irrigated
-
సాగునీరు అందించడమే ప్రభుత్వ ధ్యేయం
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి మక్తల్ : రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కాచ్వార్ గ్రామంలో మిషన్ కాకతీయ కింద బపన్‌కుంట చెరువు పనులను నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవడం ఖాయమని అన్నారు. 2017నాటికి రైతులకు భీమా ప్రాజెక్టు నుంచి సాగునీరు అందించేందుకు ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తుందని అన్నారు. నియోజకవర్గంలోని 115 చెరువులకు అనుమతులు లభించాయని అన్నారు. వాటిలో 37 చెరువులు పూర్తయ్యాయని ఎమ్మెల్యేను నిరంజన్‌రెడ్డి అభినందించారు. అనంతరం కాచ్వార్ గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రం వద్ద ఏర్పాటు చేసిన పట్టుపురుగుల పెంపకం షెడ్డును నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ప్రారంభించారు. గాలి వెంకట్‌రెడ్డి అనే రైతు పట్టు పురుగుల కేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల రైతును వారు అభినందించారు. అంతకు ముందు నిరంజన్‌రెడ్డిని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి శాలువాతో సన్మానం చేశారు. కార్యక్రమంలో పార్టీ తాలూకా ఇన్చార్జ దేవరి మల్లప్ప, నాయకులు రాజుల ఆశిరెడ్డి, గోపాల్‌రెడ్డి, సురెందర్‌రెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ రవికుమార్ యాదవ్, ఎంపీటీసీ సభ్యుడు రవిశంకర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
అన్నదాతను వెంటాడిన అప్పులు
సాగునీటి వేటలో ఐదు బోర్లు తవ్వించగగా.. అన్నీ ఫెయిలయ్యాయి. పంట పెట్టుబడుల కోసం చేసిన అప్పులు కుప్పలుగా పెరిగాయి. సొంత, కౌలు పొలాల్లో సాగు చేసిన పంటల్లో ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. ఈ క్రమంలో అప్పులు తీర్చే మార్గం లేక పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి తన వారితో బంధం తెంచుకుని కుటుంబానికి అంతులేని శోకాన్ని మిగిల్చాడో అన్నదాత. - వర్గల్ - పురుగు మందు తాగి బలవన్మరణం - ఇప్పలగూడలో విషాదం - వీధినపడ్డ కుటుంబం మండలంలోని ఇప్పలగూడ గ్రామానికి చెందిన సొక్కుల వెంకట్‌రెడ్డి (36) తనకున్న రెండెకరాలోపు భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఈ భూమిలో పంటల సాగు కోసం సుమారు ఐదు బోర్లు వేయించాడు. ఒక బోరులో కొద్దిపాటి నీరు మినహా మిగతావన్ని విఫలమయ్యాయి. దీంతో అప్పులే మిగిలాయి. మరోవైపు నీళ్లు లేక సాగు మొక్కుబడిగా మారింది. గత ఖరీఫ్‌లో పొరుగు రైతుకు చెందిన 6 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని దాదాపు రూ. 90 వేలు పెట్టుబడితో పత్తిని సాగు చేశాడు. ప్రతికూల పరిస్థితుల కారణంగా అందులో పది క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. వ్యవసాయం కలిసిరాకపోవడంతో మొత్తం రూ. 4 లక్షలకు పైబడి అప్పులయ్యాయి. ఈ క్రమంలో అప్పులు తీర్చే మార్గం లేక మానసిక వేదనకు గురైన ఆ రైతు ఆత్మహత్యే శరణ్యంగా భావించాడు. దీంతో ఈ నెల 10న ఉదయం 6 గంటలకు తన ఇంటి వెనక వైపు పురుగుల మందు తాగి పడిపోయాడు. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు గజ్వేల్ ప్రభుత్వాస్పత్రిలో ప్రాథమిక చికిత్సలు చేయించి అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా.. అక్కడ వైద్యసేవలు సరిగా అందడం లేదని, డబ్బులు సమకూర్చుకుని మెరుగైన చికిత్స జరిపించాలనే ఆలోచనతో సోమవారం సాయంత్రం రైతు వెంకట్‌రెడ్డిని స్వగ్రామానికి తీసుకువచ్చారు. అదేరోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో రైతు వెంకట్‌రెడ్డి మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, సాయి కిరణ్ (పదో తరగతి), హన్మంతరెడ్డి (ఐదో తరగతి)లు ఉన్నారు. తెల్లారితే మంచి దవాఖానకు తీసుకపోదామనుకున్నం. ఇంతల్నే పాణం పోయిందని మృతుడి భార్య లక్ష్మి బోరుమని విలపించింది. లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు గౌరారం స్టేషన్ హౌస్ ఆఫీసర్ దేవీదాస్ తెలిపారు. -
బాబు హయాంలో సాగు సమస్యే
పదేళ్లలో ఏడాదికి వెయ్యి కోట్లు చొప్పున రూ. 10 వేల కోట్లే వ్యయం అదే వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూ. 95 వేల కోట్ల వ్యయం 23.49 లక్షల ఎకరాలకు సాగునీరు సీమాంధ్ర వరకు బాబు సాగునీటి వ్యయం రూ. 6,000 కోట్లు వైఎస్ హయాంలో రూ. 41 వేల కోట్లు శ్వేతపత్రంలో వాస్తవాలున్నా .. విలేకరుల సమావేశంలో విడుదల చేయని బాబు హైదరాబాద్: గత ప్రభుత్వంపై నిందలు వేయడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ రంగాలకు సంబంధించి వరుసగా విడుదల చేస్తున్న శ్వేతపత్రాల్లో చ రిత్రను చెరిపేసే, వాస్తవాలను మరుగుపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలను తిరోగమనానికి కారణాలుగా చూపించే ప్రయత్నంలో భాగంగా.. తాజాగా నీటి పారుదల రంగంపై విడుదల చేసిన శ్వేతపత్రంతో బాబు డొల్లతనం బయటపెట్టుకున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 1994-2004మధ్య బాబు హయాంలో సాగునీటి రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత, ఆ రంగంపై వెచ్చించిన వ్యయం, అలాగే దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి (2004-2010) సాగునీటి ప్రాజెక్టులకు ఇచ్చిన ప్రాధాన్యత, ఆ రంగంపై వెచ్చించిన వ్యయం, సాధించిన ఫలితాలతో కూడిన వాస్తవ వివరాలతో అధికారులు శ్వేతపత్రం రూపొందించారు. వాస్తవాల ఆధారంగా రూపొందించిన ఈ శ్వేతపత్రం చంద్రబాబుకు ఏ మాత్రం రుచించలేదు. వైఎస్ఆర్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు, చేసిన వ్యయం, సాగులోకి వచ్చిన విస్తీర్ణం అత్యధికంగా కనపడుతూ.. తన హయాంలో ఆ రంగానికి ప్రాధాన్యమివ్వనట్టుగా, చాలా అరకొరగా వ్యయం చేసినట్టు కనిపిస్తుండంతో.. సదరు శ్వేతప్రతాన్ని విలేకరుల సమావేశంలో విడుదల చేయడానికి ఆయన ఇష్టపడలేదు. కేవలం ‘టాకింగ్ పాయింట్స్’ పేరిట ఒక పత్రాన్ని ఇచ్చి ఇదే శ్వేతపత్రం అని చెప్పి చేతులు దులిపేసుకున్నారు. అరుుతే సాగునీటి రంగంపై వాస్తవ గణాంకాలతో రూపొందించిన శ్వేతపత్రాన్ని అధికారులు ప్రభుత్వ వెబ్సైట్లో ఉంచారు. ఆ శ్వేతపత్రాన్ని పరిశీలిస్తే చంద్రబాబు రైతుల పొలాలకు సాగునీరు అందించే ప్రాజెక్టులపై ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో ఇట్టే అర్థమెపోతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 2003-04లో సాగునీటి రంగానికి బడ్జెట్లో కేవలం రూ. 2,178 కోట్లు కేటాయించగా, తదుపరి ఆర్థిక సంవత్సరం అంటే 2004-05లో వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక సాగునీటి రంగం బడ్జెట్ ఏకంగా రూ.4,254 కోట్లకు పెరిగిపోయినట్టు శ్వేతపత్రం సుస్పష్టం చేస్తోంది. చంద్రబాబు తన హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కనీసం పరిపాలన అనుమతి మంజూరు సాధించడానికి కూడా ప్రయత్నించలేదు. వైఎస్ అధికారంలోకి రాగానే దశాబ్దాల నుంచి పునాదిరాళ్లకే పరిమితమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను చేపట్టారు. ఇప్పుడు ఆ పోలవరం ప్రాజెక్టు పనులను మాత్రం వేగంగా పూర్తి చేస్తామని చంద్రబాబు శ్వేతపత్రంలో పేర్కొనడం గమనార్హం. తెలంగాణ రైతుల పొలాలకు గోదావరి జలాలను అందించాలంటే ఎత్తిపోతలు తప్ప మరో మార్గం లేదు. ఇందుకు విద్యుత్ చాలా ఎక్కువగా అవసరం అవుతుందని తెలిసి కూడా వైఎస్ ఆ పథకాలను చేపట్టారు. అయితే ఈ పథకాలను తప్పుపట్టేందుకు చంద్రబాబు శ్వేతపత్రంలో ప్రయత్నించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించాలంటే ఎకరానికి రూ.20,469 అవుతుందని, అలాగే హంద్రీ-నీవా సుజల స్రవంతి ద్వారా సాగునీరు అందించాలంటే ఎకరానికి రూ.16,750 అవుతుందని లెక్కకట్టి రైతులకు అందించే సాగునీటికి ఎక్కువ వ్యయం అవుతోదంటూ తప్పుపట్టే ప్రయత్నం చేశారు. వైఎస్ భారీ సాగునీటి ప్రాజెక్టులను చేపట్టారు. వాటి నిర్మాణం పూర్తి కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. వ్యయం కూడా ఎక్కువగానే ఉంటుంది. అవన్నీ పూర్తయితే కానీ నిర్ధారించిన లక్ష్యాల మేరకు 97.69 లక్షల ఎకరాలు సాగులోకి రావు. వైఎస్ ఆకస్మిక మృతి అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేసింది. 23.49 లక్షల ఎకరాల ఆయకట్టు నిజం కాదన్న బాబు వైఎస్ హయాంలో భారీగా నిధులు ఖర్చు చేసి 23.49 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించారని శ్వేతపత్రంలో పేర్కొన్న చంద్రబాబు.. విలేకరుల సమావేశంలో మాత్రం విమర్శలు చేశారు. 23.49 లక్షల ఎకరాలకు సాగునీరనే అంశం కేవలం కాగితాలకే పరిమితమని, వాస్తవానికి అంత ఆయకట్టుకు నీరందడం లేదని అన్నారు. మరి రికార్డుల్లో చూపించిన ఆయకట్టు ఎక్కడ ఉంది? చూపించిన ఆయకట్టులో సాగునీరు అందని భూములు ఎక్కడ ఉన్నాయి? అనే విషయాన్ని శ్వేతపత్రంలో పేర్కొనకపోవడం గమనార్హం. -
బిరబిరా కృష్ణమ్మ..!
ఆల్మట్టి ప్రాజెక్టులో 15 క్రస్టుగేట్ల ఎత్తివేత ‘జూరాల’లో పూర్తిస్థాయి నీటిమట్టం గద్వాల: కృష్ణమ్మ బిరబిరా పరుగులిడుతోంది.. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల క్రస్టుగేట్లను ఎత్తడంతో ప్రవాహం ఉరకలెత్తుతోంది.. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. జూరాల ఆయకట్టు పరిధిలో ఖరీఫ్ సీజన్ పంటలకు రెండు ప్రధాన కాల్వల ద్వారా సాగునీటిని మంగళవారం మహబూబ్‌నగర్ జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ విడుదల చేశారు. ప్రస్తుతం ఆల్మట్టి ప్రాజెక్టు రిజర్వాయర్ నీటిమట్టం 1705 అడుగులు కాగా, ఎగువప్రాంతం నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోతో 1702 అడుగులకు చేరింది. దీంతో కర్ణాటక అధికారులు ఆల్మట్టి ప్రాజెక్టులో 15 క్రస్టుగేట్లను ఒక మీటరు పెకైత్తి దిగువనదిలోకి 72,298 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ రిజర్వాయర్‌కు ఆల్మట్టి నుంచి భారీస్థాయిలో ఇన్‌ఫ్లో వస్తుండడంతో ప్రాజెక్టులో 25 క్రస్టుగేట్లను ఎత్తి దిగువనున్న జూరాల ప్రాజెక్టుకు 36,478 క్యూసెక్కుల ప్రవాహాన్ని విడుదల చేస్తున్నారు. దీంతో జూరాల జలవిద్యుత్ కేంద్రంలో ఉన్న ఆరు టర్బైన్ల ద్వారా జలవిద్యుదుత్పత్తి చేస్తూ వరద ప్రవాహాన్ని శ్రీశైలం రిజర్వాయర్‌కు బుధవారం నుంచే విడుదల చేయనున్నారు. ఇలా రాష్ట్రంలోని జూరాల, శ్రీశైలం రిజర్వాయర్లకు ఈ వర్షాకాలంలో మొదటిసారిగా కృష్ణమ్మ పరవళ్లు ప్రారంభం కానున్నాయి. తాలిపేరుకు పోటెత్తిన వరద చర్ల: ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు తాలిపేరు ప్రాజెక్ట్‌లోకి మంగళవారం వరదనీరు పోటెత్తింది. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ప్రాజెక్ట్‌కు ఐదు గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి ఉంచారు. సుమారు 20 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మధ్యాహ్నం నాలుగుగేట్లను ఎత్తి ఆరువేల క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేయగా సాయంత్రానికి వరద మరింతగా పెరగడంతో మరో గేటును, మిగతా గేట్లను కూడా మూడు అడుగుల మేర ఎత్తారు. 20 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రాత్రి 8 గంటలకు వరదనీటి ఉధృతి తగ్గుముఖం పట్టింది. రెండుగేట్లను మూసివేసి మూడు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. -
ఉపశమనం
జిల్లా అంతటా వర్షం 23.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు మండవల్లిలో అత్యధికంగా 90.2 మిల్లీమీటర్లు నారుమడులకు, వరినాట్లు పూర్తి చేసిన పొలాలకు మేలు ఖరీఫ్‌పై చిగురిస్తున్న ఆశలు ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. అన్నదాతకు ఉపశమనం లభించింది. జిల్లా అంతటా రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో నారుమడులు జీవం పోసుకుంటున్నాయి. నాట్లు వేసిన పొలాలు కళకళలాడుతున్నాయి. ఖరీఫ్ సాగుపై రైతన్నలకు ఆశలు చిగురిస్తున్నాయి. మచిలీపట్నం : ఉపరితల ద్రోణి ప్రభావంతో జిల్లాలో రెండురోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఖరీఫ్ సాగుపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. వేసవి తరువాత రెండు రోజులపాటు వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని ముసురుపట్టడంతో ఖరీఫ్ సీజన్‌కు వాతావరణం అనుకూలంగా మారిందని రైతులు అభిప్రాయపడుతున్నారు. సాగునీటి కాలువలకు నీరు విడుదలకాకపోయినా వెదజల్లే పద్ధతి ద్వారా దాదాపు 25వేల ఎకరాల్లో వరినాట్లు పూర్తిచేశారు. వర్షాధారంగానే దాదాపు 50వేల ఎకరాల్లో రైతులు నారుమడులు పోశారు. శని, ఆదివారాల్లో కురిసిన వర్షాలు వెదజల్లే పద్ధతి ద్వారా వరినాట్లు పూర్తిచేసిన పొలాలకు, నారుమడులకు మేలు చేస్తాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఆగస్టు నెల సమీపిస్తుండటంతో వర్షాలు కురుస్తాయనే ఆశతో రైతులు ఉన్నారు. వాతావరణం ఇలాగే కొనసాగితే వర్షాధారంగా అయినా పంటలు సాగు చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుందని రైతులు అంటున్నారు. 41,250 ఎకరాల్లో వరినాట్లు ఈ ఖరీఫ్‌లో జిల్లాలో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయాల్సి ఉంది. జూన్, జూలైల్లో వర్షపాతం తక్కువగా నమోదవటంతో వరినాట్లు ఆలస్యమయ్యాయి. వెదజల్లే పద్ధతి, బోరునీటి ఆధారంగా 41,250 ఎకరాల్లో వరినాట్లు ఇప్పటివరకు పూర్తయినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. పెడన, గుడ్లవల్లేరు, బందరు, బంటుమిల్లి, కృత్తివెన్ను తదితర మండలాల్లో వెదజల్లే పద్ధతి ద్వారా, ఘంటసాల, మొవ్వ, ఉంగుటూరు, తోట్లవల్లూరు, కంకిపాడు తదితర మండలాల్లో బోరు నీటి ఆధారంగా వరినాట్లు పూర్తిచేశారు. జూలై 27వ తేదీ నాటికి జిల్లాలో 286.5 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 144.3 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. వర్షాలు సక్రమంగా కురవకపోవటంతో వరినాట్లు పూర్తి చేసిన పొలాల్లో పైరు, నారుమడులకు పోషకాలు సక్రమంగా అందక, నీరు లేక పైరు ఎండిపోయే దశకు చేరుకుంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఈ పైరుకు ప్రాణం పోసినట్లయింది. ఇప్పటి వరకు 18,750 ఎకరాల్లో వరినారుమడులు పోశారు. ఈ వర్షాల వల్ల మిగిలిన ప్రాంతాల్లోనూ నారుమడులు పోసుకునేందుకు అవకాశం ఏర్పడనుంది. చెరకు మొక్కల ఎదుగుదలకు దోహదం ఈ ఖరీఫ్ సీజన్లో 37,500 ఎకరాల్లో చెరకు సాగు జరుగుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేయగా 40వేల ఎకరాలకు ఈ సాగు పెరిగింది. మొక్కతోటల్లో వర్షాలు లేకపోవటంతో మొక్కల్లో ఎదుగుదల లోపించింది. వర్షాలు కురుస్తుండటంతో చెరకు తోటలకు మేలు జరుగుతుందని వ్యవసాయశాఖ జేడీ బి.నరసింహులు, డీడీ బాలునాయక్ తెలిపారు. పత్తికి మేలు పశ్చిమ కృష్ణాలోని నందిగామ, జగ్గయ్యపేట, వీరులపాడు, కంచికచర్ల, గంపలగూడెం, తిరువూరు, మైలవరం, జి.కొండూరు తదితర ప్రాంతాల్లో ఇప్పటి వరకు 75వేల ఎకరాల్లో పత్తిసాగు చేపట్టారు. ఈ ఖరీఫ్ సీజన్లో 1.40 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతుందని అంచనా. వర్షాభావం కారణంగా పత్తిసాగు గణనీయంగా తగ్గింది. పత్తిని పక్కనపెట్టిన రైతులు సుబాబుల్ సాగుపై మక్కువ చూపుతున్నారు. వర్షాలు సక్రమంగా కురవకపోవటంతో పత్తి మొక్కల్లోనూ ఎదుగుదల లోపించింది. అధిక ఉష్ణోగ్రతలు, వర్షాలు కురవకపోవటంతో మారాకు దశలో ఉన్న పత్తి మొక్కలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు పత్తి మొక్కల ఎదుగుదలకు మేలు చేస్తాయని, ఇదే వాతావరణం కొనసాగితే మొక్కలు త్వరితగతిన ఎదుగుతాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఆదివారం నమోదైన వర్షపాతం వివరాలు జిల్లాలో ఆదివారం 23.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. మండవల్లిలో అత్యధికంగా 90.2 మిల్లీమీటర్లు, అత్యల్పంగా పమిడిముక్కలలో 0.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎ.కొండూరు-64.8, రెడ్డిగూడెం-61.4, కలిదిండి-57.4, తిరువూరు-54.2, ముదినేపల్లి-45.6, విస్సన్నపేట-42.6, నూజివీడు-38.6, బంటుమిల్లి-37.6, ముసునూరు-36.2, కైకలూరు-36.2, చాట్రాయి-35.2 మైలవరం-35.0, కంకిపాడు-31.2, జి.కొండూరు 30.4, పామర్రు-28.6, గన్నవరం-27.6, ఆగిరిపల్లి-26.2, చల్లపల్లి-24.4, బాపులపాడు-24.2మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. విజయవాడ-24.0, గూడూరు-24.0, ఘంటసాల-22.4, ఉయ్యూరు-21.4, మచిలీపట్నం-20.6, గంపలగూడెం-20.4, పెదపారుపూడి-19.2, కోడూరు-18.2, పెనమలూరు-15.8, గుడివాడ-14.8, వీరులపాడు-11.6, గుడ్లవల్లేరు-11.2, కృత్తివెన్ను-10.2, ఉంగుటూరు-10.2, మోపిదేవి-9.2, నందివాడ-8.2, మొవ్వ-6.8, అవనిగడ్డ-6.4, వత్సవాయి-5.8, తోట్లవల్లూరు-5.4, పెడన-5.2, కంచికచర్ల-5.2, ఇబ్రహీంపట్నం-5.0, నాగాయలంక-4.4, నందిగామ-4.4, పెనుగంచిప్రోలు-4.0, చందర్లపాడు-3.2 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. -
వంశ‘ధార’పారింది
ప్రధాన కాలువల ద్వారా సాగునీరు విడుదల హిరమండలం: వంశధార కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా సాగునీటిని అధికారులు శుక్రవారం విడుదల చేశారు. ఎస్ఈ బి.రాంబాబు ముందుగా వంశధార నదికి పూజలు నిర్వహించి నీరు విడిచిపెట్టారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వరినారుమడులు ఎండిపోతున్నాయన్న రైతుల కోరికతోపాటు, రాష్ట్ర కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు నీరు విడిచి పెట్టామన్నారు. నదిలో ఇన్‌ఫ్లో తక్కువగా వస్తున్నందు నీటిని రైతులు పొదుపుగా ఉపయోగించుకోవాలని సూచించారు. కుడికాలువ ద్వారా 55 కిలోమీటర్ల పరిధిలోని హిరమండలం, ఎల్.ఎన్,పేట, సరుబుజ్జిలి, బూర్జ, ఆమదాలవలస, గార, శ్రీకాకుళం మండలాల్లోని 62,280 ఎకరాలకు, ఎడమ ప్రధాన కాలువ ద్వారా 104 కిలోమీటర్ల మేర హిరమండలం, జలుమూరు. టెక్కలి, పోలాకి, సంతబొమ్మాళి, పలాస, నరసన్నపేట, మెళియాపుట్టి, సారవకోట, కోటబొమ్మాళి, నందిగాం, వజ్రపుకొత్తూరు మండలాల్లోని 1.48 లక్షల ఎకరాలకు సాగునీరు అందజేయనున్నట్టు ఎస్ఈ పేర్కొన్నారు. కుడికాలువ ద్వారా 50 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 150 క్యూసెక్కులు నీటిని విడిచిపెడతామన్నారు. ఈ కార్యక్రమంలో వంశధార ఈఈ లు రామచంద్రరావు, మన్మథరావు, డీఈఈ ఎస్.జగదీశ్వరరావు, ఏఈఈలు పాల్గొన్నారు. -
సాగునీరు సందేహమే
తంగెడ మేజర్ కాలువ పరిధిలోని వ్యవసాయ భూములకు ఈ ఏడాది సక్రమంగా సాగునీరు అందే పరిస్థితి కన్పించటం లేదు. 35 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ కాలువ పూర్తిగా పిచ్చి మొక్కలతోను, పూడికతోనూ నిండిపోయింది. కరకట్టలు పూర్తిగా దెబ్బతిన్నాయి. డ్రాప్‌లు శిథిల స్థితికి చేరాయి. అయినప్పటికీ ఆధునీకరణ పనులు ముందుకు సాగక పోవడంతో ఖరీఫ్‌కు ఈ కాల్వ పరిధిలో చివరి భూములకు సాగునీరు అందడం కష్టమేనని అన్నదాతలు భావిస్తున్నారు. తంగెడ మేజర్ కాలువలను నిర్మించిన తరువాత ఇప్పటి వరకు కనీస మరమ్మతులు చేపట్టలేదు. పిడుగురాళ్ల మండలం శాంతినగర్ నుంచి దాచేపల్లి మండలం తంగెడ వరకు 8 కిలో మీటర్లకుపైగా కాలువలో చెట్లు, రబ్బరు ఆకులు మెండుగా పెరిగి ఉన్నాయి. కరకట్టలపై, కాలువలో ముళ్లచెట్లు పెరిగి ఉన్నాయి. కాల్వలో అల్లుకుపోయిన రబ్బరు ఆకులు సాగునీరు పారుదలకు ఆటంకంగా మారాయి. కొన్నిచోట్ల కరకట్టలు బాగా బలహీనంగా ఉండి నీటి పారుదల ఎక్కువైయితే తెగిపోయే ప్రమాదం ఉంది. ముత్యాలంపాడు అడ్డరోడ్డు వద్ద తంగెడ మేజర్ కాలువ కోతకు గురైంది. నాగార్జునసాగర్ కుడికాలువ ఆధునీకరణ పనుల్లో భాగంగా 35వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈకాలువ ఆధునీకరణ పనులు చేపట్టాలని అధికారులు భావించారు. జూలకల్లు బ్రాంచి నుంచి 25 కిలోమీటర్ల పొడవు ఉండే తంగెడ మేజర్ కాల్వకు రూ.14.50 కోట్ల అంచనా వ్యయంతో ఆధునీకరణ చేయాలని 2012 జూలైలో పనులు ప్రారంభించారు. 38 నెలల్లో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. పూడికతో పాటుగా శిథిలావస్థకు చేరిన డ్రాప్ట్ల స్థానంలో కొత్తగా నిర్మించటం, సిమెంట్ లైనింగ్ పనులు, కరక ట్టల బలోపేతం వంటి పనులను చేపట్టాల్సి ఉంది. ఈ కాలువ పరిధిలో ఉన్న 32 డ్రాప్‌లకు గాను ఇప్పటికే 28 నిర్మించారు. మరో నాలుగు నిర్మించాల్సి ఉంది. ఐదు వేల ఎకరాలకూ అనుమానమే.. కాల్వ ఆధునికీరణ పనులు అనుకున్నంత వేగంగా జరగడం లేదు. సాగునీరు నిలిపివేసిన తరువాత పనులు చేపట్టటంలో జాప్యం జరిగింది. కాంట్రాక్టర్ సకాలంలో పనులు చేపట్టకపోవటంతో ఈ ఖరీప్ సీజన్లో సకాలంలో పంటలకు సాగునీరు అందే పరిస్థితి కన్పించటంలేదు. డ్రాప్‌ల నిర్మాణం దాదాపు పూర్తికావచ్చినా కాలువలో పెరిగిన ముళ్లచెట్లు, రబ్బరు ఆకులు, కరకట్టల బలోపేతం, పూడికతీత పనులను చేపట్టాల్సి ఉంది. ఈ కాలువ కింద ఉన్న సుమారు 5వేల ఎకరాల చివరి భూములకు సాగునీరు అందకపోవటంతో ఆ భూముల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంటలకు నీళ్లతడి వేయలంటే అన్నదాతలు రేయింబవళ్లు కాలువపై జాగారం చేయాల్సిన పరిస్థితులున్నాయి. ఈ ఏడాదైయిన కాలువ ఆధునికీకరణ పనులు ముగిస్తే చివరిభూములకు కూడా సాగునీరు అందుతుందని రైతులు ఆశపడ్డారు. అనుకున్న విధంగా పనులు ముందుకు సాగకపోవడం ప్రస్తుతం వారిని కలవర పెడుతోంది. పనులను వేగవంతం చేస్తున్నాం.. తంగెడ మేజర్‌కాలువ ఆధునీకరణ పనులను వేగవంతంగా చేయిస్తున్నాం. డ్రాప్‌ల నిర్మాణం దాదాపుగా పూర్తయింది. కొన్నిచోట్ల చెట్ల తొలగింపు, కాలువలో పెరిగిన రబ్బరు ఆకుల తొలగింపు చేపట్టాలి. నిర్ణీత సమయానికి పనులు పూర్తవుతాయని భావిస్తున్నాం. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ పంటలకు సాగునీరు అందించే ఏర్పాట్లు చేస్తాం.-ఇరిగేషన్ ఏఈ ఆదినారాయణ -
నత్తే నయం
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: 50,250 ఎకరాలకు సాగునీరు అందించేందుకు జలయజ్ఞం పథకంలో భాగంగా 2005లో కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకం ప్రారంభించారు. నిధుల కొరత, పాలకుల నిర్లక్ష్యం కారణంగా పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ప్రి యదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోతల ద్వారా సుమారు 40 కిలోమీటర్లు తీసుకొచ్చి కోయిల్‌సాగర్ రిజర్వాయర్‌ను నింపడమే ఈ పథకం ప్రధాన ఉ ద్దేశం. రూ.359 కోట్ల అంచనావ్యయంతో పనులు చేపట్టి నిధులన్నీ ఖర్చుచేశారు. అప్రోచ్ చానల్ 9.90 కి.మీ మేర, టన్నెల్ 10.25 కి.మీ, గ్రావిటీకాల్వ 28.75 కిలోమీటర్ల మేర తవ్వాలని నిర్ణయించారు. రెండు లిఫ్టుల ద్వారా 3.90 టీఎంసీల నీటిని వినియోగించాల్సి ఉంది. ఈ పథకం ద్వారా 72 గ్రామాలు లబ్ధిపొందనున్నాయి. కాగా, 2009 చివరి నాటికి పనులు పూర్తిచేసి 2010 ఖరీఫ్ నుంచి ఆయకట్టుకు సాగురు అందించాలనే ఆశయంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిధులు కొరత లేకుండా మంజూరు చేశారు. ఆయన మరణానంతరం ప్రాజెక్టుపై పర్యవేక్షణ కొరవడటంతో మరో ఏడాది గడిచినా పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇక ఇప్పటివరకు స్టేజ్-1, స్టేజ్-2లో 90 శాతం పనులు పూర్తయ్యాయి. కేవలం పిల్లకాల్వల నిర్మాణం కోసం 720 ఎకరాలు సేకరించాల్సి ఉండగా అదీ జరగలేదు. ముఖ్యంగా పథకం ట్రయల్న్ ్రకోసం విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని అధికారులు పదేపదే నివేదికలు పంపుతున్నా ప్రభుత్వం నుంచి అనుమతులు రావడం లేదు. 2009లో పనులు పూర్తిచేస్తామని కాంట్రాక్టర్ ఒప్పందంలో పేర్కొన్నా.. వాయిదాలు వేస్తూ 2011 మార్చి, 2012 మార్చి, 2012 జూన్ అంటూ చివరికి 2013 మార్చి నాటికి పనులు పూర్తి చేయనున్నట్లు కొత్త తేదీని ప్రకటించారు. గడువు దాటి ఆరునెలలు గడిచినా పట్టించుకునేవారు లేరు. పెండింగ్ పనులు రెండు సర్జ్పూల్స్తో పాటు రెండు లిఫ్టులను వినియోగించాల్సి ఉంది. స్టేజ్- 1 కింద మొదటి లిఫ్టు నర్వ మండలం ఎల్లంపల్లి వద్ద, స్టేజ్-2 కింద రెండో లిఫ్టును మరికల్ మండలం తీలేరు శివారులో ఏర్పాటు చేశారు. 40 కిలోమీటర్ల మార్గంలో 10.25 కిలో మీటర్ల మేర టన్నెల్స్ ద్వారా నీటిని పంపిస్తారు. ముఖ్యంగా ఒక్కో పంపునకు 7.5 మెగావాట్ల చొప్పున ప్రాజెక్టుకు మొత్తం 30 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుంది. కేవలం వర్షపాతంపై ఆధారడిన కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో నిండిన సందర్భాలు లేవు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కోయిల్‌సాగర్ ఆయకట్టు, అదనపు ఆయకట్టును కలిపి మొత్తం 50,250 ఎకరాలకు సాగునీరు ఇచ్చే విధంగా రూపకల్పన చేశారు. విద్యుత్ కనెక్షన్‌కు ప్రభుత్వం అనుమతిస్తే ప్రాజెక్టు పరిధిలోని దేవరకద్ర మండలంలో 11,420 ఎకరాలు, చిన్నచింతకుంట మండలంలో 6,420 ఎకరాలు, ధన్వాడ మండలంలో 21,940 ఎకరాలు, కోయిల్‌కొండ మండలంలో 70 ఎకరాలు, మక్తల్ మండలంలో 3,100 ఎకరాలు, నర్వ మండలంలో 7,300 ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉంది. నివేదికలు పంపాం.. ఇప్పటివరకు 95 శాతం పనులు పూర్తయ్యాయి. విద్యుత్ కనెక్షన్ కోసం ప్రభుత్వ అనుమతి కోసం నివేదికలు పంపాం. అనుమతి ఇచ్చి విద్యుత్ కనెక్షన్ ఇచ్చిన 45 రోజుల్లోనే ట్రయల్న్ ్రపూర్తిచేస్తాం. - పురుషోత్తం, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నిర్లక్ష్యం చేసిన పాలకులు కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకం విషయంలో పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ ఖరీఫ్‌కు నీళ్లు ఇవ్వాల్సి ఉన్నా కెనాల్లో ఉన్న ముళ్ల కంపలు తొలగించేందుకు కనీసం ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం మంజూరు చేయలేదు. ప్రాజెక్టులో 32 అడుగులు నీళ్లు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 10 అడుగులు మాత్రమే ఉన్నాయి. ప్రాజెక్టు కింద ఉన్న భూములకు సంబంధించి రైతుల నుంచి వసూలు చేసిన శిస్తు కూడా ప్రభుత్వానికి జమ చేయలేదు. మోటార్లు ఏర్పాటు చేసినా డ్రై ట్రయల్న్ ్రచేసేందుకు కనీసం విద్యుత్ కనెక్షన్ కూడా ఇవ్వలేదు. జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులను కలిసినా ఫలితం లేకపోయింది. -
కరుణాకరరెడ్డి నేతృత్వంలో వేల మందితో మహిళా భేరి
అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టి కురుక్షేత్ర సంగ్రామానికి నాంది పలికిన శకునిలా, రెండు ప్రాంతాలను వేరుచేసి మరో కురుక్షేత్ర యుద్ధానికి తెరదీస్తున్న ఆడ శకుని సోనియాగాంధీ అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా శనివారం తిరుపతి అన్నారావు సర్కిల్ వద్ద కరుణాకరరెడ్డి నేతృత్వంలో వేల మందితో మహిళా భేరి నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విభజన జరిగితే తాగునీరు, సాగునీరు లేక రాయలసీమ ప్రజలు అలమటించాల్సి వస్తుందని తెలిపారు. భారతంలో ద్రౌపదికి వస్త్రాపహరణం చేస్తుంటే, కౌరవులు చూస్తూ ఉండిపోయినట్లు, తెలుగుతల్లికి అదే పరిస్థితి నెలకొంటే, సీమాంధ్ర ఎంపీలు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. సాక్షి, తిరుపతి: రాష్ట్ర విభజన ప్రకటనకు నిరసనగా తిరుపతి అన్నారావు సర్కిల్లో శనివారం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో దాదాపు ఏడువేలమంది మహిళలతో మహిళా భేరి జరిగింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందేనని మహిళలు ముక్తకంఠంతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి మాట్లాడుతూ విభజన జరిగితే తెలంగాణలో కృష్ణ, గోదావరి నదులపై ఆనకట్ట కడతారని, దీంతో సీమాంధ్రలో వ్యవసాయ భూములు బీళ్లవుతాయన్నారు. రాయలసీమవాసులు ఉలవలు తిని బతకాలని, తాగునీటి కోసం అలమటించాల్సి వస్తుందని తెలిపారు. మహిళలు వంటకు కన్నీళ్లనే వాడుకోవాల్సి దుస్థితి దాపురిస్తుందన్నా రు. సీమాంధ్రకు సజీవ నదులు లేవని, శ్రీవేంకటేశ్వరస్వామి పాదాలకింద ప్రవహించే విరజానదిలోని నీటిని ఇమ్మని బిందె లు తీసుకుని వేడుకోవాల్సి ఉంటుందని అన్నారు. మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొన్నారంటే విభజనపై ఎంత నిరసన ఉందో తెలుసుకోవచ్చని తెలిపారు. అందరికీ అత్మీయతను పంచే మహిళ కళ్లెర్ర చేస్తే దుర్గమ్మ అవుతుందని కేంద్రాన్ని హెచ్చరించారు.గాలేరు-నగిరి, హంద్రీ-నీవా లాంటి పథకాలతో సస్యశ్యామలం చేద్దామనుకున్న వైఎస్ రాజశేఖరరెడ్డి కలలు కల్లలుగా మిగిలిపోతాయని అన్నారు. శ్రీశైలం మల్లన్న అభిషేకానికి కూడా నీళ్లు దొరకవని, ఆయనకు మనరక్తంతోనే అభిషేకం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. గత 60 ఏళ్లుగా సీమాంధ్రుల డబ్బు, రక్తంతో నిర్మించిన తలలాంటి హైదరాబాద్‌ను తెలంగాణ వారికిచ్చి, మొండెంను మాత్రమే మనకివ్వాలని చూస్తున్నారని చెప్పారు. రాష్ట్రానికి వచ్చే 1.20 లక్షల కోట్ల ఆదాయంలో, 90వేల కోట్లు హైదరాబాద్ నుం చే వస్తోందని అన్నారు. అంతా వారికిచ్చేస్తే, సీమాంధ్రకు నిధులు ఎలా వస్తాయని, పథకా లు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. భారతంలో ద్రౌపదికి వస్త్రాపహరణం చేస్తుంటే, కౌరవులు చూస్తూ ఉండిపోయినట్లు, తెలుగుతల్లికి అదే పరిస్థితి నెలకొంటే, సీమాం ధ్ర ఎంపీలు అదే తరహాలో చూస్తున్నారని ఆరోపించారు. పార్టీ అధినేత్రి ముందు గంగిరెద్దుల్లా తలలు ఊపి వస్తున్నారని ఎద్దేవా చేశారు. టీటీడీ ట్రస్టు బోర్డు మాజీ సభ్యుడు ఒవి.రమణ మాట్లాడుతూ కుమారుడిని ప్రధానమంత్రిని చేసేందుకు సోనియా విభజన ప్రక్రియకు రూపకల్పన చేసిందని విమర్శించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి లేని లోటు నేడు స్పష్టంగా కనిపిస్తోందని, ఆయన ఉంటే ఈపరిస్థితి వచ్చేది కాదని కాంగ్రెసు ఎంపీలే అంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర కన్వీనర్ పాలగిరి ప్రతాప్‌రెడ్డి, మహిళా కన్వీనర్ కుసుమ, చెంచయ్య యాదవ్, గోపీయాదవ్, సోమశేఖర్, హర్ష, తొండమనాటి వెంకటేష్, ముద్రనారాయణ, రాజేంద్ర, ఖాద్రీ, ఎంవిఎస్.మణి తదితరులు పాల్గొన్నారు.