నాగార్జున సాగర్ ప్రాజెక్టు(ఫైల్ ఫొటో)
హైదరాబాద్: ఏపిలోని జలాశయాలు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ జలాశయం నీటిమట్టం 884.90 అడుగులుగా ఉంది. ఇన్‌ఫ్లో 1,04,126, ఔట్ ఫ్లో 1,40,244 క్యూసెక్కులుగా ఉంది.
నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి కూడా వరద నీరు వచ్చి చేరుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 574.70 అడుగులుగా ఉంది. ఈ ప్రాజెక్టులో ఇన్‌ఫ్లో 1,32,446, ఔట్‌ఫ్లో 32 వేల క్యూసెక్కులుగా ఉంది.
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దహేగాం మండలంలో ఎర్రవాగు, నల్లవాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలుగ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లిలోని పెదవాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 4,300 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. పాల్వంచ మండలం కిన్నెరసాని రిజర్వాయర్‌కు వరద నీరు వచ్చి చేరింది. నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. 392 అడుగుల గరిష్ట సామర్థ్యానికి వరదనీరు చేరుకుంది. భద్రాచంల ఏజెన్సీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కంకలవాగు,రాచపల్లివాగు, పాలెంవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పంట పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. చర్ల మండలం తాలిపేరు రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు చేరింది. 18 గేట్లను ఎత్తి 38 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో వంశధార జలాశయంలో వరద ఉధృతి నిలకడగా కొనసాగుతోంది. గొట్టా బ్యారేజీ వద్ద 84 వేల క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. అధికారులు 22 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు.
**