Reservoirs
-
గంగ కంటే కృష్ణ మిన్న
సాక్షి, అమరావతి: దేశంలో అతి పెద్ద, పొడవైన నది గంగ. నీటి లభ్యతలోనూ గంగదే ప్రథమ స్థానం. గంగ నదీ పరివాహక ప్రాంతం(బేసిన్)లో 75 శాతం లభ్యత ఆధారంగా 17,940.20 టీఎంసీలు గంగా నదీ పరివాహక ప్రాంతం(బేసిన్)లో లభిస్తాయి. కానీ..ఆ గంగా బేసిన్లో రిజర్వాయర్ల నీటి నిల్వ(లైవ్) సామర్థ్యం 1,713.58 టీఎంసీలే. కృష్ణాలో ఏటా 75 శాతం లభ్యత ఆధారంగా లభించేది 3,157.29 టీఎంసీలు. కృష్ణా బేసిన్లో 1,783.43 టీఎంసీలు నిల్వ (లైవ్) సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లున్నాయి. వీటిని బట్టి చూస్తే దేశంలో అత్యధిక నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లలో కృష్ణా బేసిన్ అగ్రస్థానంలో నిలిచింది. దేశంలో జలవనరులపై కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సమగ్రంగా అధ్యయనం చేసింది. ఆ అధ్యయనంలో వెల్లడైన అంశాల ఆధారంగా ఇటీవల నివేదికను రూపొందించింది. అందులో ప్రధానాంశాలు ఇవీ..దేశంలో ఉత్తరాన హిమాలయ నది సింధూ నుంచి.. దక్షిణాన ద్వీపకల్ప నది కావేరి వరకూ నదుల్లో ఏటా సగటున 75 శాతం లభ్యత ఆధారంగా 70,391.84 టీఎంసీలు లభిస్తాయి. నీటి లభ్యతలో బ్రహ్మపుత్ర(18,565.53 టీఎంసీలు) మొదటి స్థానంలో ఉండగా.. గంగా(17,940.20 టీఎంసీలు) రెండో స్థానంలోనూ.. గోదావరి(4,145.66 టీఎంసీలు) మూడో స్థానంలో ఉంది. ఇక నీటి లభ్యతలో కృష్ణా (3,157.29 టీఎంసీలు) నాలుగో స్థానంలో నిలిచింది.దేశంలో అన్ని నదీ పరివాహక ప్రాంతాల్లో నిర్మించిన రిజర్వాయర్లలో నీటి నిల్వ (లైవ్) సామర్థ్యం 10,724.16 టీఎంసీలు. నీటి లభ్యతలో అగ్రస్థానంలో ఉన్న బ్రహ్మపుత్ర..రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యంలో అట్టడుగున నిలిచింది.గోదావరి బేసిన్లో 1,233.75 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లు ఉండగా.. పెన్నా బేసిన్లో 178.84 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లు ఉన్నాయి. -
అడుగంటిన రిజర్వాయర్లు.. మంత్రి ఉత్తమ్‌కు హరీష్‌రావు లేఖ
సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ (అంతగిరి) రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ లు పూర్తి గా నీళ్లు లేక రిజర్వాయర్లు అడుగంటి పోయే పరిస్థితికి చేరుకున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ హరీశ్.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. ‘‘గత సంవత్సరం ఇదే ఆగస్టు నెలలో అనంతగిరి రిజర్వాయర్‌లో 3.32 టీఎంసీల నీళ్ళు ఉంటే ప్రస్తుతం 0.75 టీఎంసీలు, రంగనాయక సాగర్‌లో 2.38 టీఎంసీలకు గాను ప్రస్తుతం 0.67 టీఎంసీలు, మల్లన్న సాగర్ 18 టీఎంసీలకు గాను ప్రస్తుతం 8.5 టీఎంసీలు, కొండ పోచమ్మ సాగర్ 10 టీఎంసీలకు గాను ప్రస్తుతం 4.5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఒకవైపు రిజర్వాయర్లలో నీళ్లు లేక, మరోవైపు వర్షాలు కురవక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. .. పంటలు వేయాలా వద్దా అనే అయోమయంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే జిల్లాల పంటల సాగు విస్తీర్ణం కూడ తగ్గి పోయింది. కాబట్టి రాజకీయాలు పక్కనబెట్టి మిడ్ మానెర్ నుండి అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్లకు నీటిని పంపింగ్ చేసేలా ఇరిగేషన్ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నా. అదేవిధంగా కాలువల ద్వారా నీటిని విడుదల చేసి ఆయకట్టుకు నీళ్లందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రైతాంగం పక్షాన కోరుతున్నాను’’ అని లేఖలో అన్నారు. -
వరద హోరు.. ప్రాజెక్టులకు జలకళ
-
AP Rains: వరదలతో రిజర్వాయర్లకు జలకళ
-
దేశంలో పెరిగిన ప్రధాన రిజర్వాయర్ల నీటిమట్టం
దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) శుభవార్త చెప్పింది. గత ఏడాది సెప్టెంబర్ తర్వాత దేశంలోని ప్రధాన జలాశయాల నీటిమట్టం తొలిసారిగా పెరిగిందని సీడబ్ల్యూసీ పేర్కొంది. అయితే స్వల్పంగానే నీటిమట్టం పెరగడంతో జలమండలి ఆందోళన వ్యక్తం చేస్తోంది.భారతదేశంలోని 150 రిజర్వాయర్లను పర్యవేక్షించే సీడబ్ల్యూసీ తాజా సమాచారాన్ని మీడియాకు వెల్లడించింది. 150 రిజర్వాయర్లలో 20 జలవిద్యుత్ ప్రాజెక్టులకు ఉపయుక్తమవుతున్నాయి. వీటి మొత్తం నిల్వ సామర్థ్యం 35.30 బిలియన్ క్యూబిక్ మీటర్లు (బీసీఎం. గత సంవత్సరం ఇదే కాలంలో అందుబాటులో ఉన్న నిల్వ 44.06 బీసీఎం. సాధారణ నిల్వ స్థాయి 50.422 బీసీఎం. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్‌లలో మొత్తం 19.663 బీసీఎం నిల్వ సామర్థ్యంతో 10 రిజర్వాయర్లు ఉన్నాయి. ఇవి సీడబ్ల్యూసీ పర్యవేక్షణలో ఉన్నాయి.అసోం, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, త్రిపుర, నాగాలాండ్, బీహార్‌లతో సహా తూర్పు ప్రాంతంలో 23 రిజర్వాయర్లు ఉన్నాయి. వీటి మొత్తం నిల్వ సామర్థ్యం 20.430 బీసీఎం. ప్రస్తుత నిల్వ 3.979 బీసీఎం (19 శాతం). ఇది గత సంవత్సరం కంటే 20 శాతం తక్కువ. గుజరాత్, మహారాష్ట్రలోని పశ్చిమ ప్రాంతంలో 49 రిజర్వాయర్లు ఉన్నాయి. వీటి మొత్తం నిల్వ సామర్థ్యం 37.130 బీసీఎం. ప్రస్తుతం నిల్వ 7.949 బీసీఎం (21 శాతం). గత సంవత్సరం ఇది 27 శాతం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ సహా మధ్య ప్రాంతంలో 26 రిజర్వాయర్లు ఉన్నాయి. వీటిలో 48.227 బీసీఎం నిల్వ సామర్థ్యం ఉంది. ప్రస్తుత నిల్వ 12.26 బీసీఎం(25 శాతం). గత సంవత్సరం ఇది 35 శాతం.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడుతో సహా దక్షిణ ప్రాంతంలో 42 రిజర్వాయర్లు ఉన్నాయి. మొత్తం నిల్వ సామర్థ్యం 53.334 బీసీఎం. నిల్వ ఇప్పుడు 10.152 బీసీఎం (19.03 శాతం) వద్ద ఉంది. గత సంవత్సరం 19.43 శాతం. తాద్రీ నుంచి కన్యాకుమారి వరకు బ్రహ్మపుత్ర, సబర్మతి, పశ్చిమాన ప్రవహించే నదులలో సాధారణ నీటి నిల్వ కంటే మెరుగ్గా ఉన్నాయి. సింధు, సువర్ణరేఖ, మహి తదితర నదుల్లో నీటి నిల్వలు సాధారణ స్థాయికి చేరువలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మహానది, కావేరి, బ్రాహ్మణి, వైతరణి నదులో తక్కువ నీటి నిల్వలు నమోదయ్యాయి. -
111 జీవో రద్దు అమలుపై స్తబ్ధత
సాక్షి, హైదరాబాద్: జీవో 111 రద్దు అమలుపై స్తబ్ధ త నెలకొంది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాల పరిరక్షణకు ఉద్దేశించిన 111 జీవోను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్‌లో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో కొన్ని అభ్యంతరాలు రావడంతో ప్రభుత్వం నిబంధనల సడలింపులపై అధ్యయనం చేసేందుకు జీవో 69ను జారీ చేస్తూ, ప్రత్యేకంగా ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక అందించే దాకా 111 జీవో పరిధిలోని ప్రాంతాల్లో నిబంధనలు కొనసాగుతాయని ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసింది. దీంతో 111జీవో పరిధిలోని 84 గ్రామాల్లో మళ్లీ స్తబ్ధత నెలకొంది. అయితే ప్రభుత్వం విధించిన ఆంక్షలు కేవలం సామాన్యులకే పరిమితమవుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల చేయి తడిపే అక్రమార్కుల నిర్మాణాలు మాత్రం జోరుగా సాగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. కాలయాపన కమిటీ.. హైదరాబాద్‌కు తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాల పరిధిలో సుమారు 1.32 లక్షల ఎకరాలలో భూమి ఉంది. ఇక్కడ 84 గ్రామాలకు కొత్త మాస్టర్ ప్లాన్‌ను రూపొందించి ప్రణాళిక ప్రకారం హరిత నగరాన్ని నిర్మించాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగానే 111 జీవోను రద్దు చేసింది. అయితే ఈ జలాశయాల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై మార్గదర్శకాలు రూపొందించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. మున్సిపల్, ఆర్థిక, నీటిపారుదల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, జలమండలి ఎండీ, కాలుష్య నియంత్రణ బోర్డు సభ్య కార్యదర్శి, హెచ్ఎండీఏ డైరెక్టర్ (ప్లానింగ్) సభ్యులుగా ఉండే ఈ కమిటీలో.. ఏయే అంశాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలన్న దానిపై విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. అయితే కమిటీ ఏర్పాటై నెలలు గడుస్తున్నా నేటికీ ఎలాంటి విధానాలను రూపొందించకపోవడం గమనార్హం. ఆగని నిర్మాణాలు.. ఇప్పటికే 111 జీవో పరిధిలోని భూముల్లో సంపన్న వర్గాలు, పారిశ్రామికవేత్తలు, సినీ, రాజకీయ ప్రముఖులు, బ్యూరోక్రాట్స్ తక్కువ ధరకే పెద్ద ఎత్తున స్థలాలను కొనుగోలు చేసి, ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్‌లను నిర్మించుకున్నారు. శంషాబాద్, మెయినాబాద్, రాజేంద్రనగర్, చేవెళ్ల, షాబాద్, కొత్తూరు శంకర్పల్లి మండలాల పరిధిలో అక్రమంగా లగ్జరీ విల్లాలు, హైరైజ్ నిర్మాణాలు జరుగుతున్నాయి. 111 జీవో ఎత్తివేశాక ఒక్క శంషాబాద్ పట్టణంలో దాదాపు 400 అక్రమ నిర్మాణాలు చేపట్టారని అంచనా. మొయినాబాద్ మండలంలో కొందరు రియల్టర్లు భూములను 10, 25 గుంటల చొప్పున ఫామ్ ల్యాండ్లుగా విక్రయిస్తున్నారు. వీటిని కొనుగోలు చేసిన చాలా మంది ఆయా ఫామ్ ల్యాండ్లలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని తెలుస్తోంది. వీటిని ఫామ్ హౌస్, వీకెండ్ హోమ్స్‌గా మార్చేసి అద్దెకు ఇస్తున్నారని స్థానికులు చెపుతున్నారు. రేటు పెట్టి మరీ వసూళ్లు.. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వస్తే నోటీసులు జారీ, క్షేత్ర స్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నా.. అవి అంతంతమాత్రమేనని విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే 111 జీవో పరిధిలో చాలా వరకు అక్రమ నిర్మాణాలు నేతలు, ప్రముఖులవే కావడంతో అధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు స్థానిక మున్సిపల్ అధికారుల చేతులు తడపడంతో వారూ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఒక్కో భవనానికి రూ.2–5 లక్షల వరకు మున్సిపల్ అధికారులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. జీవో రద్దు తర్వాత రియల్ బూమ్.. జీవో111 పరిధిలోని పాత వెంచర్లలో గజం ధర రూ.3–4 వేల వరకు ఉండేది. కాగా, ఈ జీవోను రద్దు చేశాక ధరలు ఒక్కసారిగా గజానికి రూ.12 వేలకు పైగానే చెబుతున్నారు. శంషాబాద్ మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న భూములు ఎకరం ధర రూ.8 కోట్లకు పైగానే చెబుతున్నారు. విమానాశ్రయానికి దగ్గర్లోని గ్రామాల్లో ఎకరం రూ.3–5 కోట్ల వరకు పలుకుతున్నాయని చెపుతున్నారు. సాంకేతికతను వినియోగించుకోవాలి నీటి వనరుల సంరక్షణ పేరుతో అభివృద్ధికి అడ్డుకట్ట వేయకూడదు. జలాశయాల ఆక్రమణలు, కాలుష్య నియంత్రణకు సాంకేతికతను వినియోగించుకోవాలి. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినచర్యలు తీసుకుంటే వ్యవస్థ బాగుంటుంది. – కంచర్ల సంతోష్ రెడ్డి, సీఎండీ, డ్రీమ్ వ్యాలీ గ్రూప్ -
ఉధృతంగా ఈసీ, మూసీ వాగులు.. ఆ రోడ్డు మూసివేత
సాక్షి, రంగారెడ్డి: కుండపోత వర్షాలతో హైదరాబాద్ శివారులోని జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. లోతట్టు ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మూసీ పరివాహక ప్రాంత వాసులను అధికారులు అప్రమత్తం చేశారు. ఈసీ,మూసీ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రాజేంద్రనగర్ నుంచి పోలీస్ అకాడమీ వైపు వెళ్లే ఔటర్ సర్వీసు రోడ్డును పోలీసులు మూసివేశారు. నార్సింగి నుంచి మంచిరేవులకు వెళ్తే దారిని నార్సింగి పోలీసులు మూసేశారు. ప్రత్నామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచించారు. ఎగువ ప్రాంతాల నుంచి జంట జలాశయాలకు వరద భారీగా చేరుతోంది. వికారాబాద్, తాండూర్, శంకర్పల్లి, షాబాద్, షాద్ నగర్, పరిగితో పాటు పలు గ్రామాలకు నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. చదవండి: మూసీలో కొట్టుకొచ్చిన లక్ష్మీ మృతదేహం? -
ఇంకా మొదలుకాని వరదలు.. జలాశయాలు వెలవెల
సాక్షి, హైదరాబాద్: తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని జలాశయాలు వెలవెలబోతున్నాయి. ప్రధాన జలాశయాల్లో నిల్వలు అడుగంటి పోయాయి. గతేడాది సరిగ్గా ఇదే సమయానికి కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలోని ప్రధాన ప్రాజెక్టుల్లో మొత్తం 386.8 టీఎంసీల నిల్వలుండగా, ప్రస్తుతం 285.21 టీఎంసీల నిల్వలు మాత్రమే ఉన్నాయి. కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ఆల్మట్టి డ్యాంలో గతేడాది సరిగ్గా ఇదే సమయానికి 91.35 టీఎంసీల నిల్వలుండగా, ప్రస్తుతం 21 టీఎంసీల నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఎట్టకేలకు డ్యాంకు గత మంగళవారం నుంచి వరద ప్రవాహం ప్రారంభమైంది. ప్రస్తుతం 19,172 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో డ్యాంలోకి వచ్చి చేరుతోంది. రోజుకు 1.66 టీఎంసీల వరద ఆల్మట్టిలో చేరుతుండగా, మరో 108 టీఎంసీల వరద వచ్చిచేరితేనే డ్యాం నిండనుంది. ఇక నారాయణపూర్ జలాశయంలో 17 టీఎంసీలు, తుంగభద్ర డ్యాంలో 6.89 టీఎంసీల నిల్వలు మాత్రమే ఉన్నాయి. జూరాలకు ఇంకా మొదలుకాని ఇన్‌ఫ్లో నారాయణపూర్, జూరాలకు ఇప్పటివరకు ఎలాంటి ఇన్‌ఫ్లో ప్రారంభం కాలేదు. శ్రీశైలంకు 126 క్యూసెక్కుల నామమాత్రపు వరద వస్తోంది. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యాంలు పూర్తిగా నిండితేనే దిగువన ఉన్న జూరాల, శ్రీశైలం జలాశయాలకు వరద నీరు రానుంది. నైరుతి రుతుపవనాలు ప్రారంభమై నెలన్నర గడుస్తున్నా చెప్పుకోదగ్గ వర్షాలు లేకపోవడం, ఇంకా వర్షాభావ పరిస్థితులు కొనసాగుతుండడంతో ఈ డ్యాంలు ఇప్పట్లో నిండే సూచనలు కనపడటం లేదు. ప్రాణహితకి స్వల్పంగా పెరిగిన వరద.. గోదావరి పరీవాహక ప్రాంతంలోని ప్రాణహిత నదికి స్వల్పంగా వరద ప్రవాహం పెరుగుతుండటంతో లక్ష్మి(మేడిగడ్డ) బ్యారేజీకి ప్రస్తుతం 1,23,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 1,19,878 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. సమ్మక్క బ్యారేజీకి వస్తున్న 83,945 క్యూసెక్కులను వచ్చినట్టు కిందికి పంపిస్తున్నారు. -
ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: జీవో 111 రద్దు అనంతర పరిణామాలను రాష్ట్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. జీవో ఎత్తివేత తర్వాత ఎదురయ్యే పర్యావరణ సమస్యలను అంచనా వేస్తూ దానికి తగ్గట్టుగా మార్గదర్శకాల జారీకి కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా జీవో రద్దుతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాల మనుగడ ప్రశ్నార్థకమవుతుందనే పర్యావరణ వేత్తల ఆందోళనను పరిగణనలోకి తీసుకుంటూ అచితూచి అడుగులేస్తోంది. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా.. జలాశయాల ఉనికికి భంగం కలుగకుండా ప్రణాళికా బద్ధమైన అభివృద్ధికి సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. భారీ నిర్మాణాలు, పరిశ్రమలతో జంట జలాశయాలు కలుషితం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోనుంది. స్థిరాస్తి వ్యాపారం, నిర్మాణాలకు ఎడాపెడా అనుమతులు ఇచ్చేసి చేతులు దులుపుకోకుండా.. మురుగు నీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటు, వరద కాల్వల నిర్మాణం, గ్రీన్‌బెల్ట్, బఫర్ జోన్ పరిధుల నిర్ధారణ తదితర అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోంది. సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)ల నుంచి అభ్యంతరాలు రాకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని అత్యున్నత స్థాయి అధికారులు, నిపుణుల కమిటీ కొత్త నిబంధనల రూపకల్పనలో తలమునకలైంది. జీవో 111 పరిధిలోని ఏడు మండలాల్లో 84 గ్రామాలుండగా వీటిల్లో ప్రభుత్వ, ప్రైవేట్ కలుపుకొని సుమారు 1.35 లక్షల ఎకరాల భూమి ఉంది. జెడ్‌ఎల్‌డీ ప్రాంతాల్లో నివాస సముదాయాలు వర్షపాతాన్ని అధ్యయన నివేదిక ఆధారంగా తక్కువ వర్షపాతం ఉండి, జలాశయాల మనుగడకు ఇబ్బంది లేని ప్రాంతాన్ని జీరో లెవల్ డిశ్చార్జి (జెడ్‌ఎల్‌డీ)గా గుర్తించనున్నారు. ఈ ప్రాంతంలో హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారమే నివాస సముదాయాల నిర్మాణాలకు అనుమతి ఇస్తారు. వాణిజ్య కార్యకలాపాలకు అస్సలు అనుమతులు ఉండవు. ఇక ఈ ప్రాంతాల్లోని నివాసాల నుంచి విడుదలయ్యే వ్యర్థ జలాలను శుద్ధి చేసి, తిరిగి ఆ నీటిని అక్కడే వివిధ ఇతర అవసరాలకు వినియోగించుకునే విధంగా తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. శాటిలైట్ మ్యాపుల ద్వారా గ్రీన్ చానళ్ల గుర్తింపు.. మురుగు, వర్షపు నీరు జంట జలాశయాలకు చేరితే వాటి ఉనికికే ప్రమాదమనేది పర్యావరణవేత్తల ప్రధాన అభ్యంతరం. దీనికి పరిష్కారం చూపించగలిగితే సమస్య ఉండదని భావించిన నిపుణులు కమిటీ.. అసలు వరద నీరు జలశయాలకు ఏ ప్రాంతం నుంచి చేరుతుందో అధ్యయనం చేయాలని నిర్ణయించారు. గత 50 ఏళ్ల వర్షపాతాన్ని అధ్యయనం చేసి నీటి ప్రవాహ మార్గాన్ని శాటిలైట్ మ్యాపుల ద్వారా గుర్తించనున్నారు. జలాశయాల ఎగువ నుంచి వచ్చే ఈ నీరు జీవో 111 పరిధిలోని 84 గ్రామాల గుండా ఎలా ప్రవహిస్తుందో నిర్ధారిస్తారు. ఈ ప్రవాహ మార్గాన్ని గ్రీన్ ఛానల్‌గా గుర్తిస్తారు. ఈ చానల్స్ వద్ద వరద కాలువలను నిర్మిస్తారు. ఒకవేళ కాలువల నిర్మాణం కోసం భూములు తీసుకోవాల్సి వస్తే గనక ప్రస్తుత మార్కెట్ రేటు కట్టి ఇవ్వాలని, అప్పుడే భూ యజమానులు ముందుకొస్తారని అధికారులు ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. బఫర్ జోన్ 500 మీటర్లే! ప్రస్తుతం జంట జలాశయాల చుట్టూరా 10 కిలో మీటర్ల ప్రాంతాన్ని చెరువు పూర్తి స్థాయి సామర్థ్యం (ఎఫ్టీఎల్)గా పరిగణిస్తున్నారు. ఈ ప్రాంతంలో కేవలం పదిశాతం విస్తీర్ణంలో మాత్రమే నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారు. అయితే కొత్త నిబంధనలలో ఎఫ్టీఎల్ స్థానంలో 500 మీటర్ల వరకే బఫర్ జోన్ ఉండనుంది. ఈ జోన్ పరిధిలో నిర్మాణాలపై ఆంక్షలుంటాయి. కాగా 300 చదరపు మీటర్లకు పైన ఉన్న ప్లాట్లకు కనిష్టంగా మీటరు వెడల్పుతో ఒకవైపున గ్రీన్ బెల్ట్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
ఏకాభిప్రాయానికి చివరి యత్నం
సాక్షి, హైదరాబాద్: రిజర్వాయర్ల నిర్వహణ కమిటీ (ఆర్ఎంసీ) సిఫారసులపై ఏకాభిప్రాయానికి కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) తుది ప్రయత్నం చేయనుంది. ఈ నెల 24వ తేదీ ఉద యం 11 గంటలకు హైదరాబాద్‌లోని జలసౌధలో ఆర్ఎంసీ చివరి సమావేశాన్ని నిర్వ హించనుంది. ఈ మేరకు తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేఆర్ఎంబీ గురువారం లేఖ రాసింది. ఈ సమావే శానికి ఏ ఒక్క రాష్ట్రం ప్రతినిధులు గైర్హాజరైనా లేక కమిటీ సిఫారసులపై రెండు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదరక పోయినా.. తన కార్యాచరణలో ఆర్ఎంసీ విఫలమైనట్టు నివేదిస్తామని స్పష్టం చేసింది. గతంలో కొన్ని ఆర్ఎంసీ సమావేశాలకు తెలంగాణ, ఏపీలు గైర్హాజరైన నేపథ్యంలో ఈ నిబంధనను పొందుపర్చింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్ల నిర్వ హణకు సంబంధించిన విధివిధానాలను (రూల్ కర్వ్) సిఫారసు చేసేందుకు గతంలో ఆర్ఎంసీని కృష్ణా బోర్డు ఏర్పాటు చేసింది. ఈ సిఫారసులకు తుది రూపమివ్వడంతో పాటు సంతకాల స్వీకరణ కోసం చివరిసారిగా 24న ఆర్ఎంసీ సమావేశాన్ని తలపెట్టింది. గత సమావేశాల్లో ఏకాభిప్రాయం కుదిరిన పలు అంశాలపై సైతం ప్రస్తుత భేటీలో పునః సమీక్ష కోరవచ్చని తెలిపింది. ఏకాభిప్రాయం కష్టమేనా? శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో ఎంతమేర నీటి నిల్వలున్నప్పుడు, ఎంత మేర నీళ్లను సాగునీరు, జలవిద్యుదుత్పత్తి అవసరాలకు విని యోగించాలి అన్న అంశంపై ఆర్ఎంసీ సిఫారసు లు చేయాల్సి ఉంది. ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తిలో తాత్కాలికంగా కృష్ణాజలాల పంపిణీని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. శ్రీశైలం జలాశయం నుంచి 34 టీఎంసీలకు మించి నీళ్లను ఏపీ తరలించరాదని.. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాలను 50:50 నిష్పత్తిలో పంచేలా రూల్ కర్వ్‌లో పొందుపర్చాలని డిమాండ్ చేస్తోంది. శ్రీశైలం జలాశయం నుంచి నీళ్లను తరలించుకోవడానికి ఉండాల్సిన కనీస నిల్వ మట్టం 834 అడుగులు మాత్రమేనని తెలంగాణ అంటుండగా, 854 అడుగులుండాలని ఏపీ వాదిస్తోంది. శ్రీశైలం జలాలు పూర్తిగా జలవిద్యుదుత్పత్తి కోసమేనని తెలంగాణ అంటుండగా, సాగు, తాగునీటి అవస రాలకే ప్రాధాన్యం ఇవ్వాలని ఏపీ పేర్కొంటోంది. వరద జలాల వినియోగాన్ని సైతం లెక్కించి సంబంధిత రాష్ట్రం ఖాతాలో జమ చేయాలని తెలంగాణ కోరుతుండగా, ఏపీ వ్యతిరేకిస్తోంది. ఆయా అంశాలపై రెండు రాష్ట్రాల సమ్మతితో రూల్‌కర్వ్‌కు తుది రూపు ఇవ్వడం సవాలుగా మారింది. ఈ నేపథ్యంలోనే చివరి సమావేశంలోనూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏకభిప్రాయం కుదిరే అవకాశాలు లేవని, లక్ష్య సాధనలో ఆర్ఎంసీ విఫలమయ్యే సూచనలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
జలాశయాలపై భారీగా సౌర విద్యుత్ ప్రాజెక్టులు!
సాక్షి, హైదరాబాద్: ‘తప్పనిసరి పునరుత్పాదక విద్యుత్ (ఆర్పీవో) కొనుగోళ్ల’ విషయంగా కేంద్రం భారీ లక్ష్యాలు పెట్టిన నేపథ్యంలో.. సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని వివిధ రిజర్వాయర్లపై ఐదు వేల మెగావాట్ల సామర్థ్యంతో ‘ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్లాంట్ల’ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లు, లోయర్ మానేరు వంటి జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్రెడ్కో), నీటిపారుదల శాఖ చర్చలు జరుపుతున్నాయి. అయితే ఈ చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని నీటిపారుదల శాఖ అధికారవర్గాలు తెలిపాయి. రామగుండంలో ఫ్లోటింగ్ ప్రాజెక్టు రాష్ట్రంలో ఇప్పటికే రామగుండంలో ఎన్టీపీసీ, జైపూర్‌లో సింగరేణి సంస్థలు తమ థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు నీటిని సరఫరా చేసే జలాశయాలపై ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్లాంట్లను నిర్మించాయి. రామగుండంలోని 500 ఎకరాల జలాశయంపై ఎన్టీపీసీ 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్‌ను నిర్మించింది. అదే మల్లన్నసాగర్ జలాశయం 22 వేల ఎకరాల్లో ఉంటుంది. మిగతా జలాశయాలూ భారీగానే ఉన్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని రిజర్వాయర్లపై 5 వేల మెగావాట్ల మేర సౌర విద్యుత్ ప్లాంట్లను స్థాపించవచ్చని నీటి పారుదల శాఖ వర్గాలు భావిస్తున్నాయి. వీటి ఏర్పాటుతో స్థలం అద్దె రూపంలో నీటి పారుదల శాఖకు ఆదాయం కూడా వస్తుందని పేర్కొంటున్నాయి. మరోవైపు కాళేశ్వరం వంటి భారీ లిఫ్టులకు చౌకగా విద్యుత్ లభిస్తుందన్న భావన వ్యక్తమవుతోంది. భూసేకరణ సమస్య తప్పుతుంది! భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు వేల ఎకరాల భూములు అవసరం. రాష్ట్రంలో భూముల కొరత తీవ్రంగా ఉంది. ధరలూ భారీగా పెరిగిపోయాయి. సౌర విద్యుత్ ప్రాజెక్టులకు భారీగా భూసేకరణ జరపడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యమయ్యే పనికాదు. భారీ వ్యయంతో భూములు కొని సోలార్ ప్లాంట్లు పెట్టినా దానివల్ల పెట్టుబడి వ్యయం పెరిగి.. విద్యుత్ ధరలు భారీగా పెరిగిపోతాయి. అదే ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లతో భూసేకరణ సమస్య తప్పుతుందని, విద్యుత్ ధర తక్కువగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో టెండర్లు ఆహ్వానించి ప్లాంట్ల ఏర్పాటు బాధ్యతను ప్రైవేటు డెవలపర్లకు అప్పగించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. -
Andhra Pradesh: ప్రాజెక్టుల భద్రతకు ప్రత్యేక చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వివిధ నీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్ల భద్రత, నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం తన కార్యాలయ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు, రిజర్వాయర్ల భద్రత, నిర్వహణపై సమగ్ర పరిశీలన చేయాలని చెప్పారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వద్ద నిర్వహణ పరిస్థితులను సరిదిద్దాలని, రాష్ట్ర విభజన నాటి నుంచి దీని గురించి పట్టించుకోలేదని అన్నారు. దీనివల్ల ముప్పు ఏర్పడే పరిస్థితులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వారీగా నిర్వహణ కోసం తగినంత సిబ్బంది ఉన్నారా? లేదా? అన్న దానిపై లెక్కలు తీయాలని, అవసరమైన సిబ్బందిని వెంటనే నియమించాలని ఆదేశించారు. గత సమీక్షా సమావేశంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ దిశగా ప్రభుత్వ యంత్రాంగం కొన్ని చర్యలు చేపట్టిందని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ► ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రెవిన్యూ–విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి, జల వనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్‌లతో కమిటీ ఏర్పాటు చేశాం. ► ఐఐటీ, జేఎన్టీయూ నిపుణుల కమిటీకి జల వనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ చైర్మన్‌గా ఉన్నారు. తీసుకోవాల్సిన చర్యలను అత్యున్నత కమిటీకి తెలియజేస్తున్నారు. ► వివిధ ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్వహణపై గత ప్రభుత్వాల హయాంలో ఇచ్చిన నివేదికలను కూడా అత్యున్నత స్థాయి కమిటీ పరిశీలిస్తోంది. ఇటీవలి వరదలు, కుంభవృష్టిని పరిగణనలోకి తీసుకుని ఆ మేరకు తగిన సూచనలు చేస్తుంది. ► ఆటోమేషన్ రియల్ టైం డేటాకు, కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానించే వ్యవస్థపై కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కూడిన అత్యున్నత బృందం దృష్టి సారించింది. ► అన్ని మేజర్, మీడియం రిజర్వాయర్లు, బ్యారేజీల నిర్వహణకు అదనపు సిబ్బంది నియామకం, వాటర్ రెగ్యులేషన్ కోసం సిబ్బంది నియామకంపై ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ► పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేసిన పక్షంలో ఆస్తి, ప్రాణనష్టానికి ఆస్కారమున్న లోతట్టు ప్రాంతాలను గుర్తించే పని కూడా ఈ కమిటీ చేస్తోంది. -
CM YS Jagan: నీటి ప్రాజెక్టులపై సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వివిధ నీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్ల భద్రత, నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. గురువారం ఉదయం తన కార్యాలయ సంబంధిత అధికారులతో సీఎం సమావేశమయ్యారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల వద్ద సమగ్ర పరిశీలనచేయాలన్నారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వద్ద నిర్వహణా పరిస్థితులు సరిదిద్దాలని, రాష్ట్ర విభజన నాటినుంచి దీనిగురించి పట్టించుకోలేదన్నారు. దీనివల్ల ముప్పు ఏర్పడే పరిస్థితులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వారీగా నిర్వహణకోసం తగినంత సిబ్బంది ఉన్నారా? లేదా? అన్నదానిపై లెక్కలు తీయాలన్నారు. అవసరమైన సిబ్బందిని నియమించాలని ఆదేశాలు జారీచేశారు. గత సమీక్షా సమావేశంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ దిశగా ప్రభుత్వ యంత్రాంగం కొన్ని చర్యలు చేపట్టిందని అధికారులు సీఎంకు వివరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జవనరులశాఖ స్పెషల్‌చీఫ్ సెక్రటరీ, రెవెన్యూ–విపత్తు నిర్వహణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, జలవనరులశాఖ ఇంజినీర్‌ఇన్ ఛీఫ్‌లతో కమిటీని ఏర్పాటుచేసిన విషయాన్ని ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఐఐటీ, జేఎన్టీయూ నిపుణుల కమిటీకి జలవనరులశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఛైర్మన్‌గా ఉన్నారని, తీసుకోవాల్సిన చర్యలను అత్యున్నత కమిటీకి తెలియజేస్తున్నారని వివరించారు. చదవండి: (Andhra Pradesh: పేదలకు నిశ్చింత) సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు వివిధ ప్రాజెక్టుల నిర్వహణపై గత ప్రభుత్వాల హయాంలో ఇచ్చిన నివేదికలను కూడా అత్యున్నతస్థాయి కమిటీ పరిశీలిస్తోందన్నారు. తాజా వచ్చిన వరదలను, కుంభవృష్టిని పరిగణలోకి తీసుకుని ఆమేరకు తగిన సూచనలు చేస్తుందన్నారు. ఆటోమేషన్ రియల్ టైం డేటాకు కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానించే వ్యవస్థపైన కూడా చీఫ్ సెక్రటరీతో కూడిన అత్యున్నత బృందం దృష్టిసారించిదని ముఖ్యమంత్రికి వివరించారు. అన్ని మేజర్, మీడియం రిజర్వాయర్లు, బ్యారేజీల నిర్వహణకు అదనపు సిబ్బంది నియామకం, అలాగే వాటర్ రెగ్యులేషన్‌కోసం కూడా సిబ్బంది నియామకంపై ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని అధికారులు తెలియజేశారు. వీరి నియామకానికి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. పెద్దమొత్తంలో నీటిని విడుదల చేసిన పక్షంలో ఆస్తినష్టం, ప్రాణనష్టానికి ఆస్కారమున్న లోతట్టుప్రాంతాలను గుర్తించే పనినికూడా కమిటీ చేస్తోందని కూడా అధికారులు తెలిపారు. -
మల్లన్నసాగర్‌ను పరిశీలించిన నిపుణుల కమిటీ
సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను నిపుణుల కమిటీ శనివారం పరిశీలించింది. ప్రాజెక్టులో నీటిని నింపడంపై పలు సూచనలు చేసింది. రిజర్వాయర్ నిర్మాణ డిజైన్స్, డ్రాయింగ్స్, జియాలజిస్టులు ఇచ్చిన టెస్టు రిపోర్టులు, వివిధ ల్యాబ్‌ల నుంచి వచ్చిన రిపోర్టులు, నిర్మాణంలో అనుసరించిన టెక్నికల్ ప్రొసీజర్స్‌ను అధ్యయనం చేసి ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. దీనిలో ఈఎన్సీ (జనరల్) మురళీధర్, ఈఎన్సీ (గజ్వేల్) హరిరాం, ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్ శ్రీధర్, ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్లు ఉమాశంకర్, శశిధర్ సభ్యులుగా ఉన్నారు. వీరు రిజర్వాయర్ నిర్మాణ పద్ధతులు, సీవోటీ కట్టింగ్, ప్రాజెక్టు నింపే టైంలో చేయాల్సిన టెస్టులు తదితర అంశాలను పరిశీలించారు. ఇప్పటికే రిజర్వాయర్‌లో 4.90 టీఎంసీలను నింపారు. ప్రాజెక్టు మినిమం డ్రా లెవల్ వరకు నెమ్మదిగా నీటిని నింపాలని వారు సూచించారు. కమిటీ వెంట ప్రాజెక్టు సీఈ చంద్రశేఖర్, ఎస్ఈ వేణు, ఇంజనీర్లు ఉన్నారు. -
రిజర్వాయర్లకు నయా లుక్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మిగతా ప్రాంతాలు పర్యాటకంగా వెనుకబడే ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలు ఉన్నా సౌకర్యాలు లేకపోవడం, పర్యాటకానికి అనువుగా లేకపోవడమే దీనికి కారణం. ఇలాంటి సమయంలో గోదావరి జలాలతో నిండుతున్న రిజర్వాయర్లు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఆయా ప్రాజెక్టులు పర్యాటకానికి ఆస్కారమిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ కసరత్తు ప్రారంభించింది. గతంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చేసిన ప్రతిపాదనల ఆధారంగా రిజర్వాయర్లు, ప్రాజెక్టుల వద్ద అభివృద్ధి చర్యలు చేపడుతోంది. రంగనాయకసాగర్ రిజర్వాయర్ నాలుగు రిజర్వాయర్ల వద్ద.. పర్యాటక అభివృద్ధి కోసం ప్రభుత్వం నాలుగు రిజర్వాయర్లపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో కీలక పట్టణంగా ఎదుగుతున్న సిద్దిపేటకు సమీపంలోని రంగనాయకసాగర్ రిజర్వాయర్, సిరిసిల్ల శివార్లలోని అన్నపూర్ణ రిజర్వాయర్, అవకాశాలు ఉండీ ఇన్నాళ్లూ అభివృద్ధికి నోచుకోని అప్పర్, మిడ్‌మానేరు రిజర్వాయర్లను ఎంపిక చేసింది. ఆయా చోట్ల అభివృద్ధి పనులకు సంబంధించి ఇటీవలే పర్యాటకాభివృద్ధి సంస్థ ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన ఇచ్చింది. జాతీయ స్థాయిలో సంస్థలు కాన్సెప్టు, డీపీఆర్‌లతో ఈ నెల 15 నాటికి ప్రతిపాదనలు ఇవ్వాలని కోరింది. పనులు అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని పేర్కొంది. వచ్చిన ప్రతిపాదనల్లో మేలైన దాన్ని ఎంపిక చేసి ఆ ఇతివృత్తానికి తగ్గట్టు రిజర్వాయర్లను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో రంగనాయకసాగర్‌ను తొలిదశలో రూ.100 కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అనంతగిరి రిజర్వాయర్‌లోని ప్రకృతి అందాలు రివర్ ఫ్రంట్‌గా లోయర్ మానేరు.. లోయర్ మానేరు డ్యామ్ బ్యాక్‌వాటర్ ప్రాంతాన్ని రివర్‌ఫ్రంట్ పేరుతో అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం నీటిపారుదల శాఖకు రూ.350 కోట్లు కేటాయించింది. ఆ ప్రాంతంలో పర్యాటకులకు వసతులు, ఆకర్షణీయ పనులు చేసేందుకు పర్యా టక శాఖకు రూ.వంద కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టుకు కన్సల్టెంటు నియామక ప్రక్రియ జరుగుతోంది. దీనితో కలిపి ఐదు ప్రాంతాల్లో పర్యాటక ప్రాజెక్టులు పట్టాలెక్కనున్నాయి. అయితే పర్యాటక అభివృద్ధి పనులు నిధుల కొరతతో చతికిలబడుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. తాజా ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందన్నది తేలాల్సి ఉంది. -
మరో ఎన్నికల హామీ అమలుకు రంగం సిద్ధం
వర్గపోరు.. రక్తపుటేరులు.. ఆధిపత్యం కోసం సాగించిన మారణహోమంలో ఎంతో మంది బలయ్యారు. ఎన్నో కుటుంబాలు వీధినపడ్డాయి. అంతా ఓ కుటుంబం కనుసన్నల్లోనే.. చెప్పినట్టు వినాలి.. కాదన్న వారి తలలు తెగిపడ్డాయి. ఇదంతా గతంలో రాప్తాడు నియోజక వర్గంలోని గ్రామాల పరిస్థితి. కానీ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఫ్యాక్షన్ కు చరమగీతం పాడారు. అభివృద్ధి దిశగా అడుగులు వేయించారు. కరువు సీమలో కృష్ణమ్మ పరవళ్లకు అహరహం కృషి చేశారు. తాజాగా వైఎస్సార్ తనయుడు, సీఎం జగన్మోహన్రెడ్డి రక్తపుటేరులు పారిన ప్రాంతాల్లో కృష్ణా జలాలను పారించి కొత్త వెలుగులకు శ్రీకారం చుట్టారు. సీఎం అడుగుజాడల్లో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ‘లక్ష ఎకరాలకు సాగునీరు’ యజ్ఞం చేపట్టారు. సాక్షి, కనగానపల్లి: రాప్తాడు నియోజకవర్గంలోని కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, రామగిరి మండలాలు 2009 వరకు పెనుకొండ నియోజకవర్గంలో ఉండేవి. రాజకీయ పెత్తనం, గ్రామాల్లో ఆధిపత్యం కోసం ఓ వర్గం ఈ మండలాల్లో ఫ్యాక్షన్‌ను పెంచి పోషించింది. పేదలు వ్యవసాయం చేసుకుంటే తమ పెత్తనానికి బ్రేక్ పడుతుందని కుట్ర చేసింది. గ్రామీణులు సాగువైపు వెళ్లకుండా ఆధిపత్య పోరుకు ఉసిగొలిపింది. తమ మాట కాదన్న వారిని వేటాడి అంతమొందిస్తూ వచ్చింది. ఫలితంగా కనగానపల్లి మండలంలో 8, రామగిరిలో ఐదు, చెన్నేకొత్తపల్లిలో ఆరు గ్రామాల్లో ఫ్యాక్షన్ తారస్థాయికి చేరింది. ఇందులో కనగానపల్లి మండలంలోని మద్దెలచెరువు, తగరకుంట, భానుకోట, రామగిరి మండలంలోని కుంటిమద్ది, గంతిమర్రి, నసనకోట, చెన్నేకొత్తపల్లి మండలంలోని మేడాపురం, కనుముక్కల, నాగసముద్రం గ్రామాలు అత్యంత సమస్యాత్మక గ్రామాలుగా మారిపోయాయి.. దౌర్జన్యం.. దుర్మార్గం ఒకప్పుడు పచ్చని పంట పొలాలతో కళకళలాడిన కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, రామగిరి మండలాల్లో కరుడుకట్టిన ఫ్యాక్షనిస్టు కనుసన్నల్లో నియంతృత్వ ధోరణి రాజ్యమేలింది. రక్తపుటేరులు ప్రవహించాయి. నక్సలైట్ల కదలికలు, పోలీసుల కూంబింగ్‌లు.. ఫ్యాక్షనిస్టుల దౌర్జన్యం.. దుర్మార్గాలతో జనం కంటి మీద కునుకు దూరమైంది. పచ్చని పంట పొలాలు బీళ్లుగా మారాయి. 1994 నుంచి 2004 వరకూ సుమారు 120 మంది ఫ్యాక్షన్‌కు బలైనట్లు పోలీసుల లెక్కలు చెబుతున్నా.. అనధికారికంగా ఈ సంఖ్య రెట్టింపేనని స్థానికులు అంటున్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ ప్రాంతంలో కొన్ని ఫ్యాక్షన్ హత్యలు, ఘర్షణలు చోటు చేసుకున్నాయి. చదవండి: (వైఎస్ జగన్ మాట ఇస్తే తప్పరు: తోపుదుర్తి) ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి, ఎంపీ మాధవ్ ఒక్కసారిగా మారిన పరిస్థితి రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వ్యవసాయానికి పెద్ద పీట వేస్తోంది. ఇందులో భాగంగా హంద్రీ–నీవా కాలువ ద్వారా కృష్ణా జలాలతో చెరువులను నింపడమే కాక, పంటల సాగుకూ నీటిని వదలడంతో గ్రామాల్లో ప్రజలు వ్యవసాయంపై దృష్టి పెట్టారు. నాటి ఫ్యాక్షన్ రాజకీయంతో విసిగిపోయి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు తిరిగి స్వగ్రామాలకు చేరుకున్నారు. వర్గ కక్షలకు దూరంగా.. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. అందువల్లే 2019 తర్వాత ఫ్యాక్షన్ హత్యల ప్రస్తావనే లేకుండా పోయింది. ‘హంద్రీ–నీవా’ నీటితో సస్యశ్యామలం రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరు, కనగానపల్లి, రామగిరి, రాప్తాడు, చెన్నేకొత్తపల్లి మండలాల మీదుగా హంద్రీ–నీవా కాలువ గుండా కృష్ణా జలాలు ప్రవహిస్తున్నాయి. కాలువ సరిహద్దు గ్రామాలైన కనగానపల్లి, రామగిరి, చెన్నేకొత్తపల్లి మండలాల్లోని సుమారు 12 చెరువులు, 15 కుంటలను కృష్ణా జలాలతో నింపారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి చొరవతో కాలువ దిగువన వేల ఎకరాల్లో పంటల సాగుకు నీరు అందింది. కనగానపల్లి మండలంలోని తగరకుంట, తూంచర్ల, బద్దలాపురం, యలకుంట్ల, గుంతపల్లి గ్రామాల్లో సుమారు వెయ్యి ఎకరాల్లో వరి, 500 ఎకరాల్లో పండ్ల తోటలు సాగులోకి వచ్చాయి. రామగిరి మండలంలోని కుంటిమద్ది, పోలేపల్లి, గంతిమర్రి గ్రామాల్లోనూ రైతులు విస్తారంగా పంటలు సాగు చేపట్టారు. ఒక్క కుంటిమద్ది చెరువు కింద 500 ఎకరాల్లో వరిసాగులోకి రావడం గమనార్హం. మేడాపురం, కనుముక్కల, ఒంటికొండ తదితర గ్రామాల్లో వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో ఫ్యాక్షన్ అనే పదం వినిపించకుండా పోయింది. వేదికను సిద్ధం చేస్తున్న దృశ్యం ఆశలకు జీవం.. చెన్నేకొత్తపల్లి: రాప్తాడు నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు సారునీరందించే లక్ష్యంతో నిర్మిస్తున్న దేవరకొండ, ముట్టాల, తోపుదుర్తి రిజర్వాయర్ల నిర్మాణానికి బుధవారం భూమిపూజ చేయనున్నారు. చెన్నేకొత్తపల్లి మండలం వెంకటంపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన పైలాన్, మూడు రిజర్వాయర్ల భూమి పూజ పనులను ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడిపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు. అనంతరం నిర్వహించే భారీ బహిరంగ సభకు జిల్లా ఇన్చార్జి మంత్రి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజుతో పాటు ఎంపీలు గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మూడు రోజులుగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మంగళవారం నాటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేయించారు. ఏర్పాట్ల పరిశీలన చెన్నేకొత్తపల్లి మండలం వెంకటంపల్లి గ్రామం వద్ద నిర్వహిస్తున్న మూడు రిజర్వాయర్ల భూమిపూజ పనులకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. సభాస్థలి, రిజర్వాయర్ల పైలాన్, వాహనాల పార్కింగ్, భోజన కౌంటర్లు, ఎల్ఈడీ స్క్రీన్స్ వంటి ఏర్పాట్లను మంగళవారం పూర్తి చేశారు. కలెక్టర్ గంధం చంద్రుడు, జేసీ నిశాంత్‌కుమార్, ఆర్డీఓ మధుసూదన్‌లు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. లక్ష ఎకరాలకు సాగునీరే లక్ష్యం రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యం. ‘ప్రజాసంకల్ప’ యాత్రలో నియోజకవర్గ సమస్యలను స్వయంగా చూసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. జగన్ అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలోనే ప్రజలకిచ్చిన హామీని ముఖ్యమంత్రి నెరవేర్చారు. రాప్తాడు నియోజకవర్గంలోని చెన్నేకొత్తపల్లి మండలంలో దేవరకొండ రిజర్వాయర్, ముట్టాల, తోపుదుర్తి రిజర్వాయర్ల నిర్మాణాల ద్వారా రైతాంగానికి సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. – తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే -
నెరవేరనున్న సీఎం జగన్ మరో ఎన్నికల హామీ..
సాక్షి, అనంతపురం: మరో ఎన్నికల హామీ నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సన్నద్ధమవుతున్నారు. అనంతపురం జిల్లాలో రేపు(బుధవారం) 3 రిజర్వాయర్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపన చేయనున్నారు. చెన్నేకొత్తపల్లి మండలం వెంకటాంపల్లిలో పైలాన్ ఏర్పాటు చేశారు. రాప్తాడు నియోజకవర్గంలో ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ రిజర్వాయర్లు నిర్మాణం కానున్నాయి. హంద్రీనీవా నుంచి పేరూరు డ్యాంకు నీటి తరలింపు కోసం ప్రణాళికలు సిద్ధమయ్యాయి. (చదవండి: బీసీల కార్పొరేషన్ల ఏర్పాటు ఓ చారిత్రక నిర్ణయం) రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందనుంది. ఏడు మండలాల్లోని 35 గ్రామాలకు లబ్ధి చేకూరనుంది. మొత్తం నాలుగు రిజర్వాయర్లు, ప్రధాన కాలువ కోసం రూ.800 కోట్లను ఏపీ ప్రభుత్వం వెచ్చిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజన్ ఉన్న నాయకుడని, రాప్తాడు నియోజకవర్గ ప్రజలకు లక్ష ఎకరాలకు నీరిస్తానన్న హామీని నిలబెట్టుకున్నారని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. తమకు రైతు ప్రయోజనాలే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. (చదవండి: ఆ రాతలపై అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్) -
వైఎస్ జగన్ మాట ఇస్తే తప్పరు: తోపుదుర్తి
సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మాట ఇస్తే తప్పరని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరందిస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, ఇప్పటికే పేరూరు డ్యాంకు కృష్ణా జలాలను అందించాం. నియోజక వర్గ పరిధిలో కొత్తగా నాలుగు రిజర్వాయర్ల నిర్మాణానికి చేసిన ప్రతిపాదనలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం ఆమోదం తెలిపార’ని అన్నారు. చదవండి: (ఎంపీ మాధవ్ చొరవ.. అనంత మీదుగా ప్రత్యేక రైలు) ఈ నెల 9న ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ గ్రామాల్లో నిర్మించ తలపెట్టిన రిజర్వాయర్ పనులకు బుధవారం సీఎం జగన్ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. ‘గతంలో సాగునీటి ప్రాజెక్టుల పేరుతో టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడ్డారు. హంద్రీనీవా నుంచి పేరూరు డ్యామ్‌కు నీటి తరలింపు కోసం 803 కోట్ల రూపాయలతో టీడీపీ సర్కారు అంచనాలు రూపొందించింది. అదే డబ్బుతో నాలుగు రిజర్వాయర్లు, ప్రత్యేక కాలువ ద్వారా పేరూరు డ్యామ్‌కు నీరు తరలిస్తాం. తాజా ప్రతిప్రాదనల ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ. 300 కోట్లు ఆదా కానుంద’ని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తెలిపారు. చదవండి: (ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పెద్ద మనసు) కాగా, ‘బంగారం’లాంటి భూములు.. సిరులు పండే నేలలు.. అయితేనేం.. నీరులేక నోరెళ్లబెట్టాయి! పచ్చని పంటలు పండే పొలాలన్నీ బీళ్లుగా మారాయి. ఏడాదికి మూడు పంటలు పండించే సత్తా ఉన్న రైతులు ఉన్నా.. జల సిరి లేకపోవడంతో వ్యవసాయం నిర్వీర్యమవుతూ వచ్చింది. సీజన్ వస్తే ఆకాశం వైపు ఆశగా చూడడం తప్ప మరేమీ చేయలేని అసహాయ స్థితిలో అన్నదాతలు కొట్టుమిట్టాడారు. ఇదంతా గతం. ‘నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరందిస్తా’ అనే నినాదంతో ప్రజాభిమానాన్ని చూరగొని ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అహర్నిశం శ్రమించారు. ఇప్పటికే హంద్రీ–నీవా ద్వారా పేరూరు డ్యాంకు కృష్ణా జలాలు అందించారు. అంతటితో ఆగిపోకుండా మరో నాలుగు రిజర్వాయర్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసి, ప్రభుత్వ ఆమోదం కూడా పొందారు. ఈ నెల 9న ఈ రిజర్వాయర్ల నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రాప్తాడు నియోజకవర్గానికి ప్రధాన సాగునీటి వనరుగా ఉన్న అప్పర్ పెన్నార్ డ్యాం (పేరూరు డ్యాం) దశాబ్దాలుగా నీటి చుక్క లేక బోసిపోయింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు నీటిని అందించేందుకు రూ.810 కోట్లు మంజూరయ్యాయి. అయితే పనులు ముందుకు సాగలేదు. కేటాయించిన నిధులు దుర్వినియోగమయ్యాయి. అదే సమయంలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పేరూరు డ్యాంను నీటితో నింపవచ్చునంటూ అప్పటి వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త హోదాలో తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పలు సూచనలు చేస్తూ వచ్చారు. తన వాదనలోని వాస్తవాలేమిటో ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన ఏడాది కాలంలోనే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆచరణలో నిజం చేసి చూపించారు. పేరూరు డ్యాంకు కృష్ణా జలాలను అందించి, తానిచ్చిన మాటను నిలుపుకున్నారు. అంతేకాక జీడిపల్లి రిజర్వాయర్ నుంచి నేరుగా పేరూరు డ్యాంకు నీరు మళ్లించేలా రూ.264.54 కోట్లతో 53.45 కిలోమీటర్ల మేర కాలువ పనులు చేపట్టారు. దీని ద్వారా పేరూరు డ్యాం దిగువన ఉన్న 10 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. డ్యాంకు సమీపంలో ఉన్న రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాల్లో భూగర్భజలాలూ పెరిగి పరోక్షంగా మరో 25 వేల ఎకరాలు సాగులోకి రానున్నాయి. ‘హంద్రీనీవా’ నుంచి ప్రత్యేక కాలువ ద్వారా పేరూరు డ్యాంకు నీరు తరలించే మార్గంలోనే మరో నాలుగు సాగునీటి రిజర్వాయర్ల నిర్మాణానికి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం పేరూరు డ్యాంకు నీటిని తరలించేందుకు కేటాయించిన రూ.810 కోట్ల నిధుల కన్నా తక్కువతో వీటి నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళికలను ప్రకాష్‌రెడ్డి సిద్ధం చేశారు. ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ.244 కోట్లకుపైగా మిగులు చూపించారు. -
పంటలకు సమృద్ధిగా నీరందిస్తాం: అనిల్
సాక్షి, నెల్లూరు: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా రెండోసారి జలాశయాలకు నిండుదనం వచ్చిందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని జలాశయాలను పూర్తిస్థాయి సామర్థ్యంతో నింపుతామన్నారు. (చదవండి: ఏపీలో కొత్త జిల్లాల ప్రక్రియ ప్రారంభం) ‘‘గతంలో దివంగత మహానేత వైఎస్సార్ హయాంలో భారీగా వర్షాలు కురిశాయి. మళ్ళీ జగనన్న పాలనలోనే ఈ జలాశయాలకు నీళ్లు వస్తున్నాయి. సోమశిల చరిత్రలో గత ఏడాది మొదటి సారి పూర్తి సామర్థ్యం 78 టీఎంసీల మేర నీటిని నింపాం. ఈ ఏడాది కూడా 78 టీఎంసీల మేర నీటిని నింపుతాం. కండలేరు జలాశయానికి కూడా నీటిని విడుదల చేస్తున్నాం. ఈ ఏడాది పంటలకు సమృద్ధిగా నీటిని అందిస్తామని’’ మంత్రి పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకే రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. వర్షాలు కురుస్తుండటంతో రంగు మారే అవకాశం ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. -
కుందూపై మూడు జలాశయాలు
సాక్షి, అమరావతి: కుందూ నదిపై మూడు జలాశయాలను నిర్మించి కేసీ (కర్నూలు–కడప) కెనాల్, తెలుగుగంగ ఆయకట్టు స్థిరీకరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కుందూ నదిపై కర్నూలు జిల్లా కోయిలకుంట్ల మండలం జోలదరాశి వద్ద 0.8 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్‌ను రూ.312.3 కోట్లతో నిరి్మంచనున్నారు. చాగలమర్రి మండలం రాజోలి ఆనకట్టకు ఎగువన 2.95 టీఎంసీల సామర్థ్యం కలిగిన మరో రిజర్వాయర్‌ను రూ.1357.10 కోట్లతో నిరి్మంచనున్నారు. వీటికి పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ జలాశయాల ద్వారా కేసీ కెనాల్ ఆయకట్టును స్థిరీకరించనున్నారు. మరోవైపు కుందూనది నుంచి ఎనిమిది టీఎంసీలను తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన అనుబంధ జలాశయం(ఎస్సార్)–1 జలవిస్తరణ ప్రాంతం వద్దకు ఎత్తిపోసి ఆయకట్టు స్థిరీకరించే పనులకు కూడా రూ.564.60 కోట్లతో పరిపాలనా అనుమతి మంజూరైంది. కేసీ కెనాల్ ఆయకట్టుకు మంచి రోజులు.. ►తుంగభద్ర–పెన్నా నదులపై కర్నూలు జిల్లా సుంకేశుల వద్ద డచ్ సంస్థ 1873లో ఆనకట్ట నిర్మించింది. అక్కడి నుంచి పెన్నా వరకు కాలువ తవ్వకం పనులను 1880 నాటికి పూర్తి చేసింది. బ్రిటిష్ ప్రభుత్వం అదే ఏడాది దీన్ని రూ.3.02 కోట్లకు కొనుగోలు చేసింది. 1933 నుంచి ఈ కాలువ సాగునీటి ప్రాజెక్టుగా మారింది. 140 ఏళ్ల చరిత్ర కలిగిన కేసీ కెనాల్ ఆయకట్టు కింద 2,65,628 ఎకరాల ఆయకట్టు ఉంది. కర్నూలు జిల్లాలో 1,73,627 ఎకరాలు, వైఎస్సార్ జిల్లాలో 92,001 ఎకరాల ఆయకట్టు ఉంది. ►బచావత్ ట్రిబ్యునల్ కేసీ కెనాల్‌కు 39.9 టీఎంసీలను కేటాయించింది. సుంకేశుల బ్యారేజీ వద్ద 29.9 టీఎంసీలు లభ్యమవుతాయని, మిగతా పది టీఎంసీలు తుంగభద్ర జలాశయం నుంచి విడుదల చేయాలని పేర్కొంది. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు తుంగభద్రలో సుంకేశుల వద్ద నీటి లభ్యత కనిష్ట స్థాయికి పడిపోవటంతో కేసీ కెనాల్ ఆయకట్టుకు సక్రమంగా నీళ్లందని దుస్థితి నెలకొంది. ►కుందూ వరద ప్రవాహాన్ని ఒడిసిపట్టడం ద్వారా కేసీ కెనాల్ ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులను అధిగమించాలని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా ►నిర్ణయించారు. ఆ క్రమంలో కుందూ నదిపై రాజోలి, జోలదరాశి జలాశయాల నిర్మాణానికి 2008 డిసెంబర్ 23న పరిపాలన అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాజోలి ఆనకట్టకు దిగువన 84,686 ఎకరాలకు కుందూ వరద ద్వారా నీళ్లందించి మిగతా 1,80,942 ఎకరాలకు సుంకేశుల బ్యారేజీ నుంచి తుంగభద్ర జలాలను అందించడం ద్వారా కేసీ కెనాల్ ఆయకట్టును సస్యశ్యామలం చేయాలని భావించారు. వైఎస్సార్ హఠాన్మరణంతో రాజోలి, జోలదరాశి జలాశయాలకు గ్రహణం పట్టింది. ►కేసీ కెనాల్ ఆయకట్టును సస్యశ్యామలం చేసేందుకు ఆ రెండు జలాశయాల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. రిజర్వాయర్ల నిర్మాణంతో రాజోలి జలాశయంలో 6 గ్రామాలు, 9,938 ఎకరాలు ముంపునకు గురవుతాయి. జోలదరాశి జలాశయంలో ఒక గ్రామం, 2,157 ఎకరాల భూమి ముంపునకు గురవుతుంది. బ్రహ్మం సాగర్‌కు కుందూ జలాలు ►తెలుగుగంగ ప్రాజెక్టులో బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ సామర్థ్యం 17.73 టీఎంసీలు. కానీ నీటిని సరఫరా చేసే లింక్ కెనాల్ సక్రమంగా లేకపోవడంతో బ్రహ్మంసాగర్‌ను నింపలేని దుస్థితి నెలకొంది. ఫలితంగా తెలుగుగంగ ఆయకట్టుకు సరిగా నీళ్లందడం లేదు. మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాల్లో తాగునీటి అవసరాలకు కూడా నీటిని సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడింది. ►ఈ పరిస్థితిని అధిగమించేందుకు కుందూ నదిపై వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం జొన్నవరం వద్ద ఆనకట్ట నిరి్మస్తారు. నదికి వరదలు వచ్చే 65 రోజుల్లో నిత్యం 1,425 క్యూసెక్కుల చొప్పున ఎనిమిది టీఎంసీలను దువ్వూరు చెరువులోకి ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి తెలుగుగంగ ప్రధాన కాలువ 107 కి.మీ వద్ద అనుబంధ జలాశయం–1 (ఎస్సార్–1) జల విస్తరణ ప్రాంతం వద్దకు ఎత్తిపోస్తారు. ఆ జలాశయాన్ని నింపి బ్రహ్మంసాగర్‌కు తరలించి తెలుగుగంగ ఆయకట్టుకు నీళ్లందించే పనులకు రూ.564.60 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచి్చంది. ►దీనిద్వారా తెలుగుగంగ ఆయకట్టు స్థిరీకరణతోపాటు మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాల ప్రజల దాహార్తి తీరనుంది. -
నిండు కుండల్లా..
రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. సీలేరు విద్యుత్ కాంప్లెక్సు పరిధిలోని రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయి. రెండురోజులపాటు కురిసిన వర్షాలకు రిజర్వాయర్లన్నీ నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. జోలాపుట్ మొదలుకుని తూర్పుగోదావరి జిల్లా పొల్లూరు రిజర్వాయర్ వరకు ప్రస్తుతం నీటి మట్టాలు గరిష్టస్థాయికి చేరుకున్నాయి. అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోయాయి. సాక్షి, సీలేరు: విద్యుత్‌ను నిరంతరం ఉత్పత్తి చేసే జలాశయాల్లో భారీగా నీరు చేరడంతో జెన్కో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. డొంకరాయి జలవిద్యుత్ కేంద్రం మినహా అన్నింటిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు జోలాపుట్ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 2,750 అడుగులు కాగా శనివారం సాయంత్రానికి 2,749.25 అడుగుల్లో ప్రమాదస్థాయికి చేరుకుంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో మరింత నీరు చేరితే రిజర్వాయర్ నిండిపోతుంది. దీంతో అధికారులు అప్రమత్తమై 20 వేల క్యూసెక్కుల నీటిని బలిమెల రిజర్వాయర్‌లోకి వదులుతున్నారు. బలిమెల జలాశయంలోకి కూడా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మెల్లమెల్లగా నీరు చేరుతుంది. గత 15 రోజుల కిందట కురిసిన వర్షాలకు రిజర్వాయర్‌లో భారీగా నీరు చేరింది. దీంతో ఇరు రాష్ట్రాల విద్యుత్ ఉత్పత్తికి నీటిని వాడుకున్నారు. 1516 అడుగుల నీటి మట్టానికి గాను 1497.01 అడుగుల్లో నీటిమట్టం ఉంది. 19 అడుగుల తేడాతో ఉన్న నీటిమట్టం జోలాపుట్ నుంచి రోజుకు 20 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. ఇరు రాష్ట్రాలు విద్యుత్ ఉత్పత్తికి నీటిని వాడుకుంటున్నారు. ఇదిలా ఉండగా సీలేరు (గుంటవాడ) రిజర్వాయర్ 1360 పూర్తిస్థాయి నీటిమట్టానికి గాను 1348 అడుగులకు నీరు చేరింది. దీనికి ఉపనదులైన పిల్లిగెడ్డ నుంచి ప్రస్తుతం వర్షపునీరు చేరుతుంది. దీని దిగువున ఉన్న సీలేరు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. గరిష్టస్థాయికి ‘డొంకరాయి’ సీలేరు విద్యుత్ కాంప్లెక్సు పరిధిలోని డొంకరాయి జలాశయం నీటిమట్టం గరిష్టస్థాయికి చేరింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పాలగెడ్డ, వలసగెడ్డ, మంగంపాడు ఉపనదుల నుంచి వస్తున్న వర్షపు నీటితో పూర్తిగా నిండిపోయింది. 1037 పూర్తిస్థాయి నీటి మట్టానికి గాను శనివారం సాయంత్రానికి పూర్తిగా నిండిపోయింది. దీంతో అధికారులు మెయిన్ డ్యాం నుంచి శబరినదిలోకి 10 వేల క్యూసెక్కులును రెండు గేట్ల ద్వారా విడుదల చేస్తున్నారు. ఇంకా భారీగా వర్షాలు కురుస్తుండడంతో నీటి విడుదల కొనసాగుతుంది. తూర్పు గోదావరి జిల్లా మోతుగూడెం (ఫోర్‌బై) జలవిద్యుత్ కేంద్రంలో మొన్నటి వరకు డొంకరాయి పవర్ కెనాల్ గండి పడడంతో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు నీరు లేక జెన్కో అధికారులు ఇబ్బందులు పడేవారు. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఏవీపీ డ్యాం 930 అడుగుల సామర్ధ్యం అయినప్పటికీ శనివారం పూర్తిగా నిండిపోవడంతో గేట్లను ఎత్తి పవర్ కెనాల్ ద్వారా పొల్లూరు డ్యాంలోకి నీటిని మళ్లిస్తున్నారు. వర్షాలకు అలిమేరు వాగు నుంచి కూడా నీరు ప్రవహిస్తుంది. దీంతో ఫోర్‌బై జలవిద్యుత్కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు నీటి కొరత లేదని, పీక్‌లోడ్ అవర్స్‌లో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు సరిపడిన నీరు ఉందని ఏపీ జెన్కో ఎగ్జిక్యుటివ్ ఇంజనీర్ వి.ఎల్ రమేష్ తెలిపారు. కురుస్తున్న వర్షాల కారణంగా నీరు ఎప్పటికప్పుడు చేరుతుండడంతో అప్రమత్తంగా ఉన్నామని ఆయన తెలిపారు. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. జలకళాంధ్ర..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సరిగ్గా దశాబ్దం తర్వాత కృష్ణా, గోదావరి, వంశధార నదులు పోటాపోటీగా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఆగస్టు 11వ తేదీ నాటికే నదీ పరీవాహక ప్రాంతంలో ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. కృష్ణా, వంశధార నదుల్లో సెప్టెంబరు వరకూ.. గోదావరి నదిలో అక్టోబర్ వరకూ వరద ప్రవాహం ఉంటుంది. రుతుపవనాల వల్ల సమృద్ధిగా వర్షాలు కురిస్తే పెన్నా నది కూడా పొంగుతుంది. వర్షాలు ఇలాగే కొనసాగితే మధ్య తరహా ప్రాజెక్టులు సైతం నిండుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 2009 తర్వాత జీవనదులు పూర్తిస్థాయిలో జలకళను సంతరించుకోవడంతో సింహభాగం ప్రాజెక్టుల కింద ఆయకట్టులో ఖరీఫ్, రబీ పంటల సాగుకు అవకాశం ఏర్పడిందని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ఇప్పటికే గోదావరి డెల్టాలో 10.13 లక్షల ఎకరాలకు నీటిని విడుదల చేశారు. కృష్ణా డెల్టాలో 13.09 లక్షల ఎకరాలకు సాగునీరు విడుదల చేశారు. వంశధార నది పోటెత్తుతుండటంతో గొట్టా బ్యారేజీ నుంచి 2.31 లక్షల ఎకరాలకు నీటిని విడుదల చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 25.53 లక్షల ఎకరాల్లో వరి పంట సాగులో రైతులు నిమగ్నమయ్యారు. ఉత్తరాంధ్రలో నాగావళి నది ఉధృతంగా ప్రవహించడంతో తోటపల్లి జలాశయం నిండిపోయింది. తోటపల్లి జలాశయం కింద ఉన్న ఆయకట్టు 1.18 లక్షల ఎకరాలకు నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాలువ కింద 11.74 లక్షల ఎకరాలకు, ఎడమ కాలువ కింద ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 10.38 లక్షల ఎకరాలకు ఆదివారం ఆంధ్రపదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్, తెలంగాణ మంత్రి జగదీష్‌రెడ్డి నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ ఆయకట్టుకు ఆగస్టు రెండో వారంలోగా నీటిని విడుదల చేయడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో ఆనందోత్సాహాలు కృష్ణా, తుంగభద్ర నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండడం, ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేస్తుండడంతో రాయలసీమ, నెల్లూరు జిల్లాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నీటితో శ్రీశైలం కుడిగట్టు కాలువ (ఎస్ఆర్బీసీ) కింద 1.54 లక్షల ఎకరాల్లో పంటల సాగులో రైతులు నిమగ్నమయ్యారు. తెలుగుగంగ ప్రాజెక్టు కింద కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల్లో 4.36 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టులో పంటల సాగుకు రైతులు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగుగంగ ప్రధాన కాలువ ద్వారా సోమశిల, కండలేరు జలాశయాలను నింపనున్నారు. దీనివల్ల పెన్నా డెల్టా పరిధిలోని 2.47 లక్షల ఎకరాలు, సోమశిల ప్రాజెక్టు కింద 1.56 లక్షల ఎకరాలకు నీళ్లందించడానికి ప్రణాళిక రచించారు. తుంగభద్ర నది పరవళ్లు తొక్కుతుండడంతో ఇప్పటికే తుంగభద్ర జలాశయం నిండిపోయింది. ఈ ఏడాది తుంగభద్రలో నీటి లభ్యత పెరిగే అవకాశం ఉంది. తుంగభద్ర నదిపై ఆధారపడిన కర్నూలు–కడప(కేసీ) కెనాల్‌కు ఇప్పటికే నీటిని విడుదల చేశారు. ఈ కెనాల్ కింద 2.66 లక్షల ఎకరాల్లో పంటల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. తుంగభద్ర జలాశయం నుంచి ఎగువ కాలువ(హెచ్చెల్సీ), దిగువ కాలువలకు(ఎల్లెల్సీ) సోమవారం నుంచి నీటిని విడుదల చేయనున్నారు. హెచ్చెల్సీ కింద 2.2 లక్షల ఎకరాలు, ఎల్లెల్సీ కింద 1.51 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయనున్నారు. ఈ ఏడాది గాలేరు–నగరి, హంద్రీ–నీవా తొలి దశ ఆయకట్టుకు నీళ్లందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. మధ్యతరహా ప్రాజెక్టుల ఆయకట్టులోనూ... భూపతిపాలెం, ముసురుమిల్లి వంటి మధ్య తరహా ప్రాజెక్టులు నిండిపోయాయి. దాంతో ఆయా ప్రాజెక్టుల కింద ఆయకట్టులో పంటల సాగును రైతులు ప్రారంభించారు. కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదీ పరివాహక ప్రాంతాల్లోని ఎత్తిపోతల పథకాల కింద ఆయకట్టుకు సైతం అధికారులు నీటిని విడుదల చేశారు. చిన్న తరహా ప్రాజెక్టులు, చెరువులు కొంతవరకు నిండాయి. నీటి లభ్యత ఆధారంగా వాటి ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో గోదావరి డెల్టాతోపాటు నీటి లభ్యత ఆధారంగా మరిన్ని ప్రాజెక్టుల కింద ఈ ఏడాది రబీ పంటకు కూడా సాగునీరందించే అవకాశాలు ఉండటంతో రైతన్నల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు సాగుకు నీటి విడుదలిలా - ధవళేశ్వరం నుంచి గోదావరి డెల్టాలోని 10.13 లక్షల ఎకరాలకు - కృష్ణా డెల్టాలోని 13.09 లక్షల ఎకరాలకు - గొట్టా బ్యారేజీ నుంచి 2.31 లక్షల ఎకరాలకు - తోటపల్లి జలాశయం కింద ఉన్న 1.18 లక్షల ఎకరాలకు - సాగర్ ప్రాజెక్టు కుడి కాలువ కింద 11.74 లక్షల ఎకరాలకు, ఎడమ కాలువ కింద ఏపీ, తెలంగాణలోని 10.38 లక్షల ఎకరాలకు -
వాన కురిసే.. సాగు మెరిసే..
సాక్షి, అమరావతి: చినుకు జాడ కోసం గత కొంత కాలంగా ఎదురుచూస్తున్న రైతుల్లో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఈ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఖరీఫ్ పనులు ముమ్మరం చేశారు. మెట్ట పంటలతో పాటు మాగాణుల్లో నాట్లు వేయడం మొదలైంది. అడుగంటిన జలాశయాలకు ఇప్పుడిప్పుడే నీరు చేరుతుండటంతో నీటి కొరత ఉండదని రైతులు భావిస్తున్నారు. దీనికితోడు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో వచ్చే వారంలో మంచి వానలు పడే అవకాశం ఉండటం కూడా రైతుల్లో భరోసా నింపుతోంది. ఉత్తరాంధ్ర, రాయలసీమలో రుతుపవనాలు విస్తరించి ఉండడం కలిసివచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అన్ని జిల్లాల్లో విత్తన పంపిణీ నిరాటంకంగా సాగుతోంది. వర్షాధారిత పంటలు వేయడం ఊపందుకుంది. జొన్న, మొక్కజొన్న, అపరాలు, నూనె గింజల పంటల సాగు సైతం పుంజుకుంది. మొత్తం సాగు విస్తీర్ణం 42,04,218 హెక్టార్లు కాగా.. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌ను 38,30,466 హెక్టార్లుగా ఖరారు చేశారు. ఇందులో ఇప్పటికి 19,73,041 హెక్టార్లలో విత్తనాలు పడాల్సి ఉంటే సుమారు 13.84 లక్షల హెక్టార్లలో విత్తినట్టు వ్యవసాయ శాఖ ప్రకటించింది. వరి, మొక్కజొన్న, రాగి, కంది, వేరుశనగ, ఆముదం, పత్తి, మిరప వంటి పంటలు 26 శాతం నుంచి 50 శాతం వరకు వేయడం పూర్తయింది. చెరకు నాటు దాదాపు 75 శాతం పూర్తయింది. డెల్టాలో ముమ్మరంగా నాట్లు... కృష్ణా, గోదావరి డెల్టాలో వరి నాట్లు ఊపందుకున్నాయి. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో నాట్లు నాట్లు వేస్తున్నారు. ప్రస్తుత సీజన్లో 16.25 లక్షల హెక్టార్లలో వరి సాగు లక్ష్యంగా వ్యవసాయ శాఖ పెట్టుకుంది. ఈ సీజన్లో ఇప్పటికి 6.27 లక్షల హెక్టార్లలో నాట్లు పడాల్సి ఉంది. అయితే వర్షాభావ పరిస్థితుల వల్ల ఇప్పటికి 4.81 లక్షల హెక్టార్లలో నాట్లు పడ్డాయి. ప్రస్తుతం కృష్ణా, గోదావరి నదులకు వరద నీరు పెరుగుతుండటంతో అనుకున్న లక్ష్యం మేరకు వరి సాగయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. వేరుశనగ పరిస్థితి ఇలా... వేరుశనగను ఈ సీజన్లో 9.16 లక్షల హెక్టార్లలో సాగు చేయించాలని లక్ష్యంగా నిర్ణయించినప్పటికీ 7.53 లక్షల హెక్టార్లలో సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఇందులో ఇప్పటికి 5.13 లక్షల హెక్టార్లలో వేరుశనగ విత్తనాలు పడాల్సి ఉంటే 2.43 లక్షల హెక్టార్లలో మాత్రమే విత్తనాలు వేశారు. మంచి వర్షాలు పడితే వేరుశనగ సాగు విస్తీర్ణం పెరుగుతుందని భావిస్తున్నారు. మెట్టపంటలు, ఇతర ఆహార ధాన్యాల సాగు అనుకున్న లక్ష్యం మేరకు సాగుతోందని అధికారులు చెబుతున్నారు. త్వరలో సాధారణ స్థితికి వర్షపాతం.. గత వారంలో 36 శాతంగా ఉన్న లోటు వర్షపాతం ఈ వారానికి 27 శాతానికి చేరింది. మున్ముందు ఇది మరింత తగ్గి సాధారణ స్థితికి చేరుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. జూన్ ఒకటి నుంచి ప్రారంభమయ్యే ఖరీఫ్ సీజన్లో నైరుతీ రుతుపవనాల వల్ల రాష్ట్రంలో 556 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు కావాలి. ఇందులో ఇప్పటికి 245 మిల్లీమీటర్లు కురవాలి. కానీ ఇప్పటికి 178.4 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. ఈ సీజన్లో జూలై 31 వరకు ఏ జిల్లాలోనూ అధిక వర్షపాతం నమోదవలేదు. ఉత్తర కోస్తాలోని 5 జిల్లాల్లో విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలు మినహా మిగతా మూడు శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాలు సాధారణ స్థితిలో ఉన్నాయి. దక్షిణ కోస్తాలోని గుంటూరు, ప్రకాశం మినహా కృష్ణా, నెల్లూరు జిల్లాలు లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటున్నాయి. రాయలసీమలో చిత్తూరు మినహా వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాలు లోటు వర్షపాతంలో ఉన్నాయి. వరి రైతులకు సూచనలు ప్రస్తుతం వరి నాట్లు వేస్తున్న రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ విభాగం పలు సూచనలు చేసింది. ఆయా మండలాలకు సిఫార్సు చేసిన భాస్వరాన్ని ఆఖరి దమ్ములో వేసుకోవాలి. దీర్ఘకాలిక, మధ్య కాలిక రకాలైతే 25, 30 రోజుల వయసున్న నారును నాటుకోవాలి. స్వల్పకాలిక రకాలు సాగు చేస్తుంటే 20 నుంచి 25 రోజుల నారు నాటుకోవాలి. ప్రతి 2, 3 మీటర్లకు 30 సెంటీమీటర్ల వెడల్పున కాలిబాటలు తీసుకోవాలి. సిఫార్సు చేసిన నత్రజనిని మూడు సమభాగాలు చేసి నాటుకు ముందు ఒకసారి, పిలకల దశలో రెండో సారి, అంకురం దశలో మూడో సారి వేసుకోవాలి. పొటాష్‌లో సగభాగాన్ని మొదటి దశలో, మిగతా సగాన్ని అంకురం ఏర్పడే దశలో వేసుకోవాలి. కలుపు నివారణకు నాట్లు వేసిన 3, 5 రోజులలోపు పల్చగా నీరు పెట్టి ఎకరానికి ఒకటిన్నర లీటర్ల బుటాక్లోర్ లేదా 500 మిల్లీలీటర్ల ప్రిటిలాక్లోర్ లేదా ఆక్సాడయార్జిల్ 35– 50 గ్రాములు లేదా బెన్సల్ఫూరాన్ మిథైల్ గుళికలు ఎకరానికి నాలుగు కిలోలను 20 కిలోల ఇసుకలో కలిపి చల్లుకోవాలని సూచించింది. -
కృష్ణమ్మ వస్తోంది!
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర, కర్ణాటకల్లో విస్తారంగా వర్షాలు కురిస్తున్నాయి.. ఆల్మట్టి నిండింది. నారాయణపూర్ నీటిమట్టం పెరిగింది.. ఇక మన పాలమూరులోని జూరాలకు పారాలా..! వానాకాలంలో తొలిసారి కర్ణాటక నుంచి దిగువన తెలంగాణకు కృష్ణానది ప్రవాహం మొదలైంది. మహారాష్ట్ర, కర్ణాటకల్లో విస్తారంగా వర్షాలు కురవడం, కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండుకుండలను తలపిస్తుండటంతో దిగువ జూరాలకు నీటి విడుదల మొదలైంది. వానాకాలంలో తొలిసారి కర్ణాటక నుంచి దిగువన తెలంగాణకు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. వచ్చింది వచ్చినట్లు దిగువకే.. భారీగా కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టికి వరద ఉధృతి పెరుగుతోంది. శనివారం ప్రాజెక్టులోకి 22 వేల క్యూసెక్కుల ప్రవాహాలు రాగా, ఆదివారం రాత్రి లక్ష క్యూసెక్కులకు పెరిగింది. ప్రాజెక్టు నిండటంతో 18 గేట్లు ఎత్తారు. లక్షా రెండు వేల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటిమట్టం ఉదయానికే 129 టీఎంసీలకుగానూ 124 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులో నీటినిల్వలు ఖాళీ చేయాలని కేంద్ర జల సంఘం కర్ణాటకను హెచ్చరించడంతో ఉదయం నుంచే విద్యుదుత్పత్తి ద్వారా 28 వేల క్యూసెక్కుల నీటిని దిగువ విడుదల చేయడం మొదలు పెట్టారు. దీన్ని క్రమంగా 40 వేల క్యూసెక్కుల వరకు పెంచుతూ పోయారు. నారాయణపూర్‌లో... నారాయణపూర్‌కు 30 వేల క్యూసెక్కుల మేర నీరు వస్తోంది. వరద పోటెత్తే అవకాశాల నేపథ్యంలో నారాయణపూర్ నుంచి నీటివిడుదల మొదలు పెట్టారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు 10 వేల క్యూసెక్కుల నీటిని విద్యుదుత్పత్తి ద్వారా నదిలోకి వదిలారు. అర్ధరాత్రి వరకు గేట్లెత్తి క్రమంగా లక్ష క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేస్తూ వెళతామని, దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని నారాయణపూర్ ఇంజనీర్లు జూరాల ప్రాజెక్టు అధికారులకు సమాచారమిచ్చారు. ప్రస్తుతం నారాయణపూర్‌లో 37 టీఎంసీలకు గానూ 28 టీఎంసీల నిల్వలున్నాయి. జూరాలా.. ఇక పారాలా.. ఎగువ నుంచి వరద ఉధృతిని బట్టి సోమవారం రాత్రికి లేక మంగళవారం ఉదయానికి కృష్ణాజలాలు పాలమూరులోని జూరాల ప్రాజెక్టును చేరనున్నాయి. తుంగభద్ర ప్రాజెక్టులోకి 15 వేల క్యూసెక్కుల మేర వరద వస్తోంది. ఇందులో 100 టీఎంసీలకుగానూ 24 టీఎంసీల నిల్వ ఉంది. మహారాష్ట్రలోని ఉజ్జయినికి వరద ఉధృతి పెరిగింది. నిన్న మొన్నటి వరకు 10 వేల నుంచి 12 వేల క్యూసెక్కుల వరద రాగా, ఆదివారం సాయంత్రానికి 60 వేలకు పెరిగింది. దీంతో ప్రాజెక్టులో నిల్వ 117 టీఎంసీలకు గానూ 53 టీఎంసీలకు చేరింది. వరదను ఒడిసిపట్టండి: సీఎం జూరాలపై ఆధారపడ్డ ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోతలకు అంతా సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం పాలమూరు జిల్లా ఇంజనీర్లను ఆదేశించారు. పాలమూరు జిల్లా చీఫ్ ఇంజనీర్ ఖగేందర్, ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండేతో ఫోన్లో మాట్లాడారు. ఎగువ నుంచి భారీ వరద వచ్చే అవకాశాలుండటంతో జూరా ల కింది ఆయకట్టుకు నీటి విడుదలతోపాటు జూరాలపై ఆధారపడ్డ భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల పంపులను తిప్పాలని, మోటార్లను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. వచ్చిన వరదను వచ్చినట్లుగా ఎత్తిపోసి చెరువులకు నీటిని తరలించాలని, ఈ ప్రాజెక్టుల కింద గరిష్టంగా 4.50 లక్షల ఎకరాలకు నీరందించేలా చూడాలని సూచించారు. -
జలాశయాలన్నీ ఖాళీ!
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటిపోయాయి. చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులు నీళ్లు లేక నోరెళ్లబెట్టాయి. సాగునీటి మాట దేవుడెరుగు.. గుక్కెడు తాగునీటి కోసం కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం జలాశయాల్లో అందుబాటులో ఉన్న అరకొర జలాలు మే నెలాఖరు నాటికి మరింత తగ్గిపోనున్నాయి. ఆగస్టు వరకూ జలాశయాల్లోకి వరద నీరు చేరే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో మే, జూన్, జూలై నెలల్లో తాగునీటి సమస్య విషమించడం ఖాయమని అధికార వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. రాష్ట్రంలో అధిక శాతం మంది ప్రజలు సాగునీరు, తాగునీటి అవసరాలకు కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార నదీ జలాలపై ఆధారపడతారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు శ్రీశైలం జలాశయంలో పూర్తిస్థాయి నీటి మట్టం(ఎఫ్ఆర్ఎల్) 885 అడుగులు. నీటి నిల్వ 215.87 టీఎంసీలు. కనీస స్థాయి నీటి మట్టం(ఎంఎండీఎల్) 854 అడుగులు. ప్రస్తుతం గేట్ల కంటే దిగువ స్థాయికి అంటే.. 808.3 అడుగులకు నీటిమట్టం పడిపోయింది. శ్రీశైలం రిజర్వాయిర్‌లో ప్రస్తుతం 33.34 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. డెడ్ స్టోరేజీకి శ్రీశైలం జలాశయం నీటి నిల్వలు అడుగంటిపోయినా ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు గత రెండు రోజులుగా 2.24 టీఎంసీలను విడుదల చేశారు. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు. పూర్తి నీటి నిల్వ 312.04 టీఎంసీలు. కనీస స్థాయి నీటి మట్టం 510 అడుగులు. ప్రస్తుతం సాగర్‌లో 514.5 అడుగుల్లో 139.44 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. సాగర్ నుంచి తాగునీటి అవసరాల కోసం కుడి, ఎడమ కాలువలకు 7,912 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. తుంగభద్ర, కండలేరు, సోమశిల రిజర్వాయర్లలోనూ నిల్వలు కనీ స నీటిమట్టం కంటే దిగువకు చేరాయి. చిత్రావతి బ్యా లెన్సింగ్ రిజర్వాయర్(సీబీఆర్), పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోనూ అదే పరిస్థితి. తాగునీటి ఎద్దడి మరింత తీవ్రం ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. ప్రస్తుతం నాగార్జునసాగర్ నుంచి విడుదల చేస్తున్న జలాలతో సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు నింపినా.. ఆ నిల్వలు ఏప్రిల్, మే నెలలకే సరిపోతాయని అంచనా వేస్తున్నారు. కండలేరు, సోమశిల రిజర్వాయర్లలో ఉన్న జలాలను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం సరఫరా చేస్తున్నారు. ఏలేరులో ఉన్న జలాలను విశాఖపట్నం తాగునీటి అవసరాలు, ఉక్కు కర్మాగారం అవసరాలకు విడుదల చేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం బోరుబావులపైనే ఆధారపడుతున్నారు. రాయలసీమలో అనంతపురం, వైఎస్సార్ జిల్లాల తాగునీటి అవసరాలు తీర్చే పీఏబీఆర్, సీబీఆర్‌లలో ఉన్న జలాలు రెండు నెలలకు మాత్రమే సరిపోతాయి. నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల సకాలంలో వర్షాలు కురిసినా ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలు నిండి.. శ్రీశైలం రిజర్వాయర్‌కు వరద జలాలు చేరాలంటే ఆగస్టు వరకూ వేచిచూడాల్సిందే. తుంగభద్ర జలాశయానికి జూలై నాటికి వరద జలాలు చేరే అవకాశం ఉంది. ఎగువ నుంచి వరద జలాలు వచ్చే వరకూ అంటే మే, జూన్, జూలై నెలల్లో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు తప్పవని అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలోని మున్నేరు, వైరా ఉపనదులతోపాటు కృష్ణానదిలో నీటిచుక్క కనిపించడం లేదు. ప్రతి గ్రామంలోనూ తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. తాగునీటి కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. సమస్య పరిష్కారానికి అధికారులు ఎటువంటి ప్రత్యేక చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.