pituitary gland
-
ఈ వ్యాధి అంత ప్రాణాంతకమా? లక్షణాలేంటి?.. వస్తే ఏం చేయాలి?
సాధారణంగా ఏ చిన్న నొప్పి వచ్చినా.. శరీరంలో ఏ చిన్న మార్పు కనిపించినా వెంటనే గూగుల్ చేస్తాం. దొరికిన సమాచారం ఆధారంగా ఏమీ కాదులే అని ఊరుకుంటాం. లేదంటే తెలిసిన డాక్టరు దగ్గరికి పరిగెడతాం. కానీ మనం అంత తేలిగ్గా గుర్తించలేని, అంతుబట్టని, అసలు పెద్దగా అవగాహనలేని రోగం ఒకటి ఉంది. అదే కుషింగ్స్ సిండ్రోమ్(సీఎస్). ఏప్రిల్ 8న కుషింగ్స్ అవేర్నెస్ డే సందర్బంగా కొన్ని వివరాలు మీకోసం.. 1912లో "పాలీగ్లాండులర్ సిండ్రోమ్"ని అమెరికన్ న్యూరో సర్జన్ డాక్టర్ హార్వే కుషింగ్ని ఈ వ్యాధిని గుర్తించారు. ఏప్రిల్ 8 ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రతీ ఏడాది ఏప్రిల్ 8న, కుషింగ్స్ అవేర్నెస్ డే జరుపుకుంటారు. కుషింగ్స్ వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నారు. కుషింగ్స్ సపోర్ట్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ (CSRF) దీనిపై విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది కుషింగ్స్ సిండ్రోమ్ అంటే ఏంటి? మనందరికీ కొన్ని స్టాండర్డ్ వ్యాధులు తెలుసు. ఉదాహరణకి రక్తపోటు, చక్కెర వ్యాధి, కాన్సర్, థైరాయిడ్ మొదలైనవి. వీటితోపాటు, ఇంకా పలు సమస్యలు అన్నీ ఒకేసారి మన శరీరంపై దాడి చేస్తే ఎలా ఉంటుంది? అంతా అయోమయం, గందరగోళంగా ఉంటుంది. నిజానికి ఈ వ్యాధిని ఎంత తొందరగా గుర్తించి, చికిత్స తీసుకోవడం చాలా అసవరం. సంక్లిష్టమైన ఈ ఎండోక్రైన్ రుగ్మతకు తగిన చికిత్స చేయకపోతే తీవ్రమైన పరిణామాలు కూడా సంభవించే అవకాశం ఉంది. హార్మోనల్ ఇంబాలన్స్తో వచ్చే వ్యాధి పేరే కుషింగ్స్ సిండ్రోమ్. కార్టిసాల్ అనే హార్మోన్ సాధారణ స్థాయిల కంటే ఎక్కువైతే ఇది సంభవిస్తుంది.స్టెరాయిడ్స్ ఎక్కువ తీసుకున్నా, శరీరంలో ఉత్పత్తి అయినా ఈ వ్యాధి మన శరీరంపై దాడిచేస్తుంది. ముఖంపై చర్మం బాగా నల్లగా మారిపోవడం, జుట్టు విపరీతంగా రాలిపోవడం, ఎక్కువగా పింపుల్స్ లాంటివి ప్రధాన లక్షణాలుగా చెప్పుకోవచ్చు వీటితోపాటు మహిళల్లో అయితే గైనిక్ సమస్యలు మరింత వేధిస్తాయి. అలాగే విపరీతమైన మతిమరుపు మరో ప్రధాన లక్షణం. అయితే సమస్య ఇదీ అని తెలియక సంవత్సరాల తరబడి ఏవో మందులు వాడుతూ కాలం గడిపేస్తూ ఉంటారు. కుషింగ్స్ సిండ్రోమ్ లక్షణాలు ఊబకాయం, హైపర్ టెన్షన్, డయాబెటిస్ మెల్లిటస్, బోలు ఎముకల వ్యాధి, ఇన్ఫెక్షన్లు ,న్యూరోకాగ్నిటివ్ డిస్‌ఫంక్షన్స్ వస్తాయి. మొటిమలు, ముఖం విపరీతమైన నల్లగా మారి పోవడం బఫెలో హంప్ (మెడ వెనుక అదనపు కొవ్వు చేరి గూని లాగా ఏర్పడటం) పొత్తికడుపు చుట్టూ విపరీతంగా కొవ్వు చేరడం రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ పెరగడం లేదా హైపర్ గ్లూసేమియా అధిక దాహం, అలసట, అతి మూత్రవిసర్జన, తలనొప్పి, విపరీతమైన మతిమరుపు అధిక రక్త పోటు, అవాంఛిత రోమాలు, మహిళల్లో ఋతుక్రమంలో మార్పులతో పాటు మానసిక అస్థిరత, నిరాశ, తీవ్ర భయాందోళన. పురుషుల్లో వ్యంధ్యత్వం లాంటివి కూడా సంభవిస్తాయి. మరి ఈ వ్యాధి నిర్దారణ ఎలా? చికిత్స ఏంటి? పిట్యూటరీ గ్రంధిపై ట్యూమర్, అడ్రినల్ అడెనోమా (మూత్రపిండాలపై ట్యూమర్) అది విడుదల చేసే కార్టిసాల్ ఎక్కువ కావడమే ఇన్ని విపరీతాలకు కారణం. అయితే ఎండోక్రినాలజిస్ట్ ద్వారా వ్యాధి నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. మూత్రం, రక్తం, హార్మోన్ల పరీక్ష ద్వారా కుషింగ్స్ వ్యాధిని గుర్తించవచ్చు. ఈ కణితిని పూర్తిగా గుర్తించేందుకు సీటీ స్కాన్ లేదా ఎంఆర్ఐ పరీక్షలు అవసరం. పిట్యూటరీ రేడియో థెరపీ, స్టెరియాడ్ ఉత్పత్తిని నిరోధించడం, ఒక వేళ కణితి పెద్దదిగా ఉంటే ఆపరేషన్ కూడా చేయించుకోవాల్సి వస్తుంది. క్రమం తప్పకుండా వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడాలి. అలాగే మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి. మద్యపానం, ధూమపానం లాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. సమతుల ఆహారం తీసుకుంటూ, చిన్న చిన్న వ్యాయమాల ద్వారా స్వీయ రక్షణ పద్ధతులను పాటించాలి. కుషింగ్స్ వ్యాధి బారిన పడి కోలుకుంటున్న విశాఖ జిల్లా పాయకరావు పేటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయిని విజయ భాను కోటె అనుభవం... “I” అనే సినిమా హీరో విక్రమ్ ఏదో కెమికల్ వలన హీరో వికారంగా మారిపోయినట్టే నేను కూడా దారుణంగా తయారయ్యా. అసలు నన్ను నేను గుర్తుపట్టుకోలేనంతగా ఎందుకు మారిపోయానో అర్థం అయ్యేది కాదు. దీనకి తోడు శారీరకంగా ఎన్నో సమస్యలు. ఎంతోమంది డాక్టర్స్ దగ్గరికి తిరిగి తిరిగి, ఎన్ని రకాలుగా చికిత్సలు తీసుకున్నా లాభం లేదు. ఇలా ఎందుకు జరుగుతోందో అర్థ అయ్యేదికాదు. ఈ డిప్రెషన్‌కు గెలవాలనే పట్టుదలతో విపరీతమైన పనికి అలవాటు పడిపోయాను. రోజుకు వంద పనులు కల్పించుకున్నాను. అసలు నొప్పి లేని రోజంటూ లేని నా జీవితంలో నొప్పినే నేస్తంగా భావించాను. 2021 జూన్ లో విపరీతంగా పెరిగిన రక్తపోటు వల్ల డాక్టర్ MRI ద్వారా నాదొక రేర్ డిసీజ్ అని తేలింది. దీన్ని నమ్మాలో వద్దో అర్థం కాలేదు. పదేళ్లు నరకం చూశా.. ఇప్పటికీ భరించలేని నొప్పులు కానీ పదేళ్ల నరకం తరువాత నా బాధలకు కారణం ఏంటో ఎట్టకేలకు తెలిసిందన్న ఒక్కటే సంతోషం. చాలా ప్రయత్నాల తరువాత చివరికి సర్జరీ జరిగింది. అలా నా వ్యాధిని కనిపెట్టిన ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ వంశీ కృష్ణ, నాకు సర్జరీ చేసిన న్యూరాలజిస్ట్ డాక్టర్ బి ఎస్ వి రాజు, ఇలా నాకు చికిత్స చేసిన వైద్యులందరూ నా పాలిట దేవుళ్ళు. సర్జరీ జరిగిన రెండో నెలలకి బరువు తగ్గి, నల్లటిముఖంలో కాస్త మార్పు వచ్చినా ముక్కలుగా విరిగిపోయిన పళ్ళు ఇక బాగు కావనేది అర్థం అయిపోయింది. ఇప్పటికీ ఏదైనా సర్జరీ చేయాల్సి వస్తే..ఇక ఆ బాధలు చెప్పలేను..చిన్న ఇంజెక్షన్‌కు కూడా నానా యాతన అనుభవించాలి. కదుములు కట్టేస్తాయి. అసలు నా జీవితంలో కోలుకోవడం అంటే ఏమిటో అర్థం కావడంలేదు. ఒక విధంగా నేను బ్రతికి ఉండడం గొప్ప. స్టెరాయిడ్స్ లేకుండా లేవలేను. ఏ పనీ చేయలేను. నా లాంటి కష్టాలు మరెవ్వరికీ రాకూడదనేది నా తాపత్రయం అందుకే దీనికి గురించి అందరికీ తెలియాలని ఆరాటపడుతున్నా. ఇన్ని నష్టాలు జరగకుండా ముందే వ్యాధి నిర్ధారణ కావడం చాలా ముఖ్యం. కుషింగ్స్ లక్షణాలు ఏమాత్రం కనిపించినా ముందు ఎండోక్రినాలజిస్ట్‌ను కలవాలి. హార్మోన్ టెస్ట్స్ చేయించుకోవడం చాలా అవసరం. ప్రపంచ వ్యాప్తంగా కుషింగ్స్పై పరిశోధనలు జరుగు తున్నాయి. అదే మాదిరిగా ఇండియాలో కుషింగ్స్ సిండ్రోమ్ రోగులపై మరింత పరిశోధన జరగాల్సి ఉందని.. ఈ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన రావాలి, దీనిపై విస్తృతంగా ప్రచార జరగాలి అంటారు విజయభాను. -
Health: రొమ్ము నుంచి నీరులాంటి స్రావాలా? అయితే..
మహిళల్లో కనిపించే కొన్ని సమస్యలు చాలా ఆందోళన కలిగిస్తాయి. ఉదాహరణకు రొమ్ముల్లో కనిపించే స్రావాలు క్యాన్సర్ కారణంగానా అని భయపెడతాయి. కానీ ఆ లక్షణం తప్పనిసరిగా క్యాన్సర్ వల్లనే కానక్కర్లేదు. బిగుతైన దుస్తుల వల్ల కూడా కావచ్చు. అలాగే తినగానే గర్భిణుల్లో ఇబ్బంది కలగవచ్చు. ఇలాంటి కొన్ని సమస్యలపై ఉండే సాధారణ అపోహలు తొలగించి, అవగాహన కలిగించే కథనాలివి... కొందరిలో రొమ్ము నుంచి నీరులాంటి స్రావాలు వస్తుంటాయి. ఈ కండిషన్‌ను గెలాక్టోరియా అంటారు. ఇలా జరుగుతున్నప్పుడు మహిళల్లో చాలా మంది దాన్ని క్యాన్సర్‌గా అనుమానించి, చాలా ఆందోళనకు గురవుతుంటారు. నిజానికి రొమ్ము నుంచి నీరు రావడానికి చాలా కారణాలుంటాయి. మెదడులోని పిట్యూటరీ గ్రంథి నుంచి విడుదలయ్యే ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతున్నప్పుడూ, మెదడులో ఏమైనా కంతుల వల్లగానీ, హైపోథైరాయిడిజమ్ వల్ల గానీ, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతుండటం వల్ల గానీ, లోదుస్తులు బాగా బిగుతుగా ఉన్నా, రొమ్ములో కంతులు ఉన్నా లేదా యాంటీ డిప్రెసెంట్ మందులు వాడుతున్నా, అవే కాకుండా మరికొన్ని రకాల మందుల్ని చాలాకాలంగా వాడుతున్నా కూడా రొమ్ముల్లో నీరు రావచ్చు. అయితే క్యాన్సర్‌లో కూడా ఇలా రొమ్మునుంచి స్రావాలు వస్తుండవచ్చు. అయితే... స్రావాలు కనిపించిన ప్రతిసారి అందుకు రొమ్ముక్యాన్సరే కారణం కాబోదు. అందుకే ఇలాంటి సమయాల్లో అనవసరంగా ఆందోళన చెందకుండా... తొలుత డాక్టర్‌ను కలిసి తగిన పరీక్షలు చేయించుకోవాలి. దానికి కారణం ఏమిటో నిర్దిష్టంగా తెలుసుకోవాలి. రొమ్ము పరీక్ష చేయించుకున్నప్పుడు ఏవైనా గడ్డలుగానీ, ఇన్ఫెక్షన్గానీ ఉన్నాయా అని చూడాలి. కొన్నిసార్లు రొమ్ము స్కానింగ్, మామోగ్రఫీ ప్రొలాక్టిన్ హార్మోన్, థైరాయిడ్ హార్మోన్, సీబీపీ, ఈఎస్ఆర్ వంటి పరీక్షలు అవసరం కావచ్చు. దానిలో బయటపడ్డ సమస్య లేదా కారణాన్ని బట్టి చికిత్స ఉంటుంది. కొన్ని మందులను దీర్ఘకాలికంగా తీసుకోవడం వల్ల ఇలా జరుగుతుంటే మందుల్ని ఆపడం లేదా మార్చడం జరుగుతుంది. కొన్నిసార్లు సింపుల్‌గా దుస్తులను కాస్త వదులుగా వేసుకోవడం వల్లనే ఈ సమస్య తీరిపోవచ్చు. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఆందోళన చెందకుండా డాక్టర్‌ను సంప్రదించడం అవసరం. చదవండి: Health Benefits of Eating Dates: తీపిగా ఉండే ఖర్జూరాలు తరచుగా తింటున్నారా? ఈ విషయాలు తెలిస్తే! -
వయసు 16.. ఎత్తు 7.4 అడుగులు
డెహ్రడూన్ : సాధరణంగా ఇంటర్ చదివే కుర్రాడు అంటే.. 5 - 5.5 అడుగులు ఎత్తు.. ఎక్కడో ఓ చోట కొందరు 6 అడుగులు ఎత్తుతో.. ఓ మోస్తరు బరువుతో ఉంటారు. కానీ ఉత్తరాఖండ్‌కు చెందిన మోహన్ సింగ్ మాత్రం ఏకంగా ఏడున్నర అడుగుల ఎత్తుతో.. 113 కిలోగ్రాముల బరువుతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కొడుకు భారీగా ఎదగడాన్ని చూసి సంతోషించిన తల్లుదండ్రులు అందుకు బ్రెయన్ ట్యూమర్ కారణం అని తెలిశాక ఆశ్చర్యపోతున్నారు. మోహన్ సింగ్ తలలో ఏర్పడిన ఓ ట్యూమర్ వల్ల అతను ఇంత భారీగా పెరిగాడని వైద్యులు నిర్థారించారు. ఆపరేషన్ చేసి ట్యూమర్‌ని తొలగించారు. ఈ సందర్భంగా మోహన్ సింగ్ తండ్రి మాట్లాడుతూ.. ‘చిన్నప్పుడు మోహన్ కూడా అందరి పిల్లలానే సాధరణ ఎత్తు బరువుతో ఆరోగ్యంగా ఉండేవాడు. కానీ ఓ ఐదేళ్ల నుంచి అతని శరీరాకృతిలో విపరీమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అనూహ్యంగా ఎత్తు, బరువు పెరగడం ప్రారంభించాడు. ఇంటర్‌కు వచ్చే సరికి అతని ఎత్తు 7.4 అడుగులు కాగా బరువు 113 కిలోగ్రాములు. 4ఎక్స్ఎల్ సైజు దుస్తులు అతనికి సరిపోయేవి. చెప్పులు ప్రత్యేకంగా డిజైన్ చేయించే వాళ్లం. మంచం కూడా ప్రత్యేకంగా తయారు చేయించాం. ఈ ఐదేళ్లలో మోహన్ ఎక్కడికివెళ్తే అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవాడు. జనాలు అతనితో సెల్ఫీ తీసుకునేందుకు ఎగబడేవారు’ అన్నారు. ‘మేం కూడా అతను సాధరణంగానే ఎత్తు పెరుగుతున్నాడనుకున్నాం. కానీ ఓ ఐదు నెలలుగా మోహన్ విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నాడు. దాంతో లోకల్ వైద్యుల దగ్గరకి తీసుకెళ్లాం. వారు ఎమ్ఆర్ఐ స్కానింగ్ చేయించాల్సిందిగా సూచించారు. స్కానింగ్ రిపోర్టులో మోహన్ తలలో ఓ ట్యూమర్ ఏర్పడిందని వచ్చింది. దాంతో వారు ఎయిమ్స్‌కు తీసుకెళ్లమని సూచించారు. మోహన్ రిపోర్టులు పరిశీలించిన ఎయిమ్స్ వైద్యులు అతని పిట్యూటరి గ్రంథికి ట్యూమర్ వచ్చిందని.. ఫలితంగానే ఇంత ఎత్తు, బరువు పెరిగాడని తెలిపారు. ఎండోస్కోపిక్ సర్జరీ ద్వారా ట్యూమర్‌ని పూర్తిగా తొలగించవచ్చని పేర్కొన్నారు. ఫలితంగా కొద్ది రోజుల్లోనే మోహన్ బరువు తగ్గుతాడని.. కానీ ఎత్తు మాత్రం అలానే ఉంటాడని తెలిపారు’ అన్నాడు. మోహన్‌కు సర్జరీ చేసిన వైద్యులు మాట్లాడుతూ.. ‘ఇది జన్యు సంబంధిత సమస్య కాదు. పెరుగుదల హర్మోన్లలో వచ్చే లోపం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి.ముగ్గురు వైద్యులు దాదాపు మూడు గంటల పాటు శ్రమించి ఈ ట్యూమర్‌ని తొలగించారు’ అని పేర్కొన్నారు. -
నేను మీ పిట్యుటరీ గ్రంథిని
good morning నేను పింక్ రంగులో ఉంటాను. చిన్న కాడ నుంచి ఒక రేగు పండులా వేలాడుతుంటాను. మెదడు కిందిభాగంలో ఒదిగి ఉంటాను. కానీ శరీరం చేసే ప్రతి పనిలోనూ నేను తోడ్పడుతుంటాను. అంటే నా ప్రమేయం లేకుండా ఏ పనీ జరగదు. నేను ఆనంద్ పిట్యుటరీ గ్రంథిని. నా పరిమాణం గ్రాములో సగముంటుంది. అందులో 85 శాతం నీరే ఉంటుంది. కానీ నా నిర్మాణమే అత్యంత సంక్లిష్టంగా ఉంటుంది. ఇవాళ ఆనంద్ మనుగడకు నేనే కారణం. నేను సరిగా పనిచేయకపోతే ఆనంద్‌కు ఆరోగ్య సమస్యలే కాదు... ప్రాణాలకే ముప్పు రావచ్చు. నేను సరిగా పనిచేయకపోతే ఆనంద్ కేవలం ఒక మీటరు ఎత్తుండే మరుగుజ్జుగా మారవచ్చు. లేదా రెండున్నర మీటర్ల ఎత్తుండేలా రాక్షసాకృతినీ పొందవచ్చు. అతడిలోని సెక్స్ అవయావాలను ఎప్పటికీ చిన్న కుర్రాడిలో ఉన్న పరిమాణంలోనే ఉంచగలను. లేదా వయసుకు ముందే వృద్ధాప్యం వచ్చేలా కూడా చేయగలను. నేనే మాస్టర్... నేనే బాస్ నేను వేలాడే కాడను హైపోథలామస్ అంటారు. అక్కడి నుంచే ఆనంద్‌లోని అన్ని గ్రంథులనూ నా అదుపాజ్ఞల్లో ఉంచుకుంటాను. అతడి ఒంట్లోని గ్రంథులన్నింటినీ నేనే నియంత్రిస్తుంటాను. అవి తమ స్రావాలు సక్రమంగా ప్రసరిస్తున్నాయో లేదా పర్యవేక్షిస్తుంటాను. సరిగా ప్రసరించేలా చూస్తుంటాను. అందుకే నన్ను మాస్టర్ గ్లాండ్ అంటారు. ఆనంద్‌లోని హార్మోన్ల రసాయనాలన్నీ తగిన పాళ్లలో ఉంచేలా చేస్తున్నందుకే నన్ను ‘కెమికల్ బాస్’గా కూడా వ్యవహరిస్తారు. అత్యంత పెద్ద, సంక్లిష్టమైన రసాయన ఉత్పాదన కర్మాగారాన్ని కేవలం అర్ధగ్రాములో ఏర్పాటు చేసుకున్న ఒక అద్భుతాన్ని నేను. నేను రెండు తమ్మెలు (లోబ్స్)గా ఉంటాను. నా కింది తమ్మె (పోస్టీరియర్ లోబ్)లో హైపోథలామస్ నుంచి ఉత్పత్తి అయిన హార్మోన్లు నిల్వ ఉంటాయి. పైన ఉండే తమ్మె (యాంటీరియర్ లోబ్) పెద్దది. అది దాదాపు పది రకాల హార్మోన్లను స్రవిస్తుంది. ఈ హార్మోన్లన్నీ నిర్మాణపరంగా అత్యంత సంక్లిష్టమైనవి. రోజూ నేను ఉత్పత్తి చేసే హార్మోన్ల పరిమాణం ఎంతో తెలుసా? ఒక గ్రామును పది లక్షల భాగాలు చేస్తే అందులోని ఒక భాగం ఎంత ఉంటుందో అంత! కాస్త ఎక్కువా కాదు... కాస్త తక్కువా కాదు... నాలోని ఒక హార్మోన్ ఆనంద్ మెడలో ఉండే థైరాయిడ్‌ను నియంత్రిస్తుంది. నేను గనక థైరోట్రోపిన్ హార్మోన్‌ను ఎక్కువగా స్రవిస్తే ఆనంద్ థైరాయిడ్‌ను విపరీతంగా పనిచేయిస్తుంది. దాంతో అతడిలో ఆకలి పులిలా విజృంభిస్తుంది. అంతగా తింటున్నా రివటలా ఉంటాడు. అదే గనక నేను కాస్త పని తగ్గించానా... అతడు నిస్తేజమవుతాడు. మందమతి అయిపోతాడు. కానీ అతడిలో థైరాయిడ్ ఎంత పాళ్లలో స్రవిస్తోందన్న అద్భుతమైన పక్కా సమాచార వ్యవస్థతో కరక్ట్ ఫీడ్‌బ్యాక్‌తో పనిచేస్తుంటాను. కాస్త ఎక్కువా కానివ్వను... తక్కువా కానివ్వను. పనిలో అంతటి ఖచితత్వం నాది. అంతటి సునిశితత్వంనాది. ఎత్తు పెంచడంలో నా భూమిక... ఇక నాలోని మరో అద్భుతం ఆనంద్ సరైన ఎత్తు పెరిగేలా చూడటం. నేను స్రవించే గ్రోత్ హార్మోన్స్‌తో ఆనంద్ ఎతు ్తపెరిగేలా చేస్తాను. అతడి ఎముకల కొనల్లో ఎత్తును ఆపే ప్లేట్లు పెరిగి బిగుసుకునే వరకూ నేను అతడి ఎత్తును పెంచుతుంటా. ఎందుకే ఎవరైనా ఆనంద్ ఎత్తు పెరిగే యుక్తవయసులో చూసి ఉంటే... ‘అమ్మో... చూస్తుండగానే ఎంత పెరిగాడూ... నా మీద గుప్పెడు’ అని ఆశ్చర్యపోయేలా చేస్తుంటాను. యుక్తవయసు దాటాక అతడిలోని ఎముకల చివర్లోని గ్రోత్ ప్లేట్ బిగుసుకుపోయి ఎత్తు ఆగిపోతుంది. కానీ నాలో ఎముకను పెంచే హార్మోన్లు మాత్రం స్రవిస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఆనంద్ వయసు 47 ఏళ్లు. ఏదైనా కారణం చేత అతడి ఎముక విరిగిపోయి... మధ్యలో కాస్త గ్యాప్ వచ్చిందనుకోండి. అది భర్తీ అయ్యే వరకు మళ్లీ ఎముకను పెంచుతుంటాను నేను. అలా కాళ్లు, చేతులు, పాదాలు, దవడ... ఇలా ఎక్కడ ఎముక విరిగినా అది నార్మల్కు పెరిగే వరకూ నాలోంచి రసాయనాలు స్రవిస్తూనే ఉంటాయి. అదే గ్రోత్ హార్మోన్ ఎక్కువ మోతాదులో స్రవించడం వల్ల కొందరిలో ముక్కు బండగా మారిపోవడం, కింది దవడ విపరీతంగా పెరగడమూ జరుగుతాయి. బాల్యం నుంచి యుక్తవయసులోకి వచ్చేందుకు నేను అవసరం... పిల్లలు తమ బాల్యం నుంచి యుక్తవయసుకు చేరేందుకు అవసరమైన హార్మోన్లు నా పైన ఉండే హైపోథలామస్ నియంత్రణలో ఉంటాయి. తగిన తరుణం రాగానే... అక్కడి నుంచి వచ్చే సంకేతాలకు అనుగుణంగా నేను వాటిని ప్రసరించేలా చూస్తాను. ఆనంద్ భార్యలో తొలుత ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (ఎఫ్ఎస్హెచ్) స్రవించేలా చేస్తాను. ఆ తర్వాత ల్యూటినైజింగ్ హార్మోన్ (ఎల్‌హెచ్) కూడా స్రవించేలా చేస్తాను). ఒకవేళ మహిళల్లో ఈ ఎల్‌హెచ్, ఎఫ్ఎస్హెచ్ హార్మోన్లు సరిగా స్రవించకపోతే యుక్తవయసులోకి వచ్చాక ఒక అమ్మాయి.. తాను యువతిగా చెందాల్సిన క్రమం (ప్యూబర్టీ) ఆలస్యమవుతుంది. ఆనంద్‌లో సంతాన సాఫల్యం కోసం... ఆనంద్‌లో అతడి శుక్రకణాలు, పురుషులకు అవసరమైన హార్మోన్లు స్రవింపజేసేలా చూస్తాను. అదే ఆనంద్ భార్యలో ఆమె ఓవరీస్, అండాలు సక్రమంగా అభివృద్ధి చెందేలా చూస్తాను. ఇలా ఆనంద్ దంపతులకు సంతాన సాఫల్యం అయ్యేలా చూడటంలోనూ నాది అత్యంత కీలక భూమిక. నా స్రావాల వల్లనే ఆనంద్ భార్యలో ప్రతి నెలా ఒక అండం విడుదల అవుతుంటుంది. నేను గనక నా హార్మోన్లను కాస్త కొద్దిగా ఎక్కువ స్రవించేలా చూశానంటే ఆమెలో ఒక అండం బదులు మూడు, నాలుగు, ఐదు అండాలు పుట్టవచ్చు. అదే జరిగితే కవలలే కాదు... ఒకే కాన్పులో ముగ్గురు, నలుగురు, ఐదుగురు పుట్టవచ్చు. ఇక నా స్రావాలు పురుషుడైన ఆనంద్‌లో కాస్త ఎక్కువగా జరిగినా కాస్త ఉత్తేజపూరితంగా ప్రవర్తిస్తుంటాడు. అమ్మ నుంచి అమృతాలు ఊరేది నా వల్లే... కొత్తగా మాతృమూర్తిగా మారిన అమ్మ రొమ్ము నుంచి పాలు ఊరేది నా స్రావాల వల్లనే. ఆనంద్ పుట్టీ పుట్టగానే అతడి స్పర్శను తెలుసుకున్న మాతృమూర్తి నుంచి అసంకల్పితంగా ప్రోలాక్టిన్ అనే హార్మోన్ స్రవిస్తుంది. ఈ ప్రోలాక్టిన్ను స్రవించేది నేనే. ప్రోలాక్టిన్ మెదడును ప్రేరేపిస్తుంది. అంతే... ఆ మెదడు నుంచి అమ్మలో మురిపాలతో పాటు పాలూ ఊరుతాయి. అలా అమ్మ నుంచి క్షీర కారుణ్యాలు ఉప్పొంగేలా చేస్తుంది ప్రకృతి. ఈ అందమైన ప్రకృతి రచనాకృతిలో నేనూ ‘పాలు’ పంచుకుంటానని గర్వంగా చెప్పగలను. ప్రమాదాల నుంచి రక్షించే విధానం ఇలా... ఎముకలతో పటిష్టంగా నిర్మించిన కోటగోడల మాటున నేను దాగి ఉంటా. మెదడు కింద ఉయ్యాలపై నేను కొలువుంటా. నా స్థానం సురక్షితం. కానీ ఏదైనా ప్రమాదంలో ఆనంద్‌కు యాక్సిడెంట్ అయి, తలకు గాయం అయ్యిందనుకోండి. వెంటనే నేను నా నుంచి స్రవించే వ్యాసోప్రెసిన్ అనే హార్మోన్ తగ్గుతుంది. దాంతో శరీరం నుంచి మూత్రవిసర్జన పెరుగుతుంది. ఆనంద్‌కు విపరీమైన దాహం వేస్తుంది. ఫలితంగా నీళ్లు ఎక్కువగా తాగేస్తాడు. ఒంట్లో రక్త ప్రసరణ పెరుగుతుంది. ఈ నీళ్లు తాగడం, రక్తప్రసరణ పెరిగి అన్ని అవయవాలకూ రక్తం అందడం జరిగి ప్రాణాపాయ ప్రమాదాన్ని అధిగమించడం జరుగుతుంది. ఇంత కీలకమైన పనులు చేస్తుంటానా... అయినా అసలు నా ఉనికే ఎవరికీ తెలియనంత ఒద్దికతో నా కార్యకలాపాలు నిర్వహించుకుంటూ పోతాను. నాకేమీ లాభాపేక్ష లేదు. అంతా ఆనంద్ కోసమే. అతడి ఆనందం కోసమే. నాలోని కణుతులు చూపు మీద ప్రభావం చూపవచ్చు... నా పక్కన కొన్ని కీలకమైన ఇతర శరీర భాగాలూ ఉంటాయి. చాలా అరుదుగా జరిగేదే అయినా నాలో పెరిగే కణుతులు ఆనంద్ కంటి చూపు మీద ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే నాలో వచ్చే కణుతులు పెరిగి అవి కంటి నరాన్ని నొక్కేయడం వల్ల కంటి చూపు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. డాక్టర్ శ్రీదేవి పాలడుగు, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ అపోలో హాస్పిటల్స్ హైదర్‌గూడ, హైదరాబాద్