టగ్‌బోట్ల సాయంతో కాలువలో ముందుకు కదులుతున్న నౌక
సూయెజ్(ఈజిప్ట్): సూయెజ్ కాలువలో కూరుకుపోయిన అత్యంత భారీ కంటెయినర్ ఓడ ‘ఎవర్ గివెన్’ ఎట్టకేలకు కదిలింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దాదాపు వారం క్రితం ఈ ఓడ.. అంతర్జాతీయ సరుకు రవాణాలో కీలకమైన సూయెజ్ కాలువలో అడ్డం తిరిగి చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. దాంతో సూయెజ్ కాలువలో సరుకు రవాణా ఒక్కసారిగా ఆగిపోయింది. వారం రోజులుగా అంతర్జాతీయ సరుకు రవాణా నిలిచిపోయి, వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.
ఈ నేపథ్యంలో ఆ భారీ రవాణా నౌకను కదిలించేందుకు అంతర్జాతీయ నిపుణులు గత వారం రోజులుగా చేస్తున్న కృషి సోమవారానికి ఫలించింది. వాతావరణ పరిస్థితులు, పోటెత్తిన అలలు కొంతవరకు వారికి సహకరించాయి. కూరుకుపోయిన నౌక భాగాన్ని కదిలించేందుకు ఒకవైపు డ్రెడ్జింగ్ చేస్తూ, మరోవైపు 10 టగ్ బోట్లతో వెనక్కు లాగుతూ నిపుణులు ప్రయత్నించారు. అలాగే, నౌక చుట్టూ 18 మీటర్ల లోతు వరకు 27 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తొలగించారు. అనంతరం, కెనాల్ ఉత్తర, దక్షిణ తీరాలకు మధ్యనున్న వెడల్పైన ‘గ్రేట్ బిట్టర్ లేక్’ వద్దకు 2.2 లక్షల టన్నుల బరువైన ఆ నౌకను తీసుకు రాగలిగారు. అక్కడ ఆ నౌకను క్షుణ్నంగా పరిశీలిస్తారు. నౌక సాంకేతిక సామర్థ్యాన్ని పరీక్షిస్తారు.
నౌక కదులుతున్న దృశ్యాలను ఉపగ్రహ ఛాయాచిత్రాలతో ‘మెరైన్‌ట్రాఫిక్.కామ్’ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. ఈ విధానం సఫలం కానట్లైతే, నౌకలోని దాదాపు 20 వేల కంటెయినర్లను వేరే షిప్‌లోకి మార్చి, అనంతరం, బరువు తగ్గిన ఈ నౌకను కదిలించాల్సి వచ్చేది. ఇసుక, బురదలో కూరుకుపోయిన ‘ఎవర్ గివెన్’ నౌకను తిరిగి కదిలించి, ప్రధాన మార్గంలోకి తీసుకువచ్చే బాధ్యతను ‘బొస్కాలిస్’ అనే నౌకా నిర్వహణ, మరమ్మత్తుల సంస్థకు అప్పగించారు. ఆ పని పూర్తికాగానే ‘మా పని పూర్తి చేశాం. సూయెజ్ కెనాల్ అథారిటీస్‌తో కలిసి మా నిపుణులు ఎవర్‌గివెన్‌ను జలాల్లోకి తీసుకురాగలిగారు. ఈ కాలువ ద్వారా రవాణా మళ్లీ ప్రారంభమయ్యేందుకు మార్గం సుగమమయింది’ అని ఆ సంస్థ సీఈఓ పీటర్ ప్రకటించారు.
కాలువ మార్గానికి అడ్డంగా గత మంగళవారం జపాన్‌కు చెందిన సరకు రవాణా నౌక ‘ఎవర్ గివెన్’ చిక్కుకుపోవడంతో వారం రోజులుగా అంతర్జాతీయ రవాణా నిలిచింది. దాంతో రోజుకు దాదాపు 900 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లింది. సూయెజ్ కాలువ మార్గంలో వారం రోజుల పాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడిన నేపథ్యంలో.. ఎవర్ గివెన్ నౌకను కదిల్చినప్పటికీ.. ఈ కాలువ గుండా సాధారణ స్థాయిలో నౌకల రవాణా జరిగేందుకు మరికొంత సమయం పట్టే అవకాశముంది. ఇప్పటికే దాదాపు 367 నౌకలు ఇరువైపులా నిలిచిపోయాయి. ఇవన్నీ క్లియర్ అయ్యేందుకు 10 రోజులు పడుతుందని రిఫినిటివ్ అనే సంస్థ అంచనా వేసింది. పలు నౌకలు ప్రత్యామ్నాయ, సుదూర మార్గమైన ‘కేప్ ఆఫ్ గుడ్‌హోప్’ ద్వారా వెళ్తున్నాయి. అంతర్జాతీయ సరకురవాణా వాణిజ్యంలో 10% సూయెజ్ కాలువ ద్వారా జరుగుతుంది. క్రూడాయిల్ రవాణాలో ఈ మార్గం వాటా దాదాపు 7%. గత సంవత్సరం ఈ మార్గం గుండా 19 వేలకు పైగా నౌకలు వెళ్లాయి.
Comments
Please login to add a commentAdd a comment