని, అన్ని రకాల వసతులూ, శిక్షకులూ ఉన్న స్టార్లకే అలా అయితే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరుపలకల దేహాన్ని పొందాలని కోరుకునేవారు చాలా మంది ఉండొచ్చు.. అయితే దానిని సాధించడం చాలా కష్టం. అంతేకాదు సాధించినా కూడా ఆ సిక్స్‌ప్యాక్‌ని కొనసాగించడం మరింత కష్టం. ఈ విషయం చాలా మందికి తెలీదు సిక్స్–ప్యాక్ మ్యానియాలో పడి గుడ్డిగా అనుసరించే ముందు, ఆకస్మిక, కఠినమైన డైట్ వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాల గురించి యువత తెలుసుకోవాలని వైద్యులు, ఫిట్నెస్ నిపుణులు సూచిస్తున్నారు. వైద్యులు ఏం చెబుతున్నారు.. 👉సిక్స్ ప్యాక్ కొనసాగింపు శరీరానికి ఆరోగ్యకరమైనది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 👉అసహజమైన శరీరపు అతి తక్కువ కొవ్వు శాతం ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కొన్ని నెలల పాటు సిక్స్ ప్యాక్ మెయింటెయిన్ చేయడం అంటే శరీరపు కొవ్వు శాతం ఉండాల్సిన కనీస స్థాయి కన్నా పురుషులలో అయితే 12% మహిళల్లో అయితే 18% తక్కువవుతుందని వైద్యులు చెబుతున్నారు. 👉కొవ్వు ఇలా పరిమితికి మించి తగ్గడం అనేది అంతర్గత అవయవాల లైనింగ్‌ను ప్రభావితం చేస్తుంది. 👉తమకు వచ్చిన సిక్స్ ప్యాక్ చూపులకు బిగుతుగా కనిపించేలా చేయడానికి కొందరు ఆహారంలో ఉప్పును పూర్తిగా వదులుకుంటారు ఇది మరింత ప్రమాదకరం. ఆహారం నుంచి ఉప్పు తొలగించడం ఆరోగ్యంపై ప్రతికూల ఫలితాలను కలిగిస్తుంది. 👉అదే విధంగా కొన్ని సందర్భాల్లో తాగే నీటికి కూడా ప్రమాదకర పరిమితి పాటించాల్సి ఉంటుంది. ఇది తీవ్రమైన డీ హైడ్రేషన్‌కు గురిచేసే అవకాశం ఉంది. 👉అలాగే సిక్స్–ప్యాక్ సాధించిన తర్వాత కూడా దాన్ని నిలబెట్టుకోవడం కోసం నిరంతరం పరిగెత్తడం, అవి కనపడని రోజున తీవ్ర ఒత్తిడికి గురికావడం జరుగవచ్చని, అది మానసిక సమస్యలకు దోహదం చేస్తుందని సైక్రియాట్రిస్ట్లు హెచ్చరిస్తున్నారు. 👉బాడీ బిల్డింగ్ పోటీలకు హాజరయ్యేవారు లేదా పూర్తిగా వైద్యుల, న్యూట్రిషనిస్ట్‌ల పర్యవేక్షణలో గడిపేవారు, ఒత్తిడితో కూడిన వృత్తి వ్యాపకాలు నిర్వహించని వారు తప్ప సిక్స్ ప్యాక్ గురించి ఎక్కువ శ్రమించడం ప్రమాదకరం అంటున్నారు. 👉ఇక ఫాస్ట్‌గా సిక్స్ ప్యాక్ దక్కించుకోవడం కోసం స్టెరాయిడ్స్ వంటివి అతిగా తీసుకుంటున్నారు కొందరు. ఇది కూడా శరీరంలోని హార్మోన్ల పనితీరును దెబ్బతీస్తుందని, ఫలితంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. అదే అసలు కారణమా? ఆ మధ్య టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఉన్న నటుడు రానా దగ్గుబాటి ఆరోగ్యం విషయంలో రకరకాల వార్తలు గుప్పుమన్నాయి. బాహుబలి అనంతరమే ఆయన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాడని, సిక్స్ ఫిజిక్ కోసం ఆశ్రయించిన పలు మార్గాలే దీనికి కారణమని పలు వార్తలు వెలుగు చూశాయి. అలాగే ఇటీవల కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ యువ నటుడు నాగÔౌర్య ఆకస్మిక అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. హైదరాబాద్‌లో జరుగుతున్న సినిమా షూటింగ్లో పాల్గొన్న ఆయన ఆకస్మికంగా సొమ్మసిల్లిపడిపోగా ఆయనను గచ్చి»ౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం కోలుకున్నారు. ఆసుపత్రిలో చేరే సమయంలో డీ హైడ్రేషన్, హై ఫీవర్‌తో బాధపడుతున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఇక కన్నడ సూపర్‌స్టార్ పునీత్‌రాజ్ జిమ్ చేస్తూ స్ట్రోక్ వచ్చి మరణించిన విషయమూ తెలిసిందే...జాగ్రత్తలు పాటించాలి... అబ్బాయిలు మాత్రమే కాదు అమ్మాయిలు సైతం సిక్స్ ప్యాక్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. శారీరకంగా అమ్మాయిలకు, అబ్బాయిలతో పోలిస్తే చాలా పరిమితులు ఉంటాయనే విషయం గుర్తుంచుకోవాలి. మగవాళ్లకన్నా ఆరోగ్య సమస్యలు ఎక్కువ. ఫిట్నెస్ రంగాన్ని ప్రొఫెషన్‌గా తీసుకున్నా, బాడీ బిల్డింగ్ రంగంలో రాణించాలనుకున్నా.. ఓకే గానీ... సరదాకో, గుర్తింపు కోసమో సిక్స్‌ప్యాక్ చేయాలనుకోవడం ఏ మాత్రం సరికాదు. –కిరణ్ డెంబ్లా, డి.జె, ఫిట్నెస్ శిక్షకురాలుఏడాది పాటు శ్రమించా..కఠినమైన వర్కవుట్స్‌తో పాటు డైట్ కూడా ఫాలో అయ్యా. షూటింగ్ ఉన్నప్పుడు వర్కవుట్ చేయడంతో పాటు నీళ్లు కూడా తీసుకోలేదు. ఇలాంటి సందర్భంలో సైకలాజికల్ ప్రెషర్‌ను ఎదుర్కోవడం అంత సులభం కాదు. సిక్స్ ప్యాక్ అనేది చాలా కష్టమైన ప్రక్రియ. –ఆనంద్ దేవర్కొండ, సినీ హీరోరాంగ్ రూట్లో అనర్థాలే.. చాలా మంది యువత ఎఫర్ట్ పెట్టి సిక్స్‌ప్యాక్ సాధిస్తున్నారు. అయితే కొందరు మాత్రం త్వరగా షేప్ వచ్చేయాలని రాంగ్ రూట్లో ప్రయత్నాలు చేయడం, మజిల్స్‌ను పరిమితికి మించి శ్రమకు గురిచేయడం వల్ల ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. –ఎం.వెంకట్, ట్రైనర్, సిక్స్ ప్యాక్ స్పెషలిస్ట్ -
ప్రాసెస్డ్ ఫుడ్స్.. ఆరోగ్యం మటాష్
సాక్షి, అమరావతి: ప్రాసెస్డ్, అల్డా ప్రాసెస్డ్ ఆహారాల వినియోగం తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడుగురి పెద్దల్లో ఒకరు, ప్రతి 8మంది చిన్నారుల్లో ఒకరిని ప్రాసెస్డ్ ఫుడ్ వ్యసనపరులుగా మారుస్తోంది. ఐస్‌క్రీమ్, కూల్ డ్రింక్స్, రెడీ మీల్స్ (రెడీ టు ఈట్), ప్రాసెస్ చేసిన మాంసపు ఉత్పత్తులతో క్యాన్సర్, బరువు పెరుగుదల, గుండె జబ్బులు, మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా సంభవిస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. 36 దేశాలకు చెందిన 281 అధ్యయనాలను విశ్లేషించడం ద్వారా ‘అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అడిక్షన్’ ప్రమాదాలను కనుగొన్నారు. మొత్తం జనాభాలో 14 శాతం మంది పెద్దలు, 12 శాతం మంది చిన్నారులు నిత్యం ప్రాసెస్డ్ ఆహారాన్ని మాత్రమే భుజిస్తున్నట్టు బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనంలో తేలింది. మద్యంతో సమానం ప్రాసెస్డ్ ఆహార పదార్థాలు అతిగా తీసుకునే వారిలోనూ, ఆల్కాహాల్ తీసుకున్న వ్యక్తులలోనూ మెదడు స్ట్రియాటమ్‌లో ఎక్స్ట్రా సెల్యులర్ డోపమైన్‌ను ఒకే స్థాయిలో ప్రేరేపిస్తున్నట్టు తేల్చారు. తద్వారా తీవ్రమైన కోరికలు, స్థూలకాయం, తిండిపై నియంత్రణ లేకపోవడం, అతిగా తినే రుగ్మత, శారీరక–మానసిక అనారోగ్యం తదితర ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొంది. యూకే, యూఎస్‌లలో సగటు వ్యక్తి ఆహారంలో సగానికిపైగా ప్రాసెస్డ్ ఫుడ్స్ వినియోగిస్తున్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా అసమతుల్య ఆహారాన్ని తీసుకోవడంతో వైద్యం, పర్యావరణ కోసం ఏడాదికి 7 ట్రిలియన్ డాలర్లకుపైగా అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా స్థూలకాయం, నాన్–కమ్యూనికేబుల్ వ్యాధులు ఉన్నత, మధ్య ఆదాయ దేశాలలో గణనీయంగా పెరిగాయి. పట్టణీకరణ, జీవనశైలిలో మార్పులతోపాటు స్త్రీ, పురుషుల ఉద్యోగాలు, ప్రయాణ సమయాలు పెరగడంతో కొన్ని దేశాల్లో అధికంగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగం ఎక్కువగా ఉంది. ప్రాసెస్ చేసిన జంతు ఆధారిత ఉత్పత్తులు, నూడుల్స్, కృత్రిమ స్వీటెనర్లతో కార్డియో వాసు్కలర్, కార్డియో మెటబోలిక్ కోమోర్చిడిటీలు 9శాతం పెరుగుతోంది. అయితే రొట్టెలు, తృణధాన్యాలు, మొక్కల ఆధారిత ఉత్పత్తులు వంటి ఇతర అల్ట్రా ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎటువంటి ఆరోగ్య ప్రమాదాలను కలిగి ఉండవని నివేదించింది. పౌష్టికాహార భద్రత లోపం ఇప్పటికే ఆసియా, లాటిన్ అమెరికాల్లో అత్యంత ప్రాసెస్‌తోపాటు సహా ప్రాసెస్ చేసిన ఆహారాల వినియోగం పెరుగుతోంది. ఇది ఆఫ్రికాకు కూడా వేగంగా వ్యాపిస్తోంది. అయితే కోవిడ్–19కి ముందు స్థాయిల కంటే చాలా ఎక్కువగా ఉంది. తద్వారా పౌష్టికాహార లోపం భయపెడుతోంది. ప్రపంచ జనాభాలో దాదాపు 29.6 శాతం మంది (240 కోట్ల మంది ప్రజలు) 2022లో తీవ్రంగా ఆహార భద్రతను ఎదుర్కొన్నారు. వీరిలో దాదాపు 90 కోట్ల మంది (11.3 శాతం మంది) ఆహార అభద్రతలో తీవ్రంగా కూరుకుపోయారు. ఇక 2030లో దాదాపు 60 కోట్ల మంది దీర్ఘకాలికంగా పోషకాహార లోపంతో బాధపడతారని ఐక్యరాజ్య సమితి సైతం ఆందోళన చెందుతోంది. తొమ్మిది దక్షిణాసియా దేశాలలో పోషకాహార లోపం (24 కోట్ల మంది)లో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ తర్వాత భారతదేశం మూడవ స్థానంలో ఉంది. భారత్‌లో పోషకాహార లోపం 2004–06లో 21.4 శాతం నుంచి 2020–22 నాటికి 16.6కి తగ్గింది. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కడికక్కడ లభిస్తున్నాయి. నగరం/పట్టణం నుంచి 1–2 గంటలు, అంతకంటే ఎక్కువ ప్రయాణ సమయం ఉన్న గ్రామాల్లోనూ ఈ ఆహార విధానం వృద్ధి చెందడం ఆందోళన కలిగిస్తోంది. -
సీఎం జగన్ ఆపన్న హస్తం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మానవత్వం చాటుకున్నారు. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా నిర్వహించిన మైనార్టీల సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరానికి వచ్చిన ఆయన.. తిరిగి వెళుతున్న సమయంలో స్టేడియం వద్ద పలువురు వ్యాధిగ్రస్తుల కుటుంబ సభ్యులు కలిసి తమ పిల్లల అనారోగ్య సమస్యలు చెప్పుకుని ఆదుకోవాలని వేడుకున్నారు. వారి సమస్యలు విన్న సీఎం వైఎస్ జగన్.. తక్షణమే వారికి ఆర్థిక సాయం అందించాలని జాయింట్ కలెక్టర్ సంపత్‌కుమార్‌ను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ గంటల వ్యవధిలోనే బాధిత కుటుంబ సభ్యులకు రూ.లక్ష చొప్పున రూ.4 లక్షల చెక్కును అందించారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్, వైఎస్సార్ సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి.సంపత్ కుమార్ చేతులు మీదుగా ఈ సాయం అందజేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన మాచవరానికి చెందిన సాయితేజ తండ్రి ముసలయ్య, విద్యాధరపురానికి చెందిన జగదీష్ తల్లి టి.ఉష, బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న కండ్రిక గ్రామానికి చెందిన ప్రవీణ్‌కుమార్ తల్లి నాగమణి, విజయవాడ దుర్గాపురానికి చెందిన సుకీర్తి చికిత్స కోసం తల్లి కరుణలు చెక్కులు అందుకున్నారు. -
వైజాగ్ జూపార్క్‌లో "టైగర్ జానకి" మృతి
విశాఖపట్నం: జూ పార్కులో జానకి(22) అనే ఆడ పెద్ద పులి వృద్ధాప్యంతో శనివారం మృతి చెందింది. జూలో ఎన్‌క్లోజర్‌లో హుషారుగా తిరుగుతూ సందర్శకులను అలరించే జానకి కొన్ని నెలలుగా ఆనారోగ్యానికి గురైంది. జూ వైద్య సిబ్బంది వైద్య సేవలు అందించినా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. వృద్ధాప్య కారణంగా అనారోగ్యానికి గురై కొన్ని రోజులుగా ఆహారం కూడా తినలేదని జూ క్యూరేటర్ నందనీ సలారియా తెలిపారు. ప్రస్తుతం జూలో మూడు పెద్ద పులులున్నట్లు పేర్కొన్నారు. -
డయాబెటిస్ ఉన్నవాళ్లు గుండె జబ్బులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
-
పిల్లల్ని ఒంటరి చేసి వెళ్లిపోయావా.. ఎందుకిలా చేశావ్ మమత!
గుడివాడరూరల్: వివాహిత కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మందపాడుకు చెందిన తాడి మమత (26) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ క్రమంలో ఆ ఇబ్బందులు తాళలేక శుక్రవారం రాత్రి పామర్రు రోడ్డులోని పెదకాల్వలో దూకింది. స్థానికులు చూసి వెంటనే టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. గజ ఈతగాళ్ల సాయంతో వెతుకులాట ప్రారంభించినా ఫలితం లేకుండా పోయింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో శనివారం ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టగా 10 గంటల తర్వాత బాపూజీనగర్ లాకుల వద్ద మమత మృతదేహం లభించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి పోలీసులు తరలించారు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త తాడి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు టూటౌన్ ఎస్ఐ వి.రాజేంద్రప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
‘నాన్న క్షమించు.. నాకు బతకడం ఇష్టం లేదు’
వేలూరు: రాణిపేట జిల్లా ఆర్కాడు తాలుకా సాత్తూరు గ్రామానికి చెందిన విఘ్నేశ్వరన్(26) కాంచీపురంలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో ట్రైనీ కానిస్టేబుల్‌గా ఉన్నాడు. ఆరోగ్యం క్షీణించడంతో గత 10 రోజులుగా సెలవు పెట్టి స్వగ్రామంలో ఉంటున్నాడు. సోమవారం ఉదయం కాంచీపురం వెళుతున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి ప్రయాణమయ్యాడు. సాయంత్రం వాలాజ టోల్గేట్ నుంచి విఘ్నేశ్వరన్ తన తండ్రి ఏయుమలైతో సెల్ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తుంది. ఆ సమయంలో ‘నాన్న నన్ను క్షమించు, నాకు బతకడం ఇష్టం లేదని, ఆరోగ్యం సక్రమంగా లేదని చెప్పి’.. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు తెలుస్తోంది. అనంతరం అక్కడున్న చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏయుమలై తన బంధువులతో కలిసి కారులో వాలాజ టోల్గేట్ వద్దకు చేరుకొని గాలించగా విఘ్నేశ్వరన్ ఆత్మహత్య చేసుకొని ఉండటాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు. వాలాజ పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ప్రియురాలితో గొడవపడి వ్యక్తి ఆత్మహత్య -
తనలా బాధపడుతున్న బాలుడి కోసం రూ 61 లక్షలు సమకూర్చాడు...ఐతే అతను చనిపోయాడు!
మనమే బాధలో ఉంటే అవతలివాళ్లకి సాయం చేయాలన్న ఆలోచనే రాదు. చాలామంది తమకే ఇంత పెద్ద కష్టం అంటూ దేవుడిని లేక విధిని తిడుతూ ఊసూరుమంటూ కూర్చుండిపోతారు. కానీ ఈ యువకుడు అందుకు భిన్నం. తాను ఒక క్యాన్సర్ పేషంట్ అయ్యి మరో క్యాన్సర్ పేషంట్ బతకాలని తపించాడు. అసలు విషయంలోకెళ్తే...అమెరికాలోని రైస్ లాంగ్‌ఫోర్డ్ అనే యువకుడు ప్రతిభావంతుడైన అథ్లెట్. అయితే ఒక రోజు తన స్నేహితులతో కలసి చేసిన స్ప్రింట్ రేస్‌లో రైస్ కళ్లు తిరిగి పడిపోయాడు. అప్పుడే రైస్ ఆస్టియోసార్కోమా అనే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. అతని కుడి కాలు తుంటిలో కంతిని గుర్తించిన వైద్యులు తొలగించే నిమిత్తం మొత్తం కాలుని తీసేశారు. దీంతో రైస్ జీవితాంతం కర్రల సాయంతోనే నడిచే పరిస్థితి ఎదురైంది. అయితే అతని కుటుంబసభ్యులు మాత్రం రైస్ క్యాన్సర్‌ని జయించి బయటపడ్డాడని ఆనందించారు. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలువలేదు. రైస్‌కి శస్త్రచికిత్స జరిగిన కాలు మళ్లీ వాపు రావడం మొదలైంది. మళ్లీ క్యాన్సర్ తర శరీరంలో మరింతగా విజృభించడం మొదలైందని రైస్ గ్రహించాడు. ఈ క్రమంలో రైస్ జాకబ్ జోన్స్ అనే ఆరేళ కుర్రవాడు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని తెలుసుకుని ఆ బాలుడికి సాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. అందుకు రైస్ వ్యక్తిగతంగా సుమారు ఒక లక్ష రూపాయలు పొదుపు చేసి ఆ బాలుడి కుటుంబసభ్యులకు అందజేశాడు. అయితే ఇది అతని చికిత్సకు ఏ మాత్ర సరిపోదని భావించి ఆన్లైన్లో క్రౌడ్ ఫండింగ్ ఓపెన్‌చేసి ఆ బాలుడి కోసం దాదాపు రూ.61 లక్షలు సేకరించాడు. ఈ మేరకు రైస్ తన తల్లి కేథరిన్‌తో ...జాకబ్ ఆరేళ్ల తన జీవితంలో న్యూరోబ్లాస్టోమా అనే క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నాడు. అతను ఈ క్యాన్సర్‌ని జయించి త్వరితగతిన కోలుకోవాలని కోరుకుంటున్నా" అని తరుచుగా చెప్పేవాడు. అంతేకాదు రైస్ సేకరించిన ఈ 61 లక్షలు డబ్బుని జాకబ్ కుటుంబ సభ్యులకు అందించిన తదుపరి అతను మరణించాడు. దీంతో జాకబ్ కుటుంబ సభ్యలు మాట్లాడుతూ..."రైస్ తానున్న పరిస్థితిని పక్కనపెట్టి జాకబ్ పట్ల అతను కనబర్చిన ప్రేమ, తెగువ, ధైర్యం నమశక్యంకానివి. రైస్ కారణంగానే జాకబ్ ఈ క్యాన్సర్‌తో పోరాడి కొత్త భవిష్యతును పొందగలిగే సువర్ణావకాశం కలిగింది" అని కన్నీటిపర్యంతమయ్యారు. ప్రస్తుతం ఈ విషయం ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ఇదో చెత్త ప్రశ్న.. ఇంటర్వ్యూలో యువతి షాకింగ్ రిప్లై.. వీడియో వైరల్) -
పామేడు– కొండపల్లి మధ్య ఆర్కే అంత్యక్రియలు
చర్ల/టంగుటూరు: మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) మృతిని మావోయిస్టు పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఆర్కే మృతిపై గురువారమే కథనాలు వచ్చినా పార్టీ నుంచి అధికారిక ప్రకటన మాత్రం శుక్రవారం వెలువడింది. ఆయన గురువారం ఉదయం కిడ్నీ సంబంధిత వ్యాధితో మృతి చెందగా శుక్రవారం మధ్యాహ్నం పార్టీ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించినట్లు ఆ ప్రకటన తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పామేడు – కొండపల్లి మధ్య అటవీ ప్రాంతంలో నిర్వహించిన అంత్యక్రియల ఫొటోలు, వీడియోలను శనివారం మావోయిస్టు పార్టీ మీడియాకు విడుదల చేసింది. ఆర్కే అంత్యక్రియల్లో బీజాపూర్, సుకుమా జిల్లాల్లోని పాలగూడ, గుండ్రాయి, కంచాల, మీనగట్ట, దామారం, జబ్బగట్ట తదితర గ్రామాల నుంచి సుమారు 2 వేల మందికిపైగా ఆదివాసీలతో పాటు పెద్ద ఎత్తున మావోయిస్టులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆర్కే మృతి సమాచారాన్ని పార్టీ శ్రేణులు కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలకు తెలియజేయడంతో పాటు మిలీ షియా, గ్రామకమిటీ సభ్యుల ద్వారా వివిధ గ్రామాలకు చేరవేసి అంత్యక్రియలకు రావాలని సూచించడంతో ఆదివాసీలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కాగా, శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తరలి వచ్చిన ఆదివాసీలతో పాటు మావోయిస్టులు ఆర్కేకు నివాళులర్పించి భారీ ర్యాలీ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఉద్యమంలో నాలుగు దశాబ్దాల పాటు పనిచేసిన ఆర్కే మృతదేహాన్ని చూసి ఆదివాసీలు కన్నీటిపర్యంతమైనట్లు సమాచారం. ఆర్కేకు ఘన నివాళి ఏపీలోని ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో ఆర్కే భార్య శిరీష, కుటుంబ సభ్యులు, అమరుల బంధుమిత్రుల సంఘం సభ్యులు శనివారం ఆర్కేకు నివాళులర్పించారు. ‘ఆర్కే మృతితో ఉద్యమం ఆగిపోదు. ఆయనలాంటి గెరిల్లా యుద్ధ వీరులు ఇంకా పుట్టుకొస్తారు’అని ఈ సందర్భంగా శిరీష అన్నారు. ఆయన ప్రజల కోసమే అమరుడయ్యారని విరసం నేత కల్యాణరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆర్కే మరణ వార్తను ధ్రువీకరించుకుని భార్య శిరీష, కుటుంబ సభ్యులు విలపించారు. ఇదిలా ఉండగా ఆర్కే పోలీసులకు లొంగిపోయుంటే ఆయనకు మంచి వైద్యం అందేదని, బతికేవాడని ఒడిశాలోని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ పిళ్లై అభిప్రాయపడ్డారు. మంచి వైద్యం అందించినా.. పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కేకు అకస్మాత్తుగా కిడ్నీల సమస్య వచ్చిందని, డయాలసిస్ చేయిస్తున్న క్రమంలో కిడ్నీలు ఫెయిల్ కావడం, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన మృతి చెందారని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేర్కొన్నారు. ఆర్కేకు పార్టీ తరఫున మంచి వైద్యం అందించినా దక్కించుకోలేకపోయామని తెలిపారు. ఆర్కే మృతి చెందిన నేపథ్యంలో శుక్రవారం అభయ్ ఓ లేఖ విడుదల చేశారు. పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అనారోగ్యంతో 14 అక్టోబర్ 2021న ఉదయం 6 గంటలకు తుదిశ్వాస విడిచారని లేఖలో వెల్లడించారు. ఆయనకు అకస్మాత్తుగా కిడ్నీల సమస్య మొదలుకాగా, వెంటనే డయాలసిస్ ప్రారంభించినా కిడ్నీలు ఫెయిల్ కావడం, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తి అమరుడయ్యారని పేర్కొన్నారు. ఆయనకు విప్లవ శ్రేణుల మధ్యే శ్రద్ధాంజలి ఘటించి అంత్యక్రియలు పూర్తిచేశామని తెలిపారు. కామ్రేడ్ రామకృష్ణ మృతి పార్టీకి తీరని లోటని, ధైర్యసాహసాలతో పార్టీకి, విప్లవోద్యమానికి నాయకత్వం అందించారని కొనియాడారు. పార్టీకి అన్ని రంగాల్లో సేవలందించారని వివరించారు. ఆర్కే సాధారణ జీవితం, ప్రజల పట్ల ప్రేమ, సహచరులపై ఆప్యాయత, విప్లవం పై స్పష్టత, దూరదృష్టి నుంచి యావత్ పార్టీ కేడర్ ప్రేరణ పొందినట్లు తెలిపారు. ఆయన ఆశయసాధనకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. -
అన్న మృతిని తట్టుకోలేక..
సాక్షి, కోనరావుపేట(వేములవాడ): సోదరుని మృతిని తట్టుకోలేక సోదరి కూడా ప్రాణాలు విడిచిన సంఘటన మండలంలోని కనగర్తిలో జరిగింది. కనగర్తికి చెందిన బడే రామయ్య శనివారం మృతి చెందాడు. అన్న మృతదేహాన్ని చూసిన చెల్లి నిజామాబాద్‌కు చెందిన తాళ్లపెల్లి లక్ష్మి కుప్పకూలింది. అన్నాచెల్లెళ్లు ఒకేసారి మృతిచెందడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. లక్ష్మికి భర్త పోచయ్య, కుమారుడు కిషన్ ఉన్నారు. మరో ఘటనలో.. పాముకాటుతో యువకుడి మృతి కోనరావుపేట(వేములవాడ): మండలంలోని గొల్లపల్లి(వట్టిమల్ల)లో పాముకాటుకు యువకుడు బలయ్యాడు. గ్రామానికి చెందిన చీమల ప్రశాంత్(26) 18 రోజుల క్రితం పొలం వద్ద గడ్డి కోస్తుండగా పాము కాటువేసింది. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 18 రోజులుగా చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతునికి భార్య వైష్ణవి, కుమారుడు నితీష్ ఉన్నారు. చదవండి: Canara Bank: పక్కా ప్లాన్.. రూ.338 కోట్లు ఎగనామం! -
అయ్యో భగవంతుడా.. సాయం అందేలోపు.. ఆగిన శ్వాస
సాక్షి, చెన్నై: ప్రభుత్వ పరంగా సాయం అందేలోపు..ఓ క్రీడాకారుడి శ్వాస ఆగింది. వివరాలు.. తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని మండవర్ మంగళం గ్రామానికి చెందిన దురై పాండియన్, మల్లిక దంపతులకు మురుగేషన్, దినేష్ కుమారులు. గతంలో అనారోగ్యంతో దురై పాండియన్ మరణించాడు. అగ్గిపెట్టెల తయారీ పరిశ్రమలో పనిచేసి పిల్లలను మల్లిక పోషించింది. పెద్దవాడైన మురుగేషన్ (20) తమిళనాడు రాష్ట్ర సబ్ జూనియర్ హాకీ టీం జట్టులో రాణించాడు. ఇటీవల మురుగేషన్ ఆర్మీలో చేరాలనుకున్నాడు. అయితే ఆర్మీ ఎంపిక సమయంలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో అతడి రెండు కిడ్నీలు దెబ్బతిని ఉన్నట్లు గుర్తించారు. దీంతో తల్లి మల్లిక కుమారుడికి అప్పు చేసి చికిత్స అందించింది. ప్రస్తుతం తిరునల్వేలి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారంలో రెండుసార్లు డయాలసిస్ చేసుకుంటూ వచ్చిన మురుగేషన్‌ను ఆదుకుని ఆధునిక వైద్యం అందించాలని ప్రభుత్వానికి కుటుంబీకులు, సహచర క్రీడాకారులు విజ్ఞప్తి చేశారు. అయితే సాయం అందేలోపు మురుగేషన్ మంగళవారం రాత్రి నిద్రలోనే మరణించాడు. బుధవారం తనయుడు ఇక లేరన్న సమాచారంతో మల్లిక శోక సంద్రంలో మునిగిపోయింది. కాగా బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని క్రీడాకారులు విజ్ఞప్తి చేస్తున్నారు. చదవండి: రేవంత్‌రెడ్డికి సాయంత్రం వరకు గడువిస్తున్నా: మల్లారెడ్డి -
రక్తపు వాంతులు.. అంతుపట్టని వ్యాధి
సాక్షి, ములుగు : ఓ వింతవ్యాధి ఆ గ్రామాన్ని కబలిస్తోంది. వరుస మరణాలు ఆ గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కేవలం 20 రోజుల వ్యవధిలో ఆరుగురు బలయ్యారు. దీంతో తమ గ్రామానికి ఎవరో చేతబడి చేశారని ఆందోళన చెందుతున్న అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వణికిపోతున్నారు. ప్రాణ భయంతో ఊరు వదిలి వలస వెళ్ళిపోతున్నారు. వారిని బలి తీసుకుంటున్న ఆ వ్యాదేంటో వైద్యులకు కూడా అంతు చిక్కడం లేదు. ఇది ములుగు కన్నాయిగూడెం మండలంలోని ముప్పనపల్లి గ్రామం. వరంగల్‌కు 145 కి.మీ దూరంలో, ములుగు జిల్లా కేంద్రానికి 95కి.మీ దూరంలో వుండే ఏటూరునాగారం ఏజెన్సీలోని ఓ మారుమూల గ్రామం ఇది. ఈ కుగ్రామం గత 20 రోజులుగా మృత్యు భయంతో బెంబేలెత్తిపోతోంది. (20 రోజుల్లో ఆరుగురు మృతి.. కారణం?) ఎవరిని పలుకరించినా మృత్యు భయమే గ్రామంలో ఏ ఒక్కరికి కంటిమీద కునుకు లేదు. ఏ ఇంట్లో అలికిడి అయినా ఏదో జరిగి పోతుందనే ఆందోళన వెంటాడుతుంది. కడుపునొప్పి జ్వరంవస్తే చాలు.. ఇక చావు తప్పదని ఆందోళన. అందుకు కారణం గత 20 రోజుల్లో ఈ గ్రామానికి చెందిన ఆరుగురు చనిపోవడమే. వాళ్లకు కడుపునొప్పి వచ్చిన కొద్దిసేపటికే కడుపంతా ఉబ్బి రక్తంతో వాంతులు చేసుకొని కేవలం కొద్ది గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు ఎర్రయ్య, లక్ష్మీనారాయణ, కుమారి, దుర్గమ్మ, రమేష్, రాధిక అనే ఆరుగురు ఒకే రకమైన వింతవ్యాధితో చనిపోయారు. అంతా కడుపు ఉబ్బి ప్రాణాలు కోల్పోయారు. దీంతో గ్రామంలో ఎవరికైనా కడుపునొప్పి వచ్చిందంటేచాలు చావు తప్పదని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముప్పునపల్లిలో ఎటు చూసినా విషాద వాతావరణమే అలముకొని ఉంది. మరణించిన వారి ఫ్లెక్సీలు, ఇళ్లకు తాళాలే వేలాడుతున్నాయి. ఎవరిని పలుకరించినా మృత్యు భయమే కనిపిస్తుంది. ఇప్పటివరకు మరణించిన వారంతా అంతా ఒకే విధంగా వింత వ్యాధితో మృతి చెందడంతో ఊరికి ఎవరో చేతబడి చేశారని, ఏదో శక్తి ఈ ఊరిని ఆవహించిందని ఆందోళన చెందుతున్నారు. ఆరోగ్య శాఖ అధికారులకూ అంతు చిక్కని రోగం ఈ గ్రామంలో మొత్తం 60 కుటుంబాలు నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం అంతుచిక్కని వింత వ్యాధి వారి ప్రాణాలు మింగేస్తుండడంతో ఊరంతా ప్రాణభయంతో ఊరి విడిచి వలసబాట పట్టారు. ఇప్పటికే 40కి పైగా కుటుంబాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇళ్ళు, ఊరు విడిచి వెళ్లిపోయారు. దీంతో ఏ ఇంటికి చూసినా ఇలా తాళాలు వేలాడుతున్నాయి. ఏదో శక్తి ఊరిని ఆవహించిందని ఆందోళన చెందుతున్న ఇక్కడి ప్రజలు ఇక్కడ ఉంటే ప్రాణాలు మిగలవనే ఆందోళనతోనే ఊరువిడిచి వెళ్లిపోతున్నారని చెబుతున్నారు. వింతవ్యాధితో ఊరంతా మృత్యువాత పడుతుండడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పందించారు. గ్రామంలో ప్రత్యేక హెల్త్ క్యాంపు నిర్వహించారు. చనిపోయిన వారితోపాటు ప్రస్తుతం బ్రతికి ఉన్నవారి కుటుంబ సభ్యులకు మలేరియా, కరోనా, డెంగ్యూ టైపాయిడ్ టెస్టులు నిర్వహించారు. కానీ ఎలాంటి ఫలితంలేదు. నెగిటివ్ గానే వస్తుంది. ఈ చావులకు కారణమేమిటో వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు అంతు చిక్కడం లేదు. మూఢనమ్మకాల వైపు అడుగులు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడే మకాంవేసి మరోచావు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. వరుస మరణాల నేపథ్యంలో మూఢనమ్మకాల వైపు అడుగులు వేస్తున్నారు. కచ్చితంగా ఏదో శక్తి ఆవహించిందని, చేతబడి చేశారని గ్రామమంతా ఆందోళన చెందుతుండడంతో స్థానిక సర్పంచ్ కూడా అయోమయంలో చిక్కుకున్నారు. వైద్యులకు కూడా ఈ వ్యాధి అంతుచిక్కకపోవడం వల్ల మూఢ నమ్మకాలవైపు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ఊళ్ళో మిగిలిన15 కుటుంబాలు చీకటి పడితేచాలు ఒక్కచోట చేరి మృత్యువును జయించేందుకు మానవ ప్రయత్నాలు చేస్తూ మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. ఇప్పటివరకు చనిపోయిన వారి మరణాలకు కారణాలు తెలియదు... ఎప్పుడు ఎవరు బలవుతారో అర్థంకాక వీరంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భీతిల్లుతున్నారు. -
ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
ఇబ్రహీంపట్నం: రంగారెడి జిల్లా ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం నేత మస్కు నర్సింహ(52) అనారోగ్యంతో మృతి చెందారు. ఘగర్, బీపీ లెవల్స్ పెరగడంతో పది రోజుల క్రితం ఆయన నిమ్స్‌లో చేరారు. గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతోపాటు ఉపిరితిత్తులు ఇన్ఫెక్షన్కు గురికావడంతో నర్సింహ ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొం దుతూ ఆదివారం అర్ధరాత్రి పన్నెండున్నర గంటల సమయంలో ఆయన కన్నుమూశారు. యాచారం మండలం చింతుల్ల గ్రామానికి చెందిన నర్సింహకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. విద్యార్థి దశ నుంచి రాజకీయల్లో ఆయన చురుకైన పాత్ర పోషించారు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నుంచి సీపీఎం అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. కాగా, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సీతారాములు నిమ్స్ వద్ద నర్సింహ భౌతికకాయంపై ఎర్రజెండా కప్పి నివాళులు అర్పించారు. నర్సింహ మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ప్రజాసేవలో నిమగ్నమైన దళిత నేత చిన్నవయసులోనే మరణించడం బాధాకరమని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విచారం వ్యక్తం చేశారు. -
కాటికి పంపేవారే కరువయ్యారు!
కోదాడ: కరోనా మహమ్మారి మానవ సంబంధాలను ఏ విధంగా చిన్నాభిన్నం చేస్తుందో నిరూపించే విషాద ఉదంతమిది. ఊరంతా బలగం ఉన్నా.. కనీసం కడసారి చూపునకైనా కన్నెత్తి చూసినవారు కానరాలేదు. కాటికి సాగనంపడానికి.. పాడెమోసేందుకు నలుగురు బంధువులు కరువయ్యారు. దీంతో కరోనా వ్యాధితో ఇబ్బంది పడుతున్న మనుమడు పుట్టెడు కష్టంలో ఒక్కడే నాయనమ్మను కారులో కాటికి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సూర్యాపేట జిల్లా మునగాలలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇప్పటికే ముగ్గురు కుమారులు చనిపోయారు. దీంతో ఆమె కొద్దిరోజులుగా రెండో కుమారుడి కొడుకు (మనుమడి) వద్ద ఉంటోంది. అనారోగ్యంతో ఆదివారం ఆమె మృతిచెందింది. ఇదే సమయంలో ఆమె మనుమడు వేరేచోట కరోనా పాజిటివ్‌తో హోం ఐసోలేషన్‌లో ఉన్నాడు. దీంతో వృద్ధురాలి మృతదేహాన్ని చూసేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. గ్రామానికి చెందిన కొందరు ఈ విషయాన్ని మనుమడికి చెప్పగా, తన పరిస్థితిని వివరించి బోరున విలపించాడు. ఈ విషయంలో ఏం చేయాలో తెలియక గ్రామానికి చెందిన నలుగురు పెద్దలు అంత్యక్రియలకు కావాల్సిన ఏర్పాట్లను చేశారు. రాత్రి 7 గంటల సమయంలో పాజిటివ్‌తో ఇబ్బంది పడుతున్న మనుమడు పీపీఈ కిట్ ధరించి కారులో ఇంటికి వచ్చి మృతదేహాన్ని ఒక్కడే కారులోకి చేర్చాడు. అదే కారును నేరుగా శ్మశానం వద్దకు తీసుకెళ్లి నాయనమ్మ అంత్యక్రియలు నిర్వహించాడు. -
చికిత్స పొందుతూ కన్నుమూసిన నర్సింగ్‌రావు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత, అంబర్పేట్ శంకర్ సోదరుడు సి.నర్సింగ్‌రావు (67) సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న నర్సింగ్రావును కుటుంబ సభ్యులు గత నెల 27న ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆ మరుసటి రోజే ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నెల 8న ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న నర్సింగ్‌రావు చనిపోయాడని ఆస్పత్రి వర్గాలు చెప్పడంతో పెద్ద దూమారం చెలరేగిన సంగతి విదితమే. ఈ ఘటనపై నర్సింగ్‌రావు కుటుంబ సభ్యులతోపాటు వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే, హైబీపీ, మధుమేహం, లంగ్స్ ఇన్ఫెక్షన్, కిడ్నీ ఫెయిల్యూర్, న్యుమోనియా తదితర రుగ్మతలతో బాధపడుతున్న నర్సింగ్‌రావు ఆరోగ్యపరిస్థితి విషమించి సోమవారం కన్నుమూశారు. -
వీరాటం.. బతుకు పోరాటం
వయసు 13 ఏళ్లు...మనిషి 3 అడుగులు....ఆకలి అయితే తినాలనే ఆలోచన రాదు...మాట్లాడటానికి మాటలు రావు...తన మనస్సులోని భావాలను వ్యక్తపరచలేడు. తన అవసరాలను ఎదుటివారికి చెప్పేందుకు నోరు రాదు. ఆలోచించేందుకు మెదడు పరిణితిలేదు. ఏది కావాలన్నా కుటుంబ సభ్యులు తీర్చాల్సిందే. ఇటువంటి పరిస్థితిల్లో కుటుంబం అతనికి అండగా నిలబడింది. తల్లి, తండ్రి, అక్క వ్యవసాయ పనులు చేస్తూ, తమ కుటుంబాన్ని గడుపుతూ, ఆస్పత్రుల చుట్టూ తిరిగారు.. సమయం, డబ్బు వృథా అని వైద్యులు చెబుతున్నా.. ఏదో చిన్న ఆశ .. తమ బిడ్డ మామూలు మనిషి అవుతాడని ఆ తల్లిదండ్రులు ఎదురు చూసేలా చేస్తోంది. పిడుగురాళ్ల రూరల్: మల్లేశ్వరి, లక్ష్మయ్యలకు మూడవ సంతానంగా వీరాటం గోపి జన్మించాడు. వారిది వ్యవసాయ కూలి కుటుంబం. నిరంతరం పని చేస్తే కానీ పూట గడవని పరిస్థితి. కరవు ప్రాంతమైన బొల్లాపల్లి మండలం గుంమ్మనంపాడులో ఉండలేక అత్తగారి ఊరైన పిడుగురాళ్ల మండలం పందిటివారిపాలెం గ్రామానికి వచ్చి 10 ఏళ్లుగా జీవనం సాగిస్తున్నారు. కుటుంబంలో మొత్తం ఐదుగురు సభ్యులు ఉన్నా తల్లి కాని, తండ్రి కాని గోపి దగ్గర ఉండి నిత్యావసరాలు తీర్చాల్సిందే. అక్క అనిత చిన్నతనం నుంచి పొలంపనులకు వెళ్తూ ఇంటి పోషణలో భాగస్వామ్యమవుతుంది. ఇంట్లో ముగ్గురు కూలి పని చేస్తూ, గోపి మందుల ఖర్చులు చూస్తూ, గోపి చిన్న అక్క రమ్యను చదివిస్తున్నారు. అద్దె ఇంట్లో ఉండలేక, గోపికి, ఇంటి పోషణకు వచ్చే డబ్బులు సరిపోక నానా అవస్థలు పడుతున్నారు. పందిటివారిపాలెం గ్రామంలో గోపిని చూసిన ప్రతి ఒక్కరు ఆ కుటుంబంపై జాలిచూపించాల్సిందే. వైద్య సేవలకు వేలల్లో ఖర్చు... మగ పిల్లాడు పుట్టాడని ఆనందించే లోపు ఎదుగుదల లేదని తెలిసి బాధపడిన తల్లిదండ్రులు వైద్యం చేయించేందుకు13 ఏళ్లుగా తిరగని ప్రదేశం అంటూ లేదు. గుంటూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రముఖ హాస్పటల్స్‌లో మందుల కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తూనే ఉన్నారు. కానీ డాక్టర్లు మాత్రం గోపికిఅవయవాల ఎదుగుదల లేదని తేల్చి చెప్పారు. అయినప్పటికీ ఏదో రకంగా గోపి మామూలు మనిషి అవుతాడని, ఏడాక్టర్ చేతిలో ఏముంటుందోనని ప్రతిడాక్టర్ సలహాలు, సూచనలు, మదులు వాడుతూనే వేల రూపాయలుఖర్చు చేస్తున్నారు. కానీ గోపిలో ఏలాంటి మార్పు కనిపించలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంఆదుకోవాలని వినతి ప్రభుత్వ పింఛన్ పొందేందుకు ఆధార్ తప్పనిసరి కానీ, గోపికి ఆధార్ తీసేందుకు వేలిముద్రలు కానీ, ఐరీష్ తీసేందుకు సహకరించటం లేదు. ఎన్నోసార్లు మీసేవాలో ఆధార్ నమోదు కోసం వెళ్లినా ఫలితంలేదు. దీంతో గోపి 10 ఏళ్లకు పైగా పింఛన్ కోసం పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఈవిషయమై కుటుంబ సభ్యులు కలవని అధికారులు లేరు. అయినా ఎటువంటి ఉపయోగం లేదు. పింఛన్ అయినా వస్తే కొంత ఉపశమనం కలుగుతుందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. -
తల నొప్పిని భరించి.. ప్రయాణికులను కాపాడి..!
సాక్షి, అమరావతి: ఆ బస్సు గుంటూరు నుంచి అమరావతికి బయలుదేరింది. మరో ఆరు కిలో మీటర్లు ప్రయాణిస్తే గమ్యస్థానం చేరుతుంది. ఉన్నట్టుండి బస్సు అదుపు తప్పింది.. స్టీరింగ్‌పై డ్రైవర్ చేతులు ఉన్నా నియంత్రణ చేయలేకపోతున్నాడు.. భరించలేని తలనొప్పి, కళ్లు బైర్లుకమ్మడంతో డ్రైవింగ్‌పై దృష్టిపెట్టలేకపోయాడు.. బస్సు రోడ్డుపై అడ్డదిడ్డంగా వెళ్లడం.. కనుచూపు మేరలోనే కొండవీటివాగుపై బ్రిడ్జి కనిపించడం, బస్సుపై డ్రైవర్ నియంత్రణ లేపోవడం.. గమనించిన ప్రయాణికులు ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. వారి అరుపులతో స్పృహలోకి వచ్చిన డ్రైవర్ బస్సును పక్కకుతీసి ఆపడంతో ప్రయాణికులు ఊరిపీల్చుకున్నారు. నొప్పి భరించలేని డ్రైవర్ సీటులో కూర్చోలేక రోడ్డుపై పడుకుని తల్లడిల్లాడు. డ్రైవర్‌ను ప్రయాణికుల సాయంతో బస్సు కండక్టర్ అమరావతి సీహెచ్‌సీకి తరలించాడు. బస్సు కండక్టర్ కుమారి, ప్రయాణికుల కథనం మేరకు.. గుంటూరు నుంచి అమరావతిగుడి సర్వీసు ఆర్టీసీ బస్సు డ్రైవర్ రవికిరణ్ మధ్యాహ్నం భోజనం తరువాత ఆరోగ్యం బాగాలేదని బస్టాండులో ఆర్టీసీ సంస్థకు చెందిన డాక్టర్‌కు చూపించుకున్నారు. డాక్టర్ పారాసిటమాల్ మాత్రలు ఇచ్చి పంపించారు. అనంతరం రవికిరణ్ డ్యూటీ ఎక్కాడు. బస్సు గుంటూరు నుంచి అమరావతి వస్తుండగా తాడికొండ అడ్డరోడ్డు దగ్గర తనకు తలనొప్పిగా ఉందని రవికిరణ్ కండక్టర్ కుమారికి చెప్పారు. తీరా ఎండ్రాయి వద్దకు వచ్చేసరికి రవికిరణ్ తలనొప్పిని తట్టుకోలేక తల్లడిల్లాడు. కళ్లు బైర్లుకమ్మడంతో స్టీరింగ్‌పై నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు రోడ్డుకు అడ్డదిడ్డంగా వెళ్లడంతో బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులు భయపడ్డారు. కొండవీటి వాగుపై ఉన్న వంతెన ఎదురుగా కనిపించడంతో ఎటువంటి ప్రమాదం జరుగుతుందోనని హాహాకారాలు చేశారు. వారి అరుపులకు తేరుకున్న రవికిరణ్ బస్సును పక్కకుతీసి నిలిపాడు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం డ్రైవర్‌ను అమరావతి సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ చికిత్స పొందిన అనంతరం డ్రైవర్ కోలుకున్నాడు. కోలు కున్న రవికిరణ్ మాట్లాడుతూ తనకు ఆరోగ్యం బాగాలేదని ఆర్టీసీ డాక్టర్ వద్దకు వెళ్తే పారాసిటమల్ మాత్రలు ఇచ్చి పంపించారని, ఒక మాత్ర వేసుకుని డ్యూటీకి వచ్చానని చెప్పాడు. -
పెళ్లయిన నెలన్నరకే మృత్యు ఒడిలోకి...
సుజాతనగర్: పెళ్లింట విషాదం నిండుకుంది. పెళ్లయిన నెలన్నర రోజులకే అనారోగ్యంతో అతడు మృతిచెందాడు. సుజాతనగర్ మండలం సుజాతనగర్ గ్రామస్తులు షేక్ ఇబ్రహీం, ఖాదర్‌బీ దంపతుల పెద్ద కుమారుడు షేక్ ఇస్మాయెల్(26), ఎంబీఏ పట్టభద్రుడు. ఎస్బీఐ ఇన్సూరెన్స్‌లో ప్రైవేట్ ఉద్యోగిగా కొత్తగూడెంలో పనిచేస్తున్నాడు. కొత్తగూడేనికి చెందిన షేక్ ఇమాంసాబ్, రజియా దంపతుల కుమార్తె ఇస్మత్‌తో గత నెల (నవంబర్) 12న ఇస్మాయెల్‌కు వివాహమైంది. పెళ్లికి ముందే ఇస్మాయెల్‌కు జ్వరం సోకింది. వైద్యం చేయించుకోవడంతో తగ్గింది. ఆ తర్వాత పెళ్లయింది. ఇటీవల ఒక రోజున, డ్యూటీలో ఉండగానే అతడికి కడుపు నొప్పి వచ్చింది. కళ్లు తిరిగి పడిపోయాడు. వారం రోజులుగా ఖమ్మంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి కిడ్నీలు ఫెయిలైనట్టు వైద్యులు చెప్పారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. ఈ నెల 28న (శుక్రవారం) హైదరాబాద్ తీసుకెళుతుండగా మృతిచెందాడు. అతని భార్య, కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. -
వరంగల్: ఓటు వేసేందుకు వస్తూ వృద్ధురాలి మృతి
సాక్షి, తరిగొప్పుల: ఓటు వేసేందుకు వచ్చి బీపీ తగ్గడంతో తీవ్ర అస్వస్థతకు గురై వృద్ధురాలు మృతి చెందిన సంఘటన జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలో చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... మండంలోని మాన్సింగ్ గ్రామ శివారు బాల్య భూక్యతండాకు చెందిన భూక్య మంగ్లీ (68) శుక్రవారం తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు మండలంలోని అంకుషాపూర్‌లోని పోలింగ్ కేంద్రానికి వస్తుంది. ఈ క్రమంలో పోలింగ్ బూత్ బయట బీపీ తగ్గడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో వైద్య చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సూచన మేరకు ఎంపీపీ నూకల కృష్ణమూర్తి మృతురాలి కుటుంబసభ్యులను పరామర్శించి రూ.5000 ఆర్థిక సాయం అందజేశారు. ఆయన వెంట ముక్కెర బుచ్చిరాజ్, పోగుల మల్లేషం, నాగపూరి కిషన్ గౌడ్ ఉన్నారు. -
నా ప్రాణం పోయినా సరే నువ్వు బతకాలి
ముత్తారం(మంథని): ఆ కుటుంబాన్ని విధి పగబట్టింది. గతంలో అనారోగ్యంతో తల్లి మరణిం చింది. ఇప్పుడు ఇంటి ఆడబిడ్డఅయిన కన్నూరి శిరీష(20) కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడగా... వైద్యుల సూచనల మేరకు తన సోదరుడు కాలేయాన్ని దానం ఇచ్చాడు. తన సోదరి బతుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే 20 రోజులు చికిత్స పొందిన యువతి మంగళవారం ఊపిరి వదిలింది. ఈ ఘటనతో కుటుంబంలో వి షాదం అలుము కుంది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఆదివారంపేటకు చెందిన కన్నూరి బాబు, శైలజ దంపతులకు నలుగురు సంతానం. వీఆర్ఏగా పనిచేసిన బాబు ఇటీవలే వీఆర్వోగా పదోన్నపతి పొందాడు. నాలుగేళ్ల క్రితం పెద్దకూతురు వివాహం చేసి అప్పులు పాలయ్యాడు. అం తలోనే భార్య శైలజ అనారోగ్యంతో చనిపోయింది. రెండో కూతురైన శిరీషకు కడుపునొప్పి రావడ ంతో హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు తప్పనిసరిగా కాలేయ మార్పిడి చేయాలని సూచించారు. కాలే యం కొనే స్థోమత లేకపోవడంతో శిరీష సోద రుడు రవితేజ కాలేయదానానికి ముందుకొచ్చా డు. గతనెల 17న ఆపరేషన్ నిర్వహించి రవితేజ కాలేయాన్ని శిరీషకు అమర్చారు. 20రోజుల పాటు జీవించి ఈనెల 6న చికిత్స పొందుతూ చనిపోయి ంది. ‘తన ప్రాణం ఏమైన మంచిదే కానీ నీవు బతకాలని.. కాలేయదానం చేసినా నిన్ను కాపాడుకోలేకపోయామని’ శిరీష సోదరుడు రవితేజ, కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. -
నిద్ర ప్రయోజనం ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించడమా?
కంటి నిండా నిద్ర పట్టకపోతే.. ఎంత చికాకో మనకు తెలియంది కాదు. పైగా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు నిద్రలేమి హేతువు అవుతుంది. ఈ నేపథ్యంలో కొలంబియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చేసిన ఒక ప్రయోగం ఆసక్తికరమైన విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ఈగలపై జరిగిన ఈ ప్రయోగం ద్వారా నిద్ర వల్ల శరీరానికి కలిగే ప్రయోజనం ఆక్సిడేటివ్ ఒత్తిడి తగ్గడం కావచ్చునని స్పష్టం చేసింది. తినే ఆహారం, పీల్చేగాలి... పరిసరాల్లోని వాతావరణం వంటి అనేక కారణాల వ్ల మన శరీరంలో ఫ్రీరాడికల్స్ ఎక్కువవుతాయని.. ఇవి కాస్తా వాపు/మంటకు దారితీసి చివరకు అనేక వ్యాధులకు కారణమవుతుంది. ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు శాస్త్రవేత్తలు అతితక్కువ సమయం మాత్రమే నిద్రపోయే ఈగలను ఎన్నుకున్నారు. వీటన్నింటిలోనూ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన వీరు.. మిగిలిన వాటితో పోల్చి చూడటం ద్వారా నిద్ర ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గిస్తుందన్న అంచనాకు వచ్చారు. నిద్రలేమి కారణంగా అల్జైమర్స్, పార్కిన్సన్స్, హంటింగ్టన్స్ వంటి వ్యాధులు వస్తాయని, నిద్రతక్కువైతే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువై మరిన్ని సమస్యలకు దారితీస్తుందని తమ అధ్యయనం స్పష్టం చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. -
పొద్దంతా పొగ... ఒళ్లంతా సెగ
సాక్షి,సిటీబ్యూరో : గ్రేటర్లో కాలుష్యం తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరింది. ముఖ్యంగా వాహనాలు వదులుతున్న పొగ కారణంగా భూస్థాయి ఓజోన్ క్రమంగా పెరుగుతుంది. ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ రద్దీ అత్యధికంగా ఉండే సమయాల్లో ఈ ప్రమాదం అధికంగా ఉంటోంది. దీంతో సిటీజన్లు ఆస్తమా, బ్రాంకైటిస్ తదితర శ్వాసకోశ వ్యాధులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వాహనాల నుంచి వెలువడుతోన్న కాలుష్య ఉద్గారాలతోపాటు ఓజోన్ వాయువులు సిటీజన్లకు పట్టపగలే చుక్కలు చూపుతున్నాయి. ప్రధానంగా ట్రాఫిక్ రద్దీ సమయాల్లో ప్రధాన రహదారులపై భూ స్థాయి ఓజోన్ వాయువు గాలిలోని నైట్రోజన్ ఆక్సైడ్స్, ఒలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్లతో కలిసిపోయి...సూర్యరశ్మి ప్రభావంతో భూఉపరితల వాతావరణాన్ని ఓజోన్ దట్టంగా ఆవహిస్తోంది. దీంతో ట్రాఫిక్ రద్దీలో చిక్కుకొన్న ప్రయాణికులు, వాహనదారులు, చిన్నారులు, వృద్ధులు, రోగులు, పాదచారులు ఊపిరాడక సతమతమవుతున్నారు. సాధారణంగా ఘనపు మీటరుగాలిలో భూస్థాయి ఓజోన్ మోతాదు వంద మైక్రోగ్రాములకు మించరాదు. కానీ నగరంలోని ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే సుమారు వంద కూడళ్లలో ఘనపు మీటరు గాలిలో 150 మైక్రోగ్రాములుగా నమోదవుతుండడంతో పలు అనర్థాలు తలెత్తుతున్నాయి. భూస్థాయి ఓజోన్‌తో తలెత్తే అనర్థాలివే... అస్తమా, బ్రాంకైటిస్‌తో సతమతమవడంతోపాటు ఊపిరాడని పరిస్థితి ఎదురవుతుంది. గొంతునొప్పి, ముక్కుపుటాలు దెబ్బతినడం, కళ్లు మండడం. ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతినడం, ఛాతిలో అసౌకర్యం. గ్రేటర్లో వాయు కాలుష్యానికి కారణాలివే.. మహానగరంలో పలు కూడళ్లలో వాయు కాలుష్యం అవధులు దాటుతోంది. గ్రేటర్ పరిధిలో సుమారు 50 లక్షలకు పైగా ఉన్న వాహనాలు వెదజల్లుతున్న పొగ, ట్రాఫిక్ రద్దీలో రహదారులపై రేగుతున్న దుమ్ముతో సిటీజన్ల ముక్కుపుటాలు, శ్వాసకోశాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. పలుప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో చెత్తను తగులబెట్టడంతో కాలుష్య తీవ్రత పెరుగుతోంది. పరిశ్రమలు వెదజల్లుతోన్న కాలుష్యంతో సమీప ప్రాంతాలు పొగచూరుతున్నాయి. శివారుప్రాంతాల్లో నిర్మాణ సంబంధ కార్యకలాపాలు పెరగడంతో సూక్ష్మ ధూళికణాలు పీల్చే గాలిలో చేరి సమీప ప్రాంతాల్లోని సిటీజన్ల ఊపిరితిత్తులోకి చేరుతున్నాయి. ఘనపు మీటరు గాలిలో సూక్ష్మధూళికణాలు (పీఎం2.5) మోతాదు 40 మైక్రోగ్రాములకు మించరాదు. కానీ పలు కూడళ్లలో పలుమార్లు అంతకు రెట్టింపు స్థాయిలో ధూళికాలుష్యం నమోదవుతోంది. బాలానగర్,ఉప్పల్,జూబ్లీహిల్స్,చార్మినార్, ప్యారడైజ్, జూపార్క్, పంజగుట్ట, కూకట్పల్లి, చిక్కడపల్లి, ఎంజీబీఎస్ ప్రాంతాల్లో వాయుకాలుష్యం శ్రుతిమించుతున్నట్లు తేలింది. ఆయా కూడళ్లలో ఏడాదికి సగం రోజులు అంటే 183 రోజులపాటు కాలుష్య మేఘాలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నట్లు బయటపడడం గమనార్హం. గ్రేటర్ పరిధిలో రాకపోకలు సాగించే 50 లక్షల వాహనాల్లో ఏటా సుమారు 109.5 కోట్ల లీటర్ల పెట్రోలు, 120.45 కోట్ల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తుండడంతో పొగ తీవ్రత ఏటేటా పెరుగుతూనే ఉంది. గ్రేటర్ పరిధిలో పదిహేనేళ్లకు పైబడిన కాలం చెల్లిన వాహనాలు 10 లక్షల వరకు ఉన్నాయి. ఇవన్ని రోడ్లపైకి వస్తుండడంతో పొగ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వాహనాల సంఖ్య 50 లక్షలు దాటినా..గ్రేటర్లో 7 వేల కిలోమీటర్ల రహదారులే అందుబాటులో ఉన్నాయి. దీంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగి సగటు వాహన వేగం గంటకు 12 కి.మీ.కి పడిపోతుంది. ఇదే తరుణంలో ఇంధన వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. దీంతో వాహనాల నుంచి వెలువడుతున్న పొగ నుంచి కార్బన్‌మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్‌డయాక్సైడ్, అమ్మోనియా, బెంజీన్, టోలిన్, ఆర్‌ఎస్‌పీఎం(ధూళి రేణువులు) వంటి కాలుష్య ఉద్గారాలు వాతావరణంలో చేరి నగర పర్యావరణం పొగచూరుతోంది. ధూళికాలుష్యంతో అనర్థాలివే.. పీఎం10, పీఎం 2.5, ఆర్‌ఎస్‌పీఎం సూక్ష్మ, స్థూల ధూళి రేణువులు పీల్చేగాలిలో చేరి నేరుగా ఊపిరితిత్తుల్లో చేరి తీవ్రమైన శ్వాసకోశవ్యాధులు, పొడిదగ్గు, బ్రాంకైటిస్‌కు కారణమవుతున్నాయి.ధూళి కాలుష్య మోతాదు క్రమంగా పెరుగుతుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్లు పెరిగే ప్రమాదం పొంచి ఉంది. ఇటీవల నగరంలో శ్వాసకోశ సమస్యలు,అస్తమా,క్రానిక్ బ్రాంకైటిస్,సైనస్ సమస్యలు పెరగడానికి ప్రధాన కారణం వాతావరణ మార్పులు, వాయుకాలుష్యమే. ఇలా చేస్తే మేలు... ఇంటి నుంచి బయటికి వెళ్లే సమయంలో విధిగా ముక్కు, ముఖానికి మాస్క్‌లు,హెల్మెట్లు ధరించాలి. కళ్ల రక్షణకు అద్దాలు ఉపయోగించడం ద్వారా వాయుకాలుష్యం, భూస్థాయి ఓజోన్ వల్ల కలిగే దుష్ప్రభావాలను కొంతమేర నివారించే అవకాశాలుంటాయని వైద్యులు చెబుతున్నారు. కాలంచెల్లిన వాహనాలను రోడ్డెక్కకుండా చూడాలి. ప్రజా రవాణావ్యవస్థను సిటీజన్లు వినియోగించుకోవాలి. ప్రతీవాహనానికి ఏటా పొల్యూషన్ పరీక్షలను తప్పనిసరి చేయాలి. ఉల్లంఘించే వారికి భారీగా జరిమానాలు వేయాలి. ఇరుకు రహదారులు, బాటిల్‌నెక్స్‌ను తక్షణం విస్తరించాలి. తద్వారా ట్రాఫిక్ సమస్య తగ్గి...పొల్యూషన్‌కు అడ్డుకట్ట పడుతుంది. -
కడుపు కదిలించేందుకు... కాంతి!
ఉదయాన్నే కడుపు సాఫీగా కదలకపోతే ఎంత చికాకో.. కాఫీలతో కొందరు.. కాసేపు నడక లేదంటే గోరువెచ్చటి నీటితో ఇంకొందరు కడుపు ఖాళీ చేసుకునేందుకు ప్రయత్నిస్తూంటారు. మరికొందరికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పని సాఫీగా అవదు. ఇలాంటి వారి కోసం కాంతి ఎంతో బాగా ఉపయోగపడుతుందంటున్నారు ఫ్లిండర్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ఆశ్చర్యపోవద్దు. అక్షరాలా నిజమే. కాంతి ద్వారా కొన్ని ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందని శాస్త్రవేత్తలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. కణాలను చైతన్యవంతం చేయడం ద్వారా గుండె చప్పుళ్లను క్రమబద్ధీకరిస్తుందని, కరెంటు షాకులతో గుండెలను మళ్లీ కొట్టుకునేలా చేసేందుకు ప్రత్యామ్నాయంగానూ ఉపయోగపడుతుందని ఎలుకలపై జరిపిన ప్రయోగాలు రుజువు చేస్తున్నాయి. తాజాగా పెద్దపేవు ప్రాంతాల్లో నీలపు కాంతిని ప్రసరింప చేయడం ద్వారా అక్కడి నరాలు చైతన్యవంతమై మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రస్తుతం మలబద్ధకం నివారణకు ఉపయోగిస్తున్న లాక్సేటివ్లు దీర్ఘకాలంలో దుష్ప్రభావాలు చూపే అవకాశమున్నందున తాము కాంతిని ప్రత్యామ్నాయంగా గుర్తించామని ఫ్లిండర్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త నిక్ స్పెన్సర్ తెలిపారు. ఎలుకల పేవు గోడల్లో అతిసూక్ష్మమైన ఎల్ఈడీ బల్బులు వెలిగేలా చేసినప్పుడు కొన్ని నరాలు చేతన్యవంతమై ఆ పని పూర్తి అయ్యేలా చేసిందని చెప్పారు. అయితే మనిషి పేవుల్లోకి బల్బులు చొప్పించడం కాకుండా ఇతర మార్గాల ద్వారా వెలుతురును ప్రసారం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. -
మీ అబ్బాయిది ఒక రకం ఆస్తమా కావచ్చు!
పల్మునాలజీ కౌన్సెలింగ్ మా అబ్బాయి వయసు 13 ఏళ్లు. అతడు ఎప్పుడూ పొడి దగ్గుతో బాధపడుతున్నాడు. గత రెండు నెలలుగా కొద్దిపాటి జ్వరంతో ఉంటోంది. వాడికి శ్వాస సరిగా ఆడటం లేదు. మాకు దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడినా సమస్య తగ్గడం లేదు. మావాడి సమస్యకు పరిష్కారం చెప్పండి. – సీతారామయ్య, కొత్తగూడెం మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ అబ్బాయి కాఫ్ వేరియంట్ ఆస్తమాతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. ఇది ఆస్తమాలోనే ఒక రకం. ఇది వచ్చిన వారిలో తెమడ వంటివి పడకుండా పొడిదగ్గు వస్తూ ఉంటుంది. పిల్లికూతలు లాంటి లక్షణాలు కూడా మొదట్లో ఉండవు. దీన్నే ‘క్రానిక్ కాఫ్’ (దీర్ఘకాలిక దగ్గు) అని కూడా అంటారు. రాత్రీ పగలూ తేడా లేకుండా దాదాపు రెండు నెలలపాటు దగ్గుతుంటారు. దాంతో రాత్రివేళ నిద్ర కూడా పట్టదు. ఈ రోగులు తమకు సరిపడని ఘాటైన వాసనలు, దుమ్ము, ధూళి వంటి వాటికి ఎక్స్పోజ్ అయితే ఆ అలర్జెన్స్ ఆస్తమాను మరింతగా ప్రేరేపిస్తాయి. కాఫ్ వేరియెంట్ ఆస్తమా సమస్య ఎవరికైనా, ఏ వయసులోనైనా రావచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఇది ఎక్కువ. ఇది ఆ తర్వాత సాధారణ ఆస్తమాకు దారితీస్తుంది. అంటే శ్వాస అందకపోవడం, పిల్లికూతలు వంటి లక్షణాలు తర్వాతి దశలో కనిపిస్తాయి. సాధారణ ఆస్తమా లాగే కాఫ్ వేరియెంట్ ఆస్తమాకు కూడా కారణాలు అంతగా తెలియవు. కాకపోతే సరిపడని పదార్థాలు, చల్లగాలి దీనికి కారణాలుగా భావిస్తుంటారు. కొందరిలో అధిక రక్తపోటు, గుండెజబ్బులు, హార్ట్‌ఫెయిల్యూర్, మైగ్రేన్, గుండెదడ (పాల్పిటేషన్స్) వంటి జబ్బులకు వాడే మందులైన బీటా–బ్లాకర్స్ తీసుకున్న తర్వాత ‘కాఫ్ వేరియెంట్ ఆస్తమా’ మొదలు కావచ్చు. కొందరిలో గ్లకోమా వంటి కంటిజబ్బులకు వాడే చుక్కల మందులోనూ బీటా బ్లాకర్స్ ఉండి, అవి కూడా ఆస్తమాను ప్రేరేపిస్తాయని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి. కొందరిలో ఆస్పిరిన్ సరిపడకపోవడం వల్ల కూడా దగ్గుతో కూడిన ఆస్తమా రావచ్చు. కాఫ్ వేరియెంట్ ఆస్తమాలో కేవలం దగ్గు తప్ప ఇతర లక్షణాలేమీ కనిపించకపోవడం వల్ల దీని నిర్ధారణ ఒకింత కష్టమే. ఎందుకంటే కాఫ్ వేరియెంట్ ఆస్తమా విషయంలో సాధారణ పరీక్షలైన ఛాతీఎక్స్‌రే, స్పైరోమెట్రీ వంటి పరీక్షలూ నార్మల్‌గానే ఉంటాయి. మీరు వెంటనే మీకు దగ్గర్లో ఉన్న ఛాతీ నిపుణుడిని కలవండి. వారు కొన్ని వైద్య పరీక్షలు చేయించి, వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత తగిన చికిత్స సూచిస్తారు. వ్యాయామంలో ఆస్తమా అటాక్ రాకుండా ఉండాలంటే...! నా వయసు 38. డస్ట్ అలర్జీ ఉంది. గతంలో నా ఫ్రెండ్స్ కొందరు వింటర్లో వ్యాయామాలు చేస్తుంటే నేను వారితో పాటు ఎక్సర్సైజ్ మొదలుపెట్టాను. కానీ వ్యాయామం చేయదలచినప్పుడల్లా ఆయాసం వస్తోంది. ఈసారి మళ్లీ వింటర్ రాబోతోంది. ఎక్సర్సైజ్ మొదలుపెట్టాలని ఉంది. ఆస్తమా అటాక్ కాకుండా నాకు తగిన సలహా ఇవ్వండి. – ఎస్. ప్రసాద్, విశాఖపట్నం వ్యాయామం కొన్నిసార్లు ఆస్తమాను ప్రేరేపించి, ఆయాసం వచ్చేలా చేస్తుంటుంది. అందుకే దీర్ఘకాలిక ఆస్తమాతో బాధపడే చాలామందిలో వ్యాయామం చేసినప్పుడల్లా ఆస్తమా కనిపిస్తుంటుంది. సాధారణంగా మనం శ్వాస తీసుకునే సమయంలోనే బయటిగాలి కాసేపు ముక్కురంధ్రాలలో ఉండి వెచ్చబడి, ఊపిరితిత్తుల్లోకి వెళ్లడానికి అనుకూలమైన ఉష్ణోగ్రతను సమకూర్చుకుంటుంది. కానీ వ్యాయామం చేసే సమయంలో గాలి ఎక్కువగా తీసుకోవడం కోసం నోటితోనూ గాలిపీలుస్తుంటారు. అంటే వారు తేమలేని పొడిగాలినీ, చల్లగాలినీ పీలుస్తుంటారన్నమాట. దాంతో గాలిని తీసుకెళ్లే మార్గాలు ఒక్కసారిగా ఈ చల్లగాలితో ముడుచుకుపోతాయి. ఫలితంగా గాలిని ఊపిరితిత్తుల్లోకి తీసుకేళ్లే దారులు సన్నబడతాయి. దాంతో కొన్ని లక్షణాలు కనబడతాయి. అవి... ∙పొడి దగ్గు వస్తుండటం ∙ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం ∙పిల్లికూతలు వినిపించడం ∙వ్యాయామం తర్వాత తీవ్రమైన అలసట (మామూలుగా వ్యాయామం చేసేవారిలో ఇంత అలసట ఉండదు) ∙వ్యాయామ సమయంలో గాలి తీసుకోవడంలో ఇబ్బంది / ఆయాసం. సాధారణంగా వ్యాయామం మొదలుపెట్టిన 5 నుంచి 20 నిమిషాల్లో ఈ లక్షణాలు కనిపించడం లేదా కొద్దిగా వ్యాయామం చేసి ఆపేశాక 5 – 10 నిమిషాల తర్వాత ఈ లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. ఇలాంటి సమయాల్లో డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి. అయితే వ్యాయామంతో వచ్చే ఆయాసం (ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా) కారణంగా వ్యాయామ ప్రక్రియను ఆపాల్సిన అవసరం లేదు. దీన్ని అధిగమించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వ్యాయామం మొదలుపెట్టడానికి ముందుగా పీల్చే మందులైన బ్రాంకోడయలేటర్స్ వాడి, వ్యాయామాన్ని కొనసాగించవచ్చు. ఇక తక్షణం పనిచేసే లెవోసాల్‌బ్యుటమాల్ వంటి బీటా–2 ఔషధాలను వ్యాయామానికి 10 నిమిషాల ముందుగా వాడి, వ్యాయామ సమయంలో గాలిగొట్టాలు మూసుకుపోకుండా జాగ్రత్తపడవచ్చు. దీనితో పాటు వ్యాయామానికి ముందర వార్మింగ్ అప్, వ్యాయామం తర్వాత కూలింగ్ డౌన్ ప్రక్రియలను చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. తొలుత పరిమితం సమయంలో వ్యాయామం చేస్తూ, ఆ వ్యవధిని పెంచుకుంటూ పోవడం వల్ల మీరు ఈ సమస్యను అధిగమించవచ్చు. పల్మునరీ ఫైబ్రోసిస్ అంటే..? నాకు గత ఆర్నెల్లుగా దగ్గు, ఆయాసం వస్తోంది. చాలామంది డాక్టర్లకు చూపించుకున్నాను. చివరకు ఒక పెద్ద డాక్టర్‌గారు దాన్ని పల్మునరీ ఫైబ్రోసిస్ అని నిర్ధారణ చేశారు. ఆ తర్వాత ‘జబ్బుకు కారణమేమిటో తెలుసుకోవా’లన్నారు. నాకు చాలా ఆందోళనగా ఉంది. – ఎమ్. సాగర్, నల్గొండ పల్మునరీ ఫైబ్రోసిస్ అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన ఒక జబ్బు. ఇందులో ఊపిరితిత్తుల మీద చారల్లాగా వస్తాయి. ఇలా చార (స్కార్) రావడం పెరిగిపోతే కనెక్టివ్ టిష్యూ అనే కణజాలమంతా ఒకేచోట పోగుబడుతుంది. దాంతో మృదువుగా ఉండాల్సిన ఊపిరితిత్తుల గోడలు మందంగా మారతాయి. రక్తానికి తగినంత ఆక్సిజన్ అందదు. దీని వల్ల రోగులు ఆయాసపడుతూ ఉంటారు. అయితే కొందరికి ఇలా జరగడానికి కారణం ఏమిటో తెలియదు. ఇలాంటి జబ్బును ఇడియోపథిక్ పల్మునరీ ఫైబ్రోసిస్ అంటారు. సాధారణంగా ఆయాసం, ఏదైనా పనిచేస్తున్నప్పుడు అది ఎక్కువ కావడం, ఎప్పుడూ పొడిదగ్గు, అలసట, ఛాతీలో ఇబ్బంది, కొంతమందిలో ఛాతీనొప్పి, ఆకలి తగ్గడం, నీరసించిపోవడం, బరువు తగ్గడం కనిపిస్తుంటాయి. సాధారణంగా ఇది ప్రధాన జబ్బు కాదు. ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్య తర్వాత రెండో (సెడండరీ) సమస్యగా ఇది వస్తుంది. కొన్నిసార్లు మన వ్యాధి నిరోధక శక్తి మనకు ప్రతికూలంగా పనిచేయడం (ఆటోఇమ్యూన్), వైరల్ ఇన్ఫెక్షన్స్, టీబీ లాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వంటి కారణాలతో ఇది వస్తుంది. ఇక ఎప్పుడూ ఆస్బెస్టాస్, సన్నటి ఇసుక రేణువులనూ, సిమెంటు నిండి గాలి పీలుస్తుండటం, నిమోనియాను కల్పించే బ్యాక్టీరియా, ఫంగస్‌లతో ఉన్న గాలిని పీల్చడం, కోడిదాణా వంటి వ్యవసాయ పరిశ్రమలకు సంబంధించిన వాసనలు ముక్కుకు తగులుతూ ఉండటం వల్ల కూడా ఈ జబ్బు రావచ్చు. సిగరెట్ పొగ ఈ కండిషన్‌ను మరింత తీవ్రతరం చేస్తుంది. సాధారణంగా దీనికి చాలా పరిమితమైన చికిత్స మాత్రమే లభ్యమవుతోంది. మంచి మందులు ఇంకా ప్రయోగదశలోనే ఉండి, అందుబాటులోకి రావల్సి ఉంది. ప్రస్తుతం కార్టికోస్టెరాయిడ్స్, యాంటీ ఇన్ఫ్లమేటర్ మందులు వాడుతూ ఊపిరితిత్తుల్లో వచ్చే వాపు, నొప్పి, ఎర్రబారే పరిస్థితిని (ఇన్ఫ్లమేషన్ను) అదుపు చేసే స్థితిలోనే వైద్యశాస్త్రం ఉంది. దీనికి తోడు అవసరమైనప్పుడు ఆక్సిజన్ పెట్టాల్సి ఉంటుంది. మీరు పెద్ద సెంటర్లలో నిపుణులైన పల్మునాలజిస్ట్లను సంప్రదించండి. డా. రమణ ప్రసాద్ కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్ , కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ -
హెల్త్ టిప్స్
► జుట్టు రాలడం సౌందర్య కాదు, ఆరోగ్య సమస్య. శరీరం పోషకాల సమతుల్యాన్ని కోల్పోయిందనడానికి నిదర్శనం. ఈ ఆరోగ్య సమస్యను గుర్తించిన వెంటనే దానిని అధిగమించడానికి చర్యలు తీసుకోవాలి. ► రోజుకు ఒక గ్లాసు బనానా సూతీ తాగుతుంటే శరీరానికి, జుట్టు పెరుగుదలకు కావలసిన పోషకాలు అంది రాలడం తగ్గుతంది. ఇది చేయడం చాలా సులభం. పాలు, పెరుగు, తేనె, అరటిపండు గుజ్జు కలిపి మిక్సీలో బ్లెండ్ చేస్తే బనానా సూతీ రెడీ. -
సాధన మారాలి...సీజన్ మారింది
సీజన్ మారింది. నీళ్లలో తడవడం, నానడం, ముసురు పట్టిన వాతావరణంలో పయనించడం...ఇవన్నీ ఇప్పుడు సర్వసాధారణం. దీంతో పాటే సీజన్లో మార్పు ద్వారా వచ్చే ఆరోగ్యసమస్యలూ.వీటికి ప్రాణాయామ ఓ చక్కని పరిష్కారం. కేవలం కొన్ని నిమిషాల పాటు సులభంగా చేసే సాధన ద్వారా సీజన్ మార్పుతో వచ్చే ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు.శ్వాసకోస వ్యవస్థలో ఊపిరితిత్తుల పాత్ర ఎంతో కీలకమైనది. మానవ శరీరంలోని ఊపిరి తిత్తులలో కుడి వైపు 3, ఎడమ వైపు 2 రోబ్స్ ఉంటాయి. శరీరంలోనే అతి పెద్ద అవయవమైనఊపిరితిత్తులు. మనం శ్వాస పీల్చినప్పుడు వాటి ఆకారం కన్నా 20 రెట్లు ఎక్కువగా వ్యాకోచం చెందుతాయి. రక్తం ద్వారా శరీరంలోని ప్రతి కణజాలానికి అవసరమైన ఆక్సిజన్ని ఇవిసరఫరా చేస్తాయి. ఈ వ్యవస్థ ఎంత సమర్ధవంతంగా పనిచేస్తే రోగనిరోధక శక్తి అంత బాగా పెరుగుతుంది. ఈ వ్యవస్థ బలహీనపడినట్లయితే బ్రోంకైటిస్, న్యుమోనియా, ఆస్తమా వంటివ్యాధులకు దారి తీస్తుంది. ముఖ్యంగా వానాకాలంలో శ్వాస కోస సమస్యలు సర్వసాధారణం. దీనికి పరిష్కారమే ప్రాణాయామాలు. ప్రాణాయామ సాధనకి కొన్ని వారాల ముందుఊపిరితిత్తులను, శ్వాస కోశ వ్యవస్థను బలోపేతం చేయడానికి కొన్ని బహిరంగ ప్రాణాయామాలను సాధన చేయాలి. బహిరంగ ప్రాణయామాల్లో... విభాగ ప్రాణయామం ముఖ్యమైంది. ఊపిరితిత్తుల్లోని పై భాగాలకు, మధ్య భాగాలకు, కింది భాగాలకు వేర్వేరుగా ఆక్సిజన్‌ను ప్రాణాయామం ద్వారా పంపవచ్చు. అంతేకాకుండా ప్రతి సెక్షన్స్లోనూ ఉన్న జోన్స్‌కు అన్ని లోబ్స్‌కి ప్రాణవాయువును అందించడం సా«ధ్యపడుతుంది. చేతులు పైకి ఉంచి చేసే సాధన వల్ల ఊపిరితిత్తుల క్రేనియల్ నెర్వస్ సిస్టమ్‌కు, చేతులు పక్కకు పెట్టి చేసినందు వల్ల మధ్య భాగాలకు, చేతులు కింద పెట్టి చేసినందువల్ల ఊపిరి తిత్తుల కింది భాగాలకు ఆక్సిజన్ సరఫరా మెరుగవుతుంది. పై భాగాలకు చేసే సాధనను క్లాలిక్యులర్ బ్రీతింగ్, మధ్య భాగాలకు చేసినప్పుడు ఇంటర్ కోస్టల్ బ్రీతింగ్, క్రింది భాగాలకు చేస్తే డయాఫ్రమెటిక్ బ్రీతింగ్ అంటారు. ఇంటర్ కోస్టల్ బ్రీతింగ్లోచేతులు రెండూ పక్కలకు పెట్టి అరచేతుల దిశ మార్చడం ద్వారా శ్వాసను మధ్య ఊపిరితిత్తులలోని వివిధ భాగాలకు పంపవచ్చు. ప్రతి ప్రాణాయామ కనీసం 10శ్వాసల కాలం పాటు చేయాలి. అరచేతుల దిశ మారుస్తూ 5 నుంచి 10 శ్వాసల కాలం పాటు ఆరు దిక్కులా ప్రాణాయామాలు చేస్తే ఒక సైకిల్ (భ్రమణం) పూర్తయినట్టు. ఇలా రోజూ ఉదయం, సాయంత్రం 5సైకిల్స్ చొప్పున చేస్తుంటే ఊపిరి తిత్తుల సామర్ధ్యం క్రమంగా పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు లేని/ఉన్నవారు కూడా నిరభ్యంతరంగా చేయవచ్చు.ఇవి తేలికపాటి ప్రాణాయామాలు కాబట్టి, ఊపిరితిత్తుల పై ఎటువంటి భారం పడదు. ఈ బహిరంగ ప్రాణాయామాల నిరంతర సాధన ద్వారా రోగ నిరోధకశక్తి పెరిగి సీజన్ మారడం వల్ల వచ్చే వైరల్ ఫీవర్స్, ఇన్ఫెక్షన్స్.. దరి చేరవు. 1 సుపీరియర్ ఇంటర్ కోస్టల్æబ్రీతింగ్ మధ్య ఊపిరితిత్తుల్లో పై భాగాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. 2 ఇన్ఫీరియర్ ఇంటర్ కోస్టల్ బ్రీతింగ్ మధ్య ఊపిరి తిత్తుల్లో కింది భాగాలకు ఆక్సిజన్ సరఫరా మెరుగు పరుస్తుంది. 3 యాంటీరియర్ ఇంటర్ కోస్టల్ బ్రీతింగ్ మధ్య ఊపిరితిత్తుల్లో ముందు భాగాలకు ఆక్సిజన్ సరఫరాకు ఉపకరిస్తుంది. 4 పోస్టీరియర్ ఇంటర్ కోస్టల్ బ్రీతింగ్ మధ్య ఊపిరి తిత్తులలో వెనుక భాగాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. 5 ఎక్స్టీరియర్ ఇంటర్ కోస్టల్ బ్రీతింగ్ మధ్య ఊపిరితిత్తుల్లో బాహ్యంగా ఉన్న పక్క భాగాల ఆక్సిజన్ సరఫరాకు మేలు. 6 ఇంటీరియర్ ఇంటర్ కోస్టల్ బ్రీతింగ్ మధ్య ఊపిరి తిత్తుల్లో లోపలి పక్క భాగాలకు ఆక్సిజన్‌ను అందిస్తుంది. ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ సమన్వయం: ఎస్. సత్యబాబు -
అనేక అనారోగ్యాలను పారదోలే సొరకాయ
గుడ్‌ఫుడ్ ఆరోగ్యానికి సొరకాయతో ఒనగూరే మేలు అంతా ఇంతా కాదు. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలనుంచి ఇది కాపాడుతుంది. సొరకాయ ఉపయోగాల్లో కొన్ని... ►100 గ్రాముల సొరకాయ తింటే దాని ద్వారా సమకూరేది కేవలం 15 క్యాలరీలు మాత్రమే. అందుకే డయాబెటిస్ ఉన్నవారు సొరకాయను ఏ రకంగా తీసుకున్నా మంచిదే. ► సొరకాయలో 96 శాతం నీరే. ఇక అందులో విటమిన్–సి, రైబోఫ్లేవిన్, జింక్, థయామిన్, ఐరన్, మెగ్నీషియమ్, మాంగనీస్ వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలం. కాబట్టి చెమట రూపంలో నీరు, ఖనిజ లవణాలను కోల్పోయే వృత్తుల్లో ఉండేవారు సొరకాయ తినడం చాలా మంచిది. తరచూ అలసటగా ఉండేవారు సొరకాయ తింటే త్వరగా శక్తి సమకూరుతుంది. ►100 గ్రాముల సొరకాయలో కొవ్వుల పాళ్లు కేవలం 1 గ్రాము మాత్రమే. కొలెస్ట్రాల్ పాళ్లు చాలా చాలా తక్కువ. అందుకే ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ►సొరకాయలో పీచు పాళ్లు చాలా ఎక్కువ. అందుకే ఇది మలబద్దకాన్ని నివారించడంతో పాటు జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. కిందినుంచి గ్యాస్ ఎక్కువగా పోయే వారు, పైల్స్‌తో బాధపడేవారు సొరకాయ తినడం మంచిది. ►బరువు తగ్గాలనుకునేవారికి సొరకాయ మంచి కూర. ఇందులో డయటరీ ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల త్వరగా కడుపు నిండిపోయిన భావన కలుగుతుంది. ► సొరకాయలో సోడియం, పొటాషియంతో పాటు అన్ని రకాల సూక్ష్మపోషకాలు ఎక్కువ. పొటాషియమ్ బీపీని నియంత్రిస్తుంది. కాబట్టి హైబీపీతో బాధపడేవారు సొరకాయ తింటే మేలు. ►సొరకాయ కాలేయానికి మేలు చేస్తుంది. దాని పనితీరును మెరుగుపరుస్తుంది. -
తీవ్రమైన తలనొప్పి, నడుమునొప్పి బాధిస్తున్నాయి!
న్యూరో కౌన్సెలింగ్ నా వయసు 30 ఏళ్లు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాను. ఇంట్లో పనులు చేసుకుని, పిల్లలను రెడీ చేసి, నా ఉద్యోగానికి వెళ్తాను. అయితే కొంతకాలం నుంచి నాకు నడుమునొప్పి, తలనొప్పితో పాటు తల తిరుగుతోంది. క్యాబ్‌లో ఆఫీసుకు వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు వాంతులు అవుతున్నాయి. ప్రయాణం వల్ల ఇలా జరుగుతోందేమో అనుకున్నాను. మా ఇంటి దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్లి కొన్ని టాబ్లెట్లు వాడాను. కానీ ఎలాంటి మార్పు లేదు. న్యూరో నిపుణుడిని కలవమని మా స్నేహితులు కొందరు సలహా ఇచ్చారు. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. – ఒక సోదరి, హైదరాబాద్ మీరు చెబుతున్న తలనొప్పి, నడుమునొప్పులకు చాలా కారణాలు ఉంటాయి. ముందుగా తలనొప్పి విషయానికి వస్తే... ఆహారం తినే వేళల్లో మార్పులు ఉన్నా, తినే వేళకు కాకుండా ఆలస్యంగా తింటూ ఉన్నా తలనొప్పి సమస్య తలెత్తుతుంది. అలాగే ఇంట్లో లేదా ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీకు తలనొప్పి ఒకవైపు మాత్రమే వస్తుంటే అది మైగ్రేన్ కావచ్చు. సైనసైటిస్ వల్ల కూడా రావచ్చు. మీకు తలనొప్పి చాలాకాలం నుంచి ఉందా లేదా కొద్దికాలంగానే వస్తుందా అన్న విషయం మీ లేఖలో ప్రస్తావించలేదు. అయితే మీకు రెగ్యులర్‌గా వాంతులు కావడంతో పాటు కళ్లు తిరగడం, ఒళ్లు తూలడం, నీరసం, శరీరం నిస్సత్తువకు లోనుకావడం వంటి లక్షణాలకు గురవుతున్నారా అన్న విషయం ఒకసారి పరిశీలించుకోండి. ఒకవేళ పైన తెలిపిన ఆరోగ్య సమస్యలతో మీరు సతమతమవుతుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం చేయకండి. వెంటనే తగిన పరీక్షలు చేయించుకొని, మీ లక్షణాలకు కారణం ఏమిటో తెలుసుకోవాల్సి ఉంటుంది. మీరు తక్షణం మీకు దగ్గర్లో ఉన్న న్యూనో ఫిజీషియన్‌ను కలవండి. మీ వైద్య పరీక్షల్లో వచ్చిన రిజల్ట్స్‌ను ఆధారంగా మీకు చికిత్స చేయాల్సి ఉంటుంది. ఇక మీ నడుము నొప్పి విషయానికి వస్తే... ఇంట్లోనే కాకుండా ఆఫీసులో కూడా పనిభారం ఎక్కువగా ఉండటం లేదా గంటల తరబడి ఒకే దగ్గర కదలకుండా, ఒకే భంగిమలో కూర్చొని ఉండటం (అంటే ఒంటి మీద ఒత్తిడి పడకుండా ఉండే ఆఫీస్ ఎర్గనమిక్స్ భంగిమలో కాకుండా తప్పుడు పద్ధతుల్లో కూర్చోవడం) వంటివి జరుగుతున్నప్పుడు నడుము నొప్పి రావచ్చు. దీన్ని నిర్లక్ష్యం చస్తే అది స్పాండిలోసిస్‌గా మారే ప్రమాదం ఉంది. కాబట్టి మీ తలనొప్పి, నడుమునొప్పి విషయంలో వాస్తవ కారణాలన తెలుసుకొని, తగిన చికిత్స తీసుకునేందుకు వెంటనే న్యూరో నిపుణులను కలిసి, తగిన చికిత్స తీసుకొండి. డా‘‘ఎస్. శ్రీకాంత్, న్యూరో సర్జన్, మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్స్ మాదాపూర్, హైదరాబాద్ -
అన్ని అనారోగ్య సమస్యలకు ‘పాజిటివ్’తో పరిష్కారం
సాక్షి, హైదరాబాద్ : అన్ని రకాల అనారోగ్య సమస్యలకు హోమియో వైద్యం చక్కటి పరిష్కారమని సినీ నటి జయసుధ అన్నారు. తాను చిన్నప్పటి నుంచి హోమియో మందులే వాడుతున్నట్లు చెప్పా రు. బేగంపేట్‌లో ఏర్పాటు చేసి న పాజిటివ్ హోమియోపతి 21వ బ్రాంచి ప్రారంభానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ హోమియో వైద్యం ద్వారానే చాలావరకు జబ్బులు పూర్తిగా నయమవుతాయన్నారు. తమ ఇంటిల్లిపాది ఆ మందులనే వాడుతున్నామన్నారు. ఎలాంటి దుష్పలితాలు లేని హోమియో మందులను అందరూ నమ్మకంతో వాడవచ్చన్నారు. పాజిటివ్ హోమియో డైరెక్టర్ ఏఎంరెడ్డి మాట్లాడుతూ సమాజంలో హోమియోపతి చాలా అవసరం ఉందన్నారు. తమ సంస్థను పక్కా ప్రణాళికతో దేశంలోని పలు రాష్ట్రాలలో విస్తరించనున్నామని చెప్పారు. జీఎం రాజు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. -
అల్సర్ అనగానే కంగారు పడనక్కర్లేదు
గ్యాస్ట్రో ఎంటరాలజీ కౌన్సెలింగ్ నా భార్య వయసు 45 ఏళ్లు. డయాబెటిస్తో బాధపడుతోంది. భక్తిభావం ఎక్కువ. ఎప్పుడూ పూజలూ–పురస్కారాలు అంటూ ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటోంది. ఉదయం నాలుగింటికే నిద్రలేచి, చన్నీళ్లతో స్నానం చేసి పూజలు మొదలుపెడుతుంది. ఉదయం 8 – 9 వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా పూజ కొనసాగిస్తుంటుంది. ఇటీవల ఆమె తరచూ అనారోగ్యానికి గురవుతోంది. కడుపులో ఉబ్బరం, మంట, ఆయాసం అంటుంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను. ఆయన పరీక్షించి అల్సర్ వచ్చిందని, ఆహారపు అలవాట్లు మార్చుకోకపోతే తీవ్ర అనారోగ్యం పాలవుతుందని హెచ్చరించారు. ఆమెకు ఉన్న షుగర్ సమస్యతో పాటు కొత్తగా అల్సర్ రావడంతో ఇంకేవైనా కొత్త జబ్బులు వస్తాయేమోనని భయంగా ఉంది. దయచేసి నా భార్య ఆరోగ్యం విషయంలో ఏ డాక్టర్ని సంప్రదించాలి? ఆమెను కాపాడుకునే మార్గాలేమైనా ఉంటే తెలపగలరు. – శ్రీనివాస్, బాపట్ల మీరు చెప్పిన కడుపులో ఉబ్బరం, మంట, ఆయాసం అన్నవి ఉదరకోశ వ్యాధులలో కనిపించే సాధారణ లక్షణాలు. కేవలం ఈ లక్షణాల మీదనే ఆధారపడి ఏ వ్యాధినీ కచ్చితంగా నిర్ధారణ చేయడం సాధ్యం కాదు. ఎందువల్లనంటే... సాధారణమైన ఇన్ఫెక్షన్స్ నుంచి క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల వరకు చాలామంది రోగులలో ఈ విధమైన లక్షణాలతో డాక్టర్‌ను సంప్రదిస్తారు. కొంతమంది రోగులలో నిర్దిష్ట లక్షణాలతో ఉన్నప్పుడు డాక్టర్లు అల్సర్ (పేగుపూత) అని అనుమానించినప్పటికీ, నిర్దిష్టంగా వ్యాధిని నిర్ధారణ చేయడం కోసం ఎండోస్కోపీ తప్పనిసరి. కడుపులో పూత అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పెప్టిక్ అల్సర్ వ్యాధి. ఇది సాధారణంగా చిన్నపేగు మొదట్లో లేదా జీర్ణకోశంలో సంభవించవచ్చు. ఈ సమస్య రావడానికి బ్యాక్టీరియా (హెలికో బ్యాక్టర్ పైలోరీ), ఎక్కువ మోతాదులో ఆమ్లం (యాసిడ్) స్రవించడం, నొప్పి నివారణ మందులు ఎక్కువ పరిమితితో వాడటం వంటివి ప్రధాన కారణాలు. ఎండోస్కోపీ ద్వారా చాలా సులువుగా సమస్యను గుర్తించవచ్చు. మూలకారణాన్ని గుర్తించి చికిత్స చేస్తే ‘పెప్టిక్ అల్సర్’ పూర్తిగా నయమవుతుంది. ఇది క్యాన్సర్‌కు దారితీయదు. అయితే పెప్టిక్ అల్సర్‌ను నిర్లక్ష్యం చేస్తే తీవ్ర రక్తస్రావం జరిగి లేదా పేగుకు రంధ్రం పడి అది ప్రాణాపాయ స్థితికి దారితీయవచ్చు. ఇక రెండో రకమైన అల్సర్లు క్యాన్సర్ వల్ల కలగవచ్చు. ఇవి సాధారణంగా జీర్ణకోశంలో వస్తాయి. ఎండోస్కోపీ, బయాప్సీ ద్వారా వీటిని నిర్ధారణ చేయవచ్చు. వ్యాధి నిర్ధారణ తర్వాత వ్యాధి దశను బట్టి దీనికి తగిన వైద్య చికిత్సను నిర్ధారణ చేస్తారు. కాబట్టి మీరు అల్సర్ అనగానే కంగారు పడాల్సిన అవసరం లేదు. సరైన ఆహారపు అలవాట్లు, సమయానికి భోజనం చేయడం, వ్యాయామం, సరైన సమయంలో సంబంధిత వైద్యుడిని సంప్రదించడం వల్ల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడమే గాక ప్రమాదకరమైన పరిస్థితులను నివారించుకోవచ్చు. డాక్టర్ వై. రామిరెడ్డి సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
మళ్లీ శ్రీవారి సేవకు డాలర్ శేషాద్రి.
-
మళ్లీ శ్రీవారి సేవకు డాలర్ శేషాద్రి
చిత్తూరు: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ పి.శేషాద్రి అలియాస్ డాలర్ శేషాద్రి (69) ఆదివారం తిరిగి విధుల్లో చేరారు. అనారోగ్యం కారణంగా గత 40 రోజులుగా డాలర్ శేషాద్రి ఆసుపత్రికే పరిమితమయ్యారు. కిడ్నీలకు వైద్యం చేయించుకుని తిరిగి స్వామివారి సేవకు వచ్చానని ఆయన తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనకపోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రాణం ఉన్నంత వరకు స్వామి వారి సేవలోనే తరిస్తానని పేర్కొన్నారు. 1977లో ఉత్తర పారుపత్తేదార్‌గా విధుల్లో చేరారు. ఆ తర్వాత వివిధ హోదాల్లో పనిచేశారు. 18 ఏళ్లపాటు శ్రీవారి ఆలయంలోనే పనిచేశారు. జూలై 31, 2006లో ఉద్యోగ విరమణ చేశారు. ఆ తర్వాత స్వామి వారి ఆలయ ఓఎస్డీగా అవకాశం వచ్చింది.పదవీ విరమణ తర్వాత కూడా సుమారు తొమ్మిదేళ్లుగా శ్రీవారి సేవలో నిమగ్నమైన శేషాద్రికి ఇదివరకే పలుమార్లు ఛాతీనొప్పి వచ్చి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. -
దాతల సహాయం కోసం...
అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలుడు ఏలేశ్వరం : అందరితో కలిసి పాఠశాలకు వెళ్లవల్సిన ఆ బాలుడు అరుదైన వ్యాధి సోకడంతో మంచానికి పరిమితమై చికిత్స పొందుతున్నాడు. అతని తల్లిదండ్రులకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో దాతల సహయం కోసం ఎదురుచూస్తున్నారు. ఏలేశ్వరానికి చెందిన గోపాలదాసు నూకరాజు కుమారుడైన దుర్గాప్రసాద్(12)కు గులియన్ బ్యారీసిండ్రోమ్(జీబీఎస్) వ్యాధి సోకింది. ఈవ్యాధి కారణంగా నరాలు చచ్చుపోవడంతో దుర్గప్రసాద్‌ను కాకినాడలోని అమృత మల్టిస్పెషాలిటీ ఆస్పత్రిలో గత 45 రోజులుగా చికిత్స అందిస్తున్నారు. కూలీ పనులు చేసుకుని జీవిస్తున్న నూకరాజు తన ఆస్తిపాస్తులను అమ్మి సుమారు రూ.5 లక్షల వరకు వైద్యానికి ఖర్చుచేశాడు. దీంతో దుర్గప్రసాద్ ఆరోగ్యం కొంతవరకు మెరుగుపడింది. పూర్తిస్థాయిలో కోలుకొనేందుకు మరో రూ.5 లక్షలు ఖర్చుఅవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో పట్టణానికి చెందిన జీసస్ మినిస్ట్రీస్ సంస్థ దాతల çసాయాన్ని కోరుతున్నది. దాతలు సెల్ నంబర్ 94401 68778, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్కౌంట్ నంబర్– 328501010020006 కోడ్–వీబీఐఎన్ 0532851కు సాయం చేయాలని కోరుతున్నారు. -
పది రోజుల తర్వాత మళ్లీ వస్తా
వైద్యుల సూచన మేరకే ఉత్సవాలకు దూరంగా ఉండాల్సి వస్తోంది స్వామి సేవకే అంకితం : డాలర్ శేషాద్రి తిరుమల : ‘నా తుది శ్వాస వరకు స్వామి సేవకే అంకితం. ఆ స్వామి దయ ఉన్నంత వరకూ నా సంకల్పంలో ఎలాంటి రాజీ ఉండబోదు’ అంటున్నారు ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి. ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఆయన వైద్యుల సూచన మేరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు కొంత దూరంగా ఉంటున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆయన్ను సోమవారం ఫోన్లో ‘సాక్షి’ పలకరించింది.. ఆయన మాటల్లోనే.. ‘నాకు పెరుమాళ్ బ్రహ్మోత్సవాలంటే ప్రాణం. కొండకి రావాలనీ ఉంది. కానీ.. వైద్యులు వారిస్తున్నారు. మరో పదిరోజుల తర్వాతే పంపుతామంటున్నారు. ఏమి చేసేది. వయసు మీద పడుతోంది కదా?. వారి చెప్పినట్టు వినకతప్పడం లేదు. 1977లో ఉత్తర పారుపత్తేదార్‌గా విధుల్లో చేరాను. వివిధ హోదాల్లో పనిచేశాను. 32 ఏళ్ల కాలంలో 18 ఏళ్లపాటు శ్రీవారి ఆలయంలోనే పనిచేశాను. జూలై 31, 2006లో ఉద్యోగ విరమణ చేశాను. ఆ తర్వాత ఆస్వామి వారే ఆలయ ఓఎస్డీగా కొనసాగేలా అవకాశం ఇచ్చారు. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు స్వామి సేవ చేస్తాను. అదే సంకల్పంతో సాగిపోతున్నా. ఇప్పటికే నా ఉద్యోగ జీవితంలో 60కిపైగా బ్రహ్మోత్సవాల్లో పాలుపంచుకున్నా. యేటా బ్రహ్మోత్సవాలతోపాటు అధికమాసంలో వచ్చే రెండు బ్రహ్మోత్సవాలూ ఉన్నాయి. దేనికవే సాటి. ఆయా సందర్భాల్లో అందరూ కలసికట్టుగా పనిచేయడం దేవస్థానంలోని మంచి సంప్రదాయం. ఆరోగ్య కారణాల రీత్యా అంతకుమించి మాట్లాడలేను’ అంటూ సెలవిచ్చారు. -
సర్వైకల్ స్పాండిలోసిస్‌కు శాశ్వత పరిష్కారం
హోమియో కౌన్సెలింగ్ నా వయస్సు 45 సంవత్సరాలు. నేను గత కొంతకాలంగా మెడనొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్ని సంప్రదిస్తే మెడ ప్రాంతంలోని వెన్నెముకలోని డిస్కులు అరుగుదలకు గురయ్యాయని చె ప్పి, మందులు ఇచ్చారు. అవి వాడుతున్నా, ఉపశమనం లభించడం లేదు. పైగా చేతులు కూడా బలహీనంగా అనిపిస్తున్నాయి. చిన్న బరువులు కూడా ఎత్తలేకపోతున్నాను. హోమియో చికిత్స ద్వారా నా సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందా? సలహా ఇవ్వగలరు. - కె.శ్రీనివాస్, ఒంగోలు మెడనొప్పి, ఈ మధ్యకాలంలో చిన్న వయస్సు వారిని కూడా వేధించే ఆరోగ్య సమస్య. మారుతున్న మానవుని జీవన విధానం వల్ల ఈ విధమైన సమస్యలు చిన్న వయస్సులో కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్ని రకాల మందులు వాడినా ఈ సమస్యకు తాత్కాలిక ఉపశమనం తప్ప శాశ్వత పరిష్కారం లభించక చాలామంది బాధపడుతుంటారు. కానీ హోమియో చికిత్స ద్వారా పూర్తిగా నయం అయే అవకాశం ఉంది. మెడ భాగంలోని వెన్నెముకలోని డిస్కులు, జాయింట్లలోని మృదులాస్తి క్షీణతకు గురవడాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. దాదాపు 15 శాతం పైగా ఇది 60 సంవత్సరాలు పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. కారణాలు: వయస్సు పైబడటం, వ్యాయామం లేకపోవడం, క్షీణతకు గురైన ఎముకలు అదనంగా పెరగటం, డిస్కులు జారిపోవడం లేదా చీలికకు గురికావడం, వృత్తిరీత్యా అధిక బరువులు మోయటం, మెడను ఎక్కువ సమయం అసాధారణ రీతిలో ఉంచడం, ఎక్కువ సమయం కంప్యూటర్ల ముందు పని చేయడం, ఎత్తై దిండ్లు వాడటం, ఎక్కువ సమయం మెడను వంచి ఉంచడం, మెడకు దెబ్బ తగలడం, పూర్వం మెడకు శస్త్ర చికిత్స జరిగి ఉండటం, అధిక మానసిక ఒత్తిడి, అధిక బరువు, ధూమపానం, జన్యుపరమైన అంశాల వల్ల మెడనొప్పి పెరిగే అవకాశం ఉంది. లక్షణాలు: సాధారణం నుండి తీవ్రస్థాయిలో మెడనొప్పి. మెడనుంచి భుజాలకు, చేతులకు, వేళ్ల వరకు పాకడం, డిస్కులు అరుగుదల వల్ల వెన్నుపూసల మధ్య స్థలం తగ్గి రాపిడి శబ్దాలు వినిపించడం, మెడ బిగుసుకుపోవడం, తలనొప్పి, తల వెనక భాగంలో మొదలై నుదురు వరకు వ్యాపించడం, నరాలపై ఒత్తిడి పడితే చేతులలో సూదులు గుచ్చినట్లుగా అనిపించడం, చేతులు మొద్దుబారడం, సత్తువ కోల్పోవటం, చిన్న బరువులు కూడా ఎత్తలేకపోవడం, నడకలో నిలకడ కోల్పోవడం వంటివి. చికిత్స: హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో మాత్రమే అందించే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ చికిత్సా విధానం ద్వారా మీ మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకుని, అందుకు సరిపడా ఔషధాన్ని అందించడం ద్వారా మెడనొప్పిని పూర్తిగా నయం చేయడమే కాకుండా వెన్నెముకను దృఢం చేయడం ద్వారా సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. - డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి,హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ -
తల్లికోసం తల్లడిల్లి..
తల్లి మృతి.. అనాథలైన పిల్లలు ఇంద్రవెల్లి : మండలంలోని వడగామ్ గ్రామపంచాయతీ పరిధిలోని లింగపూర్ గ్రామానికి చెందిన మెస్రం అనుసూయబాయి(35) అనారోగ్యంతో బాధపడుతూ శనివారం తెల్లవారు జమున మృతి చెందింది. దీంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. లింగాపూర్ గ్రామానికి చెందిన మెస్రం మారుతికి వడగామ్ గ్రామానికి చెందిన అనుసూయబాయితో వివాహం చేశారు. వీరికి ముగ్గురు సంతానం. లక్ష్మీ(12), గణేష్(8), రామ్‌చరణ్ (1) ఉన్నారు. మారుతి గత సంవత్సరం వేరే మహిళతో మరో వివాహం చేసుకున్నాడు. అప్పటినుంచి మారుతి ఎక్కడ ఉంటున్నాడో తెలియదు. అనుసూయ ఆరోగ్యం బాగలేకపోయిన కులీ పనులు చేసి ముగ్గురు పిల్లలను పోషిస్తోంది. ఈ నేపథ్యంలో గత సంవత్సరం నుంచి అనుసూయబాయి అనారోగ్యంతో బాధపడుతోంది. భర్త లేక, వైద్యం చేయించడానికి ఇంట్లో ఆర్థిక స్తోమత లేకపోవడంతో రోజు రోజుకూ పరిస్థితి విషమించి అనసూయబాయి శనివారం మృతి చెందింది. దీంతో ముగ్గురు పిల్లలు అనాథలుగా మిగిలారు. లింగపూర్ గ్రామంలో విషాధచాయలు అములుకున్నాయి. -
డస్ట్ మైట్స్‌తో ఆరోగ్యం దుమ్ము దుమ్ము!
అలర్జీస్ అలర్జీలతో బాధపడుతూ దానికి కారణమైన అంశాల కోసం మనం ఎక్కడెక్కడో వెతుకుతుంటాం. కానీ ఆ అలర్జీని కలిగించే అంశాల్లో ఒకటైన డస్ట్‌మైట్ ‘పక్కలో బల్లెం’లా మన పక్కనే ఉండవచ్చు. మన తలగడలోనే నివసిస్తూ ఉండవచ్చు. మన కార్పెట్లలో ఉండవచ్చు. అవి నేరుగా నీళ్లు తాగలేవు. అయితే వాటి మనుగడ కోసం నీరు కావాలి. అందుకే తమ ముందు కాళ్ల వద్ద ఉండే ఒక రకం గ్రంథుల ద్వారా వాతావరణంలోని తేమను స్వీకరిస్తుంటాయి. దాదాపు 30 గ్రాముల దుమ్ములో కనీసం 14,000 డస్ట్‌మైట్స్ ఉండవచ్చు. ఒక చదరపు గజం విస్తీర్ణంలో కనీసం 1,00,000 (లక్ష) డస్ట్ మైట్స్ ఉండవచ్చు. ఒక పరుపులో కనీసం కోటి డస్ట్‌మైట్స్ ఉంటాయి. దుమ్ము కారణంగా అలర్జీ కలుగుతుందని అనుకుంటారు. కానీ దుమ్ములోని ఈ డస్ట్‌మైట్స్ వల్లనే అలర్జీ వస్తుంది. అందునా అవి విసర్జించే విసర్జకాల కారణంగా కూడా అలర్జీ కలుగుతుంటుంది. ఒక్కో డస్ట్‌మైట్ తన జీవితకాలంలో 300 మిల్లీగ్రాముల విసర్జకాలను వెలువరిస్తుంది. ఒక్కోసారి ఆ అలర్జీ కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. -
ఐపీఎస్ మదన్మోహన్ కన్నుమూత
బుక్కపట్నం: ఉత్తమ ఐపీఎస్‌గా ప్రధానమంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న మదన్మోహన్(56) శుక్రవారం హైదరాబాద్‌లో అనారోగ్యంతో కన్నుమూశారు. మదన్మోహన్ బుక్కపట్నానికి చెందిన దివంగత విశ్రాంత హెచ్ఎం మాడుగుల వెంకటరత్నం, జ్ఞానాంబ దంపతులకు మూడో సంతానం. గ్రామీ ణ ప్రాంతంలో జన్మించి ఉన్నత శిఖారాలు అధిరోహించిన ఆయన 1 నుంచి 6వ తరగతి దాకా ఓడీచెరువు మండలం కొండకమర్లలో, 7వ తరగతి బుక్కపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, 8,9,10 కొడిగెనహళ్లి గురుకుల పాఠశాలలో, ఇంటర్ ఏపీఆర్జేసీ నాగార్జున సాగర్‌లో చదివి అప్పట్లో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించాడు. అనంతరం జేఎన్టీయూ అనంతపురంలో ఇంజనీరింగ్, గుజరాత్లో ఎంబీఏ విద్యనభ్యసించి 1987లో ఐపీఎస్‌లో ఉత్తమ ర్యాంకు సాధించి త్రిపుర రాష్ట్రం అగర్తలో విధుల్లో చేరాడు. 10 సంవత్సరాల కిందట కేంద్ర సర్వీసులో భాగంగా నిఘా విభాగంలోకి వచ్చారు. ప్రస్తుతం ఇందులో అడిషనల్ డీజీగా విధులు నిర్వర్తిస్తూ కన్నుమూశారు. 2011లో సేవా రంగంలో అందించే విశిష్ట పురష్కారం రాష్ట్రపతి అవార్డును అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోçßæన్సింగ్ చేతుల మీదుగా అందుకున్నారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం హైదరాబాద్ ఫిల్‌్మనగర్ శ్మశాన వాటికలో నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. పలువురి సంతాపం.. ఐపీఎస్ అధికారి మదన్మోహన్ ఆకస్మిక మృతిపై చిన్ననాటి మిత్రులు, బుక్కపట్నంవాసులు సంతాపాన్ని తెలిపారు. మిత్రులు కృష్ణారెడ్డి, బయారెడ్డి, గోరంట్లపల్లి నాగభూషణం తదితరులు ఆయన మరణ వార్త తెలుసుకుని విచారం వ్యక్తం చేశారు. -
ఒత్తిడి తగ్గించకపోగా ఎన్నో సమస్యలు తెచ్చిపెడుతుంది!
నా వయసు 48 ఏళ్లు. రోజూ చాలా ఒత్తిడికి గురవుతుంటాను. చదువుకునే రోజుల్లో సరదాగా సిగరెట్ కాల్చడం అలవాటైంది. ఇప్పుడు రోజూ ఒత్తిడి తగ్గించుకోడానికి సిగరెట్లు కాలుస్తుంటాను. ఇటీవల నాకు తీవ్రమైన ఆయాసం, దగ్గు వస్తోంది. దాంతోపాటు సరిగా నిద్రపట్టడం లేదు. మామూలు సమస్యే కదా తగ్గిపోతుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు రోజూ దగ్గు ఎడతెరిపి లేకుండా వస్తోంది. మందులు వాడుతున్నా రోజురోజుకూ పెరుగుతోంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - మోహన్, ఆదిలాబాద్ సిగరెట్ కాల్చడం ఒత్తిడిని తగ్గించకపోగా అనేక రకాల ఆరోగ్య సమస్యలను కలగజేస్తుంది. మొదట్లో సరదాగా ప్రారంభమయ్యే అలవాటు... ఆ తర్వాత వదులుకోలేని వ్యసనంగా మారి మీ ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. మీరు రోజుకు మూడు పాకెట్ల వరకు సిగరెట్లు కాలుస్తుంటారని చెప్పారు. అంత ఎక్కువ సంఖ్యలో సిగరెట్లు కాల్చడం మీ ఆరోగ్యంపై చాలా తీవ్రమైన దుష్ర్పభావం చూపుతుంది. ఊపిరితిత్తులు పాడైపోయి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. పొగతాగడం వల్ల శరీరంలోని రక్తనాళాలు పూడుకుపోయి గుండె సంబంధిత సమస్యలు, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీఓపీడీ), నిద్రలేమి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు... చర్మసంబంధిత వ్యాధులు కూడా రావచ్చు. కాబట్టి మీరు వెంటనే సిగరెట్లు కాల్చడం మానేయండి. వైద్యులను సంప్రదించి వారు సూచించిన పరీక్షలు చేయించుకోండి. పొగతాగడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. సిగరెట్ ఒత్తిడిని తగ్గిస్తుందన్నది కేవలం అపోహ మాత్రమే. మీరు ఎంత త్వరగా పొతతాగడం మానేస్తే... అది మీ ఆరోగ్యానికి అంత మేలు. గుండెపోటు వస్తే గుర్తించడమెలా? నా వయస్సు 58 సంవత్సరాలు. గత 8 సంవత్సరాలుగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నాను. ఒకవేళ నిద్రలో ఆయాసం గాని, గుండెపోటు గాని వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తెలుపగలరు. - భాను ప్రసాద్, కర్నూలు గుండెపోటును తొలిదశలోనే గుర్తిస్తే ప్రథమ చికిత్సతో ప్రాణాలు కాపాడుకోవచ్చు. గుండెపోటు లక్షణాలను గుర్తించడం చాలా ముఖ్యం. ఛాతి నొప్పి లేదా ఛాతి మంటలన్నీ కచ్చితంగా గుండెపోటుకు సంబంధించినవి కాకపోవచ్చు. ఈసీజీ పరీక్ష చేయించుకోవడం వల్ల చాలారకాల గుండె సమస్యలకు మూలం తెలుస్తుంది. కాళ్లవాపు, ఆయాసం, కళ్లు తిరిగి పడిపోవడం, బరువులు ఎత్తుతున్నప్పుడు గుండె దడ రావడం గుండెజబ్బుకు సంబంధించిన లక్షణాలుగా భావించవచ్చు. నిద్రలో మీకు ఆయాసం వస్తే గుండె జబ్బు అని నిర్ధారించుకోవద్దు అలాంటి అపోహలతో ఆందోళన పడొద్దు. చాలామంది స్థూలకాయం, శారీరక శ్రమ లేకపోవడం, ఆస్తమా కారణంగా నాలుగు మెట్లెక్కినా ఆయాసపడతారు. మీరు మధుమేహ వ్యాధిగ్రస్తులు కాబట్టి గుండెపోటు వస్తే ఆయాసం ఉంటుందే తప్ప నొప్పి ఉండదు. ఇది గుండెనొప్పే కానీ, కాస్త భిన్నమైనది. గుండెకు రక్తసరఫరా తగ్గడం, గుండె కవాటాల్లో జబ్బు కారణంగా ఆయాసం వస్తుంది. అందుకే శ్వాస సమస్యలన్నీ గుండెనొప్పికి సంబంధించినవి కావు. వ్యాధి నిర్ధారణకు ఆయాసంతోపాటు ఇతర అంశాలు కూడా పరిశీలించాలి. గుండెకు సంబంధించిన సమస్య కనిపించగానే మనం సత్వరం చేయాల్సినవి... తొలి గంట అమూల్యం కాబట్టి కుటుంబ సభ్యులు అతి త్వరగా రోగిని ఆస్పత్రికి తరలించాలి. వెంటనే ఈసీజీ తీయించాలి. డిస్ప్రిన్ కాని సార్బిట్రేట్ మాత్రలను వెంటనే నీటిలో కలిపి తాగించాలి. కూర్చోబెట్టి గాని, పడుకోబెట్టి గాని ద్రావణాన్ని తాగించాలి. దీనితో వెంటనే నొప్పి తగ్గిపోతుంది. డిస్ప్రిన్ మాత్ర స్ప్రెప్టోకైనేస్ ఇంజక్షన్‌కు సమానంగా పనిచేస్తుంది. అందుకే దీనివల్ల రోగికి ఎక్కువగా ప్రయోజనం ఉంటుంది. ఎల్లప్పుడు డిస్ప్రిన్ గాని సార్బిట్రేట్ మాత్రలను గాని దగ్గర ఉంచుకోవడం శ్రేయస్కరం. -
నేను మీ పిట్యుటరీ గ్రంథిని
good morning నేను పింక్ రంగులో ఉంటాను. చిన్న కాడ నుంచి ఒక రేగు పండులా వేలాడుతుంటాను. మెదడు కిందిభాగంలో ఒదిగి ఉంటాను. కానీ శరీరం చేసే ప్రతి పనిలోనూ నేను తోడ్పడుతుంటాను. అంటే నా ప్రమేయం లేకుండా ఏ పనీ జరగదు. నేను ఆనంద్ పిట్యుటరీ గ్రంథిని. నా పరిమాణం గ్రాములో సగముంటుంది. అందులో 85 శాతం నీరే ఉంటుంది. కానీ నా నిర్మాణమే అత్యంత సంక్లిష్టంగా ఉంటుంది. ఇవాళ ఆనంద్ మనుగడకు నేనే కారణం. నేను సరిగా పనిచేయకపోతే ఆనంద్‌కు ఆరోగ్య సమస్యలే కాదు... ప్రాణాలకే ముప్పు రావచ్చు. నేను సరిగా పనిచేయకపోతే ఆనంద్ కేవలం ఒక మీటరు ఎత్తుండే మరుగుజ్జుగా మారవచ్చు. లేదా రెండున్నర మీటర్ల ఎత్తుండేలా రాక్షసాకృతినీ పొందవచ్చు. అతడిలోని సెక్స్ అవయావాలను ఎప్పటికీ చిన్న కుర్రాడిలో ఉన్న పరిమాణంలోనే ఉంచగలను. లేదా వయసుకు ముందే వృద్ధాప్యం వచ్చేలా కూడా చేయగలను. నేనే మాస్టర్... నేనే బాస్ నేను వేలాడే కాడను హైపోథలామస్ అంటారు. అక్కడి నుంచే ఆనంద్‌లోని అన్ని గ్రంథులనూ నా అదుపాజ్ఞల్లో ఉంచుకుంటాను. అతడి ఒంట్లోని గ్రంథులన్నింటినీ నేనే నియంత్రిస్తుంటాను. అవి తమ స్రావాలు సక్రమంగా ప్రసరిస్తున్నాయో లేదా పర్యవేక్షిస్తుంటాను. సరిగా ప్రసరించేలా చూస్తుంటాను. అందుకే నన్ను మాస్టర్ గ్లాండ్ అంటారు. ఆనంద్‌లోని హార్మోన్ల రసాయనాలన్నీ తగిన పాళ్లలో ఉంచేలా చేస్తున్నందుకే నన్ను ‘కెమికల్ బాస్’గా కూడా వ్యవహరిస్తారు. అత్యంత పెద్ద, సంక్లిష్టమైన రసాయన ఉత్పాదన కర్మాగారాన్ని కేవలం అర్ధగ్రాములో ఏర్పాటు చేసుకున్న ఒక అద్భుతాన్ని నేను. నేను రెండు తమ్మెలు (లోబ్స్)గా ఉంటాను. నా కింది తమ్మె (పోస్టీరియర్ లోబ్)లో హైపోథలామస్ నుంచి ఉత్పత్తి అయిన హార్మోన్లు నిల్వ ఉంటాయి. పైన ఉండే తమ్మె (యాంటీరియర్ లోబ్) పెద్దది. అది దాదాపు పది రకాల హార్మోన్లను స్రవిస్తుంది. ఈ హార్మోన్లన్నీ నిర్మాణపరంగా అత్యంత సంక్లిష్టమైనవి. రోజూ నేను ఉత్పత్తి చేసే హార్మోన్ల పరిమాణం ఎంతో తెలుసా? ఒక గ్రామును పది లక్షల భాగాలు చేస్తే అందులోని ఒక భాగం ఎంత ఉంటుందో అంత! కాస్త ఎక్కువా కాదు... కాస్త తక్కువా కాదు... నాలోని ఒక హార్మోన్ ఆనంద్ మెడలో ఉండే థైరాయిడ్‌ను నియంత్రిస్తుంది. నేను గనక థైరోట్రోపిన్ హార్మోన్‌ను ఎక్కువగా స్రవిస్తే ఆనంద్ థైరాయిడ్‌ను విపరీతంగా పనిచేయిస్తుంది. దాంతో అతడిలో ఆకలి పులిలా విజృంభిస్తుంది. అంతగా తింటున్నా రివటలా ఉంటాడు. అదే గనక నేను కాస్త పని తగ్గించానా... అతడు నిస్తేజమవుతాడు. మందమతి అయిపోతాడు. కానీ అతడిలో థైరాయిడ్ ఎంత పాళ్లలో స్రవిస్తోందన్న అద్భుతమైన పక్కా సమాచార వ్యవస్థతో కరక్ట్ ఫీడ్‌బ్యాక్‌తో పనిచేస్తుంటాను. కాస్త ఎక్కువా కానివ్వను... తక్కువా కానివ్వను. పనిలో అంతటి ఖచితత్వం నాది. అంతటి సునిశితత్వంనాది. ఎత్తు పెంచడంలో నా భూమిక... ఇక నాలోని మరో అద్భుతం ఆనంద్ సరైన ఎత్తు పెరిగేలా చూడటం. నేను స్రవించే గ్రోత్ హార్మోన్స్‌తో ఆనంద్ ఎతు ్తపెరిగేలా చేస్తాను. అతడి ఎముకల కొనల్లో ఎత్తును ఆపే ప్లేట్లు పెరిగి బిగుసుకునే వరకూ నేను అతడి ఎత్తును పెంచుతుంటా. ఎందుకే ఎవరైనా ఆనంద్ ఎత్తు పెరిగే యుక్తవయసులో చూసి ఉంటే... ‘అమ్మో... చూస్తుండగానే ఎంత పెరిగాడూ... నా మీద గుప్పెడు’ అని ఆశ్చర్యపోయేలా చేస్తుంటాను. యుక్తవయసు దాటాక అతడిలోని ఎముకల చివర్లోని గ్రోత్ ప్లేట్ బిగుసుకుపోయి ఎత్తు ఆగిపోతుంది. కానీ నాలో ఎముకను పెంచే హార్మోన్లు మాత్రం స్రవిస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఆనంద్ వయసు 47 ఏళ్లు. ఏదైనా కారణం చేత అతడి ఎముక విరిగిపోయి... మధ్యలో కాస్త గ్యాప్ వచ్చిందనుకోండి. అది భర్తీ అయ్యే వరకు మళ్లీ ఎముకను పెంచుతుంటాను నేను. అలా కాళ్లు, చేతులు, పాదాలు, దవడ... ఇలా ఎక్కడ ఎముక విరిగినా అది నార్మల్కు పెరిగే వరకూ నాలోంచి రసాయనాలు స్రవిస్తూనే ఉంటాయి. అదే గ్రోత్ హార్మోన్ ఎక్కువ మోతాదులో స్రవించడం వల్ల కొందరిలో ముక్కు బండగా మారిపోవడం, కింది దవడ విపరీతంగా పెరగడమూ జరుగుతాయి. బాల్యం నుంచి యుక్తవయసులోకి వచ్చేందుకు నేను అవసరం... పిల్లలు తమ బాల్యం నుంచి యుక్తవయసుకు చేరేందుకు అవసరమైన హార్మోన్లు నా పైన ఉండే హైపోథలామస్ నియంత్రణలో ఉంటాయి. తగిన తరుణం రాగానే... అక్కడి నుంచి వచ్చే సంకేతాలకు అనుగుణంగా నేను వాటిని ప్రసరించేలా చూస్తాను. ఆనంద్ భార్యలో తొలుత ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (ఎఫ్ఎస్హెచ్) స్రవించేలా చేస్తాను. ఆ తర్వాత ల్యూటినైజింగ్ హార్మోన్ (ఎల్‌హెచ్) కూడా స్రవించేలా చేస్తాను). ఒకవేళ మహిళల్లో ఈ ఎల్‌హెచ్, ఎఫ్ఎస్హెచ్ హార్మోన్లు సరిగా స్రవించకపోతే యుక్తవయసులోకి వచ్చాక ఒక అమ్మాయి.. తాను యువతిగా చెందాల్సిన క్రమం (ప్యూబర్టీ) ఆలస్యమవుతుంది. ఆనంద్‌లో సంతాన సాఫల్యం కోసం... ఆనంద్‌లో అతడి శుక్రకణాలు, పురుషులకు అవసరమైన హార్మోన్లు స్రవింపజేసేలా చూస్తాను. అదే ఆనంద్ భార్యలో ఆమె ఓవరీస్, అండాలు సక్రమంగా అభివృద్ధి చెందేలా చూస్తాను. ఇలా ఆనంద్ దంపతులకు సంతాన సాఫల్యం అయ్యేలా చూడటంలోనూ నాది అత్యంత కీలక భూమిక. నా స్రావాల వల్లనే ఆనంద్ భార్యలో ప్రతి నెలా ఒక అండం విడుదల అవుతుంటుంది. నేను గనక నా హార్మోన్లను కాస్త కొద్దిగా ఎక్కువ స్రవించేలా చూశానంటే ఆమెలో ఒక అండం బదులు మూడు, నాలుగు, ఐదు అండాలు పుట్టవచ్చు. అదే జరిగితే కవలలే కాదు... ఒకే కాన్పులో ముగ్గురు, నలుగురు, ఐదుగురు పుట్టవచ్చు. ఇక నా స్రావాలు పురుషుడైన ఆనంద్‌లో కాస్త ఎక్కువగా జరిగినా కాస్త ఉత్తేజపూరితంగా ప్రవర్తిస్తుంటాడు. అమ్మ నుంచి అమృతాలు ఊరేది నా వల్లే... కొత్తగా మాతృమూర్తిగా మారిన అమ్మ రొమ్ము నుంచి పాలు ఊరేది నా స్రావాల వల్లనే. ఆనంద్ పుట్టీ పుట్టగానే అతడి స్పర్శను తెలుసుకున్న మాతృమూర్తి నుంచి అసంకల్పితంగా ప్రోలాక్టిన్ అనే హార్మోన్ స్రవిస్తుంది. ఈ ప్రోలాక్టిన్ను స్రవించేది నేనే. ప్రోలాక్టిన్ మెదడును ప్రేరేపిస్తుంది. అంతే... ఆ మెదడు నుంచి అమ్మలో మురిపాలతో పాటు పాలూ ఊరుతాయి. అలా అమ్మ నుంచి క్షీర కారుణ్యాలు ఉప్పొంగేలా చేస్తుంది ప్రకృతి. ఈ అందమైన ప్రకృతి రచనాకృతిలో నేనూ ‘పాలు’ పంచుకుంటానని గర్వంగా చెప్పగలను. ప్రమాదాల నుంచి రక్షించే విధానం ఇలా... ఎముకలతో పటిష్టంగా నిర్మించిన కోటగోడల మాటున నేను దాగి ఉంటా. మెదడు కింద ఉయ్యాలపై నేను కొలువుంటా. నా స్థానం సురక్షితం. కానీ ఏదైనా ప్రమాదంలో ఆనంద్‌కు యాక్సిడెంట్ అయి, తలకు గాయం అయ్యిందనుకోండి. వెంటనే నేను నా నుంచి స్రవించే వ్యాసోప్రెసిన్ అనే హార్మోన్ తగ్గుతుంది. దాంతో శరీరం నుంచి మూత్రవిసర్జన పెరుగుతుంది. ఆనంద్‌కు విపరీమైన దాహం వేస్తుంది. ఫలితంగా నీళ్లు ఎక్కువగా తాగేస్తాడు. ఒంట్లో రక్త ప్రసరణ పెరుగుతుంది. ఈ నీళ్లు తాగడం, రక్తప్రసరణ పెరిగి అన్ని అవయవాలకూ రక్తం అందడం జరిగి ప్రాణాపాయ ప్రమాదాన్ని అధిగమించడం జరుగుతుంది. ఇంత కీలకమైన పనులు చేస్తుంటానా... అయినా అసలు నా ఉనికే ఎవరికీ తెలియనంత ఒద్దికతో నా కార్యకలాపాలు నిర్వహించుకుంటూ పోతాను. నాకేమీ లాభాపేక్ష లేదు. అంతా ఆనంద్ కోసమే. అతడి ఆనందం కోసమే. నాలోని కణుతులు చూపు మీద ప్రభావం చూపవచ్చు... నా పక్కన కొన్ని కీలకమైన ఇతర శరీర భాగాలూ ఉంటాయి. చాలా అరుదుగా జరిగేదే అయినా నాలో పెరిగే కణుతులు ఆనంద్ కంటి చూపు మీద ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే నాలో వచ్చే కణుతులు పెరిగి అవి కంటి నరాన్ని నొక్కేయడం వల్ల కంటి చూపు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. డాక్టర్ శ్రీదేవి పాలడుగు, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ అపోలో హాస్పిటల్స్ హైదర్‌గూడ, హైదరాబాద్ -
యువకుడి ఆత్మహత్య
ముత్తారం : ముత్తారం మండలం బుధవారంపేట (రామయ్యపల్లి) శివారులో మంథని మండలం సిద్దపల్లికి చెందిన కలవేన సంతోష్(22) ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్ది సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంతోష్ అది భరించలేక అఘాయిత్యానికి పాల్పడ్డట్టు పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపారు. సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చిన సంతోష్ రాత్రి 7గంటల ప్రాంతంలో సమీప బంధువుకు ఫోన్ చేసి గ్రామ శివారులోని గుట్ట వైపు దారిలో తాను క్రిమిసంహారక మందు తాగినట్లు చెప్పాడు. దీంతో కుటుంబసభ్యులు అర్ధరాత్రి వరకు పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. అప్పటికే సంతోష్ సెల్‌ఫోన్ చార్జింగ్ లేకపోవడంతో స్విచ్ఛాఫ్ అయ్యింది. మంగళవారం ఉదయం అటుగా వెళ్తున్న రైతులు మతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. పోస్టుమార్టం అనంతరం మతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. సంతోష్ తండ్రి లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
బైక్‌పై తిరిగితే నడుంనొప్పి వస్తుందా?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 40 ఏళ్లు. బరువు 80 కేజీలు. ఉద్యోగరీత్యా రోజూ దాదాపు 60 కి.మీ. పైగా ద్విచక్రవాహనం నడుపుతుంటాను. ఈమధ్య నడుము నొప్పి ఎక్కువైంది. ఒకవైపు కాలి నొప్పితో కూడా బాధపడుతున్నాను. దయచేసి పరిష్కార మార్గాలు చెప్పండి. - రేవతి, ఏలూరు నేటి జీవనశైలిలో పని ఒత్తిడి, పోషకాహార లోపం, తగినంత నిద్రలేకపోవడం, మానసిక ఆందోళన, మీలా బైక్‌పై ఎక్కువగా తిరుగుతుండటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అలాంటి వాటిల్లో ముఖ్యమైనది సయాటికా. శరీరంలోని నరాలన్నింటిలోనూ ఇదే పొడవైనది. ఇది వీపు కింది భాగం నుంచి పాదాల వరకు ప్రయాణం చేస్తుంది. ఈ నరంపై ఒత్తిడి కలిగినప్పుడు వచ్చే నొప్పిని సయాటికా నొప్పి అంటారు. ఈ నొప్పి భరింపరానిదిగా ఉండటమే గాక రోజువారీ వ్యవహారాల్లోనూ ఆటంకం కలిగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఈ సమస్యతో తమ విధులు సక్రమంగా నిర్వహించలేకపోతున్నారు. ముఖ్యంగా 30 - 50 ఏళ్ల మధ్య వయసు వారిలో ఈ సమస్య ఎక్కువ. కారణాలు: ఎముకల్లో ఏర్పడే స్పర్శ వల్ల వెన్నెముక కంప్రెస్ అవుతుంది దెబ్బలు తగిలినప్పుడు పైరిఫార్మిస్ అనే కండరం వాచి, అది నరాలపై ఒత్తిడిని కలిగిస్తుంది గర్భిణుల్లో పిండం బరువు పెరిగి నరాలపై ఒత్తిడి కలిగిస్తుంది శారీరక శ్రమ, వ్యాయామం లేకపోవడం వల్ల కీలు సక్రమంగా పనిచేయక సయాటికా నొప్పి కలగవచ్చు. లక్షణాలు: కాళ్లలో నొప్పి సూదులు గుచ్చినట్లుగా ఉండటం కండరాల బలహీనత, స్పర్శ కోల్పోవడం రెండు కాళ్లలో లేదా ఒక కాలిలో తీవ్రమైన నొప్పి రావడం బరు వులు ఎత్తినప్పుడు, దగ్గినప్పుడు లేదా అధికశ్రమ కలిగినప్పుడు నొప్పి మరింత పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నిర్ధారణ పరీక్షలు: ఎక్స్-రే, సీటీ స్కాన్, ఎమ్మారై చికిత్స: సయాటికా నొప్పికి, వెన్నుపూసల్లో సమస్యలకు హోమియోలో మంచి చికిత్స ఉంది. రస్టాక్స్, కోలోసింథ్, కాస్టికమ్, సిమిసిఫ్యూగా వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. రోగి లక్షణాలను బట్టి అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడితే సయాటికా నొప్పి పూర్తిగా నయమవుతుంది. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ పాప పాలిపోతోంది... పరిష్కారం? హెమటాలజీ కౌన్సెలింగ్ మా పాప పుట్టిన తర్వాత తెల్లగా పాలిపోయినట్లుగా ఉంటే పరీక్షచేసి హీమోగ్లోబిన్ పాళ్లు చాలా తక్కువగా ఉన్నట్లు చెప్పారు. అప్పటి నుంచి నెలనెలా తప్పకుండా రక్తం ఎక్కిస్తూ ఉండాలని చెప్పారు. మూడేళ్ల తర్వాత ప్లీహం (స్ల్పీన్) తొలగిస్తే ఇలా తరచూ రక్తం ఎక్కించే అవసరం తగ్గుతుందని డాక్టర్లు చెప్పారు. ఆ ఆపరేషన్ చేయించాం. తర్వాత రెండు నెలలకోసారి రక్తం ఎక్కిస్తున్నారు. మంచి ఆహారం పెడుతున్నాం. నెలకోసారి పెనిడ్యూర్ ఇంజెక్షన్ చేయిస్తున్నాం. రక్తం ఎక్కించాక కేవలం నెలన్నర అయిందంటే చాలు... పాప పాలిపోయి నీరసంగా తయారవుతోంది. ఇలా మాటిమాటికీ రక్తం ఎక్కించే బాధ తప్పదా? దీనికి శాశ్వత చికిత్స లేదా? - ఒక సోదరి, విశాఖపట్నం సాధారణంగా మన రక్తంలోని ఎర్రరక్తకణాలు మధ్యన కాస్తంత నొక్కినట్లుగా బిళ్లల్లా ఉంటాయి. కానీ మీ పాపకు ఉన్న సమస్య వల్ల తయారయ్యే ప్రక్రియలోనే అవి బంతిలా గుండ్రంగా తయారవుతుంటాయి. పాపకు ఇది పుట్టుకతో జన్యుపరంగా వచ్చిన సమస్య. ఇలా కణాల ఆకృతి భిన్నంగా ఉండటంతో మన శరీరంలోని ప్లీహం (స్ప్లీన్) వాటిని లోపభుయిష్టమైన కణాలుగా గుర్తించి, ఎప్పటికప్పుడు నాశనం చేసేస్తుంటుంది. అందుకే పాపకు తరచూ రక్తహీనత వస్తోంది. సాధారణంగా ఒక ఎర్రరక్తకణం జీవితకాలం 120 రోజులు. కానీ ప్లీహం ఈ రక్తకణాలన్నింటినీ చాలా ముందుగానే నాశనం చేస్తుండటంతో వాటి సంఖ్య తగ్గిపోయి, తరచూ రక్తహీనత వస్తుంది. అందుకే చికిత్సలో భాగంగా బయటి నుంచి రక్తం ఎక్కిస్తున్నారు. అలాగే ఉన్న రక్తకణాలు నాశనం కాకుండా కాపాడుకునేందుకు ప్లీహాన్ని కూడా తొలగించారు. ఇక పుట్టిన ఎర్ర రక్తకణాలు త్వరత్వరగా నాశనమైపోతున్నాయి. కాబట్టి ఎముక మూలుగ/మజ్జ ఇంకా ఎక్కువెక్కువ ఎర్ర రక్తకణాలను తయారు చేస్తుంటుంది. అది అవసరం కూడా. అందుకే దానికి కావాల్సిన మూల వనరులైన ఫోలిక్ యాసిడ్, విటమిన్లు, ఐరన్ తదితరాలను మనం మాత్రల రూపంలో బయటి నుంచి ఇస్తుండాలి. దీనివల్ల పుట్టిన ఎర్రరక్తకణాలు ఎంతో కొంత సమర్థంగా ఉంటాయి. ప్లీహాన్ని తొలగించారు కాబట్టి ఒంట్లో నుంచి హానికారక/వ్యాధికారక సూక్ష్మక్రిముల వంటివి త్వరగా బయటకు తొలగిపోవు. ఫలితంగా రకరకాల ఇన్ఫెక్షన్ల నుంచి వచ్చే ముప్పు ఎక్కువ. దీన్ని నివారించేందుకు పాపకు నెలనెలా పెనిడ్యూర్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. ఇది చాలా అవసరం. ఇక మీ పాప విషయంలో ప్రతి రెండు నెలలకోసారి తప్పనిసరిగా రక్తం ఎక్కించాల్సి రావడం కాస్త దురదృష్టమే. మామూలుగా ప్లీహం తొలగించిన తర్వాత కొందరిలో రక్తం ఎక్కించాల్సిన అవసరమే తలెత్తదు. కానీ సమస్య తీవ్రంగా ఉన్న కొద్దిమందిలో మాత్రం ఇలా తరచూ రక్తం ఎక్కించాల్సి వస్తుంటుంది. తరచూ రక్తం ఎక్కిస్తున్నప్పుడు ఒంట్లో నుంచి ఇనుమును తొలగించే మందులు వాడడం తప్పనిసరి. ఎందుకంటే రక్తం ఎక్కించిన ప్రతిసారీ దాదాపు 100-150 మి.గ్రా. ఇనుము మన శరీరంలో పేరుకుపోతుంది. దీన్ని తొలగించేందుకు పాపకు నిత్యం మందులు ఇవ్వాలి. లేకపోతే ఆ ఇనుము... కాలేయం, గుండె వంటి అవయవాల్లో పేరుకుపోయి వాటిని దెబ్బతీస్తుంది. అందుకే ఆ మాత్రలు తప్పనిసరి. నిజానికి జన్యుపరంగా వచ్చే ఇలాంటి రక్తవ్యాధులన్నింటికీ రక్తం ఎక్కించడం తప్పించి, ఇతరత్రా చికిత్స ప్రక్రియలు తక్కువనే చెప్పాలి. ఇలాంటి వారికి కచ్చితమైన చికిత్స ఎముక మూలుగ మార్పిడి (బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్). మిగతా చికిత్సలన్నీ సమస్యను నియంత్రణలోకి తెచ్చేందుకే. మీరు ఒకసారి మీకు దగ్గర్లోని రక్తవ్యాధుల నిపుణుడిని సంప్రదించండి. డా॥శైలేశ్ ఆర్ సింగీ సీనియర్ హిమటో ఆంకాలజిస్ట్, బీఎమ్‌టీ స్పెషలిస్ట్, సెంచరీ హాస్సిటల్స్, హైదరాబాద్ -
గుండె గుండెలో వై ఎస్ ఆర్
యోధుడు సంరక్షకుడు రారాజు నారు పోశాడు... నీరు పోశాడు. గుండె తడిమాడు. ప్రాణం పోశాడు. వికసిస్తున్న ఈ పూలన్నీ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి తోటలోనివే. అందుకేనేమో ఇంకా వై.ఎస్.ఆర్. పరిమళం గుప్పుమని మన గుండెల్ని తాకుతూనే ఉంది. పువ్వు పువ్వులో వై.ఎస్.ఆర్. గుండె గుండెలో వై.ఎస్.ఆర్. ఒక మధ్యతరగతి ఇంట్లో ఒక్కరికి అనారోగ్యం చేసినా... ఆ కుటుంబం ఆర్థికంగా, మానసికంగా అల్లకల్లోలమైపోతుంది. ఆరోగ్యసేవలు ఖరీదై, వైద్యం కొండెక్కి కూర్చున్న వేళ ఇదో అనివార్యమైన దుఃఖం. ఈ సంగతి గ్రహించారు కాబట్టే, పేదవారి ఆరోగ్యసిరికి కొండంత అండయ్యారు వై.ఎస్.ఆర్! పేదవాడి గుండె చప్పుడు విని, ఆయన మనసులో మెదిలిన ఒక చిన్న ‘ఆరోగ్యశ్రీ’ ఆలోచన ఇవాళ లక్షలాది తెలుగు ఇళ్ళల్లో దీపాల్ని వెలిగించింది. ఆరోగ్య సమస్య ఏదైనా శ్రీరామరక్ష వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ. అలాంటి లక్షలాది లబ్ధిదారుల నుంచి మచ్చుకు కొద్దిమంది పసివారి అనుభవాలు... వారి మాటల్లోనే... 1. ఆయనే లేకుంటే...! ‘‘అమ్మా నాయనలకి నేను రెండో బిడ్డని. పుట్టడంతోనే నాకు గుండెలో రంధ్రం ఉందని డాక్టర్లు సెప్పారంట. మా అమ్మ రేణుక ఒకటే ఏడుపు. మా నాయనకి అమ్మని పట్టతరం కాలేదు. ఆపరేసన్ సేయించాలంటే లచ్చల కర్చు. అంత దుడ్డు మా తాన ఏడ నుంచి వస్తది! కానీ, దేముడు లాంటి వై.ఎస్.ఆర్. తాత ఇచ్చిన ‘ఆరోగ్యశ్రీ’ కార్డు మా దగ్గర ఉంది. దాంతో 2011 జూన్ 21న నాకు హైదరాబాద్‌లో ఆపరేసన్ చేశారట! ఇప్పుడు నేనింత చలాకీగా ఉన్నానంటే, అంతా వైఎస్ తాత పెట్టిన ‘ఆరోగ్యశ్రీ’ పున్నెమే!’’ - ఏకేశ్ (5), లక్ష్మీపురం, చిత్తూరు జిల్లా 2.ఐ మిస్ యూ... తాతయ్యా! ‘‘అప్పుడు నాకు పది నెలలంట! ఒంట్లో బాగుండట్లేదని హాస్పిటల్ తీసుకెళితే, గుండెలో కన్నం ఉందని డాక్టర్లు చెప్పారట! మా అమ్మా నాన్నలకి కాలూ చెయ్యీ ఆడలేదు. ఏం చేయాలా, నన్నెలా కాపాడుకోవాలా అని తెగ ఇదైపోయారట! ఇంతలో వై.ఎస్.ఆర్.గారు పెట్టిన ‘ఆరోగ్యశ్రీ’ పథకం గురించి మా నాన్నకు తెలిసింది. అంతే! ఆ పథకం సాయంతో మా నాన్న నాకు వెంటనే ఆపరేషన్ చేయించారు. నాకు ఇప్పుడు ఆరోగ్యం బాగుంది. ఆరోగ్యశ్రీ పథకాన్ని రాజశేఖరరెడ్డి తాతయ్య పెట్టారనీ, ఆ తాతయ్య వల్లే నాకు ఆపరేషన్ అయిందనీ మా నాన్న ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ పథకం మా ఇంట్లో దీపాన్ని నిలిపిందని మా అమ్మ ఎప్పుడూ అందరితోనూ అంటూ ఉంటుంది. అందుకే నాకు ప్రాణం పోసిన రాజశేఖరరెడ్డి తాతయ్యను స్వయంగా కలవాలని అనుకున్నా. కానీ అది సాధ్యం కాలేదు. అందుకే ఇప్పటికీ బాధపడుతుంటా. ఐ మిస్ యూ తాతయ్యా!’’ - రావాడ ఉషశ్రీ (7), లక్కిడాం, విజయనగరం జిల్లా 3. నడవలేనివాణ్ని పరిగెడుతున్నా! ‘‘ఇవాళ నేను ఇంత ఆరోగ్యంగా కనిపిస్తున్నా కదా! కానీ, నేను పుట్టినప్పుడు ఎంతోకాలం బతకను అనుకున్నారట! ఎందుకంటే, నేను పుట్టగానే గుండె బద్దలయ్యేంత నిజం మా నాన్న వసంత్‌కు తెలిసింది. పుట్టుకతోనే నా గుండెలో రంధ్రం ఉందట! నేను సరిగ్గా నడవలేకపోయేవాణ్ణి! నాలుగు అడుగులు వేయగానే నీరసంతో పడిపోయేవాణ్ణి. అప్పుడు వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి తాతయ్య పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం నాకు శ్రీరామరక్ష అయింది. హైదరాబాద్ పెద్ద ఆసుపత్రిలో రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా ఆపరేషన్ అయింది. మాలాంటి పేదల కోసం వైఎస్ తాతయ్య చేసిన ఆలోచన పుణ్యమా అని గుండె ఆపరేషన్ జరిగి, నేనిప్పుడు బాగా కోలుకున్నా. నడవడమే కాదు, ఆరోగ్యంగా పరిగెడుతున్నా. బడికి వెళ్ళి, 4వ తరగతి చదువుకుంటున్నా. అందుకే, వై.ఎస్.ఆర్. తాతయ్యకు మా అమ్మ, నాన్న, నేను, అన్నయ్య అందరం ఎంతో రుణపడి ఉన్నాం.’’ - వాంఖడే నిఖిల్ (7), దహెగామ్ గ్రామం, ఆదిలాబాద్ 4. మా పేదోల్లకి పెద్ద దేముడు! ‘‘మేము శానా బీదోళ్ళం. మా అమ్మా నాయన పని సేత్తేనే రోజు గడుస్తది. లేదంటే పస్తులే! నాకు 6 నెలలప్పుడు గుండె జబ్బు సేసిందట. గిద్దలూరు, నంద్యాల పట్నాల్లో వైద్యం చేయించారు. ఫలితం లేదు. ఆపరేషన్ సేత్తేనే నేను బతుకుతానన్నారట! దానికి సుమారు 3 లచ్చలవుతుందన్నారు. కానీ, గుడిసెలో బతికేటోల్లం మాకాడ అంత డబ్బేడ నించి వస్తది! అప్పుడు నంద్యాలలో ఒక డాట్టర్ గారు సలహా ఇత్తే, మా నాయన ఖాజావలీ హైదరాబాద్ తీసికెల్లి నన్ను ఆస్పత్రిలో చేర్పించారు. రాజశేఖరరెడ్డి గారి ఆరోగ్యశ్రీ పున్నెమా అని, నాకు ఆపరేసన్ అయింది. నేను బతికా. మా అమ్మా నాయన ఇయాల్టికీ అప్పటి సంగతులు మరిసిపోలేదు. ఆపరేసన్కు రెండున్నర లచ్చలైతే, మేము ఒక్క రూపాయి ఇయ్యలేదట. మొత్తం ఆల్లే సూసుకున్నారట! లేదంటే, మా ఇల్లు, పొలం అమ్ముకున్నా అంత డబ్బు వచ్చేది కాదు. నాకు మళ్ళీ జన్మనిచ్చిన ఆ దేముడు మా ఇంట్లో అందరి గుండెల్లో ఉన్నాడు.’’ - షేక్ సమీర, గిద్దలూరు, ప్రకాశం జిల్లా 5. నన్ను బతికించిన తాతయ్య! ‘‘మా బాపు మహమ్మద్ సమాద్ ఓ మెకానిక్. మా అమ్మ సుల్తానాను పెళ్ళి చేసుకున్న ఏడాదికల్లా నేను పుట్టా. కానీ పుట్టంగనే నా గుండెలో రంధ్రం ఉందని, ఆపరేషన్ చెయ్యాలనీ, రెండు లక్షలవుతుందనీ అన్నారట. ఒక్క దినం పని లేకున్నా బతుకు గడవదు. వైద్యం కోసం పైసలు యాడ నుంచి తేవాల! దిగులుతో అమ్మ అనారోగ్యం పాలై కన్నుమూసింది. దాంతో బాపు నన్నైనా బతికించుకోవాలనుకున్నారు. అప్పుడే ‘ఆరోగ్యశ్రీ’ గురించి ఎవరో చెప్పారట! హైదరాబాద్‌లోని నారాయణ హృదయాలయంకి వెళ్తే నాకు ఆపరేషన్ చేసి, కొత్త జిందగీ ఇచ్చారు. డిశ్చార్జి చేసి బస్సు చార్జీలకి ఆరు వందలు, మందులిచ్చి మరీ పంపించారు. పూర్తిగా నయమయ్యేవరకు ఉచిత వైద్యపరీక్షలు నిర్వహించి మందులిచ్చారు. అమ్మ మరణంతో కుంగిపోయిన బాపు ఇప్పుడు నేనే లోకంగా బతుకుతున్నాడు. నాకు ఆపరేషన్ జరగకపోతే ఏం జరిగేదోనని ఆలోచిస్తేనే భయమేస్తోంది. అందుకే, ఐ లవ్ వై.ఎస్.ఆర్. తాత!’’ - సదాఫ్ మోహిన్ (7), లక్సెట్టిపేట, ఆదిలాబాద్ 6. గుండె’ గాయాన్ని మాన్పారు! ‘‘నాలుగేల్లూ నోట్లోకెల్లాలంటే, కూలి సేసుకోక తప్పని కుటుంబం మాది. మా అమ్మ ప్రమీలకూ, నాన్న కామరాజుకీ నేను లేక లేక పుట్టానంట! కానీ సిన్నప్పుడే నాకు పాణం బాగలేదని డాక్టర్ దగ్గరకట్టుకెళితే, గుండెలో రంధ్రం ఉంది అన్నారట. తినడానికే డబ్బు లేనోళ్ళం, ఆపరేసన్ ఎట్ట సేయిత్తామని అమ్మానాన్న బెంగపడ్డారు. కానీ, దేముడు లాంటి వై.ఎస్. పెట్టిన ఆరోగ్యశ్రీ మా పాలిట వరమైంది. తిరుపతి ‘స్విమ్స్’ ఆసుపత్రిలో నాకు ఉచితంగా ఆపరేసన్ సేశారు. లచ్చ అయింది. నాకు జనమ నిచ్చింది దేముడైతే, మళ్ళీ జనమ నిచ్చింది వై.ఎస్.ఆర్ తాతే! అందుకే, ఆ తాతను ఎప్పుడూ మరిసిపోను.’’ - బొడ్డు ఇందు (7), అనుప్పల్లి, చిత్తూరు జిల్లా 7. అమ్మ చెప్తా ఉంటది... అంతా ఆయన చలవంట ! ‘‘మా అమ్మానాన్న (తొట్టి ఖాజాబీ, చిన్న సిద్దువలీ) బేల్దారి పని చేస్తుంటారు. నేనప్పుడు పసిపిల్లాణ్ణట! నాకు గుండెలో కన్నం ఉండేదంట! సిన్న ఆస్పత్రుల్లో సూపించారంట. కానీ, బైపాస్ చేయాలని డాక్టర్లు చెప్పారట. కానీ, అందుకు రెండున్నర లచ్చలవుతుంది. మరి, మాకేమో అంత డబ్బు లేదు. అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి సారు పెట్టిన ‘ఆరోగ్యశ్రీ’ ఉపయోగమైంది. హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్లో ఉచితంగా ఆపరేషన్ చేశారు. నాకు బాగైంది. ఇవాల నేను బతికున్నానంటే, అది ఆ పెద్దాయన చలవేనని మాయమ్మ ఇప్పటికీ చెప్తా ఉంటది!’’ - తొట్టి ఖాదర్‌వలీ (5), ముండ్లపాడు, ప్రకాశం జిల్లా 8. మా ఇంటి దీపాన్ని నిలిపింది రాజన్నే! ‘‘మేం ఎంత నిరుపేదలమంటే, మా అమ్మానాన్నలు (కంభం రమేశ్, సుజాత దంపతులు) చేపలు పట్టి తెచ్చి, వాటిని అమ్మితే కానీ మాకూ రోజూ ఇంత కూడు ఉండదు. నాకు సరిగ్గా ఏణ్ణర్ధం వయసప్పుడు 2007లో ఒకరోజు నాకు బాగా జ్వరం వచ్చిందట. ఒళ్ళు పేలిపోతోంది. కోదాడలో ఓ ఆస్పత్రిలో చూపించారు. నాకు గుండె జబ్బు, వెంటనే పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించాలనీ సూచించారు. వెంటనే విజయవాడలోని రమేష్ కార్డియాక్ సెంటర్‌కు తీసుకెళ్లారు. ఆపరేషన్ చెయ్యాలనీ, ఏడాదిన్నర వయస్సు కాబట్టి హైదరాబాద్‌కు తీసుకెళ్లాలనీ చెప్పారు. దిక్కుతోచని అమ్మానాన్నకు ఆరోగ్యశ్రీ పథకం గురించి తెలిసింది. వెంటనే నన్ను సికింద్రాబాద్‌లోని పెద్ద హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఉచితంగా ఆపరేషన్ చేశారు. నాకు మళ్ళీ ప్రాణం వచ్చింది. నాకు ప్రాణం పోసిన వై.ఎస్. తాతయ్యకు థ్యాంక్స్ చెప్పుకోలేకపోయానని బాధగా ఉంది.’’ - కంభం ఉదయ్‌కిరణ్ (11), కోదాడ, నల్గొండ -
హార్సిలీ కొండకు ఏదీ అండ?
► సమస్యలు పట్టించుకునే దిక్కులేదు ► 11ఏళ్లలో టౌన్షిప్ కమిటీ భేటీ నాలుగుసార్లే ► నేడు కలెక్టర్, టూరిజం, శాఖల అధికారుల సమావేశం బి.కొత్తకోట: రాష్ర్టంలో ఏకైక వేసవి విడది కేంద్రం బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్. ఇది రాష్ట్రంలోనే ఏకైక పర్వత నివాస ప్రాంతం. ప్రస్తుతం టౌన్షిప్ కమిటీగా కొనసాగుతోంది. డివిజన్ స్థాయి అధికారులు సభ్యులుగా, మదనపల్లె సబ్ కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించే కమిటీ సమావేశాలు నామమాత్రంగా మారిపోయాయి. తీసుకొన్న నిర్ణయాలు అమలు గాలికి వదిలేస్తున్నారు. కొన్ని సమస్యలు కనీసం పట్టించుకోవడం లేదు. గ్రామ పంచాయతీ, మండల పరిషత్ పరిధిలోని కొండను 2000లో ప్రభుత్వం తొలగించింది. ప్రత్యేకంగా టౌన్షిప్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా కమిటీయే తీర్చాల్సి ఉంటుంది. దీనికోసం తరచూ సమావేశాలు నిర్వహించి సమస్యలను సమీక్షించి చర్యలు తీసుకోవాలి. అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. గడచిన 11 ఏళ్లలో కేవలం నాలుగుసార్లు మాత్రమే కమిటీ సమావేశాలు నిర్వహించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సోమవారం హార్సిలీహిల్స్‌లో పర్యటించనున్న కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాల్సిన అవసరముంది. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలివీ.. ►పొరుగు రాష్ట్రాల పర్యాటకుల కోసం ఏటీఎం ఏర్పాటు చేయాలి. ►ఎంతో విలువైన భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. ►రెవెన్యూ అతిథిగృహాన్ని కలెక్టర్ క్యాంపు కార్యాలయంగా మార్చాలన్న ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. ►చెట్టుపై అతిథిగృహ నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. ►కొండపైనున్న బండరాళ్లు ఘాట్ రోడ్డుపై పడుతున్నాయి. ►రోప్‌వే మార్గంపై రీసర్వే అటకెక్కింది. ►రాత్రివేళ ఆరోగ్య సమస్య ఎదురైతే తలనొప్పికీ మాత్ర దొరకదు. విషసర్పాలు కాటేస్తే చావాల్సిందే. ►స్థానికంగా ఒక ఏఎన్ఎంను నియమించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. ►పర్యాటకుల కోసం మంచినీటి కొళాయిలు ఏర్పాటు చేయాలి. ►మురికినీరు, వాడేసిన వ్యర్థాలు రోడ్లపై వేయకుండా తొట్టెలు, కాలువలు నిర్మించాలి. ►గాలిబండపై మందుబాబుల వీరంగాలు తగ్గడం లేదు. ►మద్యం సీసాలను పగులగొట్టడంతో గాజు పెంకులతో గాలిబండ భయానకంగా తయారైంది. ►వీధిలైట్లు పూర్తిగా వేయకపోవడంతో రాత్రివేళల్లో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. -
సర్జరీ చేస్తే... బరువు పెరుగుతారా?
నా వయసు 37. పెళ్లయ్యింది. ఓ పాప కూడా ఉంది. రెండేళ్ల క్రితం నాకు విపరీతమైన కడుపు నొప్పి మొదలైంది. పీరియడ్స్ సమస్యలు కూడా తలెత్తడంతో డాక్టర్‌ను సంప్రదించాను. గర్భసంచిలో పెద్ద కణితి ఉందని అన్నారు. ప్రమాదకర పరిస్థితి అని చెప్పి గర్భసంచిని తొలగించారు. ఆ తర్వాత నాకు ఆరోగ్య సమస్యలైతే పెద్దగా ఏమీ లేవు. కానీ బాగా లావైపోతున్నాను. 67 కిలోలు ఉండేదాన్ని, ఇప్పుడు 79 కిలోలకు చేరుకున్నాను. డైట్ కంట్రోల్ చేసినా పెద్దగా తగ్గడం లేదు. ఆపరేషన్ చేస్తే అలాగే లావవుతారు అంటున్నారు మావాళ్లు. నిజమేనా? ఇలా బరువు పెరగడం ప్రమాదకరం కాదా? ఇప్పుడు నేనేం చేయాలి? - వి.పూర్ణిమ, కరీంనగర్ గర్భాశయం తొలగించడం వల్లనే బరువు పెరగడం ఉండదు. పెద్ద ఆపరేషన్ అయ్యిందని చాలామంది చాన్నాళ్లపాటు పని చెయ్యకుండా ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం, బలహీనపడకుండా ఉండాలని ఆహారం ఎక్కువగా తీసుకోవడం వంటివి చేయడం వల్ల లావు పెరగ వచ్చు. లేదా మీ విషయంలో థైరాయిడ్, హార్మోన్ల అసమతుల్యత లేదా ఇంకా వేరే ఏమైనా సమస్యలున్నాయేమో తెలుసుకోవడానికి పరీక్షలు చేయించుకొని, కారణాన్ని బట్టి మందులు వాడి చూడొచ్చు. కేవలం డైటింగ్ చేయడం వల్ల లావు తగ్గరు. మూడు పూటలా పరిమితమైన ఆహారం... అంటే ఎక్కువగా ఆకుకూరలు, పండ్లు తీసుకుంటూ, అన్నం, చపాతీలు తక్కువగా తీసుకోవడం, నూనె, నెయ్యి వంటి కొవ్వు పదార్థాలు ఉండే ఆహారాలకు దూరంగా ఉండటం అన్నమాట. మొత్తంగా తిండి బాగా తగ్గించేసి కూర్చుంటే నీరసం తప్పితే, లావు తగ్గడం కష్టం. ఎక్కువగా నడక, యోగా, వ్యాయామాలు చెయ్యడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగి క్యాలరీలు ఖర్చయ్యి బరువు తగ్గుతారు. బరువు ఎక్కువగా పెరగడం వల్ల మోకాళ్ల నొప్పులు, నడుం నొప్పి, బీపీ, షుగర్ వంటి ఎన్నో సమస్యలు ఏర్పడవచ్చు. నా వయసు 23. పెళ్లై రెండున్నరేళ్లు అవుతోంది. ఏడాది వయసున్న బాబు ఉన్నాడు. వాడు పుట్టిన తర్వాత కాపర్-టి వేయించుకున్నాను. మొదట బానేవుంది. కానీ తర్వాత ఏదో అసౌకర్యంగా అనిపించసాగింది. ఒక్కోసారి చురుక్కు చురుక్కుమంటోంది. డాక్టర్‌కు చూపిస్తే చెకప్ చేసి అంతా బాగానే ఉందన్నారు. కానీ ఇప్పటికీ అదే ఇబ్బంది. ఎప్పుడూ అలా ఉండటం లేదు కానీ ఒక్కోసారి ఉన్నట్టుండి అవుతోంది. ఎందుకిలా జరుగుతోంది? నేనేం చేయాలి? ఇది తీయించేసుకుంటే కుటుంబ నియంత్రణకు మరో మంచి మార్గమేదైనా ఉందా? - సావిత్రి, యానాం కాపర్-టి లేదా లూప్... టీ ఆకారంలో ఉండే సన్నని ప్లాస్టిక్ ముక్క మీద కాపర్ తీగలు చుట్టబడి ఉండే ఒక కుటుంబ నియంత్రణ సాధనం. దానికి చివర్లో తోకలాగా సన్నటి వెంట్రుక పోగు వంటి దారాలు వేళాడుతుంటాయి. దీన్ని గర్భాశయంలోకి పంపించడం జరుగుతుంది. దానికి వేళాడే సన్నటి దారాలను కొద్దిగా ఉంచి కత్తిరించడం జరుగుతుంది. ఆ దారాలు గర్భాశయ ముఖద్వారం నుంచి యోని లోపల భాగంలోకి వేళాడుతుంటాయి. వీటి ద్వారా కాపర్-టి వేసిన తర్వాత, చెకప్‌లతో కాపర్-టి గర్భాశయంలో ఉందా లేదా అనేది పరీక్షించి నిర్ధారణ చెయ్యడం జరుగుతుంది. ఇది కరెక్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు... లోపల ఏదో ఉందనే భావన లేదా గుచ్చుకోవడం ఉండదు. బాగా లోపలికి వేళ్లు పెడితే, ఆ దారాలు కొద్దిగా చేతికి తగులుతాయి తప్ప, ఇంక వేరే ఫీలింగ్ ఏమీ ఉండదు. అలా నెలకొకసారి సొంతంగా చూసుకోవడం వల్ల కూడా కాపర్-టి లోపల ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. కలయికలో కూడా గుచ్చుకోవడం వంటి ఇబ్బంది ఏమీ ఉండదు. కొన్నిసార్లు కాపర్-టి కిందికి జరిగినప్పుడు ఆ దారాలు కూడా జారి కలయిక సమయంలో యోని లోపల గుచ్చుకున్నట్లు అనిపించవచ్చు. మీకు చెకప్‌లో అంతా సరిగానే ఉందని చెప్పారు కాబట్టి, ఇబ్బంది కూడా ఎప్పుడో ఒకసారి కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకోనవసరం లేదు. కాపర్-టి కాకుండా తాత్కాలికంగా పిల్లలు పుట్టకుండా ఉండటం కోసం, నెలనెలా కుటుంబ నియంత్రణ మాత్రలు (oral contraceptive pills) ఉంటాయి. పీరియడ్ మొదలైన మూడో రోజు నుంచి 21 రోజుల పాటు రోజుకొకటి చొప్పున, మర్చిపోకుండా రాత్రిపూట... అదే సమయంలో వేసుకోవాలి. లేదా మీవారు కండోమ్స్ వాడొచ్చు. ఇవి ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ. లేదా మూడు నెలలకోసారి మెడ్రాక్సి ప్రొజెస్టరాన్ ఇంజెక్షన్ (medroxyprogesterone injection) తీసుకోవచ్చు. ఇవి ఎక్కువ డోసులు తీసుకుంటే, చాలామందిలో బ్లీడింగ్ క్రమం తప్పడం, మధ్యమధ్యలో స్పాటింగ్ కనిపించడం, తర్వాత కాలంలో పీరియడ్స్ చాలాకాలం రాకుండా ఆగిపోవడం వంటి ఇబ్బందులు ఏర్పడవచ్చు. కాబట్టి ఏ పద్ధతి అయినా... వారి వారి శరీరతత్వాన్ని బట్టి వాటి పనితీరు ఉంటుంది. -
‘టాప్ అప్’ కావాలా? సూపర్ టాప్ అప్ కావాలా?
ఫైనాన్షియల్ బేసిక్స్ రవికి 30 ఏళ్లు. ఆరోగ్య బీమా కవరేజీ రూ.2 లక్షల వరకు ఉంది. పాలసీ తీసుకొని కొన్నేళ్లు గడిచాక రవి ఒక విషయాన్ని గమనించాడు. రోజులతో పాటు వైద్య ఖర్చులూ పెరుగుతున్నాయని, భవిష్యత్తులో ఏదైనా పెద్ద ఆరోగ్య సమస్య తలెత్తితే అప్పుడు తీసుకున్న ఇన్సూరెన్స్ సరిపోదనే అంచనాకు వచ్చాడు. కొత్తగా మరొక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎలా ఉంటుందోనని ఆలోచిస్తున్నాడు. వయసు ఎక్కువయ్యే కొద్దీ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా పెరుగుతుందనే విషయం రవికి తెలుసు. అప్పుడు కొత్తగా పాలసీ తీసుకుంటే ఎక్కువ ప్రీమియం చెల్లించాలి కదా...! అన్నది అతడి ఆలోచన. ఈ సమయంలో రవికి తన స్నేహితుడు శంకర్ తారసపడ్డాడు. రవి ఈ విషయాన్ని శంకర్‌కు చెప్పాడు. అప్పుడు శంకర్.. రవికి హెల్త్ పాలసీలకు టాప్ అప్, సూపర్ టాప్ అప్ చేయించుకోవాలని సలహా ఇచ్చాడు. ఎందుకంటే వీటి ద్వారా అదనపు కవరేజీ పొందొచ్చు. అవెలా పనిచేస్తాయో ఒకసారి చూద్దాం... రవికి రూ.2 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఉంది. అతను టాప్ అప్ పాలసీల ద్వారా మరో రూ.5 లక్షల వరకు బీమా తీసుకున్నాడు. రవి అనారోగ్యం కారణంగా హాస్పిటల్ చేరాడు. ఒక ఏడాదిలో నాలుగుసార్లు చేరటంతో 1.8 లక్షలు ఖర్చయింది. ఆ మొత్తం అంతటినీ బీమా కంపెనీయే భరించింది. కానీ అదే ఏడాది ఐదోసారి కూడా రవి ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. అప్పుడు బిల్లు ఏకంగా రూ.3 లక్షలయింది. పాలసీలో కవరేజీ మొత్తం రూ.20 వేలే ఉన్నా... టాప్ అప్ రూ.5 లక్షల వరకు ఉండటంతో మిగిలిన రూ.2.8 లక్షలు కూడా బీమా కంపెనీయే భరించింది. కాకపోతే టాప్ అప్ను ఏడాదిలో ఒకసారి మాత్రమే క్లెయిమ్ చేసే వీలుంటుంది. అది కూడా ... మన మామూలు బీమా కవరేజీ మొత్తం అయిపోతున్న సందర్భంలో... దానికన్నా ఎక్కువ ఎంత అవసరమైతే అంత, మన టాప్ అప్ పరిధిలో క్లెయిమ్ చేసుకునే వీలుంటుంది. మరి సూపర్ టాప్ అప్ అంటే...! సూపర్ టాప్ అప్ అంటే... టాప్ అప్ కన్నా కొంచెం ఎక్కువన్న మాట. టాప్ అప్ను ఏడాదిలో ఒకసారే క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సూపర్ టాప్ అప్ అలా కాదు. దాని కవరేజీ మొత్తం పరిధిలో... ఏడాదిలో ఎన్నిసార్లయినా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు రవినే తీసుకుందాం. రవి ఆ ఏడాది ఐదోసారి ఆసుపత్రిలో చేరటంతో కవరేజీ మొత్తం అయిపోయింది. టాప్ అప్ గనక ఒకసారి రూ.2.8 లక్షలు చెల్లించారు. అదే రవి గనక సూపర్ టాప్ అప్ను రూ.5 లక్షలకు తీసుకుంటే... రూ.2.8 లక్షలు క్లెయిమ్ చేశాక కూడా ఇంకా కవరేజీ రూ.2.2 లక్షలుంటుంది. దాన్ని కూడా ఆ ఏడాది అవసరమైన పక్షంలో క్లెయిమ్ చేసుకోవచ్చు. పూర్తిగా రూ.5 లక్షలూ క్లెయిమ్ చేసుకునేదాకా ఇది వర్తిస్తుంది. కాకపోతే టాప్ అప్, లేదా సూపర్ టాప్ అప్ విషయంలో గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే. ఇవి బీమా కవరేజీకి అదనంగా పనిచేస్తాయి తప్ప ఇవే బీమా కవరేజీ కాదు. ఒక ఏడాదిలో లిమిట్ దాటిపోయిన పక్షంలో ఇవి అక్కరకు వస్తాయి. మన క్లెయిమ్ లిమిట్ పరిధిలోనే ఉంటే... వీటిద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదు. -
తెలివితేటలను పెంచే విటమిన్-సి
ఎగ్జామ్ టిప్స్ చదవాలంటే మూడ్ లేదా? అసలు బుర్రలో మట్టి పెట్టుకు తిరుగుతున్నావా? చదివినవి మీ పిల్లలు మర్చిపోతున్నారా? అయితే ఆసక్తికరమైన ఈ విటమిన్ గురించి తెలుసుకోవాల్సిందే. ఒక శాస్త్రీయ సర్వే ప్రకారం విటమిను సి సప్లిమెంట్ల వల్ల పిల్లల్లో ఐక్యూ పెరుగుతుందని తేలింది.మన శరీరం విటమిన్-సి ని తయారు చేసుకోలేదు అలాగే నిల్వ కూడా ఉంచుకోలేదు. కాబట్టి మనం ప్రతిరోజూ విటమిన్ సి ని ఏదో ఒక విధంగా ఆహారం ద్వారానే తీసుకోవాలి. ఆహారంలో నియమిత లేక సరైన మోతాదులో (45 మి.గ్రా) విటమిన్-సి తీసుకోవడం చాలా అవసరం. అలాగని ఎక్కువైనా, తక్కువైనా ఆరోగ్య సమస్యే. మామూలుగా పొగతాగే వారిలో పళ్లు, కూరగాయలు తక్కువగా తినే వారిలో, పిల్లలు పుట్టకుండా పిల్స్ వాడే వారిలో ఈ విటమిన్ తక్కువగా ఉంటుంది.చెర్రీ, జామ, బొప్పాయి, కివి, కమలాలు, ద్రాక్ష, పైనాపిల్, మామిడి లాంటి పుల్లని పళ్లలో, కాప్సికం, బ్రకోలి, టొమేటోలలో విటమిన్-సి ఎక్కువగా ఉంటుంది. వేడికి, వెలుగుకి, గాలికి వుండడం వల్ల, యాంటిబయాటిక్స్ వాడడం వల్ల, పొగ, మందు తాగే వారిలో ఇనుము, రాగి పాత్రలలోవండినా తీవ్రమైన జ్వరంతో బాధపడినా విటమిన్-సి నాశనమౌతుంది. కావున విటమిన్-సి మెదడు చురుగ్గా, చలాకీగా ఉండేలా చేయడమే కాక గ్రాహ్యకశక్తిని పెంచి మతిమరుపు పోగొట్టి వ్యాధి నిరోధకతను పెంచి పరీక్షా సమయంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. -
చిన్నపేగుల్లో అల్సర్... మందులతో తగ్గుతుంది
హోమియో కౌన్సెలింగ్ నాకు కొంతకాలంగా మోచేతి నొప్పి వస్తోంది. చిన్న బరువును కూడా ఎత్తలేకపోతున్నాను. ఎక్స్‌రే తీయిస్తే, ఇది టెన్నిస్ ఎల్బో అన్నారు. దీనికి హోమియోపతిలో చికిత్స ఉందా? - ఎస్వీఆర్, గుంటూరు టెన్నిస్ ఎల్బో అన్న మాట వినగానే ఇది క్రీడాకారులకు సంబంధించిన ఆరోగ్య సమస్యగా అనుకుంటారు. క్రీడాకారులకేగాక చాలామంది మోచేతితో ఎక్కువగా పని చేసేవారిలో ఈ సమస్యలు చూస్తుంటాము. ఇది కొన్ని భంగిమలలో పని చేస్తున్నప్పుడు ఒక్కోసారి తీవ్రంగా ఉంటుంది. కొన్ని పరిశోధనలలో తేలిన విషయమేమిటంటే, ఈఎల్ఆర్బీ అనే కండరం బలహీనపడటం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య సాధారణంగా 30 నుంచి యాభై సంవత్సరాల వారికి వస్తుంది. టెన్నిస్ ఎల్బో పార్శ్వ మోచేతి ముడుకు శోధను ల్యాటరల్ ఎపికాన్ డైలిటిస్ అని కూడా అంటారు. ఇది సాధారణంగా నలభై నుండి 60 ఏళ్ల వయసు వారికి వస్తుంది. ఇది మోచేతి చుట్టూ నొప్పిని కలిగిస్తుంది. మోచేతి ఎముక భాగం బయట నొప్పిని కలిగిస్తుంది. ఇది ఎక్కువగా కుడిచేతిని వాడే వారిలో వస్తుంది. ఒక్కోసారి రెండు మోచేతుల్లోనూ సంభవించవచ్చు. ఎల్బో సాధారణంగా క్రీడాకారులకు, వెయిట్‌లిఫ్టింగ్‌లో పాల్గొనేవారికి, కార్పెంటింగ్ పనులు చేసేవారికి, పెయింటర్లకు, రోడ్డు నిర్మాణ కార్మికులకు, అల్లికల పని చేసేవారికి, చెఫ్‌లకు, వెయిటర్లకు వస్తుంది. టెన్నిస్ క్రీడాకారుల్లోనే కాకుండా రిపీటెడ్ మూవ్మెంట్స్ ఎక్కువగా చేసేవారిలో కనిపిస్తుంది. కారణాలు: టెన్నిస్ రాకెట్‌తో ఆడటం, ఎక్కువ బరువులు ఎత్తటం, కార్పెంటింగ్ పని చేయడం, టైపింగ్ ఎక్కువగా చేయటం, రోడ్డు నిర్మాణ పనులు చేయడం. లక్షణాలు: మోచేయి చుట్టూ నొప్పి, చేతులు వణకటం, చేయి కింది నుంచి పై వరకు తీవ్రమైన నొప్పి, కొన్ని వస్తువులు (కత్తి, ఫోర్క్, టూత్‌బ్రష్ వంటివి) మోచేతిలో నొప్పి, బలంగా డబ్బా మూతలు తెరిచినప్పుడు, బరువులు ఎత్తినప్పుడు నిర్ధారణ: ఎక్స్‌రే, ఎమ్మారై, రక్తపరీక్షలు, ఈఎంజీ హోమియో చికిత్స: హోమియోపతిలో టెన్నిస్ ఎల్బోకి మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. రోగి శారీరక, మానసిక తత్వాన్ని పూర్తిగా విశ్లేషించి, వైద్యులు అందుకు తగిన మందులను సూచిస్తుంటారు. దీనికి సాధారణంగా ఆర్నికా యెన్టానా, బెల్లడోనా, బ్రయోనియా, ఫెరమ్ ఫాస్పారికమ్, కాల్మియా ల్యాటిఫోలియా, రస్ టాక్సికోడెన్, రస్టాక్సికోడెన్ డ్రావ్, సాన్గునేరియా, సల్ఫర్ వంటి మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. వీటితోపాటు ఫిజియోథెరపీ కూడా చేయిస్తే మంచిది. తద్వారా టెన్నిస్ ఎల్బోకి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 28 ఏళ్లు. నా కళ్లు చిన్నప్పట్నుంచీ పచ్చగా ఉంటాయి. మా దగ్గరలోని డాక్టర్‌కు చూపిస్తే లివర్ ఫంక్షన్ టెస్ట్, అబ్డామినల్ స్కానింగ్ చేయించి, ఎలాంటి సమస్యా లేదని చెప్పారు. పుట్టుకతోనే కళ్లు పచ్చగా ఉన్నాయి. వాటి వల్ల సమస్య ఏమీ ఉండదని చెప్పారు. నిజమేనా? భవిష్యత్తులో ఎటువంటి సమస్యా రాదంటారా? - జలజ, ఈ-మెయిల్ మీరు ‘గిల్బర్ట్ సిండ్రోమ్’ అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఈ సమస్యతో బాధపడేవారిలో కామెర్ల శాతం పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. ముఖ్యంగా జ్వరం వచ్చినప్పుడు కామెర్లు ఎక్కువ అవుతాయి. ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు, ఉపవాసం చేస్తున్నప్పుడు కామెర్లు ఎక్కువ కావడం, ఆ తర్వాత వాటంతట అవే తగ్గడం జరుగుతుంటుంది. ఒక్కోసారి కామెర్లు 5 ఎంజీ/డీఎల్ వరకూ వెళ్లే ప్రమాదం ఉంది. అయినప్పటికీ దీనివల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదు. ఎలాంటి మందులూ వాడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులోనూ ఎలాంటి సమస్యా రాదు. కాబట్టి మీరు నిశ్చింతగా ఉండవచ్చు. నా వయసు 35 ఏళ్లు. గత ఆర్నెల్లుగా నాకు కడుపులో మంట, నొప్పి వస్తోంది. ఒక నెల రోజులుగా వాంతులు కూడా అవుతున్నాయి. ఎండోస్కోపీ చేయించుకుంటే చిన్నపేగుల్లో అల్సర్ ఉందని చెప్పారు. నేను ఏదైనా ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉందా లేక నా సమస్య మందులతో తగ్గుతుందా తెలియజేయగలరు. - సుధాకర్, శ్రీకాకుళం మీరు చెప్పిన లక్షణాలు ‘క్రానిక్ డియోడినల్ అల్సర్’ అనే వ్యాధితో బాధపడుతున్నవారిలో కనిపిస్తాయి. ఈ అల్సర్ సాధారణంగా ‘హెలికోబ్యాక్టర్ పైలోరీ’ అనే బ్యాక్టీరియాతో వస్తుంది. దీన్ని పూర్తిగా నశింపజేయడానికి ప్రస్తుతం మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని క్రమం తప్పకుండా వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు... ఈ మందుల వల్ల మళ్లీ మళ్లీ అల్సర్ వచ్చే అవకాశాలతో పాటు అల్సర్ వల్ల వచ్చే ఇతర సమస్యలూ తగ్గుతాయి. ఎండోస్కోపీలో చిన్నపేగుల్లోని దారి మూసుకుపోయినట్లయితే ఈ చికిత్స ద్వారా అది తగ్గుతుంది. ఆపరేషన్ అవసరం లేదు. మీరు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలిసి మందులు వాడితే సరిపోతుంది. డాక్టర్ భవానీరాజు సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్ హైదరాబాద్ డర్మటాలజీ కౌన్సెలింగ్ నా వయసు 50 ఏళ్లు. నా ఒంటి రంగు గోధుమ వర్ణంలో ఉంటుంది. అయితే గత ఏడాది కాలం నుంచి నా నుదుటి మీద చర్మం నల్లగా మారుతోంది. మందంగా కూడా అవుతోంది. కణతల వద్ద, మెడ మీద, చంకల వద్ద, నడుము దగ్గర ఇలాగే అవుతోంది. ప్రధానంగా చర్మం మడతలు పడ్డ చోట ఇలా జరుగుతోంది. నాకు కొంచెం ఆందోళనగా ఉంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - సుదర్శన్ రావు, నిడదవోలు మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు ‘ఆకాంథోసిస్ నైగ్రిక్యాన్స్’ అనే కండిషన్‌తో బాధపడుతున్నారు. ఇది ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ వల్ల జరుగుతున్న పరిణామం. సాధారణంగా స్థూలకాయుల్లో ఇలా జరుగుతుంది. దీన్ని ‘హెచ్ఓఎమ్ఏ-ఐఆర్’ అనే పరీక్షతో నిర్ధారణ చేయవచ్చు. రక్తంలోని సీరమ్ ఇన్సులిన్ ఎక్కువ కావడం వల్ల దీన్ని నిర్ధారణ చేయడం సాధ్యమవుతుంది. అలా ఇది రక్త పరీక్షలో బయటపడుతుంది. దీనికి చికిత్స ఈ కింది విధంగా జరుగుతుంది. బరువు తగ్గించుకోవడం జీవనశైలిని మార్చుకోవడం (అంటే సరైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, వేళకు నిద్రపోవడం, ఒత్తిడి తగ్గించుకోవడం మేని రంగును చక్కబరిచేందుకు మందులు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మేని ఛాయ క్రమంగా మెరుగువుతుంది. ఇందుకోసం పూత మందుగా ఉపయోగించాల్సినవి... ఆర్బుటిన్ - లికోరైస్ - కోజిక్ యాసిడ్ పైన పేర్కొన్న మందులతో పాటు క్లిగ్‌మెన్స్ రెజీమ్ అనే ప్రక్రియను రోజు విడిచి రోజు రాత్రివేళ అమలు పరచాలి. యాభైకు ఎక్కువగా ఎస్పీఎఫ్ ఉన్న సన్‌స్క్రీన్‌ను రోజూ ఉదయం తొమ్మిది నుంచి మధ్యాన్నం రెండు వరకు రాసుకుంటూ ఉండాలి. ఒంటి లోపలి వ్యవస్థలను చక్కబరచడానికి యాంటీ ఆక్సిడెంట్ మాత్రలు, విటమిన్ సి కాప్స్యూల్ వంటివాటితో పాటు డాక్టర్ సలహా మేరకు మెట్ఫార్మిన్ -500ఎంజీ ప్రతిరోజూ వాడాలి. ఇతర ప్రక్రియలు: ఫీనాల్, టీసీఏ వంటి మందులతో కెమికల్ పీలింగ్ 4 - 6 సెషన్ల పాటు చేయించుకోవాలి లేజర్ టోనింగ్ కూడా పిగ్మెంట్ను తగ్గించడంతో పాటు మందమైన చర్మం మామూలుగా కావడానికి, నలుపు తగ్గడానికి ఉపయోగపడుతుంది. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ డర్మటాలజిస్ట్ త్వచ స్కిన్ క్లినిక్ గచ్చిబౌలి హైదరాబాద్ -
అనారోగ్యంతో యువతి ఆత్మహత్య
కల్లూరు: కర్నూలు జిల్లా కల్లూరు మండలంలో ఓ యువతి అనారోగ్యం కారణంగా బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన గాయిత్రి (19) అనే యువతి పదో తరగతి పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటోంది. అయితే ఆదివారం తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో భరించలేక ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. -
మోసాలు ఆన్.. లైన్లో
రకరకాలుగా మోసగాళ్ల వల అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం ఢిల్లీలోని ఓ స్వచ్ఛంద సంస్థ పేరిట శ్రీనివాస్‌కు ఫోనొచ్చింది. ‘‘ఓ పసిపాప తీవ్రమైన ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతోంది. వైద్యం కోసం మేం దేశవ్యాప్తంగా విరాళాలు సేకరిస్తున్నాం. సోషల్ మీడియాలోనూ ప్రచారం చేస్తున్నాం. మీరూ సహకరించండి’’ అనేది ఆ కాల్ సారాంశం. అంతేకాదు! ఆ పాప చేత కూడా ఫోన్ చేయించారు సదరు ప్రతినిధులు. ‘‘నీ వివరాలు మెయిల్ చేస్తే నేనేం చేయగలనో ఆలోచిస్తా’’ అన్నాడు శ్రీనివాస్. కాసేపటికి ఆన్లైన్లో సదరు స్వచ్ఛంద సంస్థ కోసం గాలించాడు. బోలెడంత మంది తాము మోసపోయామంటూ పెట్టిన పోస్ట్‌లు కనిపించాయి. దీంతో అదెంత పెద్ద మోసమో అర్థమైంది శ్రీనివాస్‌కి. ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే. నిజానికి దేశ వ్యాప్తంగా ఇపుడు జరుగుతున్న మోసాలకు లెక్కలేదు. ఆన్లైన్ ప్రపంచం గురించి పెద్దగా తెలియని వారంతా ఈ మోసగాళ్ల వలలో ఈజీగా పడిపోతున్నారు. నిజానికిది అబద్ధాలు చెప్పి అమ్మటంకన్నా దారుణం. ఎందుకంటే అబద్ధాలు నమ్మి ఒక ఉత్పత్తి కొంటే మన డబ్బు ఇరుక్కుపోవటమో, తగిన లాభాలు రాకపోవటమో మాత్రమే జరుగుతుంది. కానీ ఇలాంటి మోసాలకు గురైతే ఇక డబ్బు తిరిగిరాదు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ మోసాలు ఎలా జరుగుతాయి? వాటి బారిన పడకుండా అనుసరించాల్సిన మార్గాలేంటి? ఇవన్నీ తెలియజేసేదే ఈ కథనం... నకిలీ ఉద్యోగాల ఆఫర్లు... దేశంలో లక్షల మంది నిరుద్యోగులున్నారు. ఇదే ఈ నకిలీ ఉద్యోగాల పుట్టుకకు మూలం. వీళ్లు మోసం చేసే పద్ధతేంటంటే... మొదట మీకో ప్రముఖ కంపెనీ పేరిట ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తూ ఈ-మెయిల్ వస్తుంది. అందులో ఇంటర్వ్యూ స్థలం, తేదీ, ఫోన్ నంబర్లు అన్నీ ఉంటాయి. చివర్లో... మీరు సెక్యూరిటీ డిపాజిట్‌గానో, బేసిక్ ఫీజుగానో కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందని, దాన్ని తరవాత తిరిగి ఇచ్చేస్తామని ఉంటుంది. మన దేశంలో ఉన్న నిరుద్యోగం దృష్ట్యా చాలా మంది తేలిగ్గా ఈ వలలో పడిపోతుంటారు. కంపెనీ లోగో వంటివన్నీ ఉండి, చదువుతున్నపుడు ఈ మెయిల్లు చాలా నిజమైనవిగా కనిపిస్తాయి. ఇటీవలే బెంగళూరులో నర్సు ఉద్యోగాల పేరిట పలువురిని మోసం చేసిన ఓ నైజీరియన్ ముఠాను సైబర్‌క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. బ్రిటన్‌లో ఉద్యోగాల పేరిట ఈమెయిళ్లు పంపించింది ఈ ముఠా. దీనికి స్పందించిన ఓ నర్సు... యూకేలోని ఈలంగ్ ఆసుపత్రిలో ఉద్యో గం ఉందంటే తన రెజ్యుమె పంపింది. దాంతో ఆమె నంబరుకు ఫోన్ చేసిన ముఠా... యాంటీ టైస్ట్, డ్రగ్ ట్రాఫికింగ్ సర్టిఫికెట్ల కోసం, హెల్త్ ఇన్సూరెన్స్ కోసం, స్కిల్డ్ ఇమిగ్రేషన్ సర్టిఫికెట్ల కోసం రూ.11,03,500 డిపాజిట్ చేయాలని కోరింది. అలానే చేసిన ఆమె... ఆ తరవాత తెలుసుకుంది తాను మోసపోయానని. స్వచ్ఛంద సంస్థల పేరిట... ఇంటర్నెట్లో ‘రిలీఫ్ ఇండియా ట్రస్ట్ స్కామ్’ అని కొట్టి చూడండి. ఈ స్వచ్ఛంద సంస్థ పేరిట ఎంతమందికి ఫోన్లొచ్చాయో అర్థమవుతుంది. వైద్య సాయం అవసరమైన పలువురు పిల్లల కోసం నిధులు సేకరిస్తున్నామనే పేరిట ఈ సంస్థ ఫోన్లు చేస్తోంది. నిజానికది రిజిస్టరయిన స్వచ్ఛంద సంస్థే. కానీ దాని ఉద్దేశాలు మాత్రం వేరు. పసిపాప వెంటిలేటర్‌పై ఉందని, మరోపాప చదువుకోసమని, మరో అర్ధగంటలో సర్జరీ చేయాలని... ఇలా రకరకాల కారణాలు. అయితే అన్ని స్వచ్ఛంద సంస్థలూ ఇలా చేస్తాయని కాదు. ఒకటి రెండు చేసినా... ఇలాంటి కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండటం మాత్రం తప్పనిసరి. ఐఆర్డీఏ నుంచి కాల్ చేస్తున్నామంటూ... ప్రస్తుతం ఇది సహజమైపోయింది. ఈ రోజుల్లో ప్రతి ఇన్వెస్టర్‌కూ ఏదో ఒక బీమా తప్పనిసరిగా ఉంటుంది. ప్రత్యేకించి ఎల్ఐసీ నుంచి. దీన్ని అదనుగా తీసుకున్న మోసగాళ్లు... తాము ఐఆర్డీఏ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ, చాలా ఏళ్లుగా బీమా మొత్తం కడుతున్నందుకు మీ బీమా పాలసీ బోనస్‌కు ఎంపికైందని, ఇది క్లెయిమ్ చేయాలంటే మీరు కొంత మొత్తం చెల్లించాలని చెబుతారు. లేదంటే కొత్త పాలసీ తీసుకోవాలని చెబుతారు. చాలా సందర్భాల్లో వారు మీ గురించి పలు వివరాలు చెబుతారు. దీంతో అదంతా నిజమైన సంభాషణలానే అనిపిస్తుంది. అందుకే చాలామంది ఇన్వెస్టర్లు వీటి వలలో పడిపోతారు. సెబీ లాంటి సంస్థలు కూడా ఇన్వెస్టర్లు ఇలాంటి వాటి వలలో పడొద్దని ప్రకటనలిస్తున్నాయి. వెరిఫికేషన్ పేరిట బ్యాంకుల ఫోన్లు... చాలామంది ఇన్వెస్టర్లకు ఇది కొత్త రకం మోసమే. పెద్దగా అవగాహన లేని ఇన్వెస్టర్లను, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను అప్పుడే వాడుతున్న వారిని టార్గెట్ చేస్తూ ఈ ఫోన్లు వస్తుంటాయి. మోసగాళ్లు తమను తాము బ్యాంకు వెరిఫికేషన్ అధికారులుగా పరిచయం చేసుకుంటారు. మీ డెబిట్/ క్రెడిట్ కార్డు నంబరు, చెల్లుబడి గడువు, సీవీవీ నంబరు... ఇలాంటివన్నీ అడుగుతారు. మీరు చెబుతున్నపుడే వారొక లావాదేవీ జరుపుతుంటారు. ‘‘మీ ఫోన్‌కు ఇపుడు ఒక పాస్వర్డ్ (ఓటీపీ) వచ్చింది... అది కాస్త చెబుతారా’’ అని అడుగుతారు. అమాయకంగా అదికూడా చెబితే... అంతే సంగతులు. లావాదేవీ పూర్తయి బిల్లు మీ చేతికొస్తుంది. చేయాల్సిందేమంటే... మీ బ్యాంకు ఖాతా వివరాలు ఎప్పుడూ, ఎవ్వరికీ చెప్పొద్దు. సీవీవీ నంబరు, ఓటీపీ వంటివి అసలే చెప్పొద్దు. చాలాసార్లు పెట్రోలు పంపులు, రెస్టారెంట్లలో కార్డు ఇచ్చి నంబరు వాళ్లకు చెప్పటం జరుగుతుంటుంది. 99.9 సందర్భాల్లో ఏమీ జరగదు. కానీ ఎక్కడో 0.1% మాత్రం ఇలాంటివి జరుగుతుంటాయి. మన టైమ్ బాగాలేక ఆ 0.1%లోనే మనముంటే..!! అందుకే జాగ్రత్తగా ఉండటం అవసరం. బ్యాంకు వివరాల తనిఖీ పేరిట ఫిషింగ్... ఫిషింగ్ అనేది ఆన్లైన్ ప్రపంచంలో అత్యంత సహజమైన మోసం. దీన్లో మోసగాళ్లు చేసేదేమంటే... వెరిఫికేషన్ పేరిట మీ బ్యాంకు ఖాతా వివరాలు అడుగుతూ మీకొక మెయిల్ వస్తుంది. దాన్ని పూర్తి చేసి పంపించని పక్షంలో మీ ఖాతా క్లోజ్ అయిపోతుందనే హెచ్చరిక కూడా అందులో ఉంటుంది. ఆ దిగువనే... మీ బ్యాంకు లింక్ కూడా ఉంటుంది. మీరు ఆ లింక్‌ను క్లిక్ చేసినట్లయితే... అప్పుడు అచ్చం మీ బ్యాంకు వెబ్సైట్ పేజీని పోలి ఉండే మరో వెబ్సైట్ కనిపిస్తుంది. అచ్చం మీ బ్యాంకు వెబ్‌సైట్‌లానే ఉండటంతో అనుమానం రాదు. అక్కడ మీ వివరాలన్నీ నమోదు చేశాక... ఆ వెబ్సైట్ క్లోజ్ అయిపోతుంది. నిజానికి అదంతా మీ వివరాలు తెలుసుకోవటానికి పన్నిన పన్నాగం. అలా సేకరించిన వివరాలతో తదనంతరం వారే నేరుగా లావాదేవీలు నిర్వహిస్తారు. చేయాల్సిందిదీ... ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి. ఏ బ్యాంకూ మీ పిన్ నంబరు అడగదు. ఏ బ్యాంకూ ఎప్పుడూ మీ పాస్‌వర్డ్‌ల వంటివి తమకు ఇవ్వాలని అడగదు. అవన్నీ లావాదేవీ జరిపేటపుడు మీకు మీరుగా నమోదు చేయాల్సినవే తప్ప వేరొకరికి ఇచ్చేవి కావు. తెలుసుకునేదిలా... అయితే ఇక్కడో విషయం గమనించాలి. మీకు వచ్చిన మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనేది చూసినా...వాళ్లిచ్చిన వెబ్సైట్ లింక్ చూసినా విషయం అర్థమైపోతుంది. ఎందుకంటే అది నిజంగా సదరు కంపెనీ అధికారిక మెయిల్ నుంచి వచ్చిందయి ఉండదు. పెపైచ్చు ఇంటర్వ్యూకి పిలిచిన ఏ కంపెనీ కూడా డబ్బులు డిపాజిట్ చేయమని అడగదు. -
అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య
ఖానాపూర్(ఆదిలాబాద్): ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం బీర్నంది గ్రామంలో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. బీర్ నంది గ్రామానికి చెందిన బక్క రాజం(45) బుధవారం ఉదయం పురుగుల మందు తాగాడు. కొద్దిసేపటి తర్వాత గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఖానాపూర్ పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమించటంతో మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. అనారోగ్య సమస్యలే ఇతని ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పోలియో చుక్కలు వికటించడం వల్లే...
గుమ్మలక్ష్మీపురం: విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం మూల జంబం గ్రామానికి చెందిన 15 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. వివరాలు.. గత ఆదివారం పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా మూలజంబం గ్రామానికి చెందిన పిల్లలకు కూడా పోలియో చుక్కలు వేయించారు. ఆ రోజు నుంచి పిల్లలు వాంతులు, విరోచనాలు చేసుకుంటున్నారు. ఆరోగ్యంగా ఉన్న తమ పిల్లలకు కేవలం పోలియో చుక్కలు వేయించడం వల్లనే అనారోగ్యం పాలయ్యారని అక్కడి స్థానికులు వాపోతున్నారు. -
ముత్యంరెడ్డికి ప్రభుత్వ ఖర్చులతో వైద్యం: కేసీఆర్
హైదరాబాద్ : మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సచివాలయంలో కలిశారు. గత కొంతకాలంగా ముత్యంరెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈనేపథ్యంలో ముత్యంరెడ్డిని అమెరికా పంపి వైద్యం చేయించాలని కేసీఆర్..అధికారులను ఆదేశించారు. ముత్యంరెడ్డి ప్రయాణ, వైద్య ఖర్చులకు అయ్యే వ్యయాన్ని తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుందని కేసీఆర్ తెలిపారు. -
18ఏళ్లుగా మంచానికే పరిమితం