విశ్లేషణ
ఒక మనిషి సాటి మనిషికి సాయానికి రాడని అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో ముక్కూ ముఖం తెలియని మనుషులు చేయందిస్తారు. అడక్కుండానే మనల్ని సమస్య నుంచి గట్టెక్కిస్తారు. అది ఎంత చిన్నదైనా సరే, ఆ సమయానికి పెద్ద సాయమే అవుతుంది. అయితే, అలాంటి మనుషులను మనం ఎంత నమ్ముతాం? చాలాసార్లు మనుషుల రూపాలను చూసి వాళ్ల గుణాలను అంచనా వేస్తుంటాం. కానీ మనుషులను చూపులతో అంచనా వేయలేం. అలాంటి సందర్భాలు మనకు చాలాసార్లు ఎదురవుతూనే ఉంటాయి. ఎవరో అపరిచితులు అనూహ్యంగా ఇతరులకు సాయపడటం, ఆ తరువాత మన జీవితాల్లోంచి వారు మాయమైపోవడం... ఓహ్! మరచిపోలేం. చేదు అనుభవాలు ఎదురైనా అవి గుర్తుంచుకోవాల్సినవి కావు.
అధికారికంగా దాని పేరు ‘లండన్ అండర్‌గ్రౌండ్’. కానీ అందరూ పిలిచేది ‘ట్యూబ్’ అని! అది నిజంగానే గొట్టం ఆకారంలోనే ఉంటుంది మరి! కానీ, సొరంగం నుంచి రైలు ప్లాట్‌ఫామ్‌పైకి వస్తూండటాన్ని చూసినప్పుడు మాత్రం దాన్ని టూత్‌పేస్ట్‌తో పోల్చడం మేలని నాకు అనిపిస్తుంది. పదహారేళ్ల వయసులో మొట్టమొదటిసారి ట్యూబ్‌ను చూసినప్పుడు నాకు వచ్చిన ఆలోచన కూడా ఇదే.
విక్టోరియా స్టేషన్‌లో ఉన్నాను అప్పుడు నేను. అప్పుడే ఎయిర్‌పోర్ట్ వాహనం నుంచి కిందకు దిగాను. రెండు చేతుల్లో భారీ ట్రంకు పెట్టెలు. మీరు నమ్మినా నమ్మకపోయినా... ఆరోజు ఎయిరిండియా విమానం రెండు గంటలు ముందుగానే ల్యాండ్ అయ్యింది. నేను ఉండటానికి వెళ్తున్న నా సోదరి కిరణ్ కూడా దానికి ఆశ్చర్యపోయింది.
తమ్ముడు సెలవుల కోసం అనుకోకుండా ప్రత్యక్షమవుతున్నాడన్న ఆనందం, షాక్ నుంచి కోలుకుంటూ ‘‘హీత్రూ నుంచి బస్సు పట్టుకో... బాండ్ స్ట్రీట్‌లో ట్యూబ్’’ అంటూ కిరణ్ తన ఇంటికి దారి చెప్పింది. ‘‘నేను ఆ పక్కన ఉంటా’’ అని ముగించింది.
బాండ్ స్ట్రీట్ స్టేషన్ కిరణ్ ఆఫీసుకు దగ్గరలోనే ఉంటుంది. నాకైతే అప్పటికి లండన్ కొత్త. ఒకపక్క ఉత్సాహంగా ఉంది. ఇంకోపక్క కొంచెం ఉద్వేగంగానూ అనిపిస్తోంది. బాండ్ స్ట్రీట్ అన్నది మోనోపలి గేమ్‌లో కనిపించే పేరు. అక్కడున్న జనాలను చూస్తే మాత్రం అమ్మో ఇంతమందా? అనిపించక తప్పదు.
అందరూ ఎవరి హడావుడిలో వారున్నారు. చాలామంది వ్యాపారాలు చేసుకునేవాళ్లనుకుంటా. ఒకరిద్దరు మాత్రం అక్కడక్కడా తచ్చాడుతూ కనిపించారు. బెల్‌బాటమ్ ప్యాంట్లు, పొడుచుకువచ్చినట్లు ఉన్న జుత్తుతో ఉన్న వాళ్లకు బూడిద రంగు ఫ్లానెల్స్, సరిగ్గా అమరని స్కూల్ బ్లేజర్‌తో ఉన్న నేను పరాయివాడినన్న విషయం ఇట్టే తెలిసిపోయేలానే ఉంది.
వాతావరణం ఇలా ఉన్న సందర్భంలోనే... సొరంగం నుంచి ట్యూబ్ బయటకొస్తూ కనిపించింది. సొరంగంలో ఉండగానే వచ్చిన రణగొణ ధ్వని ట్యూబ్ వస్తున్న విషయాన్ని అందరికీ ఎలుగెత్తి చెప్పింది. శబ్దం వింటూనే చాలామంది ట్యూబ్ రాకను గుర్తించారు. సామన్లు సర్దుకుంటూ రైలెక్కేందుకు సిద్ధమవుతున్నారు. నాకైతే అంతా కొత్త. పరిసరాలతో పరిచయమూ తక్కువే. ఏం చేయాలో తెలియకుండా అలా... చూస్తూనే ఉండిపోయా కొంత సమయం!
ఎవరో గట్టిగా అరిచారు. ‘‘మిత్రమా... రా’’ అని! అప్పటికే రైలు తలుపులు తెరుచుకుని ఉన్నాయి. జనాలు లోపలికి చొరబడుతున్నారు. నేను మాత్రం నా రెండు ట్రంకు పెట్టెలతో ముందుకెళ్లేందుకు తంటాలు పడుతున్నాను. రెండింటినీ ఒక్కో చేత్తో పట్టుకున్నానా... హ్యాండ్‌బ్యాగ్ పట్టుకునేందుకు ఇంకో చేయి లేకుండా పోయింది. సర్దుదామనుకుంటే పెట్టెలు ఎత్తలేనంత బరువైపోతున్నాయి. ఈ లోపు పక్క నుంచి ఏదో గొంతు వినిపించింది... ‘‘ఒంటిచేత్తోనే చేయగలవు.’’ అంటూ. ‘‘రెండు, మూడు కావాలేమో’’ అని కూడా అనేసిందా గొంతు!
యాభై ఏళ్లు పైబడ్డ వ్యక్తి మాటలు కావచ్చు అవి. చిందరవందర బట్టలేసుకుని ఉన్నాడు. తలపై టోపీ ఒకటి. గడ్డం కూడా సరిగ్గా గీసుకోలేదు. బహుశా కంపు కూడా కొడుతున్నాడేమో. మామాలుగానైతే ఆ వ్యక్తితో మాట్లాడేవాడిని కాదేమో. భవిష్యత్తులోనైతే అలాంటి వాళ్లకు దూరంగా జరిగిపోయేవాడినేమో. దిమ్మరి అనుకుని వారిని దూరం నుంచే కొనచూపుతో చూస్తూ ఉండేవాడిని. ఎందుకంటే అలాంటివాళ్లపై నాకున్న అయిష్టం ఇట్టే తెలిసిపోతుంది మరి.
అయితే ఆ రోజు నేను ట్యూబ్ ఎక్కేనాటి పరిస్థితి వేరు. కుర్రాడిని. సాయం అవసరం ఉంది. పొగరు ఇంకా తలకెక్కి లేదు. మరీ ముఖ్యంగా... ఆ మనిషి నా ట్రంకు పెట్టెలతోపాటు హ్యాండ్ లగేజీ కూడా లాక్కున్నాడు. ట్యూబ్‌లోకి చేర్చాడు. ఆ వెంటనే రైలు తలుపులు మూసుకున్నాయి. ఆ వ్యక్తి నా వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. నోట్లో కొన్ని పండ్లు ఊడిపోయి ఉంటే... ఉన్నవి కూడా గారమరకలతో కనిపించాయి. ‘‘హమ్మయ్యా... ఎక్కేశాం’’ అన్నాడా వ్యక్తి! సమాధానం ఏం చెప్పాలో తెలియలేదు నాకు. ఓ నీరసపు నవ్వు నవ్వి ఊరుకున్నాను.
‘‘చిటికెలో రైలు తప్పిపోయేది తెలుసా?’’ అన్నాడు. నాకేమో కొత్తవాళ్లతో మాట్లాడటమంటే భయం. అతడేమో ఒకట్రెండు మాటలతో సరిపెట్టేలా లేడు. మొత్తమ్మీద ఇద్దరి మధ్య కాసేపు మౌనమే రాజ్యమేలింది. రెండు స్టేషన్లు దాటిన తరువాత ఆ వ్యక్తి నా వైపు చూసి, ‘‘ఎక్కడికి మిత్రమా?’’ అన్నాడు. తలూపుతూ నా సమాధానం విన్నాడు. కిటికీల్లోంచి బయటకు చూడటం మొదలుపెట్టాడు. సొరంగం నల్లటి గోడలు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు బయట! ఆ వ్యక్తి ఆ నల్లగోడలనే కళ్లప్పగించి మరీ చూస్తూ ఉండిపోయాడు.
ఈ ప్రయాణం ఎప్పుడు ముగుస్తుందా? అని నేను ఆత్రంగా ఎదురు చూస్తున్నాను. లగేజీ ఎలా దింపుకోవాలన్న ఆలోచన మెదడును తొలిచేస్తోంది. ఇంతలో బాండ్‌స్ట్రీట్ రానేవచ్చింది. పెట్టెలు సర్దుకుందామని అనుకునే లోపే ఆ వ్యక్తి వాటిని తన చేతుల్లోకి తీసేసుకున్నాడు. ‘‘చిన్న లగేజీలు నువ్వు తీసుకో’’ అన్నాడు. ‘‘నీ సైజుకు తగ్గవి’’ అని చతుర్లాడాడు కూడా. ప్లాట్‌ఫామ్ చివరి వరకూ నాకు తోడుగా వచ్చాడు. ‘‘వచ్చేశాం’’ అన్నాడు. ‘‘గుడ్ లక్’’ చెప్పాడు. వచ్చినంత వేగంగా వెనక్కు వెళ్లిపోయాడు. మేమొచ్చిన వైపే వెళ్లాల్సిన ట్యూబ్ కోసం వేచి చూడటం మొదలుపెట్టాడు.
ఈ సంఘటన తరువాత నేను ఆ వ్యక్తిని ఎప్పుడూ కలవలేదు. అతడు చేసిన సాయానికి థ్యాంక్స్ అయినా సరిగ్గా చెప్పానో లేదో గుర్తు లేదు. కానీ లండన్ అండర్‌గ్రౌండ్‌లో నాకు ఎదురైనా మధురమైన అనుభూతుల్లో ఇదీ ఒకటిగా నిలిచిపోయింది. ఎవరో అపరిచితులు అనూహ్యంగా ఇలా ఇతరులకు సాయపడటం ఆ తరువాత మన జీవితాల్లోంచి వారు మాయమైపోవడం... ఓహ్! మరచిపోలేం. చేదు అనుభవాలూ ఎదురవుతూంటాయి కానీ, వాటిని నేను గుర్తుంచుకోను.
ఢిల్లీలోనూ మెట్రో భూగర్భ మార్గం పడుతున్న నేపథ్యంలో మనకూ ఇలాంటి అనుభవాలు బోలెడన్ని ఎదురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి ఘటనలు చూసిన వెంటనే మనకు కలిగే ఇంప్రెషన్ తప్పు కావచ్చు అని చెప్పేందుకు ఉపయోగపడుతూంటాయి. చూపులతోనే మనిషిని అంచనా వేయలేమని చెబుతూంటాయి!
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment