సాగు నీరో రామచంద్రా..
- మరమ్మతులకు నోచుకోని గ్రోయిన్లు
- సముద్రంలోకి వృథాగా ఉప్పొంగే జలాలు
- వేలాది ఎకరాలకు అందని సాగునీరు
- అన్నదాతలకు అవస్థలు
ఉప్పొంగే జలాలు ఉప్పునీటి పాలవుతున్నాయి. వర్షాలప్పుడు నీటిని ఒడిసి పట్టుకునే పరిస్థితి కానరావడం లేదు. జిల్లాలో సుమారు ఐదు లక్షల ఎకరాలకు బోర్లు, వర్షమే ఆధారం. నదుల్లోని నీటిని పొలాలకు మళ్లించడానికి ఏర్పాటు చేసిన గ్రోయిన్లు శిథిలమవ్వడంతో సాగునీరందక అన్నదాతలు అవస్థల పాలవుతున్నారు. వీటిని బాగు చేయడానికి ప్రతిపాదనలు పంపామని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నా.. ఆ పని కానరావడం లేదు.
చోడవరం : జిల్లాలో రైవాడ, కోనాం, పెద్దేరు,కల్యాణపులోవ, తాండవతోపాటు మరో ఐదు మినీ రిజర్వాయర్లు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు లక్ష ఎకరాలు సాగు భూమి ఉంది. ఇక మిగిలిన భూములన్నీ వర్షాధారమే. వర్షాలప్పుడు నీరు వృథా కాకుండా చూడాల్సిన బాధ్యత పాలకులు, అధికారులదే. కానీ వారు పట్టనట్టు వ్యవహరించడంతో నీరో రామచంద్రా అంటూ రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రధానంగా ఎగువ నుంచి వివిధ నదుల్లోకి వస్తున్న నీటిని నిల్వ ఉంచే గ్రోయిన్లు దెబ్బతినడంతో వేలాది కూసెక్కుల నీరు వృథాగా సముద్రంపాలవుతోంది.
శారద, పెద్దేరు, బొడ్డేరు, తాండవ, తాచేరు నదులు జిల్లాలో ప్రధానమైనవి. వీటితోపాటు సుమారు 60కి పైగా ప్రధాన కొండగెడ్డలు ఉన్నాయి. పెద్దనదులపై సుమారు 25 వరకు గ్రోయిన్లు ఉన్నాయి. శారదానదిలోని కశింకోట కాశీమదుం, అనకాపల్లి గొడారి ఆనకట్ట, చెర్లోపల్లి, సీతానగరం, నర్సాపురం గ్రోయిన్లు, పెద్దేరు నదిలోని గౌరీపట్నం, శ్రీరాంపట్నం, చాకిపల్లి, భోగాపురం, పి.ఎస్.పేట, బెన్నవోలు గ్రోయిన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటికి మరమ్మతులు చేపట్టకపోవడంతో భారీ వర్షాలప్పుడు నదుల్లోని నీరు వృథాగా దిగువకు పోతోంది.
చాకిపల్లి గ్రోయిన్‌కింద 250 ఎకరాలు, భోగాపురం కింద 350, శ్రీరాంపట్నం 200, పిఎస్‌పేట 250, బెన్నవోలు 275, గౌరీపట్నం గ్రొయిన్‌కింద వెయ్యి ఎకరాలు సాగుభూములున్నాయి. పెద్ద గ్రోయిన్ల పరిధిలో వేలాది ఎకరాల ఆయకట్టు ఉంది. ఇప్పుడు ఇవన్నీ పూర్తిగా శిథిలమై ఉన్నాయి. ఐదేళ్లుగా వీటిని నీటిపారుదలశాఖ అధికారులు పట్టించుకున్న పాపానపోలేదు. గౌరీపట్నం గ్రోయిన్‌కు నాలుగేళ్ల కిందట రూ.లక్షతో మరమ్మతులు చేపట్టినా నాణ్యతా లోపంతో రెండేళ్లకే కొట్టుకుపోయింది.
మిగతా గ్రోయిన్ల పరిస్థితి దయనీయం. అసలే వర్షాధార భూములకు గ్రోయిన్లు కూడా ఉపయోగపడకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కాగా వీటికి అనుసంధానంగా ఉండే స్లూయీస్‌లు కూడా పూర్తిగా దెబ్బతినడంతో నదుల్లోని నీరు పంటకాలువలకు పారడం లేదు. పరిస్థితిని ఇరిగేషన్ అధికారుల దృష్టికి రైతులు తీసుకెళ్లినా ఫలితం శూన్యం. జిల్లా కలెక్టర్ దీనిపై చర్యలు తీసుకొని గ్రోయిన్లకు మరమ్మతులు చేపట్టి సాగునీరందేలా చూడాలని రైతులు కోరుతున్నారు.