కామెంట్
క్లబ్బులు స్నేహపూర్వకమైన వాతావరణంలో ఇతరులతో కలిసి కూర్చోవడానికి మనల్ని ప్రోత్సహిస్తాయి. క్లబ్బు లోపలికి మీరు ఒక్కరిగానే వచ్చి ఉండవచ్చు. కానీ ఒక సంతోషకరమైన బృందంలో ఒకరిగా కలిసిపోతారు. క్లబ్బు సభ్యులు గౌరవప్రదంగా ప్రవర్తిస్తారనే భావన అంతర్లీనంగా ఉంటుంది. అలాంటి పెద్ద మనుషులను చిన్నబుచ్చే సంగతి ఇది. దేశ రాజధానిలో ప్రతిష్ఠాత్మకమైన ఢిల్లీ జింఖానా క్లబ్బు సభ్యుల ఖాతాలలో ‘పాజిటివ్ క్రెడిట్ బ్యాలెన్స్’ ఉండాలంటోంది. గుప్పెడుమంది డబ్బులు ఎగ్గొట్టి ఉండొచ్చు. మరీ అనుమానాస్పదంగా కనిపిస్తే తప్ప తినేందుకు మీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని ఏ రెస్టారెంటూ అడగదు. అలాంటిది ఇంత పెద్ద క్లబ్బే ఇలా చేస్తే? కానికాలం అంటే ఇదే!
మీరు కనుక ఒక క్లబ్బులో సభ్యుడై ఉన్నట్లయితే, అలా ఉండటం ఎంతో ప్రత్యేకమైనదని మీకు తెలిసి ఉంటుంది. సమస్థాయి వ్యక్తులు కలుసుకోవడానికి, సేద తీరేందుకు, అక్కడ తాము మాట్లాడేవి, చేసేవి బయటికి బహిర్గతం అవుతాయనే భయం లేకుండా ఒక సమూహంగా మసలుకునేందుకు బ్రిటిష్‌వాళ్లు ప్రవేశపెట్టినవే ఈ క్లబ్బులు. నిర్వచనం ప్రకారం అవి ఆంతరంగికమైనవి, గోప్యనీయతను కలిగి ఉండేవి. బహశా అందువల్లే సభ్యులకు తమ క్లబ్బులు ప్రియమైనవిగా ఉండి, వారు తరచు వాటి పట్ల అపరిమితమైన విధేయతను కలిగి ఉంటారు.
దాంతోపాటుగా క్లబ్బు సభ్యులు ‘పెద్ద మనుషులు’గా పరిగణన పొందుతారు. మహిళా సభ్యుల విషయంలోనూ ఇది నిజం. ఒక అలిఖిత – అయితే అందరూ ఎరిగిన – ప్రవర్తనా నియమావళి క్లబ్బుల్లో అమలులో ఉంటుంది. క్లబ్బు సభ్యులు ఎల్లప్పుడు గౌరవప్రదంగా ప్రవర్తిస్తారనే భావన అంతర్లీనంగా ఉంటుంది. సభ్యతగల పనులే చేస్తారని వారిపై నమ్మకం ఉంచవచ్చు.
సంప్రదాయం ప్రకారం, క్లబ్బు సభ్యులు సభ్యత్వ నియమావళి మేరకు తామక్కడ పొందే సేవలకు డబ్బు చెల్లిస్తారు. అది బారులో డ్రింక్స్‌కి అయినా, డైనింగ్ హాల్‌లో విందుకైనా; లేదా క్రీడల సదుపాయాలను వినియోగించుకున్నా, వాటిల్లో పాల్పంచుకున్నా అందుకు అయిన ఖర్చును కచ్చితంగా, పూర్తిగా చెల్లించవలసి ఉంటుందనటంలో సందేహం లేదు. మొత్తమ్మీదైతే, ఈ మర్యాదస్తులు తమ చెల్లింపు నిబంధనలను గౌరవిస్తారు.
పాడు కాలం, ఇప్పుడేమైందంటే దేశ రాజధానిలో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన, సభ్యత్వానికి అపరిమితమైన డిమాండును కలిగి ఉన్న ఢిల్లీ జింఖానా క్లబ్ ఇక మీదట మునుపటిలా ఉండబోవటం లేదు. ఆ క్లబ్బు తన సభ్యత్వానికే అవమానకరంగా, అసంబద్ధంగా – సభ్యులు తాము పొందబోయే సేవలకు గాను ముందుగానే డబ్బును డిపాజిట్ చేయాలన్న పద్ధతిని ప్రవేశపెట్టింది! క్లబ్బు యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి క్లబ్బు బారులో తాగాలన్నా, క్లబ్బు డైనింగ్ హాలులో తినాలన్నా ఇకపై క్లబ్బు సభ్యుల ఖాతాలలో ‘పాజిటివ్ క్రెడిట్ బ్యాలెన్స్’ ఉండి ఉండాలి. అంటే మిగులు డబ్బులు ఉండాలి. వార్షిక సభ్యత్వ రుసుము కడుతున్నాం కదా అంటే ఇప్పుడు అదొక్కటే సరిపోదు.
విషయం ఏంటంటే, మనకు ఇష్టమైనప్పుడు క్లబ్బుకు వెళ్లి కూర్చోవడానికి సదుపాయం కల్పించటమనే క్లబ్బు ప్రధాన ప్రయోజనాన్ని ఈ కొత్త పద్ధతి నెరవేరకుండా చేస్తుంది. మీరు మీ క్లబ్బు ఖాతాలో మిగులు డబ్బు లేకుండా తినలేరు. తాగలేరు. అప్పుడిక పక్క వారి మీద పడిపోవటమొక్కటే మీకుండే మార్గం.
అది అధ్వాన్నమైన పరిస్థితి. క్లబ్బులు అనేవి స్నేహపూర్వకమైన వాతావరణంలో ఇతరుల కోసం మీరు డ్రింక్స్ కొనడానికి, లేదా వారితో కలిసి విందులో కూర్చోవడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తాయి. లోపలికి మీరు ఒక్కరిగానే వచ్చి ఉండవచ్చు. కానీ చివరికి మీరు ఒక సంతోషకరమైన బృందంలో ఒకరిగా కలిసిపోతారు. అయితే మీరు డిపాజిట్ చేసిన అడ్వాన్సు చాలినంతగా లేనప్పుడు మీరలా డ్రింక్స్‌ని కొనివ్వలేరు. లేదా ఫ్రెండ్ ఇచ్చిన డిన్నర్‌కు మీరు బిల్లు చెల్లించలేరు.
ఆఖరికి వాణిజ్యపరమైన రెస్టారెంట్లు కూడా తమ అతిథులతో ఇంతకన్నా గౌరవంగా, సాదరంగా వ్యవహరిస్తాయి. అక్కడ తినటం ముగించి, వెళ్లటానికి సిద్ధం అయ్యాకే బిల్లు చెల్లిస్తారు. తినటానికి ముందే వాళ్లేమీ అడ్వాన్సు డిపాజిట్ చేసి ఉండనక్కర్లేదు. మీరు మరీ అనుమానాస్పదంగా, నమ్మదగనివారిగా కనిపిస్తే తప్ప మీరేం తినదలచుకున్నారో దానిని తినేందుకు మీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని ఏ రెస్టారెంటూ మిమ్మల్ని అడగదు. అయినప్పటికీ జిమ్ – జింఖానాను ముద్దుగా సభ్యులు ఇలాగే పిలుచుకుంటారు – ఇకపై కొత్త పద్ధతి అమలు చేయబోతోంది.
తన సభ్యత్వం పట్ల ఈ విధమైన అమర్యాదకర వైఖరికి క్లబ్బు చూపిస్తున్న సాకు ఏమిటంటే – కొంతమంది సభ్యులు తమ బిల్లులు చెల్లించటం లేదని! దురదృష్టవశాత్తూ, ఆ మాట నిజం. బకాయి పడిన వారి పేర్ల జాబితాను అందరికీ కనిపించేలా ఉంచినప్పటికీ కూడా వారికి చీమ కుట్టినట్లయినా ఉండటం లేదు. కానీ సభ్యులలో అలాంటి వారు కొద్ది మంది, లేదంటే కొంత భాగం. సభ్యత్వపు విధి విధానాలకు కట్టుబడి, బహుశా పది వేల మందికి పైగా ఉన్న సభ్యుల జాబితాలో అదే పనిగా, తీరు మార్చుకోకుండా బకాయి పడుతుండే సభ్యులు వందకు మించి ఉండరు.
తరచు న్యాయబద్ధమైన, ఆమోదయోగ్యమైన కారణాల వల్ల బాకాయిలను ఆలస్యంగా చెల్లిస్తుండేవారిని ఉద్దేశపూర్వకంగానే నేను ఈ జాబితాలో చేర్చటం లేదు. ఇప్పుడు, మిగతా ప్రతి ఒక్కరూ – గౌరవప్రదంగా, అధిక సంఖ్యాకంగా ఉండేవారు – బకాయి పడుతున్న కొద్దిమంది విషయమై ప్రతిస్పందించటానికి క్లబ్బు ఇంతకన్నా మెరుగైన, ప్రభావవంతమైన మార్గాన్ని కనుగొనలేక పోయిన కారణంగా ఇబ్బంది పడాలా?
చూస్తుంటే క్లబ్బు సమాధానం ‘అవును’ అన్నట్లే కనిపిస్తోంది. అలా కనిపించటమే క్లబ్బు యాజమాన్యం గురించి ఆందోళన కలగటానికి కారణం. క్లబ్ అంటే ఏమిటో, అదెలా ఉండాలని కోరుకుంటారో యాజమాన్యం అర్థం చేసుకోలేక పోయింది.
ఏదేమైనా, ఇందుకు – దాటవేశారని చెప్పటానికి వీల్లేని – మరొక పరిష్కారం ఉంది. క్లబ్బు యాజమాన్యం నిజంగానే బిల్లు చెల్లింపులను బకాయి పెట్టే సభ్యుల సంఖ్య పెరుగుతోందని ఆందోళన చెందుతున్నట్లయితే బయటి రెస్టారెంట్లలో మాదిరిగా తాగిన వెంటనే, లేదా తిన్న వెంటనే బిల్లు చెల్లించాలని వారిని కోరవచ్చు. నిజానికి లండన్‌లోని చాలా క్ల్లబ్బులు ఈ పనే చేస్తున్నాయి. అది మరింత చిత్తశుద్ధిగా, మర్యాదగా ఉంటుంది. ఢిల్లీ జింఖానా క్లబ్ అటువైపుగా ఎందుకు ఆలోచించలేక పోయింది?
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment