ఉపశమనం
- జిల్లా అంతటా వర్షం
- 23.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు
- మండవల్లిలో అత్యధికంగా 90.2 మిల్లీమీటర్లు
- నారుమడులకు, వరినాట్లు పూర్తి చేసిన పొలాలకు మేలు
- ఖరీఫ్‌పై చిగురిస్తున్న ఆశలు
ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. అన్నదాతకు ఉపశమనం లభించింది. జిల్లా అంతటా రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో నారుమడులు జీవం పోసుకుంటున్నాయి. నాట్లు వేసిన పొలాలు కళకళలాడుతున్నాయి. ఖరీఫ్ సాగుపై రైతన్నలకు ఆశలు చిగురిస్తున్నాయి.
మచిలీపట్నం : ఉపరితల ద్రోణి ప్రభావంతో జిల్లాలో రెండురోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఖరీఫ్ సాగుపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. వేసవి తరువాత రెండు రోజులపాటు వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని ముసురుపట్టడంతో ఖరీఫ్ సీజన్‌కు వాతావరణం అనుకూలంగా మారిందని రైతులు అభిప్రాయపడుతున్నారు. సాగునీటి కాలువలకు నీరు విడుదలకాకపోయినా వెదజల్లే పద్ధతి ద్వారా దాదాపు 25వేల ఎకరాల్లో వరినాట్లు పూర్తిచేశారు.
వర్షాధారంగానే దాదాపు 50వేల ఎకరాల్లో రైతులు నారుమడులు పోశారు. శని, ఆదివారాల్లో కురిసిన వర్షాలు వెదజల్లే పద్ధతి ద్వారా వరినాట్లు పూర్తిచేసిన పొలాలకు, నారుమడులకు మేలు చేస్తాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఆగస్టు నెల సమీపిస్తుండటంతో వర్షాలు కురుస్తాయనే ఆశతో రైతులు ఉన్నారు. వాతావరణం ఇలాగే కొనసాగితే వర్షాధారంగా అయినా పంటలు సాగు చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుందని రైతులు అంటున్నారు.
41,250 ఎకరాల్లో వరినాట్లు
ఈ ఖరీఫ్‌లో జిల్లాలో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయాల్సి ఉంది. జూన్, జూలైల్లో వర్షపాతం తక్కువగా నమోదవటంతో వరినాట్లు ఆలస్యమయ్యాయి. వెదజల్లే పద్ధతి, బోరునీటి ఆధారంగా 41,250 ఎకరాల్లో వరినాట్లు ఇప్పటివరకు పూర్తయినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. పెడన, గుడ్లవల్లేరు, బందరు, బంటుమిల్లి, కృత్తివెన్ను తదితర మండలాల్లో వెదజల్లే పద్ధతి ద్వారా, ఘంటసాల, మొవ్వ, ఉంగుటూరు, తోట్లవల్లూరు, కంకిపాడు తదితర మండలాల్లో బోరు నీటి ఆధారంగా వరినాట్లు పూర్తిచేశారు.
జూలై 27వ తేదీ నాటికి జిల్లాలో 286.5 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 144.3 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. వర్షాలు సక్రమంగా కురవకపోవటంతో వరినాట్లు పూర్తి చేసిన పొలాల్లో పైరు, నారుమడులకు పోషకాలు సక్రమంగా అందక, నీరు లేక పైరు ఎండిపోయే దశకు చేరుకుంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఈ పైరుకు ప్రాణం పోసినట్లయింది. ఇప్పటి వరకు 18,750 ఎకరాల్లో వరినారుమడులు పోశారు. ఈ వర్షాల వల్ల మిగిలిన ప్రాంతాల్లోనూ నారుమడులు పోసుకునేందుకు అవకాశం ఏర్పడనుంది.
చెరకు మొక్కల ఎదుగుదలకు దోహదం
ఈ ఖరీఫ్ సీజన్‌లో 37,500 ఎకరాల్లో చెరకు సాగు జరుగుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేయగా 40వేల ఎకరాలకు ఈ సాగు పెరిగింది. మొక్కతోటల్లో వర్షాలు లేకపోవటంతో మొక్కల్లో ఎదుగుదల లోపించింది. వర్షాలు కురుస్తుండటంతో చెరకు తోటలకు మేలు జరుగుతుందని వ్యవసాయశాఖ జేడీ బి.నరసింహులు, డీడీ బాలునాయక్ తెలిపారు.
పత్తికి మేలు
పశ్చిమ కృష్ణాలోని నందిగామ, జగ్గయ్యపేట, వీరులపాడు, కంచికచర్ల, గంపలగూడెం, తిరువూరు, మైలవరం, జి.కొండూరు తదితర ప్రాంతాల్లో ఇప్పటి వరకు 75వేల ఎకరాల్లో పత్తిసాగు చేపట్టారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో 1.40 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతుందని అంచనా. వర్షాభావం కారణంగా పత్తిసాగు గణనీయంగా తగ్గింది. పత్తిని పక్కనపెట్టిన రైతులు సుబాబుల్ సాగుపై మక్కువ చూపుతున్నారు. వర్షాలు సక్రమంగా కురవకపోవటంతో పత్తి మొక్కల్లోనూ ఎదుగుదల లోపించింది. అధిక ఉష్ణోగ్రతలు, వర్షాలు కురవకపోవటంతో మారాకు దశలో ఉన్న పత్తి మొక్కలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు పత్తి మొక్కల ఎదుగుదలకు మేలు చేస్తాయని, ఇదే వాతావరణం కొనసాగితే మొక్కలు త్వరితగతిన ఎదుగుతాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
ఆదివారం నమోదైన వర్షపాతం వివరాలు
జిల్లాలో ఆదివారం 23.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. మండవల్లిలో అత్యధికంగా 90.2 మిల్లీమీటర్లు, అత్యల్పంగా పమిడిముక్కలలో 0.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఎ.కొండూరు-64.8, రెడ్డిగూడెం-61.4, కలిదిండి-57.4, తిరువూరు-54.2, ముదినేపల్లి-45.6, విస్సన్నపేట-42.6, నూజివీడు-38.6, బంటుమిల్లి-37.6, ముసునూరు-36.2, కైకలూరు-36.2, చాట్రాయి-35.2 మైలవరం-35.0, కంకిపాడు-31.2, జి.కొండూరు 30.4, పామర్రు-28.6, గన్నవరం-27.6, ఆగిరిపల్లి-26.2, చల్లపల్లి-24.4, బాపులపాడు-24.2మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. విజయవాడ-24.0, గూడూరు-24.0, ఘంటసాల-22.4, ఉయ్యూరు-21.4, మచిలీపట్నం-20.6, గంపలగూడెం-20.4, పెదపారుపూడి-19.2, కోడూరు-18.2, పెనమలూరు-15.8, గుడివాడ-14.8, వీరులపాడు-11.6, గుడ్లవల్లేరు-11.2, కృత్తివెన్ను-10.2, ఉంగుటూరు-10.2, మోపిదేవి-9.2, నందివాడ-8.2, మొవ్వ-6.8, అవనిగడ్డ-6.4, వత్సవాయి-5.8, తోట్లవల్లూరు-5.4, పెడన-5.2, కంచికచర్ల-5.2, ఇబ్రహీంపట్నం-5.0, నాగాయలంక-4.4, నందిగామ-4.4, పెనుగంచిప్రోలు-4.0, చందర్లపాడు-3.2 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.