ఆయకట్టు కాదు కనికట్టే!
- జిల్లాలో కొత్త ఆయకట్టు ఊసే లేదు
- కృష్ణా డెల్టాకూ సకాలంలో అందని సాగునీరు
- డ్రెయిన్లలో తూడు కూడా తొలగించని వైనం
- వంద రోజుల్లో ఉమా వల్ల రైతులకు ఒరిగింది శూన్యం
సాక్షి ప్రతినిధి, విజయవాడ : ‘పులిచింతల.. పోలవరం ప్రాజెక్టులు.. దుమ్ముగూడెం, తారకరామ ఎత్తిపోతల పథకాలు పూర్తి చేస్తాం. అన్నదాతలకు సాగునీటి కష్టాలను దూరం చేస్తాం..’ అంటూ టీడీపీ నేతలు ఎన్నికల సమయంలో హామీల వర్షం కురిపించారు. జిల్లాకు చెందిన దేవినేని ఉమా ఇరిగేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో రైతుల్లో కొత్త ఆయకట్టుపై ఆశలు చిగురిం చాయి. ఇందుకు తగినట్లుగానే ఆయన కూడా రెండు నెలల్లో పులిచింతల పూర్తిచేసి జిల్లాకు సాగునీరు అందిస్తామని చెప్పారు. కానీ, ఒక్క ప్రాజెక్టులోనూ పురోగతి లేదు.
అదనంగా ఆయకట్టు సాగులోకి రాకపోగా, కనీసం సాగర్ నుంచి కూడా సకాలంలో సాగునీరు విడుదల చేయలేదు. కాల్వలు, డ్రెయిన్లలో తూడు, గుర్రపుడెక్క తొలగించలేదు. దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు డ్రెయిన్లు పొంగి పొలాలను ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి దేవినేని ఉమాకు ముఖ్యమంత్రి ఫస్ట్ గ్రేడ్ ఇవ్వడంపై జిల్లాలోని రైతాంగం మండిపడుతోంది. వంద రోజుల్లో ఏం చేశారని ఆయనకు ఫస్ట్ గ్రేడ్ ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు.
పులిచింతల, పోలవరం, దుమ్ముగూడెంపై భారీ ఆశలు
జిల్లాలో ప్రధానంగా కృష్ణా డెల్టా ద్వారా ప్రస్తుతం 8.50 లక్షల ఎకరాలు సాగవుతోంది. సాగర్ కుడికాలువ ద్వారా నూజివీడు, మైలవరం నియోజకవర్గాల్లో మరో 3.78లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారు. మిగిలిన భూమి మెట్టగానే ఉంది. అయితే పులిచింతల, పోలవరం ప్రాజెక్టులతోపాటు దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకాలపై జిల్లా రైతులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ మూడింటి ద్వారా జిల్లాలో 7,68,000 ఎకరాలకు అదనంగా సాగునీరు అందుతోంది. రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా దేవినేని ఉమామహేశ్వరరావు బాధ్యతలు స్వీకరించగానే రెండు నెలల్లో పులిచింతల ద్వారా సాగునీరు అందిస్తానని హామీ ఇచ్చారు.
మూడు నెలలు గడిచినా ఇంతవరకు చుక్కనీరు విడుదల కాలేదు. దీంతో తమ సాగునీటి కల ఎప్పటికి నెరవేరుతుందోనని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
పులిచింతల పూర్తయితే..
పులిచింతల ప్రాజెక్టు ద్వారా పూర్తి స్థాయిలో సాగునీరు అందితే జిల్లాలో 6,79,498 ఎకరాలు సాగులోకి వస్తుంది. అంటే కృష్ణా డెల్టాతో సమానంగా సాగునీరు అందుతుంది. ఎంతోకాలంగా రైతులు ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్టు పూర్తికాకుండానే గత సంవత్సరం డిసెంబర్‌లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. రైతులకు ఇవ్వాల్సిన ప్యాకేజీలు కూడా పూర్తిగా అందలేదు.
పోల‘వరం’ ఎన్నటికో..!
పశ్చిమగోదావరి జిల్లాలోని రామయ్యపేట గ్రామం వద్ద నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ద్వారా కూడా కృష్ణా జిల్లాకు సాగునీరు అందనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే మన జిల్లాలో 62వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. కానీ, పాలకులు ఎప్పటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తారోనని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం
గోదావరి నదికి సమీపంలో ఖమ్మం జిల్లా కోతులకొండ గ్రామం వద్ద దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నారు. ఈ పథకం పూర్తయితే కృష్ణా జిల్లాలో 27 వేల ఎకరాల భూమి సాగులోకి వస్తుంది.
‘తారకరామ’కు ఖర్చు చేసింది రూ.5.37 కోట్లే!
ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి వద్ద కృష్ణానదికి సమీపంలో తారకరామ ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నారు. ఈ పథకం పూర్తయితే 56వేల ఎకరాలు సాగులోకి రానున్నాయి. రూ.165.65 కోట్లతో మొదలు పెట్టిన ఈ పథకానికి ఇప్పటి వరకు రూ.5.37 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. సొంత నియోజకవర్గంలో ఉన్న ఈ పథకంపై కూడా మంత్రి పెద్దగా దృష్టి పెట్టలేదని స్థానిక రైతులు విమర్శిస్తున్నారు.
ముందుకు సాగని ఆధునికీకరణ పనులు
నాగార్జున సాగర్, డెల్టా కాలువల ఆధునికీకరణ పనులు ఏమాత్రం ముందుకు సాగటం లేదు. దీంతో రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు డ్రెయిన్లు పొంగి పొలాలను ముంచెత్తుతున్నాయి. అష్టకష్టాలు పడి సాగు చేసిన పొలాలు నీటమునగడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు నదుల్లో నీరు సమృద్ధిగా ఉన్నా కోడూరు, నాగాయలంక, అవనిగడ్డ, మోపిదేవి, మచిలీపట్నం, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను, గూడూరు, కైకలూరు, కలిదిండి మండలాలకు సాగునీరు సక్రమంగా అందటం లేదు. కాలువ చివరి భూములు కావడంతో నీరు అందక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. సుమారు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు సక్రమంగా అందలేదని తెలుస్తోంది. దీనిపై కూడా మంత్రి దృష్టి పెడతారనుకుంటే పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.
దేనిలో ఫస్ట్ గ్రేడ్
భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉమామహేశ్వరరావుకు సీఎం చంద్రబాబు ఫస్ట్ గ్రేడ్ ఇచ్చారు. ఏ విషయాన్ని బేరీజు వేసుకుని ఆయనకు ఫస్ట్ గ్రేడ్ ఇచ్చారని జిల్లా రైతాంగం ప్రశ్నిస్తోంది. ఇరిగేషన్ శాఖ పనితీరు బాగుందనా.. లేక ప్రతిపక్షంపై అర్థంపర్థం లేని విమర్శలు చేసినందుకా.. ఏ విషయంలో ఉమాకు ఉత్తమ గ్రేడ్ ఇచ్చారనే విషయం అర్థం కావడం లేదని పలువురు పేర్కొంటున్నారు. వంద రోజుల పాలనలో ఇరిగేషన్ శాఖ వల్ల తమకు ఒరిగిందేమీ లేదని జిల్లాలోని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.