దీంతో రైతుల్లో తీవ్రమైన శ్వాసకోశ, చర్మ వ్యాధులు
తెలంగాణలో ఐసీఎంఆర్, ఎన్‌ఐఎన్ అధ్యయన నివేదిక వెల్లడి
28 పురుగుమందుల్లో 11 రకాలు అత్యంత ప్రమాదకరమని నివేదిక
సేంద్రియ పురుగుమందులు వాడటం మంచిదని సూచన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పురుగుమందుల వాడకం మితిమీరుతున్నట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) వెల్లడించాయి. దీంతో రైతులను తీవ్రమైన శ్వాసకోశ, చర్మ వ్యాధులు పట్టిపీడిస్తున్నాయని పేర్కొంది. వరి, పత్తి పండించే రైతులే ఎక్కువగా పురుగు మందులు వాడుతున్నారని తేలింది. ఐసీఎంఆర్, ఎన్‌ఐఎన్ సంస్థలు నిర్వహించిన ‘దేశంలో ముఖ్యంగా తెలంగాణలో పురుగుల మందు వాడకం–రైతుల ఆరోగ్యంపై ప్రభావం–నివేదిక’అనే అధ్యయనంలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. 18–70 ఏళ్ల మధ్య వారిపై సర్వే చేశారు. అందులో కనీసం ఒక సంవత్సరం పాటు పురుగుమందులు పిచికారీ చేసిన వారున్నారు.
వయస్సు, లింగం, ఎత్తు, బరువు, రక్తంలో గ్లూకోజ్ స్థాయి, విద్యాస్థాయి, ప్రధానవృత్తి, వారు అనుసరించే వ్యవసాయ పద్ధతులు, పురుగుమందుల వాడకం, విస్తీర్ణం, ఖర్చులు, కూలీల పనులు, çపురుగు మందుల వినియోగానికి గల కారణాలు తదితర సమాచారం సేకరించారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రక్తం, మూత్ర నమూనాలను సేకరించారు. పురుగు మందులను ఎక్కువగా వాడటం వల్ల కొందరు కేన్సర్, అల్జీమర్స్ వంటి పెద్ద వ్యాధులకు కూడా గురువుతున్నారని పేర్కొంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన లెక్కల ప్రకారం 28 రకాల పురుగు మందుల్లో 11 రకాల మందులు అత్యంత ప్రమాదకరమైనవిగా వర్గీకరించింది. రైతుల నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాల ద్వారా వారిలో పురుగు మందుల అవశేషాలు కనుగొన్నట్టు ఆ నివేదిక తెలిపింది. నిషేధిత రసాయనాలు కూడా విరివిగా ఉపయోగిస్తున్నారని తేలి్చంది. యాదాద్రి–భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని గ్రామాల్లో క్రాస్ సెక్షనల్ సర్వే జరిగింది.
అధ్యయన నివేదికలోని ముఖ్యాంశాలు
⇒ వాణిజ్య పంటల్లో మితిమీరిన పురుగు మందుల వినియోగం వల్ల అనేక నష్టాలు వాటిల్లుతున్నాయి. అవగాహన లేకపోవడంతో తీవ్రమైన అనారోగ్యాలకు గురవుతున్నారు.
⇒ రైతులు పురుగుమందులను కలపడానికి ఒట్టి చేతులను ఉపయోగించడం వల్ల కూడా నష్టం జరుగుతోంది.
⇒ పురుగు మందుల మితిమీరిన వాడకం వల్ల ఊపిరి ఆడక పోవడం, ఛాతీనొప్పి, గుండె కొట్టుకునే వేగం పెరగడం, వాంతులు, తిమ్మిరి, కండరాల బలహీనత, తలనొప్పి, తల తిరగడం, బ్యాలెన్స్ సమస్యలు తలెత్తుతున్నాయి.
⇒ ఆదాయాన్ని పెంచుకోవాలన్న ఉద్దేశంతో వాణిజ్య పంట లు పండించే రైతులు పురుగు మందులను మితిమీరి వా డారు. నిషేధిత రసాయనాలను కూడా వినియోగించారు.
⇒ అవగాహన ఉన్న రైతులు మాత్రం 36 శాతం తక్కువగా పురుగు మందులను వినియోగించినట్టు తేలింది. ఈ రైతులు మెరుగైన విత్తన రకాలు, సేంద్రియ పురుగు మందులు వాడుతున్నారని తేలింది.
⇒ పురుగు మందులకు గురికావడం వల్ల రైతుల్లో జీర్ణాశయ సమస్యల నుంచి నాడీ సంబంధిత లక్షణాలు, శ్వాసకోశ వ్యాధులు సంభవిస్తున్నాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వంటివి చుట్టుముడుతున్నాయి. పిల్లలు కూడా పురుగు మందులకు గురవుతున్నారు.
⇒ సేంద్రియ పురుగు మందులు వాడటం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.
Comments
Please login to add a commentAdd a comment