అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టి కురుక్షేత్ర సంగ్రామానికి నాంది పలికిన శకునిలా, రెండు ప్రాంతాలను వేరుచేసి మరో కురుక్షేత్ర యుద్ధానికి తెరదీస్తున్న ఆడ శకుని సోనియాగాంధీ అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా శనివారం తిరుపతి అన్నారావు సర్కిల్ వద్ద కరుణాకరరెడ్డి నేతృత్వంలో వేల మందితో మహిళా భేరి నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విభజన జరిగితే తాగునీరు, సాగునీరు లేక రాయలసీమ ప్రజలు అలమటించాల్సి వస్తుందని తెలిపారు. భారతంలో ద్రౌపదికి వస్త్రాపహరణం చేస్తుంటే, కౌరవులు చూస్తూ ఉండిపోయినట్లు, తెలుగుతల్లికి అదే పరిస్థితి నెలకొంటే, సీమాంధ్ర ఎంపీలు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు.
సాక్షి, తిరుపతి: రాష్ట్ర విభజన ప్రకటనకు నిరసనగా తిరుపతి అన్నారావు సర్కిల్‌లో శనివారం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో దాదాపు ఏడువేలమంది మహిళలతో మహిళా భేరి జరిగింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందేనని మహిళలు ముక్తకంఠంతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి మాట్లాడుతూ విభజన జరిగితే తెలంగాణలో కృష్ణ, గోదావరి నదులపై ఆనకట్ట కడతారని, దీంతో సీమాంధ్రలో వ్యవసాయ భూములు బీళ్లవుతాయన్నారు. రాయలసీమవాసులు ఉలవలు తిని బతకాలని, తాగునీటి కోసం అలమటించాల్సి వస్తుందని తెలిపారు. మహిళలు వంటకు కన్నీళ్లనే వాడుకోవాల్సి దుస్థితి దాపురిస్తుందన్నా రు.
సీమాంధ్రకు సజీవ నదులు లేవని, శ్రీవేంకటేశ్వరస్వామి పాదాలకింద ప్రవహించే విరజానదిలోని నీటిని ఇమ్మని బిందె లు తీసుకుని వేడుకోవాల్సి ఉంటుందని అన్నారు. మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొన్నారంటే విభజనపై ఎంత నిరసన ఉందో తెలుసుకోవచ్చని తెలిపారు. అందరికీ అత్మీయతను పంచే మహిళ కళ్లెర్ర చేస్తే దుర్గమ్మ అవుతుందని కేంద్రాన్ని హెచ్చరించారు.గాలేరు-నగిరి, హంద్రీ-నీవా లాంటి పథకాలతో సస్యశ్యామలం చేద్దామనుకున్న వైఎస్ రాజశేఖరరెడ్డి కలలు కల్లలుగా మిగిలిపోతాయని అన్నారు. శ్రీశైలం మల్లన్న అభిషేకానికి కూడా నీళ్లు దొరకవని, ఆయనకు మనరక్తంతోనే అభిషేకం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు.
గత 60 ఏళ్లుగా సీమాంధ్రుల డబ్బు, రక్తంతో నిర్మించిన తలలాంటి హైదరాబాద్‌ను తెలంగాణ వారికిచ్చి, మొండెంను మాత్రమే మనకివ్వాలని చూస్తున్నారని చెప్పారు. రాష్ట్రానికి వచ్చే 1.20 లక్షల కోట్ల ఆదాయంలో, 90వేల కోట్లు హైదరాబాద్ నుం చే వస్తోందని అన్నారు. అంతా వారికిచ్చేస్తే, సీమాంధ్రకు నిధులు ఎలా వస్తాయని, పథకా లు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. భారతంలో ద్రౌపదికి వస్త్రాపహరణం చేస్తుంటే, కౌరవులు చూస్తూ ఉండిపోయినట్లు, తెలుగుతల్లికి అదే పరిస్థితి నెలకొంటే, సీమాం ధ్ర ఎంపీలు అదే తరహాలో చూస్తున్నారని ఆరోపించారు.
పార్టీ అధినేత్రి ముందు గంగిరెద్దుల్లా తలలు ఊపి వస్తున్నారని ఎద్దేవా చేశారు. టీటీడీ ట్రస్టు బోర్డు మాజీ సభ్యుడు ఒవి.రమణ మాట్లాడుతూ కుమారుడిని ప్రధానమంత్రిని చేసేందుకు సోనియా విభజన ప్రక్రియకు రూపకల్పన చేసిందని విమర్శించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి లేని లోటు నేడు స్పష్టంగా కనిపిస్తోందని, ఆయన ఉంటే ఈపరిస్థితి వచ్చేది కాదని కాంగ్రెసు ఎంపీలే అంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర కన్వీనర్ పాలగిరి ప్రతాప్‌రెడ్డి, మహిళా కన్వీనర్ కుసుమ, చెంచయ్య యాదవ్, గోపీయాదవ్, సోమశేఖర్, హర్ష, తొండమనాటి వెంకటేష్, ముద్రనారాయణ, రాజేంద్ర, ఖాద్రీ, ఎంవిఎస్.మణి తదితరులు పాల్గొన్నారు.
కరుణాకరరెడ్డి నేతృత్వంలో వేల మందితో మహిళా భేరి
Published Sun, Aug 18 2013 3:45 AM | Last Updated on Fri, Sep 1 2017 9:53 PM
Advertisement
Advertisement