శివారులు ఎడారులు | Suburbs, deserts | Sakshi
Sakshi News home page

శివారులు ఎడారులు

Published Mon, Sep 8 2014 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 1:01 PM

శివారులు ఎడారులు

శివారులు ఎడారులు

  • శివారు ప్రాంతాలకు చేరని సాగునీరు
  •   ఎండిపోతున్న నారుమడులు
  •   ఆయిల్ ఇంజిన్లతో నీరుతోడినా ప్రయోజనం శూన్యం
  •   శివారులో నారుమడులే పోయని గ్రామాలెన్నో
  •   ఎకరాకు రూ.5వేలు అదనపు ఖర్చులు
  •   ఆందోళనలో అన్నదాత
  •  
    సారూ.. మీరే మా సమస్య పరిష్కరించాలి. నీరు అందక నాట్లు వేయలేకపోతున్నాం. అక్కడక్కడా నాట్లు వేసిన పొలాలు నెర్రెలిస్తున్నాయి. పంటలు పండించుకునేందుకు పూర్తిస్థాయిలో సాగునీటిని అందించాలి. లేకపోతే పంటలు పండక ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది.
     
    ఇదీ ఆదివారం 14వ నంబరు పంటకాలువను పరిశీలించేందుకు వచ్చిన ఇరిగేషన్ ఎస్‌ఈ కె.శ్రీనివాసరావు ఎదుట కోడూరు మండలం ఊటగుండం రైతుల ఆవేదన...

     
    మచిలీపట్నం/చల్లపల్లి : ఒక్క ఊటగుండం రైతులు మాత్రమే కాదు.. శివారు ప్రాంతాల్లోని అన్నదాతలందరి పరిస్థితి ఇదేవిధంగా ఉంది. ఒకవైపు సాగునీరు విడుదల చేశామని పాలకులు చెబుతున్నా.. సెప్టెంబరు నెల వచ్చినా శివారు ప్రాంతాలకు మాత్రం చుక్క నీరు చేరలేదు. దీంతో పచ్చగా కళకళలాడ్సిన వేలాది ఎకరాల పొలాలు నెర్రెలిచ్చి ఎడారులుగా మారుతున్నాయి.

    పాలకుల పర్యవేక్షణాలేమి, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. ఎగువన ఉన్న సాగునీటి ప్రాజెక్టులు నిండినా, కాలువలకు కొసరి కొసరి సాగునీటిని విడుదల చేస్తూ నీటిపారుదల శాఖ అధికారులు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాలువలకు ఎంత నీరు విడుదల చేస్తే శివారు భూములకు సక్రమంగా నీరు అందుతుందనే విషయాన్ని అంచనా వేయలేని నీటిపారుదల శాఖ అధికారుల వైఖరి తమకు శాపంగా మారిందని మండిపడుతున్నారు.
     
    కరుణించని వరుణుడు
     
    ఈ ఏడాది వరుణుడు కూడా కరుణించకపోవడంతో రైతులు అల్లాడుతున్నారు. సెప్టెంబరు 7వ తేదీలోపు జిల్లాలో 554.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 420.0 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. కంకిపాడు, పామర్రు, గూడూరు, కలిదిండి, మొవ్వ మండలాలు మినహా మిగిలిన అన్ని మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువగానే నమోదైంది. 40 శాతం నీరు కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేస్తే, మిగిలిన 60శాతం వర్షంపై ఆధారపడి సాగు చేయాల్సి ఉందని, వర్షం లేకపోవటంతో సాగునీటిని సక్రమంగా అందించలేకపోతున్నామని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.  
     
    శివారులో ఎండుతున్న నారుమడులు
     
    కాలువ చివరన ఉన్న కోడూరు, నాగాయలంక, మచిలీపట్నం, పెడన, కృత్తివెన్ను, బంటుమిల్లి తదితర మండలాల్లో ఇప్పటికీ వరినాట్లు వేస్తూనే ఉన్నారు. కోడూరు మండలంలోని ఊటగుండం, రామకృష్ణాపురం, ఇరాలి, హంసలదీవి, ఉల్లిపాలెం, సాలెంపాలెం, నారేపాలెం, విశ్వనాథపల్లి, వి.కొత్తపాలెం, మందపాకల, పోటుమీద, నాగాయలంక మండలం ఏడిమొగ, టి.కొత్తపాలెం, గణపేశ్వరం, పర్రచివర తదితర గ్రామాలకు ఇంకా సాగునీరు చేరలేదు.

    దీంతో ఆ ప్రాంతాలకు చెందిన రైతులు నారుమడులు కూడా పోసుకోలేదు. మచిలీపట్నం మండలంలో 25 వేల ఎకరాల్లో సాగు చేపట్టారు. గత పది రోజులుగా 9/3, 9/4, 9/5, 9/6, 9/7 కాలువలకు చుక్కనీరు రావటం లేదు. దీంతో తుమ్మలచెరువు, వాడపాలెం, చిన్నాపురం, నెలకుర్రు, కానూరు, తాళ్లపాలెం తదితర గ్రామాల్లో వరినాట్లు పూర్తి చేసిన పొలాలు, నారుమడులు ఎండిపోతున్నాయి. కోన, పాతేరు తదితర గ్రామాలకు సాగునీరు చేరకపోవటంతో నారుమడులు పోసుకోలేదు. బంటుమిల్లి మండలం కంచడం, బర్రిపాడు, ముంజులూరు  తదితర గ్రామాల్లో వరినాట్లు జరుగుతున్నాయి.

    ఈ మండలంలో 18 వేల ఎకరాల్లో వరిసాగు ఉండగా, 10వేల ఎకరాల్లో వెదజల్లే పద్ధతి ద్వారా వరినాట్లు పూర్తి చేశారు. కృత్తివెన్ను మండలం 10వేల ఎకరాలు సాగు ఉండగా అన్ని గ్రామాల్లో వరినాట్లు వేస్తున్నారు. బంటుమిల్లి చానల్‌కు గత నాలుగైదు రోజులుగా సాగునీటి విడుదలను గణనీయంగా తగ్గించటంతో రైతులు ఇక్కట్ల పాలవుతున్నారు. నాట్లు వేయకముందే వంతులవారీ పద్ధతిలో సాగునీటి అందిస్తామని ప్రకటించిన నీటిపారుదల శాఖ అధికారులు శివారు ప్రాంతాలకు సాగునీటిని విడుదల చేయకుండా తమను ఇక్కట్ల పాలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు.
     
    ఆయిల్ ఇంజిన్లే దిక్కు

    దివిసీమలోని పలు ప్రాంతాల్లో పంటకాలువల ద్వారా సరిగా సాగునీరు అందక పోవడంతో ఆయిల్ ఇంజిన్లతో తోడుకుని నాట్లు వేసుకుంటున్నారు. కొన్నిచోట్ల మండుతున్న ఎండల వల్ల ఉదయం తోడిన నీరు సాయంత్రానికి ఎండిపోతుండటంతో రెండుసార్లు దమ్ము చేయాల్సి వస్తోంది. దీనివల్ల ఎకరాకు అదనంగా రూ.5వేలు ఖర్చు అవుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట కాలువలకు సక్రమంగా సాగునీరు అందిస్తే తమకు ఈ దుస్థితి ఉండదని రైతులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. దివిసీమలో 1.05లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు చేయాల్సి ఉండగా నీటి కొరత వల్ల ఇప్పటి వరకు 45వేల ఎకరాల్లో మాత్రమే నాట్లు పూర్తిచేశారు.
     
    నారు ముదురుతోంది
     
    దివిసీమలోని పలు ప్రాంతాల్లో వేసిన నారు ముదిరిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా 25 నుంచి 30రోజుల మధ్య నారును ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ ప్రాంతాల్లో కొన్నిచోట్ల వేసిన నారు 35 నుంచి 40 రోజులు దాటిపోతున్నా పొలాలకు సాగునీరందకపోవడంతో ఏమిచేయాలో రైతులకు దిక్కుతోచడంలేదు. ఎండలు పెరుగుతుండటంతో నారుమళ్లకు రోజూ ఆయిల్ ఇంజిన్లతో నీటిని తోడటానికి రైతులు అదనపు భారాన్ని మోస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నాట్లు పూర్తయ్యే వరకు సాగునీటిని సక్రమంగా అందించాలని రైతులు కోరుతున్నారు.
     
     దమ్ము చేసిన పొలం ఎండిపోయింది
     పక్క రైతును బతిమిలాడుకుని ఆయిల్ ఇంజిన్‌తో నీరు తోడాను. నాట్లు వేసేందుకు దమ్ము చేయించాను. మరుసటి రోజు నాటేయడానికి వెళితే పొలంలో చుక్కనీరులేదు. ఎండిపోయి మట్టి బయటపడింది. మళ్లీ దమ్ము చేయిద్దామనుకుంటే నీరందడంలేదు. ఏమిచేయాలో తెలియడంలేదు.
     - శీలం వెంకటేశ్వరరావు, పిట్లలంక, కోడూరు మండలం
     
     ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదు
     సాగునీటి కోసం ఈ ఏడాది పడుతున్న ఇబ్బందులు ఎప్పుడూ చూడలేదు. నీటి ఎద్దడిని గ్రహించి వెదజల్లే పద్ధతిన సాగుచేశాను. నీరందక మొక్కలు ఎండిపోయి చనిపోయాయి. నారు తెచ్చి నాట్లు వేద్దామనుకున్నా పొలాలు తడవడానికి నీరు లభించడం లేదు. ఈ ఏడాది సాగునీటికి ఖర్చుపెట్టినట్టు నాజీవితంలో ఎప్పుడూ పెట్టలేదు.
     - గుమ్మడి భీమారావు, పుచ్చగడ్డ, చల్లపల్లి మండలం
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement