అన్నదాతను వెంటాడిన అప్పులు | farmers chasing debts | Sakshi
Sakshi News home page

అన్నదాతను వెంటాడిన అప్పులు

Published Wed, May 13 2015 3:05 AM | Last Updated on Sun, Sep 3 2017 1:54 AM

farmers chasing debts

సాగునీటి వేటలో ఐదు బోర్లు తవ్వించగగా.. అన్నీ ఫెయిలయ్యాయి. పంట పెట్టుబడుల కోసం చేసిన అప్పులు కుప్పలుగా పెరిగాయి. సొంత, కౌలు పొలాల్లో సాగు చేసిన పంటల్లో ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. ఈ క్రమంలో అప్పులు తీర్చే మార్గం లేక పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి తన వారితో బంధం తెంచుకుని కుటుంబానికి అంతులేని శోకాన్ని మిగిల్చాడో అన్నదాత. - వర్గల్
- పురుగు మందు తాగి బలవన్మరణం
- ఇప్పలగూడలో విషాదం
- వీధినపడ్డ కుటుంబం

మండలంలోని ఇప్పలగూడ గ్రామానికి చెందిన సొక్కుల వెంకట్‌రెడ్డి (36) తనకున్న రెండెకరాలోపు భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఈ భూమిలో పంటల సాగు కోసం సుమారు ఐదు బోర్లు వేయించాడు. ఒక బోరులో కొద్దిపాటి నీరు మినహా మిగతావన్ని విఫలమయ్యాయి. దీంతో అప్పులే మిగిలాయి. మరోవైపు నీళ్లు లేక సాగు మొక్కుబడిగా మారింది. గత ఖరీఫ్‌లో పొరుగు రైతుకు చెందిన 6 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని దాదాపు రూ. 90 వేలు పెట్టుబడితో పత్తిని సాగు చేశాడు. ప్రతికూల పరిస్థితుల కారణంగా అందులో పది క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు.

వ్యవసాయం కలిసిరాకపోవడంతో మొత్తం రూ. 4 లక్షలకు పైబడి అప్పులయ్యాయి. ఈ క్రమంలో అప్పులు తీర్చే మార్గం లేక మానసిక వేదనకు గురైన ఆ రైతు ఆత్మహత్యే శరణ్యంగా భావించాడు. దీంతో ఈ నెల 10న ఉదయం 6 గంటలకు తన ఇంటి వెనక వైపు పురుగుల మందు తాగి పడిపోయాడు. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు గజ్వేల్ ప్రభుత్వాస్పత్రిలో ప్రాథమిక చికిత్సలు చేయించి అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

కాగా.. అక్కడ వైద్యసేవలు సరిగా అందడం లేదని, డబ్బులు సమకూర్చుకుని మెరుగైన చికిత్స జరిపించాలనే ఆలోచనతో సోమవారం సాయంత్రం రైతు వెంకట్‌రెడ్డిని స్వగ్రామానికి తీసుకువచ్చారు. అదేరోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో రైతు వెంకట్‌రెడ్డి మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, సాయి కిరణ్ (పదో తరగతి), హన్మంతరెడ్డి (ఐదో తరగతి)లు ఉన్నారు. తెల్లారితే మంచి దవాఖానకు తీసుకపోదామనుకున్నం. ఇంతల్నే పాణం పోయిందని మృతుడి భార్య లక్ష్మి బోరుమని విలపించింది. లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు గౌరారం స్టేషన్ హౌస్ ఆఫీసర్ దేవీదాస్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement