సూయెజ్‌ దిగ్బంధనం నేర్పుతున్న పాఠాలు | Dirk Siebels Guest Column On Suez Canal Tragedy | Sakshi
Sakshi News home page

సూయెజ్‌ దిగ్బంధనం నేర్పుతున్న పాఠాలు

Published Thu, Apr 1 2021 12:10 AM | Last Updated on Thu, Apr 1 2021 7:55 AM

Dirk Siebels Guest Column On Suez Canal Tragedy - Sakshi

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నౌకా రవాణాపై ఎంత అధికంగా ఆధారపడి ఉందనేది సూయెజ్‌ కాలువలో ప్రమాదం వల్ల తేటతెల్లమైంది. చాలాకాలంగా నౌకారవాణా ప్రాధాన్యత కొనసాగుతూ వస్తోంది. కానీ అంతర్జాతీయ నౌకా పరిశ్రమ చాలావరకు అదృశ్య రూపంలోనే ఉంటోంది. ప్రస్తుత సందర్భంలో ఎవర్‌ గివెన్‌ నౌక సూయెజ్‌ కాలువలో ఇరుక్కుపోవడం అనేది భద్రతాపరమైన ఘటన కాదు కానీ ఇలాంటి ఇరుకైన ప్రాంతాల సంక్లిష్ట స్వభావం గురించి ప్రపంచం ఇకపై చాలా సంవత్సరాలు చర్చించే అవకాశం మెండుగా ఉంది. సూయెజ్‌ కాలువలో సంభవించినటువంటి తాజా దిగ్బంధన పర్యవసానాలు చాలా రంగాలపై ప్రభావం చూపుతాయి. ఈజిప్ట్‌లోని సూయెజ్‌ కాలువకు అడ్డుపడి ఇరుక్కుపోయిన భారీ సరుకు రవాణా నౌక ఎవర్‌ గివెన్‌ వారంరోజుల పాటు ప్రపంచాన్ని దిగ్భ్రాంతిపరిచింది. ఎవర్‌ గివెన్‌ నౌక పొడవు 400 మీటర్లు (1,321 అడుగులు), బరువు 2 లక్షల టన్నులు. దీని గరిష్ట సామర్థ్యం 20 వేల సరుకుల కంటైనర్లు. సూయెజ్‌ కాలువకు అడ్డుపడిన ఘటనలో ఆ మార్గంలో ప్రయాణించే నౌకల ట్రాఫిక్‌ను ఈ భారీ నౌక పూర్తిగా అడ్డుకుంది. మార్చి 29 సోమవారం వేకువ జామున నౌక పాక్షికంగా కదలడంతో దాన్ని తిరిగి కాలువలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ఫలించినట్లయింది. 

ఇరుకైన ప్రాంతాలగుండా రవాణా
షిప్పింగ్‌ పరిశ్రమ సకాలంలో సరుకులు చేరవేసే అత్యంత సమర్థవంతమైన అనుసంధానాన్ని అందిస్తుంటుంది. అయితే కరోనా మహమ్మారి విరుచుకుపడిన కాలంలో చాలా దేశాలు నౌకల్లో పనిచేసేవారిని కీలకమైన సిబ్బందిగా పరిగణించేంతవరకూ ఈ లింక్‌ దాదాపుగా బయటకు కనిపించలేదు. నౌకా రవాణాలో సూయెజ్‌ కాలువ వంటి ఇరుకైన జలసంధి ప్రాంతాలు దిగ్బంధనకు గురైనప్పుడు సముద్ర వాణిజ్యం తప్పనిసరిగా ప్రతిష్టంభనకు గురికావలసిన అవసరం లేదు. సాధారణ పరిస్థితుల్లో సుదీర్ఘ దూరాలకు నౌకల ద్వారా అన్నిరకాల సరుకుల రవాణా కారు చౌకగా సాధ్యపడుతుంటుంది. నౌకలో చేర్చిన సరుకుల ధరతో పోలిస్తే వాటి రవాణా ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. నౌకా రవాణా చార్జీలు అధికంగా ఉంటే అది ఆర్థికంగా మొత్తం మీద పెద్ద సమస్యగా మారుతుంది. కాకుంటే సూయెజ్‌ కాలువలో సంభవించినటువంటి తాజా దిగ్బంధన పర్యవసానాలు చాలా రంగాలపై ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు, చమురు శుద్ధి కర్మాగారాలకు నిత్యం ముడిచమురు అవసరం. ఫ్యాక్టరీలకు ముడిసరుకులు అవసరం. అమ్మడానికి షాపులకు సరుకులు అవసరం. ఇదొక గొలుసుకట్టుగా నడుస్తుంటుంది.

భద్రతా ప్రమాదాలు
సముద్రయానంలో భద్రతా ప్రమాదాలను అతిశయించి చెప్పడం సులభమే కానీ వాటిని అర్థం చేసుకోవడం చాలా క్లిష్టంగా ఉంటుంది. సూయెజ్‌ కాలువలో ప్రతిష్టంభన నేపథ్యంలో ఆఫ్రికా చుట్టూ తిరిగి పోవలసిన మార్గంలో అదనంగా సముద్ర బందిపోట్ల ప్రమాదాన్ని మరీ అతిశయించి చూపుతున్నారని నా ఉద్దేశం. పైగా, అస్థిరతా ప్రాంతమైన సూయెజ్‌ కాలువ దక్షిణ కొసలో దిగ్బంధన కారణంగా వేచి ఉంటున్న షిప్పులు సముద్ర దొంగల దాడికి అనువుగా ఉంటున్నాయన్న వార్తలు పతాక శీర్షికలెక్కుతున్నాయి కూడా. ఎర్రసముద్రంలో నౌకా రవాణా కార్యక్రమాలకు కొంతమేరకు ప్రమాదం ఉండటం నిజమే కావచ్చు కానీ ఈ పరిస్థితులు రాత్రికిరాత్రే మారిపోవు. సూయెజ్‌ కాలువ గుండా సరుకుల నౌకల రవాణా కాన్వాయ్‌ల వారీగా సాగుతుంది కాబట్టి రవాణా నౌకలు ఎల్లప్పుడూ ఎంతో కొంత సమయం వేచి ఉండాల్సి ఉంటుంది. పైగా అన్ని నౌకలకు ప్రమాద స్థాయి ఒకే రకంగా ఉంటుంది కానీ నష్ట ఫలితాలు అనేవి నౌక రకం, సరుకులు, నౌకా యజమాని జాతి వంటి కారణాలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టే అనుకోని ప్రమాదాలను అధిగమించడానికి సముచిత చర్యలు తీసుకోవడానికి గాను పరిస్థితులకు అనుగుణమైన అప్రమత్తతో వ్యవహరించవలసి ఉంటుంది.

భద్రత, రక్షణ
భద్రతకు సంబంధించిన ప్రమాదాన్ని కూడా అదేవిధమైన సావధానతతో చూడాల్సి ఉంది. ఉగ్రవాద దాడుల వంటి ప్రమాదాలు అత్యధిక స్థాయిలో ఆర్థిక విచ్ఛిన్నతకు దారితీస్తాయి కాబట్టి ఇలాంటి ప్రమాదాలను అత్యంత ఘోర దురంతాలుగా చూపుతుంటారు. సూయెజ్‌ కాలువ వంటి ఇరుకైన జలసంధి ప్రాంతాల్లో ఇలాంటివాటినే నిర్దిష్ట ప్రమాద హేతువులుగా గుర్తిస్తుంటారు. ఇక భద్రతాపరమైన ప్రమాదాలు పతాక శీర్షికల్లో చోటు చేసుకోవు. నౌకల్లో ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి కానీ ఇవి పెద్దగా చర్చనీయాంశాలు కావు. అయితే చాలా సందర్భాల్లో, భద్రత, రక్షణకు సంబంధించిన వాస్తవ చిక్కులు ఒకేరకంగా ఉంటాయి. నౌకల స్థితిస్థాపకతా శక్తిని పెంచేవిధంగా రూపొందిస్తూ యాజమాన్యాలు తీసుకునే చర్యలకు మరింత ప్రాధాన్యత లభించాల్సి ఉంటుంది. రక్షణకు సంబంధించిన ప్రమాదాలు చాలావరకు అస్థిరంగానూ, భద్రతకు సంబంధించిన ప్రమాదాలు మరింత గతిశీలంగానూ ఉంటాయి కనుక ఈ ప్రాంతంలో అన్ని రకాల ప్రమాదాల గురించి అప్రమత్తతను కలిగి ఉండటం కీలకం.

సూయెజ్‌ కాలువలో జరిగిన ప్రమాదం చాలా అరుదైనది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నౌకా రవాణాపై ఎంత అధికంగా ఆధారపడి ఉందనేది ఈ ప్రమాదం వల్ల తేటతెల్లమైంది. అనేక సంవత్సరాలుగా నౌకా రవాణా ప్రాధాన్యత కొనసాగుతూ ఉంటూ వస్తోంది. కానీ అంతర్జాతీయ నౌకా పరిశ్రమ చాలా వరకు అదృశ్య రూపంలోనే ఉంటోంది. ప్రస్తుత సందర్భంలో ఎవర్‌ గివెన్‌ నౌక సూయెజ్‌ కాలువలో ఇరుక్కుపోవడం అనేది భద్రతాపరమైన ఘటన కాదు కానీ ఇలాంటి ఇరుకైన ప్రాంతాల సంక్లిష్ట స్వభావం గురించి ప్రపంచం ఇకపై చాలా సంవత్సరాలు చర్చించే అవకాశం మెండుగా ఉంది. మానవ నిర్మితమైన సూయెజ్‌ కెనాల్‌తో సహా ఇలాంటి ఇరుకైన జలమార్గాలతో పాటు పర్షియన్‌ గల్ఫ్‌లోని హోర్ముజ్‌ జలసంధి, గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌ లేదా మాలే ద్వీపకల్పం, ఇండోనేషియాలోని సుమత్రా దీవి మధ్య ఉండే మలక్కా జలసంధి వంటి సహజ జలమార్గాలు కూడా కీలకమైన సముద్ర మార్గాలుగా ఉంటున్నాయి. వీటి గుండా వాణిజ్య నౌకలు పయనించలేని పరిస్థితులు ఎదురైనప్పుడు సరఫరాలో జాప్యం, నౌకా రవాణా చార్జీలు పెరిగిపోవడం కూడా జరుగుతుంది. చమురు మార్కెట్లో ఇది ఇప్పటికే కనిపిస్తోంది. కంటైనర్‌ షిప్పుల విషయానికి వస్తే, ఇప్పటికే కోవిడ్‌–19 సంబంధిత అంతరాయాలతో కల్లోల పరిస్థితిలో ఉన్నం దున తాజా ఘటన మరింత విషమ పరిస్థితులను నెలకొల్పుతుంది. షిప్పింగ్‌ పరిశ్రమపై, దాని కొనసాగింపుగా ప్రపంచ వాణిజ్యంపై వాణిజ్య ప్రభావాలు ఇప్పటికే గుర్తించదగిన స్థాయిలో ఉంటున్నాయి. పైగా షిప్పింగ్‌ పరిధికి మించి అనేక రంగాల్లో దీని పర్యవసానాలు ప్రపంచం అనుభవంలోకి రానున్నాయి.

సూయెజ్‌ కాలువ గుండా నౌకా రవాణాకు ప్రత్యామ్నాయంగా ఆఫ్రికా ఖండం చుట్టూ సుదీర్ఘంగా సాగిపోయే మార్గం ఒకటుంది. పైగా ఇటీవల సంవత్సరాల్లో వాణిజ్య నౌకల కార్యనిర్వాహకులకు సముద్ర దొంగల దాడి పెద్ద తలనొప్పిగా మారింది. మొదటగా సోమాలియా తీరప్రాంతం.. తర్వాత ఇటీవల గల్ఫ్‌ ఆఫ్‌ గినియా ఇందుకు ఉదాహరణలు. ఈ ప్రత్యామ్నాయ మార్గంలో ఎదురవుతున్న సముద్ర దొంగల దాడుల గురించి కొన్ని షిప్పింగ్‌ కంపెనీలు ఇప్పటికే ఆందోళనను వ్యక్తం చేశాయి. ఇటీవల సంవత్సరాల్లో సోమాలియా కేంద్రంగా సాగుతున్న సముద్ర బందిపోట్ల దాడులను కాస్త అణచివేశారు తప్పితే పూర్తిగా ఓడించలేదని షిప్పింగ్‌ పరిశ్రమ సంస్థలు, అంతర్జాతీయ నౌకాయాన సంస్థలు సూచించాయి. 

అదే సమయంలో హిందూ మహాసముద్రం గుండా దక్షిణాఫ్రికా వైపు నౌకా ప్రయాణంతో పోలిస్తే గల్ఫ్‌ ఆఫ్‌ ఏడెన్‌ గుండా సూయెజ్‌ కెనాల్‌ వైపు పయనించే నౌకలకు సముద్ర దొంగల నుంచి ఎదురవుతున్న ప్రమాదం ఏమంత తక్కువ స్థాయిలో ఉండటం లేదు. కేప్‌ ఆఫ్‌ గుడ్‌ హోప్‌ని దాటిన తర్వాత యూరప్‌ చేరవలసిన నౌక సెనెగల్, కేబో వర్డే మధ్య ఉన్న ఇరుకు జలమార్గం గుండా పయనించాల్సి ఉంటుంది. ఈ మార్గంలో వెళ్లే ఏ నౌక అయినా సరే పశ్చిమాఫ్రికాలో సముద్ర బందిపోట్లతో తలపడాల్సి ఉంది. పైగా ఆఫ్రికా చుట్టూ మరింత దగ్గర మార్గంలో వెళ్లాలనుకుంటే నైజీరియా నుంచి వెయ్యి నాటికల్‌ మైళ్ల దూరంలో రవాణా నౌకలు పయనించి తీరాల్సి ఉంటుంది.


డిర్క్‌ సీబెల్స్‌
వ్యాసకర్త పీహెచ్‌డీ (సముద్ర భద్రత) స్కాలర్‌
గ్రీన్‌విచ్‌ యూనివర్సిటీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement