శ్రీరామా కరుణించవేమిరా!
శ్రీరామా కరుణించవేమిరా!
Published Fri, Jul 11 2014 12:30 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
ప్రాజెక్టుకు ‘బాబ్లీ’ గండం
తగ్గుతున్న ఎస్సారెస్పీ నీటి మట్టం
పెరగాల్సిన సమయంలో తగ్గుముఖం
ఆందోళనలో ఆయకట్టు రైతులు
బాల్కొండ: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ప్రస్తుత నీటి మట్టం ఆయకట్టు రైతుల్లో ఆందోళన పెంచుతోంది. ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా, ప్రసుత్తం 24 టీఎంసీల నీరు మాత్రమే నిలువ ఉంది. ప్రాజెక్ట్ డెడ్‌స్టోరేజ్ ఐదు టీఎంసీలు, తాగు నీటి అవసరాలకు ఐదు టీఎంసీలు, ఆవిరి... ఇతర లీకేజీలకు ఐదు టీఎంసీలు పోతే మిగిలేది తొమ్మిది టీఎంసీల నీరు మాత్రమే. దీంతో ఏ పంటలకు నీరందని దుస్థితి. ప్రాజెక్ట్ నీటి మట్టం పెరగవలసిన సమయంలో తగ్గుముఖం పడుతుండటం రైతులను మరింత నైరాశ్యంలో ముంచుతోంది. ప్రాజెక్ట్ నీటి ఆధారంగా 18 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది. అలాంటి ప్రాజెక్ట్‌లోకి ఈ ఏడాది వరదలు రాకపోవడంతో వెలవెలబోతోంది. దీంతో ఖరీప్‌కు నీరందుతుందా? అనే అనుమానాలు రైతులను వెంటాడుతున్నాయి. మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదలతోనే అధిక భాగం ప్రాజెక్ట్ నిండుతుంది. కానీ, ఎస్సారెస్పీకి వచ్చే వరద నీటికి అడ్డుగా అక్కడ ప్రాజెక్ట్‌లు నిర్మించడంతో ఇక్కడ పూర్తి స్థాయిలో నీరు చేరడంలేదు.
నారుకు నీరు అందించలేని పరిస్థితి
గతేడాది జూన్ మధ్యలో ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరదలు ప్రారంభమై జూలై చివరినాటికి ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. జూలై చివర ప్రాజెక్ట్ నుంచి మిగులు జలాలను గోదావరిలోకి విడుదల చేశారు. దీంతో ముందస్తుగా ఆయకట్టు రైతులు పంటలు వేసుకున్నారు. గతేడాది కంటే ప్రస్తుత సంవత్సరం 14 టీఎంసీల నీరు అధికంగా ఉన్నప్పటికీ ఇంత వరకు వరదలు ప్రారంభం కాక పోవడమే ప్రమాదకరం. ప్రాజెక్ట్‌లో అన్ని అవసరాలకు పోను 45 టీఎంసీల నీరుంటే ఒక్క పంటకు నీరందించవచ్చు. కానీ, ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 24 టీఎంసీల నీరు మాత్రమే నిలువ ఉంది. దీంతో రైతులు ఖరీప్ కోసం వరి నార్లు వేసుకోవడానికి నీరు విడుదల చేసే పరిస్థితిలేదు. సాగునీరు దేవుడెరుగు ప్రస్తుతం ఉన్న నీటి నిలువతో తాగునీటి అవసరాలే తీరే పరిస్థితి కనిపించడంలేదని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఎత్తి పోతలు ఉత్తిపోతలే అవుతాయ్
శ్రీరాంసాగర్ ఆధారంగా అనేక ఎత్తి పోతలను నిర్మించారు.ప్రాజెక్ట్‌లో నీరు ఆందోళనకరంగా ఉండటంతో ఎత్తి పోతలు ఉత్తి పోతలే అయ్యే ప్రమాదం ఉంది. సాగునీటి కోసం కా కుండ తాగునీటికోసం కూడ అనేక ఎత్తి పోతలను నిర్మిం చారు. ఎత్తిపోతల ద్వారా సుమారు 1.50 లక్షల ఎకరాలు సా గవుతుంది. ఈ ఆయకట్టు ఎడారి అయ్యే ప్రమాదం ఉంది.
2012 పునరావృతమైతే...
2012లో ప్రాజెక్ట్ సకాలంలో నిండక ఖరీప్‌లో రైతులు పంటలు వేయలేదు. ఆలస్యంగా వరదలు రావడంతో ప్రాజెక్ట్ సెప్టెంబర్ చివరి నాటికి నిండింది. 2013లో మాత్రం రైతులు ఎదురుచూడక ముందే ప్రాజెక్ట్ నిండింది. ప్రస్తుతం ఇంత వరకు ఒక్క భారీ వరద కూడా ప్రాజెక్ట్‌లోకి వచ్చి చేరలేదు.
ఎస్సారెస్పీ నీటికి గ ండంగా బాబ్లీ
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ భాగాన ప్రాజెక్ట్‌కు 80 కిలో మీటర్ల దూరంలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ ఎస్సారెస్పీ నీటికే గండంగా పరిణమించింది. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం బాబ్లీ గేట్లు ఆక్టోబర్ 28న మూసి వేసి, జూలై ఒకటిన తెరువాలి. కా నీ, తెరిచినా... దించినా ఎస్సారెస్పీకి బాబ్లీ ప్రాజెక్ట్ గండంగా నే ఉంది. జూలై ఒకటిన బాబ్లీ గేట్లు ఎత్తినప్పుడు బా బ్లీ నుంచి ఎస్సారెస్పీలోకి 0.7 టీఎంసీల నీరు వస్తుందని అధికారులు తెలిపారు. రెండు రోజుల తర్వాత కేవలం 0.37 టీఎంసీల నీరు మాత్రమే వచ్చి చేరింది. గేట్లు ఎత్తి పది రో జులు గడుస్తున్నా ఇంత వరకు పూర్తి స్థాయి నీరు రాలేదు. బాబ్లీ ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం 2.4 టీఎంసీలు. బాబ్లీ నుంచి పంపింగ్ చేసే లా, ఎస్సారెస్పీ నీటిని బాబ్లీ ప్రాజెక్ట్‌లోకి లాక్కునేలా గేట్లను నిర్మించారు. ఆ గేట్ల నిర్మాణం ఇప్పుడు ప్రాజెక్ట్‌లోకి పూర్తి నీరు రాకుండా అడ్డుకుందని పలువురు ఆరోపిస్తున్నారు.
Advertisement