ఈజిప్టు నేవీలో తొలి మహిళా కెప్టెన్ మర్వా ఎల్సెల్హదార్
పిడుగు ఆకాశంలోంచి ఊడిపడుతుంది. బడబాగ్ని నిప్పుకణంలోంచి జ్వలిస్తుంది. ప్రకంపన పుడమి నుంచి ఉద్భవిస్తుంది. సుడిగుండం సముద్రంలో జనిస్తుంది. కానీ.. మహిళపై నింద ఎక్కడి నుంచి ఊడి పడి, ఎలా జ్వలించి, ప్రకంపించి, సుడిగుండమై ఆమె జీవితాన్ని అల్లకల్లోలం చేస్తుందో చెప్పలేం. ప్రస్తుతం మర్వా ఎల్సెల్హదార్ అనే నేవీ కెప్టెన్ అలాంటి ఒక నింద నుంచి బయటపడే ప్రయత్నంలోనే ఉంది.
మర్వా ఎల్సెల్హదార్ ఈజిప్టు నేవీలోని మెరైన్ విభాగంలో తొలి మహిళా కెప్టెన్. 29 ఏళ్ల యువతి. ఐదేళ్ల క్రితమే ఆమె నేవీలో చేరింది. ఇటీవల అక్కడి ‘అరబ్ న్యూస్’లో ఆమె గురించి పెద్ద కథనం వచ్చింది. తెల్ల యూనిఫామ్‌లో ఉన్న మర్వా చక్కటి ఫొటో ఒకటి పెట్టి ఈజిప్టు మెరైన్‌లో తొలి కెప్టెన్‌గా ఆమె సక్సెస్ స్టోరీ రాసింది ఆ పత్రిక. మెరైన్‌లో చేరిన ఐదేళ్ల తర్వాత ఆమెపై ఈ తాజా స్టోరీ రాయడానికి ‘అరబ్ న్యూస్’ చెప్పిన కారణం ఆలోచింపజేసే విధంగా ఉంది. ‘ఒక మహిళా మెరైన్ కెప్టెన్ అవడం గొప్పే. అంతకన్నా గొప్ప.. ఆ మహిళ మెరైన్ కెప్టెన్‌గా కొనసాగడం!’ అనే వాక్యంతో ఆ వార్తా కథనం ముగిసింది. నిజమే. మర్వా మెరైన్‌లో చేరిన తొలిరోజు నుంచీ ప్రతికూల పరిస్థితులను నెగ్గుకుంటూ వస్తోంది.
2015 వరకు ఈజిప్టు నేవీ మెరైన్‌లో మహిళా కెప్టెన్ ఒక్కరూ లేరు. పూర్తిగా పురుష ప్రపంచం అది. ఆ ప్రపంచంలోకి ధైర్యం చేసి వెళ్లింది మర్వా. అరబ్ న్యూస్‌లో మొన్న మార్చి 22న వచ్చిన ఆమె సక్సెస్ స్టోరీ కొన్ని గంటల్లోనే ట్విట్టర్‌లో, ఫేస్‌బుక్‌లో అనేకసార్లు షేర్ అయింది. అయితే రెండు రోజుల తర్వాత అదే ఫొటోతో ఇంటర్నెట్‌లో ఆమెను నిందిస్తూ ఒక వార్త వైరల్ అయింది! ఆ వార్త మర్వా చేతిలోని ఫోన్ వరకు చేరింది. మధ్యలోని ఆ కొద్ది గంటల్లోనే ఏం జరిగింది? సూయజ్ కెనాన్‌లో మార్చి 23న ‘ఎవర్ గివెన్’ అనే నౌక ‘బ్లాక్’ అయింది. కాలువకు రెండు వైపులా వాహనాల రవాణా స్తంభించిపోయింది. ఆరు రోజులు కష్టపడి నౌకను మళ్లీ దారిలో పెట్టగలిగారు. అయితే ఈ రెండు వారాల్లో తనపై వైరల్ అవుతూ వచ్చిన నిందను ‘క్లియర్’ చేసుకోడానికి నానా అవస్థలు పడుతోంది మర్వా. ఇక ఆమెపై పడిన నింద ఏమిటంటే.. ఎవర్ గివెన్‌ను ఆమే నడుపుతున్నారని, ఆమె సరిగా నడపలేకపోవడం వల్లనే ఆ నౌక.. కెనాల్‌లో అడ్డం తిరిగి, ప్రపంచ వాణిజ్య రంగానికి లక్షల కోట్ల ఆర్థిక నష్టాన్ని తెచ్చిపెట్టిందనీ!
ఇది మామూలు నింద కాదు. ఒక దేశం మాత్రమే తట్టుకోగల నింద. వ్యక్తులు భరించలేరు. తన గురించి అలాంటి అబద్ధపు వార్త ఒకటి వైరల్ అవుతున్నట్లు తెలియగానే మర్వా మొదట ఖిన్నురాలైంది. ఏమిటి ఆ నౌకకు, తనకు సంబంధం! తను నేవీలో కెప్టెనే తప్ప, సరకులను చేరవేర్చే ఓడకు కెప్టెన్ కాదు. ఎక్కడి నుంచి ఎక్కడికి కలిపారు! ఆలోచించిన కొద్దీ మర్వా మళ్లీ మళ్లీ నివ్వెరపోతోంది. పురుషాధిక్య ప్రపంచంలో ఇలాంటి నివ్వెరపాట్లు ప్రతి మహిళకూ అనుభవంలోనికి వచ్చేవేనని ఆమెకు తెలియంది కాదు. ఒక మహిళపై వచ్చిన నిందను నమ్మేవారు నమ్ముతారు. కానీ, పుట్టించేవాళ్లు ఎలా పుట్టిస్తారు?! ‘‘నాకొకటి అనిపిస్తోంది. అలవాటు లేని రంగంలోనైనా అరుదైన విజయం సాధించిన మహిళలకు ఇలాంటివి తప్పవు. నాకూ అలాగే జరిగి ఉండొచ్చు’’ అంటోంది మర్వా. సముద్రంపై ఒక మహిళ ఉద్యోగం చేస్తోందంటే ఆమెను వీలైనంత త్వరగా ‘ఒడ్డుకు చేర్చేందుకు’ అక్కడి ప్రతికూలతలు అనుక్షణం అలల్లా నెట్టేస్తుంటాయి. ‘ఇంటర్నేషనల్ మారీటైమ్ ఆర్గనైజేషన్’ నివేదిక ప్రకారం ప్రపంచం మొత్తం మీద కేవలం 2 శాతం మంది మహిళలు మాత్రమే సముద్ర ఉద్యోగాలు చేస్తున్నారు. మర్వాకు సముద్రం అంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని చూసి ఆమె సోదరుడు ఆమె పేరును ఎ.ఎ.ఎస్.టి.ఎం.టి. (అరబ్ అకాడమీ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ మ్యారిటైమ్ ట్రాన్స్‌పోర్ట్)లో నమోదు చేయించాడు.
అరబ్ లీగ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రాంతీయ విశ్వవిద్యాలయం అది. ఈజిప్టులోని అలెగ్జాండ్రి యా నగరంలో ఉంది. అయితే పురుష అభ్యర్థులకే ఆ యూనివర్సిటీలో ప్రవేశం. మహిళలెందుకు చేరకూడదు అని మర్వా న్యాయపోరాటం చేసింది. ఆ పోరాటంతో స్త్రీలకూ తొలిసారి నేవీ మెరైన్‌లో ప్రవేశం లభించింది. పట్టు పట్టి చేరాక, నిలదొక్కుకోడానికి మర్వాకు మళ్లీ ఒక పోరాటం చేయడం అవసరమైంది! అదొక పురుష ప్రపంచం. అంతా తనకన్నా వయసులో పెద్దవాళ్లు. మహిళవు, నీకెందుకు ఇవన్నీ అన్నట్లే ఉండేది వారి చూపు, మాట. ట్రైనింగ్ పూర్తయ్యే సరికి మర్వాకు సప్త సముద్రాలలో మనకలేసి వచ్చినంత పనైంది. ‘‘నా మానసిక స్థితిని స్థిరంగా ఉంచుకునేందుకు నేను చాలా కష్టపడవలసి వచ్చేది’’ అని మర్వా ఈ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బహిర్గతం చేసింది. కోర్సులో పట్టభద్రురాలయ్యాక మర్వా ఫస్ట్ మేట్ (ఫస్ట్ ఆఫీసర్) ర్యాంకుకు చేరుకుంది. ‘ఐదా 4’ శిక్షణ నౌకకు కెప్టెన్ అయింది! సూయజ్ కాలువను 2015లో ఆధునీకరించాక అందులో ప్రయాణించిన తొలి నౌక ‘ఐదా’ నే. అప్పుడే మర్వా.. సూయజ్ కెనాల్‌పై అతి చిన్న వయసులో నౌకను నడిపిన ఈజిప్టు మహిళగా గుర్తింపు పొందింది. ఆ గుర్తింపును దెబ్బతీసేలా ఇప్పుడు ఏ మూల నుంచో ఆమెపై నింద వచ్చి పడింది! ‘ఎవర్ గివెన్’ నౌకను నడిపి, కెనాల్ బ్లాక్ అవడానికి కారణం అయిందని!! అయితే అది నిలబడే నింద కాదని, సోషల్ మీడియా వికృత కల్పననేని వెనువెంటనే తేలిపోయింది.
ఇటీవల సూయజ్ కెనాల్‌లో ఇరుక్కుపోయిన ‘ఎవర్’ నౌక; (కాలువలో అడ్డుగా, విడిగా)
ఎవర్ గివెన్ నౌక ఆ రోజు సూయజ కెనాల్‌లో బ్లాక్ అయిన సమయానికి మర్వా అక్కడికి కొన్ని వందల మైళ్ల దూరంలోని అలెగ్జాండ్రియాలో ఐదా 4 నౌకలో ఫస్ట్ మేట్‌గా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈజిప్టు సముద్ర భద్రతా సంస్థకు చెందినా ఐదా ఆ రోజు ఎర్ర సముద్రంలోని లైట్ హౌస్‌కు అవసరమైన సామగ్రిని తీసుకువెళుతోంది. అందులో కెప్టెన్‌గా ఉన్న మర్వా ఫొటోను ఎవర్ గివెన్‌కు కెప్టెన్‌గా ఉన్నట్లుగా మార్పులు చేసి నెట్‌లో కొందరు తప్పుడు ప్రచారం చేశారు.
ఆ ప్రచారాన్ని ఈజిప్టు నేవీనే స్వయంగా ఖడించడంతో మర్వా కాస్త ఊపిరి పీల్చుకుంది. సోషల్ మీడియాలో కూడా అధిక శాతం మర్వాకు మద్దతుగా నిలబడ్డారు. అయినా మర్వా గురించి ఈజిప్టు నేవీలో గానీ, ఈజిప్టులో గానీ తెలియనివారు లేరు. ధైర్యంగల అమ్మాయి. 2017 మహిళా దినోత్సవం సందర్భంగా నాటి అధ్యక్షుడు అబెల్ ఫతా ఆమెను సత్కరించారు కూడా. వచ్చే నెలలో మర్వా కెప్టెన్ ర్యాంకుకు చివరి పరీక్ష పూర్తవుతుంది. అప్పుడామె రాబోయే యవతరానికి శిక్షణ నిచ్చే కెప్టెన్ కూడా అవుతారు. ‘‘మనం ఒక ఉద్యోగాన్ని ఇష్టపడి చేస్తున్నప్పుడు మన మీద వచ్చే విమర్శలు మన పై, మన పనిపై ఏమాత్రం ప్రతికూల ప్రభావం చూపలేవు’’ అంటోంది మర్వా. l
Comments
Please login to add a commentAdd a comment