తాగునీటిలో లెడ్ , మెర్క్యురీ తదితర కలుషితాలను నిర్ధారించేందుకు దిగుమతి చేసుకున్న యంత్రాలు
సాక్షి, అమరావతి: తాగునీటిలో ఉండే పురుగు మందుల అవశేషాలను గుర్తించే అత్యాధునిక నీటి పరీక్షల ల్యాబొరేటరీలు రాష్ట్రంలో అందుబాటులోకి రానున్నాయి. క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులకు కారణమయ్యే లెడ్, మెర్క్యురీ, క్రోమియం వంటి లోహాలు తాగునీటిలో సూక్ష్మస్థాయిలో ఉన్నా ఈ అత్యాధునిక ల్యాబ్‌లు పసిగట్టేస్తాయి. గ్రామీణ ప్రజలు తాగునీటికి ఉపయోగించే బోరు బావులతోపాటు ప్రభుత్వ రక్షిత మంచినీటి పథకాల్లోని నీటి నమూనాలను గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్) ఆధ్వర్యంలో ఏటా రెండుసార్లు సేకరించి, నీటి నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తుంటారు.
ఇందుకు గాను రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయిలో మొత్తం 112 నీటి పరీక్షా కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటిలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, పాలకొల్లుతోపాటు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, రాజమండ్రిలోని నీటి పరీక్షా కేంద్రాలను ఒక్కొక్కటీ రూ.6 కోట్లతో ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆధునికీకరించింది. వీటిలో వినియోగించే అత్యాధునిక యంత్ర సామగ్రిని అమెరికా నుంచి దిగుమతి చేసుకుంది. ల్యాబ్‌ల నిర్వహణ సైతం అమెరికన్ సంస్థ ఆధ్వర్యంలోనే కొనసాగుతుంది. 4 ల్యాబ్‌ల ఏర్పాటు పూర్తయి, ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ కృష్ణారెడ్డి తెలిపారు.
మరో 4 ల్యాబ్‌ల ఆధునికీకరణకు ప్రతిపాదన
జోన్ల వారీగా రాష్ట్రంలో మరో నాలుగు నీటి పరీక్షల ల్యాబ్‌లను కూడా ఈ తరహాలోనే ఆధునికీకరించేలా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు సంబంధించి విశాఖలో, రాయలసీమ నాలుగు జిల్లాలకు సంబంధించి కడపలో, విజయవాడలో ఒకటి, ప్రకాశం జిల్లాలో మరొకటి ఈ తరహా అత్యాధునిక ల్యాబ్‌ల ఏర్పాటుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఏలూరు ఘటన తర్వాత సీఎం ఆదేశాల మేరకు
సుమారు ఏడాది క్రితం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రాంతంలో అంతుచిక్కని సమస్యతో ఒకే రోజున పెద్ద సంఖ్యలో ప్రజలు అనారోగ్యం బారినపడ్డారు. పురుగు మందుల అవశేషాలతో కూడిన నీటిని తాగడం వల్లే ఆ సమస్య ఉత్పన్నమై ఉండొచ్చని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో వ్యవసాయ రంగంలో పురుగు మందుల వాడకం పెరగడం వల్ల నీటి కాలుష్యానికి ఎక్కువగా అవకాశం ఉందన్న అంశాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అయితే, తాగునీటిలో దాగి ఉండే పురుగుమందుల అవశేషాలను, మెర్క్యురీ వంటి ప్రమాదకర సూక్ష్మస్థాయి మెటల్స్‌ను గుర్తించడానికి నీటి పరీక్ష కేంద్రాలు ఇప్పటివరకు రాష్ట్రంలో అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అత్యాధునిక నీటి పరీక్షల ల్యాబ్‌ల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు మొదటగా నాలుగు ల్యాబ్‌లను ఆధునికీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment