జల గండం
భారీగా పడిపోతున్న భూగర్భ జలమట్టాలు
వేసవికి ముందే పరిస్థితి ఆందోళనకరం
నగరంలో సగటున 3.58 మీటర్ల
లోతునకు పడిపోయిన వైనం
అన్ని మండలాల్లోనూ తగ్గిన నీటి నిల్వలు
‘మహా’నగరానికి మంచినీటి కష్టాలు తప్పవా? సమీప భవిష్యత్తులో సమస్యలు
ఎదుర్కోవాల్సిందేనా?
నిపుణులను తొలిచేస్తున్న ప్రశ్నలివి. వానలు
కురుస్తున్నాయి...
జలాశయాలు నిండుగా కనిపిస్తున్నాయి కదా అనుకుంటున్నారా? ఇదంతా పైపైనే. భూగర్భ జలమట్టాలు భారీగా పడిపోతున్నాయి. ఏడాది కాలంలోనే ఈ తేడా స్పష్టంగా వెల్లడైంది. నీటి చుక్కను ఒడిసి పట్టే మార్గం లేక...ఉన్నా...ఆచరించే ఓపిక లేని యంత్రాంగం నిర్లక్ష్యం సాక్షిగా ఇప్పుడు గ్రేటర్ జలగండం ముంగిట నిలిచింది.
సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో భూగర్భ జలమట్టాలు శరవేగంగా పడిపోతున్నాయి. మేలుకోకుంటే రాబోయే ముప్పు ఎలా ఉంటుందో ముందే హెచ్చరిస్తున్నాయి.మహా నగరంపై వరుణుడు కరుణిస్తున్నా... వాన చుక్క భూమిలోకి ఇంకే పరిస్థితులు లేవు. నీటి మట్టం తగ్గడానికి ఇదో ప్రధాన కారణంగా కనిపిస్తోంది. నవంబరు నెలలో నగరంలో ఏకంగా 120 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం (80 మిల్లీమీటర్లు) కంటే 40 మిల్లీమీటర్లు అధికం. కానీ విలువైన వర్షపునీటిని భద్రపరిచే ఇంకుడు గుంతలు తగినన్ని లేకపోవడంతో భూగర్భ జలమట్టాలు ఆశించిన మేర పెరగడం లేదు. దీనిపై భూగర్భ జలనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది నగరంలో సగటున 5.79 మీటర్ల లోతున జలమట్టాలు ఉండగా... ఈసారి 9.37 మీటర్ల లోతునకు పడిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే 3.58 మీటర్ల మేర నీటిమట్టాలు పడిపోవడం గమనార్హం. శీతాకాలంలోనే ఈ పరిస్థితి ఉంటే... రాబోయే వేసవిలో ఎలా ఉండబోతోందో ఈ సంకేతాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. కాంక్రీట్ మహారణ్యంలా మారిన గ్రేటర్‌లో 60 శాతంవర్షపునీరు వృథాగా పోతుండడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షపు నీరు వరద రూపంలో 40 శాతం వృథా కావడం సర్వసాధారణం. కానీ నగరంలో దీనికి అదనంగా మరో 20 శాతం వృథాగాపోతోంది. ఈ నీటిని భూగర్భంలోకి మళ్లిస్తే జలమట్టాలు మరో మూడు మీటర్లు పెరిగే అవకాశం ఉంది. కానీ జీహెచ్‌ఎంసీ, జలమండలి విభాగాలు దీనిపై దృష్టి పెట్టిన పాపాన పోవడం లేదు.
ఎంత తవ్వినా అంతే...
గ్రేటర్ పరిధిలోని అనేక మండలాల్లో గతఏడాది నవంబరునెలాఖరుతో పోలిస్తే ఈ ఏడాది నవంబరుచివరి నాటికి భూగర్భ జలమట్టాలు మరింత లోతుకు పడిపోయాయి. చార్మినార్‌మండలంలో గత ఏడాది 5.60 మీటర్ల లోతున భూగర్భ జలాల ఆనవాళ్లు కనిపించగా... ఈసారి 11.27 మీటర్ల లోతునకు తవ్వితే గానీ నీటిచుక్క కనిపించని దుస్థితి నెలకొంది. అమీర్‌పేట్, మారేడ్‌పల్లి,నాంపల్లి, ఉప్పల్, హయత్‌నగర్,కుత్బుల్లాపూర్, మల్కాజ్‌గిరి మండలాల్లోనూ భూగర్భ జలాలు మరింత లోతుకు పడిపోవడం గమనార్హం. గ్రేటర్ పరిధిలో దాదాపు అన్ని మండలాల్లోనూ ఇదే దుస్థితి తాండవిస్తోంది.
కారణాలివే...
మహా నగర పరిధిలో అపార్ట్‌మెంట్లు, భవనాల సంఖ్య సుమారు 22 లక్షలు. కానీ ఇంకుడు గుంతలు 35 వేలకు మించి లేవు. ఈ కారణంగా వర్షపు నీటిని సంరక్షించలేకపోతున్నాం. దీంతో 60 శాతం నీరు వృథా అవుతోంది.
{
Vేటర్ పరిధిలో భూగర్భ జలమట్టాలు పెంచేందుకు గత ఏడాది జీహెచ్‌ఎంసీ 10 వేలు, జలమండలి 22 వేల ఇంకుడు గుంతల ఏర్పాటుకు వినియోగదారుల నుంచి రూ.64 కోట్ల మేర రాబట్టాయి. కానీ తవ్వింది ఐదు వేల ఇంకుడు గుంతలే. దీన్నిబట్టి వారి శ్రద్ధ ఏపాటిదో తెలుస్తోంది.మహానగరంలో ఇళ్లు, కార్యాలయాల్లో ఇంకుడు గుంతలు లేవు. దీంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు.
ఇంకుడు గుంతలతో సమస్యకు పరిష్కారం..
మధ్య తరగతి ప్రజలు 200 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఖాళీ స్థలంలో ఇళ్లు నిర్మించుకున్న పక్షంలో.. బోరుబావికి మీటరు లేదా రెండు మీటర్ల దూరంలో ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవాలి. దీని పొడవు, వెడల్పులు 2 మీటర్ల మేర ఉండాలి. 1.5 మీటర్ల లోతున గుంత తీసి ఇందులో 50 శాతం 40ఎంఎం పరిమాణంలో ఉండే పలుగు రాళ్లు, 25 శాతం 20 ఎంఎం సైజులో ఉండే రాళ్లను నింపాలి. మరో 15 శాతం బఠానీగింజ పరిమాణంలో ఉండే ఇసుకను నింపాలి. మరో పదిశాతం ఖాళీగా ఉంచాలి. భవనం పైకప్పు నుంచి పడిన వర్షపునీరు ఈ గుంతపై కొద్దిసేపు నిలిచేలా ఏర్పాటు చేసుకోవాలి. దీంతో భూగర్భజలాల రీచార్జి సులువవుతుంది. బోరుబావి పది కాలాల పాటు ఎండిపోకుండా ఉంటుందని భూగర్భ జలశాఖ నిపుణులు సూచిస్తున్నారు. ఇళ్లు, కార్యాలయాల విస్తీర్ణాన్ని బట్టి వీటి సైజు పెరుగుతుందని చెబుతున్నారు.