సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ బేసిన్ పరిధిలో కురుస్తున్న వర్షాలతో ఎగువన ఉన్న ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకోవడం.. దిగువన రాష్ట్రంలోని ప్రాజెక్టులకు ఉధృతంగా ప్రవాహా లు నమోదవుతుండటంతో నాగార్జునసాగర్ కింది ఆయకట్టు రైతాంగంలో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రాజెక్టులో ఇప్పటికే కనీస నీటి మట్టాలకు ఎగువన అరవై టీఎంసీల నీటి లభ్యత ఉండటం..ఎగువ నుంచి ప్రవాహాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఖరీఫ్‌కు సాగునీటి విడుదలకు ప్రభుత్వ యంత్రాంగం సన్నాహాలు మొ దలుపెట్టింది. అన్నీ అనుకూలిస్తే ఆగస్టు తొలి వారం నుంచే నీటి విడుదల జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.
పూర్తి ఆయకట్టుకు..?
సాగర్ ఎడమకాల్వ కింద మొత్తంగా 6.40 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉంది. గత ఏడాది విస్తారంగా వర్షాలు కురవడంతో కేవలం 35 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించారు. యాసంగి సీజన్‌లో మాత్రం 6.15 లక్షల ఎకరాలకు నీరివ్వగా 55 టీఎంసీల మేర నీటిని వినియోగించారు. ప్రస్తుతం సైతం 6.30 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించగా, దీనికి 60 టీఎంసీలు అవసరమని లెక్కించారు. దీంతో పాటే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎంఆర్‌పీ) కింద 2.63 లక్షల ఎకరాలకు మరో 20 టీఎంసీలు, తాగునీటి అవసరాలకు మరో 10 టీఎంసీలు కలిపి మొత్తంగా 90 టీఎంసీల అవసరాలను గుర్తించారు.
ఎగువన ప్రాజెక్టులన్నీ నిండి ఉండటం, నవంబర్– డిసెంబర్ వరకు సైతం ఎగువ నుంచి ప్రవాహాలు కొనసాగే అవకాశాలున్న నేపథ్యంలో 90 టీఎంసీల మేర నీటిని ఇవ్వడం పెద్ద కష్టం కాదని ప్రాజెక్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కనీస నీటి మట్టాలకు ఎగువన ఉన్న 60 టీఎంసీల లభ్యత నీటిని ఐదారు తడుల ద్వారా ఆయకట్టుకు విడుదల చేయాలని యోచిస్తున్నారు. అయితే ఆయకట్టు ప్రాంత ప్రజా ప్రతినిధులతో ఒకమారు చర్చించిన అనంతరం వారి సూచనల మేరకు నీటి విడుదల చేయాలని భావిస్తున్నారు. గత ఏడాది ఆగ స్టు నుంచి నవంబర్ వరకు నీటి విడుదల కొనసాగింది. ఈ ఏడాది సైతం ఆగస్టు తొలి వారం నుంచి నీటి విడుదల కొనసాగే అవకాశం ఉంద ని నీటి పారుదల వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఎగువ పరవళ్లతో సాగర్ పరవశం...
గడిచిన ఇరవై రోజులుగా పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటికే రెండు ప్రాజెక్టుల నుంచి భారీగా నీటి విడుదల చేస్తుండటంతో ఆ నీరంతా జూరాల మీదుగా శ్రీశైలం చేరుతోంది. ప్రస్తుత సీజన్‌లో జూరాలకు 80 టీఎంసీల మేర కొత్త నీరురాగా, శ్రీశైలానికి స్థానికంగా వచ్చిన ప్రవాహాలు కలుపుకొని మొత్తంగా 85 టీఎంసీల మేర కొత్త నీరు వచ్చి చేరింది.
ప్రస్తుతం శ్రీశైలంలో 215 టీఎంసీలకు గానూ 90 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇందులోంచే పవర్‌హౌస్‌ల ద్వారా నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్‌లో ఇప్పటివరకు 30 టీఎంసీల కొత్త నీరు చేరింది. సాగర్లో నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు కాగా ప్రస్తుతం 191 టీఎంసీల నీరుంది. 31 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. ఇందులో కనీస నీటిమట్టం 510 అడుగులకు ఎగువన వినియోగార్హమైన నీరు 60 టీఎంసీల మేర ఉంది. ఈ నీటిని సాగర్ కింది ఆయకట్టు అవసరాలకు వినియోగించే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment