pesticides
-
నేలమ్మకు కొత్త శక్తి.. చీడపీడల విముక్తి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మన ఆహారం ఆరోగ్యానికి మేలు చేసేదిగా ఉండాలంటే ఆహార ఉత్పత్తులు పండే నేల కూడా ఆరోగ్యంగా ఉండాలి. రసాయన ఎరువులు, పురుగుమందులు వాడిన నేలల్లో పండే పంటలు ఆరోగ్యానికి హాని చేస్తాయి. అలాంటిది ఆరోగ్యానికి మేలు చేసే, అధిక దిగుబడులనిచ్చే ఆధునిక వంగడాల అభివృద్ధికి మెట్ట ప్రాంత పంటల అంతర్జాతీయ పరిశోధన కేంద్రం (ఇక్రిసాట్) కొత్త దారిలో పరిశోధనలు చేస్తోంది. ఇందుకోసం పునరుత్పాదక వ్యవసాయ విధానాన్ని అవలంబిస్తోంది. ఈ దిశగా ముందడుగు సైతం వేసింది. భారత్‌తోపాటు వివిధ దేశాల్లో ఎక్కువగా సాగయ్యే వేరుశనగ, కంది, సజ్జ, పొద్దుతిరుగుడు, శనగ వంటి మెట్ట పంటల్లో మెరుగైన వంగడాల కోసం ఈ విధానంలో పరిశోధనలు జరుగుతున్నాయి. ఏడాదంతా ఏదో పంట.. ఈ పునరుత్పత్తి వ్యవసాయం పద్ధతిలో.. ఒకే కమతంలో పక్కపక్కనే వివిధ రకాల పంటలు వి త్తుకుంటారు. ఒక్కో పంట ఒక్కో దశలో ఉంటుంది. ఏడాదంతా వాటి అనుకూల కాలానికి తగ్గట్లుగా ఈ పంటలు వేసుకుంటున్నారు. ఒక పంట కొతకొచ్చే దశలో మరో పంట కాయ దశలో ఉంటుంది. ఇంకో పంట పూత దశకు వస్తుంది. రెండు బ్లాకుల్లో సాగు.. ఇక్రిసాట్‌లో మొత్తం నాలుగు రకాల నేలలు ఉండగా అందులో ఎర్ర, నల్లరేగడి నేలల్లోని రెండు బ్లాకుల్లో పునరుత్పత్తి వ్యవసాయ విధానంపై పరిశోదనలు సాగుతున్నాయి. ఎర్ర నేలతో కూడిన బ్లాకులో వేరుశనగ, పొద్దుతిరుగుడు, సజ్జ, కంది పంటలను ఒకే కమతంలో సాగు చేస్తున్నారు. నల్లరేగడి నేలతో కూడిన మరో బ్లాక్‌లో శనగ, పొద్దుతిరుగుడు, సజ్జ, కంది పంటలు వేశారు. ఇవీ ప్రయోజనాలు.. రీజనరేటివ్ అగ్రికల్చర్ విధానంలో అనేక ప్రయోజనాలున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. సాగవుతున్న పంటల్లో దేనికైనా చీడపీడలు ఆశిస్తే ఆ ప్రభావం పక్కనే ఉన్న మరో పంటకు వ్యాపించేందుకు వీలుండదు. ఆ పంటకే పరిమితమవుతుంది. అదే ఒకే పంట పూర్తి విస్తీర్ణం వేస్తే చీడపీడలు పూర్తి విస్తీర్ణంలో పంటలను ఆశించే ప్రమాదం ఉంటుంది. దీన్ని ఈ విధానం ద్వారా అధిగమించేలా పరిశోధనల ప్రక్రియ కొనసాగుతోంది. అలాగే ఆరోగ్యవంతమైన బ్యాక్టీరియా, పంటలకు ఉపయోగకరమైన ఫంగస్‌ను నాశనం కాకుండా కాపాడుకోవచ్చు. హానికరమైన రసాయనాలు, కలుపు మందులు, పురుగు మందులపై ఆధార పడాల్సిన అవసరం ఉండదు. ఆరోగ్యకరమైన నేలపై పర్యావరణానికి అనుకూలమైన రీతిలో ఈ వ్యవసాయం ఉంటుంది. విలువైన ప్రకృతి వనరులు క్షీణించకుండా, వనరులు మరింత బలోపేతం అయ్యేందుకు ఈ విధానం దోహదపడుతుంది.సాధారణంగా ఏటా అధిక మోతాదుల్లో ఎరువుల వాడకం వల్ల నేల స్వభా వాన్ని కోల్పోతూ ఉంటుంది. కానీ పునరుత్పాదక వ్యవసాయ విధానం ద్వారా నేల పునరుజ్జీవం చెందుతుంది. డీగ్రేడ్ అయిన నేల రీస్టోర్ అవుతుందని రీసెర్చ్ స్కాలర్ కల్పన పేర్కొన్నారు. -
ఎడాపెడా పురుగుమందుల స్ప్రే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పురుగుమందుల వాడకం మితిమీరుతున్నట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) వెల్లడించాయి. దీంతో రైతులను తీవ్రమైన శ్వాసకోశ, చర్మ వ్యాధులు పట్టిపీడిస్తున్నాయని పేర్కొంది. వరి, పత్తి పండించే రైతులే ఎక్కువగా పురుగు మందులు వాడుతున్నారని తేలింది. ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ సంస్థలు నిర్వహించిన ‘దేశంలో ముఖ్యంగా తెలంగాణలో పురుగుల మందు వాడకం–రైతుల ఆరోగ్యంపై ప్రభావం–నివేదిక’అనే అధ్యయనంలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. 18–70 ఏళ్ల మధ్య వారిపై సర్వే చేశారు. అందులో కనీసం ఒక సంవత్సరం పాటు పురుగుమందులు పిచికారీ చేసిన వారున్నారు.వయస్సు, లింగం, ఎత్తు, బరువు, రక్తంలో గ్లూకోజ్ స్థాయి, విద్యాస్థాయి, ప్రధానవృత్తి, వారు అనుసరించే వ్యవసాయ పద్ధతులు, పురుగుమందుల వాడకం, విస్తీర్ణం, ఖర్చులు, కూలీల పనులు, çపురుగు మందుల వినియోగానికి గల కారణాలు తదితర సమాచారం సేకరించారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రక్తం, మూత్ర నమూనాలను సేకరించారు. పురుగు మందులను ఎక్కువగా వాడటం వల్ల కొందరు కేన్సర్, అల్జీమర్స్ వంటి పెద్ద వ్యాధులకు కూడా గురువుతున్నారని పేర్కొంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన లెక్కల ప్రకారం 28 రకాల పురుగు మందుల్లో 11 రకాల మందులు అత్యంత ప్రమాదకరమైనవిగా వర్గీకరించింది. రైతుల నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాల ద్వారా వారిలో పురుగు మందుల అవశేషాలు కనుగొన్నట్టు ఆ నివేదిక తెలిపింది. నిషేధిత రసాయనాలు కూడా విరివిగా ఉపయోగిస్తున్నారని తేలి్చంది. యాదాద్రి–భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని గ్రామాల్లో క్రాస్ సెక్షనల్ సర్వే జరిగింది. అధ్యయన నివేదికలోని ముఖ్యాంశాలు ⇒ వాణిజ్య పంటల్లో మితిమీరిన పురుగు మందుల వినియోగం వల్ల అనేక నష్టాలు వాటిల్లుతున్నాయి. అవగాహన లేకపోవడంతో తీవ్రమైన అనారోగ్యాలకు గురవుతున్నారు. ⇒ రైతులు పురుగుమందులను కలపడానికి ఒట్టి చేతులను ఉపయోగించడం వల్ల కూడా నష్టం జరుగుతోంది. ⇒ పురుగు మందుల మితిమీరిన వాడకం వల్ల ఊపిరి ఆడక పోవడం, ఛాతీనొప్పి, గుండె కొట్టుకునే వేగం పెరగడం, వాంతులు, తిమ్మిరి, కండరాల బలహీనత, తలనొప్పి, తల తిరగడం, బ్యాలెన్స్ సమస్యలు తలెత్తుతున్నాయి. ⇒ ఆదాయాన్ని పెంచుకోవాలన్న ఉద్దేశంతో వాణిజ్య పంట లు పండించే రైతులు పురుగు మందులను మితిమీరి వా డారు. నిషేధిత రసాయనాలను కూడా వినియోగించారు. ⇒ అవగాహన ఉన్న రైతులు మాత్రం 36 శాతం తక్కువగా పురుగు మందులను వినియోగించినట్టు తేలింది. ఈ రైతులు మెరుగైన విత్తన రకాలు, సేంద్రియ పురుగు మందులు వాడుతున్నారని తేలింది. ⇒ పురుగు మందులకు గురికావడం వల్ల రైతుల్లో జీర్ణాశయ సమస్యల నుంచి నాడీ సంబంధిత లక్షణాలు, శ్వాసకోశ వ్యాధులు సంభవిస్తున్నాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వంటివి చుట్టుముడుతున్నాయి. పిల్లలు కూడా పురుగు మందులకు గురవుతున్నారు. ⇒ సేంద్రియ పురుగు మందులు వాడటం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. -
గుళికల ప్యాకెట్‌ను తెచ్చిన కోతి.. టీ పొడి అనుకుని..
రాజానగరం: ఓ కోతి చేసిన పనికి వృద్ధ దంపతులు కన్నుమూశారు. రాజానగరం మండలంలోని పల్లకడియం గ్రామానికి చెందిన వెలుచూరి గోవిందు (75), అప్పాయమ్మ (70) దంపతులకు ఒక కుమారుడు, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కుమారుడు తన పిల్లల చదువు కోసం కుటుంబంతో సహా రాజమహేంద్రవరంలో ఉంటున్నారు. ముగ్గురు కుమార్తెలకు వివాహాలు చేశారు. గోవిందు, అప్పాయమ్మ మాత్రమే తమ ఇంట్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం గోవిందు, అప్పాయమ్మల ఇంటి నుంచి ఒక టీ పొడి ప్యాకెట్‌ను కోతి ఎత్తుకుపోయింది. మరుసటి రోజు శుక్రవారం ఉదయం వేరొక ఇంటి నుంచి పంటలకు ఉపయోగించే విష గుళికల మందు ప్యాకెట్‌ను తీసుకువచ్చి వీరి ఇంటి పెరటిలో పడేసింది. కళ్లు సరిగా కనిపించని అప్పాయమ్మ పెరటిలో పడి ఉన్న ప్యాకెట్‌ను తన ఇంటి నుంచి కోతి తీసుకువెళ్లిందేనని భావించి దానితో టీ పెట్టింది. ఆ టీని తన భర్తకు ఇచ్చి, తాను కూడా తాగింది. కొద్దిసేపటికే వారిద్దరూ నోటి నుంచి నరుగులు కక్కుతూ పడిపోయారు. ఇరుగు పొరుగువారు చూసి హుటాహుటిన రాజమహేంద్రవరం ఆస్పత్రికి తీసుకువెళ్లగా, అప్పటికే మరణించారు. ఈ మేరకు రాజానగరం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు శనివారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
ప్రిస్కిప్షన్ లేకుండానే పురుగుమందులు!
గ్లైపోసేట్ కలుపు మందును బీజీ–3 పత్తి పంటలో కలుపు నివారణకు ఉపయోగిస్తారు. వాస్తవానికి బీజీ–3 పత్తి విత్తనంపై నిషేధముంది. కానీ అనేకమంది రైతులు దీనిని సాగు చేయడంతో పాటు గ్లైపోసేట్‌ను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఎరువులు, పురుగు మందు దుకాణాల్లో అందుబాటులో ఉండటంతో అవగాహన లేకుండానే రైతులు దాన్ని కొంటున్నారు. కొందరు రైతులు వరిలో పెరిగే కలుపు నివారణకు కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. గతంలో ఒక రైతు అలాగే వరిలో కలుపు నివారణకు ఉపయోగిస్తే పంట మొత్తం మాడిపోయింది.సాక్షి, హైదరాబాద్: మనం ఏదైనా అనారోగ్యానికి గురైనప్పుడు డాక్టర్ ప్రిస్కిప్షన్ (మందుల చిట్టీ) ఆధారంగానే మందులు వాడుతుంటాం. కానీ వ్యవసాయం చేసే రైతులు పంటలకు వచి్చన చీడపీడలను వదిలించేందుకు తమ ఇష్టారాజ్యంగా పురుగు మందులు వాడేస్తున్నారు. దీంతో పంటలు విషతుల్యమవుతున్నాయి. మోతాదుకు మించి వాడటంతో ఆయా పంటలు వినియోగిస్తున్న మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. మరోవైపు పంటల్ని కొత్త కొత్త చీడపీడలు ఆశిస్తున్నాయి.వ్యవసాయాధికారులు ప్రిస్క్రిప్షన్ రాసిస్తేనే రైతులకు దుకాణాదారులు పురుగు మందులు విక్రయించాలనే నిబంధన రాష్ట్రంలో బేఖాతర్ అవుతోంది. దీంతో రాష్ట్రంలో విచ్చలవిడిగా పురుగు మందుల విక్రయాలు జరుగుతున్నాయి. వ్యవసాయాధికారుల పర్యవేక్షణ లోపంతో పరిస్థితి ఇష్టారాజ్యంగా మారింది. భారీగా సాగు..పురుగుమందుల వినియోగం తెలంగాణలో వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, పప్పు ధాన్యాల పంటలు ఎక్కువగా సాగవుతుంటాయి. వానాకాలంలో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.29 కోట్ల ఎకరాలు. అందులో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.48 లక్షల ఎకరాలు కాగా, వరి సాధారణ సాగు విసీర్తం 57.18 లక్షల ఎకరాలు. ఇక పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 8.52 లక్షల ఎకరాలు, మొక్కజొన్న సాధారణ సాగు విసీర్ణం 6.09 లక్షల ఎకరాలు, సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 4.29 లక్షల ఎకరాలుగా ఉంది.లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగు చేస్తున్న రైతాంగం..వాటిని కాపాడుకునేందుకు పెద్ద ఎత్తున ఎరువులు, పురుగు మందులు వినియోగిస్తున్నారు. ఒక్క వానాకాలం సీజన్‌కే అన్ని రకాల ఎరువులూ కలిపి 24.40 లక్షల మెట్రిక్ టన్నులు అవసరమని నిర్ధారించారు. అందులో యూరియానే 10.40 లక్షల మెట్రిక్ టన్నులు ఉండటం గమనార్హం. వీటికితోడు భారీగా పురుగుమందుల వినియోగంతో పంటలు విషతుల్యమవుతున్నాయి. ఎకరానికి 360 కిలోల పురుగు మందుల వినియోగం! నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ తాజా అధ్యయన నివేదిక ‘భారత వ్యవసాయ పరిస్థితి’ప్రకారం పంజాబ్, హరియాణ తర్వాత తెలంగాణలోనే అత్యధికంగా పురుగు మందులు వినియోగిస్తున్నారు. అంటే పురుగుమందుల వాడకంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉందన్నమాట. పంజాబ్‌లో రైతులు ఎకరానికి 500 కిలోలు, హరియాణలో 440 కిలోలు పురుగు మందులు వినియోగిస్తుండగా, తెలంగాణలో 360 కిలోల పురుగు మందులు ఉపయోగిస్తున్నారని నివేదిక తెలిపింది. ఆరు జిల్లాల్లో ఎక్కువ గతంలో వ్యవసాయ శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో క్రిమి సంహారక రసాయనాల వినియోగం అత్యధికంగా ఉంది. వరి, పత్తి, కంది పంటలకు ఎక్కువగా క్రిమి సంహారక రసాయనాలు వినియోగిస్తున్నట్లు తేలింది. రైతులు దుకాణాదారుల వద్దకు వెళ్లడం.. వారు ఏది ఎంత వాడమంటే అంత వాడుతున్న పరిస్థితి నెలకొంది. వాస్తవానికి భూసార పరీక్షలు నిర్వహించి, వ్యవసాయాధికారుల సూచనలకు అనుగుణంగా ఎరువులు, పురుగుమందుల వాడకం ఉండాలి. నిజానికి పంటలను చీడపీడలు పట్టిపీడిస్తుంటే వ్యవసాయశాఖ అధికారులు వాటిని పరిశీలించి ఏ మందులు వాడాలో సూచిస్తూ మందుల చిట్టీ (ప్రిస్కిప్షన్) రాయాలి. కానీ అవేవీ జరగడంలేదు.ఆరోగ్యంపై ప్రభావం రసాయన పురుగుమందులను విచ్చలవిడిగా వినియోగించిన పంటలు మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. గ్లైపోసేట్‌ను ఎక్కువగా ఉపయోగిస్తే క్యాన్సర్ సోకే ప్రమాదముంది. ఆ మందు చల్లినచోట చుట్టుపక్కల పంటలపైనా ప్రతికూల ప్రభావం చూపుతుంది. పశువులు, పక్షులపై ప్రభావం చూపి జీవవైవిధ్యానికి నష్టం వాటిల్లుతుంది. ఇతరత్రా మందులు వాడిన పంటలు తినడం వల్ల కూడా దీర్ఘకాలంలో అనారోగ్యానికి గురయ్యేందుకు అవకాశం ఉంటుంది.అయినా ఏళ్లుగా మూసపద్ధతి సాగుకు అలవాటు పడిన రైతులు మోతాదుకు మించి ఎరువులు, పురుగు మందులు వాడుతున్నారని, మోతాదుకు మించి రసాయన ఎరువులు, పురుగు మందులు వాడటం వల్ల తెగుళ్లు నశించకపోగా ఏటా కొత్తవి పుట్టుకొస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి భూమిని, వాతావరణాన్ని కలుíÙతం చేయడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులపైనా ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని వారు పేర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో రైతులు ప్రాణాలు కూడా కోల్పోతున్నారని తెలిపారు. -
గడ్డినే కాదు, జీవులనూ చంపుతుంది!
ఒక ఉత్పత్తి గురించి అనేక దేశాలు గోస పడుతున్నాయి. అయినా దాని మీద శాశ్వత నిషేధం విధించడం లేదు. కలుపు సంహారక సమ్మేళనం గ్లైఫోసేట్ (గడ్డి మందు) వల్ల పర్యావరణం మీద, వ్యవసాయ కార్మికుల మీద, గ్రామీణ ప్రజల ఆరోగ్యం మీద దుష్ప్రభావాలు పెరుగుతున్నాయి. నేరుగా క్యాన్సర్ కలుగజేసే దీన్ని ఆహార పంటల క్షేత్రాలలో వినియోగించడం చాలా ప్రమాదకరం. దీన్ని పిచికారీ చేసిన పంట వ్యర్థాలను తిని గొర్రెలు, మేకలు, ఇతర పశువులు కూడా చనిపోయాయి. అయినా దీన్ని వినియోగం ఆపడం, ఉత్పత్తిని నిలిపివేయడం, అడ్డుకోవడం సవాలుతో కూడుకున్నదని స్పష్టమవుతోంది. వివిధ దేశాల రాజకీయ సంకల్పం పెద్ద కంపెనీల గణనీయమైన లాబీయింగ్ శక్తి ముందు దిగదుడుపే అని అర్థమవుతోంది.2015లో గ్లైలఫోసేట్ నిషేధాన్ని ఆమోదించి, అమలుచేసిన మొట్టమొదటి దేశం శ్రీలంక. కానీ ఈ నిషేధాన్ని 2018లో పాక్షికంగా మార్చవలసి వచ్చింది. 2022లో పూర్తిగా ఉపసంహరించబడింది. 2014లో ఒక స్థానిక శాస్త్రవేత్త గ్లైలఫోసేట్ వలన ‘క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆఫ్ అన్నోన్ ఆరిజిన్’ వస్తున్నదని పరిశోధించి చెప్పిన దరిమిలా శ్రీలంక నాయకత్వం దీని మీద దృష్టి పెట్టింది. 2015లో ఎన్నికైన మైత్రిపాల సిరిసేన ప్రభుత్వం ఈ నిషేధాన్ని ఆమోదించింది. ఈ నిషేధం అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బౌద్ధ సన్యాసి రథనా థెరో మద్దతు కొరకు ఇచ్చిన వాగ్దానం. కానీ తర్వాత నిషేధంలో వెనక్కి తగ్గడం, తరువాత పూర్తిగా ఎత్తి వేయడం జరిగింది. ఈ లాబీయింగ్ వెనుక అమెరికా ప్రభుత్వం, బేయర్ కంపెనీ (అప్పట్లో మోన్శాంటో) ఉన్నదని అందరికీ తెలుసు. డిసెంబర్ 2023లో, నెలల తరబడి తర్జనభర్జనల తర్వాత, ఐరోపా కూటమి దేశాలలో కొన్ని నిషేధించాలని కోరినా, దీని లైసెన్స్‌ను పునరుద్ధరించాలని యూరోపియన్ కమిషన్ నిర్ణయించింది. మరో పదేళ్లపాటు వినియోగాన్ని ఆమోదించింది. ఆస్ట్రియా, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, బెల్జియం, లక్సెంబర్గ్, జర్మనీ వంటి కొన్ని యూరప్ దేశాలు కొన్ని ప్రాంతాల్లో, ఇళ్లల్లో దీని వాడకంపై పాక్షిక నిషేధాలనో, పరిమితులనో విధిస్తున్నాయి.గ్లైఫోసేట్ ఒక రసాయన ఉత్పత్తి. ఇదివరకు మోన్శాంటో, తరువాత దానిని కొన్న బేయర్ కంపెనీ అంతర్జాతీయ గుత్తాధిపత్య కంపెనీ. చాలా శక్తిమంతమైన ఐరోపా కూటమి కూడా ఈ కంపెనీ ఒత్తిడికి తలొగ్గి జీవరాశికి, మానవాళికి ప్రమాదకరంగా పరిణమించిన గ్లైఫో సేట్ వాడకం ఆపలేకపోయింది. సాంకేతిక, మార్కెట్, నియంత్రణ వ్యవస్థల మధ్య ఏర్పడిన ఒక సంక్లిష్టమైన పరస్పర అవగాహన వల్ల ఆధునిక వ్యవసాయంలో గ్లైఫోసేట్‌కు ప్రోత్సాహం లభించిందని ఒక ఆధ్యయనం చెబుతున్నది. ఇందులో 4 కీలక విషయాలు ఇమిడి ఉన్నాయి. (1) జన్యుమార్పు పంటల మీద ఉపయోగం కోసం గ్లైఫో సేట్ వినియోగం; (2) కొత్త వ్యవసాయ వినియోగాలను ప్రోత్సహించడం ద్వార ప్రపంచవ్యాప్త సాధారణ గ్లైఫోసేట్ మార్కెట్ పెరుగుదల; (3) గ్లైఫోసేట్ వాడకంతో మిళితం చేసే డిజిటల్ వ్యవసాయం, జీనోమ్ ఎడిటింగ్ వంటి కొత్త సాంకేతిక ప్రోత్సాహం; (4) కార్పొరేట్ మార్కెట్ శక్తి పెరుగుదల వల్ల వ్యవసాయ పరిశోధన కార్యక్రమాల్లో ప్రభుత్వ పెట్టుబడి తగ్గి హెర్బిసైడ్ రహిత కలుపు నియంత్రణ మీద పరిశోధనలు ఆగిపోవడం.మన దేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో ప్రభుత్వాలు ఆ మధ్య వరుసగా ఒక మూడు సంవత్సరాలు దీనిమీద 60 రోజులు పాటు నిషేధం ప్రకటించాయి. ఈ తాత్కాలిక నిషేధం ఉద్దేశ్యం చట్టవిరుద్ధమైన, హెర్బిసైడ్–తట్టుకునే బీటీ పత్తి విత్తనాలను ఉపయోగించకుండా అరికట్టడానికి అని చెప్పారు. ఈ తాత్కాలిక నిషేధం కూడా కాగితాలకే పరిమితం అయ్యింది. ఆ పరిమిత నిషేధ కాలంలో కూడా బహిరంగంగానే అమ్మకాలు జరిగాయి. పురుగు మందుల నియంత్రణ చట్టం, 1968 ప్రకారం రాష్ట్రాలు విష రసాయనాలను 60 రోజుల వరకు మాత్రమే నిషేధించవచ్చు. కేంద్ర ప్రభు త్వానికి మాత్రమే శాశ్వతంగా నిషేధించే అధికారం ఉంది. వివిధ రాష్ట్రాలు కోరినా కేంద్రం నిషేధం గురించి స్పందించడం లేదు. కేరళ, సిక్కిం రాష్ట్రాలు మాత్రం కొన్ని అధికరణలను ఉపయోగించి శాశ్వత నిషేధం విధించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కేంద్రానికి రాసి మిన్నకున్నాయి. ఇతర విషయాలలో అధ్యయనాలకు బృందాలను పంపే రాష్ట్రాలు మరి కేరళ, సిక్కిం ఎట్లా సాధించాయో తెలుసు కునే ప్రయత్నం చేయలేదు.2019–21 మధ్య స్వదేశీ జాగరణ్ మంచ్ అవగాహన కార్య క్రమాలు చేపట్టి, గ్లైఫోసేట్ను పూర్తిగా నిషేధించాలని కోరుతూ రెండు లక్షల మంది సంతకాలతో కూడిన మెమోరాండంను కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రికి సమర్పించింది. స్వదేశీ జాగరణ్ మంచ్ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ. అనేక విషయాలలో ఆర్ఎస్ఎస్ అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్నదని ఆరోపణ ఎదురుకుంటున్న కేంద్ర ప్రభుత్వం, గ్లైఫోసేట్ మీద మాత్రం ఆ సంస్థ కోరిన నిషేధం విధించలేకపోతున్నది. రాజకీయ ఒత్తిడులలో ఉండే అధికార క్రమం ఇక్కడ స్పష్టంగా కనపడుతున్నది. అక్టోబర్ 2020లో, పెస్టిసైడ్ యాక్షన్ నెట్వర్క్ ఇండియా మరియు పాన్ ఆసియా పసిఫిక్ సంయుక్తంగా ‘స్టేట్ ఆఫ్ గ్లైఫోసేట్ యూజ్ ఇన్ ఇండియా’ నివేదికను విడుదల చేశాయి. దీని వాడకం విచ్చలవిడిగా ఉందని నివేదించాయి. దీని వల్ల పర్యావరణం మీద, వ్యవసాయ కార్మికుల మీద, గ్రామీణ ప్రజల ఆరోగ్యం మీద దుష్ప్ర భావాలు పెరుగుతున్నాయని పేర్కొంది. నేరుగా క్యాన్సర్ కలుగజేసే దీన్ని ఆహార పంటల క్షేత్రాలలో వినియోగించడం ప్రమాదకరం.ప్రజల నుంచి, సంస్థల నుంచి వచ్చిన ఒత్తిడుల నేపథ్యంలో నిషేధించకుండా కేంద్ర ప్రభుత్వం 2020లో కొన్ని ఆంక్షలు ప్రకటించింది. దీని ప్రకారం పెస్ట్ కంట్రోల్ ఆపరేటర్ల ద్వారా తప్ప ఏ వ్యక్తి కూడా దీన్ని పిచికారీ చేయరాదు. అంటే సాధారణ రైతులు ఉప యోగించరాదు. కేవలం రసాయన పిచికారి చేసే సంస్థల ద్వారానే ఉపయోగించాలని కొత్త నిబంధన తెచ్చింది. తదుపరి కంపెనీ నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గి ఈ ఆంక్షలను సవరించారు. శిక్షణ పొందిన వారు ఎవరైనా ఉపయోగించవచ్చు అని చెప్పారు. ఆ శిక్షణ ఇవ్వడానికి ఒక కేంద్ర పరిశోధన సంస్థకు అప్పజెప్పితే వారు కొన్ని ఆన్లైన్ తరగతులు నిర్వహించి ఒక సర్టిఫికెట్ ఇస్తున్నారు.రైతులలో పూర్తి అవగాహన లేకపోవడం, పురుగుమందు / విత్తన కంపెనీల మార్కెట్ మాయాజాలం, కొరవడిన ప్రభుత్వ నియంత్రణ వంటి కారణాల వల్ల, రైతులు దీన్ని వాడుతున్నారు. రైతులు తాము కొన్నవి గ్లైఫోసేట్ తట్టుకునే విత్తనాలు అనుకుని, కాయ కాసిన తరుణంలో, గడ్డిని తొలగించటానికి దీన్ని వాడటం వల్ల, మొత్తం పంట మాడిపోయి నష్టపోయిన ఉదంతాలు ఉన్నాయి. దీని వాడకం మీద ఆంక్షలు ఉండడంతో, ప్రభుత్వం నుంచి పరిహారం కోరే అవకాశం కూడా లేకుండా పోయింది. గ్లైఫోసేట్ పిచికారీ చేసిన గడ్డి అని తెలియక దాన్ని నోట్లో పెట్టుకున్న ఒక అమ్మాయి చనిపోయింది. అనేక విధాలుగా గ్రామాలలో అమాయకులు ఈ విష రసాయనాల బారిన పడి అనారోగ్యం పాలవుతున్నారు. పంట ఎండపెట్టడానికి ఓపిక లేని రైతులు పంట కోతకోచ్చే సమయానికి దీన్ని వాడు తున్నారు. దాని వల్ల మొక్క మాడుతుంది, చచ్చిపోతుంది. అట్లాంటి పంట వ్యర్థాలు విషపూరితం అవుతాయి. దీన్ని పిచికారీ చేసిన పంట వ్యర్థాల్నితిని గొర్రెలు, మేకలు, ఇతర పశువులు కూడా చనిపోయాయి.క్యాన్సర్ ప్రమాదాల గురించి వినియోగదారులను హెచ్చరించడంలో కంపెనీ విఫలమైందని పేర్కొంటూ మో¯Œ శాంటో (ఇప్పుడు బేయర్ యాజమాన్యంలో ఉంది)తో సహా గ్లైఫోసేట్‌తో సంబంధం ఉన్న రౌండప్ తయారీదారులపై అమెరికాలో వేలకొద్దీ కోర్టు వ్యాజ్యాలు దాఖలైనాయి. 2019 నాటికి ఇవి 42,700. ఇతర దేశంలో గ్లైఫోసేట్ మీద ఈగ వాలితే అమెరికా ప్రభుత్వం వాలిపోతుంది. అదే అమెరికాలో వేల కొద్ది వ్యాజ్యాలను ఆ కంపెనీ ఎదుర్కుంటున్నది.మానవాళికి, జీవకోటికి ప్రమాదకరంగా పరిణమించిన ఈ వ్యాపార వస్తువును నిషేధించలేని పాలనా వ్యవస్థలను, అందులోని లోపాలను అధ్యయనం చేయాలి. ఒక వ్యాపార వస్తువుని నియంత్రించలేని దేశాధినేతల బలహీనతలు ఇక్కడే తేలిపోతున్నవి. ప్రజా రోగ్యాన్ని దెబ్బ తీస్తూ, పర్యావరణానికి దీర్ఘకాల హాని చేసే రసాయనాల నియంత్రణ మీద ఒక వైపు అంతర్జాతీయ చర్చలు జరుగు తుంటే మన దేశంలో మాత్రం ఏ చర్యా లేదు. ఇది మారాలి. ఈ పరిస్థితి మారాలంటే మన రాజకీయం మారాలి. డా‘‘ దొంతి నరసింహా రెడ్డి వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు -
Fact Check: రైతుకు కాదు.. రామోజీకే విపత్తు
సాక్షి, అమరావతి: వాతావరణ ప్రభావంతో ఏదైనా పంటకు తెగులు సోకినా.. పురుగు వచ్చినా దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వమే కారణం అన్నట్టుగా ఉంది ఈనాడు రామోజీరావు రాతలు చదువుతుంటే. సర్టిౖఫై చేసిన సాగు ఉత్పాదకాలను ఆర్బీకేల ద్వారా గ్రామస్థాయిలో రైతుల ముంగిట అందిస్తూ అన్నదాతలకు అన్నివిధాలుగా అండగా నిలుస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టను దిగజార్చడమే లక్ష్యంగా నిత్యం రోత రాతలు రాస్తూ రామోజీ పైశాచికానందం పొందుతున్నారు. నకిలీ సాగు ఉత్పాదకాల బారినపడి రాష్ట్రంలో ఏ ఒక్క రైతు నష్టపోకూడదన్న సంకల్పంతో.. పంపిణీ చేసే ముందు వాటి నాణ్యతను పరీక్షించాలన్న లక్ష్యంతో నియోజకవర్గ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్‌ను తీసుకొచ్చింది. ఈ ల్యాబ్‌ల్లో పరీక్షించిన తర్వాతే మార్కెట్లోకి తీసుకొచ్చేలా ఏర్పాటు చేసింది. ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన ఉత్పాదకాలను మాత్రమే గ్రామస్థాయిలో రైతులకు పంపిణీ చేస్తోంది. ఈ కారణంగానే నాలుగున్నరేళ్లలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వల్ల తాము పంట నష్టపోయామని ఒక్కరంటే ఒక్క రైతు కూడా ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవు. ఇవేమీ పట్టని ఈనాడు వాస్తవాలకు ముసుగేసి.. ‘విత్తనం నుంచే విపత్తు’ అంటూ అడ్డగోలుగా అబద్ధాలతో కథనాన్ని అచ్చేసింది. ఈ కథనంలో పేర్కొన్న అంశాలపై వాస్తవాలు ఇవీ.. ఏటా 50 వేల శాంపిల్స్ పరీక్షిస్తున్నా ఏడుపే రాష్ట్రంలో ఏటా సగటున 1.25 లక్షల లాట్స్ విత్తనాలు, 2.80 లక్షల బ్యాచ్‌ల పురుగు మందులు, 20 వేల బ్యాచ్‌ల ఎరువులు మార్కెట్‌కు వస్తుంటాయి. గతంలో వీటి నాణ్యతను పరీక్షించేందుకు రాష్ట్రస్థాయిలో 11 లే»ొరేటరీలు మాత్రమే అందుబాటులో ఉండేవి. పెస్టిసైడ్స్ కోసం 5, ఎరువులు, విత్తన పరీక్షల కోసం 3 చొప్పున ఉండేవి. మార్కెట్లోకి వచ్చే ఎరువుల్లో 25–30 శాతం, విత్తనాల్లో 3–4 శాతం, పురుగు మందుల్లో ఒక శాతానికి మించి శాంపిళ్లను పరీక్షించే వారుకాదు. దీంతో మార్కెట్లో నకిలీలు రాజ్యమేలేవి. ఫలితంగా ఏటా రూ.వేల కోట్ల విలువైన పెట్టుబడిని రైతులు నష్టపోయేవారు. ఈ పరిస్థితికి చెక్ పెట్టాలనే లక్ష్యంతోనే రూ.213 కోట్లతో దేశంలో మరెక్కడా లేనివిధంగా జిల్లా స్థాయిలో 10, నియోజకవర్గ స్థాయిలో 127 ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్‌ను జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లా స్థాయిలో మరో 20 ల్యాబ్స్ నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ ల్యాబ్‌లలో చట్టపరంగా సేకరించిన నమూనాలతో పాటు రైతువారీ వ్యాపార సంబంధమైన విత్తనాలు, ఎరువుల నమూనాలు పరీక్షిస్తున్నారు. గతంలో ఏటా అన్నిరకాల శాంపిల్స్ కలిపి 10 వేలు పరీక్షించడమే కష్టంగా ఉండేది. కానీ.. నేడు అగ్రి ల్యాబ్స్ రాకతో ఏటా సగటున 50వేల శాంపిల్స్‌ను పరీక్షిస్తున్నారు. ఫలితంగా ఎక్కడా నకిలీ విత్తనం, ఎరువు, పురుగు మందుల బారినపడి నష్టపోయామన్న మాటే విన్పించలేదు. ఆర్బీకేల ద్వారా పురుగుల మందుల విక్రయం 2020–21 నుంచి 2021–22 వరకు ఆర్బీకేల ద్వారా రూ.14.01 కోట్ల విలువ చేసే 1,36,443 లీటర్ల పురుగు మందులను 1,50,822 మంది రైతులకు ప్రభుత్వం అందించింది. 2023–24లో రైతులకు అవసరమైన, నాణ్యత పరీక్షించబడిన పురుగు మందులను ఆర్బీకేల ద్వారా రైతులకు సరఫరా చేసేందుకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ అవసరమైన చర్యలు తీసుకుంది. సీజన్లో మందులు దొరకవనే భయంతో రైతులు విత్తనం వేసేప్పుడే అధిక సంఖ్యలో తీసుకుని నిల్వ చేసుకుంటుంటారు. కాగా.. పురుగుల మందుల వినియోగం పెరగడానికి పలు కారణాలు దోహదం చేస్తుంటాయి. 2022–23 సీజన్లో అధిక వర్షపాతం వలన గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలలో రైతులు పప్పుధాన్యాల పంటల నుండి వాణిజ్య పంటలైన మొక్కజొన్న, పత్తి, మిరప పంటల వైపు మళ్లారు. రాయలసీమ జిల్లాలలో నూనె గింజల పంటల నుండి పండ్ల తోటలు, పత్తి పంటల సాగు వైపు మొగ్గు చూపారు. మిరపలో వచ్చిన నల్లతామర, పత్తి, మొక్కజొన్నలలో పురుగులు, తెగుళ్ల ఉ«ధృతికి అడ్డుకట్ట వేసేందుకు గతం కంటే కాస్త ఎక్కువగానే పురుగు మందులను వినియోగించారు. అయితే.. ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు తగిన మోతాదులో మాత్రమే వినియోగించాలని ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం చేస్తూనే ఉన్నారు. దిగుబడులకు ఢోకా లేదు ఆహార ధాన్యాల ఉత్పత్తి 2014–19 మధ్యలో సగటున 153.95 లక్షల టన్నులుగా నమోదైతే.. 2019–23 మధ్య 165.40 లక్షల టన్నులుగా నమోదైంది. అంటే 11.45 లక్షల టన్నుల మేర పెరిగింది. ఇక ఉద్యాన పంటల విషయానికి వస్తే టీడీపీ హయాంలో 2018–19లో 17.40 లక్షల హెక్టార్లలో సాగవగా, 305 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. కాగా ప్రస్తుతం 18.03 లక్షల హెక్టార్లకు విస్తరించగా.. 368.83 లక్షల టన్నుల దిగుబడులు నమోదయ్యాయి. అంటే ఏకంగా 63 లక్షల టన్నులకు పైగా ఉద్యాన పంటల దిగుబడులు పెరిగాయి. నిజంగా నాసిరకం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు రాజ్యమేలితేæ ఈ స్థాయిలో దిగుబడులు పెరుగుతాయా అన్నది ఒక్కసారి రామోజీ ఆలోచన చేయాలి. ఏటా విస్తృత తనిఖీలు.. నాణ్యత లోపిస్తే క్రిమినల్ కేసులు రాష్ట్రవ్యాప్తంగా ఏటా పురుగు మందులు, ఎరువుల దుకాణాలలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది నిర్వహించిన తనిఖీల్లో పురుగు మందుల చట్టం 1968 నిబంధనల ప్రకారం సక్రమంగా లేని రూ.5.21 కోట్ల విలువైన 37,998 లీటర్ల పురుగు మందుల అమ్మకాలను నిలిపివేశారు. రూ.కోటి విలువైన 17,073 లీటర్ల పురుగు మందులను స్వా«దీనం చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఇంకోవైపు ర్యాండమ్ తనిఖీల్లో భాగంగా ఈ ఏడాది 10,500 పురుగుల మందుల నమూనాలు సేకరించి ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ ద్వారా పరీక్షించాలని లక్ష్యంగా నిర్దేశించారు. డిసెంబర్ నాటికి 8,159 నమూనాలు సేకరించి పరీక్షించగా, కేవలం 55 నమూనాలు మాత్రమే నాసిరకంగా ఉన్నట్టుగా గుర్తించి సంబంధిత కంపెనీలు, డీలర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తయారీదారుల అభ్యర్థన మేరకు 19 నమూనాల పునర్విశ్లేషణ కోసం పంపించారు. మిగిలిన నాసిరకం పురుగు మందుల ఉత్పత్తిదారులపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు. æనాణ్యత నిర్ధారణ నిమిత్తం నమూనాలను సేకరించి సంబంధిత పరీక్షా కేంద్రాలకు పంపించటం జరిగింది. ఈ విధంగా అగ్రిల్యాబ్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 23,714 పురుగులమందుల నమూనాలను పరీక్షించగా, 175 శాంపిల్స్ నాసిరకంగా ఉన్నట్టుగా గుర్తించారు. తయారీదారులు, సరఫరాదారుల అభ్యర్థన మేరకు 82 నమూనాలను కోర్టు ద్వారా పునర్విశ్లేషణ కోసం పంపించారు. ఇప్పటికే 31 నాసిరకం ఉత్పత్తిదారులపై చట్టపరమైన చర్యలు, క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మిగిలిన 73 నాసిరకమైన నమూనాలకు సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. పురుగు మందుల చట్టం నియమ నిబంధనల మేరకు కాల పరిమితికి లోబడి నాసిరకం పురుగుల మందుల ఉత్పత్తిదారులపై తగిన చర్యలు, క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వాస్తవాలు ఇలా ఉంటే కేవలం 5 వేల నమూనాలు మాత్రమే తీశారంటూ ఈనాడు అర్థరహితమైన ఆరోపణలు చేసింది. -
‘నకిలీ విత్తు’ చిత్తు!
ఇతని పేరు బుద్ధా సన్యాసిరావు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం. ఈయన 5 ఎకరాల్లో సొంత విత్తనంతో సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. మొలక శాతం ఎంతుందో తెలుసుకునేందుకు ఆర్బీకే ద్వారా కోరుకొండ ల్యాబ్‌కు శాంపిల్ పంపి ఉచితంగా పరీక్ష చేయించారు. మొలక శాతం చాలా తక్కువగా ఉందని గుర్తించడంతో వాటిని పక్కన పెట్టి, డెల్టా సీడ్స్ కంపెనీ నుంచి బీపీటీ 5204 విత్తనాన్ని కొని మరోసారి పరీక్షించుకుంటే మొలక శాతం బాగా వచ్చింది. అదే విత్తనాలు నారుమడి పోసుకొని సాగు చేశాడు. నిజంగా మొలక శాతం లేని సొంత విత్తనంతో సాగు చేసి ఉంటే ఎకరాకు విత్తనానికి రూ.1,000, నారుమడి, దమ్ముకు రూ.500, బాటలు తీసి ఎరువులు, పురుగు మందులకు మరో రూ.200 చొప్పున 5 ఎకరాలకు రూ.8,500కు పైగా నష్టం వచ్చేది. పంటపై పెరిగే పురుగులు, చీడపీడల నియంత్రణకు ఎకరాకు రూ.600 నుంచి రూ.800 వరకు అదనపు పెట్టుబడి పెట్టాల్సి వచ్చేది. మొక్కలు ఎదగడానికి పట్టే 25 రోజుల విలువైన కాలమే కాకుండా, ఎకరాకు 4–6 బస్తాల దిగుబడి కోల్పోవాల్సి వచ్చేది. ‘ఆ విత్తనం ఉపయోగించకపోవడం వల్ల పెట్టుబడి కోల్పోకుండా జాగ్రత్త పడడమే కాదు.. మొలక శాతం ఎక్కువగా ఉన్న బీపీటీ 5204 రకం విత్తనంతో సాగు వల్ల ఆశించిన దిగుబడులను సాధించగలిగాను. కొత్తగా ఏర్పాటు చేసిన అగ్రిల్యాబ్ వల్ల నా పంట కాపాడుకోగలిగాను’ అని ఈ రైతు ఆనందంగా చెబుతున్నాడు. పంపాన వరప్రసాదరావు, తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ ఇంటిగ్రేటెడ్ అగ్రిల్యాబ్ నుంచి సాక్షి ప్రతినిధి : తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కొరుకొండ గ్రామం. ప్రసిద్ధి చెందిన లక్ష్మీనరసింహస్వామి వారు కొలువైన ఈ గ్రామంలో ఓ వైపు పంట పొలాలు.. మరో వైపు ఆయిల్ పామ్, మామిడి, జీడిమామిడి తోటలు. గ్రామంలో కొత్తగా నిరి్మంచిన సచివాలయం, ఆర్బీకే కేంద్రాలున్నాయి. గ్రామం మధ్య కాపవరం రోడ్డులో ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో అత్యంత అధునాతనంగా నిరి్మంచిన భవనం ఉంది. అదే వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్. ఈ ల్యాబ్‌కు అనుబంధంగా పసు వ్యాధి నిర్ధారణ ల్యాబ్ కూడా ఉంది. ల్యాబ్ పరిధిలో 16,691 హెక్టార్ల విస్తీర్ణం ఉండగా, 14,162 మంది రైతులున్నారు. వీరిలో 70 శాతం మంది కౌలుదారులే. ల్యాబ్‌లో అడుగు పెట్టగానే ఎటు చూసినా అత్యాధునిక పరికరాలే. విత్తన, ఎరువుల శాంపిల్స్‌ను పరీక్షించే సీడ్ బ్లోవర్, మైక్రోస్కోప్, ప్యూరిటీ బోర్డు, డిస్టిలేషన్ యూనిట్, బోర్నర్, గోనెట్ డివైడర్, సీడ్ జెర్మినేటర్, హాట్ ఎయిర్ ఓవెన్, మప్లే పర్నేస్, హాట్ప్లేట్, సెక్షన్ పంప్, డేస్కికేటర్ ఇలా ఒకటి కాదు.. రెండు కాదు పదుల సంఖ్యలో పరికరాలు ఉన్నాయి. రైతులు తెచ్చిన శాంపిల్స్ పరీక్షించడంలో ల్యాబ్ ఇన్చార్జి, వ్యవసాయాధికారి దేవరపల్లి రామతులసితో పాటు ల్యాబ్ సిబ్బంది తలమునకలైఉన్నారు. అదే సమయంలో శాంపిల్స్ పట్టుకొని కొంతమంది, ఇచ్చిన శాంపిల్స్ ఫలితాల కోసం మరికొంత మంది రైతులు ల్యాబ్‌కు రావడం మొదలైంది. ల్యాబ్ ఏమిటో? ఎవరి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిందో మీకు తెలుసా? అని ఆరా తీయగా, అక్కడకు వచ్చిన రైతులే కాదు.. గ్రామంలోని పలువురు రైతులు కూడా ల్యాబ్ ఏర్పాటుతో మాకు ఎంతో మేలు జరుగుతోందని ఆనందంగా చెప్పారు. ‘గతంలో ఏదైనా పరీక్షించుకోవాలంటే పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వెళ్లాల్సి వచ్చేది. అంత దూరం వెళ్లేందుకు ఆరి్థక భారం కావడంతో డీలర్లు ఇచ్చిన విత్తనాలను కనీసం పరీక్ష కూడా చేయించుకోకుండానే విత్తుకునే వాళ్లం. మొలక వస్తే అదృష్టం.. లేకుంటే మా దురదృష్టం.. అన్నట్టుగా ఉండేది మా పరిస్థితి. ఇప్పుడు మా నియోజకవర్గంలోనే ఈ ల్యాబ్ రావడంతో విత్తనాలు, ఎరువులు తనిఖీ చేయించుకోగలుగుతున్నాం’ అని తెలిపారు. విత్తనం మంచిదైతే.. పంట బాగుంటుంది. పంట బాగుంటే దిగుబడిపై దిగులుండదు. ఆశించిన దిగుబడులు సాధించాలంటే మేలి రకం విత్తనం కావాలి. అన్నదాతలు నకిలీ విత్తనాలతో మోసపోకుండా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన వైఎస్సార్ అగ్రి ల్యాబ్స్ అద్భుత పనితీరుతో రైతులకు భరోసా కల్పిస్తున్నాయి. ఏటా రూ.వేల కోట్ల పెట్టుబడి మట్టిపాలు కాకుండా ముందుగానే పరీక్షించి హెచ్చరిస్తున్నాయి. పైసా ఖర్చు లేకుండా ఇన్‌పుట్స్‌ను ముందుగానే పరీక్షించుకోవడం ద్వారా నాసిరకం, నకిలీల బారిన పడకుండా ధైర్యంగా సాగు చేసుకోగలుగుతున్నారు. సొంతంగా తయారు చేసుకున్నవైనా, మార్కెట్లో కొనుగోలు చేసినవైనా నేరుగా ల్యాబ్‌కు వెళ్లి విత్తన నాణ్యతను ఉచితంగా పరీక్షించుకుని, ఫలితాల ఆధారంగా ధైర్యంగా సాగు చేసుకోగలుగు తున్నామని పలువురు రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది రైతులు నష్టపోకుండా అగ్రి ల్యాబ్‌లు అండగా నిలుస్తున్నాయి. గతంలో నకిలీలదే రాజ్యం రాష్ట్రంలో ఏటా వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు కోసం 1.25 లక్షల లాట్స్ విత్తనాలు, 2.80 లక్షల బ్యాచ్‌ల పురుగు మందులు, 20 వేల బ్యాచ్‌ల ఎరువులు మార్కెట్‌కు వస్తుంటాయి. గతంలో వీటి నాణ్యతను పరీక్షించేందుకు రాష్ట్ర స్థాయిలో 11 ల్యాబరేటరీలు మాత్రమే అందుబాటులో ఉండేవి. పెస్టిసైడ్స్ కోసం 5, ఎరువులు, విత్తన పరీక్షల కోసం 3 చొప్పున ఉండేవి. మార్కెట్లోకి వచ్చే ఎరువుల్లో 30 శాతం, విత్తనాల్లో 3–4 శాతం, పురుగు మందుల్లో ఒక శాతానికి మించి శాంపిళ్లను పరీక్షించే సామర్ధ్యం వీటికి ఉండేదికాదు. దీంతో మార్కెట్లో నకిలీలు రాజ్యమేలేవి. ఏటా వీటి బారిన పడి రైతన్నలు ఆర్థికంగా వేల కోట్ల రూపాయల పెట్టుబడి నష్టపోయేవారు. నాణ్యమైన సాగు ఉత్పాదకాలను అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలో మరెక్కడా లేని విధంగా నియోజకవర్గ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయడంతో రైతుల్లో నమ్మకం, భరోసా కలిగింది. దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా ఏపీ ఇప్పటిదాకా తమిళనాడులో అత్యధికంగా 33 అగ్రీ ల్యాబ్స్ ఉండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి ఫలితంగా నియోజకవర్గ స్థాయిలో ల్యాబ్స్ ఏర్పాటుతో ఏపీని దేశంలో నంబర్ వన్ స్థానంలో నిలిపారు. ఒక్కొక్కటి రూ.6.25 కోట్లతో జిల్లా స్థాయిలో 10 ల్యాబ్స్, ఒక్కొక్కటి రూ.82 లక్షల నుంచి 90 లక్షల అంచనాతో నియోజకవర్గ స్థాయిలో 147 ల్యాబ్స్, రూ.75 లక్షలతో నాలుగు (విశాఖ, తిరుపతి, అమరావతి, తాడేపల్లిగూడెం) రీజనల్ కోడింగ్ సెంటర్స్, రూ.8.50 కోట్ల అంచనా వ్యయంతో గుంటూరులో డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీతో రాష్ట్ర స్థాయి ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. కాగా 2021 జూలై 8న రైతు దినోత్సవం రోజున 70 కేంద్రాలు, ఆ తర్వాత మరో 5 కేంద్రాలను ప్రారంభించగా, ఈ ఏడాది జూలై 8న మరో 52 ల్యాబ్‌ల సేవలు అందుబాటులోకి వచ్చాయి. మరో 20 ల్యాబ్స్ నిర్మాణ దశలో ఉన్నాయి. వీటికి అనుబంధంగా 154 ఇంటిగ్రేటెడ్ వెటర్నరీ, 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్‌ను ఏర్పాటు చేశారు. పరీక్షలన్నీ ఉచితమే ల్యాబ్‌లలో విత్తన మొలక శాతం పరీక్ష నివేదికను వారం రోజుల్లోపు ఇస్తున్నారు. పురుగు మందులు, ఎరువుల నాణ్యత నిర్థారణ రిపోర్టును 2–3 రోజుల్లోనే అందజేస్తున్నారు. రైతులు కాకుండా వ్యాపారులు, డీలర్లు, తయారీదారులు, ఇతరులు నాణ్యత ప్రమాణాల పరీక్ష నివేదిక కోసం ఎరువుల రకాన్ని బట్టి రూ.వెయ్యి నుంచి రూ.3 వేల వరకు, పురుగు మందులకు సంబంధించి రూ.3,500, విత్తనాల నివేదిక కోసం రూ.200 చొప్పున చెల్లించాలి. అదే రైతులకైతే పూర్తిగా ఉచితం. ప్రభుత్వమే ఈ వ్యయాన్ని భరించి రైతన్నకు తోడుగా నిలుస్తోంది. ఏటా 50 వేల శాంపిళ్ల చొప్పున ఇప్పటి వరకు 1,03,215 శాంపిళ్లను పరీక్షించారు. వీటిలో 11 వేల శాంపిళ్లు ఆర్బీకేల ద్వారా రైతులు పంపినవే. వీటిలో 1,884 నమూనాలు నాణ్యత లేనివిగా గుర్తించి వాటి తయారీ, అమ్మకం దారులపై చట్టపరంగా చర్యలకు ఆదేశించారు. అత్యాధునిక పరికరాలు నమూనాల పరీక్ష కోసం ప్రత్యేకంగా ఆటోమేటెడ్ క్వాలిటీ కంట్రోల్ యాప్ (ఇన్సైట్) అభివృద్ధి చేశారు. ఫలితాలను ట్యాంపర్ చేసేందుకు వీల్లేని రీతిలో ప్రతి లేబరేటరీలో ఆటోమేషన్ ఏర్పాటు చేశారు. టెస్టింగ్ చేసిన ప్రతి ఒక్కటి రికార్డు కావడంతో పాటు ఫలితాలు ఆటోమేటిక్‌గా సిస్టమ్‌లో నమోదవుతున్నాయి. ల్యాబ్‌లో ఏబ్యాచ్ శాంపిల్‌ను ఏ సమయంలో పరీక్షించారో ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా నమోదు అవుతోంది. షాపులో బ్యాచ్ నంబర్ చెక్ చేస్తే చాలు.. నాణ్యత సరి్టఫికెట్ ఉందో లేదో తెలిసిపోతుంది. ఇచ్చిన శాంపిల్స్‌కు టెస్టింగ్ జరిగిందో లేదో కూడా ట్రాక్ చేసుకోవచ్చు. జిల్లా ల్యాబ్‌లో గ్రో అవుట్ టెస్టింగ్ ఫెసిలిటీ కల్పించారు. ఇక్కడ మొక్కల జనటిక్ ఫ్యూరిటీ టెస్టింగ్ చేస్తున్నారు. రైతులు తెచ్చే నమూనాలకు ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదు. ప్రతి ల్యాబ్ లో ఒక అఫీషియల్ అనలిస్టు, ఇద్దరు జూనియర్ అనలిస్టులను ఏర్పాటు చేశారు. వీరికి అత్యాధునిక శిక్షణ ఇచ్చారు. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్‌ను సమీప ఆర్బీకేలతో అనుసంధానించారు. ఇన్పుట్స్ పరీక్షించుకునేలా రైతులను ప్రోత్సహించేలా ఆర్బీకేల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రీ ల్యాబ్‌ల ద్వారా ఏటా 50 వేలకు పైగా ఇప్పటి వరకు 1,03,215 విత్తన శాంపిళ్లను పరీక్షించారు. వీటిలో 11 వేల శాంపిళ్లు ఆర్బీకేల ద్వారా రైతులు పంపినవే. ఇందులో 1,884 నమూనాలు నాణ్యత లేనివిగా గుర్తించి వాటి తయారీ, అమ్మకందారులపై చట్టపరంగా చర్యలకు ఆదేశించారు. తద్వారా ఆయా రైతులు నష్టపోకుండా ముందస్తుగానే అడ్డుకున్నారు. రైతులకు సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు నష్టాలపాలవ్వకుండా చూశారు. అత్యుత్తమ ల్యాబ్‌గా కోరుకొండ నియోజకవర్గ స్థాయి ల్యాబ్‌లలో కోరుకొండ ల్యాబ్ నంబర్ వన్‌గా నిలిచింది. ల్యాబ్‌ల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ర్యాంకింగ్ ఇస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయాధికారి ఎస్.మాధవరావు కృషి ఫలితంగా ఆర్బీకేల ద్వారా రైతులకు అవగాహన కల్పించడంతో కోరుకొండ ల్యాబ్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ ల్యాబ్‌లో ఇప్పటి వరకు 1038 శాంపిల్స్ పరీక్షించారు. వీటిలో యాక్ట్ శాంపిల్స్‌లో 74 విత్తన, 26 ఎరువు శాంపిల్స్, ఆర్బీకే శాంపిల్స్‌లో 16 విత్తన, 35 ఎరువులు, రైతు శాంపిల్స్‌లో 716 విత్తన, 75 ఎరువులు, ట్రేడ్ శాంపిల్స్‌లో 66 విత్తన, 25 ఎరువు శాంపిల్స్ పరీక్షించారు. రైతు శాంపిల్స్‌లో 21 నమూనాలు నాణ్యతలేనివని గుర్తించారు. తద్వారా ఆయా రైతులు నష్టపోకుండా కాపాడగలిగారు. ల్యాబ్‌లలో పరీక్షలు ఇలా జిల్లా ల్యాబ్స్‌లో బీటీ, హెచ్‌టీ పత్తి జన్యు పరీక్షలు, తేమ, మొలక శాతం, విత్తన శక్తి బాహ్య స్వచ్ఛత తదితర అధునాతన విత్తన పరీక్షలతో పాటు ఎరువుల్లో నత్రజని, భాస్వరం, పొటాష్, సూక్ష్మ పోషకాలైన జింక్, ఇనుము, బోరాన్, కాల్షియం, మేగ్నీషియం వంటి పోషకాల నాణ్యత పరీక్షలు, పురుగు మందుల్లో క్రియాశీల పదార్థాలను పరీక్షిస్తున్నారు. నియోజకవర్గ స్థాయి ల్యాబ్స్‌లో విత్తనాల్లో మొలక శాతం, బాహ్య స్వచ్ఛత, ఎరువుల్లో నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి పోషకాల నాణ్యతను పరీక్షిస్తున్నారు. పురుగుల మందుల నమూనాలను జిల్లా ల్యాబ్స్‌కు పంపిస్తున్నారు. 4 కేటగిరిల్లో శాంపిల్స్ పరీక్ష.. యాక్ట్ శాంపిల్స్ : ఇవి ప్రతి మండల వ్యవసాయాధికారి మండలంలోని డీలర్ల దగ్గర, వారికి సందేహాస్పదంగా అనిపించిన శాంపిల్స్‌ను తీసి పంపిస్తారు. వీటిని ఆర్సీసీ కోడింగ్ వ్యవస్థ ద్వారా వివిధ ల్యాబ్స్లకు పంపి పరీక్షిస్తారు. ఆర్బీకే శాంపిల్స్ : ఆర్బీకే ద్వారా సరఫరా చేసే ఎరువులు, విత్తన శాంపిల్స్ ఫార్మర్ శాంపిల్స్ : రైతులు సొంతంగా, నేరుగా తెచ్చుకునే శాంపిల్స్ డీలర్ శాంపిల్స్: డీలర్లు నేరుగా పంపే శాంపిల్స్ డీలర్లలో భయం నేను 10 ఎకరాల్లో ఇటీవల కొత్తగా వచ్చిన వరి వంగడం ఎంటీయూ 1318 సాగు చేయాలనుకున్నా. కొత్త రకం కదా.. మొలక శాతం ఏలా ఉంటుందోననే ఆందోళనతో కోరుకొండ ల్యాబ్‌కు తీసుకొచ్చి పరీక్ష చేయించాను. మంచి ఫలితం వచ్చింది. నేను నారుమడి పోసి సాగు చేస్తున్నా. ఇప్పుడు ఈ ల్యాబ్‌ల వల్ల గతంలో మాదిరిగా డీలర్లు ఏది పడితే వాటిని మాకు అంటగట్టే ప్రయత్నం చేయడం లేదు. ల్యాబ్‌ల ఏర్పాటుతో ఇన్పుట్స్ క్వాలిటీపై రైతుల్లో మంచి అవగాహన వచ్చింది. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. – చిల్పారాశెట్టి అప్పలరాజు, శ్రీరంగపట్నం, కోరుకొండ మండలం, తూర్పుగోదావరి నాణ్యత ప్రమాణాలపై దృష్టి జిల్లా, నియోజకవర్గ స్థాయి ల్యాబ్ సేవలు దాదాపు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. వీటిలో అత్యాధునిక ఎక్యూప్మెంట్స్ అందుబాటులోకి తీసుకొచ్చాం. ల్యాబ్‌లలో నాణ్యతా ప్రమాణాలను మరింత మెరుగు పర్చేందుకు నాలుగు జోన్లుగా విభజించాం. విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, తిరుపతి, పల్నాడు జిల్లా వ్యవసాయాధికారులను ఈ జోన్లకు కస్టోడియన్ అధికారులుగా నియమించాం. వీరి సేవలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. – చేవూరు హరికిరణ్, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ -
కెమికల్ కిల్లింగ్స్!
వివిధ రసాయనాలు, పురుగుమందులు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని... ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 లక్షల మంది రసాయనాల కారణంగా మృతిచెందుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ఈ మేరకు ప్రజారోగ్యంపై రసాయనాల ప్రభావం పేరుతో తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. అంతర్జాతీయంగా జరిగే అన్ని రకాల మరణాల్లో 3.6 శాతం కెమికల్స్ ద్వారానే జరుగుతున్నాయని నివేదిక వివరించింది. ముఖ్యంగా భారత్‌లో పురుగుమందుల వల్లే ఏడాదికి 70 వేల ఆత్మహత్యలు జరుగుతుండటం ఆందోళనకరమని పేర్కొంది. – సాక్షి, హైదరాబాద్హృద్రోగాలే అధికం హృద్రోగాలే అధికం డబ్ల్యూహెచ్‌వో నివేదిక ప్రకారం... కెమికల్స్ వల్ల వచ్చే జబ్బుల్లో అత్యధికంగా 40% గుండె జబ్బులే ఉంటున్నాయి. అలాగే 20% దీర్ఘకాలిక ఊపిరితిత్తుల జబ్బులు, 15% కేన్సర్లు ఉంటున్నాయి. ఏటా లక్ష మంది పురుషుల్లో కెమికల్స్ వల్ల 35 మరణాలు సంభవిస్తుండగా అందులో 32 జబ్బులు దీర్ఘకాలిక జబ్బుల వల్లే జరుగుతున్నాయి. మహిళల్లో లక్షకు 17మంది కెమికల్స్ కారణంగా చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యల్లో 20% కెమికల్స్ ద్వారా, రైతు ఆత్మహత్యల్లో 30% కెమికల్స్ ద్వారా, 1.4% నిద్రమాత్రల వంటి మందులు వేసుకోవడమే కారణం. ఏయే రసాయనాల వల్ల ఎటువంటి జబ్బులు..? ఆర్సెనిక్, ఆస్బెస్టాస్, బెంజిన్, బెరీలియం, క్యాడ్మియం తదితర రసాయనాలు 2.9 శాతం కేన్సర్లకు కారణమవుతున్నాయి. ఆర్సెనిక్ భూగర్భ జలాల నుంచి వస్తుండగా బొగ్గు గనుల్లో పనిచేసే వారిలో ఆస్బెస్టాస్ చేరుతోంది. ధూమపానం, వాహన కాలుష్యం ద్వారా బెంజిన్ శరీరంలోకి ప్రవేశిస్తోంది. మురికినీరు లేదా కలుషిత జలాల్లో ఉండే చేపలు తినడం, అలాంటి నీటితో సాగు చేసే ఆలుగడ్డ, వరి, పొగాకు ద్వారా క్యాడ్మియం ఒంట్లోకి చేరుతోంది. సీసం వాడకాన్ని తగ్గించాలి... ప్రపంచవ్యాప్తంగా భారత్ సహా 41 శాతం దేశాలు సీసంపై చాలావరకు నియంత్రణ విధించాయి. అయినా పెయింటింగ్స్, వాహన ఇంధనాలు, నీరు, ఫుడ్ ప్యాకేజీలు, చిన్నారుల ఆట బొమ్మల్లో దాని వాడకం ఇంకా కొనసాగుతోంది. ఇది తీవ్ర అనారోగ్యానికి దారితీస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా వస్తువుల్లో సీసం వాడకాన్ని నివారించాలి. అన్ని రకాల రసాయనాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 లక్షల మంది చనిపోతున్నారంటే 16 సెకన్లకు ఒకరు మరణిస్తున్నారన్నమాట. – డాక్టర్ కిరణ్ మాదల,సైంటిఫిక్ కమిటీ కన్వీనర్, ఐఎంఏ, తెలంగాణ సీసంతో ఆరోగ్యానికి హాని.. కెమికల్స్ వల్ల హానిలో సగ భాగం సీసం అనే లోహం ద్వారానే జరుగుతోంది. సీసాన్ని పెయింటింగ్స్, ప్లంబింగ్ పనులతోపాటు స్మోకింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, మైనింగ్, ఐరన్, ఉక్కు తయారీ, ఆయిల్ రిఫైనింగ్‌లో, పెట్రోల్, విమాన ఇంధనాలు, కాస్మెటిక్స్, సంప్రదాయ మందులు, నగల తయారీ, సిరామిక్స్, ఎల్రక్టానిక్ వస్తువులు, వాటర్ పైప్‌లలో సీసం ఉంటోంది. కలర్ కోటింగ్‌తో కూడిన ఆహారాలు తినడం వల్ల గుండె జబ్బుల్లో 4.6 శాతం, కిడ్నీ జబ్బుల్లో 3 శాతం సీసం ద్వారా వస్తున్నాయి. చిన్నారుల్లో మూడో వంతు బుద్ధిమాంద్యం సీసం ద్వారా ఏర్పడుతోంది. పిల్లల్లో ఎక్కువగా పెయింటింగ్స్ ద్వారా సీసం వారిలో చేరుతుండగా ఐదేళ్లలోపు పిల్లల్లో సీసం కలిగించే దుష్ప్రభావం ఐదు రెట్లు ఎక్కువగా ఉంటోంది. సీసం కలిసిన వస్తువుల వాడకం వల్ల గర్భిణుల్లో ముందస్తు ప్రసవాలు లేదా అబార్షన్లు జరుగుతున్నాయి. -
ప్రకృతి సాగుకు ప్రాధాన్యం
రైతుల్ని నూరు శాతం ప్రకృతి సాగుబాట పట్టించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. తొలి దశలో జిల్లాకు ఒక మండలాన్ని ప్రకృతి సాగులో ఆదర్శ మండలంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మండలాల్లో రసాయన ఎరువులు, పురుగు మందులు వినియోగించే సన్న, చిన్నకారు రైతులను సంఘటితం చేసి వారికి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా సాగుచేస్తే కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తారు. కావాల్సిన ఇన్పుట్స్ తయారీలో రైతులకు శిక్షణ కూడా ఇవ్వడంతోపాటు సాగులో మెళకువలు నేర్పుతూ అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తారు. దశలవారీగా మండలంలో ప్రతి ఒక్కరూ ప్రకృతి సాగు చేపట్టేలా చర్యలు తీసుకుంటారు. మార్కెటింగ్, హెల్త్ అండ్ న్యూట్రిషన్, సైన్స్, పరివర్తన, యాజమాన్యం, సర్టీఫికేషన్, స్థానిక విలువ జోడింపు, వ్యవస్థాగత పరిశ్రమలు ఇలా అన్ని విభాగాలలో ఆ మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతారు. ఆదర్శ మండలాల్లో పౌష్టికాహారం అవసరమయ్యే వారందరికీ నూటికి నూరు శాతం ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురావడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ప్రతి గ్రామంలో ప్రకృతి ఉత్పత్తులను అందుబాటులో ఉంచడం ద్వారా పౌష్టికాహార లోపంతో బాధపడే వారి ఆహారంలో వాటిని భాగమయ్యేలా చూస్తారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అధ్యయనం చేస్తారు. మార్కెటింగ్ శాఖ ద్వారా రైతులు పండించిన ప్రకృతి ఉత్పత్తులను స్థానికంగా అమ్ముకునేలా చర్యలు తీసుకుంటారు. తొలుత గ్రామస్తులకు మంచి ఆహార ఉత్పత్తులు అందించేలా ప్రోత్సహిస్తారు. – సాక్షి, అమరావతి జిల్లాకో మండలం చొప్పున ఎంపిక 100% ప్రకృతి సాగుతో ఆదర్శ మండలంగా అభివృద్ధిఏడాది పొడవునా ఆదాయంవచ్చేలా పంటల ప్రణాళిక పాయింట్ పర్సన్లుగా సెర్ప్ఏపీఎంలు, సీసీలు రైతులే విక్రయించుకునేలా.. దళారుల పాత్ర లేకుండా రైతులే స్వయంగా పంట ఉత్పత్తులను రాష్ట్ర, జాతీయస్థాయి మార్కెట్లలో నేరుగా విక్రయించుకునేలా మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తారు. వివిధ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రైతులు పంట ఉత్పత్తుల్ని విక్రయించుకుని అదనపు ఆదాయం పొందేలా చూస్తారు. ఇటీవల కాలంలో అనంతపురం జిల్లాలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసే పలువురు రైతులు ఏడాది పొడవునా పంటల సాగు ద్వారా ప్రతినెలా క్రమం తప్పకుండా ఆదాయం వచ్చేలా ఏటీఎం (ఎనీ టైం మనీ) తరహా మోడల్‌ను అభివృద్ధి చేశారు. ఇదే మోడల్‌ను రాష్ట్రమంతా విస్తరించే దిశగా చర్యలు చేపట్టారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు బాధ్యతలు ఇందుకు సంబంధించిన కీలక బాధ్యతలను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)కు ప్రభుత్వం అప్పగించింది. సెర్ప్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ (ఏపీఎం), కమ్యూనిటీ కో–ఆర్డినేటర్ సీసీలు ఈ ప్రాజెక్టులో పాయింట్ పర్సన్‌గా వ్యవహరిస్తారు. వీరి సమన్వయంతో రైతు సాధికార సంస్థ సిబ్బంది ఎంపిక చేసిన మండలాల్లో సన్న, చిన్నకారు రైతులను గుర్తించి వారిని ప్రకృతి సాగు వైపు మళ్లించేందుకు అవసరమైన చేయూత ఇస్తారు. పాయింట్ పర్సన్స్‌గా ఎంపికైన ఏపీఎం, సీసీలకు రాష్ట్ర స్థాయిలో రెండ్రోజుల శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎంపికైన మండలాలివీ.. ఈ ప్రాజెక్ట్ కోసం పాతపట్నం (శ్రీకాకుళం), జీఎల్ పురం (పార్వతీపురం మన్యం), వేపాడ (విజయనగరం), పద్మనాభం (విశాఖపట్నం), చీడికాడ (అనకాపల్లి), పాడేరు (అల్లూరి), ప్రత్తిపాడు (కాకినాడ), ఐ.పోలవరం (కోనసీమ), గోకవరం (తూర్పు గోదావరి), పాలకొల్లు (పశ్చిమ గోదావరి), జీలుగుమిల్లి (ఏలూరు), బాపులపాడు (కృష్ణా), రెడ్డిగూడెం (ఎన్టీఆర్ ), కొల్లిపర (గుంటూరు), బెల్లంకొండ (పల్నాడు), మార్టూరు (బాపట్ల), కొత్తపట్నం (ప్రకాశం), దగదర్తి (నెల్లూరు), రామచంద్రపురం (తిరుపతి), శాంతిపురం (చిత్తూరు), చిన్నమందెం (అన్నమయ్య), పెండ్లిమర్రి (వైఎస్సార్), మడకశిర (శ్రీ సత్యసాయి), రాప్తాడు (అనంతపురం), ఓర్వకల్లు (కర్నూలు), ప్యాపిలి (నంద్యాల) మండలాలను ఎంపిక చేశారు. ప్రకృతి సాగులో ఆదర్శం జిల్లాకో మండలాన్ని ఎంపిక చేసి ప్రకృతి సాగులో ఆదర్శంగా తీర్చిదిద్దేలా కార్యాచరణ సిద్ధం చేశాం. సెర్ప్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టబోతున్నాం. తొలుత సిబ్బందికి, ఆ తర్వాత రైతులకు శిక్షణ ఇస్తాం. సాగులో అవసరమైన చేయూత అందిస్తాం. – బీవీ రామారావు, సీఈవో, రైతు సాధికార సంస్థ -
పుడమి తల్లికి తూట్లు!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : పుడమి తల్లి నిస్సారంగా మారిపోతోంది. చాలాకాలంగా నత్రజని, భాస్వరం, పొటాషియం తదితర రసాయన ఎరువులకు తోడు పురుగు మందులు వాడకం విపరీతంగా పెరిగిపోయింది. పంటల దిగుబడిని పెంచుకోవడానికి, క్రిమిసంహారానికి మోతాదుకు మించి వాడుతున్న రసా యన ఎరువులు, మందుల కారణంగా సారవంతమైన నేల కాస్తా గుల్ల అవుతోంది. రసాయన ఎరువుల వాడకం పుడమి కాలుష్యంతో పాటు, వాయు, నీటి కాలుష్యానికి కూడా దోహదపడుతోంది. ఒక టన్ను రసా యన ఎరువులను వినియోగిస్తే.. అందులో కేవలం మూడున్నర క్వింటాళ్ల రసాయన ఎరువులను మాత్రమే పంటలు స్వీకరిస్తాయని, మిగిలిందంతా పుడమిలోకి ఇంకిపోవడం, వర్షాలు పడినప్పుడు చెరువులు, నదులు, వాగులు, ఇతర నీటి వనరుల్లోకి వెళ్లిపోవడం జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని దేశాలతో పోల్చిచూస్తే..మన దేశంలో వీటి విని యోగం తక్కువగా ఉన్నా.. ప్రస్తుతం వాడుతున్న ఈ రసాయన ఎరువుల వల్ల పర్యావరణంపైనా తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఆర్గానిక్‌తో మేలు.. ♦ దిగుబడి పెంచుకోవడానికి వినియోగించే ఎరువుల్లో ఆర్గానిక్, ఇనార్గానిక్ అనే రెండు రకాలు ఉన్నాయి. ఆర్గానిక్ ఎరువులు ప్రకృతి సిద్ధమైనవి. పంట వ్యర్థాలు, మొక్కలు, జంతువుల వ్యర్థాలు, మునిసిపల్ వ్యర్థాల నుంచి వచ్చే ఎరువులను ఆర్గానిక్ ఎరువులుగా పరిగణిస్తారు. ఆర్గానిక్ ఎరువుల వాడకం వల్ల భూసారం పెరగడంతో పాటు, వాన పాములు, సూక్ష్మజీవుల పునరుత్పత్తికి దోహద పడుతుంది. ఇక రసాయనాలను వినియోగించి తయారు చేసేవే ఇనార్గానిక్ ఎరువులు. పంటల ఎదుగుదలకు నత్రజని ఉపయోగపడుతుంది. ఫాస్ఫేట్ మొక్కలకు ముఖ్యమైన పోషక విలువలను అందిస్తుంది. వీటితో పాటు పొటాషియం భూమిలో నీటి సామర్థ్యాన్ని, భూ సాంద్రతను పెంచుతాయనే వాదన ఉన్నా.. ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిలోని ఆమ్లాలు చర్మంపైన, శ్వాసపైనా ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. సేంద్రీయ సేద్యం పెరుగుతున్నా దేశంలో సేంద్రీయ సేద్యం పెరుగుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించే గణాంకాలు చెబు తున్నా.. రసాయన ఎరువుల వాడకం కూడా విపరీతంగా పెరిగిపోవడం ఆందోళన కలి గించే అంశం. మన దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలు రసాయన ఎరువుల వాడకంలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ ఎరువులు భూమిలో ఉండే సూక్ష్మక్రిములను చంపే యడంతో భూమి తన సారాన్ని కోల్పోతోందని నిపుణులు చెబుతున్నారు. పంటల దిగు బడి కోసం శాస్త్రీయ ఎరువులు వినియోగించకుండా కేవలం రసాయన ఎరువులు, పురుగుమందులు వాడటం వల్ల భూసారం తగ్గి, తదనంతర కాలంలో పంటల దిగుబడులు గణనీయంగా తగ్గుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దశాబ్ద కాలంలో రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం దాదాపు 50% మేరకు పెరిగినట్లు అగ్రికల్చర్ ఇన్పుట్ సర్వే వెల్లడిస్తోంది. చైనాలో హెక్టార్‌కు 13.06 కిలోలు చైనా ఒక హెక్టార్‌కు 13.06 కిలోల పురుగు మందులు వాడుతుంటే, జపాన్ 11.85 కిలోలు, బ్రెజిల్ 4.57 కిలోలు వినియోగిస్తున్నాయి. లాటిన్ అమెరికా దేశా ల్లోనూ ఇలాంటి మోతాదుల్లోనే వినియోగిస్తున్నారని సమాచారం. మన దేశంలో అత్యధికంగా పంజాబ్‌లో ప్రతి హెక్టార్‌కు 0.74 కిలోలు వినియోగిస్తున్నారు. పంజాబ్, హరియాణాలు పంటల దిగుబడి కోసం అత్యధికంగా రసాయన ఎరువులు వినియోగి స్తున్నట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. హరియాణాలో 0.62 కిలోలు, మహారాష్ట్రలో 0.57 కిలోలు, కేరళలో 0.41 కిలోలు, ఉత్తరప్రదేశ్‌లో 0.39 కిలోలు, తమిళనాడులో 0.33 కిలోల రసాయన ఎరువులు వాడుతున్నారు. జాతీయ సగటు 0.29 కిలోలుగా ఉంది. జాతీయ సగటు కంటే తెలుగు రాష్ట్రాల్లో వినియోగం తక్కువగా ఉన్నట్లు ఆ గణాంకాలు పేర్కొంటున్నాయి. యూరియానే అత్యధికం.. ఎరువుల్లో యూరియా వినియోగం ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. రైతులు అవసరానికి మించి యూరియా వాడుతున్నారని, ఒక బస్తా యూరియా వేయాల్సిన చోట పంట ఎదుగుదల, దిగుబడి కోసం రెండు మూడు బస్తాలు వినియోగిస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల కంటే దీని ధర తక్కువగా ఉండడం, కేంద్ర ప్రభుత్వం సైతం యూరియాపై ఎక్కువ సబ్సిడీ ఇవ్వడం వల్ల రైతులు ఎక్కువగా యూరియా వినియోగిస్తున్నట్లు అధికారవర్గాల సమాచారం. యూరియాపై కేంద్రం దాదాపు 75 శాతం మేరకు సబ్సిడీ అందిస్తుంటే.. డీఏపీ లాంటి ఎరువులపై 35 శాతం మాత్రమే ఇస్తోంది. భూసార పరీక్షల ఆధారంగా వాడాల్సి ఉన్నా.. భూసార పరీక్షల నిర్వహణ ద్వారా ఏయే భూములకు ఎలాంటి పోషకాలు కావాలి, అవి ఏయే రసాయన ఎరువుల్లో ఉంటాయో తెలుసుకుని, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు వాడాల్సి ఉన్నా.. రైతులు ఇవేమీ పట్టించుకోవడం లేదు. తమకు తెలిసిన ఎరువులను యథేచ్ఛగా వాడుతున్నారు. తద్వారా ఒక్కోసారి ఆశించిన స్థాయిలో దిగుబడి రాక తీవ్రంగా నష్టపోతున్నారు. పత్తి, వరి, గోధుమ, చెరకు పంటలకు ఎక్కువగా పురుగుల మందులు వాడుతున్నారు. పంజాబ్‌లో కేన్సర్, కిడ్నీ సంబంధిత సమస్యలు రసాయన ఎరువుల అధిక వినియోగంతో ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో నష్టాలు పెరుగుతున్నాయి. ప్రత్యక్షంగా చూస్తే.. నత్రజని కాలుష్యం పెరగడం వల్ల ఆహార ఉత్పత్తుల ద్వారా కేన్సర్, కిడ్నీ సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. పంజాబ్‌లో ఈ సమస్య తీవ్రస్థాయికి చేరింది. కొంతకాలం ఎరువుల వినియోగం తర్వాత భూమి లోపల ఉండే బ్యాక్టీరియా చచ్చిపోయి, కార్బన్, మినరల్స్ వంటివి పోయి ఈ రసాయనాలే డామినేట్ చేస్తాయి. మొక్కకు సహజ సిద్ధమైన బలం చేకూరకుండా నేరుగా రసాయనాలే ప్రభావితం చేస్తాయి. పంటల వైవిధ్యం కూడా దెబ్బతింటుంది. రెండు, మూడు పంటలు వచ్చే ఉమ్మడి నల్లగొండ పరిధిలోని మిర్యాలగూడ, తదితర ప్రాంతాల్లో వరి పొలాల్లో విపరీతంగా యూరియా ఇతర రసాయనాల వినియోగం కారణంగా నేల మొత్తం రసాయనాలే నిండిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సమస్యను అధిగమించాలంటే రసాయనేతర ఎరువులైన ఆవు, ఇతర జంతువుల పేడ, గృహాల నుంచి వచ్చే చెత్తతో తయారుచేసిన ఎరువుల వినియోగం పెంచాలి. – డా. దొంతి నర్సింహారెడ్డి, వ్యవసాయరంగ నిపుణులు, పాలసీ అనలిస్ట్ రసాయన, సేంద్రీయ కాంబినేషన్ మంచిది రసాయన ఎరువుల అధిక వాడకం వల్ల భూమి తన నిజ స్వరూపం, సారాన్ని కోల్పోతుంది. భూమిలో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ కూడా చనిపోతాయి. ఎరు వులు వాడితే మొక్కల్లో నీటి నిల్వశాతం కూడా తగ్గు తుంది. వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. మొక్క కు రసాయన ఎరువు, సేంద్రీయ ఎరువులు కాంబినేషన్‌గా అందించాలి. ఉదాహరణకు మొత్తం పది బస్తాల ఎరువులు వినియోగిస్తామను కుంటే.. అందులో ఆరు బస్తాలు రసాయన ఎరువులు, 4 బస్తాల సేంద్రీయ ఎరువులు ఉండేలా చూడాలి. దీనితో సమతుల్యత ఉంటుంది. పురుగుల మందుల వల్ల బీపీ, షుగర్, కిడ్నీ పేషంట్లు పెరుగుతున్నారు. – కె.రాములు ఎండీ, ఆగ్రోస్ లిమిటెడ్ సబ్సిడీలు తగ్గించుకునేందుకే.. కేంద్ర ప్రభుత్వం పీఎం ప్రణామ్లో భాగంగా ఎరువుల వినియోగం తగ్గించడం ద్వారా రైతులకిచ్చే సబ్సిడీలు కూడా తగ్గిస్తోంది. శ్రీలంక తరహాలో సేంద్రీయ వ్యవసాయం ప్రోత్సహించాలని చూస్తోంది. సేంద్రీయ, రసాయన ఎరువులు కలగలిపి ఉపయోగించడం ద్వారా సేంద్రీయ వ్యవసాయం చేయాలి. కానీ ఒక్క సేంద్రీయ లేదా రసాయన ఎరువుల వాడకంతో పంటలు పండవు. చైనా, అమెరికాతో పోల్చితే భారత్‌లో తక్కువగానే ఎరువులు వాడుతున్నారు నిజమే. అయితే చైనాలో హెక్టార్‌కు 80 క్వింటాళ్లు, అమెరికాలో 60 క్వింటాళ్లు పండిస్తున్నారు. కానీ మన దేశంలో 25 క్వింటాళ్లే దిగుబడి వస్తోంది. 1991లో మనం ఎగుమతులు చేసే దశ నుంచి, ప్రస్తుతం వ్యవసాయ ఉత్పత్తులు సహా, పాలు, పాల ఆధారిత ఉత్పత్తులు, మాంసం, నూనెలు, పప్పుధాన్యాలు, పంచదార వంటివి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్ దిగుమతులకు డంపింగ్ కేంద్రంగా మారింది. భారత్‌లో ఉత్పత్తులను దెబ్బతీసి దిగుమతులపై ఆధారపడేలా చేసే ధనిక దేశాల ప్రయత్నాలకు కేంద్రం లొంగిపోతోందనడానికి ఇదో ఉదాహరణ. – సారంపల్లి మల్లారెడ్డి, రైతుసంఘం నేత, వ్యవసాయ నిపుణులు -
పాలీహౌస్‌ల కోసం రోబోటిక్ స్ప్రేయర్
సాక్షి, అమరావతి: ఎరువులు, పురుగు మందుల పిచికారీకి సాంకేతిక పరిజ్ఞానం జోడించడమే లక్ష్యంగా వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ అనుబంధ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు రోబోటిక్ స్ప్రేయర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని సాయంతో పాలీహౌస్, గ్రీన్ హౌస్‌లలో ద్రవ రూప ఎరువులు, పురుగు మందులను మానవ రహితంగా పిచికారీ చేయొచ్చు. పంటల వారీగా శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకే నానో యూరియా, పురుగు మందులను ఈ పరికరం పిచికారీ చేస్తుంది. దీనిద్వారా 20 శాతం యూరియా, పురుగుల మందుల వినియోగం తగ్గడంతోపాటు పెట్టుబడి ఖర్చులు 25 శాతం వరకు ఆదా అవుతాయని క్షేత్రస్థాయి అధ్యయనంలో గుర్తించారు. దిగుబడుల్లో నాణ్యత పెరగడంతోపాటు పంట ఉత్పత్తుల్లో రసాయన అవశేషాల ప్రభావం ఉండదని కూడా తేల్చారు. ప్రత్యేకతలివీ.. ♦ ఈ పరికరం రిమోట్ కంట్రోల్‌తో కిలోమీటర్ మేర పనిచేస్తుంది. ♦ ముందుగా కావాల్సిన రసాయన ఎరువు లేదా పురుగు మందులను తొట్టిలో వేసుకుని మెషిన్ ఆన్ చేసి రిసీవర్, ట్రాన్స్‌మీటర్‌ను కనెక్ట్ చేసుకోవాలి. ♦ రిమోట్ ద్వారా కమాండ్ సిగ్నల్స్‌ను అందిస్తే ఇది పని చేసుకుంటూ పోటుంది. రిమోట్ ద్వారా మెషిన్ దిశను మార్చుకోవచ్చు. ♦ కంట్రోలర్ బటన్ ద్వారా మెషిన్ వేగం, స్ప్రేయర్ పీడనం మార్చుకోవచ్చు. ♦ మొక్క ఎత్తును బట్టి నాజిల్స్ను మాన్యువల్‌గా సర్దుబాటు చేసుకోవచ్చు. ♦ పురుగు మందులను ఏకరీతిన సరైన పరిమాణంతో ఆకుల మీద పడేలా చేయటం దీని ప్రత్యేకత. ♦ తక్కువ మోతాదులో వినియోగించడం వల్ల పురుగు మందుల వృథాతో పాటు భూగర్భ జలాలు కలుషితం కాకుండా అడ్డుకోవచ్చు. ♦ 10–20 లీటర్ల లిక్విడ్ యూరియా, పురుగుల మందులను మోసుకెళ్తూ నిమిషానికి 6 లీటర్లను పిచికారీ చేయగల సామర్థ్యం ఈ పరికరానికి ఉంది. కృత్రిమ మేధస్సుతో.. కృత్రిమ మేధస్సుతో పనిచేసే పరికరాలు, మొబైల్ అప్లికేషన్స్, సెన్సార్లు, డ్రోన్స్, ఆటోమేటిక్ యంత్ర పరికరాలు, వివిధ సాఫ్ట్వేర్స్ రూపకల్పన కోసం ఆదికవి నన్నయ, జేఎన్టీయూకే, ఎన్ఐటీలతో ఒప్పందాలు చేసుకున్నాం. ఇందులో భాగంగా ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ప్రోటోటైప్ రోబోటిక్ స్ప్రేయర్‌ను అభివృద్ధి చేశారు. ఇందులో మార్పుచేసి మరింత అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. ఇమేజ్ ప్రాసెసింగ్ ద్వారా మొక్కల వ్యాధులు, తెగుళ్లను గుర్తించడంపైనా పరిశోధనలు జరుగుతున్నాయి. – డాక్టర్ తోలేటి జానకిరామ్, వీసీ, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ -
సాగులో మితి మీరుతున్న పురుగు మందులు
సాగులో మితి మీరుతున్న పురుగు మందులు -
ఆగని ‘మాస్టర్‌ప్లాన్’ మంటలు
జగిత్యాల రూరల్: జగిత్యాల జిల్లాకేంద్రంలో మాస్టర్‌ప్లాన్ – 2041 మంటలు ఇంకా కొనసాగుతున్నాయి. పట్టణ సమీప గ్రామాల్లోని తమ వ్యవసాయభూములను రిక్రి యేషన్, ఇండస్ట్రియల్, సెమీ పబ్లిక్జోన్లలో చే ర్చుతూ ముసాయిదా మాస్టర్‌ప్లాన్ ప్రకటించారని రైతులు భగ్గుమంటున్నారు. వారంరోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం కూడా రైతులు పెద్దఎత్తున తరలివచ్చి జగిత్యాల నలువైపులా రహదారులను దిగ్బంధించారు. రోడ్లపైన వంటావార్పు నిర్వ హించారు. తాము పండించిన మక్కకంకులను విక్రయిస్తూ, ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేస్తూ నిరసన తెలిపారు. హుస్నాబాద్ శివారులోని జగిత్యాల–నిజామాబాద్ ప్రధాన రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కొందరు మహిళారైతులు పురుగుమందు డబ్బాలు వెంట తెచ్చుకున్నారు. మాస్టర్‌ప్లాన్ నుంచి తమ భూములను తొలగించకుంటే ఆత్మహత్య చేసుకుంటామంటూ అధికారులను హెచ్చరిస్తూ. మందు తాగేందుకు యత్నించగా, అక్కడే ఉన్న పోలీసులు పురుగుమందు డబ్బాలను లాక్కున్నా రు. మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత అన్నిచోట్ల ధర్నాలను ఉపసంహరించుకున్నారు. -
పురుగుమందుల వాడకంపై టార్గెట్లు వద్దు
మాంట్రియల్: ప్రపంచవ్యాప్తంగా పంట సాగులో పురుగుమందుల వాడకాన్ని తగ్గించే క్రమంలో లక్ష్యాలు విధించడం సరికాదని భారత్ పేర్కొంది. పెస్టిసైడ్స్ వాడకంపై విచక్షణను ఆయా దేశాలకే వదిలివేయాలని సూచించింది. వ్యవసాయరంగానికి సబ్సిడీలు ఇవ్వడాన్ని సమర్థించింది. జీవ వైవిధ్యంపై కెనడాలోని మాంట్రియెల్‌లో జరుగుతున్న 15వ కాన్ఫరెన్స్ ఆన్ పార్టీస్(కాప్15) ఉన్నత స్థాయి సదస్సులో శుక్రవారం కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ మాట్లాడారు. పురుగుమందుల వాడకం తగ్గింపు విషయంలో ప్రపంచ దేశాలపై సంఖ్యాత్మక లక్ష్యాలను విధించడం తగదన్నారు. ఆ అంశాన్ని ఆయా దేశాలకే వదిలివేయాలని అభిప్రాయపడ్డారు. 2030 నాటికి పంటలపై పురుగు మందుల వాడకాన్ని మూడింట రెండొంతులకు తగ్గించాలన్న గ్లోబల్ బయో డైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్ లక్ష్యంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ జనాభాలో 17% భారత్‌లోనే ఉండగా, కేవలం 2.4% భూభాగం, 4% నీటి వనరులు మాత్రమే ఉన్నాయన్నారు. అయినప్పటికీ, జీవవైవిధ్యాన్ని పరిరక్షించే ప్రయత్నంలో ముందుకు సాగుతున్నామన్నారు. ఎరువులు, పురుగుమందులు సహా వ్యవసాయ రంగంపై భారత ప్రభుత్వం ఏటా 2.2 లక్షల కోట్లను సబ్సిడీగా ఇస్తున్నట్లు ఒక అంచనా. కాప్15 సదస్సుకు 196 దేశాల నుంచి 20 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. -
పురుగు మందుల అవశేషాలకు చెక్
సాక్షి, అమరావతి: తాగునీటిలో ఉండే పురుగు మందుల అవశేషాలను గుర్తించే అత్యాధునిక నీటి పరీక్షల ల్యాబొరేటరీలు రాష్ట్రంలో అందుబాటులోకి రానున్నాయి. క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులకు కారణమయ్యే లెడ్, మెర్క్యురీ, క్రోమియం వంటి లోహాలు తాగునీటిలో సూక్ష్మస్థాయిలో ఉన్నా ఈ అత్యాధునిక ల్యాబ్‌లు పసిగట్టేస్తాయి. గ్రామీణ ప్రజలు తాగునీటికి ఉపయోగించే బోరు బావులతోపాటు ప్రభుత్వ రక్షిత మంచినీటి పథకాల్లోని నీటి నమూనాలను గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) ఆధ్వర్యంలో ఏటా రెండుసార్లు సేకరించి, నీటి నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఇందుకు గాను రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయిలో మొత్తం 112 నీటి పరీక్షా కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటిలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, పాలకొల్లుతోపాటు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, రాజమండ్రిలోని నీటి పరీక్షా కేంద్రాలను ఒక్కొక్కటీ రూ.6 కోట్లతో ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆధునికీకరించింది. వీటిలో వినియోగించే అత్యాధునిక యంత్ర సామగ్రిని అమెరికా నుంచి దిగుమతి చేసుకుంది. ల్యాబ్‌ల నిర్వహణ సైతం అమెరికన్ సంస్థ ఆధ్వర్యంలోనే కొనసాగుతుంది. 4 ల్యాబ్‌ల ఏర్పాటు పూర్తయి, ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృష్ణారెడ్డి తెలిపారు. మరో 4 ల్యాబ్‌ల ఆధునికీకరణకు ప్రతిపాదన జోన్ల వారీగా రాష్ట్రంలో మరో నాలుగు నీటి పరీక్షల ల్యాబ్‌లను కూడా ఈ తరహాలోనే ఆధునికీకరించేలా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు సంబంధించి విశాఖలో, రాయలసీమ నాలుగు జిల్లాలకు సంబంధించి కడపలో, విజయవాడలో ఒకటి, ప్రకాశం జిల్లాలో మరొకటి ఈ తరహా అత్యాధునిక ల్యాబ్‌ల ఏర్పాటుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏలూరు ఘటన తర్వాత సీఎం ఆదేశాల మేరకు సుమారు ఏడాది క్రితం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రాంతంలో అంతుచిక్కని సమస్యతో ఒకే రోజున పెద్ద సంఖ్యలో ప్రజలు అనారోగ్యం బారినపడ్డారు. పురుగు మందుల అవశేషాలతో కూడిన నీటిని తాగడం వల్లే ఆ సమస్య ఉత్పన్నమై ఉండొచ్చని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో వ్యవసాయ రంగంలో పురుగు మందుల వాడకం పెరగడం వల్ల నీటి కాలుష్యానికి ఎక్కువగా అవకాశం ఉందన్న అంశాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అయితే, తాగునీటిలో దాగి ఉండే పురుగుమందుల అవశేషాలను, మెర్క్యురీ వంటి ప్రమాదకర సూక్ష్మస్థాయి మెటల్స్ను గుర్తించడానికి నీటి పరీక్ష కేంద్రాలు ఇప్పటివరకు రాష్ట్రంలో అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యాధునిక నీటి పరీక్షల ల్యాబ్‌ల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు మొదటగా నాలుగు ల్యాబ్‌లను ఆధునికీకరించారు. -
నమ్మిన చేలోనే ‘రుణం’ తీరిపోయె..
టేకుమట్ల: ఎన్నో ఆశలతో వేసిన మిర్చి పంటకు తెగులు సోకింది. తెచ్చిన అప్పులు మీద పడటంతో ఓ రైతు ఆ చేనులోనే పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా, టేకుమట్ల మండలం సుబ్బక్కపల్లిలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సిద్దూరి రవీందర్రావు (52) అనే రైతు గత ఏడాది తనకున్న రెండున్నరెకరాల భూమితోపాటు, మరో రెండెకరాలను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశాడు. దిగుబడులు రాకపోవడంతో రూ.8 లక్షల మేర అప్పు అలానే ఉండిపోయింది. ఈ సంవత్సరం తనకున్న రెండున్నరెకరాల్లో మిర్చి సాగు చేయగా కొన్ని రోజులుగా కుచ్చు తెగులు, తామర పురుగుతో పంట మొత్తం ఎదుగుదల లోపించింది. ఈ పంట కోసం లక్షల్లో పెట్టుబడి పెట్టినా ఫలితం లేకపోగా, మరిన్ని అప్పులు పెరగడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి మిర్చి చేనులోకి వెళ్లి పురుగు మందు తాగాడు. తాను చనిపోతున్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే కుటుంబ సభ్యులు చేను వద్దకు చేరుకుని పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్ఐ వినయ్‌కుమార్ పంచనామా చేసి మృతదేహాన్ని చిట్యాల మార్చురీకి పంపించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: కేవలం వారాల వ్యవధిలోనే శర వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి: సీడీసీ హెచ్చరిక -
మిర్చి పంటకు ‘తామర పురుగు’ముప్పు అందుకే! ఈ జాగ్రత్తలు తీసుకుంటే..
Pesticides For Thamara Purugu Damage In Chilli Cultivation: మిరప పంట రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 4.5 లక్షల హెక్టార్లలో సాగవుతోంది. రసాయనిక వ్యవసాయంలో ఏకపంటగా సాగవుతున్న ఈ పంటకు సాధారణంగా చీడపీడల బెడద ఎక్కువే. పురుగుమందులను విస్తృతంగా పిచికారీ చేస్తున్నప్పటికీ భూతాపోన్నతి కారణంగా కొత్తరకం చీడపీడలూ కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ‘మిరప పంటలో పూలను ఆశించే తామర పురుగులు’ మొట్ట మొదటి సారిగా గత ఏడాది జనవరి – ఫిబ్రవరిలో గుంటూరు జిల్లాలో కనిపించాయి. ఈ ఏడాది రెండు, మూడు నెలలు ముందే గుంటూరు, కృష్ణా, ప్రకాశం, కర్నూలు తదితర జిల్లాల్లో విజృంభించాయి. వేలాది ఎకరాల్లో మిర్చి పంట పైముడతతో నాశనం అవుతున్నాయి. భారీగా పెట్టుబడులు పెట్టిన రైతుల ఆశలు నిలువునా నేల రాలిపోతున్నాయి. కొందరు మిర్చి తోటలు పీకేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల మిర్చి తోటల్లో, దేశవాళీ మిరప రకాలు సాగు చేస్తున్న పొలాల్లో పరిస్థితి ఉన్నంతలో మెరుగ్గా ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం నిపుణులు, ప్రకృతి వ్యవసాయ నిపుణులతో ‘సాక్షి సాగుబడి’ ముచ్చటించింది. ఇవి కొత్త రకం తామర పురుగులు! ►గత సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలల్లో మొట్ట మొదటిసారిగా గుంటూరు జిల్లాలో మిరప పంట పండించే రైతులు పూతను ఆశించే తామర పురుగులను గమనించారు. ఈ సంవత్సరం ముందుగా మిరప పంట వేసిన పొలాల్లో ఈ పురుగులను గమనించాం. పూతను ఎక్కువ సంఖ్యలో ఈ పురుగులు ఆశించి పూత రాలిపోయి, కాయగా మారకపోవడం వలన తీవ్రంగా నష్టపోతామని రైతులు తీవ్ర ఆందోళనలో వున్నారు. ►సాధారణంగా మిరప పంటలో తామర పురుగులు అన్ని దశల్లోనూ ఆశిస్తుంటాయి. తద్వారా ఆకులు అంచుల వెంబడి పైకి ముడుచుకోవడం వలన ‘పై ముడత’ అని అంటారు. ఈ పురుగును నివారించుకోవడానికి రైతు స్పైనోసాడ్ (ట్రేసర్), ఫిప్రోనిల్ (రీజెంట్), డయాఫెన్ థయురాన్ (పెగాసస్), ఇంటర్ ప్రిడ్, ఎసిటామిప్రిడ్, క్లోరోఫెన్ పిల్ లాంటి మందులను వారం రోజుల వ్యవధిలో ఒకసారి లేదా రెండు సార్లు పిచికారీ చేయడం ద్వారా నివారించడం జరుగుతుంది. కానీ, ఈ కొత్త రకం తామర పురుగులు వాటికి భిన్నంగా ముదురు నలుపు రంగులో వుండి.. ఎలాంటి పురుగు మందులకు లొంగకుండా.. విపరీతంగా పూతను ఆశించి నష్టపరుస్తుండటం వలన రైతులు ఒత్తిడికి లోనవుతున్నారు. చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం.. రైతులు తక్షణం తీసుకోవలసిన జాగ్రత్తలు: ►రైతులు ఆందోళనతో విపరీతంగా మందులు కొట్టడం వలన ఈ తామర పురుగులో గుడ్లుపెట్టే సామర్థ్యం ఎక్కువైనట్లు గమనించాం. కాబట్టి, సింథటిక్ పైరిత్రాయిడ్ మందులను, స్పైనోసాడ్, ప్రొఫెనోఫాస్, ఇమిడాక్లోప్రిడ్ లాంటి మందులు ఎక్కువ సార్లు పిచికారీ చేయకుండా వుండాలి. ►రైతులు సామూహికంగా ఎక్కువ సంఖ్యలో జిగురు పూసిన నీలిరంగు, పసుపురంగు అట్టలను పొలంలో పెట్టుకోవడం ద్వారా వీటి తల్లిపురుగులను నివారించుకునే అవకాశముంది. ►ఇవి మనం వాడే అన్ని రకాల పురుగుమందులను తట్టుకునే సామర్థ్యం కలిగి వున్నందున.. పురుగు మందుల ద్వారా వీటిని నివారించడం కష్టం. ►ప్రస్తుతం మనకు అందుబాటులో వున్న పురుగు మందుల ద్వారా పిల్ల పురుగులను సులువుగా నివారించవచ్చు. కానీ, తల్లి పురుగులను నివారించడం చాలా కష్టం. ►తల్లి పురుగులు గుడ్లు పెట్టకుండా నివారించడం కోసం వేప సంబంధిత పురుగు మందులను పిచికారీ చేసుకోవాలి. దీనికి గాను వేప నూనె 10,000 పి.పి.యం సేకరించాలి. లీటరు నీటికి 3 మి.లీ. మరియు 0.5 గ్రా. సర్ఫ్ గాని ట్రైటాన్ – 100 గాని కలిపి పిచికారీ చేసుకోవాలి. ►బవేరియా బస్సియానా, లికానిసిలియం లికాని అనే జీవ శీలింద్ర నాశినిలను వాడుకోవచ్చు (5 గ్రా./ లీటరు నీటికి కలిపి దీనితో పాటు ట్రైటాన్ 100 0.5 గ్రా.ను కూడా కలపాలి). ►అందుబాటులో వున్న పురుగు మందులు: ఎసిటామిప్రిడ్ (ప్రైడ్) 40 గ్రా. నుండి 50 గ్రా./ఎకరానికి లేదా సైయాంట్రనిలిప్రోల్ (బెనీవియా) 240 మి.లి./ఎకరానికి లేదా ఫిప్రోనిల్ 80 ఔ+40 గ్రా. నుండి 50 గ్రా./ఎకరానికి లేదా పోలిస్ (40% ఇమిడాక్లోప్రిడ్ + ఫిప్రోనిల్ 40% ఔ+ 40 గ్రా. నుండి 50 గ్రా./ఎకరానికి) మార్చి మార్చి నాలుగు రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. ►మిరప రైతులు పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి అవసరం మేరకే వాడుకోవలసిన అవసరం చాలా వుంది. లేదంటే ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందనటంలో సందేహం లేదు. ►పొలంలో అక్కడక్కడా ప్రొద్దుతిరుగుడు మొక్కలను అకర్షక పంటగా వేసుకోవాలి. ►విత్తనం, మొక్కలను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలించేటప్పుడు జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతైనా వుంది. ఈ పరిస్థితులను ఎదుర్కోవటానికి పరిశోధనలు పురోగతిలో వున్నాయి. – డా. ఆర్.వి.ఎస్.కె. రెడ్డి, పరిశోధనా సంచాలకులు, డా.వై.యస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెం, ప.గో. జిల్లా dir-research@drysrhu.edu.in చదవండి: యాహూ! వందకు 89 మార్కులు.. 104 ఏళ్ల బామ్మ సంతోషం!! -
Drone: ఎకరాకు 6 నిమిషాల్లో మందుల పిచికారీ
మామూలుగా పంట చేనుకు రైతులు ఎరువులు, క్రిమిసంహారక మందులు చల్లుతారు. అయితే దీనికి అధిక సమయం తీసుకోవడమే గాక, కూలీలకు డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఈ ఇబ్బందులను అధిగమించడానికి రైతులు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకోవాలని జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి సూచించారు. డ్రోన్‌తో ఎకరాకు కేవలం రూ.550 తోనే 6 నిమిషాల్లో మందుల పిచికారీ పూర్తవుతుందని తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రం సమీపంలో రంగధాంపల్లిలో ఉన్న తన పొలంలో డ్రోన్‌తో మందును పిచికారీ చేయించారు. జిల్లా రైతులంతా ఈ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సూచించారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట -
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రేమికుల మృతి
సాక్షి, నల్లగొండ: రెండేళ్లుగా ప్రేమించుకున్న ప్రేమికులు విడిపోయి ఉండలేక మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో జరిగింది. ట్రైనీ ఎస్ఐ శోభన్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొం డ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండలం తెట్టెకుంటకు చెందిన మట్టిపల్లి దుర్గయ్య, సాలమ్మ దంపతులకు నలుగురు సంతానం. అందులో మొదటివాడు మట్టిపల్లి కొండలు (22) హాలియాలోని ఓ వస్త్ర దుకాణంలో పని చేసేవాడు. అదే గ్రామానికి చెందిన ఉగ్గిరి నాగయ్య, సైదమ్మ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. మొదటి కుమార్తె ఉగ్గిరి సంధ్య(20) ఇంటర్మీడియెట్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటోంది. కొండలు, సంధ్య రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సంధ్యకు పీఏ పల్లి మండలం ఘనపురం గ్రామానికి చెందిన మేనత్త కుమారుడితో ఈ నెల 22న నిశ్చితార్థం కాగా. వచ్చేనెల 11న పెళ్లి జరగాల్సి ఉంది. ఉరివేసుకుందామని భావించి.. 22వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో సంధ్య.. కొండలు ఇంటికి వచ్చింది. ఇద్దరూ కలిసి నూడుల్స్ తిన్నారు. ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకుని ఇంట్లో ఉరివేసుకునేందుకు ఫ్యాన్‌కు చీర కట్టారు. ఫ్యాన్ సరిగ్గా లేదని తెలుసుకుని ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగారు. కాసేపటి తర్వాత సంధ్య వాళ్ల ఇంటికి వెళ్లి వాంతులు చేసుకోవడాన్ని వాళ్ల నాన్నమ్మ గమనించి పురుగుల మందు తాగినట్లు తెలుసుకుంది. కొండలు కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి అపస్మారక స్థితిలో పడిపోయాడు. స్థానికులు ఇద్దరినీ హాలియాలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నల్లగొండ ఆస్పత్రికి తరలించారు. కొండలును కుటుంబ సభ్యులు నాగార్జునసాగర్ కమలా నెహ్రూ ఆస్పత్రికి తీసుకొచ్చారు. శనివారం రాత్రి 10 గంటల సమయంలో కొండలు మృతి చెందాడు. కొద్దిసేపటికే నల్లగొండ ఆస్పత్రిలో సంధ్య కూడా మృతి చెందింది. ఇద్దరి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కొడుకు బాధ నుంచి తేరుకోకముందే.. సంధ్య సోదరుడు వెంకటేశ్వర్లు ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందా డు. కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేక పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ దంపతులకు కూతురూ దూరమై మరింత కడుపుకోతను మిగిల్చింది. ‘ఏడాదిలోనే ఇద్దరు బిడ్డలను పోగొట్టుకున్న నాదేమి రాత రా దేవుడా’అంటూ ఆ తల్లిదండ్రులు రోదించిన తీరు అక్కడివారిని కంటతడి పెట్టించింది. చదవండి: డ్రైవర్ నిర్లక్ష్యంతో ఏకంగా కుటుంబమే.. -
ప్రకృతి సాగులో పరిశోధనలు
సాక్షి, అమరావతి: పురుగు మందులు, రసాయనాలతో సేద్యం కారణంగా ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోంది. పురుగు మందులు, రసాయనాల వాడకాన్ని తగ్గించి, ప్రకృతి సేద్యంతో ప్రజలకు మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం రాష్ట్రంలో ఉద్యమ రూపంలో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తోంది. సామూహిక ప్రకృతి వ్యవసాయ నిర్వహణ ప్రాజెక్టు (ఏపీ కమ్యూనిటీ మేనేజ్మెంట్ నేచురల్ ఫామింగ్ – ఏపీసీఎన్ఎఫ్) కింద ఇప్పటికే రాష్ట్రంలో 3,730 పంచాయతీల్లో 4.78 లక్షల మంది రైతులు 5.06 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యాన్ని చేపట్టారు. ప్రకృతి సాగుపై లోతైన పరిశోధనలు, పంటల సర్టిఫికేషన్‌కు వైఎస్సార్ జిల్లా పులివెందులలో అంతర్జాతీయ స్థాయి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తోంది. జర్మనీ ప్రభుత్వ ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేస్తోన్న ఈ కేంద్రం కోసం సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు సిద్దమవుతోంది. 2031 నాటికి ప్రకృతి సేద్యంలో 60 లక్షల మంది రైతులు రాష్ట్రంలో ప్రకృతి సాగు కోసం జర్మన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్థిక చేయూతనిస్తోంది. 2031 నాటికి కనీసం 60 లక్షల మంది రైతులను ప్రకృతి సేద్యం వైపు మళ్లించడమే లక్ష్యంగా ఏపీసీఎన్ఎఫ్–కేఎఫ్‌డబ్ల్యూ (జర్మన్ బ్యాంకు) ప్రాజెక్టు కింద జర్మన్ ప్రభుత్వం రూ.785.90 కోట్లు (90 మిలియన్ యూరోలు) గ్రాంట్‌తో కూడిన ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. గతేడాది ఏప్రిల్‌లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు 719 పంచాయతీల్లో ఐదేళ్ల (2020–25) పాటు అమలవుతుంది. తాజాగా విస్తృత స్థాయి పరిశోధనల కోసం ఇండో–జర్మన్ గ్లోబల్ సెంటర్ ఫర్ అగ్రోకాలజీ రీసెర్చ్ అండ్ లెర్నింగ్ సెంటర్ (ఐజీజీసీఏఆర్‌ఎల్) ఏర్పాటుకు జర్మనీ ముందుకొచ్చింది. ఇందుకోసం రూ.174 కోట్లు (20 మిలియన్ యూరోలు) గ్రాంట్ ఇస్తోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ‘ప్రకృతి సాగు’పై పరిశోధనలకు ఏర్పాటవుతోన్న తొలి పరిశోధన కేంద్రం ఇదే. ఈ ప్రతిష్టాత్మక పరిశోధన కేంద్రానికి 60 ఎకరాల భూమితోపాటు భవనాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనుంది. అంతర్జాతీయ స్థాయిలో కేఎఫ్‌డబ్ల్యూ, వరల్డ్ ఆగ్రో ఫారెస్ట్రీ సెంటర్ (ఐసీఆర్‌ఏఎఫ్), ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ), అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (సీఐఆర్ ఏడీ), జీఐజెడ్లు భాగస్వాములవు తుండగా, కేంద్ర వ్యవసాయ శాఖతో పాటు నీతి ఆయోగ్, భారత వ్యవసాయ పరిశోధనా కేంద్రం (ఐసీఏఆర్), రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర వ్యవసాయశాఖతో పాటు రైతుసాధికార సంస్థ, వ్యవసాయ వర్సిటీలు భాగస్వాములు కాబోతున్నాయి. పరిశోధన కేంద్రం లక్ష్యాలు.. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, ప్రజలకు ఆరోగ్య భద్రతను కల్పిస్తూ గ్రామీణ జీవనోపాధిని మెరుగుపర్చడమే లక్ష్యంగా అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా ఇక్కడ శాస్త్రీయ పరిశోధనలు జరుగుతాయి. వాటి ఫలితాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి రైతులు, వినియోగదారులకు ఉపయోగపడేలా వ్యవసాయ శాస్త్ర నైపుణ్యాలను, పరిజ్ఞానాన్ని పెంపొందిస్తారు. రానున్న ఐదేళ్లలో ఏపీతోపాటు దేశంలోని మరో ఐదు రాష్ట్రాల్లో ప్రకృతి సాగును ప్రోత్సహించి, కనీసం 10 వేల మంది రైతులను శాస్త్రవేత్తలుగా మారుస్తారు. వెయ్యిమంది సాంకేతిక నిపుణులను తయారు చేయడం, లక్ష మందిని సర్టిఫైడ్ చాంపియన్ అభ్యాసకులుగా తీర్చిదిద్దడం ఈ కేంద్రం లక్ష్యాలు. పరిశోధనలను ఏప్రిల్‌లో ప్రారంభిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రపంచ దేశాలకు దిక్సూచిలా పరిశోధన కేంద్రం మన రాష్ట్రంలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సేద్యానికి ఆర్థిక చేయూతనిస్తోన్న జర్మనీ ప్రభుత్వం ఇక్కడ అంతర్జాతీయ స్థాయి పరిశోధన, శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. నవంబర్ నెలాఖరుకల్లా జర్మనీ ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తుందని భావిస్తున్నాం. ఈ ప్రాజెక్టుకు 2021–27 వరకు ఈ జర్మనీ సహకారమందిస్తుంది. ఇక్కడ జరిగే పరిశోధనలు ప్రకృతి సాగులో దేశానికే కాదు ప్రపంచ దేశాలకు కూడా దిక్సూచీగా మారనున్నాయి. – టి.విజయకుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, ఏపీ రైతు సాధికార సంస్థ -
ఆర్గానిక్ సాగుతో శ్రీలంక కొత్త చరిత్ర
రసాయనిక ఎరువులు, పురుగుమందుల దిగుమతులను నిషేధించడం ద్వారా శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే పర్యావరణ హితమైన ఆహారోత్పత్తులు, ఆర్గానిక్ సాగుపై విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. రసాయనిక ఎరువులను, పెస్టిసైడ్స్‌ని నిషేధించిన మొట్టమొదటి దేశం శ్రీలంక. తమ ప్రయోజనాలకు గండి పడుతోందన్న విషయం గ్రహించిన అంతర్జాతీయ వాణిజ్య వ్యవసాయ సంస్థలు... ఆర్గానిక్ ఉత్పత్తుల వల్లే శ్రీలంకలో ఆహార సంక్షోభం ఏర్పడిందంటూ ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ అంతర్జాతీయంగా ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో శ్రీలంక తప్పకుండా లబ్ధి పొందుతుంది. తన పంటలకు ఆర్గానిక్ ట్యాగ్ ద్వారా ప్రపంచ మార్కెట్లో శ్రీలంక ప్రభంజనం సృష్టించగలదు. రసాయనిక ఎరువులు, పురుగుమందులను సంపూర్ణంగా నిషేధిస్తూ ఆర్గానిక్ ఆహారోత్పత్తుల వైపు అడుగు వేస్తూ శ్రీలంక తీసుకున్న విప్లవాత్మక నిర్ణయానికి వ్యతిరేకంగా ఊహించినట్లే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్గానిక్ పంటలపై అవే వాదనలు, అవే మానసిక భయాలు, ప్రపంచాన్ని తిరోగమనం పాలుచేసిన నకిలీ సైద్ధాంతిక ఆలోచనలు! ప్రపంచ వ్యవసాయ వాణిజ్య దిగ్గజాల సాధికారిక సమతుల్యతను ఎవరైనా విచ్ఛిన్నపరుస్తున్నారని పసిగడితే చాలు.. పదేపదే వారికి వ్యతిరేకంగా నిరసనలు, వ్యతిరేకతల రొద మిన్నుముట్టడం మనకు తెలిసిందే. ఆరోగ్యకరమైన, మరింత నిలకడైన, న్యాయబద్ధమైన ఆహార వ్యవస్థల వైపు వెళ్లవలసిన అవసరాన్ని ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవస్థల సదస్సు ఇంకా గుర్తించకముందే, కొన్ని నెలల క్రితం శ్రీలంక సాహసోపేతమైన చర్యకు శ్రీకారం చుట్టింది. రసాయనిక ఎరువులు, పురుగుమందుల దిగుమతులను నిషేధించడం ద్వారా వ్యవసాయ పర్యావరణ పరివర్తన అనే భావనను ఎంతోముందుగా ఆచరణలోకి తెచ్చింది. మే 6న దేశాధ్యక్షుడి అధికార ప్రకటన ద్వారా ఆర్గానిక్ ఆహార ఉత్పత్తుల వైపు తొలి అడుగు వేసిన దేశంగా శ్రీలంక చరిత్రకెక్కింది. అంతకుముందు పామ్ ఆయిల్ దిగుమతులపై నిషేధం విధించి, ఇప్పటికే సాగు చేస్తున్న పామాయిల్ తోటలను దశలవారీగా తొలగించాలని ఆదేశాలు జారీచేసి ఆరోగ్యకరమైన, స్థిరమైన భవిష్యత్తు వైపు గొప్ప నిబద్ధతను ప్రదర్శించింది. సెప్టెంబర్ 22న న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే మాట్లాడుతూ, శ్రీలంక జాతీయ విధాన చట్రంలో స్వావలంబన ఒక మైలురాయిగా అభివర్ణించారు. నేల ఫలదీకరణ, జీవ వైవిధ్యం, జల మార్గాలు, ఆరోగ్యం వంటివాటిపై ప్రభావం కారణంగా తమ ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రారంభంలోనే రసాయనిక ఎరువులు, పురుగుమందుల ఉపయోగాన్ని నిషేధించిందని పేర్కొన్నారు. శ్రీలంక భారీ స్థాయిలో విదేశీ రుణ ఊబిలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ప్రభుత్వ రాబడిలో 80 శాతం విదేశీ అప్పులు తీర్చడానికే వెచ్చించాల్సి వస్తోంది. అదే సమయంలో స్వదేశంలో తీవ్రమైన ఆహార పదార్థాల కొరతను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఆర్గానిక్ వ్యవసాయం చేబడితే ఆహార పదార్థాల ఉత్పత్తి తగ్గిపోయి ఆహార సంక్షోభం ఏర్పడక తప్పదంటూ నడుస్తున్న విష ప్రచారానికి వ్యతిరేకంగా శ్రీలంక అధ్యక్షుడు తన నిర్ణయానికి గట్టిగా కట్టుబడి ఉన్నారు. 1980లలో ఇండోనేషియా అధ్యక్షులు సుహార్తో ఒక్క కలం పోటుతో, వరి సాగుకు ఉపయోగిస్తున్న 57 రసాయనిక పురుగుమందులపై నిషేధం విధించినప్పుడు కొద్ది రోజులలోపే ఆయనపై పెట్టిన తీవ్ర ఒత్తిడి ఈ సందర్భంగా నాకు మళ్లీ గుర్తుకొచ్చింది. నిజానికి మే నెల ప్రారంభంలోనే శ్రీలంకలో రసాయనిక ఎరువులు, పురుగు మందులపై నిషేధం అమలులోకి వచ్చింది. అప్పటినుంచి ఒక పంట సీజన్ మాత్రమే పూర్తయింది. ఆ సీజన్లో వరినాట్లు మేలో మొదలై ఆగస్టులో పంటకోతలు పూర్తయ్యాయి. అయితే పంట ఇంకా మార్కెట్లోకి రాకముందే శ్రీలంకలో పంట దిగుబడులు తగ్గిపోయాయనే భయాందోళనలను వ్యాపింపజేయడానికి రసాయనిక ఎరువులు, పురుగుమందుల లాబీ పూనుకుంది. సాధారణంగా రసాయనిక ఎరువులను ఉపయోగించడం నిలిపివేశాక రెండు లేక మూడో సంవత్సరం వరకు మాత్రమే పంట దిగుబడులు కాస్త తగ్గుముఖం పట్టి నెమ్మదిగా మళ్లీ పెరగటాన్ని మనం చూస్తాం. రసాయన ఎరువులు, పురుగుమందులతో సాగే వ్యవసాయం కారణంగా సంభవించే దుష్ఫలితాలు సమాజం తప్పనిసరిగా చెల్లించవలసిన మూల్యంగా భావిస్తుంటారు. మరోమాటలో చెప్పాలంటే ఉత్తర శ్రీలంకలో వరి అధికంగా పండే ప్రాంతంలో, గ్రామీణ పేదల్లో మూత్ర పిండాలు భారీ స్థాయిలో విఫలం కావడానికి రసాయనిక ఎరువులు, పురుగుమందులను మోతాదుకు మించి వాడటమేనని ఎక్కువమంది నమ్ముతున్నారు. కానీ మూత్రపిండాల వైఫల్యానికి, రసాయనిక ఎరువుల వాడకానికి మధ్య ఉన్న లింకును పలువురు నిపుణులు పరిగణనలోకి తీసుకోవడం లేదు. శ్రీలంకలో దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి కారణంగా 20 వేలకంటే ఎక్కువమంది చనిపోయారనీ, గత 20 ఏళ్లుగా 4 లక్షలమంది వ్యాధిగ్రస్తులయ్యారనీ ‘ది ఇండిపెండెంట్’ నివేదిక చెబుతోంది. దేశంలో రెండో అతిపెద్ద ఎగుమతి సరుకైన తేయాకు విషయాన్ని పరిశీలిస్తే, అనవసరమైన పుకార్లు, భయాలను వ్యాప్తి చేశారు. నిజానికి తేయాకు దిగుబడులు శ్రీలంకలో చాలా తక్కువగానే ఉన్నాయి. కానీ గత దశాబ్దికాలంలో తేయాకు పంట దిగుబడి నిరంతరం తగ్గుముఖం పడుతూనే వస్తోంది. చాలా ప్రాంతాల్లో ఎకరాకు 350 నుంచి 400 కేజీలకు తేయాకు పంట పడిపోగా, కొన్ని సందర్భాల్లో ఎకరాకు 150 కేజీల తేయాకు పంట మాత్రమే సాధ్యమయింది. దేశంలో తేయాకు పంట దిగుబడులు తగ్గడానికి ప్రధాన కారణాల్లో నేల కోత ఒకటి. ఈ నేపథ్యంలో పూర్తిగా ఆర్గానిక్ సాగుకు మళ్లితే దాని ప్రయోజనం రాబోయే సంవత్సరాల్లో మాత్రమే కనిపిస్తుంది. వ్యవసాయ పర్యావరణానికి కట్టుబడటం ద్వారా శ్రీలంక నేల ఆరోగ్యాన్ని పరిరక్షించగలదు, తద్వారా తేయాకు తోటలను పునరుజ్జీవింప చేయగలదు. తన పంటలకు ఆర్గానిక్ ట్యాగ్ ద్వారా ప్రపంచ మార్కెట్లో శ్రీలంక ప్రభంజనం సృష్టించగలదు. అంతర్జాతీయంగా ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఆర్గానిక్ సాగు చేపడుతున్న మొదటి దేశంగా శ్రీలంక తప్పకుండా లబ్ధి పొందే స్థానంలో ఉంటుంది. అయితే ఈ పరివర్తనకు మార్గదర్శకం చేయడానికి శ్రీలంక సరైన చర్యలు చేపట్టవలసి ఉంది. ప్రస్తుతం శ్రీలంక ముందున్న సవాల్ ఏమిటంటే, తన పరిశోధన, అభివృద్ధి, పంటల పట్ల వైఖరిని సరికొత్తగా రూపొందించుకోవడమే. ఇందుకోసం విద్యాపరమైన కరిక్యులమ్‌ని మార్చడం ద్వారా జాతీయ వ్యవసాయ పరిశోధనా కార్యక్రమాలకు కొత్త రూపం ఇవ్వాల్సి ఉంది. వ్యవసాయ పరిశోధన కూడా కమ్యూనిటీ జ్ఞానాన్ని, ఆయా సామాజిక బృందాల సృజనాత్మక ఆవిష్కరణలను నిర్ధారించి, పరిరక్షించడంపై దృష్టి సారించాల్సి ఉంది. ప్రత్యేకించి పర్యావరణ మార్పులోని సంక్లిష్టతలను పరిష్కరించడం, సాంప్రదాయిక పంటల రకాలను, లభ్యమవుతున్న సుసంపన్నమైన వైవిధ్యతలను పరిరక్షించగలిగితే అది మొత్తం వ్యవసాయానికి గట్టి స్థిరత్వాన్ని తెచ్చిపెడుతుంది. మరీ ముఖ్యంగా ఆర్గానిక్ సాగు ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేయాల్సి ఉంది. బలవంతంగా ఆర్గానిక్ వ్యవసాయం వైపు మళ్లాలని రైతులను బలవంతపెడితే దీర్ఘకాలంలో అది పెద్దగా పనిచేయదు. వ్యవసాయ పర్యావరణం, ఆర్గానిక్, సహజ, జీవవైవిధ్యతతో కూడిన వ్యవసాయ వ్యవస్థలు ప్రపంచం మొత్తానికి ఆహారాన్ని అందించగలవా అని చాలామందికి సందేహాలు పుట్టుకొస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి ఆహార, వ్యవసాయ సంస్థ అత్యున్నత స్థాయి నిపుణుల ప్యానెల్ 2019లో వెలువరించిన ఒక నివేదిక వీటికి పరిష్కార మార్గాలను సూచించింది. వ్యవసాయ పర్యావరణ హితంతో కూడిన సాగు వ్యవస్థలు తీసుకొచ్చే ఆర్థిక ప్రయోజనాలను గురించి ఈ ప్యానెల్ సవివరంగా పేర్కొంది. ప్రత్యేకించి రఫేల్ డి అన్నోల్పో 2017లో చేసిన ఒక విశ్లేషణ ప్రకారం 61 శాతం కేసుల్లో ఆర్గానిక్ వ్యవసాయ దిగుబడులు పెరిగినట్లు, 20 కేసుల్లో మాత్రమే ఈ దిగుబడులు తగ్గుముఖం పట్టినట్లు తేటతెల్లమైంది. కాగా 66 శాతం కేసుల్లో ఆర్గానిక్ సాగు లాభదాయకత పెరిగిందని కూడా తెలిపింది. కాబట్టి ఆర్గానిక్ సాగు చేపట్టడానికి కావలిసింది సాహసం మాత్రమే. దేన్నయినా నమ్మినప్పుడు మాత్రమే దాని ప్రయోజనాలు సిద్ధిస్తాయి. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే ఆర్గానిక్ సాగు పట్ల నిబద్ధత కలిగి ఉండటం అనేది అంతర్జాతీయంగానే వ్యవసాయ భవిష్యత్తుకు తలుపులు తెరిచే అవకాశం ఉంది. దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహారం, వ్యవసాయరంగ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
హానికరమైన 27 క్రిమీ సంహారక మందులు నిషేధం
న్యూఢిల్లీ: మనుషులు, జంతువులకు హానికరంగా పరిగణిస్తున్న 27 క్రిమి సంహారక మందుల తయారీ, వినియోగంపై నిషేధం విధించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబు ఇచ్చారు. డాక్టర్ అనుపమ్ వర్మ నేతృత్వంలోని నిపుణుల సంఘం 66 కీటక నాశక మందులు కలిగించే దుష్ప్రభావాలను సమీక్షించిన అనంతరం 12 క్రిమి సంహారక మందులను పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. మరో 6 క్రిమిసంహారక మందులను క్రమంగా వినియోగం నుంచి తొలగించిందని మంత్రి తోమర్ తెలిపారు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 46 క్రిమిసంహారక మందులను నిషేధించడమో లేదా వినియోగం నుంచి తొలగించడమే చేసిందని వివరించారు. 4 క్రిమిసంహారక మందుల ఫార్ములేషన్స్‌ను దిగుమతి, తయారీ, విక్రయాల నుంచి నిషేధించామని, నిషేధించిన 5 క్రిమిసంహారక మందులను కేవలం ఎగుమతి చేయడానికి తయారీకి అనుమతించినట్లు గుర్తుచేశారు. మరో 8 క్రిమిసంహారక మందుల తయారీకి అనుమతించిన రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్లు మంత్రి వెల్లడించారు. డీడీటీని మాత్రం ప్రజారోగ్య కార్యక్రమాల కోసం వినియోగించేందుకు అనుమతిస్తున్నట్లు మంత్రి నరేంద్రసింగ్ స్పష్టం చేశారు. తెలిపారు. క్రిమిసంహారక మందులు విషతుల్యమే అయినప్పటికీ నిర్దేశించిన రీతిలో వాటి వినియోగంతో పర్యావరణానికి ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. క్రిమిసంహారక మందుల భద్రత, సామర్ధ్యం వంటి అంశాలపై నిరంతరం జరిగే అధ్యయనాలు, నివేదికలు, సమాచారం ఆధారంగా నిపుణులు తరచు సమీక్షలు నిర్వహించి ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంటాయని మంత్రి చెప్పారు. -
రైతులకు వెన్నుదన్నుగా అగ్రిల్యాబ్‌లు
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం కేంద్రంగా నిర్వహిస్తున్న ఎరువులు, విత్తన, పురుగుమందుల పరీక్షా కేంద్రాలు రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తూ నాలుగు దశాబ్దాలుగా విశేష సేవలందిస్తున్నాయి. అధునాతన పరిజ్ఞానంతో పరీక్ష ఫలితాలను సకాలంలో రైతులకు అందిస్తూ నాణ్యమైన ఉత్పత్తులను పండించేందుకు ఎంతో దోహపడుతున్నాయి. ఇక్కడి సెంట్రల్ ల్యాబ్ ద్వారా నియోజకవర్గాల్లో అగ్రిల్యాబ్ సిబ్బందికి సైతం నైపుణ్యంలో శిక్షణ అందిస్తూ రైతు సేవలో తరిస్తున్నాయి. తాడేపల్లిగూడెం: భూమాతను నమ్ముకుని హలం పట్టి పొలం దున్ని స్వేదం చిందించి పుడమితల్లి ధాన్యపు రాశులతో, పంటలతో విరాజిల్లడానికి కృషి చేసే రైతులకు విత్తనం నుంచి సాంకేతిక పరిజ్ఞానం వరకు అందించడానికి రైతు భరోసా కేంద్రాలు దివిటీలుగా మారాయి. ఆర్బీకేలు, అగ్రిల్యాబ్‌లు వ్యవసాయంలో వినూత్న మార్పులకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం శ్రీకారం చుడుతుండటంతో వ్యవసాయం పండుగగా మారింది. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా తాడేపల్లిగూడెంలో ఎరువులు, పురుగుమందులు, విత్తన పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలోని నియోజకవర్గాలలో ఏర్పాటు చేసే అగ్రిల్యాబ్‌లలో పనిచేసే సిబ్బందికి నైపుణ్య శిక్షణ, సాంకేతిక మార్గదర్శనం సైతం గూడెంలోని సెంట్రల్ ల్యాబ్ ద్వారా అందుతోంది. ఈ ల్యాబ్‌ల ద్వారా అందుతున్న సేవలు ఇలా ఉన్నాయి. ఆరు జిల్లాలకు విత్తన పరీక్షలు ధాన్యం, కూరగాయలు, అపరాల వంగడాలలో మొలకశాతాన్ని విశ్లేషించి ఫలితాలను రైతులకు అందజేయడానికి తాడేపల్లిగూడెంలో 1972లో విత్తన పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వరి, మొక్కజొన్న, వేరుశనగ, కూరగాయలు, అపరాలు, పొద్దుతిరుగుడు వంటి విత్తనాలలో మొలకశాతాన్ని విశ్లేషించి నాణ్యతను తెలియచేయడానికి ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ ద్వారా కర్నూలు, ప్రకాశం, కడప, అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల రైతులకు సేవలందిస్తున్నారు. వ్యవసాయాధికారులు, ఏడీఏల ద్వారా వంగడాల శాంపిల్స్ ఇక్కడకు వస్తాయి. వాటిలో మొలకశాతాలను వివిధ దశల్లో పరీక్షల ద్వారా నిర్థారించి ఫలితాలను 30 రోజుల వ్యవధిలో పంపిస్తారు. శీతలీకరణ పద్ధతుల్లో విత్తనాలను భద్రపర్చి తర్వాత మొలకశాతాలను పరిశీలిస్తారు. రాష్ట్రంలోని మూడింటిలో ఒకటి 1979 ఫిబ్రవరి 17న ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ ద్వారా ఎరువుల పరీక్ష కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఇటువంటి కేంద్రాలు మొత్తం మూడు ఉండగా, ఒకటి ఇక్కడ ఏర్పాటు చేయగా, మిగిలినవి అనంతపురం, బాపట్లలో ఉన్నాయి. వీటిని లీగల్ ల్యాబ్స్ అని కూడా అంటారు. అగ్రిల్యాబ్‌లలో పనిచేసే సిబ్బందికి, సాంకేతికపరమైన శిక్షణ ఈ ల్యాబ్ ద్వారా ఇచ్చారు. ఎరువులలో కల్తీ, నాణ్యత పరిశీలనకు నమూనాలను ఇక్కడకు పంపిస్తారు. గుంటూరులో కోడింగ్ సెంటర్‌కు ఈ నమూనాలు చేరితే, అక్కడి నుంచి ఇక్కడి పరీక్ష కేంద్రానికి పంపిస్తున్నారు. గతంలో 60 రోజుల్లో ఫలితాలను వెల్లడించాల్సి ఉండగా, ప్రస్తుతం అధునాతన పరీక్ష యంత్రాలు అందుబాటులోకి రావడంతో 2018 నుంచి 15 రోజుల్లోనే ఫలితాలను తేల్చేస్తున్నారు. ఫరీదాబాద్‌లోని సెంట్రల్ ఫెర్టిలైజర్ క్వాలిటీ కంట్రోల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందిన నిపుణులు ఈ ల్యాబ్‌లో సేవలందిస్తున్నారు. ప్రమాణాలకు తగ్గట్టుగా పురుగుమందు పరీక్షలు 1984 మే రెండో తేదీన ఇక్కడ పురుగుమందుల పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇవి దేశవ్యాప్తంగా 68 ఉండగా, ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఏడు ల్యాబ్‌లుండగా, రాష్ట్ర విభజనలో రెండు వరంగల్, రాజేంద్రనగర్ ల్యాబ్‌లు తెలంగాణలోకి వెళ్లాయి. మిగిలిన ఐదు ల్యాబ్‌లు రాష్ట్రానికి దక్కాయి. వాటిలో ఒకటి తాడేపల్లిగూడెం ల్యాబ్ కాగా, గుంటూరు అనంతపురం, కర్నూలు, విశాఖపట్టణాలలో ల్యాబ్‌లు ఉన్నాయి. పురుగుమందుల్లో మూల పదార్థం స్థాయి ప్రమాణాల పరిమితికి అనుకూలంగా ఉందో లేదా అనేది ఈ పరీక్ష కేంద్రాల్లో నిర్ధారిస్తారు. గుంటూరులో ఉన్న కోడింగ్ సెంటర్‌కు తిరిగి ఫలితాలను పంపిస్తారు. పురుగుమందుల్లో క్రియాశీల పదార్థా శాతాన్ని పరీక్షిస్తారు. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా నమూనాలు ఉన్నాయో లేవో పరిశీలిస్తారు. సిబ్బందికి శిక్షణ ఇచ్చాం జిల్లాలో ఏర్పాటుచేసే అగ్రిల్యాబ్ లలో పనిచేసే సిబ్బందికి సాంకేతికపరమైన శిక్షణ ఇచ్చాం. సెంట్రల్ యాక్టు ద్వారా ఏర్పాటైన ఈ ల్యాబ్‌లో పరిశోధనా పద్ధతులు, ఇతర విషయాలపై ఉన్నతాధికారుల ఆదేశాలతో వచ్చిన వారికి పరిపూర్ణమైన శిక్షణ ఇచ్చాం. – జె.శశిబిందు, ఏడీఏ, ఎరువుల పరిశోధన, సెంట్రల్ ల్యాబ్, తాడేపల్లిగూడెం -
పెండలం ఆకులతో పురుగుమందులు
కర్ర పెండలం దుంపల్లో చాలా పోషకాలుంటాయని మనకు తెలుసు. అయితే, కర్రపెండలం మొక్కల ఆకులతో చక్కని సేంద్రియ పురుగు మందులను తయారు చేయవచ్చని డా. సి. ఎ. జయప్రకాశ్ నిరూపించడంతోపాటు పేటెంటు సైతం పొందారు. కేరళలోని శ్రేకరియంలో గల కేంద్రీయ దుంప పంటల పరిశోధనా సంస్థ (సిటిసిఆర్‌ఐ) లో ఆయన ప్రధాన శాస్త్రవేత్తగా విశేష పరిశోధనలు చేస్తున్నారు. కర్రపెండలం ఆకులను తిన్న పశువులు చనిపోతాయి. వీటిలో వుండే శ్యానోజన్ అనే రసాయన సమ్మేళనం విషతుల్యమైనది కావటమే ఇందుకు కారణం. ఇది గ్రహించిన డా. జయప్రకాశ్ 13 ఏళ్ల క్రితం పరిశోధనలు ప్రారంభించారు. విశేష కృషి చేసి విజయం సాధించారు. శ్యానోజన్ సమ్మేళనాన్ని ఆకుల్లో నుంచి వెలికితీయడం కోసం తొలుత ఒక యంత్రాన్ని కనుగొన్నారు. ఇందుకోసం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ సాయం తీసుకున్నారు. అనేక ఏళ్లు పరిశోధన చేసి ఎట్టకేలకు నన్మ, మెన్మ, శ్రేయ అనే మూడు రకాల సేంద్రియ పురుగుమందులను తయారు చేశారు. ఒక కిలో కర్రపెండలం ఆకులతో ప్రత్యేక యంత్రం ద్వారా 8 లీటర్ల సేంద్రియ పురుగుమందు తయారు చేయవచ్చని డా. జయప్రకాశ్ తెలిపారు. నన్మ, మెన్మ, శ్రేయ సేంద్రియ పురుగుమందులు ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు తీవ్రనష్టం కలిగిస్తున్న పురుగులను అరికడతాయి. అరటిలో సూడోస్టెమ్ వీవిల్, కొబ్బరిలో రెడ్‌పామ్ వీవిల్తో పాటు అనేక పండ్ల / కలప పంటల్లో కనిపించే కాండం తొలిచే పురుగులను ఈ సేంద్రియ పురుగుమందులు సమర్థవంతంగా అరికడతాయని డా. జయప్రకాశ్ ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. డీఆర్డీవో తోడ్పాటుతో ఈ పురుగుమందును వాయువు రూపంలోకి మార్చుతున్నారు. ఆహార గోదాముల్లో కనిపించే పురుగులను సమర్థవంతంగా ఈ వాయు రూపంలోని సేంద్రియ పురుగుమందు అరికడుతుందట. లైసెన్స్ ఫీజు చెల్లించే ప్రభుత్వ/ప్రైవేటు సంస్థలకు ఈ పురుగుమందుల తయారీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని సిటిసిఆర్‌ఐ సంచాలకులు డాక్టర్ షీల ప్రకటించారు. కర్రపెండలం ఆకుల రసం తో లీటరు పురుగుమందు తయారు చేయడానికి కేవలం రూ. 20 మాత్రమే ఖర్చవుతుందట. ఈ పురుగుమందులు ఆకులతో తయారు చేసినవి కావటం వల్ల రసాయన పురుగుమందులకు మల్లే పురుగులు వీటికి ఎప్పటికీ అలవాటుపడిపోవు. ప్రభుత్వ సంస్థలు ఇటువంటి చక్కని సేంద్రియ పురుగుమందులను స్వయంగా తయారు చేయించి రైతులకు సరసమైన ధరకు అందిస్తే ఎంతో మేలు జరుగుతుంది. వివరాలకు.. సిటిసిఆర్‌ఐ ప్రధాన శాస్త్రవేత్త డా. జయప్రకాశ్‌ను ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు: prakashcaj@gmail.com డా. సి.ఎ.జయప్రకాశ్ -
ఎన్ఎఫ్ఎల్లో వాటా విక్రయం
న్యూఢిల్లీ: ఎరువుల రంగ పీఎస్‌యూ సంస్థ నేషనల్ ఫెర్టిలైజర్స్(ఎన్ఎఫ్ఎల్)లో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) ద్వారా 20 శాతం వాటాను అమ్మేందుకు సిద్ధపడుతోంది. దీనిలో భాగంగా ఓఎఫ్ఎస్ను నిర్వహించేందుకు మర్చంట్ బ్యాంకర్లను ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల సంస్థలు మార్చి 2లోగా బిడ్స్‌ను దాఖలు చేయవలసి ఉంటుందని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వాహక శాఖ(దీపమ్) తాజాగా పేర్కొంది. ఇందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం చూస్తే ఎన్ఎఫ్ఎల్లో 20 శాతం వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం రూ. 400 కోట్లు సమకూర్చుకునే వీలుంది. ఐపీఓకు ఇండియా పెస్టిసైడ్స్ నిధుల సమీకరణకు మరో సంస్థ సిద్ధమైంది. ఆగ్రో కెమికల్ టెక్నాలజీస్ కంపెనీ ఇండియా పెస్టిసైడ్స్ ఐపీఓ ద్వారా రూ.800 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు కోసం సెబీకి బుధవారం ముసాయిదా పత్రాలు సమర్పించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ.100 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను విడుదల చేయనుంది. అలాగే ఆఫర్ ఫర్ సేల్ ద్వారా కంపెనీ ప్రధాన ప్రమోటర్ అగర్వాల్‌తో పాటు ఇతర ప్రమోటర్లు రూ.700 కోట్ల షేర్లను విక్రయించునున్నట్లు కంపెనీ తెలిపింది.