commercial crop
-
ఎడాపెడా పురుగుమందుల స్ప్రే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పురుగుమందుల వాడకం మితిమీరుతున్నట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) వెల్లడించాయి. దీంతో రైతులను తీవ్రమైన శ్వాసకోశ, చర్మ వ్యాధులు పట్టిపీడిస్తున్నాయని పేర్కొంది. వరి, పత్తి పండించే రైతులే ఎక్కువగా పురుగు మందులు వాడుతున్నారని తేలింది. ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ సంస్థలు నిర్వహించిన ‘దేశంలో ముఖ్యంగా తెలంగాణలో పురుగుల మందు వాడకం–రైతుల ఆరోగ్యంపై ప్రభావం–నివేదిక’అనే అధ్యయనంలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. 18–70 ఏళ్ల మధ్య వారిపై సర్వే చేశారు. అందులో కనీసం ఒక సంవత్సరం పాటు పురుగుమందులు పిచికారీ చేసిన వారున్నారు.వయస్సు, లింగం, ఎత్తు, బరువు, రక్తంలో గ్లూకోజ్ స్థాయి, విద్యాస్థాయి, ప్రధానవృత్తి, వారు అనుసరించే వ్యవసాయ పద్ధతులు, పురుగుమందుల వాడకం, విస్తీర్ణం, ఖర్చులు, కూలీల పనులు, çపురుగు మందుల వినియోగానికి గల కారణాలు తదితర సమాచారం సేకరించారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రక్తం, మూత్ర నమూనాలను సేకరించారు. పురుగు మందులను ఎక్కువగా వాడటం వల్ల కొందరు కేన్సర్, అల్జీమర్స్ వంటి పెద్ద వ్యాధులకు కూడా గురువుతున్నారని పేర్కొంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన లెక్కల ప్రకారం 28 రకాల పురుగు మందుల్లో 11 రకాల మందులు అత్యంత ప్రమాదకరమైనవిగా వర్గీకరించింది. రైతుల నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాల ద్వారా వారిలో పురుగు మందుల అవశేషాలు కనుగొన్నట్టు ఆ నివేదిక తెలిపింది. నిషేధిత రసాయనాలు కూడా విరివిగా ఉపయోగిస్తున్నారని తేలి్చంది. యాదాద్రి–భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని గ్రామాల్లో క్రాస్ సెక్షనల్ సర్వే జరిగింది. అధ్యయన నివేదికలోని ముఖ్యాంశాలు ⇒ వాణిజ్య పంటల్లో మితిమీరిన పురుగు మందుల వినియోగం వల్ల అనేక నష్టాలు వాటిల్లుతున్నాయి. అవగాహన లేకపోవడంతో తీవ్రమైన అనారోగ్యాలకు గురవుతున్నారు. ⇒ రైతులు పురుగుమందులను కలపడానికి ఒట్టి చేతులను ఉపయోగించడం వల్ల కూడా నష్టం జరుగుతోంది. ⇒ పురుగు మందుల మితిమీరిన వాడకం వల్ల ఊపిరి ఆడక పోవడం, ఛాతీనొప్పి, గుండె కొట్టుకునే వేగం పెరగడం, వాంతులు, తిమ్మిరి, కండరాల బలహీనత, తలనొప్పి, తల తిరగడం, బ్యాలెన్స్ సమస్యలు తలెత్తుతున్నాయి. ⇒ ఆదాయాన్ని పెంచుకోవాలన్న ఉద్దేశంతో వాణిజ్య పంట లు పండించే రైతులు పురుగు మందులను మితిమీరి వా డారు. నిషేధిత రసాయనాలను కూడా వినియోగించారు. ⇒ అవగాహన ఉన్న రైతులు మాత్రం 36 శాతం తక్కువగా పురుగు మందులను వినియోగించినట్టు తేలింది. ఈ రైతులు మెరుగైన విత్తన రకాలు, సేంద్రియ పురుగు మందులు వాడుతున్నారని తేలింది. ⇒ పురుగు మందులకు గురికావడం వల్ల రైతుల్లో జీర్ణాశయ సమస్యల నుంచి నాడీ సంబంధిత లక్షణాలు, శ్వాసకోశ వ్యాధులు సంభవిస్తున్నాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వంటివి చుట్టుముడుతున్నాయి. పిల్లలు కూడా పురుగు మందులకు గురవుతున్నారు. ⇒ సేంద్రియ పురుగు మందులు వాడటం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. -
రైతుల మోముల్లో ‘ధర’హాసం
సాక్షి, అమరావతి: అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)ను మించి రికార్డు స్థాయి ధరలు లభిస్తున్నాయి. ముఖ్యంగా మిరప, మినుము, పసుపు, పెసలు, కందులు ఎమ్మెస్పీని మించి మంచి ధర పలుకుతున్నాయి. కోవిడ్ నేపథ్యంలో రెండేళ్ల పాటు కనీస మద్దతు ధరలు దక్కని రైతులకు ప్రభుత్వం అండగా నిలిచింది. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఆదుకుంది. దీని ద్వారా ఎమ్మెస్పీ దక్కని వ్యవసాయ, వాణిజ్య పంటలను మార్కెట్లో జోక్యం చేసుకొని మరీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. తద్వారా ప్రధాన వ్యవసాయ, వాణిజ్య పంటలకు మద్దతు ధర దక్కింది. నాలుగున్నరేళ్లలో 6.17 లక్షల మంది రైతుల నుంచి రూ.7,751.43 కోట్ల విలువైన 21.60 లక్షల టన్నుల పంట ఉత్పత్తులు కొనుగోలు చేసింది. ఇలా ధర తగ్గిన ప్రతీసారి ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకోవడంతో వ్యాపారుల మధ్య పోటీ పెరిగింది. ఫలితంగా మార్కెట్లో ప్రస్తుతం ఆయా ఉత్పత్తులకు మంచి ధర లభిస్తోంది. ఖరీఫ్ పంట ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చే వేళ అపరాలు, చిరుధాన్యాలు, ఉద్యాన, వాణిజ్య పంటల ధరలు ఎమ్మెస్పీకి మించి రికార్డు స్థాయిలో పలుకుతుండడం శుభపరిణామన్నారు. మిరప, పసుపులకు రికార్డు స్థాయి ధర అంతర్జాతీయంగా పెరిగిన డిమాండ్‌తో మిరప రికార్డు స్థాయి ధర పలుకుతోంది. ఎమ్మెస్పీ క్వింటా రూ.7 వేలు కాగా, కాస్త నాణ్యత ఉంటే చాలు రూ.20 వేలకు పైగా లభిస్తోంది. గరిష్టంగా రూ.27,525 పలుకుతోంది. ప్రతికూల వాతావరణంలో సాగు చేసిన మిరపపై ఈసారి నల్లతామర ప్రభావం పెద్దగా కనిపించకపోవడం, మార్కెట్లో రికార్డు స్థాయిలో ధరలు ఉండడంతో రైతులు మంచి లాభాలను ఆర్జించే పరిస్థితులు ఉన్నాయి. పసుపు ఎమ్మెస్పీ క్వింటా రూ.6,850 కాగా గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుపు మార్కెట్లో బుధవారం గరిష్టంగా క్వింటా రూ.10,650 పలికింది. ఈసారి రూ.15 వేలు దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఇక పత్తి పొడుగు పింజ రకం ఎమ్మెస్పీ క్వింటా రూ.7,020 కాగా, మార్కెట్లో గరిష్టంగా రూ.7,453 పలుకుతోంది. మధ్యస్థ పింజ రకం ఎమ్మెస్పీ రూ.6,620 కాగా మార్కెట్లో రూ.7 వేలు లభిస్తోంది. మిగిలిన పంట ఉత్పత్తులకు సైతం మార్కెట్లో డిమాండ్ ఉండడంతో కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ధర ఇచ్చేందుకు వ్యాపారులు పోటీపడుతున్నారు. క్వింటా రూ.10 వేలు దాటిన అపరాలు అపరాలకు మార్కెట్లో రికార్డు స్థాయి ధరలు పలుకుతున్నాయి. మినుము ఎమ్మెస్పీ క్వింటా రూ.6,950 కాగా, మార్కెట్లో రూ.11,500 పలుకుతోంది. కందులు ఎమ్మెస్పీ రూ.7 వేలు కాగా రూ.10,500, పెసలు ఎమ్మెస్పీ రూ.8,558 ఉండగా మార్కెట్లో రూ.10,500 వరకు ధరలు పలుకుతున్నాయి. రాగులు, సజ్జలు, జొన్నలు వంటి చిరుధాన్యాలకు కూడా మంచి ధరలు లభిస్తున్నాయి. ఇక ఉల్లి ఎమ్మెస్పీ క్వింటా రూ.700 కాగా, మార్కెట్లో గరిష్టంగా రూ.5,500 వరకు రైతుకు ధర లభిస్తోంది. వేరుశనగ కూడా ఎమ్మెస్పీ రూ.6,377 కాగా, గరిష్టంగా మార్కెట్లో రూ.7,596 పలుకుతోంది. అరటి ఎమ్మెస్పీ క్వింటా రూ.800 కాగా, మార్కెట్లో గరిష్టంగా రూ.2,880 లభిస్తోంది. బత్తాయి ఎమ్మెస్పీ రూ.1,400 కాగా మార్కెట్లో గరిష్టంగా రూ.4,200 వరకు పలుకుతోంది. ఖరీఫ్ పంట ఉత్పత్తులు మార్కెట్‌కు వచ్చే వేళ ఇలా వ్యవసాయ, వాణిజ్య పంటల ధరలు ఎమ్మెస్పీకి మించి పలుకుతుండటంతో రైతుల ఆనందానికి అవధుల్లేవు. -
మోదం.. ఖేదం
విశాఖరూరల్, న్యూస్‌లైన్: అకాల వర్షం శుక్రవారం రాత్రి జిల్లాను ముంచెత్తింది. కొన్ని చోట్ల వ్యవసాయాన్ని అతలాకుతలం చేసింది. ఈదురుగాలులను వెంటబెట్టుకుని రైతన్నపై దాడి చేసింది. ఏజెన్సీలోని పాడేరులో రికార్డు స్థాయిలో 9.5 సెంటీమీటర్లు, మైదానంలో సగటున 6.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.కుండపోతగా కురిసిన వర్షానికి మన్యం తడి సి ముద్దయింది. వాతావరణం చల్లబడి జనం ఉపశమనం పొందినా, వ్యవసాయానికి ఎక్కువగా విఘాతం కలిగింది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం వ్యవసాయానికి మేలు చేసింది. చెరువుల్లో పుష్కలంగా నీరు చేరడంతో రైతుల్లో ఆనందం వెల్లువెత్తుతోంది. పశుగ్రాసం పెంచుకునేందుకు, ఖరీఫ్ దుక్కులకు అనుకూలమ న్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాణిజ్య పంటల కు ఈ వాన జీవం పోసింది. జనవరి నుంచి మైదానంలోని కొన్ని ప్రాంతాల్లో చిటుక్కున చినుకులేదు. భానుడి ప్రతాపంతో మెట్ట పంటలు ఎండిపోయే పరిస్థితికి చేరుకున్నాయి. కొందరు రైతులు వ్యవసాయ మోటార్ల ఆధారంగా చెరకు, అరటి, కూరగాయల పంటలను కాపాడుకొస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వర్షం ఊరటనిచ్చింది. దాంతో వేసవి దుక్కులకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఏజెన్సీలో కాఫీ, మిరియాల పంటలకు మేలు చేకూరుతుందని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు. వానకు ఈదురుగాలులు తోడవ్వడంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల పరిధిలో ఎనిమిది మండలాల్లోనూ రబీ వరి, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సుమారు 200 హెక్టార్లలో కోతలు పూర్తయి పొలాల్లో ఉన్న రబీ వరి పనలు తడిసి ముద్దయ్యాయి. కోతకు సిద్ధంగా ఉన్న సుమారు 190 హెక్టార్లలో వరి పంట నేలకొరిగింది. ఈదురు గాలులకు లక్షలు విలువైన మామిడి కాయలు నేల రాలిపోయాయి. పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దేవరాపల్లి మండలంలో 50 ఎకరాల్లో అరటి తోటలు నేలకొరిగి పంట దెబ్బతింది. అకాల వర్షం ఏజెన్సీలో కూరగాయల పంటలకు అపార నష్టాన్ని మిగిల్చింది. ముఖ్యంగా క్యాబేజీ పంట తుడిచిపెట్టుకుపోయింది. అరకులోయ మండలం చినలబుడు, హట్టగుడ,మంజగుడ గ్రామాల్లో ఆదివాసీ రైతులు సాగు చేపట్టిన ఈపంట పూర్తిగా పాడైపోయింది. డుంబ్రిగుడ మండలంలో దేముడువలస, మాలివలస, సొవ్వా, కురిడి, కొల్లాపుట్టు గ్రామాల్లో గిరిజనులు పండించి క్యాబేజీ, టమాటా పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది.కుండ పోత వర్షానికి రబీవరికి కూడా నష్టం వాటిల్లింది. జీకే వీధి మండలం పీకేగూడెం గ్రామంలో 4 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రావికమతం మండలంలో అర్ధరాత్రి వర్షానికి జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరుపాక, చీమలపాడు, గర్నికం గ్రామాల్లో బారీ వృక్షాలు పడి విద్యుత్ తీగలు తెగిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మునగపాక ప్రాంతంలో 60 హెక్టార్లలో రబీవరి నీటమునిగింది. చింతపల్లిలో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు అక్కడక్కడ చెట్ల కొమ్మలు విరిగి తీగలపై పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చౌడుపల్లి డ్యామ్, తాజంగి రిజర్వాయర్ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎస్.రాయవరం మండలం సైతారుపేట సమీపంలోని ఆర్అండ్బీరోడ్డుపై ఉన్న బ్రిడ్జి భారీ వర్షానికి కొంతమేర కుంగిపోవడంతో పాటు ధ్వంసమైంది. మండల కేంద్రంతో పాటు సుమారు 20 గ్రామాల వారు దీనిపై నుంచే రాకపోకలు సాగిస్తుంటారు.