Water levels
-
ఊపిరి పీల్చుకుంటున్న బెజవాడ
-
కాసేపట్లో నాగార్జునసాగర్ గేట్లు తెరవనున్న అధికారులు
-
నిండుకుండలా మేడిగడ్డ బ్యారేజీ
-
ఆశలు..అడుగంటి.. గణనీయంగా పడిపోయిన భూగర్భ జలమట్టాలు
సాక్షి ప్రతినిధులు మహబూబ్‌నగర్/ కరీంనగర్/ ఖమ్మం: రాష్ట్రంలో ఎండలు మండిపోతుండటం, భూగర్భ జలాలు అడుగంటడంతో పలు జిల్లాల్లో పంటలు ఎండి పోతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. నీటి కొరత మామిడి లాంటి పంటల దిగుబడిపై ప్రభావం చూపిస్తోందని రైతులు చెబుతున్నారు. అప్పులు చేసి వివిధ రకాల పంటలు సాగు చేసిన రైతులు పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేకపోవడంతో లబోదిబోమంటున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో బోర్లు వట్టి పోవడంతో నీరందక ఇప్పటివరకు లక్షకు పైగా ఎకరాల్లో పంటలు ఎండినట్లు అంచనా. ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా మండే ఎండలు,అడుగంటిన భూగర్భ జలాలతో పంటలు ఎండిపోతున్నాయి. నిజానికి 2022–23 యాసంగిలో మొత్తం 5,15,375 ఎకరాల్లో పంటలు సాగైతే ఈ ఏడాది 3,55,827 ఎకరాల్లోనే సాగు చేశారు. పాలేరు రిజర్వాయర్ పరిధిలోని పాత కాల్వ కింద కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో సుమారు5 వేలకు పైగా ఎకరాల్లో వరి ఎండింది. భగీరథ ప్రయత్నం చేసినా.. ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామానికి చెందిన శీలం విష్ణు ఈ ఏడాది యాసంగిలో వైరా నది కింద11 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేశాడు. మరో 20 రోజుల్లో వరి చేతికి అందనుండగా వైరా రిజర్వాయర్‌లో నీటిమట్టం తగ్గిపోయింది. దీంతో వైరా నదిలో పొక్లెయినర్‌తో గుంతలు తవ్విం చి మోటారు ద్వారా పైరుకు నీరందించే ప్రయత్నం చేశాడు. అయినా ఫలితం లేక 80 శాతం మేర పంట ఎండిపోయింది. పెట్టిన పెట్టుబడి అంతా నేల పాలైందని విష్ణు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రధానంగావరి పంటపై రైతాంగం ఆధారపడుతుంది.పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో ఈసారి మార్చి 31 వరకు వేసంగి పంటకు నీరందింది. కానీ గతేడాదితో పోలిస్తే ఆశించినంత మేరకు అందలేదు. ఫలితంగా వేలాది ఎకరాల్లో వరి ఎండిపోయింది. పలుచోట్ల పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. కరీంనగర్ జిల్లాలో దాదాపు 25వేల ఎకరాల వరకు వరి పంట సాగునీరు అందక ఎండిపోయిందని అనధికారిక అంచనా. పెద్దపల్లి జిల్లాలో ఎండలు దంచికొడుతుండటంతో చెరువులు, బావులు వట్టిపోతున్నాయి. మంథని, ముత్తరాం, రామగిరి, కాల్వ శ్రీరాంపూర్, ఓదెలా మండలాల్లో సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. వీర్నాపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో మాత్రం కొంతమేర వరి పంట ఎండిపోయింది. ఇక జగిత్యాల జిల్లాలో ప్రధాన సాగునీటి ప్రాజెక్ట్ అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కింద కాలువ ఆయకట్టు చివరి భూములకు నీరందక జిల్లావ్యాప్తంగా దాదాపు 10 వేల ఎకరాల వరకు పొలాలు ఎండిపోయాయి. ఈనిన వరి ఎండిపోయింది.. ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు లకావత్శ్రీనివాస్. ఊరు సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌మండలం సేవాలాల్ తండా. యాసంగిలోమూడెకరాల్లో వరి పంట వేశాడు. 3 బోరు బావులు నమ్ముకుని పంట సాగు చేస్తే భూగర్భజలాలు కాస్తా అడుగంటిపోయాయి. దీంతో బోర్లు వట్టిపోయి 3 ఎకరాల్లో ఈనిన పంటఎండిపోయింది. ఇటీవల రూ.లక్ష వెచ్చించి550 ఫీట్ల లోతులో బోరు వేయించాడు.కానీ నీళ్లు పడక పోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నాడు. బకెట్‌తో నీళ్లు పోస్తూ.. ఈమె రైతు బోయ అంజమ్మ.నారాయణపేట జిల్లా మరికల్ మండలంఅప్పంపల్లికి చెందిన ఈమె పదేళ్లుగా కూరగాయల సాగు చేస్తోంది. ఈ ఏడాది అరఎకరంలో బెండతో పాటు ఇతర కూరగాయలు సాగు చేసింది. ఎండల తీవ్రత కారణంగా బోర్లల్లో నీటిమట్టం దాదాపుగా అడుగంటి పోయింది. వచ్చే కొద్దిపాటి నీటిని బిందెలు,బకెట్ల ద్వారా పోస్తూ పంటలు కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. 5 బోర్లువేశాడు మక్తల్ మండలం ఉప్పర్‌పల్లికి చెందిన రవీందర్‌రెడ్డికి 4 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.ఈ యాసంగిలో బోరుబావి కింద రెండు ఎకరాల్లో వరి, మిగతా మిరప తోట సాగు చేశాడు.భూగర్భజలాలు అడుగంటడంతో సుమారు రూ.1.20 లక్షలు వెచ్చించి ఐదు బోర్లు వేశాడు. రెండింటిలో నీరు పడలేదు. మూడింటిలో అంతంత మాత్రంగా నీరు పడింది. మిరపతోటకు నీరు సక్రమంగాఅందకపోవడంతో రూ.40 వేల వ్యయంతో స్ప్రింక్లర్లు వేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. చేసిన అప్పు ఎలా తీర్చాలని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
భద్రాచలంలో మళ్లీ పెరుగుతోన్న నీటిమట్టం..!
-
ఎగువన కురుస్తున్న వర్షాలకు నాగార్జున సాగర్ కు వస్తున్న వరద నీరు
-
భద్రాచలం వద్ద నిలకడగా గోదావరి నీటిమట్టం
-
883.20 అడుగులకు చేరుకున్న శ్రీశైలం జలాశయం
శ్రీశైలం ప్రాజెక్ట్/సత్రశాల/విజయపురిసౌత్: ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి వరదనీరు వస్తున్నప్పటికీ అంతే మొత్తంలో దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తుండటంతో శ్రీశైలం డ్యాం నీటిమట్టం నిలకడగా కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రానికి జూరాల, సుంకేసుల నుంచి 71,484 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలానికి వస్తుండగా, కుడి, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ 66,365 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ నీటిమట్టం 883.20 అడుగులకు చేరుకుంది. అలాగే, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌లో 2 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం 589.70 అడుగులు ఉంది. ఇది 311.1486 టీఎంసీలకు సమానం. కాగా, నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ విద్యుత్ ప్రాజెక్ట్ నుంచి 44,886 క్యూసెక్కుల నీరును దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేస్తూ 42 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రాజెక్ట్ డీఈ దాసరి రామకృష్ణా, ఏడీఈ నర్సింహారావు ఆదివారం తెలిపారు. -
ఈ ఏడాదిలో మూడోసారి తెరుచుకున్న శ్రీశైలం డ్యామ్ గేట్లు
శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్(మాచర్ల) : శ్రీశైలం జలాశయ నీటిమట్టం వర్షాకాల సీజన్ పూర్తవుతున్న సమయంలో అనూహ్యంగా పెరగడంతో ఈ ఏడాది మూడోసారి శ్రీశైలం డ్యామ్ గేట్లు తెరిచారు. గురువారం తెల్లవారు జామున డ్యామ్ రెండు గేట్లను 10 అడుగుల మేరకు తెరిచి నీటి విడుదలను ప్రారంభించారు. జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో సాయంత్రానికి 5 గేట్లను 10 అడుగులకు తెరిచి నాగార్జునసాగర్‌కు 1,39,915 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. రెండు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ మరో 58,848 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 2,42,373 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. బ్యాక్ వాటర్ నుంచి హంద్రీ నీవా సుజల స్రవంతి, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి కూడా నీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం నుంచి గురువారం వరకూ కుడిగట్టు కేంద్రంలో 13.381 మిలియన్ యునిట్లు, ఎడమ గట్టు కేంద్రంలో 16.200 మిలియన్¯ యునిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. జలాశయంలో 214.3637 టీఎంసీల నీరుంది. డ్యామ్ నీటిమట్టం 884.80 అడుగులకు చేరుకుంది. నేడు సాగర్ గేట్లు ఎత్తే అవకాశం శ్రీశైలం జలాశయం క్రస్ట్‌గేట్లు ఎత్తడంతో నాగర్జునసాగర్ జలాశయ నీటిమట్టం 590 అడుగులతో గరిష్ట స్థాయికి చేరుకోనుంది. దీంతో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు క్రస్ట్ గేట్లు ఎత్తే అవకాశం ఉందని డ్యామ్ అధికారులు తెలిపారు. జలాశయం నీటిమట్టం గురువారం రాత్రి 7 గంటలకు 588.20 అడుగులకు చేరగా ఇది 306.6922 టీఎంసీలకు సమానం. -
సాగర్ సాగు.. ఆశాజనకం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ బేసిన్ పరిధిలో కురుస్తున్న వర్షాలతో ఎగువన ఉన్న ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకోవడం.. దిగువన రాష్ట్రంలోని ప్రాజెక్టులకు ఉధృతంగా ప్రవాహా లు నమోదవుతుండటంతో నాగార్జునసాగర్ కింది ఆయకట్టు రైతాంగంలో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రాజెక్టులో ఇప్పటికే కనీస నీటి మట్టాలకు ఎగువన అరవై టీఎంసీల నీటి లభ్యత ఉండటం..ఎగువ నుంచి ప్రవాహాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఖరీఫ్‌కు సాగునీటి విడుదలకు ప్రభుత్వ యంత్రాంగం సన్నాహాలు మొ దలుపెట్టింది. అన్నీ అనుకూలిస్తే ఆగస్టు తొలి వారం నుంచే నీటి విడుదల జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. పూర్తి ఆయకట్టుకు..? సాగర్ ఎడమకాల్వ కింద మొత్తంగా 6.40 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉంది. గత ఏడాది విస్తారంగా వర్షాలు కురవడంతో కేవలం 35 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించారు. యాసంగి సీజన్లో మాత్రం 6.15 లక్షల ఎకరాలకు నీరివ్వగా 55 టీఎంసీల మేర నీటిని వినియోగించారు. ప్రస్తుతం సైతం 6.30 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించగా, దీనికి 60 టీఎంసీలు అవసరమని లెక్కించారు. దీంతో పాటే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎంఆర్పీ) కింద 2.63 లక్షల ఎకరాలకు మరో 20 టీఎంసీలు, తాగునీటి అవసరాలకు మరో 10 టీఎంసీలు కలిపి మొత్తంగా 90 టీఎంసీల అవసరాలను గుర్తించారు. ఎగువన ప్రాజెక్టులన్నీ నిండి ఉండటం, నవంబర్– డిసెంబర్ వరకు సైతం ఎగువ నుంచి ప్రవాహాలు కొనసాగే అవకాశాలున్న నేపథ్యంలో 90 టీఎంసీల మేర నీటిని ఇవ్వడం పెద్ద కష్టం కాదని ప్రాజెక్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కనీస నీటి మట్టాలకు ఎగువన ఉన్న 60 టీఎంసీల లభ్యత నీటిని ఐదారు తడుల ద్వారా ఆయకట్టుకు విడుదల చేయాలని యోచిస్తున్నారు. అయితే ఆయకట్టు ప్రాంత ప్రజా ప్రతినిధులతో ఒకమారు చర్చించిన అనంతరం వారి సూచనల మేరకు నీటి విడుదల చేయాలని భావిస్తున్నారు. గత ఏడాది ఆగ స్టు నుంచి నవంబర్ వరకు నీటి విడుదల కొనసాగింది. ఈ ఏడాది సైతం ఆగస్టు తొలి వారం నుంచి నీటి విడుదల కొనసాగే అవకాశం ఉంద ని నీటి పారుదల వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎగువ పరవళ్లతో సాగర్ పరవశం... గడిచిన ఇరవై రోజులుగా పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటికే రెండు ప్రాజెక్టుల నుంచి భారీగా నీటి విడుదల చేస్తుండటంతో ఆ నీరంతా జూరాల మీదుగా శ్రీశైలం చేరుతోంది. ప్రస్తుత సీజన్లో జూరాలకు 80 టీఎంసీల మేర కొత్త నీరురాగా, శ్రీశైలానికి స్థానికంగా వచ్చిన ప్రవాహాలు కలుపుకొని మొత్తంగా 85 టీఎంసీల మేర కొత్త నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం శ్రీశైలంలో 215 టీఎంసీలకు గానూ 90 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇందులోంచే పవర్‌హౌస్‌ల ద్వారా నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్‌లో ఇప్పటివరకు 30 టీఎంసీల కొత్త నీరు చేరింది. సాగర్‌లో నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు కాగా ప్రస్తుతం 191 టీఎంసీల నీరుంది. 31 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. ఇందులో కనీస నీటిమట్టం 510 అడుగులకు ఎగువన వినియోగార్హమైన నీరు 60 టీఎంసీల మేర ఉంది. ఈ నీటిని సాగర్ కింది ఆయకట్టు అవసరాలకు వినియోగించే అవకాశాలున్నాయి. -
బుగ్గవాగు విస్తరణకు ప్రతిపాదనలు
సాక్షి, అమరావతి బ్యూరో : పల్నాడు ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చే బుగ్గవాగు విస్తరణ పనులకు అడుగు ముందుకు పడుతోంది. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలంలో బుగ్గవాగు ప్రాజెక్టు విస్తరణ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) తయారీకి రూ.1.40 కోట్లు అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. నిధులు మంజూరు కాగానే ప్రైవేట్ ఏజెన్సీకి పనులు అప్పగించి ప్రస్తుతం ప్రాజెక్టు నీటి సామర్థ్యం 3.7 టీఎంసీల నుంచి 7 టీఎంసీలకు పెంచడంపై అంచనాలు రూపొందిస్తామని పేర్కొంటున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం పెంపు వల్ల గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తాగునీటి సమస్య పూర్తిగా తీరడంతోపాటు నాగార్జున సాగర్ కుడి కాలువ పరిధిలో ఆయకట్టుకు స్థిరీకరణ జరగనుంది. ప్రభుత్వ విప్ పిన్నెల్లి చొరవతో.. మాచర్ల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బుగ్గవాగు విస్తరణ పనుల ఆవశ్యకతను ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌కు నివేదించారు. స్పందించిన ముఖ్యమంత్రి డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. డీపీఆర్‌కు సన్నాహాలు.. ‘ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బుగ్గవాగు ప్రాజెక్టు విస్తరించి 3.7 టీఎంసీల నుంచి 7 టీఎంసీలకు పెంచేందుకు డీపీఆర్ కోసం సన్నాహాలు చేస్తున్నాం. ప్రాజెక్టు విస్తరణ వల్ల గుంటూరు, ప్రకాశం జిల్లాలకు తాగునీటి సమస్య తీరి సాగర్ ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది’ – పురుషోత్తం గంగరాజు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎస్ఈ -
జలాశయాలన్నీ నిండాయి : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో జలాశయాలు నిండటంతో సాగు, తాగునీటికీ ఢోకా లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. సింగూరు, నిజాంసాగర్‌లకు మాత్రం చాలినంత నీరు రాలేదని చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టుల పరిధిలోని గ్రామాలకు ఈ ఏడాది తాగునీరు అందించేందుకు ప్రత్యామ్నాయ, తాత్కాలిక ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. హెచ్ఎండబ్ల్యూఎస్, పరిగి, కోమటి బండ, ఎస్ఆర్ఎస్పీ.. వీటిల్లో వీలైన ప్రాజెక్టు నుంచి వీలైనన్ని గ్రామాలకు నీరందించాలని సూచించారు. మిగతా చోట్ల ట్యాంకర్ల ద్వారా, బోర్ల ద్వారా నీరు అందించాలని కోరారు. ఈ ఒక్క ఏడాదే సింగూరు, నిజాంసాగర్ పరిధిలో సమస్య ఉంటుందని, వచ్చే ఏడాది నాటికి మల్లన్న సాగర్ ద్వారా నీరందుతుందని చెప్పారు. వచ్చే వేసవిలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలని చెప్పారు. గురువారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలతో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి చాంబర్లో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కొన్ని చోట్ల పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదాలున్నాయని అన్నారు. వచ్చే నెలలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండ్రోజుల పాటు పర్యటించి స్థానికులతో చర్చించి అటవీ సంబంధిత సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. సాగునీరు, మంచినీటి కోసం శాశ్వత ప్రాతిపదికన చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని వెల్లడించారు. నిజామాబాద్‌కు కొత్త లిఫ్టులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని అన్ని ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించే సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. గుత్ప, అలీసాగర్ మాదిరిగానే లిఫ్టులు పెట్టి బాన్సువాడ, ఆర్మూరు, బాల్కొండ నియోజవర్గాలకు సాగునీరు అందివ్వాలని పేర్కొన్నారు. ఇందుకు తక్షణమే సర్వే జరిపి, లిఫ్టులు ఎక్కడ పెట్టి, ఏయే గ్రామాల పరిధిలో ఎన్ని ఎకరాలకు నీరందించవచ్చో తేల్చాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఏటా 90 టీఎంసీలకు తక్కువ కాకుండా ఎస్సారెస్పీని నింపాలని ప్రభుత్వం నిర్ణయించినందున, దీని నుంచి ఎంత వీలైతే అంత ఆయకట్టుకు నీరివ్వాలని సూచించారు. సమావేశంలో మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్‌రెడ్డి, హనుమంతు షిండే, బియ్యాల గణేశ్ గుప్తా, సురేందర్, ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్‌రావు, కార్యదర్శి స్మితా సబర్వాల్, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్‌రావు, ఈఎన్సీలు శంకర్, సుధాకర్‌రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృపాకర్ పాల్గొన్నారు. సభలో మాట్లాడుతున్న కేసీఆర్ -
గోదారి గుండె చెరువు
సాక్షి, హైదరాబాద్ : జూలై అంటే ఖరీఫ్‌కు మోఖ. మోఖలోనే వర్షాలు మొఖం చాటేశాయి. నాట్లు పడాల్సిన సీజన్లో రైతులు పాట్లు పడుతున్నారు. గలగలా గోదారి పారాల్సిన నెల ఇది. పంటల ‘ప్రాణహిత’ం కోరే రోజులివి. అట్లాంటిది గోదావరి వెలవెలపోతోంది. ‘ప్రాణహిత’లో జలజీవం లేదు. గతేడాది జూలై ఆరంభం నుంచి లక్ష క్యూసెక్కులకు తక్కువగా ఎన్నడూ ప్రవాహాల్లేవు. ఈ ఏడాది గరిష్టం గా 20 వేల క్యూసెక్కులు మించి ప్రవాహాలు రాలే దు. నీరురాక నారులేక మడులన్నీ బీడులయ్యాయి. 47 ఏళ్లలో ఎన్నడూ లేనంత కరువు.. రాష్ట్రంలో గోదావరి బేసిన్లో ఉన్న ప్రధాన ప్రాజెక్టు లు ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి. వీటికి ఎగువన కురిసే వర్షాల ఆధారంగా ప్రతి ఏటా జూలై నుంచి ప్రవాహాలు కొనసాగుతాయి. జూన్, జూలైలో ఈ ప్రాజెక్టులకు నీటి ప్రవాహాలున్నా లేకున్నా, ఎగువన ఉన్న ప్రాణహిత నది నుంచి మాత్రం జూన్ రెండు, మూడో వారం నుంచే గోదావరిలో కలిసి గరిష్ట ప్రవాహాలు వస్తుంటాయి. ప్రాణహితపై ఉన్న టెక్రా గేజ్ స్టేషన్ వద్ద ప్రతి ఏడాది జూలైలో ప్రవాహాలు లక్ష క్యూసెక్కుల నుంచి గరిష్టంగా 3 లక్షల వరకు నమోదవుతూ ఉంటాయి. అయితే ఈ ఏడాది పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ప్రాణహిత నదికి 5 లక్షల చదరపు కిలోమీటర్ల నదీ పరీవాహకం ఉన్నప్పటికీ గత నలభై ఏళ్లలో ఎన్నడూ లేనంతగా తక్కువ వర్షపాతం నమోదు కావడంతో నీటి ప్రవాహాలే కరువయ్యాయి. గత ఏడాది జూలై 18 నాటికి గరిష్టంగా 2.78 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రాగా ఈ ఏడాది గరిష్టంగా 20 వేల క్యూసెక్కులకు మించి వరద రాలేదు. వచ్చిన కొద్దిపాటి వరద నీటిని మేడిగడ్డ బ్యారేజీ గేట్లను మూసివేసి, కన్నెపల్లి పంపుల ద్వారా ఇప్పటి వరకు 6 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. గురువారం మేడిగడ్డ వద్ద 9,888 క్యూసెక్కుల కనిష్ట ప్రవాహం ఉండటంతో పంపులను నిలిపివేశారు. గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు ఇంతవరకూ 3 టీఎంసీల మేర కొత్త నీరు వచ్చి చేరింది. ఇందులోనే ఎల్లంపల్లికి 1.95 టీఎంసీలు, కడెంకు 0.80 టీఎంసీలు వచ్చింది. ఎస్సారెస్పీ, మిడ్‌మానేరు, ఎల్ఎండీలోకి మాత్రం చుక్కనీరు రాలేదు. -
జలాశయాలన్నీ ఖాళీ!
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటిపోయాయి. చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులు నీళ్లు లేక నోరెళ్లబెట్టాయి. సాగునీటి మాట దేవుడెరుగు.. గుక్కెడు తాగునీటి కోసం కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం జలాశయాల్లో అందుబాటులో ఉన్న అరకొర జలాలు మే నెలాఖరు నాటికి మరింత తగ్గిపోనున్నాయి. ఆగస్టు వరకూ జలాశయాల్లోకి వరద నీరు చేరే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో మే, జూన్, జూలై నెలల్లో తాగునీటి సమస్య విషమించడం ఖాయమని అధికార వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. రాష్ట్రంలో అధిక శాతం మంది ప్రజలు సాగునీరు, తాగునీటి అవసరాలకు కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార నదీ జలాలపై ఆధారపడతారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు శ్రీశైలం జలాశయంలో పూర్తిస్థాయి నీటి మట్టం(ఎఫ్ఆర్ఎల్) 885 అడుగులు. నీటి నిల్వ 215.87 టీఎంసీలు. కనీస స్థాయి నీటి మట్టం(ఎంఎండీఎల్) 854 అడుగులు. ప్రస్తుతం గేట్ల కంటే దిగువ స్థాయికి అంటే.. 808.3 అడుగులకు నీటిమట్టం పడిపోయింది. శ్రీశైలం రిజర్వాయిర్‌లో ప్రస్తుతం 33.34 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. డెడ్ స్టోరేజీకి శ్రీశైలం జలాశయం నీటి నిల్వలు అడుగంటిపోయినా ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు గత రెండు రోజులుగా 2.24 టీఎంసీలను విడుదల చేశారు. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు. పూర్తి నీటి నిల్వ 312.04 టీఎంసీలు. కనీస స్థాయి నీటి మట్టం 510 అడుగులు. ప్రస్తుతం సాగర్‌లో 514.5 అడుగుల్లో 139.44 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. సాగర్ నుంచి తాగునీటి అవసరాల కోసం కుడి, ఎడమ కాలువలకు 7,912 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. తుంగభద్ర, కండలేరు, సోమశిల రిజర్వాయర్లలోనూ నిల్వలు కనీ స నీటిమట్టం కంటే దిగువకు చేరాయి. చిత్రావతి బ్యా లెన్సింగ్ రిజర్వాయర్(సీబీఆర్), పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోనూ అదే పరిస్థితి. తాగునీటి ఎద్దడి మరింత తీవ్రం ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. ప్రస్తుతం నాగార్జునసాగర్ నుంచి విడుదల చేస్తున్న జలాలతో సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు నింపినా.. ఆ నిల్వలు ఏప్రిల్, మే నెలలకే సరిపోతాయని అంచనా వేస్తున్నారు. కండలేరు, సోమశిల రిజర్వాయర్లలో ఉన్న జలాలను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం సరఫరా చేస్తున్నారు. ఏలేరులో ఉన్న జలాలను విశాఖపట్నం తాగునీటి అవసరాలు, ఉక్కు కర్మాగారం అవసరాలకు విడుదల చేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం బోరుబావులపైనే ఆధారపడుతున్నారు. రాయలసీమలో అనంతపురం, వైఎస్సార్ జిల్లాల తాగునీటి అవసరాలు తీర్చే పీఏబీఆర్, సీబీఆర్‌లలో ఉన్న జలాలు రెండు నెలలకు మాత్రమే సరిపోతాయి. నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల సకాలంలో వర్షాలు కురిసినా ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలు నిండి.. శ్రీశైలం రిజర్వాయర్‌కు వరద జలాలు చేరాలంటే ఆగస్టు వరకూ వేచిచూడాల్సిందే. తుంగభద్ర జలాశయానికి జూలై నాటికి వరద జలాలు చేరే అవకాశం ఉంది. ఎగువ నుంచి వరద జలాలు వచ్చే వరకూ అంటే మే, జూన్, జూలై నెలల్లో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు తప్పవని అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలోని మున్నేరు, వైరా ఉపనదులతోపాటు కృష్ణానదిలో నీటిచుక్క కనిపించడం లేదు. ప్రతి గ్రామంలోనూ తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. తాగునీటి కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. సమస్య పరిష్కారానికి అధికారులు ఎటువంటి ప్రత్యేక చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. -
ప్రమాద ఘంటికలు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: భూగర్భ జలాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. రోజురోజుకీ మరింతగా అడుగంటడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దశాబ్ద కాలంలో ఈ ఏడాది నీటిమట్టం గణనీయంగా పడిపోవడం కరువుకు సంకేతాలని చెప్పవచ్చు. ఒక్క ఏడాది కాలంలోనే సుమారు ఐదు మీటర్ల లోతుకు నీటిమట్టం దిగజారి పోయింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉండటంతోపాటు పెద్దఎత్తున భూగర్భ జలాలను వినియోగిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణమని భూగర్భ జల శాఖ అధికారులు వివరిస్తున్నారు. ఆందోళనకరంగా.. ఈ ఏడాది జనవరి నెలాఖరు నాటికి జిల్లా సాధారణ వర్షపాతం 643.4 మిల్లీమీటర్లుకాగా.. ఇప్పటివరకు 447.8 మి.మీ వర్షపాతమే కురిసింది. అంటే 30.4 శాతం లోటు వర్షపాతం నమోదైందన్నమాట. భూగర్భ జలాలు పెరగడానికి ప్రధాన వనరు వర్షమే. అయితే ఎన్నడూ లేని విధంగా పోయినేడు కనీసం సాధారణ స్థాయిలో కూడా కురవలేదు. రోజువారీ అవసరాలు, పంటల కోసం విస్తృతంగా బోర్లపైనే జిల్లా ఆధారపడింది. ఎటువంటి రిజర్వాయర్లు, ఆనకట్టలు లేకపోవడంతో పంటల సాగుకు బోరు బావులే ఆయువుగా మారాయి. ఇలా అన్ని వైపుల నుంచి భూగర్భ జలాలపై భారం పడుతుండడం.. ఆ స్థాయిలో భూమిలోకి నీరు ఇంకే పరిస్థితులు లేకపోవడంతో భూగర్భ నీటిమట్టం పాతాళానికి చేరుకుంటోంది. జిల్లాలో 27 మండలాలు ఉండగా.. చౌదరిగూడం, కొందర్గు మండలాల్లో మాత్రమే సాధారణానికి మించి వానలు కురిశాయి. మిగిలిన 25 మండలాల్లో లోటు వర్షపాతమే. అత్యధికంగా మంచాల మండలంలో 58.6 శాతం, శంకర్పల్లి మండలంలో 53.8 శాతం, చేవెళ్లలో 49 శాతం, శంషాబాద్‌లో 47.4 శాతం, కొత్తూరు మండలంలో 45.6 శాతం, మహేశ్వరం మండలంలో 43.7 శాతం లోటు వర్షంపాతం నమోదైందని అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఒక్క బోరుబావిలోనూ పెరగని వైనం జిల్లాలో వివిధ ప్రాంతాల్లోని 40 బోరుబావుల్లో నీటిమట్టాన్ని జిల్లా భూగర్భశాఖ అధికారులు ఏడాది పాటు పరిశీలించగా ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. ఈ బావుల్లో గతేడాది జనవరి నెలలో సగటున 12.46 మీటర్ల లోతులో నీళ్లు ఉండగా.. ఈ ఏడాది జనవరి వచ్చేసరికి నీటిమట్టం 17.37 మీటర్ల లోతుకు పడిపోయింది. అంటే ఏడాదికాలంలోనే 4.91 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మున్ముందు ఇవే గడ్డు పరిస్థితులు ఎదురైతే పంటల విషయం పక్కనబెడితే.. తాగేందుకు కూడా నీళ్లు కూడా లభ్యంకావని అధికారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వాననీటి సంరక్షణే మార్గం ఆరు మండలాల్లో 20కుపైగా మీటర్ల లోతుకు, 9 మండలాల్లో 15 నుంచి 20 మీటర్ల లోతులో, 11 మండలాల్లో 10 నుంచి 15 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. 5 నుంచి 10 మీటర్ల లోతులో ఒక్క మండలంలోనూ నీటి జాడ ఉంది. ఇటువంటి దుర్భిక్ష పరిస్థితుల్లో వాననీటి ప్రణాళికాబద్ధంగా ఒడిసిపట్టడంతోపాటు విధిగా భూమిలోకి ఇంకించే చర్చలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. భారీగా వాననీటి సంరక్షణ చర్యలు చేపట్టడంతోపాటు ఉన్న నీటిని చక్కగా నిర్వహించుకుంటేనే గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కగలం. ముఖ్యంగా మెట్ట పంటలు సాగు చేసుకోవడంతోపాటు అత్యవసరమైతే డ్రిప్, స్ప్రింక్లర్ల విధానంలో పంటలు సాగుచేసుకోవాలని జిల్లా భూగర్భ జల అధికారి చంద్రారెడ్డి పేర్కొన్నారు. -
వట్టిపోయిన జలాశయాలు
జిల్లాలో తాండవ మొదలుకుని గోస్తని వరకు ఏ ప్రాజెక్టులోనూ గేట్లు ఎత్తి నీరు వదిలే స్థాయిలో నీటి నిల్వలు లేని పరిస్థితి నెలకొంది. నవంబర్లోనే ఇలా ప్రమాద ఘంటికలు మోగిస్తుంటే..ఇక ఏప్రిల్‌కు వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లోటు వర్షపాతం కారణంగా భూగర్భ జలాలు కూడా అప్పుడే 25 మీటర్ల లోతుల్లోకి వెళ్లిపోయాయి. సాక్షి, విశాఖపట్నం : విశాఖ జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులు నాలుగు. తూర్పు విశాఖ జిల్లాల్లో 51,465 ఎకరాల ఆయకట్టుకు ఆధారమైన తాండవ ప్రాజెక్టుతో పాటు జిల్లా పరిధిలో 15,344 ఎకరాల ఆయకట్టు కలిగిన రైవాడ, 12,638 ఎకరాల ఆయకట్టు కలిగిన కోనాం, 19,969 ఎకరాల ఆయకట్టు కలిగిన పెద్దేరు జలాశయాలున్నాయి. అలాగే వరాహ జలాశయం కింద మరో 4485 ఎకరాలు, గంభీరం గెడ్డ కింద 640 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రతి ఏటా 2 లక్షల హెక్టార్లలో ఖరీఫ్, 48వేల హెక్టార్లలో రబీ సాగవ్వాల్సి ఉంది. అంతటి ప్రాధాన్యం కలిగిన ఈ ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు చరిత్రలో ముందెన్నడూ లేనంత అట్టడుగు స్థాయికి చేరుకున్నాయి. గడిచిన మూడు నెలలుగా క్యాచ్మెంట్ ఏరియాల్లో చుక్కనీరు లేకపోవడంతో ప్రాజెక్టుల్లోకి ఇన్‌ఫ్లో పూర్తిగా పడిపోయింది. వర్షాభావ పరిస్థితుల వల్ల వర్షాధారంపై ఆధారపడి సాగయ్యే పంటలు ఎలాగూ ఎండిపోతుండడంతో కనీసం ప్రాజెక్టుల కింద పంటలనైనా కాపాడాలన్న ఆలోచనతో ఖరీఫ్‌లో ఇప్పటి వరకు ఉన్నంతలోనే సాగునీరు వదులుతూ వచ్చారు. ఇక ఏ ఒక్క ప్రాజెక్టులోనూ క్యూసెక్ నీరు కూడా విడుదల చేసే పరిస్థితి కన్పించడం లేదు. దుర్భర పరిస్థితుల ‘తాండవ’ం జిల్లాలో ఏకైక మేజరు ప్రాజెక్టయిన తాండవ రిజర్వాయరులో నీటి మట్టం కనీవిని ఎరుగని స్థాయిలో పడిపోయింది. ప్రాజెక్టు నిర్మించి 44 ఏళ్లు కా>వస్తోంది. ఎప్పుడూ ఇంతటి దయనీయ పరిస్థితిని చూడలేదని ఈ ప్రాంత రైతులంటున్నారు. రిజర్వాయర్ ప్రమాద స్థాయి నీటిమట్టం(ఎఫ్ఆర్ఎల్) 380 అడుగులు కాగా కనిష్ట నీటిమట్టం 345 అడుగులు. గతేడాది ఇదే సమయానికి 367.80 అడుగులుండగా, ఈ ఏడాది 347 అడుగులకు చేరుకుంది. తాండవ తర్వాత అత్యధిక ఆయకట్టు కల్గిన కోనాం రిజర్వాయర్‌లో ఎఫ్ఆర్ఎల్ 101.25 మీటర్లు కాగా, కనిష్ట నీటి మట్టం(డెడ్‌స్టోరేజ్) 84 మీటర్లు. గతేడాది ఇదే సమయానికి 99.35 మీటర్లుకాగా, ప్రస్తుతం 88.60 మీటర్లకు చేరుకుంది. ఆ తర్వాత 15వేల ఎకరాలు పైగా ఆయకట్టు కలిగిన రైవాడ ప్రాజెక్టు ఎప్‌ఆర్‌ఎల్ 114 మీటర్లుకాగా, కనిష్ట నీటిమట్టం 99 మీటర్లు. గతేడాది ఇదే సమయానికి 113.08 మీటర్ల నీటిమట్టం ఉండగా, ప్రస్తుతం 102.40 మీటర్లకు పడిపోయింది. పెద్దేరు జలాశయంలో ఎఫ్ఆర్ఎల్ 137 మీటర్లు కాగా, కనిష్టం 128 మీటర్లు. గతేడాది ఇదేసమయానికి 134.08 మీటర్ల మేర నీరుండగా, ప్రస్తుతం 129.90 మీటర్లకు పడిపోయింది. వరాహ జలాశయం ఎఫ్ఆర్ఎల్ 460 అడుగులు కాగా, కనిష్ట నీటిమట్టం 420 మీటర్లు. గతేడాది ఇదే సమయానికి 453 మీటర్లుండగా, ఈసారి 423 మీటర్లకు చేరుకుంది. తాగు నీటికి కష్టకాలమే.. విశాఖ తాగు, పారిశ్రామిక అవసరాలను తీర్చే ఏలేరు, తాటిపూడి, మేహాద్రిగెడ్డ, గోస్తని, ముడసర్లోవ, గోస్తని, గంభీరం ప్రాజెక్టుల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఏలేరులో కనిష్ట నీటిమట్టం 71.50 మీటర్లు కాగా, ప్రస్తుతం 84 మీటర్లకు చేరుకుంది. తాటిపూడి కనిష్టం 251 అడుగులు కాగా, ప్రస్తుతం 261 మీటర్లకు చేరుకుంది.మేహాద్రి గెడ్డ కనిష్టం 44 అడుగులు కాగా, ప్రస్తుతం 48 అడుగులకు చేరుకుంది. గోస్తని కనిష్ట నీటిమట్టం 21.06 అడుగులు కాగా, ప్రస్తుతం 26 అడుగులకు పడిపోయింది. ముడసర్లోవ కనిష్ట నీటి మట్టం 152 అడుగులు కాగా ప్రస్తుతం 155 అడుగులకు చేరుకుంది. గంభీరం గెడ్డ రిజర్వాయర్‌లో కనిష్ట నీటిమట్టం 107 మీటర్లు ప్రస్తుతం 107కు చేరుకోవడంతో పూర్తిగా ఎండిపోయింది. చుక్కనీరు లేక కళ్యాణపులోవ రిజర్వాయర్ కూడా పూర్తిగా ఎండిపోయింది. దీంతో సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు కూడా ఈసారి జలగండం తప్పేటట్టు కన్పించడం లేదు. లోటు వర్షపాతంకారణంగా భూగర్భ జలాలు కూడా అప్పుడే 25 మీటర్ల లోతుల్లోకి వెళ్లిపోయాయి. వేసవిలో 50 నుంచి వంద మీటర్ల లోతుకు వెళ్తే కానీ చుక్కనీరు పడే పరిస్థితి కన్పించదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రబీ సాగు డౌటే.. రబీ సాగు పూర్తిగా బోర్లు, ప్రాజెక్టుల కింద సాగు చేస్తారు.రబీ సాధారణ విస్తీర్ణం జిల్లాలో 48వేల హెక్టార్లు. 2014–15లో 42,961హెక్టార్లలో,2015–16లో 40,814హెక్టార్లలో, 2016–17లో 33,517 హెక్టార్లలో రబీ సాగవగా, 2017–18లో కేవలం 30 వేల హెక్టార్లలోనే రబీ సాగయ్యింది.కానీ ఈసారి ఓ వైపు భూగర్భ జలాలు అడుగంటి పోవడం, మరో వైపు జలాశయాలు ఎండిపోవడంతో ఈసారి ర బీ సాగుకు అవకాశం లేదంటున్నారు. జిల్లాలో డ్రగ్, బోర్‌వెల్స్ కలిపి 38,637ఉన్నాయి.వీటి పరిధిలో రబీ కింద 36వేల హెక్టార్ల విస్తీర్ణం ఉంది. ఈఏడాది ఏకంగా నవంబర్లోనే మైనస్ 25 శాతం లోటు వర్షపాతం ఉంది. రానున్న నాలుగు నెలల్లో కూడా వర్షాలు పడే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. ఈ సీజన్లో ఎలాంటి అల్పపీడన ద్రోణులు, తుఫాన్లు వచ్చే అవకాశం ఉండదు. మళ్లీ ఏప్రిల్–మేలలో మళ్లీ తుఫాన్లు వచ్చే ఆనవాయితీ ఉంది. పొరుగు జిల్లాల్లో సెప్టెంబర్ నాటికి ఖరీఫ్ సీజన్ పూర్తవుతుంది. అక్టోబర్–నవంబర్లలో రబీ సాగు ఆరంభమవుతుంది. కానీ మన జిల్లాలో ఖరీఫ్ సాగే ఆలస్యంగా ప్రారంభమవుతుంది. రబీ సాగు జనవరిలో కానీ మొదలు కాని పరిస్థితి. ఈసారి లోటు వర్ష పాతం, భూగర్భ జలాలు అడుగంటిన నేపథ్యంలో ఖరీఫ్‌లో నిండా మునిగిన రైతులు రబీ సాగుకు దూరంగా ఉండాలని ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశారనిపిస్తోంది. డెడ్ స్టోరేజ్‌లో నీటి నిల్వలు వర్షాభావ పరిస్థితుల కారణంగా రిజర్వాయర్లలో నీటి నిల్వలు అడుగంటిపోయాయి. చాలా వరకు డెడ్ స్టోరీజికి సమీపంలో ఉన్నాయి. ఎలేరు తప్ప మిగిలినవన్ని వేసవికి నాలుగైదు నెలలముందే అడుగంటిపోయే ప్రమాదాలున్నాయి. ఈలోగా క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు పడితే కానీ ఈసారి వేసవి గట్టెక్కడం కష్టమే.– ఎస్.పళ్లంరాజు, ఎస్ఈ, జీవీఎంసీ -
శ్రీశైలం జలశయానికి భారీగా వరద నీరు
-
భారీ వర్షాలకు ప్రమాదస్థాయికి చేరిన నీటిమట్టాలు
-
రెండు తడులకే 10 టీఎంసీలు ఖాళీ
బాల్కొండ: ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి ఈ ఏడాది యాసంగిలో పంటలకు 33 టీఎంసీల నీటిని 8 తడులకు అందించే లా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ రెండు తడులకే 10 టీఎంసీల నీరు వినియోగమైంది. దీంతో ఎస్సారెస్పీలో నీటిమట్టం వేగంగా తగ్గుతోంది. డిసెంబర్ 25 నుంచి వారబందీ ప్రకారం కాలువల ద్వారా పంటలకు నీటిని విడుదల చేస్తున్నారు. నీటి విడుదల నాటికి ప్రాజెక్ట్‌లో 47టీఎంసీల నీటి నిల్వ ఉంది. బుధవారం నాటికి రెండు తడులు పూర్తి కాగా, ప్రాజెక్ట్‌లో 37 టీఎంసీలకు నీటిమట్టం తగ్గిపోయింది. రెండు తడులకే ప్రాజెక్ట్‌లో 10 టీఎంసీల నీరు తగ్గుముఖం పట్టగా, మరో 6 తడులకు నీరు అవసరం ఉంటుంది. అంటే ఈ లెక్కన మరో 30 టీఎంసీల నీరు అవసరం ఉంటుంది. కానీ ప్రాజెక్ట్ అధికారులు ప్రస్తుత సంవత్సరం యాసంగి పంటలకు 33 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించి, మిగితా నీటిని తాగునీటి అవసరాల కోసం, డెడ్‌స్టోరేజీ, నీటి ఆవిరికి లెక్కలు వేశారు. భానుడు ప్రతాపం చూపితే.. ప్రస్తుతం ఎండలు అంతగా లేకపోవడంతో రెండుతడులకు 10 టీఎంసీల నీటి వినియోగమే జరిగింది. కానీ రానున్న రోజుల్లో భానుడు ప్రతాపం చూపితే నీటి అవసరం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దీంతో 6 తడుల కోసం నీటి అవసరం ఎంతగా ఏర్పడుతుందో చెప్పలేని పరిస్థితి. ఒక్క టీఎంసీతో 10 వేల ఎకరాల ఆయకట్టుకు నీటి సరఫరా చేపట్టవచ్చని ప్రాజెక్ట్ అధికారుల రికార్డులు తెలుపుతున్నాయి. ఈ లెక్కన ప్రస్తుతం 4 లక్షల ఎకరాలకు 40 టీఎంసీల నీటి వినియోగం జరిగే అవకాశం ఉంది. కానీ అధికారులు 4 లక్షల ఎకరాల ఆయకట్టు నిర్ణయించి, 33 టీఎంసీల నీటి వినియోగం చేపట్టాలని ఎలా ప్రణాళిక చేశారో అర్థం కాని ప్రశ్న. ప్రస్తుతం ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా వారబందీలో పలు మార్పులు చేస్తూ నీటి విడుదల చేపడుతున్నారు. ప్రణాళిక ప్రకారం కాకతీయ కాలువ ద్వారా 5 వేల క్యూసెక్కుల కంటే ఎక్కువ నీటి సరఫరా చేపట్టవద్దు. కానీ చివరి ఆయకట్టు వరకు నీటి సరఫరా అందడం లేదని ముందుగా 6 వేల క్యూసెక్కులకు పెంచారు. తరువాత 6500 క్యూసెక్కులకు పెంచారు. వారబందీలో తక్కువ రోజుల్లో ఎక్కువ నీటి సరఫరా చేపట్టే ప్రయోగం చేశారు. అయినా చిక్కులు తప్పడం లేదని అధికారులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయకట్టు రైతులు నీటిని వృథా చేయవద్దని ప్రాజెక్ట్ ఉన్నత అధికారులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఆయకట్టు రైతులు అధికారులతో సహకరించాలని కోరుతున్నారు. నీటిని వృథా చేయవద్దు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాలువల ద్వారా విడుదలయ్యే నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. నీటి వినియోగం, నీటి నిల్వపై ప్రభావం ఉంది. రైతులు నీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలి. అందరి సహకారంతో పంటలను గట్టెక్కించేలా నీటి సరఫరా చేపడుతాం. – శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఈ, ఎస్సారెస్పీ -
గతం కంటే ఘనం
ఉమ్మడి జిల్లాలో గణనీయంగా పెరిగిన భూగర్భ జలాలు జనగామలో రెట్టింపు స్థాయిలో నీటి మట్టాలు యాసంగికి నీరందించేందుకు ప్రణాళికలు వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లో భూగర్భ జలాలు గత ఏడాది కంటే భారీగా పెరిగాయి. గ్రామాల్లో చిన్న నీటివనరుల పునరుద్ధరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల్లో పూడికతీతలు, మరమ్మతులు చేపట్టడంతో పాటు దేవాదులు ఎత్తిపోతల పథకం ద్వారా చెరువులు నింపారు. అలాగే గత సెప్టెంబర్, అక్టోబర్‌లో విస్తారంగా కురి సిన వర్షాలతో నీటి మట్టాలు గణనీయంగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. చెరువుల్లో నీటి నిల్వలు సమృద్ధిగా ఉండడంతో ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు భారీగా పెరిగి తక్కువ లోతులోనే నీరందుతోంది. దీంతో ఈ ఏడాది యాసంగి పంటలకు కావాల్సిన సాగునీరు సరిపడా అందే అవకాశాలున్నాయి. పునర్విభజన ప్రక్రియతో కొత్తగా ఏర్పాటైన వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల్లో సుమారు 3 నుంచి 4 మీటర్ల మేరకు భూగర్భ జలాల మట్టం పెరగడంతో నీరు గతేడాది కంటే ఎక్కువగా లభించే అవకాశాలున్నాయి. ఆచార్య జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో గతేడాది, ఇప్పటి భూగర్భ జలాల మట్టాల నమోదును పరిశీలిస్తే కేవలం మీటరు మాత్రమే పెరిగింది. కాగా, జనగామ జిల్లాలోని అన్ని చెరువులను పూర్తి స్థాయిలో నింపడంతో ఈ ప్రాంతంలో గణనీయంగా భూగర్భ జలమట్టాలు పెరిగాయి. ఇక్కడ గతేడాది జనవరిలో నమోదైన భూగర్భ జలాలు.. ప్రస్తుతం నమోదైన మట్టాలను పరిశీలిస్తే సుమారు 4.18 మీటర్లు పెరిగాయి. దీంతో జిల్లాలో యాసంగి పంటలను విస్తారంగా పండిం చేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు.వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో కలిపి మొత్తం 5459 చెరువులు ఉన్నాయి. చెరువుల నిల్వ నీటి సామర్థ్యం 47,177 మిలియన్ క్యూబిక్ ఫీట్ (ఎంసీఎఫ్‌టీ)లు. ప్రసుత్తం 36,013 ఎంసీఎఫ్‌టీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ చెరువుల కింద 3,47,949 ఎకరాల ఆయకట్టు ఉంది.అందుబాటులో ఉన్న నీటి లభ్యతతో ఖరీఫ్, యాసంగి సీజన్లలో 1,23,033 ఎకరాల్లో సాగు నీరందించేలా చిన్న నీటిపారుదల శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్న నేపథ్యంలో యాసంగి పంట సాగుకు భరోసా కలుగనుంది. రబీ సీజన్లో 25,200 ఎకరాలకు సాగునీరందించేందుకు నీటి లభ్యత అందుబాటులో ఉందని నీటిపారుదల శాఖ పేర్కొంది. వరంగల్ అర్బన్ జిల్లాలో 2016 జనవరిలో భూగర్భ జలాలు 9.57 మీటర్ల లోతులో ఉండగా.. ప్రస్తుత జనవరిలో 5.66 మీటర్ల లోతునే ఉన్నాయి. అంటే గతేడాది కంటే 3.91 మీటర్ల పైనే నీటి లభ్యత ఉంది.వరంగల్ రూరల్ జిల్లాలో 2016 జనవరిలో భూగర్భ జలాలు 10.50 మీటర్ల లోతులో ఉండగా.. ప్రస్తుతం 7.45 మీటర్ల లోతులో ఉన్నాయి. అంటే గతేడాది కంటే 3.05 మీటర్లు పైనే నీటి లభ్యత ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2016 జనవరిలో భూగర్భ జలాలు 9.45 మీటర్ల లోతులో ఉండగా.. ప్రస్తుత జనవరిలో 8.76 మీటర్ల లోతులో ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లాలో 2016 జనవరిలో భూగర్భ జలాలు 6.74 మీటర్ల లోతులో ఉండగా.. ప్రస్తుతం 6.13 మీటర్ల లోతులో ఉన్నాయి. ఇక్కడ నీటి మట్టం స్వల్పంగా పెరిగింది. జనగామ జిల్లాలో 2016 జనవరిలో భూగర్భ జలాలు 13.84 మీటర్ల లోతులో ఉండగా.. ప్రస్తుత జనవరిలో 9.65 మీటర్ల లోతులోనే ఉన్నాయి. అంటే గతేడాది కంటే 4.18 మీటర్లు పైనే నీటి లభ్యత ఉంది. -
సాగర్ కాలువలో తగ్గిన నీటిమట్టం
మేజర్లకు ఎక్కక రైతుల ఇబ్బందులు ఎస్కేప్ నుంచి యథేచ్ఛగా తరలుతున్న నీరు కురిచేడు : ఆరుతడి సాగుకు నాగార్జున సాగర్ కాలువ ద్వారా వారం నుంచి నీరు విడుదల చేస్తున్నారు. నీటిమట్టం గణనీయంగా తగ్గిపోవటంతో మేజర్లకు నీరు ఎక్కక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాలువకు నీరు వచ్చి కూడా ఉపయోగం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్ఎస్పీ ఎస్ఈ శారద ఆదివారం కాలువపై పర్యటించారు. దిగువ ఉన్న మేజర్లకు నీరు సరఫరా చేసేందుకు ఎగువున ఉన్న మేజర్లను నిలిపేయాలని సూచించారు. మరో వారం, పది రోజుల్లో నీటి సరఫరా నిలిచిపోతున్నందున రైతులకు నీరందించాల్సిన అవసరం ఉందన్నారు. దిగువ ప్రాంత రైతుల పరిస్థితిని కూడా ఎగువ ప్రాంత రైతులు అర్థం చేసుకుని సహకరించాలని ఆమె కోరారు. ఎస్ఈతో పాటు దర్శి డీఈఈలు కరిముల్లా, శ్రీనివాసరావు ఉన్నారు. చెరువులకూ చేరని వైనం... స్థానిక అట్లపల్లి చెరువుకు నేటి వరకూ చుక్క నీరు కూడా మళ్లించలేదు. అట్లపల్లి చెరువు పక్క చెరువులో లోతు తవ్వటంతో నీరు సీఫేజ్ అవుతోంది. అలా చెరువు ఖాళీ అయినా అధికారులు ఆ లీకును నిలువరించలేదు సరికదా తిరిగి నీటితో నింపలేదు. దీంతో తాగునీటి కష్టాలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం వస్తున్న నీటితో తాగునీటి చెరువును నింపాల్సిన అవసరం ఉంది. సగం కూడా రాని నీరు త్రిపురాంతకం: నాగార్జున సాగర్ ప్రధాన కాలువ ద్వారా జిల్లాకు 1440 క్యూసెక్కులు మాత్రమే నీరు సరఫరా అవుతోంది. బుగ్గవాగు నుంచి 6500 క్యూసెక్కులు నీరు పెంచి విడుదల చేస్తున్నారు. తక్కువ నీటి సరఫరా జరుగుతుండడంతో మేజర్లకు నీరందక రైతులు ఆందోళన చెందుతున్నారు. విడుదల చేసినపుడు 2650 క్యూసెక్కులు రాగా రెండో రోజు నుంచి పూర్తిగా నీటి సరఫరా తగ్గిపోతు వచ్చింది. జిల్లా ప్రధాన కాలువకు 3350 క్యూసెక్కుల నీరు విడుదల చేయాల్సి ఉంది. సగం నీరు కూడా అందడం లేదు. గుంటూరు జిల్లా అక్రమ చౌర్యమే కారణం ప్రకాశం, గుంటూరు జిల్లాలలోని పంటలను రక్షించేందుకు ఆరుతడులకు నీరు విడుదల చేసారు. ఒక్కో జిల్లాకు ఐదు టీఎంసీలు మొత్తం పది టీఎంసీల నీటిని అందిస్తున్నారు. ఇప్పిటికి వారం రోజులకు గాను ఒక టీఎంసీ నీరు మాత్రమే అందినట్లు అధికారుల లెక్కలు మరో పది రోజులు మాత్రమే నీరు అందనుంది. మిగిలిన నాలుగు టీఎంసీల నీరు ఎప్పుడు అందిస్తారు. వచ్చిన నీటిని అక్రమంగా, మేజర్ల ద్వారా సామర్థ్యాన్ని మించి ఎస్కేప్ ద్వారా అక్రమంగా నీటిని తరలించుకు పోతుండడంతో జిల్లాకు నీరందడం లేదు. అక్కడ ఎమ్మెల్యేలు, మంత్రులు అధికారులపై వత్తిడి తెచ్చి యథేచ్ఛగా తరలిస్తున్నా ఇక్కడ ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు చీమకుట్టినట్లు లేకపోవడం దారుణమైన విషయం. ఇలానే కొనసాగితే వేసిన పంటలు నిలువునా ఎండిపోవాల్సిందే నని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువలో ప్రస్తుత నీటి మట్టం వివరాలు ఇలా ఉన్నాయి కాలువ పేరు నీటి సరఫరా (క్యూసెక్కుల్లో) ఒకటో తేదీ ఆరో తేదీ నాగార్జున సాగర్‌డ్యాం 4,000 7,200 బుగ్గవాగు వద్ద 5,627 6,562 గుంటూరు బ్రాంచికి 1,300 1,300 అద్దంకి బ్రాంచికి 1,200 1,088 57/2 మైలు వద్ద 2,000 2,291 జిల్ల సరిహద్దు85/3 వద్ద 1,632 1,440 126 వ మైలుకురిచేడు వద్ద 1,192 947 ఒంగోలు బ్రాంచికి 883 505 -
మత్తడికి చేరువలో పాకాల
28 ఫీట్లకు చేరిన నీటిమట్టం ఖానాపురం : జిల్లాలోని ప్రధాన చెరువుల్లో ఒకటైన పాకాల సరస్సు నీటిమట్టం శుక్రవారం నాటికి 28 ఫీట్లకు చేరింది. ఎగువ ప్రాంతమైన కొత్తగూడ మండలంలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు పొంగి పాకాల సరస్సులోకి నీరు చేరుతోంది. ఈ సరస్సు పూర్తిస్థాయి నీటిమట్టం 30.03 ఫీట్లు కాగా మరో 2 ఫీట్ల నీరు చేరితో అలుగుపడే అవకాశం ఉంది. ఎగువప్రాంతం నుంచి వాగులు భారీగా పొంగుతుండటంతో సరస్సులోకి నీరు చేరుతూనే ఉంది. ఎగువ ప్రాంతంలో వర్షాలు పడితే శనివారం ఉదయం వరకు పాకాల సరస్సు అలుగుపడే అవకాశం ఉంది. -
స్వల్పంగా పెరిగిన మడ్డువలస
వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు నీటిమట్టం బుధవారం స్వల్పంగా పెరిగింది. సువర్ణముఖి నదిలో నీటి ప్రవాహం పెరగడంతో ప్రాజెక్టులోకి 7 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు వద్ద 63.80 మీటర్ల లెవెల్ నీటిమట్టం నమోదైంది. దీంతో ప్రాజెక్టు వద్ద మూడుగేట్లు ఎత్తి వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడిచిపెడుతున్నట్టు డీఈ జి.పద్మజ తెలిపారు. -
దుర్గమ్మకు చేరువగా కృష్ణమ్మ
విజయవాడ(ఇంద్రకీలాద్రి) : దుర్గమ్మకు కృష్ణమ్మ మరింత చేరువైంది. నిన్నటి వరకు నీటి జాడలేని దుర్గాఘాట్‌లో గురువారం సాయంత్రానికి మూడు అడుగుల మేర నీరు చేరింది. దుర్గాఘాట్‌లో నీటిమట్టం పెరగడంతో అమ్మవారి భక్తులతోపాటు సందర్శకుల తాకిడి పెరిగింది. అమ్మవారి దర్శనానికి వచ్చిన పలువురు భక్తులు దుర్గాఘాట్‌లోనే పుణ్యస్నానాలు ఆచరించారు. యాత్రకుల రద్దీ ప్రారంభం శుక్రవారం ఉదయం నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం నుంచే యాత్రకుల రద్దీ ప్రారంభమైంది. బస్సు, రైళ్ల ద్వారా నగరానికి చేరుకున్న భక్తులు స్నానఘాట్లకు వస్తున్నారు. పుష్కర యాత్రికులతోపాటు నగరానికి చెందినవారు ఘాట్లలో ఏర్పాట్లను తిలకించేందుకు వస్తుండడంతో సదండి వాతావరణం నెలకొంది. -
చినుకు రాలినా.. ఏదీ జలసిరి
► సిటీలో పెరగని భూగర్భ జలమట్టాలు ► ఈ సీజన్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువ నమోదు ► 337 మి.మీటర్లకు గాను 316 మి.మీటర్లు మాత్రమే కురిసిన వాన ► ఇంకుడు గుంతలు లేక ఇబ్బందులు ► గతేడాదితో పోలిస్తే పలు మండలాల్లో తగ్గిన నీటిమట్టాలు సాక్షి, సిటీబ్యూరో: ఈ సీజన్లో గ్రేటర్లో వర్షాలు కురిసినప్పటికీ భూగర్భ జలసిరి మాత్రం పెరగలేదు. నగరవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తరచూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసినప్పటికీ పలు మండలాల్లో గతేడాదితో పోలిస్తే భూగర్భ జలమట్టాలు పెరగ లేదు. మహానగరంలో సాధారణ వర్షపాతాన్ని పరిశీలిస్తే..జూన్ తొలివారం నుంచి ఆగస్టు తొలివారం వరకు సాధారణంగా 337 మి.మీ వర్షపాతం నమోదయ్యేది. కానీ ఈసారి 316 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. అలాగే సాధారణ వర్షపాతంలోనూ 0.6 శాతం తరుగుదల నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 29 రోజులపాటు వర్షం కురిసినప్పటికీ వాననీరు నేలగర్భంలోకి ఇంకించేందుకు అవసరమైన ఇంకుడు గుంతలు అందుబాటులో లేకపోవడంతో భూగర్భ జలసిరి పెరగలేదని నిపుణులు స్పష్టంచేస్తున్నారు.l పలు మండలాల్లో పెరగని జలసిరి... గతేడాదితో పోలిస్తే హయత్‌నగర్ మండలంలో 5.88 మీటర్లు, హిమాయత్‌నగర్‌లో 4.28 మీటర్లు, ఇబ్రహీంపట్నంలో 1.15 మీటర్లు, మహేశ్వరంలో 3.80 మీటర్లు, కుత్భుల్లాపూర్‌లో 0.85 మీటర్లు, సరూర్‌నగర్‌లో 0.75 మీటర్లు, శామీర్‌పేట్‌లో 2.80 మీటర్లు, ఉప్పల్‌లో 1.42 మీటర్లు, మల్కాజ్‌గిరిలో 1.20 మీటర్లు, రాజేంద్రనగర్‌లో 2.65 మీటర్లు, శంషాబాద్‌లో 0.90 మీటర్ల మేర నీటిమట్టాలు తగ్గడం గమనార్హం. ఇంకుడు గుంతలు లేకనే ఈ దుస్థితి.. గ్రేటర్ పరిధిలో సుమారు 25 లక్షల భవంతులు, 22 లక్షల బోరుబావులుండగా..వర్షపునీటిని నేలగర్భంలోకి ఇంకించేందుకు అవసరమైన ఇంకుడు గుంతల సంఖ్య లక్షలోపుగానే ఉండడంతోనే ఈ దుస్థితి తలెత్తిందని భూగర్భజలశాఖ నిపుణులు చెబుతున్నారు.