Sriram sagar project
-
శ్రీరాంసాగర్ జలాశయంలో ముగ్గురు యువకులు గల్లంతు
సాక్షి, నిజామాబాద్: మహాశివరాత్రి పండుగపూట నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్రీరాంసాగర్ జలాశయంలో పడి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటన ముప్కాల్ మండలంలోని ఎస్సారెస్సీ లక్ష్మీ కాలువ హెడ్‌రెగ్యులేటర్ వద్ద శుక్రవారం జరిగింది. గల్లంతైన యువకులను సాయినాథ్, లోకేష్, మున్నాగా గుర్తించారు. వీరంతా జక్రాన్‌పల్లి మండలం గున్యా తండా వాసులుగా గుర్తించారు యువకులు మునిగిపోవడాన్ని గమనించిన స్థానికులు పోలీసులు, అధికారులకు సమాచారమిచ్చారు. స్థానికులు, పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. . పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: మహాశివరాత్రి నాడు విషాదం.. కరెంట్ షాక్‌తో 14 మంది చిన్నారులకు గాయాలు -
SRSP: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద.. 26 గేట్లు ఎత్తివేత
సాక్షి, నిజామాబాద్: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీటిపారుదల ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వస్తుంది. దీంతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు వరప్రదాయినిగా ఉన్న నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి భారీ వరద నీరుపోటెత్తుతోంది. ప్రాజెక్టులో సుమారు 2,22,216 క్యూసెక్కుల నీరు వస్తుండడంతో డ్యాం అధికారులు ముందు జాగ్రత్తగా 26 గేట్లను ఎత్తి లక్షా 50వేల క్యూసెక్కుల నీటిని దిగువన గోదావరిలోకి వదులుతున్నారు. శ్రీరాంప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 90 టీఎంసీలు( 1091 అడుగులు నీటిమట్టం) కాగా.. ప్రస్తుతం 75 వేల టీఎంసీల ( 1087.7 అడుగుల నీటిమట్టం) నీరు ఉంది. ప్రాజెక్టులోకి వరద పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ ఎస్ఈ శ్రీనివాస్ తెలిపారు. గేట్లను ఎత్తివేయడంతో ముందస్తుగా దిగువన పరీవాహక ప్రాంతాల ప్రజలను అలెర్ట్ చేసినట్లు తెలిపారు. రెవెన్యూ, పోలీసులు ఇందుకనుగుణంగా భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలెవ్వరూ కూడా పరీవాహక ప్రాంతాలకు రావద్దని, మత్స్యకార్మికులు, పశువుల కాపరులు, రైతులు గోదావరిని దాటే ప్రయత్నం చేయవద్దని అప్రమత్తం చేశారు. -
గోదావరిలో మొసళ్లు!.. బెంబేలెత్తుతున్న భక్తులు..
బాల్కొండ : శ్రీ రాంసాగర్ ప్రాజెక్ట్ దిగువన గోదావరిలో మొసళ్ల సంచారం పెరిగింది. శుక్రవారం పుష్కర ఘాట్ వద్ద పెద్ద మొసలి కనిపించడంతో పుణ్య స్నానాలకు వెళ్లిన భక్తులు ఒక్క సారిగా బెంబేలెత్తిపోయారు. ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరదలు వచ్చినప్పుడు నీటి ప్రవాహంలో మొసళ్లు కొట్టుకు వచ్చి ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. కాగా మొసళ్ల ఉనికితో నదికి వచ్చే భక్తులతో పాటు జీవనోపాధి కోసం చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకే పలు గ్రామాల్లోని చెరువుల్లో మొసళ్లు కనిపించాయి. దీంతో కొన్ని చెరువుల్లో ఇప్పటికీ మత్స్యకారులు చేపలు పట్టడం లేదు. ముప్కాల్ మండల నల్లూర్ ఊర చెరువులో రెండు పెద్ద మొసళ్లు గత ఏడాది నుంచి సంచరిస్తున్నాయి. మెండోరా మండలం బుస్సాపూర్ ఊర చెరువులో రెండు మొసళ్లు ఉండ గా ఒక మొసలిని ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. రెండో మొసలి గురించి ఇప్పటికీ పత్తాలేదు. ముప్కాల్ మండలం వెంచిర్యాల్ వద్ద కాకతీయ కాలువ పక్కన గల చిన్న చెరువులో మొసలి ఉండటంతో అధికారులు పట్టుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఇలా మొసళ్లు అప్పుడప్పుడూ బయటపడుతూ స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా గోదావరిలోని స్నా నాల ఘాట్ వద్ద మొసలి కనిపించడం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఉన్నతాధికారుల ఆదేశానుసారం మొసళ్లను గోదావరిలో వదిలి పెడుతున్నాం. గోదావరిలో నీటిలోనే మొసలి ఉంటుంది. సేద తీరడం కోసం ఒడ్డుకు వస్తుంటుంది. అలా వచ్చిన మొసలిని పట్టుకుని మళ్లీ నీరు అధికంగా ఉన్న ప్రాంతంలో వదిలేస్తున్నాం. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటాం. – గణేశ్, సెక్షన్ ఆఫీసర్, మెండోరా చెరువుల్లో పట్టి నదిలో వదిలి.. చెరువుల్లో పట్టుకున్న మొసళ్లను ఫారెస్టు అధి కారులు ఎస్సారెస్పీ దిగువన గోదావరిలో వదులు తున్నారు. మెండోరా మండలం బు స్సాపూర్ చెరువులో మే నెలలో జాలరుల వలకు చిక్కిన మొసలిని దూదిగాం శివారు లోని గోదావరిలో వదిలి వేశారు. ఆ సమయంలో నదిలో నీరు కూడా లేదు. అలా వది లేస్తే గోదావరికి పుణ్య స్నానాల కోసం వచ్చే భక్తుల పరిస్థితి ఏంటని పలువురు నిరసన వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితం దూదిగాం శివారులో జాతీయ రహదారి 44 పైకి పెద్ద మొసలి వచ్చి నానా హంగామా చేసింది. ఫారెస్ట్ అధికారులు ఎక్కడెక్కడో చెరువుల్లో దొరికిన మొసళ్లను పట్టుకు వచ్చి గోదావరిలో వదిలి వేస్తున్నారని, తిరిగి అవే మొసళ్లు చెరువుల్లోకి వచ్చి చేరుతున్నాయని గ్రామీ ణులు ఆరోపిస్తున్నారు. ప్రతి శుక్ర సోమవారాల్లో గోదావరిలోకి స్నానానికి భక్తులు, నిత్యం బట్టలు ఉతుక్కోవడానికి గ్రామస్తు లు వెళ్తుంటారు. మొసళ్ల వలన ప్రమాదాల భారిన పడితే ఎవరు దిక్కు అని ప్రశి్నస్తున్నారు. పట్టుకున్న మొసళ్లను జంతు ప్రదర్శన శాలకో, జంతువుల పెంపకం ప్రదేశాలకో పంపించాలని కోరుతున్నారు. -
తాడుకు వేలాడుతున్న చేపలు.. ఎందుకో చెప్పండి!
సోన్: ఇక్కడ దండేనికి వేళాడుతున్న చేపలను చూశారా? ఇవన్నీ ఎండు చేపలు. పచ్చి చేపలను ఎండబెట్టడానికి చేసుకున్న ఏర్పాటు ఇది. ఆదిలాబాద్ జిల్లా సోన్ మండలంలోని గాంధీనగర్ గ్రామంలో నివసించేవారంతా గంగపుత్రులే. నాలుగు వందల జనాభా ఉండగా అంతా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటిలో చేపల వేట సాగించి జీవనోపాధి పొందుతారు. అమ్ముడు పోగా మిగిలిన చేపలను నాలుగు రోజుల పాటు ఎండబెడతారు. ఎండుచేపలను కూడా అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో ఏ ఇంటి ముందు చూసినా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తాయి. (క్లిక్ చేయండి: నెలకు లక్ష జీతం.. సాఫ్ట్వేర్ వదిలి ‘సాగు’లోకి..) -
TSRTC: సుందర జలపాతాలు చూసొద్దాం రండి..
సాక్షి, హైదరాబాద్: పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులకు శుభవార్త. జలపాతాల సందర్శనకు తెలంగాణ ఆర్టీసీ ప్రతి శని, ఆదివారాల్లో బస్సులు నడపాలని నిర్ణయించింది. ఆదిలాబాద్‌లోని కుంటాల జలపాతాన్ని సందర్శించేందుకు ఈ సర్వీసులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ సికింద్రాబాద్ రీజనల్ మేనేజర్ వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈప్రత్యేక బస్సులు ప్రతి శని, ఆదివారాల్లో ఉదయం 5 గంటలకు మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ (ప్లాట్‌ఫామ్ 55, 56) నుంచి, ఉదయం 5.30 గంటలకు జూబ్లీ బస్‌స్టేషన్ (ప్లాట్‌ఫామ్ 20) నుంచి బయల్దేరుతాయి. పర్యటనలో భాగంగా పోచంపాడ్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, పోచేరా జలపాతం సందర్శిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆదిలాబాద్‌లోని కుంటాల జలపాతాన్ని, అనంతరం నిర్మల్ బొమ్మలు, హస్తకళలను సందర్శిస్తారు. రాత్రి 10.45 గంటలకు తిరిగి నగరానికి చేరుకుంటారు. (క్లిక్: ఆర్టీసీ ‘హైదరాబాద్ దర్శిని’.. వీకెండ్లో స్పెషల్ సర్వీసులు) ఈ పర్యటనలో కుంటాల వద్ద మధ్యాహ్న భోజనం, తిరుగు ప్రయాణంలో చేగుంట వద్ద రాత్రి భోజన సదుపాయం ఉంటుంది. పిల్లలకు రూ.599, పెద్దవాళ్లకు రూ.1099 చొప్పున చార్జి ఉంటుంది. పర్యటన టిక్కెట్ల బుకింగ్ కోసం ఫోన్ : 7382842582 నంబర్‌ను సంప్రదించవచ్చు. (క్లిక్: పెద్ద జబ్బులకు ఉచితంగా పీహెచ్‌సీల్లో చికిత్స) -
గోదావరి మళ్లీ ఉగ్రరూపం
సాక్షి, హైదరాబాద్/భద్రాచలం/కాళేశ్వరం/బాల్కొండ/దోమలపెంట(అచ్చంపేట): గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి పోటెత్తి ప్రవహిస్తోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో విస్తృతంగా వర్షాలు కురుస్తుండటంతో ఉప నదులై న మంజీర, మానేరు, ప్రాణహిత, ఇంద్రావతి ఉప్పొంగుతున్నాయి. దీంతో గోదావరిలో వరద ఉదృతి పెరుగుతోంది. గోదావరిపై జైక్వాడ్ నుంచి బాబ్లీ వరకూ అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తడం, ఈ వరదకు మంజీర తోడవడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ఉద్ధృతి పెరిగింది. వచ్చిన నీటిని వచ్చినట్లు వదిలేస్తుండటంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద భారీగా వస్తోంది. అలా దిగువకు వస్తు న్న వరద కాళేశ్వరంలో అంతర్భాగమైన మేడిగడ్డకు.. అక్కడి నుంచి తుపాకులగూడెం బ్యారేజీలలోకి.. అక్కడి నుంచి సీతమ్మసాగర్‌లోకి వస్తోంది. అక్కడి నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద ఉధృతి గంట గంటకూ పెరుగుతోంది. సోమవారం సాయంత్రం 7 గంటలకు భద్రాచలం వద్ద గోదావరికి 10,36,818 క్యూసెక్కుల వరద వస్తుండగా, నీటి మట్టం 45.6 అడుగులకు చేరింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పూస్కుపల్లి గ్రామంలో నీట మునిగిన పత్తిచేను అప్రమత్తంగా ఉండాలి... గోదావరి ఉధృతితో ప్రభుత్వం పరీవాహక జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. కలెక్టర్లు, ఎస్పీలు సహా ఇతర అధికారులను సన్నద్ధంగా ఉంచాలని సీఎస్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. తక్షణమే సెక్రటేరియట్లో కంట్రో ల్ రూమ్‌ను ఏర్పాటు చేసి పరిస్థితులను పర్యవేక్షించాలని సూచించారు. భద్రాచలం నుంచి పోలవరానికి వచ్చిన వరదను వచ్చినట్టుగా వదిలేస్తుండటంతో ఏపీలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సైతం అప్రమత్తం చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీలోకి 7,08,251 క్యూ సెక్కులు చేరుతుండగా, 7,05,651 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మరో రెండ్రోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనా. ఈ నేపథ్యంలో మరో మూడు రోజులు గోదావరికి వరద కొనసాగనుంది. కాగా, ముంపు ప్రాంత ప్రజలు, జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ భద్రాచలంలో అధికారులతో జరిగిన సమావేశంలో దిశానిర్దేశం చేశారు. జూలై, ఆగస్టు నెలల్లో వచ్చిన వరదతో తీవ్ర ఇబ్బందులు పడిన భద్రాచలం ఏజెన్సీ ప్రజలు, రైతులు.. మరోమారు ఉధృతి పెరుగుతుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. మహదేవపూర్ మండలం అన్నారం, చండుప్రల్లి, నాగేపల్లి, పూస్కుపల్లి, కాళేశ్వరం గ్రామాల్లోని గోదావరి పరీవాహక పంటభూములు నీటమునిగాయి. శ్రీశైలంలో తొమ్మిది గేట్లు ఎత్తివేత శ్రీశైలం ఆనకట్ట వద్ద సోమవారం తొమ్మిది గేట్లను ఎత్తి దిగువన సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి 2,69,207 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తోంది. దీంతో 3,02,630 క్యూసెక్కుల నీటిని నాగర్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. -
జిల్లాల్లో విస్తారంగా వానలు
సాక్షి, నెట్వర్క్: ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం రాత్రిదాకా చాలా చోట్ల వర్షాలు కురిశాయి. కరీంనగర్ జిల్లా మానకొండూరులో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం వరకు కుండపోత వాన పడింది. జగిత్యాల బీర్పూర్ మండలంలో మొక్కజొన్న, పత్తి చేన్లలో నీళ్లు చేరాయి. బుగ్గారంలో పిడుగుపాటుకు ఒక ఇల్లు పాక్షికంగా ధ్వంసమైంది. కోరుట్ల మండలంలో రహదారులపై వరద పోటెత్తి రాకపోకలు నిలిచిపోయాయి. ఇబ్రహీంపట్నం మండలంలో ఈదురుగాలులకు విద్యుత్ లైన్లు దెబ్బతిని సరఫరా నిలిచిపోయింది. ►పెద్దపల్లి జిల్లా రామగుండం, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం పరిసర ప్రాంతాల్లో వాన ముంచెత్తింది. గంజివాగు కల్వర్టుపై వరద పారుతుండటంతో వేములవాడ–బోయినపల్లి మధ్య రాకపోకలు నిలిపివేశారు. కోనరావుపేట మండలం కొండాపూర్ వద్ద సిరిసిల్ల–నిమ్మపల్లి ప్రధాన రహదారిపై కాజ్వే కొట్టుకుపోయింది. ►జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో శనివారం కుండపోత వాన పడింది. పోతుల్వాయి వద్ద బొర్రవాగు, చిద్నెపల్లిలో వాగోడ్డుపల్లి వాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గూడురు చెరువుకు గతంలో గండి పడగా.. అది మరింత పెరిగి వరద దిగువకు పోటెత్తింది. దిగువన పొలాల్లో ఉన్న సుమారు 100 గొర్రెలు నీటిలో కొట్టుకుపోయి మృత్యువాతపడ్డాయి. ►ఉమ్మడి మెదక్ జిల్లాలో శనివారం భారీ వర్షం కురిసింది. గుండువాగు ఉప్పొంగి జోగిపేట–టేక్మాల్ రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. వందల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. పలుచోట్ల ఇళ్లు కూలిపోయాయి. మంజీరా నది పోటెత్తడంతో ఘనపురం ఆనకట్ట పొంగిపొర్లుతోంది. దీంతో ఏడు పాయల వన దుర్గమ్మ ఆలయం జల దిగ్బంధమైంది. గోదావరి ప్రాజెక్టుల గేట్లన్నీ ఓపెన్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి లక్షా పదివేల క్యూసెక్కుల వరద వస్తుండటంతో.. 22 గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు కూడా నిండు కుండలా మారింది. ఎగువ నుంచి వరద చేరుతుండటంతో 8 గేట్లు ఎత్తి 80,800 క్యూసెక్కులను విడిచిపెడుతున్నారు. మొత్తంగా గోదావరి నదిపై ఉన్న అన్ని ప్రాజెక్టుల గేట్లను ఎత్తివేశారు. ఇక పరీవాహక ప్రాంతం నుంచి ప్రవాహాలు వస్తుండటంతో కరీంనగర్ జిల్లాలోని దిగువ మానేరు జలాశయం నిండుకుండలా మారింది. దీనితో ఎనిమిది గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి దూకుతున్న కృష్ణమ్మ ఎగువ నుంచి భారీ ప్రవాహాలు వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లను 15 అడుగుల మేర ఎత్తారు. ఇరువైపులా విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని వదులుతున్నారు. మొత్తంగా 4,38,185 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయంలో 884.3 అడుగుల నీటిమట్టం వద్ద 211.4 టీఎంసీలు నిల్వ ఉన్నట్టు అధికారులు తెలిపారు. -
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి
-
నలుపు రంగులోకి గోదావరి నీరు.. ప్రమాదం తప్పదు.. జాగ్రత్త!
బాల్కొండ/నిజామాబాద్: శ్రీ రాంసాగర్ ప్రాజెక్ట్ నీరు కలుషితమవుతోంది. నీరు నలుపు రంగులోకి మారిందని, దుర్వాసన తట్టుకోలేకపోతున్నామని మత్స్యకారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 21 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ అధికంగా ఉన్నప్పుడు ఎగువ నుంచి వదిలిన వ్యర్థాలు నీటిలో కలిసి పోయి దిగువకు వెళ్లిపోతాయి. ప్రస్తుతం తక్కువగా ఉన్న నీటి నిల్వతో వ్యర్థాల ప్రభావం ఏర్పడుతోంది. ఎగువ భాగాన మహారాష్ట్రలో అధికంగా ఉన్న ఫ్యాక్టరీలు విడుదల చేసిన వ్యర్థాలు నదిలో కలిసి ఎస్సారెస్పీలోకి వస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు. నీరు కలుషితమవుతుండటంతో ప్రాజెక్ట్‌లో చేపలకు ప్రమాదం పొంచి ఉందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్‌లో పాప్లెట్ రకం చేపలు మాత్రమే లభిస్తున్నాయని, అక్కడక్కడా మధ్యలో పెద్ద పెద్ద చేపలు మృతి చెందుతున్నట్లు తెలిపారు. నీటి నిల్వ తగ్గి ప్రాజెక్ట్‌లో చేపలకు ఆక్సిజన్ అందక గతంలో అనేక చేపలు మృత్యువాత పడ్డాయి. ప్రాజెక్ట్ నుంచి మిషన్ భగీరథ కోసం ప్రతి రోజు 152 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తారు. నీరు కలుషితమైతే తాగు నీటికి కూడ ఇబ్బందే అవుతుంది. ఎంత ప్యూరిఫైడ్ చేసినా రసాయానాలు కలిసిన నీరు తాగడం శ్రేయస్కరం కాదని అంటున్నారు. పరీక్షలకు పంపుతాం.. ప్రాజెక్ట్‌లోని నీరు ప్రస్తుతం అధికంగా దుర్వాసన వస్తోంది. కొద్దిగా రంగు కూడ మారుతోంది. ఉన్నతాధికారులకు ఇది వరకే నివేదించాం. నీటిని పరీక్షలకు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. పరీక్షల నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాం. – చక్రపాణి, ఈఈ, ఎస్సారెస్పీ -
SRSP: ప్రమాదపు అంచుల్లో చారిత్రక కట్టడం
-
Weekend Tourist Spot: గోదావరి తీరం.. శ్రీరాముడి విహారం..
ఈ ఊరిపేరు పోచంపాడు. శ్రీరాముడు వనవాసకాలంలో ఇక్కడ సంచరించాడని స్థానికుల విశ్వాసం. అందుకే పోచంపాడులో నిర్మించిన ప్రాజెక్టు శ్రీరామ్సాగర్గా పేరు తెచ్చుకుంది. ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్‌సాగర్... చక్కటి వీకెండ్ హాలిడే స్పాట్. పిల్లల కేరింతలు, పెద్దవాళ్ల తాదాత్మ్యతతో ఈ టూర్ పరిపూర్ణమవుతుంది. మహాగమనం మహారాష్ట్రలో పుట్టిన గోదావరి గైక్వాడ్, విష్ణుపురి, బాబ్లీ ప్రాజెక్టులను దాటుకుని తెలంగాణలో అడుగుపెట్టి నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టుతో వేగానికి కళ్లెం వేసుకుంటుంది. పర్యాటకులను అలరిస్తున్న ఈ ప్రాజెక్టు నిర్మల్, జగిత్యాల్, పెద్దపల్లి, కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలకు తాగునీరు, సాగునీటికి ప్రధాన ఆధారం. పుష్కర సాగర్ పోచంపాడు గోదావరి నది పుష్కరాలకు కూడా ప్రసిద్ధి. గడచిన పుష్కరాలలో రోజుకు ఐదు నుంచి ఎనిమిది లక్షల మంది నదిలో స్నానమాచరించారు. పుష్కరాలతో ప్రమేయం లేకుండా నదిస్నానం కోసం పర్యాటకులు ప్రతి శుక్రవారం, ఇతర సెలవు దినాల్లో ఎక్కువగా వస్తారు. భవిష్యత్తులో బోటు షికారు శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులో బోటింగ్ పాయింట్‌ను ఏర్పాటు చేసి బాసర వరకు బోట్లు నడపాలని తెలంగాణ టూరిజం నిర్ణయించింది. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు నుంచి బాసరకు దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరం. ఇంతదూరం బోటు షికారు చేయడం పర్యాటకులకు అంతులేని ఆనందాన్నిస్తుందనడంలో సందేహం లేదు. టూరిజం కార్పొరేషన్ ఏర్పాట్లు చేస్తోంది. త్యాగచరిత 1963 జూలై 26న అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పోచంపాడ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 1978కి ప్రాజెక్టు పూర్తయింది. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ, నందిపేట్, నవీపేట్, ఆర్మూర్, నిర్మల్ జిల్లాలోని లోకేశ్వరం, దిలావర్పూర్, నిర్మల్ మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు వ్యవసాయ భూములు, ఇళ్లను త్యాగం చేయడంతో శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు జీవం పోసుకుంది. ఎంతెంత దూరం! ఎలా వెళ్లాలి! శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జాతీయ రహదారి 44కు మూడు కి.మీ దూరంలో ఉంది. నిజామాబాద్ నుంచి నిర్మల్ వెళ్లే బస్సులు పోచంపాడు∙మీదుగా వెళ్తాయి. ఆదిలాబాద్, నిర్మల్ నుంచి నిజామాబాద్, హైదరాబాద్‌కు వెళ్లే బస్సులన్నీ పోచంపాడు మీదుగానే ప్రయాణిస్తాయి. పోచంపాడు... హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో, నిజామాబాద్‌కు 50 కిలోమీటర్లలో, నిర్మల్ జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. – చంద్రశేఖర్, భద్రారెడ్డి, సాక్షి, నిజామాబాద్ చదవండి: Wonder of Science: బాప్రే.. ఒక్క చెట్టుకే 40 రకాల పండ్లా..!! -
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కు పోటెత్తిన వరద
-
శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్‌కు పోటెత్తిన వరద
-
TS: ప్రాజెక్టులకు భారీ వరద
సాక్షి, హైదరాబాద్: వర్షాలు ఆగకుండా కురుస్తుండటంతో గోదావరి దాని ఉప నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. దీనితో ప్రాజెక్టులన్నీ నిండటంతో.. గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పూర్తిగా నిండిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి 3 లక్షల క్యూసెక్కులకుపైన వరద వస్తోంది. దీనితో 33 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువన ఎల్లంపల్లికి ఏకంగా ఐదున్నర లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. 40గేట్లను ఎత్తి నీటిని వదిలేస్తున్నారు. ఈ వరదతోపాటు ప్రాణహిత ప్రవాహం కూడా తోడు కావడంతో కాళేశ్వరం బ్యారేజీలకు ఏడు లక్షలకుపైగా వరద కొనసాగుతోంది. 11.50 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తోంది. ► భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. 22 గేట్లు ఎత్తి 54,835 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్, పోచారం, ఏడుపాయల వనదుర్గ, ఘనపూర్ ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్నాయి. -
‘వరద’ అంచనా తప్పిందా!
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిచేరుతున్న వరద నీటిపై ప్రాజెక్ట్ అధికారుల అంచనా తప్పిందా..! అంటే అవుననే సమాధానం వస్తోంది. గత గురువారం ఉదయం ఎగువ ప్రాంతాల నుంచి 4.32 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉందని సమాచారం వచ్చినప్పుడు ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ 82 టీఎంసీలు ఉంది. ఆ సమయంలో వరద గేట్లు ఎత్తి గోదావరిలోకి నీరు విడుదల చేయాల్సి ఉండగా అధికారులు వెనకా ముందు చేశారు. కాగా, ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ 89 టీఎంసీలకు చేరిన తర్వాత అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు వరద గేట్లను ఎత్తారు. దీంతో అప్పటికే ఎగువ ప్రాంతాల్లో బ్యాక్ వాటర్ నిలిచి వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. అదే విధంగా ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు తగ్గుముఖం పడుతున్న సమయంలో నీరు నిల్వ ఉంచాల్సి ఉండగా గోదావరిలోకి నీటిని వదిలారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు 86 టీఎంసీల నుంచి 80 టీఎంసీలకు నీటి నిల్వ తగ్గిపోయింది. వాస్తవానికి 86 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి మిగతా జలాలను కిందకు వదలాలి. అయితే అనాలోచితంగా నీటిని వదలడం, అదే సమయంలో ఎగువ ప్రాంతాల నుంచి వరద తగ్గిపోవడంతో ప్రాజెక్టులో తగిన స్థాయిలో నీరు నిల్వ లేకుండా పోయింది. ప్రాజెక్టు చరిత్రను పరిశీలిస్తే ఎగువ ప్రాంతాల నుంచి లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్న సమయంలో 89 టీఎంసీల నీటిని నిల్వ ఉంచడం ఇదే తొలిసారి. అలాగే ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ 80 టీఎంసీలకు పడిపోయినా కూడా వరద గేట్ల ద్వారా లక్షన్నర క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదలడం కూడా ఇదే తొలిసారి. కాగా, నీటి నిల్వ, విడుదల విషయంలో ఉన్నతాధికారుల ఆదేశాలనే పాటిస్తున్నామని ప్రాజెక్ట్ ఈఈ చక్రపాణి తెలిపారు. -
పుట్టు వెంట్రుకలు కార్యక్రమంలో పుట్టెడు విషాదం..
బాల్కొండ: గోదావరి నదీ తీరం శోఖ సంద్రమైంది.. నదీమ తల్లికి పుట్టు వెంట్రుకలు సమర్పించుకునే శుభకార్యానికి హాజరైన కుటుంబాలు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయాయి.. గోదావరి నదిలో మునిగి ఆరుగురు మృత్యువాత పడ్డారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దిగువన నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్ వీఐపీ పుష్కరఘాట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన బొబ్బిలి శ్రీనివాస్ (40) ఆయన ఇద్దరు కుమారులు బొబ్బిలి సిద్ధార్థ (16), బొబ్బిలి శ్రీకర్ (14), మాక్లూర్ మండలం డీకంపల్లికి చెందిన జీలకర్ర సురేశ్ (44), ఆయన కుమారుడు జీలకర్ర యోగేశ్ (14), గుత్పకు చెందిన దొడ్ల రాజు (24) గోదావరిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మూడు కుటుంబాలకు చెందిన మృతులంతా దగ్గరి బంధువులే.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎస్కేప్ గేట్ల నుంచి స్వల్ప ఇన్‌ఫ్లో ఉండటంతో ఈ పుష్కర ఘాట్ వద్ద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఘాట్ మెట్లు దిగిన వెంటనే ఎక్కువ లోతు ఉంది. దీన్ని గమనించకపోవడంతో ఒకరి తర్వాత ఒకరు నీటిలో మునిగిపోయారు. ఉదయమే సందడిగా చేరుకుని.. మాక్లూర్ మండలం గుత్పకు చెందిన సూర నరేశ్ కుమారుడి కేశఖండనం కోసం కుటుంబ సభ్యులు, సమీప బంధువులంతా కలసి శుక్రవారం ఉదయం వాహనాల్లో సందడిగా గోదావరి ఒడ్డుకు చేరుకున్నారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో గోదావరిలోకి స్నానానికి వెళ్లారు. ముందుగా సిద్ధార్థ, శ్రీకర్, రవికాంత్, యోగేశ్‌లు నదిలోకి దిగారు. స్నానం చేస్తుండగా నీటి ప్రవాహానికి తట్టుకోలేక కొట్టుకుపోసాగారు. ఇది గమనించి అక్కడే స్నానం చేస్తున్న సురేశ్, శ్రీనివాస్, రాజు వారిని కాపాడటం కోసం నీటిలోకి వెళ్లారు. రవికాంత్ నీట మునుగుతూ తేలడాన్ని గమనించిన స్థానికుడైన రాజు వెంటనే కాపాడి ఒడ్డుకు చేర్చాడు. కానీ మిగతా ఆరుగురు నీటిలో మునిగిపోయారు. ఈ విషయాన్ని బంధువైన మానిక్ భండార్‌కు చెందిన పోశెట్టి గమనించి కేకలు వేయడంతో అందరూ అక్కడికి చేరుకున్నారు. స్థానికులు, గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా గంటన్నర వ్యవధిలో ఆరుగురి మృతదేహాలు ఘాట్‌కు కొద్దిదూరంలో లభించాయి. మృతదేహాలను ఒడ్డుకు చేర్చి పోస్టుమార్టం నిమిత్తం బాల్కొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాబోయే భార్యతో వచ్చి.. ఇక మృతుల్లో ఒకరైన దొడ్ల రాజుకు వివాహం నిశ్చయమైంది. వచ్చే నెలలోనే పెళ్లి జరగాల్సి ఉంది. సూర నరేశ్ కుమారుడికి మేనమామ అయిన రాజు ఈ శుభకార్యానికి కాబోయే భార్యతో కలసి వచ్చాడు. కానీ మృత్యువు ఇలా కబళించుకుపోవడం ఆ కుటుంబ సభ్యులను విషాదంలో ముంచింది. గాలింపులో ముందుగా దొడ్ల రాజు మృతదేహం బయటపడగా కొనఊపిరి ఉందన్న ఆశతో 108 అంబులెన్స్‌లో నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలపడంతో కుటుంబీకులు దుఖంతో వెనుదిరిగారు. ఇటు ఘటనా స్థలాన్ని అదనపు డీసీపీ రఘువీర్, ఆర్మూర్ ఏసీపీ రఘు, రూరల్ సీఐ విజయ్‌కుమార్ పరిశీలించారు. మిగతా వారిని కాపాడుదామనుకునేలోపే..: రాజు, ప్రత్యక్ష సాక్షి ‘మొదట నలుగురు స్నానానికి దిగారు.. నీటి ప్రవాహానికి నలుగురు కొట్టుకుపోతుండగా.. మిగతా ముగ్గురు వారిని కాపాడేందుకు కాస్త ముందుకెళ్లడంతో మొత్తం ఏడుగురు నీటిలో కొట్టుకుపోతున్నట్లు కనిపించింది. అందులో ఒకరు (రవికాంత్) నీటిలో మునుగుతూ..పైకి తేలుతూ.. కనిపించగా.. లాక్కొచ్చి ఒడ్డుకు చేర్చాను.. మిగతా వారిని కూడా తీసుకురావాలని ప్రయత్నించగా.. అప్పటికే వాళ్లు నీటి అడుగుకు చేరిపోయారు..’అని రవికాంత్ ప్రాణాలను కాపాడిన రాజు చెప్పాడు. రక్షణ చర్యలు శూన్యం.. పుష్కర్‌ఘాట్ వద్ద ప్రమాదాలు జరగకుండా నీటి పారుదల శాఖ రక్షణ చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు దారితీస్తోంది. కనీసం ప్రమాద హెచ్చరికల బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. అక్కడ సంప్రదాయం ప్రకారం నదిలో తెప్పలు విడవడం కోసం అనేక మంది ఈ ఘాట్‌కు వస్తుంటారు. వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండటంతో అప్పట్లో ఎస్కేప్ గేట్ల ద్వారా నీటిని దిగువకు వదిలారు. ఈ వరద తాకిడికి ఈ ఘాట్ల వద్ద మట్టి కోతకు గురైంది. దీంతో ఘాట్ వద్ద మోకాళ్ల మట్టుకు నీరుంటే.. ఘాట్‌కు సమీపంలోనే ఎక్కువ లోతుంది. ఈ కారణంగా ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు చెబుతున్నారు. సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ప్రమాదవశాత్తూ జారిపడి ఆరుగురు మృతి చెందిన దుర్ఘటన పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్నానం చేసేందుకు వెళ్లి దురదృష్టవశాత్తు మృత్యువాత పడడం కలచివేసిందని శుక్రవారం ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మంత్రి వేముల, ఎమ్మెల్సీ కవిత విచారం.. పుష్కర ఘాట్ వద్ద ఆరుగురి మరణం పట్ల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎంతో కలిచివేసిందన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరారు. సీఎం కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి మృతుల కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేస్తామన్నారు. ఇటు దుర్ఘటన పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వీరు ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు. -
మెండోరో మండలం పోచంపాడులో విషాదం
-
గోదావరిలో ఏడుగురు గల్లంతు, ఆరుగురు మృతి
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మెండోరా మండలం పోచంపాడు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద గోదావరిలో స్నానం చేస్తుండగా ఏడుగురు నీట మునిగారు. వీరిని గమనించిన స్థానికులు గోదావరిలోకి దూకి గాలింపు చేపట్టారు. ఏడుగురి ఒక వ్యక్తి ప్రాణాలతో సురక్షితంగా బయటపడగా.. మరో ఆరుగురు గల్లంతయ్యారు. ముమ్మర గాలింపు అనంతరం ఆరు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులంతా మాక్లూర్, డీకంపల్లి, గుత్స, నిజామాబాద్, ఎల్లమ్మగుట్టకు చెందిన జీలకర్ర సురేష్, యోగేష్, బొబ్బిలి శ్రీనివాస్, సిద్ధార్థ్, శ్రీకర్, దొడ్లే రాజుగా గుర్తించారు. కాగా ఘటన స్థలానికి చేరుకున్న మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా ప్రతి శుక్రవారం గోదావరిలో తెప్ప దీపం సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తుంటారు. ఈ క్రమంలో ఈరోజను ఉదయం స్నానాలు చేసేందుకు నదిలో దిగిన సమయంలో ప్రమాదవశాత్తూ ఇద్దరు చిన్నారులు నదిలోకి జారీపోయారు. వారిని కాపాడేందుకు మరో అయిదుగురు నదిలోకి దిగారు. వారిలో ముగ్గురు పెద్దలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. -
కాల్వలతో కాదు.. పైపులతో పారిద్దాం
ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు కాల్వల ద్వారా నీరందుతుంది. ప్రధాన కాల్వల నుంచి పిల్ల కాల్వల ద్వారా సాగునీరు రైతుల పొలాలకు చేరుతుంది. అయితే ముందుగా తమ క్షేత్రానికి నీరు అందాలనే ఆత్రంలో పిల్ల కాల్వలకు, గట్లకు గండికొట్టడం ద్వారా నీళ్లు మళ్లిస్తుంటారు. ఫలితంగా రైతుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటాయి. పైపెచ్చు కాల్వల ద్వారా సాగునీటిని అందించే క్రమంలో దాదాపు 30 శాతం వరకు నీరు వృథా అవుతుంది. అలాకాకుండా మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీరందినట్లుగా... పైపుల ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరందితే ఎలాగుంటుంది? అద్భుతం కదూ! నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లోని 2 లక్షల ఎకరాలకు ఇలాగే పైపుల ద్వారా నీరందనుంది. పంటకు నీరు పెట్టాలనుకుంటే చేనుకు సమీపంలోని వాల్వ్‌ను స్వయంగా రైతులు తిప్పుకోవచ్చు. ఈ రెండు లక్షల ఎకరాల్లో ప్రధానంగా వరి సాగవుతోంది. పైపుల ద్వారా సాగునీరు అందడం వల్ల పంట మార్పిడికి అవకాశం ఏర్పడనుంది. రైతులు వరికి బదులు అరుతడి, వాణిజ్య పంటలు వేసుకునే వెసులుబాటు ఉంటుంది. సాగునీటిని తీసుకొచ్చే పైపులకు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్‌ను అనుసంధానిస్తే సరిపోతుంది. పైపుల ద్వారా సరఫరా కాబట్టి నీటి వృథా గణనీయంగా తగ్గుతుంది. దీనికి డ్రిప్ తోడైతే... ప్రతి చుక్కా సద్వినియోగం కానుంది. చివరి ఆయకట్టును దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా పైపులైన్ ద్వారా నీటి సరఫరా వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ–21 కింద చేపట్టిన ఈ పైప్‌లైన్ వ్యవస్థ నిర్మాణాలు యుధ్ద ప్రాతిపదికన జరుగుతుండగా, ఈ వానాకాలంలోనే తొలిసారి దీనికింద 20 వేల ఎకరాలకు ఆయకట్టుకు నీరిచ్చేలా పనులు పూర్తి చేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఫోర్‌షోర్ నుంచి నీటిని తీసుకుంటూ నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేలా కాళేశ్వరంలో ప్యాకేజీ–20, 21, 21(ఎ) పనులు చేపట్టారు. ప్యాకేజీ–20లో బినోల సమీపంలోని ఎస్సారెస్పీ ఫోర్‌షోర్ నుంచి అప్రోచ్ చానల్, 17.82 కిలోమీటర్ల టన్నెల్, 30 మెగావాట్ల సామర్థ్యంతో ఉన్న 3 మోటార్లతో సారంగాపూర్ వద్ద పంప్‌హౌస్ నిర్మాణ పనులు చేయాల్సి ఉంది. రూ.935 కోట్లతో చేపట్టిన ఈ పనులు 85 శాతం వరకు పూర్తయ్యాయి. సారంగాపూర్ పంప్‌హౌస్ నుంచి నిజాంసాగర్ కెనాల్‌కు నీటిని ఎత్తిపోసి అక్కడి నుంచి రెండు మార్గాల్లో పైప్లైన్ల ద్వారా 2 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేలా పనులు చేపట్టారు. సాధారణంగా కాల్వల నిర్మాణం చేపడితే 7 వేల నుంచి 8 వేల ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంటుంది. అదే పైప్‌లై¯Œ వ్యవస్థ అయితే భూమిలో ఒకటిన్నర మీటర్ల కింద భూగర్భాన పైప్‌లైన్ ఏర్పాటు చేస్తారు. తద్వారా పైన యథావిధిగా వ్యవసాయం చేసుకునే అవకాశముంది. భూసేకరణ తప్పుతుంది. ఇక కాల్వల ద్వారా నీటి వృథా దాదాపు 30 శాతం వరకు ఉండగా... పైప్‌లై¯న్‌తో వృథా అతి తక్కువ. దీంతోపాటు పైప్‌లై¯న్‌తో చివరి ఆయకట్టు వరకు నీటిని అందించవచ్చు. నిర్ణీత ఆయకట్టులో రెండో పంటకు సైతం నీరు అందించవచ్చనే అంచనాతో ఈ పనులు చేపట్టారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అమలవుతున్న ఈ వ్యవస్థను మోడల్‌గా తీసుకొని రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టారు. పంప్‌హౌస్‌లో సిద్ధమైన మోటార్లు పైప్‌లైన్ నిర్మాణ పనులు ఇలా... ఎస్సారెస్పీ ఫోర్‌షోర్ నుంచి నిజాంసాగర్ కెనాల్లోకి చేరే నీటిని రెండు భాగాలుగా విభజించి నీటిని తరలించేలా పైప్‌లైన్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఒక పైప్‌లైన్ వ్యవస్థను మెట్పల్లి సెగ్మెంట్‌గా, మరో పైప్‌లైన్ వ్యవస్థను గడ్కోల్ సెగ్మెంట్‌గా విభజించి పనులు చేపట్టారు. ఫోర్‌షోర్ నుంచి నీటిని తరలించే క్రమంలో నిజాంసాగర్ కెనాల్‌ను 23.10 కిలోమీటర్ల మేర వెడల్పు చేసే పనులు, గడ్కోల్ సెగ్మెంట్‌కు నీటిని సరఫరా చేసే అప్రోచ్ చానల్, టన్నెల్, పంప్‌హౌస్ నిర్మాణ పనులను ప్యాకేజీ–21 కింద చేపట్టారు. ఈ ప్యాకేజీని మొత్తంగా రూ.807 కోట్లతో చేపట్టగా, రూ.372 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు పూర్తి కావాల్సి ఉంది. అయినప్పటికీ లభ్యత నీటిని తీసుకుంటూ మెట్పల్లి సెగ్మెంట్లో కొంత భాగానికి నీటిని తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మెట్పల్లి సెగ్మెంట్లో 1.15 లక్షల ఎకరాలు (11.7 టీఎంసీ), గడ్కోల్ సెగ్మెంట్లో 85 వేల ఎకరాలకు(8 టీఎంసీ) నీరందించేలా ప్యాకేజీ–21(ఎ) కింద పనులను రూ. 2,950.31 కోట్లతో చేపట్టారు. ఇందులో ఇప్పటికే 1,430కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. తొలి ప్రాధాన్యతగా మెట్పల్లి సెగ్మెంట్ పరిధిలోని ప్రధాన పైప్‌లైన్ వ్యవస్థను పూర్తి చేసి దీనికింద ఈ వానాకాలంలోనే 20 వేల ఎకరాలకు పైపుల ద్వారా నీటిని అందించేలా పనులు జరుగుతున్నాయి. మిగతా ఆయకట్టుకు వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి నీరివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గడ్కోల్ సెగ్మెంట్ పరిధిలో 3.5 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం చేయాల్సి ఉంది. దీనికింద భూసేకరణ సమస్యలు ఉండటంతో దీని పనులను రెండో ప్రాధాన్యం కింద పెట్టుకున్నారు. నీటి తరలింపు ఇలా... తొలి ప్రాధాన్యంగా తీసుకున్న మెట్పల్లి సెగ్మెంట్ కింద 1.15 లక్షల ఎకరాల్లో 20 వేల ఎకరాలకు ఈ వానాకాలంలో నీటి తరలించేలా ప్రస్తుతం పైప్‌లైన్ వ్యవస్థ సిధ్దమైంది. నిజాంసాగర్ కాల్వల నుంచి వచ్చే 650 క్యూసెక్కుల నీటిని పైప్లైన్లోకి తోసేలా మెంట్రాజ్‌పల్లి (డిచ్పల్లి మండలం)లో పంప్‌హౌస్ ఏర్పాటు చేస్తున్నారు. 2.5 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 10 మోటార్ల ద్వారా నీటిని 92 మీటర్ల మేర లిఫ్టు చేసి నిర్ణీత నీటిని 3 మీటర్ల డయాతో ఉండే ఒకే ఒక్క పెద్ద ఎంఎస్ పైప్‌లోకి తరలించేలా పంప్‌హౌస్‌ను నిర్మిస్తున్నారు. ఈ పంప్‌హౌస్ పనులు 90 శాతం పూర్తయ్యాయి. దీనికి విద్యుత్‌ను అందించే సబ్‌స్టేషన్ నిర్మాణం పనులు వేగిరం చేశారు. ఈ పైప్లైన్లోకి నీటిని తరలించే క్రమంలో ఎలాంటి చెత్తాచెదారం రాకుండా మూడు దశల్లో నీటిని ఫిల్టర్ చేసేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రధాన పైప్‌లైన్ నుంచి నీటిని వివిధ జోన్ల కింది ఆయకట్టుకు తరలించేలా మరో చిన్న పైప్‌లైన్ వ్యవస్థ, ఈ వ్యవస్థ నుంచి జోన్ల పరిధిలోని ఆయకట్టుకు నీటిని అందించేలా మరో పిల్ల పైప్‌లైన్ వ్యవస్థను మూడు రకాల పైపులతో సిధ్దం చేస్తున్నారు. పైప్‌లైన్ వ్యవస్థలో భాగంగా నిర్మిస్తున్న మెంట్రాజ్‌పల్లి పంప్‌హౌస్ ప్రధాన పైప్‌లైన్ 3 మీటర్ల నుంచి ఒక మీటర్ వరకు ఉండే ఎంఎస్ పైపుల వ్యవస్థ కాగా, ఈ పైప్‌లైన్ నుంచి నీటిని 900 మిల్లీమీటర్ల నుంచి 350 మిల్లీమీటర్లు ఉండే డీఐ పైపులు, అటునుంచి 315–40 మిల్లీమీటర్లు ఉండే హెచ్డీపీఈ పైపుల ద్వారా నిర్ణీత ఆయకట్టుకు నీటిని అందిస్తారు. మెట్పల్లి సెగ్మెంట్ పరిధిలో 88.17 కిలోమీటర్ల మేర ఎంఎస్ పైపుల నిర్మాణం చేయాల్సి ఉండగా, ఇందులో 75.37 కిలోమీటర్ల వ్యవస్థ పూర్తయింది. 192 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూటరీ పైప్‌లైన్‌లో 114 కిలోమీటర్లు, 3,319 కిలోమీటర్ల హెచ్డీపీఈలో 1,052 కిలోమీటర్లు మేర పూర్తి చేశారు. పెద్ద పైపులైన్ నుంచి డీఐ, హెచ్డీపీఈ పైపులకు నీటిని తరలించే క్రమంలో ఓఎంఎస్ చాంబర్, డిస్ట్రిబ్యూటరీ చాంబర్స్ అని ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారానే ఎంతమేర నీటిని తరలించాలి, ఏ ప్రాంతానికి నీటిని తరలించాలి అన్నది నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే 20 కిలోమీటర్ల మేర నీటిని తరలించేలా పైప్‌లైన్ వ్యవస్థ 95 శాతం పూర్తవగా, మార్చి చివరికి 100 శాతం పనులు పూర్తి చేయనున్నారు. కొన్ని అడ్డంకులు... ఈ పైప్‌లైన్ పనులకు ప్రధానంగా భూసేకరణ లేకున్నా... రైతులు సాగు చేస్తున్న భూముల్లోంచే పైపులు వేయాల్సి ఉంది. భూమిని తవ్వి 1.20 మీటర్ల దిగువన పైపులు వేయాలి. ఆ లైన్లు వెళుతున్న మార్గాలన్నీ ప్రస్తుతం సాగులో ఉన్న భూములే కావడంతో పనులకు రైతులు అడ్డుపడుతున్నారు. వ్యవసాయ పనులు సాగని రెండు నుంచి మూడు నెలల వ్యవధిలో మాత్రమే పైపులు వేయాల్సి వస్తోంది. దీంతో ఈ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. పైపులు వెళ్లే భూములకు నష్టపరిహారం చెల్లిస్తే యాసంగి సీజన్లో పనులు పూర్తి చేస్తామని ఏజెన్సీ సహా ప్రజాప్రతినిధులు కోరినా ప్రభుత్వం దీనికి అంగీకరించకపోవడంతో రైతుల సమ్మతి దొరికిన చోటే పనులు కొనసాగించాల్సి వస్తోంది. దీనికి తోడు ఓఎంఎస్ ఛాంబర్స్, డిస్ట్రిబ్యూటరీ ఛాంబర్స్ నిర్మాణాలకు గుంట కన్నా తక్కువ భూమే అవసరమవుతున్నా, దాన్ని ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. ఇక రెండు చోట్ల రైల్వే క్రాసింగ్, నేషనల్ హైవే క్రాసింగ్‌లు వెళుతున్నాయి. మరోవైపు నిజాంసాగర్ కాల్వల వెడల్పుకు దాని పరిధిలోని భూ ఆక్రమణలు, పంటల సాగు ఇబ్బందిగా పరిణమిస్తోంది. ఈ సమస్యలను పరిష్కరించుకుంటూ ప్రస్తుతం పనులు కొనసాగిస్తున్నారు. ఈ చాంబర్లు ఎలా పనిచేస్తాయంటే.. చివరి ఆయకట్టు వరకు నీటిని తరలించేలా ఓఎంఎస్ (ఔట్లెట్ మేనేజ్మెంట్ సిస్టమ్) చాంబర్ ఏర్పాటు చేస్తుండగా, ఈ ఛాంబర్లోకి వచ్చిన నీటిని 3 నుంచి 6 ఔట్లెట్ పైపుల ద్వారా బయటకు పంపించేలా ఏర్పాట్లుంటాయి. ఔట్లెట్ పైపుల ద్వారా నీటిని తరలించే వాల్వ్‌లను పూర్తిగా సాంకేతిక సహాయంతోనే ఆపరేట్ చేసేలా దీన్ని తీర్చిదిద్దారు. ఎంతమేర నీటిని తరలిస్తున్నారన్నది తెలుసుకునేలా దీనిలో వాటర్ మీటర్, ప్రెషర్ మీటర్లు అమర్చారు. దీనికి అవసరమయ్యే విద్యుత్‌కై సోలార్‌ను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం నిర్ణయించిన 20 వేల ఎకరాల పరిధిలోనే 1,892 ఓఎంఎస్ చాంబర్స్ నిర్మాణం పూర్తయింది. ఇక్కడి నుంచి ఔట్లెట్ ద్వారా తరలించే ఒక్కో పైప్‌లైన్‌కు దిగువన ప్రతి 3 ఎకరాలకు నీటిని అందించేలా మళ్లీ 5–7 వరకు చిన్న పైపుల ద్వారా నీటిని తరలించేందుకు డిస్ట్రిబ్యూటరీ చాంబర్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఛాంబర్స్‌లో ఉండే పైపులన్నింటికీ వాల్వ్‌లను బిగించారు. అవసరమైతేనే నీటిని వాడుకునేలా ఈ వాల్వ్‌లు ఉపయోగపడతాయి. వాటిని రైతులే ఆపరేట్ చేసుకుంటారు. -
వెయ్యి చెరువుల తోట.. హరిత సూర్యాపేట
నీళ్లు లేక.. నింపే దిక్కులేక వట్టిపోయి నిర్జీవంగా మారిన చెరువులు. సాగు అవసరాలేమోగానీ పశువుల తాగునీటికి కటకటే. చెరువులు, వాగులు, వంకలు, బావులు ఎండిపోయి కనిపించేవి. వర్షాధార పంటలతో, అరకొర దిగుబడులతోనే రైతులు నెట్టుకొచ్చేవారు. ఇప్పుడు ఆ గ్రామాలకు కొత్త కళ వచ్చింది. ఎక్కడో నాలుగు వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించి వచ్చి చేరిన నీటితో చెరువులన్నీ మత్తడి దూకుతున్నాయ్. ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద కాల్వలన్నీ గోదావరి నీటితో నిండుగా ప్రవహిస్తుండటంతో సూర్యాపేట జిల్లాలోని చివరి ఆయకట్టు నీటి తడులతో ఆకుపచ్చ తివాచీ పరచినట్లు కనిపిస్తోంది. సాక్షి: హైదరాబాద్: జలం ఉంటేనే జీవం. పచ్చని పంటలు. గొడ్డూ గోదా. ఊరంతా కోలాహలం. రైతు కళ్లలో వెలకట్టలేని ఆనందం. సొంతూరిని నమ్ముకొని సాఫీగా సాగే బతుకులు. కాలం కాకపాయె... కలలు చెదిరిపాయె! అవన్నీ పదిహేను, పదహారేళ్ల కిందటి వరకు నీళ్లు లేక.. నింపే దిక్కులేక వట్టిపోయి నిర్జీవంగా మారిన చెరువులు. సాగు అవసరాలు పక్కనపెడితే కనీసంగా పశువులకు తాగునీటి అవసరాలను కూడా తీర్చే పరిస్థితులు లేక బోసిపోయి కనిపించేవి. చెరువుల్లో నీరు లేక బావులు అడుగంటగా, బోర్లలో నీరు పాతాళానికి చేరిపోయేది. అలాంటి పరిస్థితుల్లో వర్షాధార సాగుతో, అరకొర దిగుబడులతోనే రైతులు నెట్టుకొచ్చేవారు. అమ్ముకుందామన్నా భూములకు ధరలు లేక...ఊళ్లకు ఊళ్లే వలసలతో బోసిపోయేవి. అలాంటి గ్రామాలకు ఇప్పుడు కొత్త మురిపెం వచ్చింది. ఎక్కడో నాలుగు వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించి వచ్చి చేరిన నీటితో చెరువులన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద కాల్వలన్నీ గోదావరి నీటితో నిండుగా ప్రవహిస్తుండటంతో సూర్యాపేట జిల్లాలోని చివరి ఆయకట్టు నీటి తడులతో పచ్చగా కనిపిస్తోంది. వేసవి సమయంలోనూ చెరువులు అలుగు దుంకుతుండటంతో పరీవాహక పల్లెలు పులకిస్తున్నాయి. నిండిన చెరువుల కింద సాగు పెరగడం, భూముల ధరలకు రెక్కలు రావడంతో రైతుల సంబురం అంబరాన్ని అంటుతోంది. సంబురం నింపిన గోదారి ఎస్సారెస్పీ ప్రాజెక్టులో ప్రధానమైన కాకతీయ కాల్వ 284 కిలోమీటర్లు ఉండగా, దాని కింద 9.6 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనికి కొనసాగింపుగా కాకతీయ కాల్వ 284వ కిలోమీటర్ నుంచి 346 కి.మీ వరకు విస్తరణే లక్ష్యంగా ఎస్సారెస్పీ స్టేజ్–2 చేపట్టారు. దీని ద్వారా తీవ్ర అనావృష్టిని ఎదుర్కొంటున్న వరంగల్ రూరల్, ఖమ్మం, జనగాం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో 3.97 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. రూ.1,220 కోట్లతో చేపట్టిన ఈ పనుల్లో భాగంగా కాకతీయ కాల్వల తవ్వకంతో పాటు 14 నీటి పంపిణీ కాల్వలు (డిస్ట్రిబ్యూటరీలు) తవ్వకం చేశారు. ముఖ్యంగా చివరి ఆయకట్టు ప్రాంతమైన సూర్యాపేట జిల్లాలో డీబీఎం–69, 70, 71 కింద 156 గ్రామాల పరిధిలో 2.13 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, 900ల వరకు చెరువులున్నాయి. వీటిని 2019 నవంబర్ నుంచి నింపుతూ వస్తున్నారు. గతేడాది ఖరీఫ్‌లో నీటి లభ్యత ఉండటంతో ఈ చెరువులకు నీటి విడుదల అవసరం పడలేదు. చదవండి: (‘ఎల్ఆర్ఎస్’ ఆధారంగా ఇకపై పన్నుల వడ్డన) ప్రస్తుతం యాసంగి సాగు జరుగుతుండటంతో కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ఎస్సారెస్పీ కాల్వలకు నీటి విడుదల కొనసాగుతోంది. అందులో భాగంగానే చివరి చెరువు వరకు నీరు చేరుతోంది. చిట్టచివర ఉన్న చెరువులను మొదట నింపేలా టెయిల్–టు–హెడ్ విధానం ద్వారా నీటిని సరఫరా చేస్తుండటంతో సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాల్లో చెరువులన్నీ 100% నిండుతున్నాయి. వాటి కిందే 55 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందుతోంది. ఇంతవరకూ గోదావరి జలాలను ఎరుగని పరీవాహక రైతులు ప్రస్తుతం నిండుతున్న చెరువులు, పారుతున్న కాల్వల కారణంగా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎస్సారెస్పీ కాల్వలకు లైనింగ్ చేయకపోవడం కొంత ఇబ్బందిగా మారుతోంది. ఒక్క సూర్యాపేట జిల్లాలోనే రూ.300 కోట్లతో కాల్వల ఆధునికీకరణకు ప్రతిపాదనలు పంపినా అవి ఇంతవరకు ఆమోదం పొందలేదు. ఈ కాల్వల లైనింగ్ పనులు పూర్తయితే పూర్తి సామర్థ్యంతో కాల్వలకు నీటిని పారించే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు ఆనవాళ్లు కోల్పోయి... ఇప్పుడదే ఆదరువు ఈ చెరువు సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని పెద్దచెరువు. కాకతీయుల కాలం నాటికి ఈ చెరువు ఫీడర్ చానళ్లు పూడుకుపోయి, పరీవాహకమంతా ధ్వంసమై పదిహేనేళ్లుగా వట్టిపోయి కనిపించేది. నీటి చుక్క కనిపించక దీని చుట్టూతా ఎడారిని తలపించేది. దీని పరిధిలోని 324 ఎకరాల ఆయకట్టులో ఎన్నడూ పదిహేను శాతం కూడా సాగైంది లేదు. అలాంటిది ఇప్పుడు 400 కిలోమీటర్ల నుంచి వస్తున్న గోదావరి జలాలతో పులకిస్తోంది. ఎస్సారెస్పీ స్టేజ్–2 కాల్వల ద్వారా నిరంతరాయంగా నీటి విడుదల కొనసాగుతుండటంతో ఏకంగా అలుగు దుంకుతోంది. పెద్దపెద్ద చేపలు చెరువులో సందడి చేస్తున్నాయి. ఈ ప్రాంతంలో ముంబైకి వలస వెళ్లిన వారు తిరిగి గ్రామాలకు చేరుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు. వ్యవసాయానికి పనికిరాని గుట్టలను సైతం నీళ్లొచ్చాయన్న సంతోషంతో చదును చేసి పంట సాగు మొదలుపెట్టారు. ‘ఈ చెరువు నిండక ముందు మూడెకరాల్లోనే సాగు చేసే వాణ్ని. కానీ ఇప్పుడు ఏడెకరాల్లో వరి సాగు చేశా. మొత్తం పంటకు నీరందుతోంది. బోర్లు, బావుల వాడకం పూర్తిగా తగ్గించా’అని ఆ చెరువు పరిధిలోని ఆయకట్టు రైతు అనంతుల సత్తయ్య పేర్కొన్నారు. పెద్ద చెరువును పరిశీలిస్తున్న ఇంజనీర్లు ‘సారు'ంటే.. గుండెలు పొంగేవి! ఈ చెరువు దివంగత సాగునీటి రంగ నిపుణుడు ఆర్. విద్యాసాగర్‌రావు స్వగ్రామం జాజిరెడ్డి గూడెంలోని తీగల చెరువు. పక్కనే మూసీ నది పారుతున్నా ఏనాడూ నిండింది లేదు. చిన్నపాటి లిఫ్టు ద్వారా ఈ చెరువు, దాని పరిధిలోని ఆయకట్టుకు నీరివ్వాలని తలంచినా సాధ్యపడలేదు. అయితే విద్యాసాగర్‌రావు చొరవతో ఎస్సారెస్పీ స్టేజ్–2 పనులను పూర్తి చేయడంతో ఈ చెరువు ప్రస్తుతం నిండి దీని కింద ఆయకట్టు 800 ఎకరాలు సాగులోకి వచ్చింది. ఈ చెరువులోకి నీళ్లొచ్చాకే ఇక్కడ ఎకరం భూమి రూ. 5 లక్షల నుంచి రూ. 25 లక్షలకు పెరిగింది. ‘నిండని చెరువుతో అరకొరగా వ్యవసాయం చేసే వాళ్లంతా నీళ్లొచ్చాక రెండు పంటలు సాగు చేస్తున్నారు. కందులు, పెసలు, పత్తి సాగు చేసే వాళ్లు వరికి మళ్లారు. ఎకరాకి 40 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. గతంలో 8 బోర్లు వేసినా పడలేదు. కానీ ఇప్పుడు ఆ అవసరమే లేదు. ఎస్సారెస్పీ కాల్వల లైనింగ్ జరిగితే మరింత మేలుంటుందని గ్రామానికి చెందిన రైతులు పున్న హరిప్రసాద్, చింత నర్సయ్యలు పేర్కొన్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్నది నాగారం మండల పరిధిలో ఎస్సారెస్పీ కాల్వలకు దగ్గరగా కొత్తగా సాగులోకి వస్తున్న భూమి. కాల్వల్లో నీరు పారకం ఇకపై ఆగదన్న భరోసాతో ఇప్పటికే కొంత పొలంలో నాట్లు వేయగా, మరింత బీడు భూమిని సాగులోకి తెచ్చేలా రైతులు దున్నటం మొదలు పెట్టారు. ఇప్పటికే కొంత బీడు భూమిని సాగులోకి తెచ్చే యత్నాల్లో ఉండగా, ఇకముందే మొత్తం భూమిని సాగు చేస్తానని రైతులు చెబుతున్నారు. రావి చెరువు పక్కన కనిపిస్తున్నది సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండల పరిధిలోని మాచవరం గ్రామంలోని రావి చెరువు. 0.24 టీఎంసీ సామర్థ్యం గల ఈ చెరువు 16 ఏళ్లలో ఏనాడూ నిండింది లేదు. దీని కింద 200 ఎకరాల ఆయకట్టు ఉండగా బోర్లు, బావుల కిందే ఆరుతడి పంటల సాగు జరిగేది. ఈ చెరువు కింద ఏనాడూ రెండో పంట వేసింది లేదు. వేసవి వస్తే బోర్లు పనిచేయక, తాగునీరు లేక ట్యాంకర్లు పెట్టి ఇంటింటికీ బిందెలను లెక్కగట్టి సరఫరా చేసేవారు. అలాంటి చెరువు ప్రస్తుత సమయంలోనూ నిండుకుండను తలపిస్తోంది. కాళేశ్వరం నుంచి 450 కి.మీ. దూరం దాటుకొని ఎస్సారెస్పీ స్టేజ్–2 కాల్వల ద్వారా వచ్చిన గోదారి జలాలతో కళకళలాడుతోంది. మూడుకిస్తామన్నా పోలే... ఇప్పుడు ఎకరా రూ. 30 లక్షలు నిర్ణీత ఆయకట్టుకు అదనంగా మరో 200 ఎకరాలకు సాగునీటిని అందిస్తోంది. నీళ్లు నిండుగా ఉండటంతో గతంలో 15–18 మీటర్ల దిగువన ఉండే భూగర్భ జలాలు ప్రస్తుతం 3 మీటర్లలోనే లభ్యతగా ఉన్నాయి. ‘16 ఏళ్లలో ఎప్పుడూ చెరువు నిండలేదు. ఎన్నోసార్లు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా అవుతోంది. ఇక్కడి చెరువుల్లో చేపలు భారీగా చేరాయి. 8 నెలలు చేపలనే తింటున్నారు. ఒక్కోటి 6–8 కిలోలు ఉంటుంది’ అని గ్రామానికి చెందిన మురహరిరెడ్డి, బొబ్బయ్యలు తెలిపారు. తెలంగాణ వస్తే ఏ మొస్తుందన్న దానికి... ఈ ఊరికే చేరిన నీళ్లే తార్కాణమని ఎంపీపీ నిమ్మాది భిక్షం పేర్కొన్నారు. నీళ్ల రాకతో రూ. 3 లక్షలు కూడా రాని ఎకరా పొలం ఇప్పుడు రూ. 30 లక్షలు పలుకుతోందని చెప్పారు. తీగలచెరువు -
పక్షం రోజులు.. 127 టీఎంసీలు
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఈ సారి భారీ వరద పోటెత్తింది. పక్షం రోజుల్లోనే ఏకంగా 127 టీఎంసీల మిగులు జలాలు వృథాగా గోదావరిలోకి వెళ్లిపోయాయి. ప్రాజెక్టు ఎగువన ఉన్న మహారాష్ట్రలోని సాగునీటి ప్రాజెక్టుల నుంచి 15 రోజులుగా రోజూ లక్ష నుంచి లక్షన్నర క్యూసెక్కుల వరద జలాలు తరలివస్తున్నాయి. దీంతో ఎస్సీరెస్పీ ప్రాజెక్టు వరద గేట్లను ఎత్తి అదే స్థాయిలో నీటిని నదిలోకి వదులుతున్నారు. ఈ ఏడాది వర్షాకాలం సీజన్ ప్రారంభమైన జూన్ 1 నుంచి ప్రాజెక్టులోకి సుమారు 234 టీఎంసీల నీరు వచ్చినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు నిండిపోగా, మిగిలిన జలాలను గోదావరిలోకి వదిలి పెడుతున్నారు. వరద కాలువ ద్వారా మిడ్‌మానేరు జలాశయానికి తరలిస్తున్నారు. అలాగే, కాకతీయ, సరస్వతి, లక్ష్మీకాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. కాగా, అక్టోబర్ 28 వరకు మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తే ఉంచుతారు. దీంతో అక్టోబర్‌లో కూడా ప్రాజెక్టుకు వరద జలాల రాక కొనసాగుతుందని అధికారులు తెలిపారు. మొదట 112 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులోకి భారీగా సిల్ట్ చేరడంతో నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలకు పడిపోయింది. ఐదేళ్లలో ఇన్‌ఫ్లో ఇలా.. ఇదిలా ఉండగా గత ఐదేళ్లలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వచ్చిన ప్రవాహాలను పరిశీలిస్తే.. 2014–15లో కేవలం 14.77 టీఎంసీలు మాత్రమే ఇన్‌ఫ్లో వచ్చింది. 2015–16లో మరీ తక్కువగా 4.42 టీఎంసీల ఇన్‌ఫ్లో మాత్రమే వచ్చి చేరింది. ఇక 2016–17లో 254 టీఎంసీలు రాగా, 2017–18లో 85 టీఎంసీల వరద మాత్రమే వచ్చింది. 2019–20లో 87 టీఎంసీల ఇన్‌ఫ్లో వచ్చింది. ఈసారి ఇప్పటికే 234 టీఎంసీల వరద జలాలు వచ్చాయి. రబీ పంటలకు భరోసా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలో ఎస్సారెస్పీ ప్రాజెక్టు ఆయకట్టు ఉంది. స్టేజ్ –1 పరిధిలో 9.68 లక్షల ఆయకట్టు ఉండగా, స్టేజ్–2లో మరో ఐదు లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో ఖరీఫ్ పంటలతో పాటు రబీ పంటలకు కూడా సాగునీరందనుంది. దీంతో ఆయకట్టు రైతులకు భరోసా ఏర్పడింది. -
నిండుకుండలా వున్న శ్రీరాం సాగర్ ప్రాజెక్టు
-
దిగువమానేరు, శ్రీరాం సాగర్ గేట్ల ఎత్తివేత
సాక్షి, కరీంనగర్: అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత రాత్రి పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. వాగులు వంకలన్ని పొంగిపొర్లుతున్నాయి. చెరువులు కుంటలు అలుగు పారుతుండగా ప్రాజెక్టులన్నీ నిండుకుండను తలపిస్తుండడంతో అధికారులు గేట్లు ఎత్తారు. కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేరు డ్యామ్‌కు వరద పోటెత్తింది. మోయతుమ్మెద వాగు ద్వారా 47 వేల క్యూసెక్కుల వరద, మీడ్ మానేర్ నుంచి 19 వేల క్యూసెక్కుల నీరు ఎల్ఎండీకి చేరుతుంది. దీంతో అధికారులు 20 గేట్లు ఎత్తి 57,652 క్యూసెక్కుల నీటిని మానేరు వాగులోకి, మరో రెండు వేల క్యూసెక్కుల వాటర్‌ను కాకతీయ కాలువకు వదులుతున్నారు. మిడ్ మానేర్‌కు ఎస్సారెస్పీ వరద కాలువ ద్వారా 15 వేలు, మూలవాగు ద్వారా మరో 8వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో ఎంఎంఆర్‌కు చెందిన 6 గేట్లు ఎత్తి 19వేల క్యూసెక్కుల నీటిని దిగువ మానేరు డ్యామ్‌కు వదులుతున్నారు. ఎగువ మానేర్ నర్మాల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి అలుగు పారుతుంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎస్ఆర్ఎస్పీ కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గోదావరి ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు లక్షా 52వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండటంతో 15గేట్లు ఎత్తి 1,43,865 క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి వదులుతున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మంథని నియోజకవర్గంలో నిర్మించిన సుందిళ్ల పార్వతి బ్యారేజ్, అన్నారం సరస్వతి బ్యారేజ్, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌లకు భారీగా వరద వస్తుండడంతో ఆయా బ్యారేజీల గేట్లన్ని ఎత్తి దిగువకు లక్షలాది క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టుల గేట్లను ఎత్తడంతో అటు గోదావరి మానేరు వాపులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. తీర ప్రాంత ప్రజలను అధికారులతో పాటు మంత్రి గంగుల కమలాకర్ అప్రమత్తం చేశారు. వర్షం వరదలు అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత నెలలో కురిసిన వర్షాలతో నీట మునిగి పంట నష్టపోయిన రైతులు ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా మరోసారి వర్షం వరదలు అపార నష్టాన్ని మిగిల్చాయి. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు 40 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల ఇన్ ఫ్లో రెండు లక్షల 21 వేల క్యూసెక్కు లు అవుట్ ఫ్లో రెండు లక్షల 21 వేల క్యూసెక్కు లు వరద గేట్ల ద్వారా రెండు లక్షలు, కాలువల ద్వారా 21 వేల క్యూసెక్కుల నీటి విడుదల పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు, 90 టీఎంసీలు ప్రస్తుత నీటిమట్టం 1091 అడుగులు, 90 టీఎంసీలు లోయర్ మానేరు డ్యామ్ 20 గేట్లు ఎత్తి, 57652 క్యూసెక్కుల నీటిని మానేరు వాగులోకి విడుదల. ఇన్ ఫ్లో 59961 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో 59961 క్యూసెక్కులు. పూర్తి స్థాయి నీటి నిలువ సామర్థ్యం 24.034 టీఎంసీలు ప్రస్తుతం నీటి నిలువ 23.645 టీఎంసీలు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు 25 గేట్లు ఎత్తి, 72509 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల. ఇన్ ఫ్లో 72518 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో 73157 క్యూసెక్కులు. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు ప్రస్తుతం నీటి నిలువ 19.397 టీఎంసీలు. -
తరలివచ్చిన జలతరంగిణి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విస్తారంగా కురిసిన వర్షాలతో పెరిగిన నీటి లభ్యత, ఎగువ కాళేశ్వరం ద్వారా తరలివచ్చిన గోదావరి జలాలతో శ్రీరాం సాగర్ ప్రాజెక్టు పరీవాహకం ఉప్పొంగుతోంది. గత యాసంగి సీజన్లకు భిన్నంగా ఈ ఏడాది ఎస్సారెస్పీ–1, 2 కింద పూర్తి ఆయకట్టుకు నీరందించడంతో పాటు గరిష్టంగా 65 టీఎంసీల మేర నీటి వినియోగం జరిగింది. మరో 20 నుంచి 25 టీఎంసీల నీటిని మార్చి చివరి వరకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండటంతో రైతులకు ఉపశమనం కలుగుతోంది. కొత్తగా ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా వరద కాల్వ కింది చెరువులు నింపుతూ, ఆయకట్టుకు నీరిచ్చే ప్రక్రియ మొదలవడంతో జోష్ మరింత పెరిగింది. చరిత్రలో తొలిసారి.. ఎస్సారెస్పీ ప్రాజెక్టులో స్టేజ్–1 కింద 9.6 లక్షలు, స్టేజ్–2 కింద 3.97 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు గతేడాది వర్షాకాల సీజన్లో కురిసిన వర్షాలతో 159 టీఎంసీల మేర కొత్త నీరు వచ్చింది. ఇందులోంచి ఖరీఫ్‌లో నీటి వినియోగం పెద్దగా చేయలేదు. దీంతో యాసంగి మొదలయ్యే నాటికి ప్రాజెక్టులో 90 టీఎంసీలకు గాను.. 89 టీఎంసీల మేర లభ్యత ఉండటంతో స్టేజ్–1 కింద లోయర్ మానేరు డ్యామ్ (ఎల్ఎండీ) వరకున్న 4.62 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఎస్సారెస్పీ నుంచి గతేడాది డిసెంబర్ 25 నుంచి నిరంతరాయంగా నీటిని 4 తడుల ద్వారా విడుదల చేసి సాగునీరిచ్చారు. దీనికే ఇప్పటి వరకు 25 టీఎంసీల మేర నీటి వినియోగం చేశారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 90 టీఎంసీలకు 58 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంది. లభ్యత నీటిలోంచి మరో 3 తడుల ద్వారా 20–25 టీఎంసీల మేర నీరిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఇక ఎల్ఎండీ దిగువన స్టేజ్–1 కిందే ఉన్న మరో 5లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా ఎల్ఎండీకి ఎత్తిపోసిన నీటితో సాగునీరిచ్చారు. స్టేజ్–1 కిందే మొత్తంగా 9.5 లక్షల వరకు ప్రస్తుతం సాగునీరందింది. ఇక స్టేజ్–2 కింద 3.97లక్షల ఎకరాలకు గానూ 2.5 లక్షల ఎకరాలకు నీరందిస్తున్నారు. దీంతోపాటే 592 చెరువులను నింపుతున్నారు. ఎల్ఎండీ దిగువన మొత్తం 44 టీఎంసీల మేర నీటిని వినియోగించారు. టెయిల్ టు హెడ్ అనే పద్ధతిన నీరు పంపిణీ చేయడంతో ఆయకట్టు చివరి జిల్లా అయిన సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలానికి గోదావరి నీళ్లు చేరాయి. మొత్తంగా ఎస్సారెస్పీ కింద చరిత్రలో తొలిసారి 12 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరందింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 69 టీఎంసీల మేర నీటి వినియోగం జరిగింది. గడిచిన పదేళ్లలో యాసంగిలో జరిగిన వినియోగాన్ని పరిశీలిస్తే గరిష్టంగా 2010–11 ఏడాదుల్లో 57.96 టీఎంసీలుగా మాత్రమే ఉంది. కానీ ఇప్పటికే 69 టీఎంసీల మేర వినియోగం పూర్తవ్వడం, మరింత నీటి వినియోగానికి సిద్ధంగా ఉండటంతో మార్చి చివరికి 100 టీఎంసీల మార్కును దాటే అవకాశాలున్నాయి. పునరుజ్జీవంతో మరింత మేలు.. ఎస్సారెస్పీపైనే ఆధారపడిన వరద కాల్వకు సైతం పునరుజ్జీవ పథకం ద్వారా నీరందిస్తున్నారు. పునరుజ్జీవన పథకంలో భాగంగా ఉన్న రాంపూర్, రాజేశ్వరరావుపేటలోని మోటార్లను ఆరంభించి కాల్వకు నీటిని విడుదల చేశారు. ఒక టీఎంసీ నీటిని పంపింగ్ చేసి 50 చెరువులను నింపనున్నారు. దీంతో పాటే వరద కాల్వ పరిధిలో బోరు మోటార్ల ద్వారా సాగు చేసిన ఆయకట్టుకు నీటి లభ్యత పెంచనున్నారు. ఎస్సారెస్పీలో ఏప్రిల్ నాటికి యాసంగి వినియోగంతో లభ్యత పడిపోగానే ఇదే ఎగువ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఖాళీ చేసి పునరుజ్జీవన పథకం ద్వారా మళ్లీ నింపనున్నారు. దీంతో మళ్లీ ఖరీఫ్‌లో సాగుకు నీటి కొరత లేకుండా చూసేలా ఇదివరకే ప్రణాళిక రచించారు. గత పదేళ్లలో ఎస్సారెస్పీకి వచ్చిన వరద నీరు, వినియోగం.. (టీఎంసీల్లో) సంవత్సరం వచ్చిన వరద నీటి వినియోగం 2009–10 27.34 13.61 2010–11 308.82 57.96 2011–12 174.20 33.67 2012–13 54.73 27.38 2013–14 320 56.60 2014–15 14.77 4.11 2015–16 4.42 1.61 2016–17 356.26 43.47 2017–18 75.31 33.42 2018–19 77.17 17.10 2019–20 159 69 -
చేపలు పోతున్నాయి!
సాక్షి. బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వారా నీటి విడుదల చేపట్టిన, ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకంలో రివర్స్ పంపింగ్ ద్వారా నీరు వచ్చిన ప్రాజెక్ట్ నుంచి చేపలు వెళ్లిపోతాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వరద కాలువ హెడ్‌రెగ్యులేటర్‌కు జాలి గేట్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వరద కాలువ హెడ్ రెగ్యులేటర్ హైలెవల్లో ఉండటంతో నీటి విడుదల సమయంలో చేపలు, చేప పిల్లలు కాలువలో వెళ్లిపోతున్నాయి. దీంతో జలాశయంలో చేపలు, చేపపిల్లలు ఖాళీ అవుతున్నాయని మత్స్యకారులు వాపోతున్నారు. వరద కాలువ హెడ్‌రెగ్యులేటర్ వద్ద జాలి గేట్లు కావాలని ఆరేళ్లుగా డిమాండ్ చేస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదని మత్స్య కారులు అంటున్నారు. జాలి గేట్లు ఏర్పాటు చేస్తే 90 శాతం చేపలు, చేపపిల్లలు బయటకు వెళ్లిపోయే పరిస్థితి ఉండదంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వరద కాలువకు జాలి గేట్లు అమర్చుతామని పాలకులు వచ్చి సందర్శించారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి మోక్షం లభించలేదు. దీంతో వరద కాలువ ప్రవహించిన ప్రతిసారి మీనాలు కాలువలో పోతున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌పై చేపలు వేటాడుతు ఐదు వేల కుటుంబాలు బతుకుతున్నాయి. జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా చేపల వేటకు వస్తుంటారు. కాకతీయ కాలువ, ఇతర కాలువల ద్వారా నీటి విడుదల చేసినప్పు డు చేపలు, చేపపిల్లలు చాలా తక్కువగా కాలు వల్లో కొట్టుకుపోతాయంటున్నారు. వీటికి జాలి గేట్లు ఉన్నాయని మత్స్యకారులు అంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే వరద కాలువ హెడ్ రెగ్యులేటర్‌కు జాలి గేట్లను అమర్చాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. కాలువలో చేపల వేట ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వారా నీటి విడుదల జరిగినప్పుడు అధికంగా చేపలు బయటకు వెళ్తాయి. దీంతో కాలువ హెడ్‌రెగ్యులేటర్ వద్ద కొందరు చేపలు పడుతున్నారు. మత్స్యకారులే కాకుండా ఇతరులు కూడా చేపలను పట్టుకుంటారు. దీంతో మత్స్య సంపద తరలి పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాలి గేట్లు నిర్మించాలి వరద కాలువకు జాలీ గేట్లను నిర్మించాలి. లేదంటే నీటి విడుదల చేపట్టినా రోజులు వరద కాలువలో చేపలు అధికంగా బయటకు పోతాయి. దీంతో తీవ్రంగా నష్టపోతాం. – కిషన్, మత్స్యకారుడు లాభం ఉండటం లేదు ప్రభుత్వం ప్రతి ఏటా ప్రాజెక్ట్‌లో చేపపిల్లలను వదులుతుంది. కానీ వరద కాలువ ప్రవహిస్తే కాలువలోనే అనేక చేప పిల్లలు కొట్టుకు పోతున్నాయి. దీంతో లాభం ఉండటం లేదు. జాలి గేట్లు ఉంటే ఇంత నష్టం జరగదు. – గణేశ్, మత్స్యకారుడు మంత్రికి విన్నవించాం వరద కాలువ హెడ్‌రెగ్యులేటర్ వద్ద జాలి గేట్ల కోసం మంత్రి ప్రశాంత్‌రెడ్డికి విన్నవించాం. ఆయన సానూకూలంగా స్పందించారు. జాలీ గేట్లు పెడితే మత్స్యసంపద తరలిపోదు. – గంగాధర్, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు, బాల్కొండ