నేను మీ పిట్యుటరీ గ్రంథిని
good morning
నేను పింక్ రంగులో ఉంటాను. చిన్న కాడ నుంచి ఒక రేగు పండులా వేలాడుతుంటాను. మెదడు కిందిభాగంలో ఒదిగి ఉంటాను. కానీ శరీరం చేసే ప్రతి పనిలోనూ నేను తోడ్పడుతుంటాను. అంటే నా ప్రమేయం లేకుండా ఏ పనీ జరగదు. నేను ఆనంద్ పిట్యుటరీ గ్రంథిని.
నా పరిమాణం గ్రాములో సగముంటుంది. అందులో 85 శాతం నీరే ఉంటుంది. కానీ నా నిర్మాణమే అత్యంత సంక్లిష్టంగా ఉంటుంది. ఇవాళ ఆనంద్ మనుగడకు నేనే కారణం. నేను సరిగా పనిచేయకపోతే ఆనంద్‌కు ఆరోగ్య సమస్యలే కాదు... ప్రాణాలకే ముప్పు రావచ్చు. నేను సరిగా పనిచేయకపోతే ఆనంద్ కేవలం ఒక మీటరు ఎత్తుండే మరుగుజ్జుగా మారవచ్చు. లేదా రెండున్నర మీటర్ల ఎత్తుండేలా రాక్షసాకృతినీ పొందవచ్చు. అతడిలోని సెక్స్ అవయావాలను ఎప్పటికీ చిన్న కుర్రాడిలో ఉన్న పరిమాణంలోనే ఉంచగలను. లేదా వయసుకు ముందే వృద్ధాప్యం వచ్చేలా కూడా చేయగలను.
నేనే మాస్టర్... నేనే బాస్
నేను వేలాడే కాడను హైపోథలామస్ అంటారు. అక్కడి నుంచే ఆనంద్‌లోని అన్ని గ్రంథులనూ నా అదుపాజ్ఞల్లో ఉంచుకుంటాను. అతడి ఒంట్లోని గ్రంథులన్నింటినీ నేనే నియంత్రిస్తుంటాను. అవి తమ స్రావాలు సక్రమంగా ప్రసరిస్తున్నాయో లేదా పర్యవేక్షిస్తుంటాను. సరిగా ప్రసరించేలా చూస్తుంటాను. అందుకే నన్ను మాస్టర్ గ్లాండ్ అంటారు. ఆనంద్‌లోని హార్మోన్ల రసాయనాలన్నీ తగిన పాళ్లలో ఉంచేలా చేస్తున్నందుకే నన్ను ‘కెమికల్ బాస్’గా కూడా వ్యవహరిస్తారు. అత్యంత పెద్ద, సంక్లిష్టమైన రసాయన ఉత్పాదన కర్మాగారాన్ని కేవలం అర్ధగ్రాములో ఏర్పాటు చేసుకున్న ఒక అద్భుతాన్ని నేను.
నేను రెండు తమ్మెలు (లోబ్స్)గా ఉంటాను. నా కింది తమ్మె (పోస్టీరియర్ లోబ్)లో హైపోథలామస్ నుంచి ఉత్పత్తి అయిన హార్మోన్లు నిల్వ ఉంటాయి. పైన ఉండే తమ్మె (యాంటీరియర్ లోబ్) పెద్దది. అది దాదాపు పది రకాల హార్మోన్లను స్రవిస్తుంది. ఈ హార్మోన్లన్నీ నిర్మాణపరంగా అత్యంత సంక్లిష్టమైనవి. రోజూ నేను ఉత్పత్తి చేసే హార్మోన్ల పరిమాణం ఎంతో తెలుసా? ఒక గ్రామును పది లక్షల భాగాలు చేస్తే అందులోని ఒక భాగం ఎంత ఉంటుందో అంత!
కాస్త ఎక్కువా కాదు... కాస్త తక్కువా కాదు...
నాలోని ఒక హార్మోన్ ఆనంద్ మెడలో ఉండే థైరాయిడ్‌ను నియంత్రిస్తుంది. నేను గనక థైరోట్రోపిన్ హార్మోన్‌ను ఎక్కువగా స్రవిస్తే ఆనంద్ థైరాయిడ్‌ను విపరీతంగా పనిచేయిస్తుంది. దాంతో అతడిలో ఆకలి పులిలా విజృంభిస్తుంది. అంతగా తింటున్నా రివటలా ఉంటాడు. అదే గనక నేను కాస్త పని తగ్గించానా... అతడు నిస్తేజమవుతాడు. మందమతి అయిపోతాడు. కానీ అతడిలో థైరాయిడ్ ఎంత పాళ్లలో స్రవిస్తోందన్న అద్భుతమైన పక్కా సమాచార వ్యవస్థతో కరక్ట్ ఫీడ్‌బ్యాక్‌తో పనిచేస్తుంటాను. కాస్త ఎక్కువా కానివ్వను... తక్కువా కానివ్వను. పనిలో అంతటి ఖచితత్వం నాది. అంతటి సునిశితత్వంనాది.
ఎత్తు పెంచడంలో నా భూమిక...
ఇక నాలోని మరో అద్భుతం ఆనంద్ సరైన ఎత్తు పెరిగేలా చూడటం. నేను స్రవించే గ్రోత్ హార్మోన్స్‌తో ఆనంద్ ఎతు ్తపెరిగేలా చేస్తాను. అతడి ఎముకల కొనల్లో ఎత్తును ఆపే ప్లేట్లు పెరిగి బిగుసుకునే వరకూ నేను అతడి ఎత్తును పెంచుతుంటా. ఎందుకే ఎవరైనా ఆనంద్ ఎత్తు పెరిగే యుక్తవయసులో చూసి ఉంటే... ‘అమ్మో... చూస్తుండగానే ఎంత పెరిగాడూ... నా మీద గుప్పెడు’ అని ఆశ్చర్యపోయేలా చేస్తుంటాను. యుక్తవయసు దాటాక అతడిలోని ఎముకల చివర్లోని గ్రోత్ ప్లేట్ బిగుసుకుపోయి ఎత్తు ఆగిపోతుంది. కానీ నాలో ఎముకను పెంచే హార్మోన్లు మాత్రం స్రవిస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఆనంద్ వయసు 47 ఏళ్లు. ఏదైనా కారణం చేత అతడి ఎముక విరిగిపోయి... మధ్యలో కాస్త గ్యాప్ వచ్చిందనుకోండి. అది భర్తీ అయ్యే వరకు మళ్లీ ఎముకను పెంచుతుంటాను నేను. అలా కాళ్లు, చేతులు, పాదాలు, దవడ... ఇలా ఎక్కడ ఎముక విరిగినా అది నార్మల్‌కు పెరిగే వరకూ నాలోంచి రసాయనాలు స్రవిస్తూనే ఉంటాయి. అదే గ్రోత్ హార్మోన్ ఎక్కువ మోతాదులో స్రవించడం వల్ల కొందరిలో ముక్కు బండగా మారిపోవడం, కింది దవడ విపరీతంగా పెరగడమూ జరుగుతాయి.
బాల్యం నుంచి యుక్తవయసులోకి వచ్చేందుకు నేను అవసరం...
పిల్లలు తమ బాల్యం నుంచి యుక్తవయసుకు చేరేందుకు అవసరమైన హార్మోన్లు నా పైన ఉండే హైపోథలామస్ నియంత్రణలో ఉంటాయి. తగిన తరుణం రాగానే... అక్కడి నుంచి వచ్చే సంకేతాలకు అనుగుణంగా నేను వాటిని ప్రసరించేలా చూస్తాను. ఆనంద్ భార్యలో తొలుత ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (ఎఫ్‌ఎస్‌హెచ్) స్రవించేలా చేస్తాను. ఆ తర్వాత ల్యూటినైజింగ్ హార్మోన్ (ఎల్‌హెచ్) కూడా స్రవించేలా చేస్తాను). ఒకవేళ మహిళల్లో ఈ ఎల్‌హెచ్, ఎఫ్‌ఎస్‌హెచ్ హార్మోన్లు సరిగా స్రవించకపోతే యుక్తవయసులోకి వచ్చాక ఒక అమ్మాయి.. తాను యువతిగా చెందాల్సిన క్రమం (ప్యూబర్టీ) ఆలస్యమవుతుంది.
ఆనంద్‌లో సంతాన సాఫల్యం కోసం...
ఆనంద్‌లో అతడి శుక్రకణాలు, పురుషులకు అవసరమైన హార్మోన్లు స్రవింపజేసేలా చూస్తాను. అదే ఆనంద్ భార్యలో ఆమె ఓవరీస్, అండాలు సక్రమంగా అభివృద్ధి చెందేలా చూస్తాను. ఇలా ఆనంద్ దంపతులకు సంతాన సాఫల్యం అయ్యేలా చూడటంలోనూ నాది అత్యంత కీలక భూమిక. నా స్రావాల వల్లనే ఆనంద్ భార్యలో ప్రతి నెలా ఒక అండం విడుదల అవుతుంటుంది. నేను గనక నా హార్మోన్లను కాస్త కొద్దిగా ఎక్కువ స్రవించేలా చూశానంటే ఆమెలో ఒక అండం బదులు మూడు, నాలుగు, ఐదు అండాలు పుట్టవచ్చు. అదే జరిగితే కవలలే కాదు... ఒకే కాన్పులో ముగ్గురు, నలుగురు, ఐదుగురు పుట్టవచ్చు. ఇక నా స్రావాలు పురుషుడైన ఆనంద్‌లో కాస్త ఎక్కువగా జరిగినా కాస్త ఉత్తేజపూరితంగా ప్రవర్తిస్తుంటాడు.
అమ్మ నుంచి అమృతాలు ఊరేది నా వల్లే...
కొత్తగా మాతృమూర్తిగా మారిన అమ్మ రొమ్ము నుంచి పాలు ఊరేది నా స్రావాల వల్లనే. ఆనంద్ పుట్టీ పుట్టగానే అతడి స్పర్శను తెలుసుకున్న మాతృమూర్తి నుంచి అసంకల్పితంగా ప్రోలాక్టిన్ అనే హార్మోన్ స్రవిస్తుంది. ఈ ప్రోలాక్టిన్‌ను స్రవించేది నేనే. ప్రోలాక్టిన్ మెదడును ప్రేరేపిస్తుంది. అంతే... ఆ మెదడు నుంచి అమ్మలో మురిపాలతో పాటు పాలూ ఊరుతాయి. అలా అమ్మ నుంచి క్షీర కారుణ్యాలు ఉప్పొంగేలా చేస్తుంది ప్రకృతి. ఈ అందమైన ప్రకృతి రచనాకృతిలో నేనూ ‘పాలు’ పంచుకుంటానని గర్వంగా చెప్పగలను.
ప్రమాదాల నుంచి రక్షించే విధానం ఇలా...
ఎముకలతో పటిష్టంగా నిర్మించిన కోటగోడల మాటున నేను దాగి ఉంటా. మెదడు కింద ఉయ్యాలపై నేను కొలువుంటా. నా స్థానం సురక్షితం. కానీ ఏదైనా ప్రమాదంలో ఆనంద్‌కు యాక్సిడెంట్ అయి, తలకు గాయం అయ్యిందనుకోండి. వెంటనే నేను నా నుంచి స్రవించే వ్యాసోప్రెసిన్ అనే హార్మోన్ తగ్గుతుంది. దాంతో శరీరం నుంచి మూత్రవిసర్జన పెరుగుతుంది. ఆనంద్‌కు విపరీమైన దాహం వేస్తుంది. ఫలితంగా నీళ్లు ఎక్కువగా తాగేస్తాడు. ఒంట్లో రక్త ప్రసరణ పెరుగుతుంది. ఈ నీళ్లు తాగడం, రక్తప్రసరణ పెరిగి అన్ని అవయవాలకూ రక్తం అందడం జరిగి ప్రాణాపాయ ప్రమాదాన్ని అధిగమించడం జరుగుతుంది. ఇంత కీలకమైన పనులు చేస్తుంటానా... అయినా అసలు నా ఉనికే ఎవరికీ తెలియనంత ఒద్దికతో నా కార్యకలాపాలు నిర్వహించుకుంటూ పోతాను. నాకేమీ లాభాపేక్ష లేదు. అంతా ఆనంద్ కోసమే. అతడి ఆనందం కోసమే.
నాలోని కణుతులు చూపు మీద ప్రభావం చూపవచ్చు...
నా పక్కన కొన్ని కీలకమైన ఇతర శరీర భాగాలూ ఉంటాయి. చాలా అరుదుగా జరిగేదే అయినా నాలో పెరిగే కణుతులు ఆనంద్ కంటి చూపు మీద ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే నాలో వచ్చే కణుతులు పెరిగి అవి కంటి నరాన్ని నొక్కేయడం వల్ల కంటి చూపు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
డాక్టర్ శ్రీదేవి పాలడుగు,
కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్
అపోలో హాస్పిటల్స్
హైదర్‌గూడ, హైదరాబాద్